గోండు (కోయతూర్‍) భాష డిక్షనరీ – ఒక పరిశీలన


నిజమైన భారతీయులు ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైనపుడు అసలు ఈ దేశంలో మూలవాసి ఎవరు? ఆ మూలవాసులకు ఈ దేశంలో దక్కిన గౌరవం ఎలాంటిది? వారి ఆస్తిత్వ మూలాలు, సంస్కృతి సంప్రదాయాలు, భాషల రక్షణ పై, జీవన విధానంపై చర్చ జరిగినపుడు వారికంటు ఒక భద్రత దొరుకుతుంది. కాని 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారత దేశంలో ఆ ప్రయత్నం జరగలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో 10 కోట్ల జనాభ గల ఆదివాసీలు
ఉంటే, అందులో మధ్య భారత దేశ కేంద్రంగా 3 కోట్ల జనాభ గోండు సమాజంగా చెప్పబడే కోయతూర్‍ ప్రజలు ఉన్నారు, కానీ ఈ ప్రజలు మాట్లాడే గోండు భాషని మాత్రం రాజ్యాంగం లోని 8 వ షెడ్యూల్‍ లో చేర్చక పోవడం తో నానాటికీ భాష పూర్తిగా అంతరిస్త్తూ వస్తుంది. నేడు ఒక సర్వే లో కేవలం 5 శాతం జనాభా మాత్రమే గోండు భాష మాట్లాడుతున్నారు అంటే, బాష ఎంత వేగంగా అంతరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి క్రమంలో మధ్య భారతంలోని కొంతమంది ఆదివాసీ పరిశోధకులు, బుద్ధి జీవులు, భాష రక్షణకు గోండి (కోయతూర్‍) భాష డిక్షనరి తయారు చేసి, దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేలా, అన్ని రాష్ట్రాల ఆదివాసీలకు ఉపయోగ పడేలా తయారు చేసిన సందర్భంతో పాటు, ఇంకా అనేక రకాల గోండు భాష పై వచ్చిన డిక్షనరీ లను ఈ వ్యాసం లో వివరించాలనేది నా యొక్క ఉద్దేశ్యం.


మధ్య భారత దేశంలో కోయతూర్‍ తెగ విభజన
ఈ దేశంలో చత్తీస్‍ ఘడ్‍, మధ్యప్రదేశ్‍, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, తెలంగాణ, ఆంధప్రదేశ్‍ లలో కోయతూర్‍ లు మద్య భారత దేశ కేంద్రంగా 3 లక్షల చదరపు కిలోమీటర్ల దట్టమైన అటవీ కొండ ప్రాంతంలో నివశిస్తున్నారు. కాని నేడు వీరు మాట్లాడే భాషకు మాత్రం ప్రత్యేక గుర్తింపు లేదు. భాషల పూర్వ లిపి కి రక్షణ లేదు. వాస్తవంగా భారత రాజ్యాంగం వ్రాసే క్రమంలోనే ఒక కుట్రపూరితంగా విభజన జరిగింది. గోండి అనేది సమాజం ‘‘కోయతూర్‍’’ అనేది జాతి/తెగ, ఈ కోయతూర్‍ మూలం నుండి ఉద్బవించినవే నేటి ఆదిమ తెగలు, కాని ఈ తెగలకు ఆంత్రోపాలజి శాస్త్ర వేత్తలు, రాజ్యాంగ నిర్మాతలు నిర్వచనం ఇచ్చే క్రమంలో, గుట్టల ప్రాంతంలో నివశించే వారిని గుట్ట కోయలని (అది క్రమంగా గొత్తెకోయలుగా మారింది) రాజరికం చేసిన కోయలను రాజ కోయలని (అది క్రమంగా రాసకోయ అయింది) డోలికొట్టి కర్మలు చేసేవారిని డోలికోయ అని, గంపలు అల్లే వారిని గంప కోయలు అని, గొండ్వాణ రాజ్యాలు నడిచిన క్రమంలో గోండ్వాణ భూభాగంలో నివశించే జాతి మొత్తాన్ని గోండులని, అబుజ్‍ మాడ్‍ కొండ ప్రాంతంలో నివసించే గోండులను మాడియ గోండులని, మరియు గోండులని, రాజరికం చేసిన వారిని రాజ్‍ గొండ్‍లు అని, ఇలా రాజ్యాంగం వ్రాసేవారు భౌగోళిక ప్రాంతాలను బట్టి, కొండ ప్రాంతాలను బట్టి రాజ్యాంగంలో నిర్వచించటంతో దేశ వ్యాప్తంగా మెజారిటీ ఉన్న కోయతూర్‍ తెగ 38 రకాలుగా విడిపోవడంతో వీరు అంత వేరు వేరు అనే భావనలో కోయతూర్‍ భాషకు దేశంలో స్థానం లేకుండా పోయింది. రాజ్యాంగంలో ఆదివాసీల గుర్తింపుగా 5,6 షెడ్యూల్‍ లను ఆదివాసీల అభివృద్ధి కోసం పొందు పరిచారు కాని, షెడ్యూల్డ్-8 లో మాత్రం కొయతూర్‍ భాషకు మాత్రం గుర్తింపు లభించలేదు. దాంతో కోయతూర్‍ల అస్థిత్వ మూలాలు క్రమక్రమంగా అంతరించే దశకు చేరుకున్నాయి, ఒకే భాష గల ప్రజలు ఒకే మూలం నుండి వచ్చిన ప్రజలు భాష కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తాయి.


భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో గోండు భాషకు నష్టం
ఈ దేశంలో ప్రధానమైన కుట్ర ప్రత్యేక గోండ్వాణ రాష్ట్రం ఏర్పడకుండ జరిగింది. చరిత్రలో ప్రత్యేక భాష, వేషధారణ,ప్రత్యేక భుభాగం, సారూప్యం, ప్రత్యేక స్వయం ప్రతి పత్తి హక్కులు, చారిత్రక పోరాటాలు, బ్రిటిష్‍ పాలనలో ప్రత్యేక హద్దులు, ఈప్రాంతంకి ఉన్న, మధ్య భారతాన్ని ప్రత్యేక గోండు రాష్ట్రం చేయలేదు, భాష ప్రయుక్త రాష్ట్రాలుగా, ఒరిస్సా, మధ్యప్రదేశ్‍, చత్తీస్‍ ఘడ్‍, ఆంధప్రదేశ్‍, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటకలుగా విభజించటంతో ఆయ రాష్ట్రా లలో ఈ కోయతుర్‍ భాషకు ప్రాధాన్యత లేక, 66 ఏళ్ళుగా, కోయ భాషకు మరాఠి, ఒడియ, హింది, కన్నడ తెలుగు భాష ప్రభావం పడి, కోయ భాష యాస, ప్రాసలు కూడ మారినవి. దాంతో కోయ పదాలన్ని స్థానిక భాష పదాలు అని చెప్పుకునే క్రమం కూడా ఆయా రాష్ట్రాలలో చూడొచ్చు. దీనిని ఒక తెగ మూలాలను విచ్ఛిన్నం చేసే క్రమంలో మతతత్వ శక్తులు చేసే కుట్రగా కూడా మనం చూడవచ్చు. చారిత్రకంగా చూసినపుడు The Cambridge history Indian Volum -I అనే పుస్తకాన్ని లండన్‍ oxford university వారు రచించినపుడు కూడా ఈ దేశ మూలవాసులు ఆదివాసీలే అని తమ పరిశోధనలో 18 వ శతాబ్దం లోనే నిర్ధారించారు, వాస్తవాలు రాశారు. క్రీస్తు పూర్వం 10 వేల సంవత్సరాలుగా భారతదేశంలో సారవంతమైన భూములు, దట్టమైన అడవులు, నదులు, వ్యవసాయ యోగ్యమైన భూములు ఉండటంతో భారీగా వలసవచ్చి చేరారని, వీరంతా వలసవాదులని స్పష్టంగా ఉంది. దీని ఆధారంగా 2012 సం।।లో కూడా ఒక సందర్భంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా ఆదివాసీలదే ఈ దేశం అని తీర్పునిచ్చింది. “Indico The Magestanis” వ్రాసిన పుస్తకంలో క్రీస్తు పూర్వం 317 సంవత్సరంలో అలెగ్జాండర్‍తో కూడా గంగానది పరీవాహక ప్రాంతంలో ఆదివాసీలే పోరాటం చేసినట్టు సష్టంగా ఉంది. ఆర్యుల రాక నుండి బ్రిటిష్‍ పరిపాలన వరకు భారత దేశంపై దండెత్తిన వారందరిని ఎదురించి పోరాడి రక్తం చిందించిన చరిత్ర ఆదివాసీలదే కాని నేడు ఆ చరిత్ర వక్రీకరణతోపాటు భాష మూలాలను కూడా చిదిమేసి విభజించి పాలించి సమూల నాశనం చేసే కుట్ర చేసారు భారత పాలకులు. ప్రాంతాలుగా, రాష్ట్రాలుగా, తెగలుగా విడగొట్టారు, చివరకు జిల్లాలుగా, మండలాలుగా కూడా ఆదివాసి భూ భాగాలను విభజించటం వలన అస్తిత్వమే ప్రమాదంగా మారింది.


