జానపద గేయాలలో సామాజిక జీవనం


జానపదులు అంటే సామాన్యంగా గ్రామీణులు లేదా నిరక్షరాస్యులు అని అనుకుంటారు. జనపదం అంటే గ్రామం కాబట్టి గ్రామంలో నివసించే వారు జానపదులు అనుకున్నారు. కానీ మారిన కాలాన్ని బట్టి, సామాజిక పరిణామాన్ని బట్టి జానపదులు అంటే ఏదైనా ఒక విషయంలో భాగస్వామ్యం గల జనసముదాయం అని చెప్పవచ్చు.
సమాజంలో అక్షరజ్ఞానం లేని సామాజికులు, గ్రామీణ, శ్రామిక సామాన్య జనం తమ శ్రమలో, ఆచారాల్లో, సంబరాల్లో అలవోకగా సృష్టించుకుని అలిఖితంగా తరతరాలుగా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమింప చేస్తూ వచ్చే కథలు, గాథలు, గేయాలు, పాటలు, పొడుపు కథలు మొదలైన వాఙ్మయం జానపద సాహిత్యం.
జానపద సాహిత్యం లిఖిత రూపంలో లేదు. ఇది రాసిన వారు ఇదమిద్దమని చెప్పడానికి వీలు లేదు. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి, ఒక తరం నుండి మరొక తరానికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రచారానికి వచ్చింది. ఈ జానపద గీతాలు జనపదుల నుండి ఉద్భవించినవి. ఇవి భాషతో, మనుష్యులతో పాటు పుట్టి పెరుగు తుంటాయి.


ఆదిమానవుడు ప్రకృతిలోని లయాన్వితమైన శబ్దానికి అనుకరణగా తన గొంతు విప్పి సరిగమలు ఆలపించి నప్పుడు ఆ రాగంలో ఇమిడే పదాలను పొదగ నేర్చినప్పుడు, ఆనందం పొందినా, ఆవేదన చెందినా, ఆ ఆవేశాన్ని తనకు తెలిసిన భాషలో భావయుక్తంగా పాడ నేర్పినప్పుడు జానపద గేయం ఆవిర్భవించింది. ఈ విధంగా జానపదులు వివిధ ఆచారాలను సంస్కృతిని, సంప్రదాయాలను, ఆహారం – అలవాట్లను గురించి చిత్రించడం జరిగింది.


శ్రామిక గేయాలలో సామాజిక జీవనం :
మానవుడు తన జీవిక కోసం అనేక రకాల వృత్తులను నిర్వర్తిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. ఈ శారీరక శ్రమను పోగొట్టుకునే క్రమంలో ఈ గేయాలు ఆవిర్భవించాయి.
వ్యవసాయ జీవనం :
కొయ్యండల్లా కొయ్యండీ కోసీ బణుపూ లెయ్యండీ
వానల వరదల వంగిన సేను వెన్నుల నీనిన వన్నెల సేను తిన్నగ దీసీ మొదలూ కోసీ పనలన్నీని పొంజెట్టావా
గింజలు బందలో పడిపోకుండా పొందుగ వెన్నులు కొయ్యండల్లా
కాలం సూతే సీతాకాలం కొడవలి పాటూ జాగర్తల్లా
కాలూ సెయ్యా ఆడింతేనే కుండలో కూడు కలిసొత్తాది


ఈ గేయంలో వరి కోత కోసే సమయంలో వర్షాలు సంభవిస్తే ఆ వరదలకు వరి వంగి పోతుంది. అలా అలా వంగిన వరి పైరును కోయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వరిని జాగ్రత్తగా తీసి వాటి వెన్నులను జాగ్రత్తగా పొలంబందలో పడిపోకుండా కోయాలని చెప్పడం జరిగింది. ఈ వరికోతలు శీతాకాలంలో అయితే ఇంకా జాగ్రత్త వహించి కోత కోయాలి లేకపోతే కొడవలితో గాయమైతే శీతాకాలంలో గాయం మానడం కష్టమని, పేదవాళ్లకు కూలి చేసుకుని బతికే వాళ్లకు, చేతులు బాగుంటేనే జీవనం కొనసాగు తుందని చెప్పడం జరిగింది.


మోట పాట
శ్రామిక గేయాలు మోట పాటలకు ప్రత్యేకత గలదు. ఈ మోట పాటలలో శ్రమ జీవనంతో పాటు మామ కొడుకు పైన ప్రేమ పెంచుకున్న మరదలి వేదన కూడా తెలియవస్తుంది.
చింతకిందిరో మోట వాడరా
చిగురు యామంచి ఎడ్ల జోడోయీ
నీ వలుపాటి ఎద్దూర వన్నెలాడోయీ
నీ దాపాటి ఎద్దోయీ ధర్మరాజోయీ
నీ మోకు పేరోయీ ఆకు తీగోయీ
నీ బొక్కెన పేరోయీ బొడ్డుగిన్నోయి
అంటూ మరదలు తన బావ యొక్క మోట గురించి, తన ఎడ్ల జోడు గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తుంది. రైతు అరక కట్టెపుడు నాగలి ఇరువైపులా ఎడ్ల జోడును వలపల, దాపల అంటారు. వలపల అనగా కుడివైపు, దాపల అనగా ఎడమవైపు అని అంటారు. తన మోట ఎడ్ల బండి ఎద్దులు వన్నెలాడి, ధర్మరాజు అనుకుంటూ
నిన్ను జూడ నీళ్ళ కొస్తీరా
నీళ్ళు లేవూ నీవు లేపూరా
చెప్పరాని దుఃఖ మొచ్చేనూ
తన బావ కనబడకపోవడంతో దుఃఖితురాలై
కంటి శోకము కడువ నిండేనూ
కడువల నీరోయీ మడువ సాగేనూ
మడువ మలిపే మామకొడుకూరా
మడువకేసి నువు మళ్ళ గట్టోయీ
అంటే తన దుఃఖం ద్వారా వచ్చిన కన్నీరుతో కడవలు నిండి కన్నీరై, మడవ సాగుతుందని, ఆ నీరు పొలానికి మలిస్తే వంపులు, మిట్టలు వరదలుగా మారినాయని, జామ తోట, నిమ్మ తోట, అరటి తోట, మామిడి తోటలు కూడా పారాయని చెబుతుంది. ఇందులో లో విరహ వేదనతో పాటు ఆనాటి సేద్యం, పంటల గురించి కూడా తెలుస్తుంది.


శృంగార గేయాలు :
జానపద గేయాలలో ఎక్కువగా శృంగార రసమే ఉంటుంది. తమ ప్రేమను వ్యక్త పరచడంలో, ఇష్టమైన వారి గురించి చెప్పడంలో ఎలాంటి సమస్యలు లేకుండా చెబుతారు.
రాగి సెట్టేగేడు రాగాలు తీసేడు
రోగమన్న వచ్చి సావడేమి వీని
రాగాల మీద మన్ను బొయ్యా
అంటూ ఒక స్త్రీ తను ఇష్టపడ్డ వ్యక్తిని గురించి, తను మాత్రమే ఇష్టపడి తన ప్రియుడిగా భావించుకున్న వ్యక్తి గురించి చెప్పిన విధానం
వట్టిసేపల కూర వడిపిల్ల మెతుకులు
ఒక్క బుక్క వచ్చి తినడేమి వీని
వొక్కి మొఖం మీద మన్ను బొయ్య
ప్రేమగా వెండి చాపల కూర వండితే కనీసం ఒక్క బుక్క అయినా తినిపోతే బాగు అనుకుంటుంది. ఈ విధంగా సద్ద సేను దగ్గరకు వచ్చి సైగ అయినా చేస్తే బాగుండు, హోలీ పండగ నాడు, హోలీ అయినప్పుడే, కోలాటం వేసేటప్పుడు కొంగు అయినా పట్టి లాగడే అని బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ గేయంలో ఆ నాటి పనులు, పండగల గురించి తెలుస్తుంది.


స్త్రీల పాటలు :
జానపద గేయాలలో స్త్రీలకు సంబంధించి నటువంటి గేయాలను స్త్రీల పాటలు అని పిలుస్తాము. జానపద గేయాలలో ఎక్కువగా స్త్రీల పాటలే ఉంటాయి.
సాధారణంగా వివాహమైన తర్వాత భార్య వలన కొందరికి ధనం లేదా అదృష్టము కలిసివస్తుంది. ఆ సమయంలో భర్త తన భార్య గురించి ఇలా చెబుతాడు
నీతోనే లచ్చిమి నాకొచ్చినాదే మరుదాలా
నువు రాకముందమ్మా నాకేమి లేదు మరుదాలా
నువు వచ్చిన గడియ లచ్చిమొచ్చిందే మరుదాలా
అంటూ తన భార్య రావడంతో ధనము వచ్చింది, దొడ్డి పెరిగింది, ఇల్లు పెరిగింది అని చెప్పడం ద్వారా భార్య మీద ఉన్న ప్రేమ, గౌరవం తెలుస్తుంది.


వేరు పడడం
భార్య తన మాట విని వేరు పడితే కుటుంబాన్ని ఎలా నడపాలి, పొదుపు ఎలా చేయాలి అనే విషయాలను చెబుతూ
పాలు మాలక నీపు పాలుపంచుకుంటే
కూలినాలి జేసి నిన్ను కూర్చోబెట్టి
సోలబియ్యములోను సొరగొట్టి యొకగిద్ద
అని భర్తతో నీవు సోమరితనం వదిలి నీ భాగం నీవు పంచుకుంటే కూలీనాలీ చేసి నిన్ను కూర్చోబెట్టి పోషిస్తానని, సోలెడు బియ్యం లోనే తలగొట్టి ఒక గిద్ద మిగిలిస్తాను అని
గిద్దపెసరపప్పు గిన్నెతోడను వండి
వద్దు వద్దన నీకు వడ్డించి నేతినగ
ముద్దజేసికొంత మూలదాచి ఎట్టి
ప్రొద్దున చద్దితో పొలముకే పంపింతు
గిద్దెడు పెసరపప్పు తోనే తన భర్తకు వద్దు వద్దు అన్నా వడ్డించి అందులోనే కొంత మిగిలించి పొద్దున్నే మరలా పొలానికి కూడా పంపిస్తానని చెప్పడం జానపద స్త్రీ పొదుపుకు ప్రతీక.


సంతానాపేక్ష
గృహిణికి సంతానప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. కానీ అట్టి సంతానంకు దూరం అయిన స్త్రీ పడే వేదన వర్ణించలేము
సంతులేని యిల్లు సావడి కొట్టము
పిల్లలులేనిల్లు పీర్ల కొట్టము
బాలలు లేని యిల్లు బందిఖానా అంటే ఇక్కడ సంతానం లేని చావడి కొట్టం వలె ఖాళీగా సందడి లేకుండా ఉంటుందని, పిల్లలు లేని ఇల్లు బందిఖానాలా ఉంటుందని చెప్పవచ్చు.


మంగళ హారతులు

సెలవిచ్చి మాయమ్మ సెలవిచ్చినోము – చెలిగి మీ అత్తింట్లో బుద్ధిగలిగుండు
ఎవ్వరేమాడిన ఎదురు మాటాడకమ్మా – వీధిలో నిలుచుండి కురులిప్పకమ్మా
పలుమారు పలుదెరిచి నవ్వబోకమ్మా – పరమాత్మతో గూడి వెలుగుమాయమ్మ
వార్నిగాదని పూలు ముడువబోకమ్మా – పెద్దల గుట్టెరిగి నడువుమాయమ్మ
ఆకలి ఉంటేను అడుగబోకమ్మా – అత్తగారితో పోరు చేయబోకమ్మా
నాతోటి జేసిన మంకు పోరెల్ల – ఎరుగని అత్తింట్లో చేయబోకు మమ్మా
ఆడపిల్లను అప్పగింతల సమయంలో అత్తవారింట ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయంలో తల్లి చెప్పిన బుద్ధులు వివరించ బడ్డాయి. ఎవరు ఏమి అనినా ఎదురు మాట్లాడకు, వీధిలో నిలబడి జుట్టు విప్ప కూడదు, కలహాలు పెంచకూడదు, ఎక్కడపడితే అక్కడ నవ్వకూడదు, అత్త వారితో పోరువద్దు, నాతో చేసిన మంకు తెలియని అత్తవారింట్లో చేయవద్దని చెబుతుంది.


హాస్య గేయాలు :
ఒక జారస్త్రీ తన భర్తతో ఒక విధంగా, ప్రియుడితో ఒక విధంగా ఉన్న విధానాన్ని ఈ గేయంలో చూడొచ్చు
యింటి మొగునికి నులకామంచం
పరాయి మొగుడికి పట్టేమంచం
నడుమ దిరిగే వో బొళ్ళమ్మకు
నగిషీ చేసిన నవారు మంచం
ఈ గేయంలో తన సొంత మొగుడికి నులక మంచం, పరాయి మొగుడికి పట్టే మంచం వేసి వీరిద్దరి మధ్య ఉన్న ఆమెకు కు నగిషీ వేసి చెక్కించిన నవారు మంచం వేసి మర్యాద చేసిన విధం చూడవచ్చు.
వదిన మరదళ్ళ హాస్యము ఈ గేయంలో చూడవచ్చు
వానగొడ్తందిజాన – వదినే వచ్చేనమ్మా
ఎట్లా పొమ్మందు వదినే – వానగొడ్తందిజాన
అంటూ మరదలు తన వదినతో
చాప వేస్తామంటే – సందు కొంచెమాయె
కళ్ళు తీస్తమంటె – చెల్లని పైసాయె
తన వదినను ఇంట్లో ఉండనీయడం ఇష్టంలేక చాప వేద్దామంటే తగిన స్థలం లేదని, కల్లు తీసుకువచ్చి మర్యాద చేద్దామంటే పైసలు చెల్లనివి ఉన్నాయని చెబుతుంది.
కోడిని గోస్తా మంటే గుడ్ల మీద కోడి వదినే
వడ్లు దంచుదామంటే – ఇత్తనాల వడ్లు వదినె
అంటూ చెబుతుంది. ఇక్కడ ఈమెను చూస్తే కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా అన్న సామెత గుర్తుకు వస్తుంది.
ఈ విధంగా జానపద గేయాలలో మనకు ఆనాటి జానపదుల జీవనం వ్యక్తమవుతుంది. జానపదులు ఆనందం, విచారం, సంతోషం ఈ గేయాల ద్వారా వ్యక్త పరిచేవారు. ఈ జానపద గేయాల ద్వారా మనము ఆనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.


ఆధార గ్రంథాలు :
1.తెలుగు జానపద గేయ సాహిత్యము – బిరుదురాజు రామరాజు.
2.త్రివేణి
3.తెలుగు జానపద గేయ సాహిత్యము – స్త్రీల గేయాలలో సంప్రదాయము – చింతపల్లి వసుంధరా రెడ్డి

  • భైరి నాగయ్య
    ఎ: 9701547606

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *