(గత సంచిక తరువాయి)
సాంఘిక స్థితిగతులు
కాకతీయుల కాలంలో సాంఘిక వ్యవస్థ ప్రాచీన భారతీయ రాజనీతి విధానాన్నే అనుసరించినారు. రాజ్యవిస్తరణలో భాగంగా వివాహాది సంబంధాలకు కుల ప్రాతిపదికను రాజులు స్వీకరించలేదనే చెప్పవచ్చు. సంఘంలో అన్ని కులాలవారు వారి వారి కులసంబంధ వృత్తులను చేసుకునేవారని శాసనాల ద్వారా తెలుస్తుంది. రాజ్య వ్యవస్థలో బాహత్తర నియోగాధిపతులు ఉండేవారు అందులో అన్ని కులాల వారికి భాగస్వామ్యం ఉండేది. కరణం, పెద్ద కాపు, తలారి, పురోహితుడు, కమ్మరి, కంసాలి, వండ్రంగి, కుమ్మరి, చాకలి, మంగలి, చర్మకారుడు ఇట్లా ఆయా కులాలవారు వృత్తులను చేసేవారు. దేశ సంరక్షణలో కూడా అన్ని శాఖల్లో ఆయా వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉందని తెలుస్తుంది.
ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు వారికి సంబం ధించిన అన్ని అవసరాలను చూసుకునే బాధ్యత రాజుదే. అటువంటి శాసనం ఒకటి మనం రేచర్ల రెడ్డివంశానికి చెందిన నామిరెడ్డి పిల్లలమర్రి శాసనం. శక సంవత్సరం 1124 = క్రీ.శ. 1202 దుందుభి చైత్ర శుద్ధ ఏకాదశి రోజు రేచర్ల నామిరెడ్డి తన పేరుమీద పిల్లలమద్రిలో నామేశ్వర శివ లింగాన్ని ప్రతిష్ఠించి దేవుని అంగరంగ భోగాలకు, ధూపదీప నైవేద్యాలకు భూమిని దానమిచ్చి వేయించిన శాసనం ఇది.
శాసనకాలం పేర్కొనబడని మరొక శాసనం నామిరెడ్డి వేయించినది నామేశ్వరాలయ గోడపై 17 పంక్తుల్లో ఉంది. బహుశః ఇది ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత వేయించి ఉండవచ్చు. ఇందులో దేవాలయంలో ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసేవారికి, అందులో సేవలు అందించేవారికి ఇచ్చిన దానం గురించి ఉంది.
ఈ శాసనంలో శ్రీ నామేశ్వర స్థానాపతికి, రంగంవారికి పిల్లలమర్రి కోటలో ధారా పూర్వకంగా ఇండ్లు కట్టించి ఇచ్చిన విషయం తెలుస్తుంది. అందులో ప్రధాన పూజారి అయిన గంగజియ్య, ఆవుజం (సంగీత వాయిద్యం) వాయించే ముప్పోజుకు, మద్దెల వాయించే మల్లోజు, దామ దామన, బ్రహ్మలకు, పాత్ర (నృత్యం చేసేవారు) సీతమ, అన్యమ, పార్వతి, ముత్తమలకు, వాసెకార (మురళి వాయించే వాడు) పోతనకు, మోకరి (శంఖం ఊదేవారు) దామకు, పాడి (పాటలు పాడేవారు) త్రిపురమ, జక్కమ, బ్రమ్మక, మారకలకు, పడిహారి (ప్రతిహారి) విమలెకు, పూజారులు రామజియ్యకు, ప్రోలజియ్య, కొమ్మజియ్యలకు ఇండ్లు నిర్మించినట్లుంది.
సమాజంలో స్త్రీలకు విశేష గౌరవం ఇవ్వబడింది. రాణులే కాకుండా సామాన్య స్త్రీలు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు, కళాకారులు గౌరవింపబడినారు.
గోన వంశంలో జన్మించిన కుప్పాంబిక మల్యాల వంశంలో బలవంతుడైన గుండదండాధీశుని పెండ్లి చేసుకున్నది. గుండయ మరణానంతరం ఇతని భార్య అయిన కుప్పసానమ్మ (కుప్పాంబిక) క్రీ.శ. 1276లో బూదపురంలో ఒక శాసనం వేయించింది.
