పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ ‘బాలచెలిమి’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘కరీంనగర్‍జిల్లా బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త సంగనభట్ల చెన్న రామకిష్టయ్య గారి విశ్లేషణ.
కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ బాలచెలిమి వారి ఆహ్వానం మేరకు కరీంనగర్ జిల్లా ‘బడిపిల్లల కథలు’ ఎంపిక కోసం 126 కథలు రాగా కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాల సాహితీవేత్తలు 25కథలను ఎంపిక చేశారు. ఈ పుస్తకానికి కవర్ కంది నరసింహులు, లోపలి బొమ్మలు మర్రిపల్లి రమేశ్ వేశారు. ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ బాలచెలిమి నిష్ణాతులతో ఎన్నో సమావేశాలు, సదస్సులు, చర్చలు, బాల చెలిమి ముచ్చట్లు నిర్వహించింది.
ఇలా వర్గీకరిస్తే చాలా రకాల కథలు మనకు గోచరిస్తాయి. పూర్వం పెద్దలు పిల్లల కొరకు వారి స్థాయికి దిగి కథలు వ్రాయడం ఆనవాయితీ. కాని ప్రస్తుతం పిల్లలే మంచి మంచి కథలు వ్రాసి పిల్లలనే గాకుండా పెద్దలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇది ప్రస్తుతం వచ్చిన మార్పు. చందమామ, బాలమిత్ర వంటి పేరెన్నికగన్న పత్రికలు బాల సాహిత్యంలో కథలకున్న గొప్పదనాన్ని నిన్నటి వరకు చాటి చెప్పాయి. బాల సాహిత్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత పెద్దలపైన, పిల్లలపైన ఉంది. ఇందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలి. ఇందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలి.
కరీంనగర్ జిల్లా బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిలో అనేకమంది బాలసాహిత్య రచయితలు, రచయిత్రులు ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పిల్లలను ఉత్తమ రచయితలుగా తీర్చిదిద్దుతున్నారు. కరీంనగర్ జిల్లా పిల్లలు వ్రాసిన కథలు ఈ పుస్తకంలో 25 వరకు ఉన్నాయి.
ఈ కథలలో బేంచీల అంతరంగాన్ని తెలిపే బేంచీ కథ, అబద్దాన్ని అబద్దంతోనే జయించాలి అని తెలిపే మంచి స్నేహం కథ, తాను క్రొత్త బట్టలు కొనుక్కొవాలనే కోరికను త్యాగం చేసి నానమ్మ కోరికలు తీర్చిన రమేశ్ కథ, నిజం తెలుసుకొని మారిన మరొక బాలుని కథ, పొలాన్ని కొడుకుగా భావించే రైతు కథ, ఈ కథలన్నీ పిల్లల రచనా శిల్పాన్ని, వారి ఆలోచనా తీరును పెద్దలు కూడా రాయలేనంత పదజాలాన్ని తెలుపుతాయి. కథలలోగానీ, గేయాలలోగానీ నూతనత్వంతో పాటు సందేశం అంటే అవి ఇతరుల అభిమానాన్ని చూరగొంటాయి.
మన కరీంనగర్ జిల్లా కథలు పిల్లలు, పెద్దలే గాకుండా అన్ని వయస్సులవారు చదివి ఆనందింతురు గాక! బాల కథా సాహిత్యం సూర్య చంద్రులున్నంత వరకు భూమిపై వెలుగుతుందని ఆశిస్తూ…
- సంగనభట్ల చెన్న రామకిష్టయ్య, బాల సాహితీవేత్త