జానపద కళారూపాల్లో దక్కనీ కళాసంస్కృతి


ప్రపంచ జానపద కళ ఉత్సవాలను ప్రతీ సంవత్సరం ఆగస్టు 22నాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. లిఖిత సంప్రదాయానికి ముందే దేశదేశాల్లో జానపద కళారూపం మౌఖిక సంప్రదాయంలో కొనసాగుతూ వచ్చింది. అపు రూపమైన విజ్ఞానాన్ని అందించిన ఈ జానపదకళ జాతుల వారసత్వసంపదగా మిగిలి పోతోంది. అంతేగాదు అది జాతుల సాంస్కృతిక చిహ్నంగా కూడా నిలిచి పోతోంది. వాస్తవంగా జానపద అస్తిత్వమంతా జానపద కళా వైభవాల్లోనే నిక్షిప్తమై ఉంది. ఒక్క కళలే గాదు మానవ మనుగడకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించింది జానపదమేననేది నిజం.


ఏ దేశంలోనైనా జానపదులనేవారు సామూహికంగా కొన్ని సంప్రదాయాలను కలిగిఉంటారు. ఆ సంప్రయాయాల నుండి నిష్పన్నమైనదే జానపద విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని సుసంపన్నంచేసేవి జానపదకళలు మాత్రమే. చరకళల్లో ప్రధానమైన ప్రదర్శన కళల్లో న•త్యం, నాటకం, చిత్రపటం ప్రదర్శన ముఖ్యమైనవి. అభినయ ప్రాధాన్యం కలిగిన నృత్యంలో అలం కరణలతో పాటు సంగీత, సాహిత్యాలు మరింత సొగసులను చేకూర్చాయి. అలాగే అవి నాటకానికి కూడా ఆయువును పోశాయి. చిత్రపటం ప్రదర్శనలో అలంకరణ, సంగీత, సాహిత్యంతో పాటు గాత్రం కూడా పటం ప్రదర్శనను మరింత కళాత్మ కంగా తీర్చిదిద్దింది.


కళా రూపాల్లో శిష్ట జానపద కళలు
భారతీయ శిష్ట జానపదకళలు రైలు పట్టాల్లా సమాంతరంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. శిష్టకళా రూపాల శిలలుగా, దేవాలయాలుగా, చెక్కడాలుగా ఉండిపోయాయి. ఈ శిల్పవాస్తు, నిగమ శాస్త్రాలన్నీ ప్రాచీనపురాణాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అలాగే చరకళలైన చిత్రకళ, నాట్య, సంగీతగానాదులు ఒకతరంనుండి మరోతరానికి సంక్రమిస్తూ వస్తున్నాయి. శిష్ట కళలుశాస్త్రీయతను అనుసరించి మనగలుగు తున్నాయి. ఇవి శాస్త్రీయ ద•క్పథం కలిగి ఉంటాయి. స్థిరత్వ గుణం కలిగుంటాయి. ఇవి ఒకతరం నుండి మరోతరానికి ప్రసారమవుతూ ఉంటాయి. ఈ కళలు సతతం ప్రజల్లో ప్రసారమవుతూ పదునెక్కి కొత్త పోకడలను సంతరించుకొంటాయి.


శిష్ట కళలకంటే భిన్నమైనవి జానపద కళలు. వృత్తి పరంపరాగత కౌశలమే జీవగర్ర. నైపుణ్యతే సజీవంగాఉంచు తుంది. సరళ భావాల్ని ప్రతిబింబిస్తాయి. శిష్టకళలు నాగరిక వృత్తికారుల కారణంగా వైయక్తికంగా నిలిచి పోతాయి. జాన పద కళలకు ఆ ప్రమాదంలేదు. స్వాభావికంగా ఆ జానపద కళలు సామూహిక మనో భావాలకు ప్రాధాన్యమిస్తుంటాయి. శిష్ట శిల్పంలాంటివాటికి స్వయం ప్రేరణ ఎక్కువ. జానపద శిల్పంలాంటి వాటికి వస్తు నిష్ట ఎక్కువ. అందుకని జానపద కళారూపాల్ని కళాదృష్టితోనే గాక సామాజిక దృష్టితో చూడాల్సిన అవసరంఉంది. కుండ, ఇనుపగోళం, వస్త్రం, నీర (మద్యం) స•ష్టి నాగరికతకు నడకను నేర్పాయి. బుట్టలు, బొమ్మలు, ఆభరణాలు లాంటి సృష్టి హస్తకళలు ప్రతిబింబింబిస్తున్నాయి.


దక్కనీ కళా సంస్కృతి
భారతీయ కళాసంస్కృతుల్లో దక్కనీ కళాసంస్కృతికి ఎంతో ప్రాధాన్యముంది. దక్షిణభారతంలో కుతుబ్‍ షాహీలు 1296 నుండి 1687వరకు పాలించిన గోల్కొండ రాజ్యంలో, నిజాం షాహీలు 1724నుండి 1948 వరకు హైదరాబాద్‍ నేలిన కాలాలలో తెలుగుకళలు జోరుగా అభివృద్ధిచెందాయి. చిత్రలేఖన, నకాషి చిత్రపట శైలులకు దక్కనీ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతే గాదు ముఖ్యంగా ఇక్కడి హస్తకళలశైలి విదేశీకళా (పారశీలాంటి) సంస్కృతులతో మిశ్రితమై ప్రత్యేక తెలంగాణ శైలితో వర్ధిల్లింది. ఈ కళలకు పొరుగుననున్న మైసూర్‍, విజయనగర కళా చిత్రాలకు ఎంతోసారూప్యతను కలిగి ఉండడాన్ని విశేషించి చెప్పాలి. తళతళ మిరుమిట్లుగొలిపే బంగారం, తెలుపురంగుల వజ్రాలుసైతం గోల్కొండ శైలిలో కనిపించడం మన కళా సంస్కృతులనే ప్రతిబింబిస్తున్నాయి. అంగళ్లలో రత్నాల్లా గోల్కొండ కోటాలో వజ్రాలు అమ్మేవారనే ప్రశస్తి చరిత్ర పుటలకెక్కింది.


ప్రదర్శనకళల్లో పటంకథాగానం
అరుదైన ఈ దక్కనీ పటం కళారూపం మీద తెలుగు రాష్ట్రాల్లో 35యేండ్ల క్రితమే ప్రత్యేక అధ్యయనాలు సాగుతూ వచ్చాయి. ఈ కళా రూపం దక్షిణ భారత ప్రాంతంలో నాలుగు వందల సంవత్సరాలుగా ఆశ్రిత కులాల కళాకారులు చేత ప్రదర్శితమవుతూ రావడం గుర్తించుకోవాలి. ముఖ్యంగా వృత్తి ఆధారిత పురాణాలు నిర్దిష్ట పోషకుల మూలపురుషుల చరిత్రలు వందలేండ్లుగా ప్రజల ముందు ప్రదర్శింపబడుతూ వచ్చాయి. ఇంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్న ఈ పటం కళా రూప సంస్కృతి అందుబాటులో లేనందువల్ల 35 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచానికి తెలియకుండా చీకటికోణంలో మ్రగ్గింది. 1950-65 మధ్య కాలంలో ప్రఖ్యాత జానపద పరిశోధకుడు నేదునూరి గంగాధరం గ్రామ యాచకుల గురించి మొట్టమొదట వెలుగులోకి తెచ్చారు. 1955లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు జానపద గేయసాహిత్యం మీద పరిశోధన చేసినప్పటికీ పటం కళారూపం మీద దృష్టి సారించలేదు. ఆ తర్వాత వృత్తి పురాణాల పటం కథాగానమంటూ ననుమాసస్వామి, పద్మనాయకుల కథాగానమంటూ భక్తవత్సలరెడ్డి ఈ కళారూపం గురించి అధ్యయనంచేస్తూ వచ్చారు. కళాచరిత్రకారుడు జగదీశ్‍ మిట్టల్‍ జానపద కళారూపంమీద గొప్ప కృషిచేసి 2014లో Deccani Scroll Paintigs గ్రంథాన్ని రచించాడు. అందులో ఆయన దక్కనీ పటం కళారూపం అనేక అంశాలలో ఉన్నతమైనవి అయినప్పటికీ, భారతదేశం లోని బెంగాల్‍, రాజస్థాన్‍, మధ్యప్రదేశ్‍, గుజరాత్‍, కర్ణాటక ప్రాంతాలలో ఉత్పత్తి చేయబడిన స్క్రోల్‍లతో పోల్చినప్పుడు దీని కళా విలువలు పరిశోధకులకు తెల్సివచ్చా యన్నారు. 2000 సంవత్సరం నుండి విశ్వ విద్యాలయాల్లో ఈ పటం కళా రూప సంస్కృతి అంశంగా పాఠ్యాంశాలే గాదు ఆంధప్రభ, వార్త్త లాంటి ప్రముఖ పత్రికల్లో ననుమాసస్వామి ధారా వాహిక పరిశోధన వ్యాసాలూ రాశారు. మరో అంశం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‍ ఆయన మార్గదర్శనంలో 13 సీరియల్స్ చిత్రించి ప్రసారం చేసింది. అంతేగాదు చీకటి కోణంలోంచి ఈ పటం కళారూప సాహిత్యం వెలువడుతున్న కారణంగా విశ్వ విద్యాలయాల్లో పిహెచ్‍.డి పరిశోధనలు జరుగుతూవచ్చాయి.


పటం కళారూపం స్వరూపం
చిత్ర పటం అనేది సమ్మికనిపిస్తోంది. శ్రిత కళగా ఏర్పడింది. పటం కళారూప ప్రదర్శనకు ఆశ్రిత కులాలు, పటం నిర్మాణానికి నకాషి కళాకారులు తరతరాలుగా సేవలందిస్తూ వస్తున్నారు. పటం నిర్మాణం పూర్తిగా సంప్రదాయ రీతిలో దేశి పద్ధతిలో తయారవుతుంది. అజంతా కళ దీనికి మూలం. ఇది జానపద చిత్రకళా సంస్కృతికి సంబంధించింది. సృజన శీలత, దక్షతఉన్న కళాకారులే దీన్ని నిర్మించగలరు. ఆ ప్రజ్ఞా పాటవాలు కలిగిన కళాకారులే నకాషి వారు. మన సమాజంలో కులం పుట్టిన నాటినుండే ఈ నకాషి వృత్తి కనిపిస్తోంది. హిందువుల పెండ్లిళ్లకు ఆవశ్యకమైన ఐరోణి కుండల మీద కళాత్మకంగా చిత్రాలువేసే పనినుండి చిత్ర పటం తయారీవరకు గల పనంతా నకాషీలదే. పోషక కులం కోసం ఆశ్రిత.

కులం ఆధార పడడం, ఆశ్రితుల మనుగడకోసం నకాషీలు చిత్ర పటం మీద కళా ఖండాలు చిత్రించడం ఒక సంప్రదాయంగా వస్తోంది.
చిత్రపటం తయారీని గమనిస్తే అది ఒక శాస్త్రీయ పద్ధతిలోనే సిద్ధంచేయడం కనిపిస్తోంది. మూడున్నర అడుగుల వెడల్పు, 36 అడుగుల పొడువున్న ఒక సైను తెల్లబట్టను ఎన్నుకొని దాన్ని ఉతక్కుండా తీసుకువచ్చి చదును నేలమీద పేర్చి, ఖడీగోండు, (తుమ్మబంక) గంజికలిపి వడబోసి, వెడల్పున్న కుంచెతో పూస్తారు. అది ఆరిన తర్వాత నల్లరంగు రేఖలతో అద్దకంచేసి వాటిమీద నప్పేరంగులు నింపుతారు. చిత్రించిన బొమ్మల కాంతి తగ్గకుండా పటంమీది బొమ్మల మీద సుద్ద ఖడీ వేస్తారు. అలా వేస్తే బొమ్మలకు వేసిన రంగులు పక్కలకు ప్రాకాకుండా నిలిచిపోతాయి. కథాంశంలో పాత్రలను బట్టి తెల్ల, నల్ల, పసుపు, నీలి, ఆకుపచ్చ, ఎరుపులతో పాటు పసుపు పచ్చ తాళకం అనేదాన్ని ఉపయోగి స్తారు. నకాషీలు చిత్రించిన చిత్రపటంలో పోషిత కులాల సాంస్కృతిక చరిత్రనే దిద్దుతారు. ఒకసారి పటం నిర్మాణం చేయిస్తే అది నూరేండ్లు ప్రదర్శించడానికి ఉపయోగ పడతాయి.


పటం ప్రదర్శన విధానం
పటం కళారూప ప్రదర్శనలో నిలువుపటం,అడ్డంపటం రెండింటి ప్రదర్శనలో విభేదం కనిపిస్తోంది. రెండుగుంజలు అటొకటి, ఇటొకటి పాతి, పైభాగంలో ఆరు అడుగుల ఎత్తులో అడ్డంగా ఒక కర్రనుకట్టి నిలువు పటాన్నిదానికి పైనుండి కిందికి వేలాడేట్టుగా కడతారు. మొదట ఆరడుగులు వేలాడదీసి మిగితా పటాన్ని కింద నేలమీద చుట్టి పెడతారు. పటం కథాగానం చేసే ఆరుగురు కళాకారుల్లో ప్రధాన కథకుడు, సహ కథకుడు పటానికిరువైపులా నించుంటారు. మిగిలిన కళాకారుల్లో ఒకరు తబలా, మరొకరు హార్మోనియం, ఇంకొకరు తాళాలు, మిగిలిన కళాకారుడు శృతి వాయిద్యాన్ని-తలో పనిలో ఉంటారు.


12 వృత్తులవారికి చిత్రపటాలు
వృత్తి పురాణాలు ప్రదర్శించడానికి మాధ్యమాలుగా ఉపయోగపడే ఈ పటం కళారూపాలు పరిమిత కులాలకే ఉండడం కనిపిస్తోంది. ఒక్కో కులానికి ఒకటి లేదా రెండు ఆశ్రిత కులాలు ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా 12 వృత్తుల వారికి చిత్రపటాలుంటే వాటిని ప్రదర్శించడానికి 16మంది ఆశ్రిత కళాకారులున్నారు. 1. మాదిగ వృత్తి జాంబపురాణం పటం కళా రూపం. వారికి డెక్కలి కళాకారులు కథాగానం చేస్తారు. 2.మాల వృత్తికి శివకంఠ మాల పటం కళారూపం. దాన్ని చెప్పడానికి గుర్రం కుల కళాకారులున్నారు. 3.కోయ పురాణం పటం కళా రూపం. దీన్ని చెప్పడానికి పట్టెడ కళాకారులున్నారు 4. గోండ్‍ జాతి పద్మనాయకుల పటం కళా రూపం. దీన్ని చెప్పడానికి తోటి కళాకారులున్నారు. 5. నాయీబ్రాహ్మణ వృత్తిపురాణం పటం కళారూపం. దీన్ని చెప్పడానికి అద్దపు కళాకారులున్నారు. 6.రజక వృత్తి మడేలు వృత్తిపురాణం పటం కళారూపం. దీన్ని చెప్పడానికి మఠమయ్యలు, గంజికూటి కళాకారులున్నారు. 7. యాదవ వృత్తి పురాణ పటం కళా రూపం. దీన్ని చెప్పడానికి మందెచ్చు, కొమ్ముల, తెరచీరల కళాకారులున్నారు. 8. కుమ్మరి వృత్తి పురాణం పటం కళా రూపం. దీన్ని చెప్పడానికి పెక్కండ్రు కళాకారులున్నారు. 9. ముదిరాజు వృత్తి పురాణం పటం కళా రూపం. దీన్నిచెప్పడానికి కాకి పడగల కళాకారులున్నారు. 10. పద్మశాలి వృత్తి పురాణం పటం కళారూపం. దీన్ని చెప్ప డానికి కూనపులి కళాకారులున్నారు. 11. విశ్వా బ్రాహ్మణ వృత్తి పురాణం పటం కళారూపం. దీన్నిచెప్పడానికి పనస కళాకారులున్నారు. 12 గౌడవృత్తి పురాణం పటం కళా రూపం. దీన్ని చెప్పడానికి జెట్టి, ఏనూటి కళాకారులున్నారు. పై వాటిలో మడేలు వృత్తివారికి ఇద్దరు, యాదవ వృత్తి వారికి ముగ్గురు, గౌడ వృత్తి వారికి ఇద్దరు చొప్పున కళా ప్రదర్శన కళాకారులున్నారు. అయితే, మొత్తం 12 వృత్తులవారికి 16 పటం ప్రదర్శించే కళాకారులున్నారనేది గుర్తించుకోవాలి.


దేశ విదేశాలలో ప్రదర్శన కళలు
ప్రదర్శన కళల్లో అనేకమైన వాటిల్లో చిత్రపటం దృశ్య రూపానికి సంబంధించింది. ఆ రోజుల్లో వృత్తిపురాణాలు ఆ చిత్రపటం ద్వారా ప్రదర్శిత మవడమంటే ఈనాటి పవర్‍ పాయింట్‍ ప్రెసెంటేషన్‍ లాంటిది. అది ఒకసమ్మి శ్రితమైన కళగా భాసించింది. దేశీయంగా తెలుగు రాష్ట్రాల్లో చిత్రపటం ప్రచారంలో ఉంటే, బీహార్‍, ఒరిస్సా, బెంగాల్‍, కర్ణాటక రాష్ట్రాల్లో పటచిత్రాలు తరతరాలుగా ప్రదర్శిత మవుతూ వస్తున్నాయి. విదేశాల్లో టిబెట్‍, ఇజ్రాయిల్‍ లలో Printed Scrolls, Dead Scroll Narrativesలాంటి జానపద ప్రదర్శన కళలు ప్రచారంలోనున్నాయి. అలాగే మలేషియా,నేపాల్‍ లాంటి దేశాల్లోనూ ఇలాంటి ప్రదర్శనలు కనిపిస్తున్నాయి. 2015 మార్చిలో అంతర్జాతీయ జానపద కళలమీద హైద్రాబాద్‍లో ననుమాస స్వామి రెండురోజుల సదస్సు నిర్వహించినప్పుడు వేరు వేరు దేశాల పరిశోధకులు తమ దేశాల్లో ప్రదర్శితమవుతున్న కళారూపాలను ప్రదర్శించారు. దేశీయంగా చిత్రపటం కళారూపాలు ఇక్కడి వృత్తుల పురాణాల కథాగానంతో ప్రదర్శితమవుతూ ఉంటే విదేశాలలో కేవలం రామాయణ, భారత ఇతివృత్తాలతో ప్రదర్శన కళలు ప్రదర్శితమవుతూ వస్తున్నాయి. దేశీయ, విదేశీయ ప్రదర్శన కళలలో వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతేగాదు దేశీయ చిత్రపటం కళారూపాలు వృత్తులకు, వృత్తి మూల పురుషుల వీరగాథలకు సంబంధించి ఉన్నాయి. విదేశీ కళా ప్రదర్శనల్లో కేవలం రామాయణ భారత కథాగానాలు కనిపించడం పరిశోధకులకు దిమ్మదిరిగి పోయింది. సామాజిక చైతన్యం లోపించిందని బాహాటంగానే విమర్శించారు.


