పెద్దబజారు చిన్నసందులోని కళాత్మకమైన దర్వాజా లోంచి సన్నగా – సన్నని నడిమి పాపిట ఒత్తైన వెంట్రుకలతో, చేతిలో ఎన్నో పుస్తకాలతో స్టూడియో ‘ఆక•తి’కి నడిచి వెళ్తుంటే కళా సెలయేరు పారుతున్నట్లనిపిస్తుండేది… ఆ కళామూర్తే సైబ పరంధాములు.
కీ.శే.సైబ పరంధాములు, శ్రీ సైబ లింగయ్య, శ్రీమతి గంగూబాయి దంపతులకు 08-4-1945న నిజామాబాద్ నగరంలో జన్మించారు. అప్పటి మల్టీపర్పస్‍లో చదివి గోల్డ్ మెడల్ సంపాదించారు. అనారోగ్య కారణాల వల్ల బి.టెక్. పూర్తి చేయలేక పోయారు. ఇది ఒకవైపు వారి శారీరక కోణం. కాని వారి అంతరాంతరాల్లో అనేక కళలు సజీవంగా నడుస్తూ ఉండేవి. కొంతకాలం శ్రీరాధాకృష్ణ విద్యాలయం ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా వారి అనంతమైన కళాజీవనానిక ఆ వృత్తి కట్టేసినట్లుగా అనిపించింది. తానే స్వయంగా ‘ఆకృతి’ స్టూడియోను ప్రారంభించారు.
పూసలగల్లి – జవహరురోడ్‍లో ఉండే ఆ స్టూడియో, కళాకారులను, చిత్రకారులకు, కవులకు కూడలైంది. ‘ఆక•తి’ని అందరి చిరునామాగా మార్చివేసిన కళామూర్తి సైబ. మనిషిలో ఒక కళ ఉంటేనే ఎంతో గొప్ప. సైబ పరంధాములులో కవిత్వం, చిత్రకళ, ఫోటోగ్రఫి, నఖచిత్రం, శిల్పం ఇలా అన్ని కళలు పూర్ణమై ఉన్నాయి.
1969 మకర సంక్రాంతి 14న ప్రారంభమైన ఇందూరు భారతి మూలస్తంభాలలో వీరు ముఖ్యులు. ఇందూరు భారతి ద్వారా ‘చౌరస్తా’ కవితా సంకలనానికి వీరు చిత్రాలు గీశారు. ఇది సాహితీ చరిత్రలో అపూర్వఘట్టం. చౌరస్తా కవులని తెలునాట సైబ, ఎ. సూర్యప్రకాష్, బద్దూరి నరసింహం, శ్రీపాద స్వాతి సుప్రసిద్ధులు.
వీరి ఇంట్లోనే గ్రంథాలయం ఏర్పాటు చేశారు. యువ కవులకు కొత్త కొత్త కవితా సంకనాలు ఇక్కడి నుండే ప్రాప్తించేవి. అనేక మంది కవులకు మార్గదర్శకత్వం వహించేవారు. ఇందూరు భారతి అనేక గ్రంథాలకు సైబ గీసిన బొమ్మలే ముఖ్యచిత్రాలు. చూస్తుండగానే మనిషి ముఖాక•తిని క్షణంలో పెన్సిల్తో చిత్రించేవారు.
టౌను హాలులో జుగల్‍బంది. ఉత్సవంలో ఒక కళా కారుడు తబలా వాయిస్తుంటే దానికనుగుణంగా చిత్రాలు పెయింట్ చేశారు. ఈ అద్భుత చిత్రాలు ఇప్పటికి నిజామాబాద్ ఎఫ్.ఎమ్. ఆకాశవాణి కేంద్రంలో కుడ్య చిత్రాలుగా మనకు సైబను జ్ఞాపకం చేస్తాయి. అనాటి ఉత్సవానికి కలెక్టర్ శంకరన్ విచ్చేసి సైబను అభినందించారు.
సైబ సార్ గీసిన నిలువెత్తు గాంధీగారి ఫోటో అప్పట్లో వ్యాపారవేత్త వెలాస్య సాయిరెడ్డి కొన్ని వేలకు దక్కించుకున్నారు. చాలా కాలం శాంతినివాస్ లాడ్జ్లో ఎదురుగా ఉండేది. కవి మిత్రులు వచ్చినప్పుడు సైబ పేయింట్ చేసిన గాంధీగారి అద్భుత కళా ఖండాన్ని చూపించేవాళ్లం. ఇక ఫోటోగ్రఫీ అంటే సైబకు ఆరవ ప్రాణమే. దానిని వ్యాపారంగా భావించక ప్రవృత్తిగానే స్వీకరించేవారు. పెండ్లిల్లకు, సభా కార్యక్రమాలకు ఫోటో తీయడానికి వెళ్లినా ఇంత డబ్బు కావాలని డిమాండ్ చేసేవారు కారు. గోలుకొండ కోటలో అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల మేళ 1973లో జరిగినప్పుడు సైబ తీసిన అనేక ఫోటోలకు అవార్డులు లభించాయి. కవి మిత్రుల పెండ్లిల్లకు సైబ కెమెరాతో విచ్చేసేవారు. వారు తీసిన ఆల్బమ్‍లు దాదాపు అందరి మిత్రుల ఇండ్లల్లో ఆయన జ్ఞాపకంగా ఉన్నాయి.
సైబకు ఉన్నవి రెండే చేతులైనా కలంతో కవిత్వం రాస్తూ – కుంచెతో చిత్రాలు వేస్తూ – కెమెరాతో తీసేవారు. దారువును శిల్పాలుగా మలిచేవారు. వారు మొదట్లో ‘వెన్నెల’ అనే లిఖిత మాసపత్రిక బాల సాహిత్యం కోసం ఆవిష్కరించారు.
తరువాత ఇందూరు భారతి ద్వారా ఆవిష్కరింపబడ్డ కొన్ని చిత్రాలు, వెలుగులో రావటానికి సంకలనాలుగా మలచ బడటానికి రూపశిల్పి వీరే. ప్రముఖుల సన్మాన పత్రాలకు సైబ డిజైన్లు కూర్చేవారు. జగ్గయ్యకు సమర్పించిన చిట్టిబాబు, ఈమని శంకర శాస్త్రులకు వేదికపై అందజేసిన అనేక సన్మాన పత్రాలకు సైబ ఆకృతే ముఖ్యం.
కవిగా సైబ పరంధాములు అనేక రచనలు గావించారు, సైబ పద చిత్రాలు, సైబ శబ్ద చిత్రాలు, భావ చిత్రాలు భావ గీతాలు మొదలైన సంకనాలకు అనేక అవార్డులు లభించాయి. వీటికి తాను వేసిన చిత్రాలే అంతర్వాహినిగా అద్భుతాలు. కేవలం కవిత్వమే కాకుండా వీరు అనేక సంగీత రూపకాలు రచించారు. ఇవి రేడియోలోనూ వేదికలపై ప్రసారము – ప్రదర్శన ఐనాయి.
వీరు రచించిన ‘సిద్ధార్థ’ నృత్యరూపకం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ప్రదర్శింపబడి మన్ననలందుకుంది. విషజ్వాల, ప్రత్యూష చిత్రాలకు కళాదర్శకత్వం వహించారు. ఆర్మూర్ ప్రజలు సైబ పరంధాములు గారికి మహోన్నత వేదికపై ప్రముఖులు, పెద్దలు, కవులు, కళాకారుల సమక్షంలో ‘కళానిధి’ బిరుదుతో సన్మానించారు. ఇటు కవులకు శిక్షణనిచ్చి ఎందరినో ప్రముఖ కవులుగా తీర్చిదిద్దారు. సాహితీ సేవలో క్లుప్తగోష్టులు, చర్చలు, కవితా పఠన పోటీలు నిర్వహించి కవులకు అండదండగా ఉండేవారు.
ఎందరో ఫోటోగ్రాఫర్లను అవుట్‍డోర్‍కు తీసుకువెళ్లి శిక్షణ నిచ్చేవారు. ముఖ్యంగా వాటిలో ఖిల్లా, నందిగుట్ట, సారంగపూర్, అలీసాగర్ యాత్రలు మరువలేనివి. వారు ఈ రోజున స్టూడియోలు పెట్టుకొని జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన శిష్యులు ఎందరెందరో!
నిజామాబాదులో తమ ఆకృతి సంస్థ ద్వారా అలిశెట్టి ప్రభాకర్, చంద్ర, కాపు రాజయ్య వంటి ప్రముఖుల చిత్రాలతో సైబ ఆర్ట్ ఎగ్జిబిషన్‍లు నిర్వహించి అనేకమంది చిత్రకారులకు స్ఫూర్తి ప్రదాతలైనారు.
Lions, Lio లాంటి అనేక సంస్థలకు తమ సేవల నందించి సభలు జయప్రదం జరిగేలా పర్య వేక్షణ జరిపేవారు. వీరి స్టూడియోను ప్రముఖులు దాశరథి, ఆరుద్ర, జగ్గయ్య, సినారె దర్శించారు.
ఇందూరు ఉత్సవాలకు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి గారు విచ్చేసినప్పుడు అస్వస్థతగా ఉన్న సైబను ఎన్నో మెట్లు ఎక్కి వచ్చి పలకరించారు. సైబ కృషిని, చిత్రాలను చూసి ప్రశంసించారు. ఆ వేళ సైబ ఇంట్లో వీధి జాతరే ఐంది.
సైబ నిరంతరం సేవా కార్యక్రమాల్లో వుండటంవల్ల ఒత్తిడి, ఎల్లవేళలా సంచారం, సమావేశాలు, అవుట్‍డోర్ ఫోటోగ్రఫీ సమావేశాలు – పని ఒత్తిడితో సైబకు అనారోగ్యం కలిగింది. ఎంత అనారోగ్యంగా ఉన్న సైబసార్ సమావేశం అంటే – సై అనేవారు. అనారోగ్యంగా వున్నా, వారి మార్గదర్శకత్వంలో పెద్ద సమావేశాలు చాలాసార్లు నిర్వహించాం. సైబకి ముగ్గురు మగపిల్లలు. శశాంక, సారిక, తూనిక. ఇప్పుడు సారిక మాత్రమే మిగిలున్నారు. భార్య ‘అహల్య’ సైబని అమ్మలా చూసేది. సైబకి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం. ఇందూర్ వాస్తవ్యురాలు, అప్పుడే డిగ్రీ కళాశాల మెట్లెక్కిన అయినంపూడి శ్రీలక్ష్మిని స్వంత కూతురిలా చూసుకునేవారు. తాను ప్రముఖ కవయిత్రిగా, వ్యాఖ్యాతగా నిలబడటానికి కారణభూతులు సైబ దంపతులు. అలాగే పంచారెడ్డి లక్ష్మణ్, చందనరావు, సమీర, బద్ధూరిల స్నేహం మర్చిపోలేనిది.
ఒకసారి రక్తహీనతతో ప్రభుత్వ వైద్యశాలలో చేరినప్పుడు అనుకోకుండా విచ్చేసిన మహాకవి ఆరుద్ర సైబను పరామర్శించారు. అంత అనారోగ్యస్థితిలోనూ సైబ పెన్సిల్‍తో ఆరుద్ర చిత్రం గీసి అందించి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పారు. వరంగల్లు సమా వేశాలకు వెళ్లినప్పుడు సైబ ఆరోగ్యం చాలా క్షీణించింది. త్వరలోనే కోలుకున్న వారిపై పనిభారం వేసేవారం కాదు. ఒక్కోరోజు స్టూడియోకు వెళ్ళకున్నా – కవిమిత్రులను కలువకున్నా సైబకు పొద్దు పోయేది కాదు.
తరువాత కాలంలో స్టూడియో ఆకృతిని పెద్దబజారుకు మార్చారు. ఇంటికి దగ్గర అవడం కొంత అనుకూలం. ఇక్కడ ఉన్నప్పుడే చాలా సంకలనాలు తన చేతితో రాసి ముద్రించారు.
సైబ గీసిన చిత్రాలు ఆంధప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రికల్లో ప్రచురణమైనాయి. అనేక కవితలకు పత్రికలవారు వీరి ఫోటోలను సందర్భానుసారం కళాత్మకంగా వేసేవారు. అది 15-08-1997 భారత స్వాతంత్య్ర దినోత్సవం. సైబ శ్వాస పీల్చుకోవడం చాలా కష్టమైంది. ఈ రోజే అంతిమశ్వాసను ఈ లోకానికి ఇచ్చేసి సైబ కీర్తిశేషులైనారు.
అంతిమ యాత్రలో నిజామాబాద్ కళాకారులు కొన్ని కిలోమీటర్ల పర్యంతం వాటికకు కదలివచ్చారు. కళామూర్తిని కోల్పోయిన దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు.
కవిత్వం, ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం మూడు ముమ్మూర్తుల కలిసిన త్రివేణి సంగమం కళానిధి మన సైబ పరంధాములు. వీరు క్షణం క్షణం ఎప్పుడు కార్యక్రమం నిర్వహించినా స్మృతికి వస్తూనే ఉంటారు.
తెలంగాణ ప్రభుత్వం సైతం కీ.శే. కళానిధి పర రధాములు గారి కళాసేవను ప్రశంసించి పెద్ద సభను స్మృతిగా నిర్వహించింది. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించింది. సైబ సహధర్మ చారిణి శ్రీమతి అహల్యగారు సభకు హాజరై సంభావనను గ్రహించారు. అలాగే రాష్ట్ర ఆవిర్భావానంతరం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణగారు ‘సైబ’ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి, 75 వేల రూపాయలు ఆర్థిక సహకారం అందివ్వటం ద్వారా తెలంగాణ కళాకారులకు రాష్ట్రావిర్భావం ద్వారా వెలుగు రోజులు వచ్చాయనిపించింది. ప్రముఖ చలనచిత్ర దర్శకులు బి. నరసింగరావు రూపొందించిన ‘ఆర్ట్ ఏ తెలంగాణ’ పుస్తకంలో కూడా సైబగారి చిత్రాల్ని వేసి వారికి కళా నీరాజనం అందించడం ఇందూర్ వాసులకి గర్వకారణం.
కళామూర్తి సైబ పరంధాములు శరీరంతో భౌతికంగా లేకున్నా ఇందూరు నగరం ప్రతి ఉత్సవంతో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంది. ఈనాడున్న కవులు, ఫోటోగ్రాఫరులు, చిత్రకారులు ఆయన తీర్చిదిద్దిన జ్ఞాపికలే!
ఈనాటికి ఆకృతి స్టూడియో దగ్గరకు వెళ్లినా వారున్న వీధిలోకి వెళ్లినా వారి మృదువైన కవితాగానం – వారి వర్ణమయ చిత్రాలు వినిపిస్తాయి, కనిపిస్తాయి.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
– కందాళై రాఘవాచార్య