వావికొల్లులో ఉదయనచోడుని కొత్తశాసనం


నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలంలోని వావికొల్లు గ్రామం పొలిమేరలో కందూరుచోడులనాటి కొత్తశాసనం లభించింది. ఇది తెలంగాణ చరిత్రలో కొత్తపేజీ. కందూరుచోడుల పాలనాకాలానికి చేర్చిన కొత్త విశేషణం.


నల్లగొండ జిల్లాకేంద్రానికి పొరుగునవున్న పానుగల్లు రాజధానిగా కందూరు-1100ల నాడును కందూరిచోడులు తొలుత కళ్యాణీ చాళుక్యులకు సామంతులుగా, తర్వాత కాకతీయ సామంతులుగా 250యేండ్లు పాలించారు. ఈ శాసనంలో పేర్కొనబడిన ఉదయనచోడుడు నల్లగొండ జిల్లా శాసనసంపుటి, వా.2లో సం.25వ, క్రీ.శ. 1149నాటి సిరికొండ శాసనంలో ప్రస్తావించబడ్డాడు. ప్రస్తుత వావికొల్లు శాసనం ఉదయనచోడుని శాసనాలలో 3వది. క్రీ.శ.1149నాటికే ముగిసిపోయిందన్న జగదేకమల్లుని పాలనాకాలాన్ని క్రీ.శ.1158 వరకు చూపిన మొదటి శాసనమిది. గతంలో ఈ రాజుదే 1156 నాటి శాసనం భువనగిరి సమీపంలోని వడపర్తిలో(నేను పరిష్కరించినదే) దొరికింది.


కళ్యాణకటకం నెలవీటిలో ఉన్న కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లదేవ (పెర్మానడి, ప్రతాప చక్రవర్తి, హెమ్మాదిరాయ) బిరుదాంకితుడు 2వ జగదేకమల్ల పాలనాకాలంలో, అతని సామంతుడు, మహామండలేశ్వరుడు, వీరమాహేశ్వరుడు, కందూరిపురవరాధీశుడు, కందూరు-1100లనాడు పాలకుడు, సూర్యవంశోద్భవ కులతిలక కాశ్యపగోత్ర, కరికాలాన్వయ కందూరి ఉదయనచోడ మహారాజులు యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, మౌనానుస్ఠాన, జప, హోమాది సమస్త సత్కర్మనిరతులైన ఆంగీరస, బార్హస్పత్య, భరద్వాజ గోత్రజులైన తమ పురోహితులు సర్వదేవ సోమయాజులకు శకసం.1080, బహుధాన్య నామ సం. భాద్రపద మాస శుద్ధ పంచాదశి(పౌర్ణిమ),ఆదివారం, చందగ్రహణసమయంలో అంటే క్రీ.శ.1158 సెప్టెంబరు 10వ తేదీన బొడవిప్పఱ్ఱును అష్టభోగతేజ స్వామ్యంగా, సర్వనమస్యంగా (సర్వజనులు గౌరవించునట్లు), ఏకభోగంగా (ఒక్కరే అనుభవించే విధంగా) ఇచ్చినట్లు శాసనం పేర్కొంటున్నది. ప్రత్యేకంగా సోమయాజులుగారు తమ సోదరులు కాయనప్పన, ఆదిత్య మంచిగార్లతోగృహ, క్షేత్రాది(ఇల్లు,పొలము మొదలైన) సర్వార్థ (అన్నిరకాల ఆర్థిక) విషయాలలో విభక్తులైన (విడిపోయిన) ఉత్తరకాలాన (తరువాతకాలంలో) ఈ గ్రామాన్ని శాసనంగా పొందినాడని, ఏకభోగంగా స్వీకరించాడని శాసనం చెపుతున్నది.


వావికొల్లు శాసనంలో ప్రస్తావించిన అష్టభోగతేజ స్వామ్యంగా (అష్టభోగాలకు యజమానిగా) అంటే ఇచ్చిన దానాన్ని ‘విక్రయ, దాన, వినిమయ, జల, తరు, పాషాణ, నిధి, నిక్షేపాల’తో ఏకభోగస్వామ్యంగా (ఒక్కరే అనుభవించుటకు) అనుభవించుటకు అనుమతించడం. ఇచ్చిన దానాన్ని దానగ్రహీత ఏ విధంగా శాసనఫలాన్ని పొందవచ్చు ననేది ఈ శాసనపదం తెలియజేస్తున్నది.
శాసనకోశంలో అష్టభోగసంపదలనే మరొక విశేష శాసన పదముంది. అష్టభోగసంపదలంటే అన్నం, వస్త్రం, గంధం, పుష్పం, తాంబూలం, స్త్రీ, శయనం, సంగీతాలనే ఎనిమిది విధాలైన సంపదలను అనుభవయోగ్యం చేయడం.
వావికొల్లు శాసనంలో సోమయాజులు తన సోదరులతో సర్వార్థ విషయాలలో విడిపోయిన తర్వాత ఈ గ్రామాన్ని దానంగా పొందినాడు కనుక తానొక్కడే అనుభవయోగ్యుడని తెలుస్తున్నది.

వావిలికొల్లు శాసనపాఠం:
సూర్య, చంద్రులు
మొదటి వైపు:

 1. స్వస్తి సమస్త భువనా
 2. శ్రయ శ్రీపృథ్వీవల్లభ మ
 3. హారాజాధిరాజ పరమేశ్వ
 4. ర పరమభట్టారక సత్యా
 5. శ్రయకులతిలక చాళు
 6. క్యభరణ శ్రీమత్త్రిభు
 7. వనమల్లదేవ విజయ
 8. రాజ్యముత్తరోత్తరా
 9. భివృద్ధి ప్రవర్ధమాన
 10. మాచంద్రార్కతారకము
 11. గా గల్యణకటకము నె
 12. లవిట సుఖోత్కథా వి
 13. నోదంబున రాజ్యము
 14. చేయంగాం దత్పాదపద్మొ
 15. పజివి సమధిగత పంచ
 16. మహాశబ్ద మహామం
 17. డలేశ్వర విరమాహేశ్వ
 18. ర కోడూరి పురవరాధి
 19. శ్వర సూర్యవంశోద్భవ కు
 20. లతిలక కాశ్యప గోత్త్ర
 21. కరికాలాన్వయ నామా
 22. ది సమస్తప్రశస్తి సహి
 23. తం శ్రీమన్మహామం
 24. డలేశ్వర కందూరి ఉద

రెండవ వైపు

 1. యాదిత్యదేవ చో
 2. డ మహారాజులు త
 3. మ పురోహితు
 4. లైన స్వస్తో యమ
 5. నియమ ప్రాణ
 6. యామ ప్రత్యహా(ర)
 7. ధ్యాన ధారణ మౌనాను
 8. స్ఠాన జపహోమా
 9. ది సమస్త సత్కర్మ
 10. నిరత ఆంగిరస బా
 11. ర్హస్పత్య భారద్వాజ
 12. గోత్రజులైన స
 13. ర్వదేవ సోమ
 14. యాజులకు వా
 15. రు తమ్ములు
 16. ‘కాయనప్పనం’గారి
 17. తొడా ‘నాదిత్య
 18. మంచిం’గారి తొ
 19. డాను గృహక్షేత్రా
 20. ది సర్వార్థ విషయ
 21. ము నందూను వి
 22. భక్తులైన ఉత్తర
 23. కాలాన

మూడో వైపు:

 1. స్వస్తి శక వర్షా
 2. త్‍ 1080 అగు బ
 3. హుధాన్య సంవత్సర
 4. భాద్రపద శుద్ధ పంచా
 5. దశినాదివారాన సో
 6. మగ్రహణకాలాన
 7. కందూరి వేయిన్నూ
 8. ఱూడలోణ పుట్టము
 9. తూర్పున నాడ్లేటి
 10. డెభయింటి
 11. లొనా బొడవిప్ప
 12. ఱ్ఱు (ఇ)ష్ట భోగతేజ
 13. స్వామ్యముగా స
 14. ర్వనమస్యముగా
 15. ధారాపూర్వకమై
 16. ఏకభోగము ఇ
 17. చ్చిరి1..11 స్వదత్తాం ప
 18. రదత్తాంవాయోహ
 19. రేతు వసుంధరాం షష్టి
 20. ర్వర్షో సహస్రాణి విస్ఠా
 21. యాం జాయతే క్క్రిమిః

నాలుగో వైపు:

 1. స్వదత్తాద్విగుణం పు
 2. ణ్యం పరదత్తాను పా
 3. లనం1 పరదత్తా
 4. పహారేణ స్వదత్తం
 5. నిష్ఫలం భవేత్‍
 6. సామాన్యోయం ధర్మ
 7. సేతు నృపాణాం
 8. కాలేకాలే పాలని
 9. యో భవద్భిః సర్వా
 10. నేతాన్భావినః పార్థి
 11. వేంద్రాన్భూయో భూ
 12. యో యాచతే రా
 13. మచంద్రః

ఈ శాసనస్తంభం వావికొల్లు గ్రామం ఆనుకుని పారే చారగొండవాగు పక్కనున్న పొలాలలో లభించింది. కవి, మిత్రుడు తగుళ్ళ గోపాల్‍ స్నేహితుడు వావికొల్లు నుంచి పంపిన శాసనం ఫోటోగ్రఫీ ఆధారంగా ఈ రచన. శాసనం గుర్తించి నాకు పంపిన వారికి ధన్యవాదాలు.

 • శ్రీరామోజు హరగోపాల్‍,
  ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *