21 సూత్రాల అజెండాతో నయా ఉస్మానియా


ఉస్మానియా యూనివర్సిటీ ఆర్టస్ కాలేజ్‍ ముందు నిలబడి దాన్ని చూస్తుంటే ప్రతీ ఒక్కరిలోనూ ఎన్నో రకాల అనుభూతులు కలుగుతాయి. కొందరికి అక్కడ తాము చదువుకున్న రోజులు గుర్తుకొస్తే, మరి కొందరికి ఒకనాటి రాచరికం మదిలో మెదులుతుంది. కొందరికి అక్కడ ఉరకలు వేసిన తెలంగాణ
ఉద్యమం గుర్తుకొస్తుంది. మరికొందరికి వివిధ అంశాల్లో అక్కడి విద్యార్థుల చైతన్యం యాదికొస్తుంది. అదే మన ఉస్మానియా యూనివర్సిటీ.
యావత్‍ దేశంలో ఉన్నత విద్యకు మారుపేరుగా నిలిచింది ఉస్మానియా యూనివర్సిటీ. తాజాగా ఫౌండేషన్‍ డే వేడుకతో ఈ యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడి మట్టికే ఏదో ప్రత్యేకత ఉన్నట్లుగా ఉంది. ఇక్కడికి వస్తే చాలు ప్రతీ ఒక్కరిలోనూ ఉత్సాహం ఉరకలు వేస్తుంటుంది.


1917లో నాటి ఏడో నిజాం మీర్‍ ఉస్మాన్‍ అలీ ఖాన్‍ ఈ విద్యాసంస్థను నెల కొల్పారు. నాటి నుంచి కూడా ఎవరి ఊహలకూ అందని రీతిలో అది విస్తరిస్తూనే ఉంది. తన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసుకుంటూనే ఉంది. దేశంలోని అత్యంత పురాతన యూనివర్సిటీల్లో ఇది ఏడవది. దక్షిణ భారతదేశంలో మూడో పురాతన యూనివర్సిటీ. స్వాతంత్య్ర పోరాటం మొదలుకొని తెలంగాణ స్వరాష్ట్రం దాకా ఎన్నో ఉద్యమాలకు ఇది పురిటిగడ్డగా నిలిచింది.
దేశంలో ఉన్నత విద్యాభ్యాసానికి ప్రీమియర్‍ విద్యాసంస్థల్లో ఒకటిగా నిలిచింది ఉస్మానియా యూనివర్సిటీ. ఇది ఎన్‍ఏసీసీ నుంచి A+ గుర్తింపును, యూజీసీ నుంచి కేటగిరీ-1 గ్రేడెడ్‍ అటానమీని పొందడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. నేటి కాలంలో ఈ విధమైన గుర్తింపులు, ర్యాంకింగ్‍ లే విద్యాసంస్థల పనితీరుకు పట్టం కట్టేవిగా ఉంటున్నాయి. అలాంటి వాటిని ఎన్నిటినో ఈ విద్యాసంస్థ సాధించింది.


ఇదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేయడం మొదలైన సంగతిని గూడా ద•ష్టిలో ఉంచుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీ భవితవ్యం ఎలా ఉండ నుంది అనేది యావత్‍ తెలంగాణకు ఒక ఆసక్తిదాయక అంశంగా మారింది. ఫౌండేషన్‍ డే సందర్భంగా విద్యార్థుల్లో, బోధన, బోధనేతర సిబ్బందిలో వ్యక్తమైన ఆకాంక్షలు చూస్తుంటే మాత్రం… వందేళ్లు పూర్తి చేసుకున్నట్లు గానే వెయ్యేళ్లను సైతం ఈ యూనివర్సిటీ పూర్తి చేసుకుంటుందన్న నమ్మకం వ్యక్తమైంది.


విద్యరంగంలో ఉత్కృష్టత సాధనకు నూతన వ్యూహాలు, అకడమిక్‍ క్యాలెండర్‍ను స్ట్రీమ్‍ లైన్‍ చేసుకోవడం, జాతీయ విద్యావిధానం అమలు లాంటివన్నీ తెరపైకి వచ్చాయి. యూనివర్సిటీలకు ప్రాణం పోసేది అక్కడ జరిగే అధ్యయనాలు, పరిశోధనలే. ఈ అంశానికి ఇకముందు మరింత ప్రాధాన్యం ఇవ్వడానికి తెలంగాణా ప్రభుత్వం ముందుకొచ్చింది అని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్‍కుమార్‍ వ్యక్తపరచడం, ఉపాధ్యాయ, విద్యార్థి లోకానికి ఒక బరోసా.
యూనివర్సిటీల అవసరాలు మరింతగా పెరగడంతో నిధుల లోటు ఏర్పడుతోంది. దాన్ని ఆయా విద్యాసంస్థలు ఎలా భర్తీ చేసుకోగలవన్నది కూడా ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్నగా తెర పైకి వస్తోంది. దాతల నుంచి మరింత సహకారం కోరడం, పూర్వ విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగ స్వాములుగా చేయడం, ప్రైవేటు రంగానికి అవసరమైన సేవలు అందించడం… ఇలా మరెన్నో ఆలోచనలను కార్యరూపంలోకి తేవాల్సి ఉంటుంది.


తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగానే ఉస్మానియా యూనివర్సిటీ ముందుకెళ్తోంది. ఫౌండేషన్‍ డే సందర్భంగా యూనివర్సిటీ వైస్‍ చాన్సలర్‍ ప్రస్తావించిన 21 సూత్రాల అజెండా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ అజెండా గనుక అమలైతే…అది ఉస్మానియాకు నయా దిశను అందిస్తుందనడంలో సందేహం లేదు. ఆ దిశగా గట్టి ప్రయత్నాలు జరగాలని కోరుకుందాం. జై బోలో ఉస్మానియా…


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *