ఓ వైపు రోజురోజుకు దిగజారుతున్న పర్యావరణ ప్రమాణాలు. మరోవైపు పర్యావరణ పరిరక్షణకై వాగ్బాణాలు. మధ్యన పర్యావరణ రక్షణకై తీసుకోవాల్సిన చర్యల్ని తీవ్రతరం చేయాలంటున్న పర్యావరణవేత్తలు ఇవేవి పట్టని వినియోగదారులుగా మారిపోయిన సగటు జనాలు! నిత్యకృత్యంగా మారిన ప్రకృతి ప్రకోపాలు. మస్తిష్కానికి, సాంకేతిక పరిజ్ఞానానికి అంతు చిక్కని వాతావరణ పెనుమార్పులు. వెరసి భౌగోళిక భగభగలు. ఉరుములు, మెరుపులు, పిడుగులు. ఉప్పెనలు, కుంభవృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు! కరిగిపోతున్న మంచు ఖండాలు, పొంగుతున్న మహానదులు, తల్లిడిల్లుతున్న సముద్రాలు, నిరాశ్రయులైతున్న జనాలు, కనుమరుగైతున్న వేలాది జీవరాసులు! తరుగుతున్న అడవులు, పెరుగుతున్న ఎడారులు. ఇలా ఎంత ఘోషించినా, ఎన్నింటిని ఉదహరించినా వినేవాడు కరువైన వ్యవస్థలు!
శాపంగా మారిన పారిశ్రామీకరణ :
ఈ విపత్కర భౌగోళిక పరిణామాలు పారిశ్రామిక విప్లవం తర్వాత వేగం పుంజుకుంటే, ఈ 21వ శతాబ్దంలో తారస్థాయికి చేరాయి. దాదాపు గత 8 వేల ఏండ్లుగా పెద్దగా మార్పులేని భూ ఉష్ణోగ్రత 1850 నుంచి పెరుగుదల మొదలైంది. 19వ శతాబ్దం చివరి నాటికి వివిధ పరిశ్రమల ద్వారా వెలువడిన కార్బన్డయాక్సైడ్ 0.90C ఉష్ణోగ్రతను పెంచి భూగోళాన్ని జ్వరపీడితురాలిగా మారిస్తే, 20వ శతాబ్దం ప్రారంభానికి ఇది ఏకంగా 10C కు పెరిగింది.
1980 నుంచి ప్రతిదశాబ్దం, గత దశాబ్దం కన్నా వేడి దశాబ్దంగా నమోదు అవుతున్నది. 2015 నుంచి 2021 మధ్యన ఏడు సంవత్సరాలు అత్యధిక ఉష్ణోగ్రత సంవత్సరాలుగా ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) గుర్తించింది. ఇందులో 2016, 2019, 2020, 2021లలో అతివేడి సంవత్సరాలు అనగా, సరాసరి 010C నుంచి 110C ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవం ముందువాటి కన్నా పెరిగింది. 2021లో ఉత్తర ధృవానికి దగ్గర వుండే కెనడాలో 500C ఉష్ణోగ్రత నమోదై అల్జీరియాలోని సహారా ఎడారితో పోటీ పడింది. ఇదంతా ఎల్‌నినో (El Nino) ప్రభావమని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. (Kuwait (Mitribah) around 1.20c higher than normal on 21st July 2016). దీనంతటికి కారణం 1950 నుంచే కార్బన్ సంబంధిత ఉద్గారాలు పదులరెట్లు పెరగడమే!
సముద్రాల ఆమ్లీకరణ – నీటి మట్టాలు పెరగడం :
సంవత్సర సంవత్సరానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని విధిగా సముద్రాలు గ్రహించడంతో 1969 నుంచి సుమారు 700 మీటర్ల సముద్ర ఉపరితల నీరు -180C (0.40C ) వరకు పెరిగింది. దీంతో 1993-2016 మధ్య కాలంలో ఉత్తర ధృవంలోని మంచు సంవత్సరానికి 286 బిలియన్ టన్నుల చొప్పున, అంటార్కిటికా ప్రాంతంలో సంవత్సరానికి 127 బిలియన్ టన్నుల చొప్పున కరిగిపోయినట్లు నాసా (NASA) ధృవీకరించింది. గత దశాబ్దకాలంలో దక్షిణ ధృవమంచు కరగడం మూడింతలైనట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. గత శతాబ్ద కాలంలో సముద్ర మట్టాలు 200 మి.మీ. (ఎఎ) పెరిగితే, గత రెండు దశాబ్దాలలో ఇది రెండింతలైనట్లు తేలింది. అంటే, భూగోళాన్ని కొలిమిగా మార్చి అభివృద్ధి అనే ముసుగును తొడిగామన్నమాట!
అలాగే పరిశ్రమలు విడుదల చేస్తున్న కార్బన్‌డయాక్సైడ్‌లో 30 శాతాన్ని సముద్రాలు గ్రహించడంతో నీరంతా ఆమ్లీకరణ చెంది, జలచరాలకు ఆక్సీజన్ కొరతను సృష్టిస్తున్నాయి. ఇలా ప్రతీ సంవత్సరం రెండు బిలియన్ టన్నుల కార్బన్డయాక్సైడ్ అనే విషాన్ని సముద్రాలు గ్రహిస్తున్నట్లు లెక్కలు చెపుతున్నాయి.
పర్యావరణ వేత్తల నిరసన గళాలు!
నిరంతరం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు ప్రపంచవ్యాపితంగా గల పర్యావరణవేత్తలని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాదాపు అన్ని దేశాల్లో పర్యావరణ అభిమానులు, పర్యావరణ వేత్తలు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నారు.
వాతావరణం మార్పులపై అత్యవసర పరిస్థితిని ప్రకటించండి!
(Declare climate emergency)
దిగజారుగుతున్న వాతావరణ పరిస్థితులపై ప్రపంచంలో ఏదో రూపంలో ఆయా ప్రభుత్వాలకు, ప్రపంచాధినేతలకు నిరసనలతోపాటు విన్నపాలు అందుతూనే వున్నాయి. ఇందులో చెప్పుకోదగ్గ ఓ ప్రకటన బయో సైన్సు (Bio-Science) అనే పత్రికలో వచ్చింది. 153 దేశాలకు చెందిన సుమారు 11వేలకు పైగా పర్యావరణ శాస్త్రజ్ఞులు నవంబర్, 2019న భూమండలం యొక్క చెప్పలేని బాధలు (untold sufferings) పేరున ఓ ప్రకటనను పై పత్రికలో విడుదల చేస్తూ, ప్రకృతి విరుద్ద మానవచర్యల్ని నియంత్రించాలని, హరిత వాయువుల తీవ్రతను తగ్గించాలని, క్లైమేట్ ఎమర్జెన్సీని (climate emergency) ప్రకటించాలని ప్రపంచ దేశాలను డిమాండ్ చేసారు. అలాగే 1979లో జరిగిన మొదటి ప్రపంచ వాతావరణ జెనివా సదస్సు నుంచి 2015 నాటి ప్యారిస్ సదస్సు దాకా ఒప్పుకున్న తీర్మానాలన్నింటిని వెంటనే అమలు చేయాలని కోరారు. అయినా చేపట్టిన చర్యలు లేవు. చెవికెక్కించుకున్న దేశాధినేతలు లేరు.
శాస్త్రజ్ఞుల ప్రకటన తీర్మానాలు :
1.శిలాజ ఇంధనాల వినియోగంపై సుంకం విధించాలి.
2.జనాభా రేటను తగ్గించాలి.
3.బాలికలకు ఉన్నత చదువు అందించాలి.
4.మాంసాహారం నుంచి శాఖాహారానికి ప్రపంచాన్ని మార్చాలి.
సదస్సులు – సమావేశాలు – వాగ్బాణాలు :
పర్యావరణ ఉద్యమకారుల, నిరసనగళాలకు తలొగ్గి ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాపితంగా సదస్సుల్ని, సమావేశాల్ని నిర్వహిస్తూ, మాటల గ్యారడీని ప్రదర్శిస్తూనే వున్నది. అందులో ముఖ్యమైనది స్టాక్‌హోమ్ సదస్సు. కాలుష్యంతో, వేడిమితో తల్లడిల్లుతున్న పుడిమికి స్వచ్ఛత చేకూర్చాలనే తలంపుతో ఐక్యరాజ్య సమితి (UN) జూన్ 5-16, 1972లలో మొట్టమొదటి పర్యావరణ సదస్సును స్టాక్‌హోమ్‌లో నిర్వహించి, 26 అంశాల్ని ముందుకు తెచ్చింది. వీటిని మూడు భాగాలుగా విభజించింది. అవి :
- పర్యావరణ మార్పుల అంచనా కార్యక్రమం (Watch Plan) (Global Environmental Assessment Programme)
- పర్యావరణ యాజమాన్య కార్యక్రమాలు (Environmental Management Activities)
- ఆయా దేశాల స్థాయిలో చోటుచేసుకునే వాతావరణ మార్పుల తులనాత్మక పరిశీలన – యాజమాన్యం
- (International Measures to support Assessment and Management Activities carried out at the National & International Levels)
ఈ స్టాక్‌హోం సమావేశమే పర్యావరణ కార్యక్రమం (The Un Environment Programme – UNEP) అనే సంస్థకు నాందీ ప్రస్తావన చేసింది. అలాగే మొదటి రోజు సమావేశానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day)గా ఐక్యరాజ్య సమితి 1974లో ప్రకటించింది.
ధరిత్రి సదస్సులు : (Earth Summits)
ఇలా మొదలైన సమావేశాలు ధరిత్రి సదస్సు (Earth Summits)గా ప్రతి దశాబ్దానికి ఒకసారి ఎంపిక చేసిన దేశాల్లో జరుగుతున్నాయి. ఇప్పటికి అయిదు(1972, 1982, 1992, 2002, 2012) జరగా, ఆరవది (2022) గత నెల జూన్ 2-3 తేదీలలో తిరిగి స్టాక్ హోంలోనే జరిగింది. ఇందులో సమగ్రావృద్ది, న్యాయమైన భవిష్యత్తుతో పాటు, పగడపు దీవుల సంరక్షణపై చర్చ జరిగింది. ఇందులో 1992లో జరిగిన రియో డి జనిరో సదస్సుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 21వ శతాబ్దపు పర్యావరణ ఆకాంక్షల్ని నెరవవేర్చి, సమగ్ర అభివృద్దిని ఆయా స్థానిక ప్రభుత్వాలు సమిష్టి కృషితో చేపట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
పార్టీల సదస్సులు : (Conference of Parties – COP)
పై ధరిత్రి సదస్సులు దశాబ్దానికి ఒకసారి కాబట్టి, అంచనాలు, నియంత్రణలు, చర్యలు సాపేక్షికంగా వుండవని భావించిన ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం ఎంపికచేసిన దేశంలో ఒక సమావేశాన్ని నిర్వహించి, ధరిత్రి సదస్సు దశాబ్దపు (decennial) ఎజెండాను పునఃసమీక్షించుతూ, ప్రతీ సంవత్సరపు COPల నిర్ణయాత్మక అంశాల్ని అమలయ్యేలా చూడడం ఈ పార్టీల సదస్సుల బాధ్యత. కాని, ఇవి మిథ్యా సదస్సులుగానే మిగిలి పోతున్నాయి.
1995లో ప్రారంభమైన ఈ సదస్సుల తతంగం గత సంవత్సరం నవంబర్‌లో జరిగిన COP 26 గ్లాస్గో సదస్సులో చూసాం. ఈ సదస్సుల పేరునుబట్టే ఈ సమావేశాల్లో ఆయా దేశాధినేతల కన్నా, ఆ దేశాల ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తూ, దోచుకుంటున్న మల్టీనేషనల్స్ పాత్రనే గణనీయంగా వుంటుంది. ఈ ప్రపంచ కుభేరులు పర్యావరణంపై ప్రేమను ఒలకబోస్తూ, కొన్ని తీర్మానాలని చేసి ఆయా దేశాధినేతల దృష్టికి తూతు మంత్రంగా తీసుకెళ్ళుతారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు ఈ తీర్మానాలను పట్టించుకోకున్నా పల్లెత్తుమాటనని ఈ సదస్సులు, బలహీన దేశాలపై అనేక ఆంక్షల్ని మాత్రం విధిస్తాయి!
ఈ సదస్సులకు, కొన్ని అంతర్జాతీయ సంస్థల్ని (World Economic Forum-WEF) ఏర్పాటు చేసి, వాటిచే బీదదేశాల స్థితిగతుల్ని ఏకరువు పెడుతూనే, ధనవంత దేశాల బలుపును కూడా పేర్కొంటాయి. వీటిని చూసిన వారికి అంతర్జాతీయ సంస్థలు బేశుగ్గా పనిచేస్తున్నాయని భ్రమల్ని కల్గిస్తాయి.
గత అర్థశతాబ్ద కాలంగా ధరిత్రి సదస్సులు, COPలు ఏ లక్ష్యాల్ని సాధించియో పృథ్విని కమ్ముకున్న కాలుష్య మేఘాలు, రోజురోజుకు పెరుగుతున్న భూ తాపమే ఆకాశమెత్తు నిదర్శనం!
అందుకే, పర్యావరణవేత్తలు, అభిమానులు, అభివృద్ధి నమూనాల కింద నలుగుతున్న బడుగుజనాలు ఈ సదస్సుల సందర్శంగా సదస్సులు జరిగే ప్రదేశాల్లో, ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున నిరసనల్ని చేపడుతున్నది తెలిసిందే!
బ్రున్లాండ్ (Brundtland) కమీషన్ :
సాధారణంగా ఐక్యరాజ్యసమితి, యూనిసెఫ్ (UNICEF), ఐఎల్ఓ (ILO), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లాంటి సంస్థలంటే మనకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. కాని ఈ సంస్థలు ప్రపంచబ్యాంక్‌కు తలొగ్గి ఎలా పనిచేస్తాయో ప్రపంచీకరణ మొదలైన తర్వాతగాని తెలిసిరాలేదు. ఈ ప్రపంచస్థాయి సంస్థలన్నీ కొన్ని అగ్రరాజ్యాల, ముఖ్యంగా అమెరికా, యూరఫ్ దేశాల అడుగులకు మడుగులొత్తడం కనిపించని నగ్నసత్యం. ఈ సంస్థలేవి వాటి ఎజెండాలకు లోబడిగాని, చెప్పే భావాలకు అనుగుణంగా గాని ప్రవర్తించింది లేదు. గిట్టని దేశాల్లో సర్వేలు నిర్వహించి, నివేదికల్ని తయారుచేసి, అంతర్జాతీయ షరతుల్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తాయి. ఈ సంస్థలకి అనుగుణంగా వున్న దేశాలను పల్లెత్తుమాట కూడా అనవు.
కొన్ని సందర్భాలలో ఈ సమితి అంతర్జాతీయ కమీషన్లు ఏర్పాటు చేసి, నివేదికల్ని రాయించి శభాష్ అనిపించుకుంటుంది. కాని ఆ నివేదికల జోలికి గాని, అవి పొందుపరిచిన సూచనల్నిగాని ఏనాడు పట్టించుకోదు. అలాంటి కమీషనే ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన బ్రున్లాండ్ (Brundtland) కమీషన్. అతి శీఘ్రంగా క్షీణిస్తున్న పర్యావరణ పునరుద్దరణపై తగు సూచనల్ని ఇవ్వాలని కోరుతూ 1983లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, నార్వే ప్రధానమంత్రిగా పనిచేసిన గ్రో హార్లెమ్ బ్రున్లాండ్ (Gro Harlem Brundtland) నేతృత్వంలో ఓ కమీషన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ కమిటి ప్రతిపాదిత సిద్ధాంతం :
బ్రున్లాండ్ కమీషన్ వివిధ దేశాల ప్రపంచస్థాయి పర్యావరణ వేత్తల సూచనల్ని, సలహాల్ని తీసుకొని ఓ సిద్దాంతాన్ని, కొన్ని సూచనల్ని చేసింది. సామాజిక, ఆర్థిక అభివృద్దే సుస్థిర అభివృద్ధి అని, ఇది పర్యావరణ సమైక్యతతోనే సాధ్యమనే సిద్దాంతాన్ని ముందుకు తెచ్చింది.
ఈ సందర్భంగా అందరికి ఒకే సాధారణ భవిష్యత్ (Our Common Future) పేరున కమీషన్ ఓ రిపోర్టును రూపొందిచింది. అందులోని ముఖ్యాంశాలు :
- అభివృద్ధి మాత్రమే దారిద్య్రాన్ని నిర్మూలిస్తుంది.
- 1990 నాటికే ఆర్థికాభివృద్ధికై ఓ ప్రాపంచిక దృక్పథం ఏర్పర్చు కోవాలి.
- ఒకే ధరిత్ర (One Earth) కాబట్టి, అందరికి ఒకేరకమైన భవిష్యత్ (One Future) వుండాలి.
- ప్రకృతి వనరులను అభివృద్ధి చెందిన దేశాలు కొల్లగొట్టవద్దు.
- రేపటి తరం అవసరాలను తీర్చడానికి విశాల దృక్పథంతో రాజకీయ, ఆర్థిక, సాంఘిక వ్యవస్థల్ని నిర్మించాలి.
- దేశ ప్రజల మధ్యన, దేశాల మధ్యన సంపదల పంపిణీ జరగాలి.
- 1980 సంవత్సరమే చివరి అభివృద్ధి దశకంగా వుండాలి.
- సహార ప్రాంత 1/5 వంతు ప్రజల జీవన ప్రమాణాలు 1970 స్థాయికి దిగజారాయి. కాబట్టి, వారి జీవన ప్రమాణాల్ని తిరిగి పెంచేలా కృషి చేయాలి.
- మూడో ప్రపంచ దేశాల్లో అసమగ్ర అభివృద్ధి, అప్పులు, వడ్డీలు ఇకపై కొనసాగకూడదు.
కమీషన్ సూచనలు :
- జీవావరణానికి అనుగుణంగా మనముండాలిగాని, మనకు అనుకూలంగా జీవావరణాన్ని మార్చుకోవద్దు.
- ప్రకృతి వనరుల వినియోగంపై నియంత్రణ వుండాలి. లేనిచో వనరులు తరిగి వలసలు పెరుగుతాయి.
- వలసలతో వ్యవసాయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో భూసారం తగ్గడంతో నూతన సాగుకై అడవుల్ని నరకాల్సి వస్తుంది. కాబట్టి, వనరుల్ని కనీస స్థాయిలోనే వినియోగించాలి.
- హరిత వాయువల నియంత్రణ జరగాలి.
- అడవుల పునరుద్దరణ జరగాలి.
- పునరుద్దరణ ఇంధనాలను వినియోగించాలి.
- జలవిద్యుత్‌ను పెంచి, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించాలి.
ఈ కమీషన్ రిపోర్టు ఇచ్చి నాలుగు దశాబ్దాలు కావస్తున్నా సమగ్ర పర్యావరణాభివృద్ధి ఎంత మేరకు సాధించబడిందో కరోనా కాలంలో చూసాం. ప్రపంచస్థాయిలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కమీషన్లకు వాటి అమలును మాత్రం ఆటకెక్కిస్తున్నాయి. అందుకే ప్రకృతి విపత్తులు మనను కంటతడి పెట్టిస్తూ వెన్నంటి తరుముతున్నాయి.
ప్రకృతి జ్వరానికి మనిషి జలుబే కారణం :
మానవుడి వక్రబుద్దిని ఎత్తిపట్టిన బ్రున్లాండ్ కమిటీ రిపోర్టు నేపథ్యంలో అమెరికాలోని అయిదు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్థలు 1989లో భౌగోళిక మార్పులు – మన సాధారణ భవిష్యత్తు (Global Change & Our Common Future)అనే అంశంపై వాషింగ్టన్లో సదస్సును నిర్వహించాయి. ఈ సదస్సులో పాల్గొన్న పర్యావరణ సంస్థ మాజీ అధిపతి విలియం రకెల్షాస్ (William Ruckelshaus)మాట్లాడుతూ, ప్రకృతి జ్వరానికి మనమే అంటు వ్యాధిలా (nature seems to be running a fever. We are the flux)పనిచేస్తున్నామని వ్యాఖ్యానించడం ఓ కఠోర సత్యం కాదా..?
ఈ సందర్భంగానే అమెరికాలోని మూడు జాతీయ అకాడమీలు (సైన్సు / ఇంజనీరింగ్ / మెడిసిన్) సంయుక్తంగా నాటి అమెరికా అధ్యక్షుడైన జార్జ్ బుష్‌కు ఓ లేఖను పెట్టాయి.
లేఖనిలో ప్రధానాంశాలు :
- వాతావరణ విపత్తుపై అమెరికా శాస్త్రీయ విధానమైన ఎజెండాను సత్వరమే రూపొందించాలి.
- వనరుల అభివృద్ధికి, సంబంధిత కార్యక్రమాలకు సమన్వయం వుండాలి.
- సహేతుకమైన పర్యావరణ సమస్యల్ని శ్వేతసౌధం (White House) పట్టించుకోవాలి.
ఈ మూడింటితో పాటుగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలంటు లేఖలో ప్రస్తావించాయి.
ఈ లేఖను బుష్ & ష్ కాకి అవగా, తర్వాత అధ్యక్షుడైన జూనియర్ బుష్ కూడా తండ్రి బాటలోనే నడిచాడు. ఇదీ అంకుల్ శ్యాంల పర్యావరణ దృక్పథం!
(వచ్చే సంచికలో ‘మానవాళికి పెను ప్రమాద హెచ్చరిక’ చూద్దాం!)
- డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162