భౌగోళిక భారత దేశంలో గోండు భాష పదాలు – నామకరణం
దేశంలో భౌగోళిక అంశాలను పరిశీలన చేసినపుడు కూడా కొన్ని వాస్తవాలు బయటకి వస్తాయి, ‘గంగా’ అనేది కోయ భాషపదం కాని ఈ నది పేరును బయట ప్రాంతం వారు స్వాధీనపర్చుకున్నారు. గంగా అంటే కోయ బాష లో శ్రేష్ఠమైన త్రాగునీరు, నిరంతర ప్రవాహం అని అర్థం, ఈ నది పరీవాహక ప్రాంతంలో ఆదివాసీ తెగలు జీవనానికి ఆధారం అయి కడుపునింపే క్రమంలో వచ్చింది. హిందు అంటే కోయ భాషలో సముద్రం, అది హిందు మహాసముద్రం అయింది. కోయ భాషలో ‘హిమ్‍’ అంటే మంచు, ‘‘మలయ్‍’’- అంటే పర్వతాలు అవి నేడు హిమాలయాలు అయినవి. ఈ గంగా, హిమాలయ ప్రాంతాలలో పురాతన ఆదివాసీ మూలాల భాషనుండి ఈ పదాలు ఉద్భవించినవి కాని, ఆ కోయ భాష పదాలు నేడు పరాయివయినవి. ఇలా అనేక పదాలు ఉన్నవి. ఉదా: పుట్ట అంటే పాములు నివసించేది. ఈ పుట్ట అనేది కోయ భాష పదం ‘‘పుట్ట’’ అంటే కోయ అర్ధం గ్రహించటం. ఆదివాసీలు అడవులలో పశువుల్ని మేపే క్రమంలో పశువులు పుట్టను తన కొమ్ములతో పొడిస్తే తెల్లవారే లోపు వర్షం పడుతుందని గ్రహిస్తారు. అంటే పుట్ట-పశువు రెండు కలిసి వాతావరణాన్ని అంచనా వేస్తాయి. ఇలా కోయ భాషలో ప్రతి పదానికి ఒక శాస్త్రీయ అర్థం ఉంటుంది. కోయ భాష పదాలను అధ్యయనం చేసే క్రమంలో, డిక్షనరి అధ్యయనం క్రమంలో, అత్యాచారం, దోపిడి హత్య, దొంగతనం, మోసం, లాంటి పదాలను ఎక్కడ కనిపించలేదు, దొరకలేదు అని తెలిపారు. సూక్ష్మస్థాయి అధ్యయనంలో తెలిసినది ఏమిటంటే, అసలు ఆదివాసీ సమాజమే ఒక సమూహంగా ఉమ్మడి సంప్రదాయక జీవన వ్యవస్థ కల్గి ఉన్న క్రమంలో నైతిక విలువలు నీతి ధర్మం సేవా భావం అలవర్చుకున్న జీవనంలో వీటితో పనేముంది? పూర్వీకులు ఒక ఉన్నతమైన సమాజంగా తీర్చి దిద్దడానికి ఈ పదాలు పూర్వకాలం నుండే లేవు అని తెలిపారు. అందుకే ఆదివాసీలు అమాయకులు, నీతి పరులు, అనీ నైతిక విలువల సమాజం అనీ ఆకలితో ఎవరైనా వస్తే అన్నం, అంబలి, జావ పోసి ఆదరిస్తారు అతిథుల కాళ్ళు కడిగి ఇంట్లోకి ఆహ్వానిస్తారు ఇలాంటి శాస్త్రీయ జీవనం అలవర్చుకున్న ఆదివాసీలు దీనికి అనుగుణంగా భాష, పదాలు ఏర్పరుచుకున్నారు.


గోండు అనేది సమాజం కోయతూర్‍ అనేది తెగ
నేటి సమాజంలో గోండు కోయ వేరు కాదు ఆదిమ తెగలన్ని కూడా గోండి మూలం నుండి ఆవిర్భావం పొందాయి అనేది స్పష్టం అయినపుడు, గుర్తించినప్పుడు, ఇంకా చైతన్యం పెరిగి భాషను రక్షించుకోవటం సులభమవుతుంది. మాఘపున్నమి ఇది ఫిబ్రవరి నెలలో వస్తుంది దీనిని పరిశీలన చేస్తే అర్థం అవుతుంది. ఈ పున్నమిలోనే ఆదివాసీల దేవతలు, పండుగలు మొదలవుతాయి. నాగోబా – ఆదిలాబాద్‍, సమ్మక్క సారలమ్మ మేడారం, ఒరిస్సా నియంగిరిలోని దొంగ్రియ ఆదివాసీల జాతర, మహారాష్ట్ర కచర్గడ్‍ సాత్పురా పర్వతాల లో జాతర, మధ్య ప్రదేశ్‍ నర్మద నది పరివాహక ప్రాంతం లో వింధ్య పర్వతాలలో జాతరలు అన్ని కూడా ఈ పున్నమికి మొదలు అవటం భౌగోళికంగా ఈ దేశం ఆదివాసీలను విడదీసిన అడవి తల్లి పకృతి రూపంలో ఆదిమ తెగల మూలం ఒకటే అని తెలుపుతుంది. ఇంకా గొట్లు (సగాలు) దేవుళ్ళు అన్నీ కూడా ఈ పున్నమిలోనే దేశ వ్యాప్తంగా ఆదివాసీలు ఇలవేల్పు జాతర రూపం లో కొలుస్తారు గోండు కోయ వేరు అయితే గోండుల చరిత్ర అంత కోయ పున్నెం(ధర్మం) గా చెప్పబడుతుంది అలాంటపుడు వేరు ఎలా అవుతుంది? ఒక్క తెలంగాణలో తప్ప దేశవ్యాప్తంగా గోండులు కోయలంతా కోయతూర్‍లు గానే చెప్పుకుంటారు. దీనిని గోండి కోయ పురాణలలో చూడవచ్చు, మధ్య భారతంలో 1నుండి 12 రకాల గొట్లు (సగా) లుగా నేడు ఆదివాసీలున్నారు. అందులో తెలంగాణలో 3 నుండి 7 వరకు ఉన్నవి, మిగతావి ఇతర రాష్ట్రాలలో చూడవచ్చు వీరంతా కోయతూర్‍లు గానే పిలుచుకుంటారు. కొమరం భీమ్‍ పోరాటం తరువాత ఆదిలాబాద్‍లో నిజాం రాజు ఏర్పాటు చేసిన ఆస్ట్రియా దేశస్తుడు అయిన ప్రో’’ హైమండార్ఫ్ కమిషన్‍ హైద్రాబాద్‍ రాష్ట్రంకి ఇచ్చిన నివేదికలో గోండు అని రాయటం మూలంగా తెలంగాణలో గోండు, కోయ వేరు అనే పరిస్థితులు వచ్చాయి.


దేవనాగరి లిపిలో గోండు భాష డిక్షనరీ తయారీ ఒక పరిశీలన
ఆదివాసీ జాతి రక్షణ, భాష రక్షణ కోసం కోయతూర్‍ల అస్థిత్వ మూలాలను భవిష్యత్‍ తరాలకు అందించి అస్థిత్వ మూలాలను రక్షించే క్రమంలో ఆదివాసి పరిశోధకులు రచయితలు మొట్టమొదటగా తీసుకున్న డిక్షనరీ తయారి మద్య భారతంలో 7 రాష్ట్రాల ప్రతినిధులు 2014 డిసెంబర్‍లో గోండు తెగ ఆరాధికుడు గోండు కోయ పున్నె సిద్ధాంత కర్త, ఆచార్య డా।। మోతిరావన్‍ కంగాలి అధ్యక్షత న మొదటి సమావేశం కేంద్ర గిరిజన శిక్షణ పరిశోధన సాంస్కృతిక శాఖ సహకారంతో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. రెండ సెమినార్‍ 2015 అక్టోబర్‍లో కర్ణాటక కన్నడ యూనివర్సిటీ యందు, మూడవ సెమినార్‍, ఇందిరా గాంధి నేషనల్‍ ట్రైబల్‍ సెంట్రల్‍ యూనివర్సిటి అమర్‍ కంటక్‍ మద్యప్రదేశ్‍. నాల్గవ సెమినార్‍ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‍ జిల్లా ఉట్నూర్‍ సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ (ITDA) సహకారంతో జరిపారు. అయిదవ సెమినార్‍ భద్రాచలం (ITDA) సహకారంతో జరిపారు. ఆరవ సెమినార్‍ మహారాష్ట్ర చంద్రపూర్‍లో గోండ్వాన యానివర్సిటి సహకారంతో జరిగింది. ఏడవ సెమినార్‍ కర్ణాటక రాష్ట్రం రాయచూర్‍ యునివర్సిటీ యందు జరిపి పూర్తి చేయటం జరిగింది. ఈ ఏడు సెమినార్‍ లలో మధ్య భారతంలోని అనేక కోయ పదాలను సేకరించి, 3000 వేల పదాలు 400 వాక్యాలతో గోండి (కోయతూర్‍) డిక్షనరి తయారు అయింది. ఈ డిక్షనరీ తయారు చేయటంలో సుమారు 150 మంది ప్రతినిధులు 10 రాష్ట్రాల నుండి, ఒక సెమినార్‍ నిర్వహణకి 7 రోజుల చొప్పున హాజరు అయి, వివిధ రాష్ట్రాలలోని ఆయా రాష్ట్రాల మూల పదాల సేకరణతో చేయటం జరిగింది. జాతీయ స్థాయిలో ఈ డిక్షనరి తయారిలో అనేక రకాల కోణాల నుండి అధ్యయనం జరిగింది. కోయ భాషలోకి వివిధ రాష్ట్రాలలోని స్థానిక పదాల వైవిధ్యాన్ని కూడ తీసుకొని, ఎక్కువ ప్రాంతాలలో వాడుకలో ఉన్న వాక్యాలను మరియు పూర్వ పదాల ఆధారంగా నిర్మాణం జరిగింది. మిగతా వాడుక పదాలు అంటే స్థానికంగా
ఉన్న పదాలు పర్యాయ పదాలుగా వచ్చినవి. దీనిలో ప్రధానంగా ‘‘అన్నం’’ను కోయ భాషలో ‘‘గాటో’’ అని ఆదిలాబాద్‍ లో అంటారు. ఖమ్మం జిల్లాలో ‘‘దోడ’’ అంటారు. నార్త్ బస్తర్‍లో ‘‘సక్కుర్‍’’ బస్తర్‍లో ‘‘దౌడ’’ అంటారు. దీనిలో ‘‘దొడ’ పురాతన పదం, ఎక్కువ ప్రాంతాలలో వాడుకలో ఉన్న పదం, దానిని ప్రధాన పదం చేస్తూ మిగిలిన వాటిని పర్యాయ పదాలుగా చేశారు. ‘‘మీన్‍’’ అంటే చాప. ఇది ఎక్కువ ప్రాంతాలలో వాడుకలో ఉంది. కాని ‘‘కికె’’ అని ఒరిస్సా, ఖమ్మం జిల్లాలలో అంటారు. ఇది పూర్తిగా కోయ మూల పదం. మీన్‍ ఎక్కువ ప్రాంతాలలో వాడుకలో ఉన్నప్పటికి, ‘‘కికె’’నే తీసుకోవాల్సివచ్చింది. ఎందుకంటే మూలపదం కాబట్టి. ‘‘టేకు’’ అనేది కోయ పదం దీనిని అన్ని భాషలలో వాడుతున్నారు. టేకు వృక్షం కూడా అడవిలో భాగంగా ఉంది. టేకం అనే ఇంటి పేరు కూడా కోయలో ఉంది. ‘‘మర’’ అంటే చెట్టు కోయ భాషలో. ఖమ్మంలో వ్యవహారిక భాషలో ఉంది. ‘‘మడ’’ అని చత్తీస్‍ఘఢ్‍లో మధ్యప్రదేశ్‍లలో వాడతారు. ‘‘మర్ర’’ అని మహారాష్ట్రలో వాడతారు. ‘‘మర’’ అంటే సముద్రము ఒడ్డున ఉండే వృక్షం అని అర్థం. కోయ భాషలో ఈ మూడింటిలో ఒక్కటి ప్రధానం అయి మిగతావి పర్యాయ పదాలుగా చేశారు.


దేశంలో వివిధ రాష్ట్రాలలో స్థానికంగా వచ్చిన గోండు భాష డిక్షనరీల అనుసంధానం
ఈ డిక్షనరిలో 2005 నుండి 2007 వరకు ‘‘మార్క్ పెన్ని’’ అనే న్యూజిలాండ్‍కు చెందిన ఒక పరిశోధకుడు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‍ గోండు ప్రాంతంలో నివాసం ఉండి, 30 పదాలతో స్థానిక పదాలపై గోండి డిక్షనరి చేశాడు. ఇంకా మధ్యప్రదేశ్‍, మహారాష్ట్ర, లలో కూడా స్థానికంగా డిక్షనరిలు వచ్చినవి. అదేవిధంగా తెలంగాణలో గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ మరియు బిరస ముండా రీసెర్చ్ సెంటర్‍ నుండి కూడా డా।। మైపతి సంతోష్‍ కుమార్‍ కాకతీయ విశ్వ విద్యాలయంగారు వ్రాసిన కోయ భాష డిక్షనరీ ఆంగ్లం మరియు తెలుగులో వచ్చింది. కాని ఇవి ఒకే ప్రాంతానికి పరిమితమైన పదాలనే చేర్చారు. ఈ డిక్షనరిల ఆధారంగా, ఇంకా అనేక ప్రాంతాలలో వచ్చిన డిక్షనరీలు అధ్యయనం చేస్తూ అనుసంధానం చేస్తూ, ఆదిలాబాద్‍ జిల్లా గుంజాల గోండు లిపిలో బయట పడ్డ పూర్వ గ్రంధాల ఆధారంగా, ఈ డిక్షనరీలో అన్ని పదాలతో దేశ వ్యాప్తంగా కోయభాషకు ఒకే మూల పదాలు వచ్చేలా భాష ప్రామాణీకరణతో డిక్షనరి అయింది. దీనితో అన్ని ప్రాంతాలలో భాషాభివ•ద్ధి జరుగుతుంది. భాష పరిరక్షణ జరుగుతుంది. అని 4 సంవత్సరాల కాలం పాటు తయారు చేసి దేశ రాజదాని న్యూ ఢిల్లీలో 2016 సంవత్సరంలో విడుదల చేశారు. పురాతన చిత్ర లిపి సింధు నాగరికత చిత్ర లిపి ఆధారంగా హరప్పా, మెహంజదారో చిత్రలిపి కోయతూర్‍ భాషకు సంబందించింది అని దీనిని డా।। మొతిరావన్‍ కంగాలి కర్ణాటక హంపి యునివర్సిటీ గారు డాక్టరేట్‍ పుస్తక రూపం తెచ్చారు. ఆధారాలతో సహా తన పరిశోధన గ్రంధంలో తెలిపారు. దీనిని అతని శిష్యుడు అయిన మహారాష్ట్రకు చెందిన ప్రకాష్‍ సలామ్‍ హిందీలో అనువాదం చేశారు. దీనిపై మాంగ్సే మంగల్‍ సింగ్‍ అనే రచయిత నాగపూర్‍లో కోయ భాషపై లిపి కూడా తీసాడు. వివిధ ప్రాంతాలలో నేడు ఈ లిపి ప్రాచుర్యంలో ఉంది.


8వ షెడ్యుల్‍లో గోండు భాషను అధికారికంగా గుర్తించాలి
ప్రధానంగా ఈ దేశంలో హిందీ ప్రధాన భాషగా ఎక్కువ రాష్ట్రాలలో ఉండటంతో పూర్తి చేసిన ఈ డిక్షనరి మొదటగా దేవనగరి స్క్రిప్ట్లో ముద్రణలో చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో స్థానిక భాషలలోకి అనువాదం జరుగుతుంది. ఈ ప్రయత్నంతో రాష్ట్రాలు వేరు అయినా, ఈ దేశం ఆదివాసీలను విభజన చేసినా, విచ్ఛిన్నం చేసినా కోయ భాష మూల పదాలు భద్ర పరచటం కోసం జరిగిన ఒక గొప్ప ప్రయత్నంగా ఈ డిక్షనరీనీ చూడొచ్చు. ఈ డిక్షనరీ ఆదివాసి మేధావులు తయారు చేయటం వెనుక ఉన్న ఆకాంక్ష ఏమిటి అంటే పార్లమెంట్‍లో కోట్లాది కోయతూర్‍ ప్రజల అస్థిత్వానికి సంబంధించిన భాషకు రాజ్యాంగబద్ద ఆమోద ముద్ర 8వ షెడ్యూల్‍లో జరగాలి అని, హోం మంత్రిత్వ శాఖ అధికారిక పత్రం ప్రకారం గోండు భాషతో సహా 38 భాషలను చేర్చాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. 2004లో నాలుగు బాషలకు బోడో, డోగ్రి మైథిలి, సంతాలికి 22 భాషలతో కూడిన 8వ షెడ్యూల్‍లో జోడించబడ్డాయి. కానీ గోండు భాషకు స్థానం కల్పించలేదు. గోండు భాష అంటే కేవలం సంభాషించే మాధ్యమం మాత్రమే కాదు, భౌగోళిక, పాక•తిక, సామాజిక, చారిత్రక, ఇతిహాసాల సమగ్ర స్వరూపం, పురాతన మౌఖిక సాహిత్యం, ఆదివాసీ అస్థిత్వ మూలాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానంతో ముడి పడి ఉన్నందున రక్షణకు దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం జరగాలి. కోయ భాష విస్తృతికి ఇంకా పరిశోధనలు విస్తృతంగా జరగాలి. ప్రతి రాష్ట్రంలో ఆదివాసి పాఠశాలలో ఈ డిక్షనరీ పదాలు చేర్చి ప్రాధమిక విద్య అందించాలి. సెకండరీ విద్యా, యూనివర్సిటీ స్థాయిలో కోయ భాషకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. భాషా శాస్త్ర వేత్తలు, బాషా శాస్త్ర పరిశోధన సంస్థలు, ప్రత్యేక దృష్టి పెట్టాలి. బాష ప్రాధాన్యతను పెంచాలి. కోయ భాష ఆత్మగౌరవంనీ తెలియచేయాలి. అప్పుడే కోయతూర్‍లకి ఈ దేశంలో మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే భవిష్యత్‍లో పరాయి మతాల యొక్క బాషల ప్రభావం పడి కోయతూర్‍ల అస్తిత్వ మూలాలు ధ్వంసమయి ఆదిమ జాతులు చరిత్ర కాల గర్భంలో కలిసి పోవడం అనేది ఒప్పుకొని తీరాల్సిన నిజం.

– కాక నవ్య
అనువర్తిత భాషా శాస్త్రం
తెలుగు యూనివర్సిటీ హైద్రాబాద్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *