తెలంగాణ గిరిజనుల సంప్రదాయ వాద్యాలు-వైవిధ్యం

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తెగలుగా గుర్తించబడిన 35 తెగలు తమ సంస్క•తిలో భాగంగా జరుపుకునే పండుగలు, దేవతల కొలుపులు, పెళ్లిళ్లు, చావు పుట్టుకలు, వినోదాలు వంటి సందర్భాల్లో సంగీత వాద్యాలను ఉపయోగిస్తారు. వీరు ఆయా సందర్భాన్ని బట్టి ప్రత్యేకమైన వాద్యాలను వాయించుకుంటూ తమ సాంస్క•తిక జీవనాన్ని గడుపుతున్నారు. అనాదిగా వాద్యం వారి జీవితంలో భాగమై ఆయా గిరిజనుల విభిన్న సాంస్క•తిక వైవిధ్యాన్ని తెలియజేస్తున్నవి. ఆంధప్రదేశ్‍లో కనిపించే భగత, వాల్మీకి, కొండదొర, నూకదొర, కమ్మర, గదబ, గౌడ, కొటియా, సవర, ఖోంధ్‍, హిల్‍ రెడ్డి, పోర్జ, మన్నె దొర, జాతాపు మొదలైన గిరిజన తెగలు డోలు, డప్పు, తుడుం, కిద్ది వంటి వాద్యాలనే ఉపయోగించటమే కనిపిస్తుంది. సహజంగా వీరు ఉపయోగించే వాద్యాలు మిగతా తెగలు కూడా ఉపయోగిస్తాయి. ఆయా తెగలకంటూ ప్రత్యేకమైన వాద్యాలు కనిపించవు.


ఉద్దేశ్యం:
తెలంగాణా ప్రాంతంలో కనిపించే, గోండు, తోటి, పర్దాన్‍, కోలాం, అంధ్‍, చెంచు, నాయకపోడు, కొండరెడ్డితో పాటుగా మైదాన ప్రాంత గిరిజనులైన బంజారా, ఎరుకల, నక్కల వంటి తెగలు ఉపయోగించే వాద్యాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో కోయ గిరిజనుల ఉపతెగలైన డోలి, పట్టెడ మరియు బంజారా ఉపతెగలైన ధాడి, భాట్స్ మరియు డప్పుడియా వారు ఉపయోగించే వాద్యాలు ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఇందులో డోలి ఉపతెగ వారు ఉపయోగించే వాద్యం కారణంగానే వారికి ఆ పేరు స్థిరపడింది. ఈ రకంగా ఆ వాద్యం వారి సంస్క•తిలో ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో తెలుస్తుంది. అదేవిధంగా తమ దేవతలకు ప్రతిరూపాలుగా కొలిచే వాద్యాలు, ప్రత్యేక సందర్భాల్లోనే వాయించే వాద్యాలు, ప్రక•తి సహజసిద్ధమైన వాద్యాలు,తెగ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే వాద్యాలు మరియు వాద్యాల తయారీలో ఉపయోగించే ప్రత్యేకమైన వస్తువులు, విశ్వాసాలకు సంబంధించి 71 రకాల వాద్యాలు తెలంగాణ గిరిజనులు ఉపయోగిస్తున్నారు. అయితే గిరిజనులు ఉపయోగించే వాద్యాలు కాలానుగుణంగా వస్తున్న మార్పులకు లోనయ్యి పరిణామం చెందుతున్నవి. వీటన్నింటిని తెలియజేస్తూ గిరిజనుల వాద్యాల సంస్క•తి వైవిధ్యాన్ని వైశిష్యాన్ని పరిచయం చేయాలని ఉద్దేశంతో రాయడం జరిగింది.


తెలంగాణ గిరిజనులు ఉపయోగించే వాద్యాలు


అంధ్‍ గిరిజనులు:
ఏక్తారా, డోలక్‍, డప్పుడి, తార్‍, మంజీరా, డోల్కి జాన్జర్‍, డోలు .
చెంచు గిరిజనులు:
తప్పెట, 12 మెట్ల కిన్నెర, జేగంట, డప్పు
కోయ గిరిజనులు:
కొమ్ముడోలు, తూతు కొమ్ము, అందెలు, అక్కుమ్‍, గజ్జెల పట్టా, సన్నాయి, మేళం, మువ్వలు.
కోయ ఉపతెగలు:
డోలికోయ – డోలి
పట్టెడ కోయ – రావణాస్త్త్రం
గోండు గిరిజనులు:
గుమేల, తుడుం, టపాల్‍ డోలు, జోడు కోలలు, వెట్టె, పర్ర, డప్పు.
తోటి గిరిజనులు:
కికిరి ,కుజ్జా డక్కి, డోలు, కాలికోమ్‍, సన్నాయి, బొంగా టిప్లింగ్‍ /చిటికెలు, తమ్మెడ బాజా, తోటి బుర్ర, 12 మెట్ల కిన్నెర, తుడుం మద్దెల, తాళాలు, గజ్జెలు, హార్మోనియం.
కొండ రెడ్డి గిరిజనులు
గిల్ల కాయలు/ దామర గుత్తులు, ఔజం, డోలు.
పర్ధాన్‍ గిరిజనులు:
సుర్నేయి, డోలు, బొంగా, కీకిరి డప్పుడి, వెట్టే పర్ర, కాలీకోమ్‍, తుడుం, డప్పు.
కోలాం గిరిజనులు:
డోలు, డప్పు, పిల్లన గోయి, తుడుం, డుల్కి, గుమేల.
నాయకపోడు గిరిజనులు:
తప్పెట, పిల్లనగోయి, మూగడోలు, అందెలు, డప్పు.
బంజారా గిరిజనులు:
నంగారా, ఇత్తడి పల్లెం, డప్పు, కచోడో, తాళాలు, చిరతలు.


బంజారా గిరిజనుల ఉపతెగలు:
భాట్స్: రబాబ్‍, జంనగ/ జంగ్‍, చిరతలు, తాళాలు, నగారా.
ధాడి: సారంగి
డప్పుడియా: డప్పు
ఎరుకల గిరిజనులు: సోది కిన్నెర, ఏక్తారా.
నక్కల గిరిజనులు:
డేంచుక, కసాలి వంటి వాద్యాలు ఉపయోగిస్తారు.


తెలంగాణ ప్రాంతానికి చత్తీస్గడ్‍ నుండి వలస వచ్చి ఏటూర్‍ నాగారం పరిసర ప్రాంతాల్లో స్థిరపడిన గుత్తి కోయ గిరిజనులు డోలు కొయ్య గుజ్జిడి అనే ప్రత్యేకమైన వాద్యాలను ఉపయోగిస్తారు. అయా గిరిజన తెగలు ఉపయోగించే కొన్ని వాద్యాలు ఒకే రకంగా కనిపించినప్పటికీ వాటిలో కొద్దిపాటి బేధ సాద•శ్యాలు కనిపిస్తాయి.


గిరిజన తెగలన్నింటిలో డప్పు వాద్యం సర్వసాధారణంగా కనిపిస్తుంది.


ఆదిలాబాద్‍ పరిసర ప్రాంతాల్లోని గిరిజనులు ఉపయోగించే డప్పులు ఆకారంలో చిన్నగా, పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉండే డప్పులు ఆకర్షనీయంగా ఉండటమే గాక ఉత్సాహాన్ని కలిగించే శ్రావ్యమైన ధ్వనిని స•ష్టిస్తాయి. డప్పులను తయారు చేసుకోవడానికి కావలసిన పట్టీ కోసం కుక్కెలికి కర్ర లేదా ఆరెకర్ర లేదా టేకు కర్రను ఉపయోగిస్తారు. ఈ పట్టీకి చర్మాన్ని ముడుచుకోవడానికి దారుగు చెక్క, మొర్రి పండు బంకను బాగా ఉడికించి జిగురు తయారు చేసుకుంటారు. ఆ జిగురును పట్టీ అంచుకు రాస్తూ, చర్మాన్ని ముడుచుకోవడం జరుగుతుంది.ఇక ఆదిలాబాద్‍ ప్రాంతానికే చెందిన తోటి మరియు పర్ధాన్‍ తెగ ఉపయోగించే కీకిరి వాద్యాన్ని తంత్రీలు మరియు చర్మంతో కలిసి తయారు చేసుకుంటారు. ఈ కీకిరి వాద్యంతో కళాకారులు గోండు సంస్క•తికి చెందిన అన్నోరాని, సదర్బీడి వంటి కథలను కథాగానం చేస్తారు. ఈ వాద్యం మణిపూర్‍ లోని పేనా, ఒరిస్సాలోని కెన్రా బాణం, రాజస్థాన్‍లో రావణ హట్టా, కేరళలోని వీణాకుంజ్‍ వంటి వాద్యాల పోలిక ఉంటుంది. దీనిని పర్ధాన్‍ మరియు తోటి గిరిజనులు మహంకాళి శక్తి నాలుకకు ప్రతిరూపంగా, హీరాబాయికి ప్రతిరూపంగా కొలుస్తారు. ఇక వాద్యాన్ని వాయించడానికి ఉపయోగపడే కుజ్జాను జల్లిదేవరకు ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ కుజ్జాను బర్రె కొమ్ముతో విల్లు మాదిరిగా తయారు చేసుకుని దానికి గుర్రపు వెంట్రుకలను మందంగా విల్లుకు దారం కట్టినట్లుగా కడతారు. ఈ విల్లుకే చిన్న గజ్జెలు మరియు పెద్ద గజ్జెలు అల్లుకుంటారు. పెద్ద గజ్జెల్లో వాయించే కళాకారుడు తోటి మరియు పర్ధాన్‍ తెగలో ఏ సగకు చెందిన వారైతే ఉదాహరణకు ఆ కళాకారుడు నాలుగో సగాకు చెందినవాడైతే నాలుగు పెద్ద గజ్జెలు అల్లుకుంటాడు.ఇది వారి అస్తిత్వానికి ప్రతీకగా కట్టుకుంటారు.ఈ రకంగా వాద్యాలను తాము కొలిచే దేవతల ప్రతిరూపంగా కూడా కొలుస్తూ కనిపించడం విశేషం.


ప్రత్యేక సందర్భాల్లో వాయించే వాద్యాలు:
గిరిజనులు ఉపయోగించే కొన్ని వాద్యాలను కేవలం పండుగలు, దేవతల కొలుపుల సందర్భాల్లోనే బయటకు తీసి పవిత్రంగా వాయిస్తారు. ఇటువంటి వాద్యాల్లో గోండు గిరిజనులు ఉపయోగించే గుమేల, పర్ర, వెట్టె వంటి చర్మ వాద్యాలు వారి సంస్క•తిలో అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఇందులో గోండు వారిలోని నాలుగో సగా వారు ‘గుమేల’ వాద్యాన్ని దండారి దేవతకు ప్రతిరూపంగా కొలుస్తారు. అట్లాగే పర్ర వాద్యాన్ని ఐదు వేల్పుల వారు తమ దేవతకు ప్రతిరూపంగా పూజించడం విశేషం. అదేవిధంగా వెట్టె వాద్యాన్ని ఏత్మాసూర్‍ దేవతకు పతిరూపంగా కొలువడం కనిపిస్తుంది. ఈ రకంగా వాద్యాలను తమ దేవతలకు చిహ్నంగా చూస్తూ, కొలిచే విధానం గోండు సంస్క•తిలో దర్శనమిస్తుంది. ఈ వాద్యాలను గోండు వారు దండారి పండుగ సందర్భంగా బయటకు తీసి గుస్సాడీలో భాగంగా నిష్టతో వాయిస్తారు. మిగతా రోజుల్లో బయటకు తీయడం గానీ, బయటి వ్యక్తులకు చూపించడం కానీ చేయరు. ఇందులో పర్ర వాద్యం మద్దెల మాదిరిగాను, వెట్టే వాద్యం కంజర ఆకారంలో వెడల్పుగా చర్మంతో ముడవబడి ఉంటుంది. పర్ర వాద్యానికి సహ వాద్యమైన వెట్టె వాద్యం మీద 18 రకాల దరువులు వాయిస్తారు. దీనికి అనుగుణంగా పర్రను వాయించడం జరుగుతుంది. వెట్టె, పర్ర వాద్యాలను జోడువాద్యాలని పిలుస్తారు. గుస్సాడీలో ఈ రెండు వాద్యాల సంగీతానికే టప్పాల్‍, కొండల్‍ ధరించిన వారికి దేవుడు పూనకం వస్తుంది. వీటి వాయింపుతో పాటుగా గుమేల, డప్పులు ఉపయోగిస్తారు. వెట్టె వాద్యానికి చర్మాన్ని ముడుచుకునేప్పుడు తప్పనిసరిగా స్త్రీ బహిష్టు ఉన్న రోజుల్లోనే ఆ వెట్టె ను తాకిస్తారు. తద్వారా అది పవిత్రమవుతుందని విశ్వసిస్తారు. ఇంకా గిరిజన తెగల్లో జంతువు పేరుతో పిలవబడే నక్కల తెగ ప్రత్యేకమైనది. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నక్కల వారు తమ మూల సంస్క•తిని అనుసరించి సంప్రదాయ వేట, చిరు వ్యాపారాలు చేసుకుంటూ, సంచారం చేస్తారు. వీరిని పిట్టలోళ్ళు అని కూడా పిలుస్తారు. నక్కల వారు తమ వంశదేవతలను భద్రపరుచుకునే స్వామి మూటతోపాటుగా పవిత్రంగా భద్రపరచుకునే వాద్యాలు డేంచుక, కసాలి వాద్యాలు. వీరు వంశాల వారీగా సామూహికంగా దేవతలను దసరా లేదా శివరాత్రికి కొలుస్తారు.ఈ సందర్భంలోనే స్వామి మూటలోని విగ్రహాలను తీసి పండుగ చేస్తారు. ఇదే సందర్భంలో వాద్యాలను బయటకు తీసి పవిత్రంగా వాయిస్తారు. గిరిజన తెగలు ఉపయోగించే వాద్యాల్లోనే డేంచుక వాద్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది తంత్రీ వాద్యం. బైండ్ల కళాకారులు ఉపయోగించే జెముడిక మాదిరిగా కనిపించినప్పటికీ, తయారీలోనూ వాయించడంలోనూ భిన్నంగా ఉంటుంది. ఇది సుమారుగా మూరెడున్నర పొడవు వ•త్తాకారం నుండి జానెడు వెడల్పు ఉంటుంది. దీని తయారీకి మొగిలి చెట్టు మొద్దు బోధగద్దనరం, మేక చర్మం, పాచి తీగ, గజ్జెలు మరియు ఇనుప రింగులు ఉపయోగించి తయారు చేస్తారు. దీన్ని వాయిస్తుంటే నాలుగైదు మైళ్లు శ్రావ్యమైన శబ్దం వినిపిస్తుంది. ఇక కసాలి వాద్యాలు, ఇవి తాళాల మాదిరిగా ఉండి కంచుతో తయారు చేయబడినవి. వీటిని కూడా పండుగ సందర్భంలోనే బయటకు తీసి వాయిస్తారు. అదేవిధంగా నాయక పోడు గిరిజనుల ఇలవేల్పు లక్ష్మీదేవర. లక్ష్మీ దేవర ఆలయాలు నాయకపోడు గిరిజనులు ఉండే గూడెంలో ఉంటాయి. ఆ గుడి దగ్గర లక్ష్మీదేవర ప్రతిమను నిలుపుకొని పూజిస్తారు. అక్కడ గిరిజనులు అత్యంత పవిత్రంగా భావించే మూగడోలును భద్ర పరుస్తారు. ఇది సుమారుగా రెండు మీటర్ల పొడుగుతో ఇద్దరు కళాకారులు రెండు వైపులా వాయించేందుకు వీలుగా ఉంటుంది. కేవలం లక్ష్మీ దేవర కొలుపులోనే దీన్ని ఒక గుంజకు తగిలించి ఇద్దరు వ్యక్తులు చెరో వైపు ఉండి వాయిస్తారు. ఈ వాద్యాన్ని నాయక పోడు గిరిజనులు తమ దేవుడైన మూగలరాయునికి ప్రతిరూపంగా, పవిత్రంగా కొలుస్తారు.


అంధ్‍ గిరిజనులు ఆదిలాబాద్‍ ప్రాంతంలో అంధ్‍ లకే మరాఠీ భాషలో కండోభ కథను చోండ్కా, మంజీరా, డప్పులు, డోలక్‍, తాళాలు వంటి వాద్యాలను ఉపయోగించి కథాగానం చేస్తారు. వీరు ప్రదర్శనలో ఉపయోగించే చోండ్కావాద్యాన్ని చర్మం మరియు తంత్రీతో కలిపి ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు.


చర్మవాద్యాలలో తెలంగాణా ప్రాంత గిరిజనులు ఉపయోగించే డోళ్లు ప్రత్యేకమైనవి. కోలాం, గోండు, తోటి, పర్ధాన్‍ ఈ నాలుగు తెగలవారు ఒకే రకమైన డోలును పెండ్లి మరియు వివిధ సాంస్క•తిక కార్యక్రమాల్లో వాయిస్తారు. ఈ డోలు సహాయంతో పెళ్లిలో జరిగే ప్రతీ తంతుకు ఒక్కొక్క రకంగా పదహారు రకాల దరువులను వాయించడం విశేషం. డోలు సంగీతాన్ని బట్టి పెళ్లిలో ఏ తంతు జరుగుతుందో గుర్తుపడతారు. డోలు తయారీలో ఎక్కువ రోజులు మన్నిక గలిగే సండ్రేగి కర్రను ఉపయోగిస్తారు. ఈ కర్రను కూడా అడవి నుండి అమావాస్య రోజున తెచ్చుకుంటే కర్ర చెదలు పట్టకుండా ఉంటుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా డోలు తయారీలోనే ఆయా తెగలు ఏ సగాకు చెందినవారో ఉదాహరణకి నాలుగో సగా వారైతే నాలుగు గీతాలను ఆ డోలు మీద గీయించుకుంటారు. ఇది వారి సాంస్క•తిక అస్తిత్వానికి చిహ్నంగా భావిస్తారు.


ఆదిలాబాద్‍ ప్రాంతంలోని గిరిజనులు ఉపయోగించే చర్మవాద్యాలలోనే ప్రత్యేకమైనది తుడుం వాద్యం. దీనిని గోండు, పర్ధాన్‍, తోటి, కోలాం తెగవారు ఉపయోగిస్తారు. వీరంతా తుడుం వాద్యాన్ని అత్యంత పవిత్రంగా చూసుకుంటారు..’ ఇది సుమారుగా రెండు జానళ్ల వెడల్పు, జానెడున్నర ఎత్తుతో ఉంటుంది. ఓజా అనే ప్రత్యేకమైన జాతితో తయారు చేయించుకుంటారు. దీన్ని తయారు చేయించుకున్నందుకు ప్రతిఫలాన్ని డబ్బులతో వెలు కట్టలేరు. నాలుగు కాళ్ల జంతువుల్లో ఆవు దూడను గానీ మేక పిల్లగానీ దానంగా ఇస్తారు. ఓజాలు కూడా 360 మేకులను గోండు జాతి దేవుళ్లకు ప్రతిరూపంగా తుడుం నిర్మాణంలోనే కొట్టి,పవిత్రంగా తయారు చేసి ఇస్తారు. అందుకే తుడుం ను ఆయా తెగలు అత్యంత పవిత్రంగా చూసుకోవడం జరుగుతుంది. దీనికి మందంగా ఉండే ఎద్దు లేదా మెకం లేదా దుప్పి చర్మాన్ని ముడుచుకుంటారు. దీనిని వీరి ఆటపాటల్లో దేవతల కొలుపుల్లో, పెళ్లిళ్లు, ఊరేగింపులు, దేవతల కొలుపులు వంటి సాంస్క•తిక కార్యక్రమాల్లో ప్రధానంగా వాయిస్తారు.


ఉమ్మడి ఆదిలాబాద్‍, ఉమ్మడి కరీంనగర్‍ జిల్లా ప్రాంతంలోని బంజారాలు న•త్యం చేసే సందర్భంలో వాయించే నగారా వాద్యం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వాద్యం ఆకర్షణీయమైన ధ్వనిని పలికిస్తూ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. బంజారాల ఉప తెగలు ధాడీ మరియు భాట్స్ కళాకారులు వాయించే సారంగి, రబాబ్‍ అనే తంత్రీవాద్యాలు చాలా పురాతనమైనవి. ఈ వాద్యాలను ఉపయోగిస్తూ బంజారులకు కథాగానం చేస్తారు. వీరు ఉత్తర భారతం నుండి వచ్చిన వారు కావటంతో ఆ ప్రాంతంలో ఉపయోగించే వాద్యాలకు వీరు వాయించే వాద్యాలకు సాద•శ్యం కనిపిస్తుంది. సారంగి, రబాబ్‍ వీరికి ఏ రకంగా సంక్రమించాయో వాటికి చెందిన మౌఖిక కథలు కూడా వినిపిస్తాయి. ఈ వాద్యాల మీద తమ పూర్వీకులను మరియు దాతల పేర్లు రాగి రేకుల మీద రాయించుకొని వేయించుకుంటారు. బంజారులు వారి ఉపతెగలు డప్పులు, తాళాలు, చిరుతలు, మద్దెల, నగారా, రబాబ్‍, సారంగి వాద్యాలన్నింటిని వారి సంస్క•తిలో భాగంగా ఉపయోగిస్తున్నప్పటికి వీరి రబాబ్‍, సారంగి వాద్యాలను అత్యంత పవిత్రంగా, సరస్వతీ దేవికి ప్రతిరూపంగా చూసుకుంటారు.
గిరిజనులు వాద్యాలకు మేక, ఆవు, మేకం, ఉడుము వంటి జంతువుల చర్మాన్ని ఉపయోగించి ముడుసుకుంటారు. చర్మ వాద్యాలైన డోలక్‍, డోలు, మద్దెల, డుమ్కి, తమ్మెడ బాజ, మూగడోలు, కొమ్ము డోలు మొదలైన వాద్యాలకు చర్మాన్ని ముడుసుకున్న తర్వాత డోలు రెండు వైపులా ఒకే రకమైన శబ్దం రాకుండా ఉండేందుకు ఒక పక్కన ఒగ్గం దీనినే ఒంగం లేదా కందెన, ఓం, బోనం అని కూడా అంటారు. దీన్ని డోలుకు ఒక ప్రక్కన పెట్టుకుంటారు. దీని వల్ల డోలును వాయించినపుడు ‘గుమ్‍ గుమ్‍’ అని శబ్దం చేస్తుంది. ఈ రకంగా డోలులో రెండు వేరు వేరు ధ్వనులను పలికించే విధంగా తయారు చేసుకుంటారు. ఈ చర్మవాద్యాలలోనే అతి పలుచని చర్మం పొరను ఉపయోగించి కూడా వాద్యాలను ముడుసుకుంటారు. తోటి మరియు పర్దాన్లు ఉపయోగించే కీకిరి, డక్కీ వంటి వాద్యాలకు పలుచని మేక లేదా ఆవు పర్రను ఉపయోగించి ముడుసుకుంటారు. ఇక గోండు గిరిజనులు వాడే గుమేలకు ప్రత్యేకంగా ఉడుము చర్మాన్ని ముడుసుకోవడం విశేషం. ప్రతి వాద్యానికి కింది భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది . ఇక్కడి నుండే శబ్దం బయటికి వస్తుందని, ఆ భాగాన్ని జీవర అని పిలుస్తారు. అక్కడ వాద్యానికి ప్రాణం ఉంటుందని, బొట్టు పెట్టి పూజిస్తారు గిరిజనులు.


అదేవిధంగా అతి ప్రాచీనమైన పన్నెండుమెట్ల కిన్నెర, తోటి బుర్ర, ఏక్తార మొదలైన తంత్రీవాద్యాల్లో చేదు ఆనపకాయ బుర్రను, ఆడవెదురు బొంగును మాత్రమే ఉపయోగించి తయారు చేసుకుంటారు. ఈరకమైన వస్తువులను వాద్యం తయారీలో ఉపయోగిస్తేనే తాము చెప్పబోయే కథకు, శ•తికి వాద్యం అనుకువుగా శ్రావ్యమైన సంగీతాన్ని పలికిస్తుందంటారు కళాకారులు. తోటి గిరిజన కళాకారులు పన్నెండు మెట్ల కిన్నెరను వాయిస్తూ జంగులింగు కథ, ఎల్లమ్మకథ, క•ష్ణలీల, మహాభారతం కథలను చెప్పడంతో పాటుగా తోటి బుర్రను ఉపయోగించి కూడా పాండవుల కథలను గానం చేస్తారు. వీరు తోటి బుర్రను భీముని ‘గద’ గా భావించుకొని పూజచేస్తారు. కొందరు బుర్రకు నెమలీకలు అలంకరించుకుంటే లక్ష్మీచేకూరుతుందని విశ్వసిస్తారు. ఈ రకంగా వాద్యాల మీద ఇటువంటి విశ్వాసాలు విరివిగా కనిపిస్తాయి.


ప్రక•తి సహజసిద్ధమైన వాద్యాలు:
ఆదిమ జాతులు మొదట సహజంగా ప్రక•తిలో లభించే అరుదైన వస్తువులనే సంగీత వాద్యాలుగా ఉపయోగించుకున్నారు. నేటికీ ఆదివాసీలు అదే సంస్క•తిని అనుసరిస్తున్నారు. మీరు ప్రక•తిలో ధ్వనికి హేతువైన కాయలు, గింజలు, వెదురు కర్రలు వంటివి కూడా వాద్యాలుగా ఉపయోగించుకోవడం కనిపిస్తుంది.అందుకే గిల్లకాయలను కూడా సంగీత వాద్యంగా తయారు చేసుకునే నైపుణ్యం కూడా కొండ రెడ్డి గిరిజనుల్లో కనిపిస్తుంది. ఇంకా వీరి తెగకే చెందిన ప్రత్యేకమైన వాద్యం ‘ఔజం’. దీని సంగీతం విశిష్టమైనది. దీని శబ్దం నాలుగైదు మైళ్ళ దూరం వినిపిస్తుందంటే అతిశయోక్తికాదు. ఇది వీరి తెగకు అస్తిత్వపు ప్రతీకగా భావిస్తారు. అట్లాగే తోటి గిరిజనులు గోండులకు కథ చెప్పే సందర్భంలో గరిట మాదిరిగా ఉండే రెండు కర్రలతో శబ్దం చేస్తూ వాయించే వాటిని చిటికలు లేదా టిప్లింగ్‍ అంటారు. వీటి శబ్దం సహజ సిద్ధంగా, శ్రావ్యంగా ఉంటుంది. అదేవిధంగా గోండు గిరిజనులు గుస్సాడీ సందర్భంలో గుమేల వాద్యంతో పాటుగా వాయించే టపాల్‍ వాద్యం కూడా కర్రతో చేయబడి ఉంటుంది. దీని శబ్దం కూడా సహజ సిద్ధంగా శ్రావ్యంగా ఉంటుంది. ఇవే కాకుండా కోలాం గిరిజనులు మరియు నాయకపోడు గిరిజనులు ప్రక•తిలో సహజంగా లభించే ఆడ వెదురు బొంగును పొడవైన పిల్లనగోయిగా తయారు చేసుకుని సంగీతాన్ని పలికించడం గిరిజనులకే చెల్లింది.


గిరిజనులు చర్మ తంత్రీ, ప్రక•తి సహజసిద్ధమైన వాద్యాలతో పాటుగా లోహం తో తయారు చేయబడిన సంగీత పరికరాలను కూడా ఉపయోగిస్తారు.
ఇందులో భాగంగా కోయ గిరిజనులు తూతుకొమ్ము, అక్కుం వంటి వాయు సంబంధించిన సంగీత పరికరాలను ఉపయోగిస్తారు. ఇవన్నీ ఒక రకమైన సంగీత వాద్యాలయితే లోహ పాత్రలను ఉపయోగించి కూడా సంగీతాన్ని పుట్టిస్తారు. ఇందులో ప్రధానంగా గుజ్జిడి, గజ్జెలు, అందెలు, మంజీరాలు ముఖ్యమైనవి. ఇవే కాకుండా బంజారాలు తాళాలు మాత్రమే ఉపయోగించకుండా ‘కొచోడో’ అనే కంచు పాత్రను కూడా వాద్యంగా ఉపయోగిస్తారు. అంతే కాక ఈ పాత్రను నంగారా వాద్యంలో చేర్చి తయారు చేసుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ‘ఇట్లా గిరిజన వాద్యాలలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఇక కోయ గిరిజనుల ఉపతెగ పట్టెడ కళాకారులు ఉపయోగించే పట్టెడ వాద్యం కూడా కనుమరుగైంది. దీనితో వారి మౌఖిక సాహిత్యం అంతరించింది. అంతే కాక బంజారాల ఉపతెగ ధాడి కళాకారులు సారంగి అనే వాద్యాన్ని ఉపయోగించి బంజారాలకు కథలు చెప్తారు. నేడు ఆ వాద్యంతో పాటు వారి సంస్క•తి కాలగర్భంలో కలిసిపోతున్నది.


ముగింపు :
ఆధునికంగా మారుతున్న కాలంతోపాటు గిరిజన వాద్యాలు అంతరించిపోయే దశకు చేరుతున్నవి. గిరిజన సంస్క•తికి ప్రతీకగా నిలిచే ఎన్నో ప్రత్యేకమైన వాద్యాలను వాయించే కళాకారులు కనుమరుగవుతున్నారు. ఇదంతా ఒక్క. రోజులో ఒక్క సంవత్సరంలో జరుగుతున్నది కాదు. క్రమంగా ఆయా తెగల్లో వస్తున్న సాంఘిక, సాంస్క•తిక మార్పుల కారణంగా క్రమంగా జరుగుతూ వస్తున్నది. గిరిజన వాద్యాలు కొన్నైతే ఆయా తెగలు అస్తిత్వానికి సాంస్క•తిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఉదాహరణకు గోండు గిరిజనుల ఉపతెగ అయిన తోటి వారు ఉపయోగించే కీకిరి వారి సంస్క•తిలో భాగమైనది. వారికి ఆ వాద్యం,ఆయా తెగ దేవత హీరాబాయికి ప్రతిరూపంగా, పవిత్రంగా కొలుస్తారు. ఇక కొండరెడ్డి వారికి ప్రత్యేకంగా ఉండే ఔజం వాద్యం వారి అస్తిత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ రకంగా ఆయా తెగలకు కొన్ని ప్రత్యేక వాద్యాలు ఉన్నవి. ఇది వారి సంస్క•తీ గొప్పదనం. ఆయా వాద్యాలకు ప్రత్యేకమైన గుర్తింపు, చరిత్ర మౌఖిక సాహిత్యం ఉంటుంది. అయితే ఇప్పటికే అరుదైన వాద్యాలు తుడుం, కీకిరి, గుమేల, ఔజం, కిద్దీ, డప్పులు మూగడోళ్లు, రబాబ్‍, సారంగి వంటి వాద్యాలు ప్రస్తుతం కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి. ఆయా వాద్యాలను వాయించే కళాకారులు కూడా వ•ద్ధ వయసులోనే ఉన్నారు. కళ అనేది యువతలో వారసత్వంగా సంక్రమిస్తే ఆ కళ పదికాలాలపాటు నిలుస్తుంది. అట్లా కాకుండా కళ వ•ద్దుల చేతుల్లోనే ఉంటే వారి కళానైపుణ్యం ఆ కళ వారితోనే అంతరించిపోతుంది. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి గిరిజన వాద్యాలు వాయించే కళాకారుల్లో కనిపిస్తున్నది. పూర్వం కళాకారులు కొన్ని వాద్యాల మీద అనేక దరువులను అనేక రకాలుగా పలికించేవారు. ప్రస్తుతం ఆ దరువులను వాయించే కళాకారులు కనుమరుగవుతున్నారు. ఇక వాద్యాలను తాము స్వయంగా తయారు చేసుకొనే సంస్క•తి కూడా కళాకారుల్లో కనుమరుగవుతున్నది. తద్వారా ఆయా వాద్యాల్లో నైపుణ్యం తగ్గి ఆ వాద్యాలు చేసే మధురమైన ధ్వని కూడా క్షీణించిపోతున్నది.


పూర్వం వాద్యం తయారీలో చర్మాన్ని ప్రధానంగా ఉపయోగించేవారు. కానీ ప్రస్థుతం దాని స్థానంలో ప్లాస్టిక్‍ వచ్చి చేరింది. డోలు వంటి తయారీలో కర్రను ఉపయోగించే సంస్క•తి ఉండేది కానే దాని స్థానంలో కీ కేసిన్‍ పైపును వాడుతున్నారు. ఈ కేసిన్‍ పైప్‍కే చర్మాన్ని ముడుసుకుంటున్నారు. ఇక కీకిరి వంటి వాద్యంలో గుర్రపు వెంట్రుకలు ఉపయోగించే స్థానంలో ప్లాస్టిక్‍ వైరును ఉపయోగిస్తున్నారు. అలాగే భాట్స్ కళాకారులు ఉపయోగించే రబాబ్‍ వాద్యానికి తీగలుగా ఒకప్పుడు మేక పేగులను ఉపయోగించేవారు. ప్రస్తుతం కొందరు కళాకారులు వాటి స్థానంలో ప్లాస్టిక్‍ తీగలను కట్టుకుంటున్నారు. వాద్యాల తయారీలో చర్మం, కర్ర ఉపయోగించి తయారు చేసుకోకుండా ప్లాస్టిక్‍, ఇనుము వంటి వస్తువులను ఆధునికంగా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల వాద్యం యొక్క మూల శబ్దం ఏదైతే ఉంటుందో అది కనుమరుగవుతున్నది. వీటన్నిటిని ద•ష్టిలో పెట్టుకొని గిరిజనుల మూల సంస్క•తి ప్రతిబింబించే వాద్యాలన్నింటిని సేకరించి భద్రపరచాల్సిన అవశ్యకత ఉన్నది. తద్వారా వారి సంస్క•తి పరిరక్షింపబడుతుంది.

విషయ దాతలు:
  1. అర్క రాములు, వయస్సు -70, కోలాం తెగ- కామాయపేట గ్రామం, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్‍ జిల్లా.
  2. సోయం భీమ్రావు, వయసు- 73- పర్పధాన్‍ తెగ- పర్థాన్‍ గూడ- ఇంద్రవెల్లి మండలం -ఆదిలాబాద్‍ జిల్లా.
  3. కొమ్రం లింగు-వయసు -70, గోండు -చుంచు ఘాట్‍ గ్రామం -ఆదిలాబాద్‍ మండలం, జిల్లా.
  4. వెడ్మా శంకర్‍-వయస్సు 45, తోటి- ఎదులాపాడు -తిర్యాణి మండలం -ఆసిఫాబాద్‍ జిల్లా.
  5. శెవికే మారుతి -వయస్సు 45-అంధ్‍, లోకారి-బి, గాదిగూడ మండలం – ఆదిలాబాద్‍ జిల్లా
  6. భట్టు కిషన్‍- వయస్సు 65 -ఏబి తండా- నెక్కొండ మండలం- వరంగల్‍ జిల్లా
  7. కొయ్యల సమ్మయ్య- వయస్సు 50 -నాయక పోడు- రొయ్యూరు మండలం-
  8. కల్ము సోమిడి- వయస్సు 40- గుత్తి కోయ చింతలమోరి -ఏటూరు నాగారం మండలం- ములుగు జిల్లా.
  9. సండ్ర శేఖర్‍ -వయస్సు 45- డోలికోయ- తుపాకులగూడెం గ్రామం-ఏటూర్‍ నాగారం మండలం- ములుగు జిల్లా.
  • డా. బాసని సురేష్‍
    ఎ: 9989417299

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *