భూమి, ఆకాశం, గాలి, నీరు,అగ్ని ఈ ఐదు పంచభూతాలు. పంచభూతాల సమ్మిళితమే ప్రకృతి లేదా పర్యావరణము. పంచభూతాల మయమైన ప్రకృతి వలనే ప్రాణికోటి ఆవిర్భవించింది. భవిష్యత్తులో కూడా ప్రాణికోటి మనుగడ కొనసాగవలెనన్న పంచభూతాలను అనగా పర్యావరణమును పరిరక్షించుకోవడం ఎంతైనా అవసరము.
ఈ పంచభూతాలు ఏవిధముగా కలుషిత మౌతున్నవి, వాటిని ఏవిధముగా పరిరక్షించుకోవాలి అన్న విషయం మీద ఆలోచన చేద్దాము
1) గాలి: గాలి లేనిదే మనం మరియు ప్రాణి కోటి ఒక నిమిషమైన బ్రతుకలేదు. అందుచేత గాలిని కలుషితం కాకుండ కాపాడు కొనవలయును. దుమ్ము ధూళి, ఫ్యాక్టరీల నుండి వెడలే విషవాయువులు, వాహనములలో నుండి వెడలే బొగ్గు పులుసు వాయువు మరియు కట్టెలు కాల్చిన పొగ వలన గాలి కల్మష మౌతున్నది. దానిచే గాలిలో ఆమ్లజని శాతము తగ్గి ప్రాణుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.
అందుచేత భూములను పడవా పెట్టకుండా పైరు పంటలతో కప్పి ఉంచాలి. కట్టెలను కాల్చవద్దు. పెట్రోలు మరియు డిజిల్ వాహనాలను తగ్గించి విద్యుత్తు వాహనాలను వాడవలయును. ఫ్యాక్టరీలనుండి విషవాయువులు వెలువడకుండ చేయవలయును. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను తగ్గించి సోలార్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పుకోవాలి.
చెట్లు కార్బన్ డై ఆక్సడ్‍ను గ్రహించి ఆమ్లజనిని విడుదల చేయును కనుక చెట్లను బాగా పెంచవలయును. ప్రతి ఇంటికి కనీసము ఒక చెట్టైనను (వేపచెట్టు), కొన్ని చెట్ల పాదులను, కూరగాయల మొక్కలను, పూలచెట్లను పెంచవలయును. అపుడు కుటుంబంకు సరిపడు ఆమ్లజని మన ఇంటి వద్దే ఉత్పత్తి అగును. ఊరంతా నందన వనమగును.
2) నీరు: నీరు లేకుండా ఒక వారము రోజులకు మించి మనము బ్రతుక లేము. మరియు ప్రాణికోటి కూడా మనుగడ సాగించలేదు. ప్రాణికోటికి కావలయు ఆహారము వండుటకై కూడా నీరు ఎంతేని అవసరము.అందుచే నీటిని కలుషితం కాకుండ కాపాడు కొనుటయేగాక వేసవి కాలంకు కూడా సరిపోవు నీటిని భద్రపరచు కోవాలి. మనము మన ఇంటిలో వాడు నీటిని సబ్బులు వాడటం వలన కల్మష పరుచుచున్నాము. అందుచే సబ్బులను సాధ్యమైనంత వరకు వాడకూడదు. సబ్బులు వాడని నీటిని మనం ఇంట్లో చెట్లు చేమలు పెంచుటకు వాడి నీటిని పొదుపు చేయవచ్చును. ఫ్యాక్టరీలు వదిలిన రసాయన వ్యర్ధాలు వాగులలో నదులలో కలుయుట వలన నీరు కలుషితమవుతుంది.
రసాయనిక వ్యర్ధాలు వాగులలో కలువకుండ చర్య తీసుకోవాలి. వానాకాలం కురిసిన భారీ వర్షాల నీటిని ఇంట్లో ఇంకుడు గుంతల ద్వారా, చేనులో కందకాల ద్వారా భూమిలో ఇంకించు కొన్నచో భూగర్భ జలాలమట్టం పెరిగి, వేసవి కాలంలో మనము బావుల ద్వారా పొంది నీటి అవసరాలను తీర్చుకొన వచ్చును. వానలే నీటికి ఆధారము కావున వానలను కురిపించుకొనే ప్రయత్నం చేయాలి. చెట్ల భాష్ఫీ కరణము వలన మేఘాలు ఆకర్షించ బడి వానలు కురియును.కావున మనము చెట్లను బాగా పెంచ వలయను. వానలు బాగా కురియ వలెనన్న కనీసము భూమి మీద కనీసము 35 శాతము చెట్లు అడవులు ఉండవలయును. కాబట్టి చెట్లను పెంచడం ద్వారానే మన మనుగడను కాపాడుకోగలము.
3) అగ్ని: అగ్ని అంటే ఒక నిప్పే గాక ఊష్ణము వెలుగు మరియు శక్తికి ఆధారములు. సూర్యుడు ఉష్ణశక్తికి మూలాధారము. సూర్యుని ఊష్ణశక్తి వలన వానలు కురియు చున్నవి. పంటలు పండుచున్నవి. సూర్యుడు లేకున్న అసలు ప్రాణికోటి పుట్టుకే అసంభవము. భూమి సూర్యుని నుండి జీవకోటి బ్రతుకుటకు కావలసిన సమ ఉష్ణోగ్రత దూరములో ఉన్నది. కావున జీవకోటి ఈ గ్రహముపై పుట్టి బ్రతుకు చున్నది. అందుచే సూర్యశక్తిని సద్వినియోగం చేసుకోవాలి. వాతావరణం కలుషితం చేసే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను తీసివేసి సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే పర్యావరణం కల్మషం కాదు.
4) భూమి: భూమి మీదనే సమస్త జీవకోటి బ్రతుకు చున్నది. భూమి మీదనే నీరు, సూర్యశక్తి, మరియు గాలి వలన పంటలు పండుచున్నవి. భూమి చుట్టూ ప్రాణికోటి మనుగడకు కీలకమైన వాతావరణం నెలకొంది. కావున భూమి కల్మషములబారి నుంచి కాపాడు కొన వలయును. భూమి లోపలి పొరల్లో గల సూక్ష్మజీవుల వలన పంటలు పండుచున్నవి కావున ఆ సూక్ష్మజీవులు నశించకుండ చూచుకోవలయును. అంటే విచక్షణారహితంగా రసాయనిక ఎరువులను, పురుగుల మందులను వాడకూడదు. సేంద్రియ ఎరువులను మాత్రమే వాడవలయును. భూమిపై కురిసిన వాననీటిని మొత్తము భూమి పొరలలోనే ఇంకించ వలయును. అపుడే భూమిలోగల సూక్ష్మజీవులు నశించకుండ అభివ•ద్ధి చెంది భూమిని సారవంతము చేసి అధిక పంటలు పండగలవు. అంతేకాకుండా భూమి పొరల్లోనికి ఏ రసాయనిక పదార్థాలు చొరబడకుండ చూచుకొన వలయును. అపుడే భూమిని రక్షించు కోగలము.
5) ఆకాశము: మన భూమి చుట్టూ ఆవరించి ఉన్న ప్రదేశమే ఆకాశము. ఈ ప్రదేశంలో గాలి ఆవరించి ఉన్నది. ఈ ఆకాశములోనే సూర్యుని ఊష్ణ శక్తి వలన మేఘాలు ఏర్పడి భూమిపై వానలు కురియు చున్నవి. భూమికి ఎత్తులో ఓజోను పొరయుండి సూర్యుని యొక్క అతి నీలలోహిత కిరణాల నుండి మనలను కాపాడుచున్నది. ఈ ఓజోన్ పొర పెట్రోలియం వాహనాల నుండి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ వలన దెబ్బ తింటుంది. అందువలన అతివ్రష్టి మరియు అనావ•ష్టి ఏర్పడి వరదలు మరియు కరువు కాటకాలతో మనము బాధ పడవలసి యుండును. అందుచే మనం పెట్రోలియం వాహనాలను వాడటం ఆపి, విద్యుత్ వాహనాలను వాడవలయును. ధర్మల్ విద్యుత్ కేంద్రాలను ఆపి వేసి సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి.
పైన చెప్పి నట్లుగా పంచభూతాలను (ప్రక•తిని) పర్యావరణంను పరిరక్షించుకోవడం ఎంతైనా అవసరము. అప్పుడే మనము మన మనుగడను కాపాడు కోగలము. అందుచేత ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడవలెను.
- సంగెం చంద్రమౌళి
విశ్రాంత చీఫ్ ఇంజనీర్, నీటిపారుదల శాఖ