నిర్వీర్యమౌతున్న నివేదికలు! శూన్యస్థాయిలో చర్యలు !!

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!!



(గత సంచిక తరువాయి)
గత కథనాలలో భూగోళానికి, మానవాళికి ముంచుకొస్తున్న పెనుప్రమాదాల్ని చర్చించాం! వివిధ సదస్సుల, సమావేశాల చర్చల్ని, తీర్మానాల్ని, దేశాధినేతల వాగ్బాణాల్ని చూసాం! అయినా జరగాల్సిన ధ్వంసరచన జరుగుతూనే వుంది. యుద్దమేఘాలు తొలగకపోగా మరింత కారుమబ్బులుగా మారుతున్నాయి. అగ్రరాజ్యాల మధ్యన చిన్న రాజ్యాలు నలిగిపోతుంటే, అమాయక ప్రజలు నిత్యం సమిధలుగా మారుతున్నారు. ఓ వైపు కాలుష్య పరిణామాల్ని ఏకరువు పెడుతూనే నిత్యం యుద్ధభేరిని మోగిస్తున్నాయి. తన ఉనికికే ప్రమాద ఘంటికలు మోగుతుంటే, భవిష్యత్‍ చిత్రపటం ఆగమ్యగోచరంగా మారింది.


ఈ విపత్కరస్థితిలో తన పెద్దతనాన్ని కాపాడుకోవడానికై ఐక్యరాజ్యసమితి భూగోళంకు సంభవిస్తున్న విపత్కర పరిణా మాల్ని ఏకరువు పెట్టే ఎజం డాలను ముందే సుకుంది. అందులో ప్రధానంగా చెప్పు కునే ది ఇంటర్‍ గవర్నమెంటల్‍ పానెల్‍ ఆన్‍ క్లైమేట్‍ చేంజ్‍ (IPCC) అనే ఓ ప్రపంచస్థాయి వేదికను ఏర్పాటు చేసి, ఆచరణకు నోచుకోని నివేది కల్ని ప్రపంచస్థాయి నిపుణు లతో రాయిస్తూ, కాన్ఫరెన్స్ ఆఫ్‍ పార్టీలలో (COP) చర్చిస్తున్నది.


ఈ సంస్థ (IPCC) పూర్వపరాలు :
భూగోళంపై నిత్యం చోటుచేసుకుంటున్న పరిణామాల్ని అంచనా వేయడానికి అనేక దేశాల్లో పర్యావరణ వేత్తలు, భూగర్భశాస్త్రవేత్తలు, భౌతిక, రసాయన, జీవశాస్త్రవేత్తలు ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నది తెలిసిందే! వీరికి తోడు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ అభిమానులు భూగోళంపై చోటుచేసుకుంటున్న పరిణామాల్ని, అన్యాయాల్ని అగ్రరాజ్యాల, పెద్దదేశాల దౌర్జన్యస్థితిని ఎండగడుతూనే వున్నారు. ఈ హెచ్చరికలకు నిద్రలేచినట్టుగా నటిస్తున్నా, ఆయా దేశాల పాలకులు పర్యావరణ పరిరక్షణకై చేపడుతున్న చర్యలు ఓవతీశీ స్థాయిలోనే వున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితిలో కదలికలు మొదలయ్యాయి. నివాసయోగ్య భూగోళం నిర్వీర్యంగా మారుతున్న పరిస్థితుల్ని శాస్త్రీయంగా అంచనా వేయడానికై 1988లో ఈ IPCC సంస్థకు రూపకల్పన చేసింది. ఈ బృహత్కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అజమాయిషీ చేయడానికై ప్రపంచ వాతావరణ సంస్థకు (WMO), పర్యావరణ కార్యక్రమ సంస్థ (UNEP) కు ఐక్యరాజ్యసమితి అప్పజెప్పింది.


ఇలా వాతావరణ సంబంధంగా జరుగుతున్న పెనుమార్పుల్ని శాస్త్రీ యంగా అధ్యయనం చేసి, భవిష్యత్‍ ప్రభావాలపై విధానపరమైన నిర్ణయాల్ని తీసుకోవడానికి మాత్రమే ఏర్పాటైన ఈ IPCC విధాన కర్తలను (policy makers) ఎలాంటి ఖచ్చితమైన చర్యలు చేపట్టాలో కట్టడి చేయలేదు.
195 దేశాల సభ్యత్వం గల ఈ సంస్థలోని మెంబర్‍ స్టేట్‍ సభ్యులంతా పాల్గొని చర్చలు చేయడం, ఆయాదేశాల నుంచి సేకరించిన పర్యావరణ విపత్తు సమాచారాన్ని క్రోడీకరించి, ఆధారాలతో సరిచూసు కొని తిరిగి సంబంధిత విషయ నిపుణుల, శాస్త్రజ్ఞుల అభిప్రాయాల్ని కోరుతుంది. ఈ నివేదికల తయారీకి, గ్రంథస్తం చేయడానికి, ప్రపంచ వ్యాపితంగా సంబంధిత విషయ నిపుణుల్ని, శాస్త్రజ్ఞుల్ని ఎంపిక చేస్తుంది.


నివేదికలు – మూడు దశలు :
1) ఆమోదం (approval) :
విధానకర్తలు పర్యావరణ విపత్తులపై ఓ అవగాహనకు రావడానికై వివిధ అంశాలపై చర్చలు చేయడం. విధానకర్తలకు అవగాహన కల్గించడం (summarise to policy makers)
2) దత్తత తీసుకోవడం (adoptation):
వివిధ విషయనిపుణులు గ్రూపులవారిగా తయారుచేసిన నివేదికల్ని సంశ్లేషణ చేయడం
3) సమస్య ఆకళింపు (acceptance):
మూడో దశలో భాగస్వామ్య దేశాలు (stake holders) పర్యావరణ తీవ్రతల్ని గుర్తించి, చేపట్టాల్సిన చర్యలపై స్పందించడం.


కాలపరిమితిని విధించలేని నివేదికలు :

ఈ వేదిక ఇప్పటివరకు ఆరు నివేదికల్ని రూపొందించింది. అవి వరుసగా 1990, 1995, 2001, 2007, 2014లలో కాగా ప్రస్తుత ఆరవ నివేదిక రూపకల్పన 2017లో ప్రారంభమైంది. దీని నివేదిక గత సంవత్సరం ఆగస్టులో కార్యాచరణ నివేదిక (Action Report-6)గా వెలువడింది. కాలపరిమితి లేకుండా రూపొందుతున్న ఈ నివేదికల తయారికి కనీసం అయిదు సంవత్సరాలు పడుతున్నది. ఈ కాలయాపనలో నిర్దేశిత అంశాలకు అదనంగా మరికొన్ని అంశాలు చేర్చాల్సి వస్తున్నది. దీంతో ఉపనివేదికల్ని (supplement) తయారు చేయాల్సి వస్తున్నది.
1995 నాటి AR-2 నివేదికకు 1996లో హరితవాయువుల ప్రభావంపై కూడా సమాచారాన్ని పొందుపర్చాలని ఎజెండాగా చేర్చడం జరిగింది.


కార్యాచరణ నివేదిక-6 (AR-6) :
ప్రస్తుత ఆరవ నివేదిక రూపకల్పన 2017లో మొదలై ఆగస్టు 9, 2021న ఐక్యరాజ్యసమితికి సమర్పించబడింది. దీన్ని రూపొందించడానికై ప్రపంచ వ్యాపితంగా 2,827 మంది శాస్త్రజ్ఞుల, నిపుణుల నుంచి అభ్యర్థిత్వాలు రాగా, అందులో నుంచి 743 మందిని ఎంపిక చేశారు. ఇందులో కూడా ఆశ్రిత పక్షపాత ముండడం గమనార్హం! చాలా దేశాల నిపుణులకు ఈ నివేదిక తయారిలో అసలు స్థానమే వుండదు. నివేదికల్ని రూపొందించడమే గాని, నిలదీయడం, నిర్దేశించడం ఈ వేదిక నుంచి కుదరనిపని. అలాగే క్షేత్రస్థాయి పరిశీలనలకన్నా, ఆయా ప్రభుత్వాలు ఇచ్చే గణాంకాలు, సమాచారమే క్రోడీకరణకు గురై వాస్తవాలు మరుగున పడిపోతూ వుంటాయి. ఇలా ఈ ఆరవ నివేదికలో 66 దేశాలకు చెందిన 234 మంది నిపుణులకు అవకాశం దక్కగా, ఇందులో భారత్‍ నుంచి 10 మంది వున్నారు. వీరంతా అంశాల వారిగా మూడు గ్రూపులుగా ఏర్పడి నివేదికల్ని రూపొందించారు.


l. భౌతిక అంశాల ఆధారంగా వాతావరణ మార్పులు -2021 (The Physical Science Basis) (9 ఆగస్టు 2021న విడుదలైంది)
ll. వాతావరణ మార్పుల ప్రభావం – ఆచరణ – నిస్సహాయత- 2022 (Impact, Adoptation & Vulnerability) (28 ఫిబ్రవరి 2022న విడుద లైంది)
lll. వాతావరణ మార్పులు – తీవ్రతను తగ్గించే చర్యలు – 2022 (4 ఏప్రిల్‍ 2022న విడుదలైంది)


ఇందులో అయిదు ప్రధాన అంశాలున్నాయి. (సైన్సు, టెక్నాలజీ, వాతావరణం, ఆర్థిక, సామాజిక) (Mitigation of climate change)
ప్రపంచ భౌగోళిక మార్పుల్ని అన్ని స్థాయిల్లో (భూగర్భ, నేల, సముద్ర, వాతావరణ, మంచు) వ్యాపితంగా జరుగుతున్న పర్యావరణ వాతావరణ మార్పుల్ని వీరు పరిశీలించి నివేదికల్ని రూపొందించడం జరిగింది. మూడో నివేదికను 38 మంది రూపొందించగా, భారతీయులు (10) ఇందులో పనిచేశారు.

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *