మనిషి ప్రకృతికి నిలువెత్తు ఆశ. దుర్భలశత్రువు అని అంటారు. ప్రకృతిని పరిరక్షించగలడు. పాడు చేయగలడు. ఒక విధ్వంసమే సృష్టించగలడు. ఇప్పటికీ అది జరిగిపోయింది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని నిలువరించటం ఎంతయినా అవసరం. నిలుపుదల దగ్గరే ఆగిపోకుండా వీలయినంతగా మేలు కలిగించే చర్యలు చేపట్టాలి. సమాజాలు అభివృద్ధి చెందటానికి పరిశ్రమలు అవసరం. పరిశ్రమల వెంట వచ్చే కాలుష్యం తప్పనిసరి. నిజానికి పరిశ్రమలు, కాలుష్యం రెండూ కవల పిల్లల్లాంటివి. ఇవి రెండూ కలిసి పెరుగుతాయి. పరిశ్రమలను దుష్టమైనవి అని లనలేం. అవి సృష్టించి ఇచ్చిన కాలుష్యాన్ని కానుకగా స్వీకరించలేం. ఈ కాలుష్యాలు పలు రకాలుగా మానవ సమాజాలను బాధిస్తుంటాయి.
మనిషి భూమి మీదకు వచ్చిన నాటి నుండే ఆవరణ వ్యవస్థలు కలుషితం కావటం మొదలైందని చెపుతారు. అయితే పర్యావరణాన్ని కాపాడటం, పర్యావరణ నిర్వహణ అన్నవి ఆధునిక కాలంలోనే చర్చకు వచ్చాయి. నేటి సమాజానికి ప్రకృతితో పని చాలా విస్త•తమైనటువంటిది. ప్రకృతితో ముడివడకుండా ఏదీ లేదు. ఆ ముడివడిన బంధాన్ని బాధ్యతగా స్వీకరించకుండా భారంగా భావించి ప్రకృతిపై మరింత భారాన్ని మోపుతూ ఉన్న తీరును ఎప్పటికప్పుడు జాగరూకులమై పరిశీలించుకోకపోతే, తగు చర్యలు చేపట్టకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.
మానవాళి మొత్తాన్ని ఏదో ఒక మేరకు ప్రభావితం చేస్తున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, జనాభావిస్ఫోటనం, దారిద్య్రం, పేదరికం, వనులు అతివినయోగం, సంప్రదాయ ఇంధన వనరులు తగ్గిపోవటం, నూతన ఇంధన వనరుల కొరకు పరిశోధనలు, ముడిసరుకు కొరకు అన్వేషించే శోధనలు తగ్గిపోవటం మొదలైనవి అన్నీ కలవరపెట్టే అంశాలుగానే మిగలటం లేదు. అవి పర్యావరణ సంక్షోభాలను మరింతగా తీవ్రతరం చేస్తున్నాయి. పర్యావరణం సంక్షోభ, విధ్వంసాలో ప్రపంచ వ్యాప్తంగానే తీవ్రమయ్యాయి.
నిజానికి ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలో జీవించటం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఇది అందరికీ సరిసమానంగానే వర్తిస్తుంది. అయితే పేదరికంతో, దారిద్య్రంతో బాధితమవుతున్న దేశాలు వాటిని నిర్మూలించుకునేందుకు అభివృద్ధి క్రమాన్ని వేగవంతం చేసుకోవలసిన పరిస్థితులలోనే ఉంటాయి. అభివృద్ధి చెందటం ద్వారానే పేదరికాన్ని తొలించుకోవటం సాధ్యపడుతుంది. అభివృద్ధిని ఆశించకుండా పేదరికం తొలగింపునో, నిర్మూలననో కోరుకోలేం. అభివృద్ధిని కోరుతూ ఉన్నట్లయితే, అది వెంట తెచ్చే సకల కాలుష్య కారకాలను ఆమోదించక తప్పదు. వాటిలో బాధితులం కాక తప్పదు. ఇదొక సంకటస్థితి. పర్యావరణానికి హాని కలిగిస్తూ ప్రస్తుత తరాన్నే కాకుండా, రాబోయే తరాలకు మనం ఇవ్వబోయే అభివృద్ధి ఏమిటనేది కూడా ఆలోచించాలి. దీనిలోంచే సుస్థిర అభివృద్ధి అనే భావన ఉద్భవించింది. ప్రస్తుత మానవుల అవసరాలను తీర్చడంలో ఎక్కడా రాజీపడకుండా రాబోయే తరాల అవసరాలను కూడా గుర్తెరిగి ప్రవర్తిస్తూ వనరులను వినియోగంలోకి తెచ్చుకోగలటంలోనే సుస్థిరత అభివృద్ధి అనే మాటలకు సార్థకత చేకూరుతుంది. 1970లలోనే పర్యావరణం, అభివృద్ధి అనే విషయంగా కొకొయోక్ డిక్లరేషన్లఓ తొలిసారిగా సుస్థిరాభివృద్ధి అనే పదం వాడబడింది. అంతర్జాతీయ సంస్థలు పర్యావరణానికి విధేయంగా ఉంటూ లాభదాయక అభివృద్ధి లేదా ఫలప్రద అభివృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉండటం అవసరమే కాదు. అని వార్యత కూడా. పర్యావరణ హితమూ, అభివృద్ధి దాయకమూ అయిన మార్గంలోనే సుస్థిరత దాగి వుంది. ఆర్థిక స్థిరత్వం పర్యావరణ స్థిరత్వం కలిగినదే సుస్థిరాభివృద్ధి.
సుస్థిరాభివృద్ధి అనేది ఒక విధానం. అదే సమయంలో అదొక వ్యూహం. ఆర్థిక, సామాజిక పురోగతి అనే క్రమంలో పర్యావరణాఇనకి, సహజ వనురులకు ఎక్కడా ఏ చిన్న మెత్తు విఘాతం ఏర్పడకుండా నిరంతరం సాగవలసిన, వృద్ధి చెందుతూ పోవలసిన ఒక పరిక్రమం. ప్రస్తుతాభివృద్ధికి కావలసిన వనరులను వినియోగిస్తూనే ఆగామి కాల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని సాధించే అభివృద్ధి ఉభయులకూ లాభకరంగానే కాదు, క్షేమదాయకంగా ఉండేదే సుస్థిరాభివృద్ధి అవుతుంది. అయితే చాలా సార్లు ప్రస్తుతమే ప్రధానమైపోయి, భవిష్యత్తును విస్మరించడం జరుగుతూ ఉంటుంది. మనం, మన వర్తమానం బాగుంటే చాలనుకోకూడదు. మన ప్రస్తుతం అనేది ఎంత సమృద్ధితోనో, పుష్కలత్వంతోనో ప్రకాశిస్తున్నా ఈ వెలుగంతా రేపటికి అంధకారంగా మారకూడనిదై ఉండాలి. కనుకనే అభివృద్ధి వాదానికి, పర్యావరణ హితానికి మధ్య ఎప్పుడు ఒక ఘర్షణ, విబేదం లేదా కొన్నిసార్లు వైషమ్యం కూడా తలెత్తుతూ ఉంటుంది.
భవిష్యత్ తరాల వారికోసం నేను లేదా మనమెందుకు ఆలోచించాలి అనే ప్రశ్న తలెత్తుంది. ఇది మానవాళి ధర్మం, విధి, బాధ్యత కూడా. ఒక కుటుంబంలో ముందు తరాలవారు కూడా సుఖంగా, క్షేమంగా, సమృద్ధంగా జీవించాలని ఎట్లా కోరుకుంటున్నామో, మానవాళి మొత్తంగానే ఒక విశాలమైన కుటుంబం అని భావించే పెద్ద మనసు మనకుండటం అవసరం. దీనికి గొప్ప త్యాగాలు కూడా చేయ పనిలేదు. వ్యక్తిగత స్వార్థ సాధనలో కొంత సడలింపు, ఉదారత చాలు. ఐక్యరాజ్యసమితి 1967లో జరిపిన మాల్తీస్ ప్రతిపాదనలు ఏమి సూచిస్తున్నాయంటే భవిష్యత్ తరాల మేలుకోసం ప్రస్తుత తరం సహజ వనరుల వినియోగంలో అతిశయం, ఆడంబరం లేకుండా, వాటిని ప్రదర్శించకుండా ఉంటే చాలు. ఇవ్వాళి మనకు అందుబాటులో ఉన్న వనరులకు, నేటికి మనం సృష్టికర్తలం కాము. కనుక వాటికి శాశ్వత యజమానులమూ కాకూడదు. వనరుల లభ్యత ప్రకృతి్ప సాదించింది. కాకపోతే మానవ మేధశాస్త్ర సాంకేతిక ప్రగతిని సాధించడం ద్వారా కేవలం వనరుల మీదనే కాకుండా ఆసాంతం ప్రకృతిపైనేనిర్నిరోధక ఆధిపత్యాన్ని ప్రకటించగలిగింది. ఆధిక్యత చాటగలిగింది. ఈ వనరుల వినయోగంలో తగినంత వివేచన కలిగి ఉండటం ముఖ్యమైంది. ఆ వివేచన ఏమంటే ఈ వనరులపై మనకే కాదు రాబోయే తరాలకు కూడా హక్కులున్నాయని గుర్తించటం, గుర్తింపుతో సరిపెట్టకుండా అంగీకరించటంతోనే పని అయిపోయిందని భావించకుండా ఆచరణలో పెట్టడం.
1972లో ఐక్యరాజ్యసమితి మానవ పర్యావరణంపై జరిపిన శిఖరాగ్ర సదస్సులో ‘స్టాక్‍హోమ్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్‍మెంట్’లో సుస్థిరాభివృద్ధి అనే భావనకు ఒకింత ప్రేరణ, ప్రోత్సాహం దొరికింది. దాని నుంచి పొందాల్సిన అవగాహన, చైతన్యాలను మనం పొందే ఉన్నాం. 1972 నుంచి 1987లో వచ్చిన మాంట్రిమేల్ ప్రొటోకాల్ (ఓజోన్ ఒప్పందం), 1992లో రిమోడిజనరియోలో జరిగిన ‘ధరిత్రి సదస్సు’లు మనకు చాలా అంశాల పట్ల సరైన ఆలోచనకు దృక్పథాన్నిచ్చాయి. జీవవైవిద్యం వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్‍హౌస్ వాయువుల దుష్పరిణామాలు వీటి పట్ల కూడా కావలసనింతా ఆలోచన, అవగాహనలే ఆచరణ దాకా రాలేదు. దేశాలు, దేశాధినేతలు, ప్రభుత్వాలు వారు చేయాల్సింది చేస్తారు. బాధితమవుతున్న మనుషులుగా మనం చేయాల్సిందేమిటి? పర్యావరణాన్ని కబళించి, ఆపై మానవాళిని అంతం చేసే అభివృద్ధా? ఆలోచనాపరులైన మానవులు ఎప్పుడూ అవసరమైన అనివార్యమైన సమయాల్లో సరైన నిర్ణయాలే తీసుకుంటారు. మరి మీ నిర్ణయమేంటి? అస్థిరాభివృద్ధా? సుస్థిరాభివృద్ధా!!
- డా।। ఆర్. సీతారామారావు
ఎ : 9866563519