కుప్పాంబిక గోన వంశోద్భవగా చెప్పుకున్నాం. బూదపురంలో తన భర్తకు పుణ్యలోక ప్రాప్తి కొరకు అతని పేరుమీద ఆలయాన్ని నిర్మించి గుండేశ్వరస్వామిని లింగప్రతిష్ఠ చేసి అనేక దానధర్మాలు చేసి శాసనం వేయించింది. కుప్పాంబిక కట్టించిన ఈ క్షేత్రం అతుల్యమైనదిగా, అధిక ఫలాన్నిచ్చేదిగా చెప్పబడింది. కుప్పాంబిక తన కొడుకులు బాచయ బొప్పండు, గణపతిదేవుండు, పర్వతము మల్లయ, తమ్ముడు గోన బుద్ధయ, గోన విఠయ కుమారుడు గుండయలతో కలిసి గుండేశ్వర దేవునికి బాస సముద్రంలో రెండు మర్తుర్లు, కుప్ప సముద్రంలో 1 మర్తురు, గణప సముద్రంలో 1/2 మర్తురు, బుధుని కుంటలో ఒకటిన్నర మర్తురు మొత్తం 5 మర్తుర్లు నీరు నేల, బూదపురంలో 12 మర్తుర్ల వెలిపొలం, పోతుల మడుగులో 9 మర్తుర్లు మొత్తం 21 మర్తుర్లు ఆచంద్రార్కంగా దానం ఇచ్చింది. ఈ దానాన్ని స్వీకరించి చీలజియ్యల కొడుకు వైజజియ్యల తన తరతరాల వరకు దేవుని పాదోపజీవులై ఉండాలని, శాసన సంరక్షణార్థం శబ్ద విశారద కవీశ్వరుడైన ఈశ్వర భట్టోపాధ్యాయులు శాసన రచయితగా చెప్పబడినాడు.
శాసనంలో కుప్పాంబికకు గురించి చాలా గొప్పగా వర్ణించబడింది. సకల గుణగణాలంకృత, పతివ్రత. కల్పంలో చెప్పిన ప్రకారంగా లక్ష్మీనారాయణ, జలశయన, అశూన్యశయ్య, అనంత, అరుంధతీయ, ద్వాదశీ వంటి అనేక వ్రతాలను ఆచరించిన వనితగా కీర్తించబడింది.
ఇంకా కుప్పసానమ్మ అనేక నూతులు త్రవ్వించింది, పశువులకు నీటి కుంటల వంటి అనేక నీటి వసతులు కల్పించి భూతదయను ప్రదర్శించింది. అనేక శివాలయాలను నిర్మించింది, తోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, విష్ణు విగ్రహాలను, శివలింగాలను ప్రతిష్టించింది. ఇటువంటి సత్కార్యాలు అనేకం చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందింది.
ఇంకా శాసనంలో కుప్పసానమ్మ చేసిన మంచి పనులను గురించి వర్ణన ఉంది. ఈమె అనేక భూ, గో, సువర్ణ (బంగారం) దానాలు, రథములు, గుఱ్ఱములు, ఎల్లప్పుడూ అన్నదానం, నీరు,గృహదానం చేసినట్లు చెప్పబడింది. ఆయా కన్యలకు అన్నివిధాల శ్రేష్టులైన వరులను వెతికి పతిదానం (వివాహాలు జరిపించింది),
ఇంకా ఆమె కీర్తిని వర్ణిస్తూ ‘‘ప్రశాంతమైన పాల తరంగ కాంతులను జయించిన ఆమె కీర్తి అన్ని దిక్కులకు వ్యాపించిందట. క్షీరసముద్రగర్భంలో ఉండే గొప్ప అవకాశం ఒక్క పురుషోత్తముడికే కాదట. కుందమాంబ కీర్తికాంతుల వల్ల జగత్తులో ఉన్న సమస్త జనులందరూ క్షీరసాగరంలోనే ఉన్నట్లు సాధారణమయ్యిందట. బాల భారతి కల్పనా చాతుర్యం మనకు ఇక్కడ కనబడుతుంది.
ఆమె కుందపురంలో త్రవ్వించిన కుంద సముద్రం(పెద్ద చెరువు) ఏవిధంగా ఉందంటే : క్షీరసాగరమథనంలో సముద్రం నుండి పుట్టిన చంద్రుడు క్షయం పొందుతాడు (శుక్ల, కృష్ణపక్షాలు), ఇంకా కళంకం ఉన్నవాడు. కానీ ఈ కుంద సముద్రంలో పుట్టిన కీర్తిచంద్రునికి ఆ రెండు దోషాలు లేవు. కాబట్టి సముద్రం కంటే ఈ తటాకమే శ్రేష్టంగా ఉందని, తటాకం అంత విశేషమైందని చెప్పబడింది.
మత ధార్మిక స్థితిగతులు
కాకతీయులు అంటే సాధారణంగా వీరశైవ మతావలంబకులని, వారు అనేక శివాలయాలు నిర్మించి విరాళంగా దాన ధర్మాలు నిర్వర్తించారని చెప్పుకుంటాం. అయితే కాకతీయుల జన్మస్థలం, వారి వంశం కాకతి అనే జైన దేవత మూలంగా వచ్చిందనే వాదం కూడా మనం వింటుంటాం. ఏది ఏమైనా కాకతీయుల శైవమతాన్ని వృద్ధి పరిచినప్పటికీ జైన, వైష్ణవ మతాలను నిరాదరించలేదు. వారికి తగిన వసతులు, ఆలయాలు నిర్మించి అన్ని మతాల వారి ఆశీస్సులు అందుకున్నారు. మత ఘర్షణలు జరిగి పూర్వపు ఆలయాలను పడగొట్టి శైవాలయాలు నిర్మించినట్లు కొందరు చెప్తున్నారు. కానీ శాసనాల్లో ఆ విధమైన ప్రస్తావనలు మనకు కనిపించటం లేదు.
వీరి కాలంలో వేయించబడిన బూరుగుగడ్డ శాసనం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది కాకతి రుద్రమదేవి కాలం నాటిది శ.సం. 1190 = క్రీ.శ.1268.
ఈ శాసనము వేయించినవాడు దేవకీపుత్రదాసుడు. ఇతడు రుద్రమదేవి ప్రధాని అయిన సత్రం బొల్లరాజు సోదరుడు. ఇతడు బూరుగుగడ్డ గ్రామం మధ్యలో ప్రజలందరికీ హితం చేకూర్చేవిధంగా శ్రీదేవీ, భూదేవి సమేత చెన్న గోపినాథుని ప్రతిష్ఠ చేసి అంగరంగ భోగాలకు వృత్తులను సమర్పించి శాసనం వేయించినాడు. ప్రోలసముద్రం పడమటి దిక్కున కూచినేని కాలువలో కార్తిక, వైశాఖాల్లో పండించే రెండు పంటలకు గాను పది మర్తుర్ల భూమిని సమర్పించినాడు. అదేవిధంగా మహాప్రధాని సత్రము బొల్లరాజు తమ తల్లి పేరుమీద మంద్రాజు చెరువు ముందు మావపురాన్ని కట్టించి చెన్న గోపీనాథ దేవునికి ఆచంద్రార్కముగా సమర్పించెను. ఈ సమర్పణ రుద్రమదేవికి పుణ్యంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఊరికి నాలుగు దిక్కుల సరిహద్దులు కూడా చెప్పబడినవి.
ఇదే శాసనంలో గోకర్ణదేవ వల్లభరాజు కొడుకు రుద్రదేవుడు గోపీనాథ దేవుని అంగరంగ భోగాలకు కార్తిక, వైశాఖమాసాలకు సంబంధించిన పంటలకు నీరు నేలను సర్వమాన్యముగా ధారపోసినట్లు ఉంది. గోపీనాథ మూర్తిని చేసిన కసె గోపాలదాసరి, కసె కరుణాకర దాసరి అనే ఇద్దరికి రెండు మర్తుర్లు, రెండు పుట్లు; మద్దెల వాయించేవారు ముగ్గురికి మూడు మర్తుర్లు, మూడు పుట్లు; ఆవజకానికి ఒక మర్తురు, ఒక పుట్టి; నీరు ఎత్తి పోసేవారికి ఒక మర్తురు, పుట్టి; కరడకము( జేగంట) వాయించేవాడికి ఒక మర్తురు, పుట్టి; ముఖరి వాయించే ఇద్దరికి రెండు మర్తుర్లు, 2 పుట్లు; పాత్రలు (నృత్యం చేసేవారు) ఇద్దరికి రెండు మర్తుర్లు, రెండు పుట్లు; సిహళితలు (పాటలు పాడేవారు) ఎనిమిది మందికి ఎనిమిది అడ్డలు, ఎనిమిది పందుములు (పందుము = 10 తూములు); జేగంటలవారు ఏడుగురికి ఏడు పాదికలు, (పాదిక = పణంలో 4 వంతు), ఏడు పందుములు; గొడుగులు పట్టేవారు నలుగురికి నాలుగు పాదికలు, 4 పందుములు; సింహనాదముల వారు ఇద్దరికి రెండు పాదికలు, రెండు పందుములు; శంఖం ఊదేవారు ఇద్దరికి రెండు పాదికలు, రెండు పందుములు; తోటపని చేసేవారు ఇద్దరికి 3/4 అడ్డ, 3/4 ముప్పందుము; ఎర్ర కలువల మడుగు చూసేవారికి; బానిసలు ఇద్దరికి (సేవకులు) రెండు పాదికలు, రెండు పందుములు; పశువులు కాసేవారు పదిమందికి పది పాదికలు, పది ఎందుములు; తలారి (దేవాలయ అంగరక్షకుడు) ముయడ్డ (3/4), ముప్పందుము; ఆగమ శాస్త్రజ్ఞులు తొమ్మిదిమందికి 9 అడ్డలు, 9 పందుములు; దేవాలయంలో ఉండే భండారి (భాండాగారం నిర్వహించేవాడు)కి ఒక మర్తురు, ఒక పుట్టి; అధికారి శ్రీ రామదాసికి ముయ్యడ్డ (3/4), పుట్టెడు వెలిపొలం ఇచ్చి ఆలయ నిర్వహణ బాధ్యతలను ఆయా వ్యక్తులకు అప్పగించినారు.
ఈ శాసనంలో రెండు మూడు అంశాలను మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. 1. ఈ శాసనం కాకతీయ చక్రవర్తి అయిన రుద్రమదేవి కాలంలో వేయించినట్టిది. కాకతీయులు రుద్రమ కాలం నాటికే వీరశైవ మతావలంబకులుగా, ఆ మతాన్ని ప్రోత్సహించినట్లుగా మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ ఈ శాసనం వల్ల రుద్రమ కాలంలోనే రామానుజ స్వామి వారి వైష్ణవమతం బాగా వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. శాసన ప్రారంభం కూడా రామానుజులను స్తుతిస్తూనే ప్రారంభమైంది. 2. కాకతీయుల కాలం నాటి నీటిపారుదల అభివృద్ధి, చెరువులను త్రవ్వించడం, తద్వారా పంటపొలాల పరిరక్షణ వంటివి ఈ శాసనంద్వారా తెలుస్తుంది. ఎన్నో రకాల చెరువుల కింద ఉన్న భూమిని దేవాలయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులకు దానం చేసినట్లు ఈ శాసనంలో మనం గమనించవచ్చు.
కాకతీయులు, వారి సామంతులు, మాండలికులు ఇతర అధికార, అనధికార గణం అనేక ఆలయాలను, తటాకాలను నిర్మించి దేవునికి నిత్య నైవేద్యానికి, అఖండ దీపానికి స్వామివారి రంగభోగానికి భూములను, వస్తువలను, ధనాన్ని సమర్పించి శాసనాలు వేయించినారు. వీరి కాలంలో నిర్మించబడిన ఆలయాల్లో హనుమకొండ వేయిస్తంభాల గుడి, వరంగల్ కోటలోని ఆలయాలు, కాసాపురం, త్రిపురాంతకం, పిల్లలమర్రి, పాలంపేట రామప్ప దేవాలయం, ఘనపురం ఆలయాలు, పానగల్లు, వర్ధమానపురం, నాగులపాడు, బూరుగుగడ్డ, ఇనుగుర్తి, ధర్మసాగరం, గణపవరం, కొండపాక, బూదపురం, ఉప్పరపల్లి, మేళ్ళచెరువు తదితర ప్రాంతాల్లో అనేక ఆలయాలు నిర్మించబడినాయి. ఆయా ఆలయాల పోషణ వాటికి సంబంధించిన నిర్వహణ స్థానిక ఆలయ అధికారులు నిర్వహించేవారు.
(తరువాయి వచ్చే సంచికలో)