పటం ప్రదర్శన సాహిత్యం
వృత్తి పురాణాలలో ఆదిపురాణం మాదిగ వృత్తికి సంబంధించిన జాంబ పురాణం. కథాగానం చేసే కళాకారులు ఆశ్రితులైన డెక్కలి ఉప కులం. చైతన్యమేగాదు,రసరమ్య గీతాల్లా సాగిపోయే సృజన సాహిత్యం మంత్రముగ్దుల్ని చేస్తుంది.
‘నీల వర్ణా ! జాంబవంతా ! ఏడున్నావయ్యా !
ఆకాశంలో ఉన్నావా ? గాలిలో ఉన్నావా ?
నడి సంద్రంలో దాగి ఉన్నావా ? జాంబవంతా !’
అంటూ జానపద కవి ఆ సన్నివేశాన్ని ఆసాంతం రసరమ్యం చేశాడు.
ఈ సాహిత్యం మామూలు దర్వులో ఉండడం మనస్సును స్పందింప జేస్తుంది. దాని నుండి స్ఫూర్తిని పొందిన సినీ కవి అవే అక్షరాల్ని పల్లవింపజేసి హృదయాల్ని దోచుకొనే తీరు గమనించండి.
‘ఏ మబ్బు మాటున్నావో ఏ పొదల చాటున్నావో
ఏ గాలి తరగలపైనా.. ఊగి ఊగి పోతున్నావో
కలగా.. నన్నే.. కవ్వించేవో..
చందమామలో ఉన్నాను.. చల్లగాలిలో ఉన్నానూ
నీ కంటి పాపలలోనా.. నేనూ దాగి ఉన్నానూ
నీలో.. నేనై.. నిలిచున్నాను’
అంటూ సినీ బాణిలో రక్తి కట్టించాడు. జానపద కవులే శిష్ట కవులకు మార్గ దర్శకులు అనేది నిజం.
మడేలు వృత్తి పురాణంలో శిష్టులను సైతం తలలూపే విధంగా గీతాన్ని రచించాడు జానపద కవి….
‘కొమ్మనురా విరుల రెమ్మనురా
కనుగొనవేరా నా మనసే నీదాయెరా
ఈ కొమ్మ నీ సొమ్మురా ఈ రెమ్మ పూ రెమ్మరా
పూ సుగంధ భరితమ్మురా కొమ్మనురా …’
అంటూ జానపద కన్యక రతి వలపులలో వోల లాడిస్తుంది. కవి తన ప్రతిభతో ప్రేక్షకుల్ని రసానందంలో ముంచేస్తాడు. అలాగే మరో సన్నివేశంలో గీతాన్ని ఎత్తుగడలతో నడిపించాడు.
‘జాజినమ్మా విర జాజినమ్మా
విరహ మోహం తీరదేమమ్మా
కలలో కనిపించే అందమొలికించే
రేరాజు నారాజు కవ్వించేనమ్మా’
అంటూ పదాలు పునరావృతమైనప్పటికీ నడుమ చేరిన విర పదం రసరమ్యతను తెచ్చిపెట్టింది.
ఈ జానపద కవి రజక వృత్తి గురించి యదార్థంగానేగాదు అద్భుతంగా వర్ణించాడు. సన్నివేశం మాసిన,చీకిన బొంతనుతికేది.
‘ఎట్లా ఉతికేదవురా బొంత
ఈ కఠిన మాటలు బొంక కింకా
సామాజిక జనంలోపల కలిపి ఉతికి తెలుపు చెయ్యకు
ధరణిలోన కీర్తి కొంత వగల మాటలు పలుకనేలా’ // ఎట్లా//
సౌడు సున్నంల తడిపి ఉతుకకు పొయ్యిమీద ఉడక పెట్టొద్దు
నీళ్లలో జాడించవద్దు బండమీద నువ్వు బాదొద్దుర
భూమి మీద నువ్వు ఎండేయ వద్దు
గాలిలోనూ నువ్వు ఆరేయవద్దు // ఎట్లా//
వాస్తవికంగానే అయినా సృజనాత్మకత ఉట్టిపడుతోంది. జానపద కవి ప్రతిభ శిష్టులైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు.
నాయీబ్రాహ్మణ వృత్తి పురాణంలో పెళ్లి సందర్భంలో నాయికి దోషి బ్రాహ్మణునికి జరిగిన సంవాదం కొంత క్రొత్తదాన్ని నింపింది.
ఎవ్వడివిరా నీవు ఇందేల వచ్చినావు ఎవ్వడివిరా నీవు
వొళ్ళు బలిసి నాడు ధనము దొంగలించుకు పోవును //ఎవ్వడివిరా నీవు//
మూటనివ్వను పోరా నాయీ నన్ను విడువుమోయీ
నా మాట వినువురోరి మూటనివ్వను పోరా
కూలి చెయ్యరాదా మరియాదగ బతకలేవా
మూట నాది రోరి నా శ్రమను దోయకోరి
ఏటికి ఈ దొంగ బుద్ధి సిగ్గు నీకు లేదా //ఎవ్వడివిరా నీవు//
సన్నివేశం సామాజిక అంశంలోకి ప్రవేశ పెట్టడం అద్భుతమైన ఆలోచన. ప్రేక్షకులను అలరించేది సామాజిక వర్గాలను చతన్యపరిచే దృక్పథం ఎన్నదగింది.
ఇలాగే మిగిలిన తొమ్మిది మంది పోషక కులాల పటం కథా గానంలో ఆశ్రిత కులాల సాహిత్యం గొప్ప విలువలను ప్రోది చేస్తున్నాయని చెప్పడం మంచిది. వేల సంవత్సరాలయినప్పటికీ వృత్తి పురాణాల ప్రదర్శన, సాహిత్యం చీకటిలోనే మ్రగ్గుతూ వచ్చింది. ఈ 50 సంవత్సరాలలోనే జానపద పరిశోధకుల కృషివల్ల ఈ మాత్రం వెలుగు చూడ్డం దక్షిణ భారతీయ సాహిత్యానికి మేలే జరిగింది.

  • ప్రొఫెసర్‍ ననుమాస స్వామి
    ఎ : 7013763438, 9848545949

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *