అరబ్బీ మురబ్బా ‘బార్కాస్‍’


ఒక తాతీల్‍ (సెలవు) దినం పురుసత్‍గ చార్మినార్‍కు వెళ్లండి. అక్కడ చార్మినార్‍ చల్లని చత్రచ్ఛాయలలో ఒక పాత సైకిలు సీటు వెనుక త్రాళ్లతో కట్టిన గుండ్రటి వెదురు గంపలో దోరగా మగ్గిన జాంపండ్లను పెట్టుకుని, నడుముకు తోలు బెల్టుతో ఎగగట్టిన ఎర్ర గళ్లలుంగీని గట్టిగా బిగించి కట్టుకుని, నోటినిండా ఎర్రని పాన్‍ నములుతూ మధ్యలో తుపుక్‍, తుపుక్‍ మని రోడ్డుమీద ఉమ్మేస్తూ, సన్నగా పొడుగ్గా ఉన్న మేక గడ్డం చిరుగాలితో సయ్యాటలాడుతుంటే, తెల్లటి మస్లీన్‍ లాల్చీ ధరించి, తలమీద తెల్లని చిల్లుల జాలీ టోపీతో, కండ్లకు సుర్మా సుతారంగా అద్దుకుని ‘‘బార్కాస్‍ కీ జామ్‍, బార్కాస్‍కీ జామ్‍’’ అని ఒర్లుతున్న ఒక బార్కస్‍ ‘‘చావూష్‍’’ కనబడతాడు. ఆ అరుపులకు చార్మినార్‍ దద్దరిల్లి ఆ నాలుగు మినార్లు మన నెత్తుల మీద కూలిపడతయా అని మనం పరేషాన్‍ అవుతం.


‘‘ఔను తింటే తియ్యటి బార్కస్‍ జాం పండ్లే తినాలి. చూస్తే బార్కస్‍నే చూడాలి’’. అదొక మినీ అరేబియా దేశం. ఒక చల్లని సాయంత్రం ‘‘దీపాలు వెలిగి పరదాలు తొలిగే’’ సమయంలో, జిలుగు వెలుగుల జలతారు దీపాల విద్యుత్‍ కాంతులలో మనం అక్కడికి ప్రవేశిస్తే అరేబియన్‍ నైట్స్ – వేయిన్నొక రాత్రుల కథలు జ్ఞాపకం రాక మానవు. అక్కడి సందడి, సందడి తొడతొక్కిడి బజారులలోని సడక్‍ మీద నడుచుకుంటూ, తియతీయని అరబ్బీ మురబ్బాలను చప్పరిస్తూనో లేక భగబుగలుగా మండే గాడిపొయ్యిల మీద పెద్దపెద్ద డేగ్చాలలో కళపెళా ఉడుకుతున్న ఘుమఘుమల హలీంనో లేదా హరీస్‍నో తనవి తీరా రుచి చూసి ఆఖర్న పూదీనా సువాసనలతో గుభాళించే గరం గరం ‘‘ఝావా’’ను చుక్కలు చుక్కలుగా నాలికపై చప్పరిస్తుంటే బహుత్‍ మజా మజాగా ఉంటది. భూమ్మీద జన్నత్‍ (స్వర్గం) అంటే ఇదే ఇదే అన్నట్లు కూడా ఉంది.


‘ఇదీ బార్కాస్‍ ఇస్‍స్పెషాలిటీ’’.
అన్ని పేర్లలాగే బార్కస్‍ అన్న పేరు కూడా అపభ్రంశ నామమే. దాని అసలు ఇంగ్లీష్‍ పేరు ‘‘బ్యారక్స్’’ అనగా సైనిక పటాలం ఉండే చోటు. నైజాంల కాలంలో అరబ్బుల సైనిక పటాలాలు, వారి కుటుంబాలు అక్కడ ఉండేవి. నైజాం స్వంత సైన్యం ప్రైవేట్‍ ఆర్మీ ఈ అరబ్బులతోనే నిండి ఉండేది. దానిని అరబ్‍ రెజిమెంట్‍ అనేవారు.
హైదరాబాద్‍ నగరంలో అరబ్బులు రెండు వందల సంవత్సరాల క్రితం అరేబియాకు క్రింద ఉన్న యెమన్‍ దేశం నుండి వలస వచ్చారు. వీరు యెమన్‍లోని హద్రామీస్‍ అను ప్రాంతం నుండి వచ్చారు. అందుకే వీరిని హద్రామీస్‍ అని కూడా అంటారు. మానవజాతుల వలసలు కూడా నదుల ప్రవాహాల వంటివే కదా! యెమన్‍ దేశం నుండి వీరు అరేబియా సముద్రంలో తెరచాపల ఓడల ద్వారా గుజరాత్‍లోని అహమ్మదాబాద్‍, బరోడా, సూరత్‍ తీర ప్రాంతాలను చేరుకున్నారు. మరికొందరు బొంబాయి నుండి కొంకణ ప్రాంతాలకు, గోవాకు చేరుకున్నారు. ఆ తర్వాత్తర్వాత మరికొంతమంది సాహసికులు సముద్రపు అలలతో సయ్యాటలాడుతూ కాలవాహిని అలలవాలున కన్నడ, మలబారు రాజ్యాలను చేరుకున్నారు. మళయాళ దేశంలో విరివిగా లభించే మసాలా దినుసులను అరబ్బు, యూరపు దేశాలకు ఓడల ద్వారా ఎగుమతుల వ్యాపారం చేసేవారు. మరికొంత మంది ఇస్లాం మత ప్రచారం కోసమే కేరళకు వచ్చారు. ఇక్కడి దళిత, శూద్ర స్త్రీలను పెళ్లిళ్లు చేసుకున్నారు. వారి సంతానాన్నే ‘‘మోప్లా’’లు అన్నారు. ఇట్లా అరబ్బులు దక్షిణ భారత దేశమంతా విస్తరించారు. వారిలో కొంత మంది బీదర్‍లోని బహమనీ రాజ్యం నుండి హైద్రాబాద్‍కు సైనికులుగా వచ్చి స్థిరపడినారు. స్థానికులు వారిని విలాయితీలు అనగా విదేశీయులు అనీ, చావూష్‍లు అనగా సైన్యంలో క్రింది తరగతి వారనీ, ద్వారపాలకులనీ పిలిచేవారు.


తెలుగువారందరూ ముస్లింలను సర్వసాధారణంగా తురకలు అని పిలుస్తారు. ఈ పదప్రయోగం ముస్లింలకు కోపం తెప్పిస్తుంది. ఆప్ఘనిస్తాన్‍ నుండి వచ్చిన పఠాన్లు, ఇరాన్‍ నుండి వచ్చి పర్షియన్‍లు, మధ్య ఆసియానుండి వచ్చిన మంగోలులు ఆఫ్రికా నుండి వచ్చిన హబ్సీలు లేదా అబిసీనియన్లు విభిన్న దేశాలు, జాతుల వారు కావున తమందర్నీ ఒకే గాటన కట్టి తురకలు లేదా తుర్కోళ్లు అని పిలవటం తప్పని వారి వాదన. టర్కీ నుండి వచ్చిన వారు మాత్రమే తురకలు అని మిగతా ముస్లింల అభిప్రాయం.
అరబ్బులు మరాఠాల సైన్యంలో ముఖ్యమైన పాత్ర వహించారు. వీరు ముస్లింలు అయినా ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబుకు వ్యతిరేకంగా యుద్ధం చేసారు. వీరు గొప్ప గెరిల్లా యోధులు. విలువిద్యలో ప్రవీణులు. శివాజీకి విలువిద్య నేర్పింది ఒక అరబ్‍ వీరుడే. మరాఠాల బలం క్షీణించిన తర్వాత కొంతమంది అరబ్‍ వీరులు హైద్రాబాద్‍లోని నిజాం రాజ్యానికి వలస వచ్చారు. హిందూ రాజ్యస్థాపన కోసం కృషి చేసిన చత్రపతి శివాజీ ముస్లింల సహాయం, కుతుబ్‍షాహీ నవాబుల సహాయం తీసుకోవటాన్ని గమనిస్తే యుద్ధాలకు మూలం రాజ్యకాంక్ష విస్తరణే అసలైన ఉద్దేశ్యం అని అర్థం అవుతుంది.


హైద్రాబాద్‍లో స్థిరపడిన అరబ్బుల ఉర్దూ భాష దక్కనీ ఉర్దూ ఐనా అరబ్బీ పదాలు, యాస కలగలిసి కొత్తగా వింతగా రూపొందింది. నిజాం నవాబులు వీరిని తమ ప్రైవేటు సైన్యంగా వాడుకోవటమే కాకుండా వీరికి ప్రత్యేక అధికారాలు కూడా దఖలు పరిచాడు. నైజాం రాజ్యం చట్టాలు వీరికి వర్తించవు. నిరంతరం ఆయుధాలను ధరించే హక్కు వీరికుండేది. ‘‘జంబియా’’ అనే వొంపులు తిరిగిన కత్తిని వీరు వీపుల వెనక బిగించి కట్టుకుని తిరిగేవారు. కాబూలీ వాలాల మాదిరే వీరు కూడా పేద ప్రజలకు అప్పులిచ్చి చక్రవడ్డీలు వసూలు చేసి లక్షాధికారులు అయినారు. వడ్డీని వీరు ‘‘మిత్తీ’’ అనేవారు. బకాయిలు పడిన వారిని, రుణాలు చెల్లించని వారిని తమ స్వంత జైళ్లల్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారు. ప్రభుత్వానికి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఆరవ నిజాం మొదటిసారి రైల్వేలైన్‍ వేసేటప్పుడు ఒక అరబ్బు నవాబు డెబ్బై లక్షల రూపాయలను రుణంగా ఇచ్చాడంటే వారెంత శక్తివంతులో అర్థం చేసుకోవచ్చు. ఆరవ నిజాం కాలంలో మక్కా మసీదుకు ఎదురుగా ఉన్న ఒక భవనంలో సుల్తాన్‍ ఆఫ్‍ మకల్లా నివసించేవాడు. ఇతను అరేబియా ఎడారిలోని ఒక చిన్న దేశానికి సుల్తాను. అపరకుబేరుడు కావున నిజాంకు కూడా అప్పులిచ్చేవాడు. ఇతనికి తన స్వంత అరబ్బు సైన్యం ఉండేది. సామాన్య పౌరులపై వారి ఆగడాలకు అంతు ఉండేదికాదు. చెన్నరాయని గుట్ట (చాంద్రాయణ గుట్ట)కు వెళ్లే భక్తులను గుట్ట క్రింద ఆపేసి నిలువుదోపిడీ చేసేవారు. లాల్‍దర్వాజాలోని బాలాగంజులో ఉండే వేశ్యాగృహాలకు వచ్చే విటులను రాత్రిపూట గల్లీలలో పట్టుకుని కొట్టిపైసలు వసూలు చేసేవారు. చంచల్‍గూడ బస్తీలలో దారిన వెళ్లే అందమైన ఆడవారిని బలవంతంగా బుజాలపై వేసుకుని పరిగెత్తి తమ ఇళ్లల్లో బందీలుగా చేసేవారు. నిజాం పోలీసులకు కూడా వీరంటే గుండె దడగా ఉండేది.


ఆరోజు మొహర్రం ఊరేగింపు. మకల్లా సుల్తాన్‍ ఇద్దరు కుమారులు ఒక మదపుటేనుగు అధిరోహించి పత్తర్‍ గట్టీ వీధులలో ఊరేగుతున్నారు. ఆ ఏనుగు తన తొండంతో వీధులలోని చిన్న చిన్న దుకాణాలను చెల్లా చెదరుచేస్తూ పాదచారులను భయభ్రాంతులను చేస్తుంది. ట్రాఫిక్‍ అంతా అస్తవ్యస్తంగా మారింది. సుల్తాన్‍ కుమారులకు అదొక వినోదంగా అనిపించి చాలా ఆనందిస్తున్నారు. ఇంతలో మొహర్రంకు సంబంధించిన ఆలంలు, పీర్లు పత్తర్‍ గట్టీలోకి ప్రవేశించాయి. ప్రమాదాన్ని పసిగట్టిన నిజాం పోలీసులు ఏనుగును పక్క వీధిలోకి మళ్లించమని మావటీకి చెప్పినా వాడు వినలేదు. పోలీసులు ఏనుగును బెదరించటానికి బర్చీలతో కొంచెం పొడవగా అది భయపడి పరిగెత్తింది. దాని మీదున్న ఇద్దరు రాకుమారులు క్రిందపడి వారికి గాయాలైనాయి. ఈ వార్త మకల్లా సుల్తాన్‍కు తెలిసి ఒళ్లుతెలియని ఆగ్రహంతో తన 5000 వేల అరబ్బుల సైన్యాన్ని పోలీసులపై దాడి చేయమని ఆజ్ఞాపించాడు. నగరంలో కనిపించిన ప్రతి పోలీసుపైనా అరబ్బు సైన్యం దాడి చేసింది. వారి దాటికి తట్టుకోలేక నిజాం పోలీసులు ప్రాణాలను అరచేతులలో పెట్టుకుని పారిపోయారు. తమ యూనిఫాంలను విప్పి రోడ్లపై విసిరేసి సాధారణ పౌరుల్లాగా తప్పించుకున్నారు. దాడులను తప్పించుకోవాలని కొందరు మురికి కాలువలలో, మోరీలలో దాక్కున్నారు. నగర కొత్వాల్‍ (పోలీసు కమీష్నర్‍) నవాబ్‍ అక్బర్‍ జంగ్‍ ప్రాణభయంతో కోఠీలోని బ్రిటిష్‍ రెసిడెన్సీలో ఆశ్రయం తీసుకున్నాడు.


అప్పుడు ఆ కల్లోల్లాన్ని అణచడానికి దివాన్‍ సర్‍ సాలార్‍జంగ్‍ సర్వసైన్యాధిపతి అఫ్సర్‍ ఉల్‍ ముల్క్ను పిలిపించి చావూష్‍ల నందర్ని బంధించమని ఆజ్ఞాపించాడు. రక్తపాతం జరిగి అనేకుల ప్రాణాలు పోతాయన్న భయంతో ఆ సర్వసైన్యాధిపతి ఆ సంగతి తనకు వదిలేయమని దివాన్‍గారిని వేడుకున్నాడు.
నవాబ్‍ అఫ్సర్‍ ఉల్‍ ఉల్క్ తన స్వంత ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. గోల్కొండ రెజిమెంటు నుండి కొంత సైన్యాన్ని తీసుకుని మక్కా మసీదుకు వచ్చి దానిపై భాగంలో ఒక పెద్ద ఫిరంగిని అమర్చి అక్కడ సైన్యాన్ని మొహరించాడు. పది నిముషాలలో సుల్తాన్‍ మకల్లా లొంగి పోకపోతే ఆ ఫిరంగితో మక్కామసీదుకు ఎదురుగా ఉన్న సుల్తాన్‍ రాజభవనాన్ని ముక్కలు ముక్కలుగా పేల్చివేస్తానని హుకుం జారీ చేశాడు.
దెబ్బకు దయ్యం వదిలింది. సుల్తాన్‍ లొంగిపోయాడు. అతనిని అరెస్టు చేశారు. లక్ష రూపాయల జుర్మానా విధించటమే గాక నగర బహిష్కార శిక్షను ఒక ఏడాదిపాటు విధించారు. కాని ఏం లాభం? ఒక నెలైనా గడవక ముందే ఆ శిక్షలన్నీ రద్దయినాయి. లోగుట్టు ఆ అల్లాకే తెలుసు.
మరొక మజేదార్‍ ముచ్చట చెప్పి ఈ బార్కస్‍కీ కహానీ ముగిస్తాను.


పస్కలకు అంటే పచ్చ కామెర్లకు (జాండీస్‍) అలోపతిలో మందులు లేవు. బార్కస్‍కు పోతే మాత్రం మూడు రోజులల్ల పస్కలు గాయబ్‍ అవుతాయి అంటే మాయం అవుతాయి. రోగి పోంగనే అక్కడ్నే పాలల్ల కలిపి పసరు తాగిస్తరు. ఆ దినమంతా పాలు కలిపిన అన్నం ఉప్పు శక్కర కలుపకుండ తినాలె. రెండో రోజు మేకమాంసం బిర్యానీ లేదా కూరగాయల బిర్యానీ తినాలె. మూడవరోజు మళ్లీ పాలన్నం అంతే. మంత్రమేసినట్టుగనే రోగం మాయం అవుతది. ఒకపైస ఫీజు తీసుకోరు. ఆ హకీంసాబ్‍ లందరూ మహమ్మద్‍ ప్రవక్త కుటుంబానికి చెందిన వారట. వాల్ల ‘‘దవా ఔర్‍ దువా’’తో రోగి కోలుకుంటడు.
పస్కల మందుకు పోతే మాత్రం అక్కడ దొరికే బార్కస్‍ జాంపండ్లు కొనటం మాత్రం మరువకుండ్రి. ఖుదాహాఫీజ్‍!


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍, ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *