‘తృతీయ ప్రకృతి పౌరులు’.. మనలో ఒకరిగా గుర్తిద్దాం!


హిజ్రాలు నేడు సమాజంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. వీరిని తృతీయ ప్రకృతి (థర్డ్ జెండర్స్ ) గా పరిగణిస్తారు. స్త్రీ మరియు పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని హిజ్రా, గాండు, పేడీ అని పలురకాలుగా పిలుస్తారు. పుట్టుకతోనే ఈ లక్షణాలున్న వారు కొందరైతే, తమకు నచ్చిన విధంగా లింగ మార్పిడి చేయించుకుని మారేవారు మరికొందరు. వీరికి సమాజంలో సరైన ఆదరణ లేకపోవడంతో ఇలాంటివారందరూ కలసి ఒకే ఇంటిలో జీవిస్తుంటారు.
ప్రపంచ చరిత్రను ఒక్కసారి తిరగేసి చూస్తే వీరి ప్రస్తావన మనకు ఆనాటి కాలం నుండి కనబడింది. మన ఇతిహాసాలలో చూస్తే పాండవ వనవాసంలో అర్జునుడు బ•హన్నల అనే పేరుతో నపుంసకుడి వేషధారణలో జీవించాడన్న విషయం అందరికి విదితమే. అలాగే భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ఒక నపుంసకుడితో పోరాటం చెయ్యడానికి నిరాకరించినట్లు మహా భారతంలో చెప్పబడింది.


చరిత్ర పూర్వ కాలం నుండి హిజ్రాలు, లింగ మార్పిడి దారుల ఉనికిని నమోదు చేస్తూనే వచ్చింది. కానీ, వందేళ్ల క్రితం బ్రిటీష్‍ పరిపాలకులు వీరిని నేరస్తుల ముఠాగా ముద్ర వేయడంతో సమాజం వీరిని అపార్థం చేసుకుని చిన్న చూపు చూడ్డం మొదలైంది. నాటి నుండి నేటి వరకు వీరు సమాజం నుంచి వెలివేయబడుతూనే ఉన్నారు, అవమానించబడుతూనే ఉన్నారు.


సమాజం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా హిజ్రాలు నేటికీ యాచకుల్లాగే మిగిలిపోయారు. శతాబ్దాలనుండి తమ హక్కుల కోసం పోరాడుతూనే వున్నారు. వీరిని సమాజం త్యజించినట్టు, కొన్ని కుటుంబాలు కూడా వెలివేశాయి. అయినప్పటికీ ఎంతో ఆత్మధైర్యంతో వారు హిజ్రా కమ్యూనిటీని ఏర్పాటు చేసుకుని ఇతర లింగ మార్పిడి దారులతో కలిసి సహజీవనం చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చు కుంటున్నారు. ఒక హిజ్రా ‘గే’ గా ముద్రించబడి సమాజంలో జీవితం కొనసాగించాలంటే ఎంతో నరక ప్రాయమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిఒక్కరు చులకనగా చూస్తారు. వారిపట్ల చిన్న చూపు ప్రదర్శిస్తూ, వారితో మాట్లాడ్డమే తప్పుగా భావిస్తూ, భయంతో దూరం పెడుతుంటారు. కానీ, వాళ్ళూ మనలాంటి మనుషులే అని ఎందుకు గుర్తించరు?! ఈ మార్పు మనందరిలో రావాలి. వాళ్ళని కూడా మనలో ఒక్కరిగా భావించాలి. వీరికి ఎటువంటి ఆదరణ లేకపోవడంవల్ల వారి గ్రూప్‍ సభ్యులందరూ కలిసి వారిలో ఒకరికి నాయకత్వ బాధ్యత ఇస్తారు. ఆ ఎన్నుకోబడిన వ్యక్తిని ‘దీదీ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ప్రభుత్వం వీరిని పట్టించుకోక పోవడంతో డబ్బు సంపాదన లేకపోవడంతో బలవంతపు వసూళ్ల రీతిని పాటించాల్సొస్తుంది. ఎందుకంటే ఆర్ధిక ఇబ్బందులు కారణంగా గత్యంతరం లేని పరిస్థితిలో ఈ మార్గాన్ని వారు ఆశ్రయించాల్సి వచ్చినదని వారి వాదన.


ఇప్పటికైనా వీరి గురించి ఆలోచించి అటు ప్రభుత్వం ఇటు సమాజం సరైన సౌకర్యాలు, గౌరవము, రక్షణ కల్పించాలి. వీరిని కూడా భారత పౌరులుగా గుర్తించి, మనలో ఒకరిలా భావించాలి.

  • సుజాత.పి.వి.ఎల్‍.,
    ఎ : 7780153709

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *