చాయ్‍ గరం

హైద్రాబాద్‍ ఆత్మ చార్మినార్‍లో కాదు
ఇరానీ చాయ్‍లో దాక్కుని ఉంది.
            - జాన్‍దార్‍ అఫ్సర్‍, ప్రముఖ ఉర్దూ కవి


మీరెపుడైనా ఖడక్‍ చమచ్‍ చాయ్‍ తాగినారా? పోనీ మలయ్‍దార్‍ పౌనా చాయ్‍? అయ్యో అది భీ తాగలేదా మరి ఉత్త ఖడక్‍ చాయ్‍? జాఫ్రానీ చాయ్‍? ఘావా? గులాబీ పత్తా కా చాయ్‍?
అరెరె ఎంత పనయ్యింది? ఇవన్నీ రుచి చూడకుండనే జిందగీ ఖతం అయిపోతే ఎట్ల మరి? ఈ భూమ్మీదికి మళ్లీ మళ్ళీ రాం కదా? ఏదో ఒక రోజు ‘‘రామ్‍ నామ్‍ సత్యహై’’ అని వెళ్లిపోతం కదా!
హైద్రాబాదీయులు సూర్యుడికన్నా, సుప్రభాతం కన్నా ముందే చేతిల చాయ్‍ కోపుతో తొలిపొద్దుకు ఆహ్వానం పలుకుతారు. నిత్యజీవితం అట్లా చాయ్‍తో శురూ అయితది. చాయ్‍ చప్పరించుకుంట ఆనాటి అక్బార్‍ల తాజాకబర్‍లు చదువుతుంటే ఆ మజానే వేరు కదా!
ప్రతిదానికి ఒక చరిత్ర ఉన్నట్లే చాయ్‍కు కూడా ఒక చరిత్ర
ఉంది. మరి ఇక ‘‘చాయ్‍ పే చర్చా’’
శురూచేద్దామా?
పాతనగరంలో మచిలీకమాన్‍ పక్కన షెహరాన్‍ హోటల్‍ గల్లీ పేరు ఇరానీ గల్లీ. వందేళ్ల క్రిందట ఎక్కువ మంది ఇరానీలు అక్కడే నివసించేవారు. అప్పటి ఇరానీలు హైద్రాబాద్‍ నగరవాసులకు ఇచ్చిన ‘‘తోఫా’’నే ఇరానీ చాయ్‍. తొలిదశలో ఇరానీలు తమ ఇళ్లల్లోనే ‘‘చాయ్‍కా పత్తా’’ను నీళ్లలో బాగా మరిగించి పాలు, శక్కరా కలపకుండా లేత తేనె రంగులో వుండే ఆ చిరుచేదు వేడి పానీయాన్ని ఆస్వాదించేవారు. దాని రుచి తర్వాత కాలంలో హైద్రాబాదీలకు పరిచయం అయ్యింది. అటువంటి చాయ్‍ స్థానికుల మనసులను, మంత్రించి గెలుచు కుంటుందని ఆ రోజుల్లో ఎవరూ ఊహించలేదు.
1930 దశకం చివరి రోజుల్లో నగరంలో ‘‘చాయ్‍ఖానా’’లు మొదలయి నాయి. అప్పటికే నగర ప్రజలకు బ్రాహ్మణులు నడిపే ‘‘పూటకూళ్ల సత్రాలే’’ తెలుసుకాని ‘‘చాయ్‍ఖానాలు’’ వారికి కొత్త. హోటల్‍ అన్న పదమే ఇంకా పుట్టలేదు. ముస్లింలందరూ ఆ ‘‘చాయ్‍ఖానాలకు’’ సులభంగానే అలవాటు పడ్డారు కాని హిందువులు అటువైపు కన్నెత్తి చూడలేదు. వారికి మడీ ఆచారం, అంటూ సొంటూ, ఎంగిలి మంగలం పట్టింపులు ఎక్కువ కావున ‘‘సంఘ భయం’’ వలన అటువైపు తొంగి చూడలేదు. నెమ్మది నెమ్మదిగా అట్టడుగు కులాలు, బహుజనులైన శ్రామికప్రజలు ‘‘చాయ్‍’’కు దాసులైనారు. చాయ్‍ త్రాగుతే ఒంట్లో ‘‘ఊష్ణం’’ పెరుగుతుందని హిందువులు భయపడేవారు. బ్రహ్మచారులు తాగవద్దనీ స్వప్నస్కలనాలు జరుగుతాయని భయపెట్టేవారు. బ్రాహ్మణ యువకులు చాయ్‍ తాగినట్లు తెలిస్తే తోటి బ్రాహ్మలు ముందు వారిని వెలివేసి తర్వాత ప్రాయశ్చితంగా నాలుకలపై ఎర్రగా కాల్చిన సూదితో వాతలు పెట్టేవారు. దీనిని ‘‘శుద్ధి’’ అని కూడా అనేవారు. అక్కడక్కడా జిహ్వాచాపల్యంతో పిల్లలు చాయ్‍ తాగితే దేహశుద్ధి కూడా బాగానే జరిగేది.
కాని చాయ్‍ చాలా గమ్మత్తుగా, నాటకీయంగా ప్రజలల్ల పాకిపోయింది. ఘట్కేసర్‍లో ఉండే చాపత్త కంపెనీ వారు చాలా తెలివిగా నగర, గ్రామీణ ప్రజలకు చాయ్‍ అలవాటు చేసేవారు. పెద్ద పెద్ద ఫ్లాస్కులల్ల చిక్కటి పాలతో స్ట్రాంగ్‍ డికాషన్‍ మిలాయించి డబుల్‍ శక్కర వేసి అందమైన కాగితం గ్లాసులల్ల ఇంటింటికి ఉచితంగా చాయ్‍ అందించేవారు. క్రొత్తలో మొగమాటం కొద్దీ, భయం కొద్ది ఎవరూ ఆ గ్లాసులను ముట్టుకునేవారు కాదు. సేల్స్మాన్స్ వాళ్ల ముందే చాయ్‍ చప్పరిస్తూ ఆనందంతో లొట్టలు వేసేవారు. ముందు యువకులు టెంప్ట్ అయ్యేవారు. ఆ తర్వాత ముసలిముతకా, ఆడవారూ పిల్లలు. ప్రతీరోజూ పొద్దుటి పూట ఉచితంగా చాయ్‍ త్రాగటం అలవాటు అయినాక ఒక రోజు గ్రామం మధ్యలో చివిడి దగ్గరనో, చెట్టు క్రిందనో ఛాయ్‍ తయారు చేసుకునే పద్దతిని చూపెట్టి బోధించేవారు. అందరూ దానిని ఆలకించే వారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో వారి ఊహకు తట్టలేదు.
ఒక రోజు శుభ ముహూర్తానా చాయ్‍ రాలేదు. అందరూ ఎదిరి చూసారు రెండో రోజూ మూడో రోజూ రాలేదు. అందరి గుండెలు చాయ్‍ కోసం పీకబట్టినయి. నాలుగోరోజూ ముసలోళ్లందరూ ‘‘ఈ కుక్కల కొడుకులు ఇంకా రాలేదేమిటి’’ అని తిట్లూ, శాపనార్థాల పంచాంగం ప్రారంభిం చారు. ఆడోళ్లకు ఇంటి పనులు ప్రారంభించటానికి కాళ్లూ చేతులు ఆడలేదు. మలబద్దకం వున్నోళ్లకు కడుపుల గరం గరం చాయ్‍ పడకపోతే పైఖానా సాఫ్‍ రాక పోయేది. యువకులు గ్రామ చావిడీ వద్దనో, బస్తీకూడలి వద్దనో చేరి ‘‘చా కంపెనీ వాళ్లు’’ వస్తున్నారేమోనని ఎదురు చూపులు చూస్తూ అంబటాల్ల యాళ్ల వరకు పడిగాపులు కాసారు. కాని క్యా ఫాయిదా? చాయ్‍ నహీఁ ఆయా.


ఒక వారం తర్వాత ఒకడు కొన్ని చాపత్త పొట్లాలు పట్టుకుని బస్తీలకో గ్రామంలకో ప్రవేశించి బుడ్డపైసకో రెండు బుడ్డపైసలకో, దుగ్యానీకో అమ్మటం మొదలు పెట్టేవాడు. ‘‘మజ్బూరీ కా నామ్‍ మహాత్మాగాంధీ’ అన్నట్లు జనమంతా చచ్చినట్లు చాపత్త పొట్లాలు కొనుక్కుని, రెండవ ప్రపంచ యుద్ద కాలంలో శక్కర చాలా పిర్యం కావున బెల్లం గడ్డలు డికాషన్‍లో కరిగించుకుని ‘చా’ తాగటం శురూ చేసారు. అట్లా చాలా జల్దీనే ‘‘ఛా’’ ఒక వ్యవసనంగా మారి పోయింది. 1940 దశకం ముగిసే సరికి ఇంటింటా ‘‘చా’’ సర్వంత్య్రామి ఐపోయింది.
1950 వచ్చేసరికి నగరంలో అనేక ఇరానీ హోటల్స్ వెలిసాయి. ఇటు మదీనా హోటల్‍ అటు అల్ఫా మరియు ప్యారడైజ్‍ హోటల్స్. తర్వాత తామరతంపరగా అనేక హోటల్స్ పుట్టుకొచ్చాయి.
సరే మళ్లీ మనం చాయ్‍ దగ్గరికి పోదామా? అరవై ఏండ్ల క్రిందటి ఒక చాయ్‍ ముచ్చట మీతో పంచుకుంటాను. ‘‘పదేండ్ల పిల్లగాడినైన నేను ప్రతి రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకు తలనిండా ముసుగు కప్పుకుని కనులు మూసుకుని, కమ్మని కలలు కనే మధురమైన సమయంలో ‘‘చాయ్‍ గరం’’ అనే పిలుపు మంద్రస్వరంతో మ్యూజికల్‍గా వినబడేది. అదొక గమ్మత్తు పిలుపు. ఆ పిలుస్తున్న మనిషి చాలా దూరంలో ఉన్నాడు కావున గొంతు చాలా నెమ్మదిగా వేరే లోకాల నుండి ఈ భూలోక వాసులను పిలుస్తున్నట్లుగా ఉండేది. ఆ రోజుల్లో అన్నీ పెంకుటిళ్లే. చుట్టుపట్లా మేడలు, మిద్దెలూ ఏమీ లేవు. పైగా రాత్రి సమయం. ప్రజలు త్వరగా తిని త్వరగా నిద్రపోయే బంగారు రోజులు అవి. ఆ నీరవనిశ్శబ్ద నిశీధి సమయంలో చీమ చిటుక్కుమన్నా, ఒక పుల్లవిరిగినా స్పష్టంగా, వివరంగా వినబడే ఏకాంత, ప్రశాంత సమయంలో, గాలి కూడా సడిచేయని అలౌకిక, చిదానంద సమయంలో ఆ మంద్రస్వరం శ్రోతలను మంత్రముగ్దులను గావించేది. ఆ గొంతు ఒక వృద్దుడిది. అందులో అన్ని రాగాల స్థాయిలు ఉన్నాయి. ‘‘చా’’ అక్షరానికి చాలా సేపు దీర్ఘం తీసేవాడు. ‘‘య్‍’’ అక్షరాన్ని క్రింది స్థాయిలో ఆలాపించి లిప్తకాలం విరామం ఇచ్చి మళ్లీ ‘‘గరం’’ను పంచమ స్వరంలో ముగించేవాడు. దూరాన సన్నగా ప్రారంభమై మా ఇంటి వెనుక ఉన్న ఒక పురాతన తాతల కాలం నాటి వేపచెట్టు క్రిందికి వచ్చేసరికి పడుకున్న నన్ను బుజం తట్టి లేపుతున్నట్లుగానే ఆ పిలుపు ఉండేది. ఆ అదృశ్య వ్యక్తి బహుషా మంత్రగాడు కావచ్చని ఒకసారి, పిల్లలను పిలిచి దరికి చేరగానే అమాంతం మింగేసే బకాసుర రాక్షసుడు కావచ్చని మరోసారి ఊహించుకుని వణికి పోయేవాడిని. ఆ పిలుపు చీకటల్లో జుట్టు విరబోసుకున్న దయ్యం లాంటి వేపచెట్టు క్రింద కాసేపు నిలబడి నా కోసం నిరీక్షిస్తున్నట్లు భావించి ముసుగు ఇంకా గట్టిగా బిగించేవాడిని. తర్వాత ఆ పిలుపు బూలోకపు సరిహద్దులు దాటి ఇతర లోకాలకు వెళ్లిపోతున్నట్లు సన్నసన్నగా దూరదూరంగా వెళ్లిపోయి చాలా సేపటి వరకు నన్ను శూన్యస్థితిలోకి నెట్టివేసేది. తర్వాత నిద్రలోకి వెళ్లిపోయేవాడిని. ప్రతిరోజూ ఈ సంఘటన ఒక రివాజుగా మారింది.


ఒకసారి అనుకోకుండా ‘‘చాయ్‍ గరం’’ దర్శన భాగ్యం నాకు లభించింది.
ఆ రోజు నాకు కొంచెం పులకరం వచ్చింది. ఆ రాత్రి మా బాపు నన్ను దవాఖానాకు తీసుకుపోయాడు. తిరిగి వచ్చేసరికి రాత్రి అయ్యింది. నేను సైకిలుకు ముందు హాండిల్‍ బార్‍ మీద కూర్చున్నాను. బాపు సైకిలు తొక్కుతున్నాడు. సైకిలుకు ముందు బిగించిన ఖందీల్‍ నుండి వస్తున్న గ్యాసు నూనె దీపం వెలుగు, గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే అన్నట్లు మినుకుమినుకుమని కునుకుతూ వెలుగుతుంది. మా ఇంటి వెనక వేప చెట్టు దగ్గరికి వచ్చాం. చిక్కని చిమ్మని చీకటి. చీకటి ఆకాశం జిలుగువెలుగుల చుక్కల చీర కట్టుకుని చలికి గజగజా, వజవజా వణుకుతుంది. ఆ చీకట్లో చెట్టు క్రింద కొరివి దయ్యంలా ‘‘చాయ్‍ గరం’’. ఎర్రగా నిగ నిగ మెరుస్తూ భగభగ లాడుతున్న ఇనుప నిప్పుల పొయ్యి. దాని మీద జాగ్రత్తగా అమర్చిన రాగిరంగు బఫ్కా. ఆ బఫ్కా రింగులకు తగిలించిన రెండు మూడు తెల్లని కోపులు. బఫ్కా లోపల బాగా మరుగుతున్న డికాషన్‍కు గుర్తుగా మూతలోపలి నుండి వస్తున్న భుగభుగల సన్నటి వేడివేడి పొగలు. పొయ్యిలోని నిప్పుకణికల వెలుగులలో వెలుతురులో ఆ ‘‘చాయ్‍ గరం’’ అవతారం నాకు లీలగా, మసకమసకగా కనబడుతుంది. బక్కచిక్కిన నల్లటి వృద్ధ శరీరం. జీబురుగా గుబురుగా పెరిగిన తెల్ల తల వెంట్రుకలు. ఆ వెండి వెంట్రుకలకు రెండింతలుగా పెరిగిన క్రింది గడ్డం. ఆ వెంట్రుకల లోపల అతని ముఖం సరిగ్గా కనబడటం లేదు కాని నిప్పు కణికల వెలుగులు అతని కళ్లల్లో ప్రతి ఫలించి ఆ కళ్లు చమక్‍ చమక్‍న మెరుస్తున్నాయి. కొరివి దయ్యం కండ్లలాగా. పాతాళభైరవి సీన్మాలో కాళికాదేవి కండ్లలాగా మెరుస్తున్నాయి. రాత్రిపూట చలిని తట్టుకునేందుకు ఒక పాత తాతల కాలం నాటి చిరిగిన రంద్రాలున్న నల్లకోటు వేసుకున్నాడు. కటిక చీకట్లో ఆ చీకటి మనిషిని ఒక మనిషి అని గుర్తించటానికి మెరుస్తున్న ఆ రెండు కండ్లు తప్ప మరే ఆధారం లేదు. అప్పటి వరకు నిలబడ్డ అతను అక్కడున్న ఒక బండ మీద సుఖాసీనుడైనాడు. తన ముందు అతి జాగ్రత్తగా నేల మీద నిప్పుల కుంపటిని సర్దినాడు. ఇంతల అతని దగ్గరికి అంత రాత్రిపూట గిరాకీలు దొరకని ఒక ముసలి డొక్కు రిక్షావాడు ఊగుతున్న పీరులా నడుస్తూ వచ్చాడు. శరీరంలో రక్తమాంసాలు ఏ మాత్రం లేని ఆ డొక్కు రిక్షా ముసలి మనిషి చాలా కాలం తర్వాత అప్పుడే బొంద లోపల నుండి లేచి వచ్చిన పురాతన అస్థిపంజరంలా ఉన్నాడు. మరో మినిట్ల అంత తొందరగా నిద్రపట్టని మరో ముసలి వాడు ఎంతకూ ఆగని దగ్గులు ఖంగు ఖంగుమని దగ్గుకుంటూ వచ్చాడు. వాడు కూడా ఆ ఆఖరి చాయ్‍ తాగినంక ఆ ముసలి రిక్షా వాడికి తోడుగా బొందలోపలికి వెళ్లి నిద్రపోవటానికి సిద్దంగా ఉన్న సగం చచ్చిన శవంలా ఉన్నాడు. రాత్రిపూట ఆవారాగా తిరిగే మరో జులాయి యువకుడు ఎన్నో అపస్వరాలతో ఏదో ఒక పిచ్చిపాట పాడుతూ నగంలోని గల్లీలన్నీ తిరుగుతూ, తిరుగుతూ వచ్చి ఆ నిశిరాత్రి సమయాన ఆ ఇద్దరికి అక్కడ ఆ చెట్టు క్రింద తోడైనాడు. ఆ ముగ్గురు చలికి గజగజ వణుకుతూ ఆ నిప్పుల కుంపటి చుట్టూ కూచుని మొత్తం శరీరాన్ని కాకున్నా కనీసం ముక్కులు ముఖాలు, అరచేతులనయినా వెచ్చబరచుకుందామన్న సదుద్దేశ్యంతో హోమగుండం లాంటి ఆ నిప్పుల కుంపటి చుట్టూ చేరి డికాషన్‍ పొగల సువాసనలను ఆష్రూణిస్తూ చిదానంద స్థితిలో ఓలలాడుతున్నారు. ఆ అమాస చీకటి రాత్రి ఎవరైనా అకస్మాత్తుగా ఆ ముగ్గురిని చూస్తే గాలిలో తేలే దయాల నీడలు అక్కడ కూచున్నట్లు భ్రమ కలిగి భయపడతారు. వేళకానివేళల్లో రాత్రిపూట ఈ మనుషుల సందడేమి•ని విసుక్కున్న చెట్టుమీది పక్షులు నిద్రాభంగమైందన్న కోపంతో రెక్కలు రెపరెపలాడించి, మరికొన్ని టపటపలాడించి కొద్దిసేపు తమ నిరసన చెట్టు క్రింది ఆ మూర్ఖపు మనుషులకు తెలిపి మళ్లీ సర్దుకుని ముడుచుకుని పడుకున్నాయి. చాయ్‍గరం ముసలాడు మూడు బేరాలు ఒకేసారి దొరికినందుకు మురిసి పోతూ భఫ్కకు తగిలించిన మురికి కోపుల్ని తీసి వెంబడున్న బకెట్‍లోని మురికి ఎంగిలి నీళ్లల్లో ఆ మురికి కప్పుల్ని తన మురికి చేతులతో శుభ్రపరచాలన్న మంచి ఉద్దేశ్యంతోనే మంచిగానే కడిగే ప్రయత్నంలో నిమగ్నుడై ఉండి కూడా కొద్ది దూరాన సైకిలుపై ట్రింగు, ట్రింగుమని గంట మోగిస్తూ వస్తున్న మా తండ్రీకొడుకుల్ని చూసి మొత్తం ఐదు బేరాలు దొరికాయన్న సంతోషంతో ఒళ్లు మరిచి తనకు తెలియకుండానే ‘‘చాయ్‍ గరం’’ అని సంగీత నాదాన్ని వినిపించాడు. ఆ సంగీత తరంగాలతో అసలే పులకరంతో ఉన్న నా ఒళ్లు మరింత పులకరించింది. ఆ ముసలివాడి ఆకారాన్ని చూడగానే నాకు నేను చదివిన ‘‘రిప్‍ వాన్‍ వింకిల్‍’’ కథ లోని ముసలి మనిషి జ్ఞాపకం జ్ఞాపకం వచ్చాడు.
ఆ రాత్రి ఆ చీకటి చెట్టు క్రింది ‘‘సంచార చాయ్‍ ఖానా’’ సజీవ దృశ్యాన్ని నేను నా జీవితంలో ఎప్పుడూ మరువలేని, మరుపురాని, మధురమైన విశయం. మళ్లీ అటువంటి ఆనందం నాకు రాజ్‍కపూర్‍ ‘‘శ్రీ 420’’ సీన్మాలో నాయికా నాయకులు చిరుజల్లుల వర్షంలో తడుస్తూ ఒక ఫుట్‍పాత్‍ మీది గుడిసె హోటల్లో గరంగరం చాయ్‍ను కప్పు సాసర్లలో తాగుతున్న దృశ్యంల కనబడింది.


మా చిన్నతనంల మాకూ, చాయ్‍కు బొడ్డుతాడు సంబంధం ఉండేది. మా ‘‘నాస్తా’’ గురించి చెప్తే ఇప్పటి తరం నవ్వుతారేమో! పొద్దున్నే లేచి ముఖం కడగంగనే పొడుగుపొడుగు బరువైన పెంబర్తి ఇత్తడి గ్లాసులల్ల గరంగరం ‘‘చా’’పోసుకుని అండ్ల నిన్న మొన్నటి చద్దిపూరీలను చిన్న చిన్న ముక్కలుగా విరిచి కొద్దిసేపు నానబెట్టి తింటుంటే ఆ మజానే వేరు. ఇదే టెక్నిక్కు మడుగూలకు, సకినాలకు అప్లై చేసేవారం. ఉప్పిడి పిండిలో చాయ్‍ కలుపుకుని తింటే ఎంత రుచో మీకు తెలుసా? ఆఖరికి వినాయక చవితి తెల్లారి మిగిలిపోయిన బెల్లపు పాశంల చాయ్‍ పోసుకుని తింటుంటే ‘‘స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్టుడేది. ఎండాకాలం ఒంటిపూట బడులు ఉన్నప్పుడు చాయ్‍ గ్లాసులల్ల ఉడుకుడుకు అన్నం వేసుకుని చెమ్చతో తింటుంటే పాల అటుకులు తింటున్నట్టు ఉండేది. పాలు త్రాగే తాహత్‍ లేనపుడు ‘‘చాయ్‍’’ మమ్మల్ని ఎన్నో రకాలుగా అమ్మలాగే ఆదుకునేది. బలం సంగతి పెరుమాళ్ల కెరుక.


తర్వాత కొన్ని సంవత్సరాలకు మా శాలిబండా రావి చెట్టు క్రింది దర్గా పక్కన పెద్ద ఎత్తున ఆధునికంగా ఒక ఇరానీ హోటల్‍ వెలిసింది. దాంతో మా పాత నగరంలో ‘‘హల్‍చల్‍’’ చెలరేగింది. దాని పేరు ‘‘సాంజ్‍ ఔర్‍ సవేరా’’. చాలా కవితాత్మకమైన పేరు. చాలా ఇరానీ హోటళ్లు హిందువుల హోటళ్ల లాగా మతపరమైన, దేవుండ్ల పేర్లతో కాక భావుకతతో, లౌకికపరంగా ఉంటాయి. లేదా వాళ్ల పూర్వీకుల జన్మస్థలాల పేర్లుగాని గ్రీకు పురాణాల హీరోల పేర్లతో గాని ఉంటాయి.
ఉదా।। అల్ఫా హోటల్‍, వీనస్‍ హోటల్‍, హోటల్‍ తాష్కెంట్‍, హోటల్‍ బాస్రా, హోటల్‍ షెహరాన్‍ లేదా టెహరాన్‍. మా శాలీబండాలోని ‘‘సాంజ్‍ ఔర్‍ సవేరా’’ వెలసిన కొత్తలో మా అమాయకపు, స్వచ్ఛమైన కండ్లకు ఆ హోటల్‍ ఒక తాజ్‍మహల్‍లా వెలిగిపోతూ కనిపించేది. లోపల ఎటుచూసినా నిలువెత్తు పెద్ద పెద్ద అద్దాలు. ఎటుతిరిగి చూసినా మనమే కనబడేవాళ్లం. సొగసైన పొడుగు పొడుగు ఫేము ఖుర్చీలు, నాలుగు కుర్చీల మధ్యన పాలరాతి బండ పరచిన ఒక గుండ్రటి టేబుల్‍. దానిపై శుభ్రంగా తెల్లగా మెరిసే గాజు గ్లాసులలో మంచినీళ్లు. ఎత్తైన స్లాబు నుండి క్రిందికి వ్రేలాడుతున్న రంగరంగుల షాండీలియర్లు. అందులో కూడా మనుషులు మ్కులు, ముక్కలుగా కనబడుతుంటారు. గాజు అద్దాల వెనుక అలమారాలు అందులో బిస్కట్టు ప్యాకెట్లు, బార్నవిటా, హార్లిక్స్ సీసాలు, జామ్‍లు, కేకులు, పేస్ట్రీలు. ఎక్కడైనా గోడలు ఖాళీగా ఉంటే అక్కడ మధుబాల, నర్గీస్‍, హీరోయిన్ల తస్వీర్లు వ్రేలాడుతుండేవి. మొదటిసారి నేను తాజా బన్‍ మస్కా తిన్నది అక్కడే. ఎర్రగా కరకరలాడే ‘‘మేతి కా సమోసాలు’’ తిన్నదీ అక్కడే. దోస్తులతో కలిసి ఒక కప్పులో సగం సగం ఇరానీ చాయ్‍ తాగిందీ అక్కడే. కౌంటర్‍లో నీలికళ్ల నడివయసు ఇరానీ మనిషి. కొలిమిలో బాగా కాల్చి ఇవతలికి తీసిన రాగిరంగు ముఖం. పల్చని ఎర్రని పెదాల మధ్య పొద్దున్నే పువ్వులు పూస్తున్నట్లు చిరుచిరు నవ్వుల పువ్వుల మందహాసాలు. ప్రసన్నవదనంతో ఉన్న ఘటోత్కచుడి తమ్ముడిలా కనబడేవాడు. అతను హమేషా గ్రామ్‍ఫోన్‍పై కుక్కబొమ్మ ఉన్న నల్లటి హెచ్‍ఎంవి రికార్డ్ ప్లేయర్‍లు వేస్తూనో లేక గ్రామ్‍ ఫోన్‍కు కుంజీ తిప్పుతూనో కనబడేవాడు. దిలీప్‍కుమార్‍ అంటే అతనికి ఇష్టం కాబోలు హమేషా ‘‘మధుమతి’’ సీన్మాలో ముఖేష్‍ పాడిన ‘‘సుహానా సఫర్‍’’ పాట వేస్తుండేవాడు. ప్రతి బుధవారం రాత్రి ‘‘భినాకా గీత్‍ మలా’’ పాటలు రేడియోలో పెద్దగా పెట్టగానే ఇండ్లల్ల రేడియోలు లేని ఆ పేద కాలంలో శ్రోతలు హోటల్‍ లోపలా బయటా నిలబడి అమీర్‍ సయానీ గొంతుతో, హిందీ పాటల సంగీతంతో ఆనంద డోలికలలో తేలియాడే వారు. పనిపాటా లేని అల్లరి చిల్లర నిరుద్యోగ బేకార్‍ గాండ్లందరూ ఆ కుర్చీలల్ల గంటల తరబడి గప్పాలు కొట్టుకుంట కాలక్షేపం చేసినా పల్లెత్తి ఒక మాట ఆ ఓనర్‍ అనకపోయేది. రాజుగారి పక్కన రాణిగారు కూచున్నట్లు ప్రతి ఇరానీ హోటల్‍ పక్కన ఒక పాన్‍షాప్‍ ఉంటది. గరం గరం ఇరానీ చాయ్‍ పీనేకే బాద్‍ సువాసనలు గుబాళించే లక్నో మసాలా జర్దాపాన్‍ వేసుకోకపోతే మజానే రాదు. ‘‘నోట్లె పాన్‍ ఇంట్ల ఫోన్‍’’ ఉండటం ఆ రోజుల్లో ఒక దర్జా ఒక హోదా. ఆ పాన్‍ ప్రియుల పుణ్యమా అని ఆ పాతరోజులల్ల హైద్రాబాద్‍ సడక్‍లన్నీ ఎర్రని పాన్‍ మరకలతో కళకళలాడుతుండేవి. సర్కారీ ధఫ్తర్‍లల్ల గోడల కన్నీ పాన్‍ మరకలే ఏదో హత్య జరిగినట్లు. ఎవరైనా విదేశీయులు చార్మినార్‍, మక్కమస్జిద్‍లు చూడటానికి రాగానే నోటినిండా ఎర్రని పాన్‍ రసంతో పురజనులు కనబడేసరికి ఇంతమందికి బ్లడ్‍ క్యాన్సర్‍ వచ్చిందేమని వారు భీతి చెందేవారు. ‘‘పాన్‍ హీ షాన్‍ హై’’ అన్న మన సంగతి వారికి తెలియదు కదా పాపం!
మటన్‍ బిర్యానీలు, చికెన్‍ బిర్యానీలు పొట్టపగిలేలా బాగా మెక్కిన తర్వాత ‘‘ఇరానీ చాయ్‍’’ తాగటం కంపల్‍సరీ. ఏల యనగా అందులోని నూనె, కొవ్వు పదార్థాలు సులభంగా వెంటనే జీర్ణం కావటానికి గరం గరం ఇరానీ చాయ్‍ గొంతు నుండి కడుపులోకి చుక్కలుచుక్కలుగా జారకపోతే ‘‘గలా సాఫ్‍ కాదు ఖానా హజమ్‍’’ కాదు.


ఇటీవల నేను కెనడా రాజధాని టోరంటోను సందర్శించాను. అక్కడున్న ఒక ప్రముఖ విఫణి వీధిలో ‘‘హైద్రాబాద్‍ చాయ్‍’’ అన్న ఒక హోటల్‍ కనబడి మన చాయ్‍ ప్రభ అక్కడ కూడా నలుదిక్కుల వెలిగిపోతున్నందుకు నేను సంతసించాను. దేశంకాని దేశంలో మన చాయ్‍ కనబడితే చిన్న నాటి దోస్తును చాలా కాలం తర్వాత మళ్లీ కలుసుకున్నంత సంతోషం కలుగుతుంది.
విజ్ఞులైన పాఠక మహాశయుల్లారా!
చాయ్‍, కాఫీలకు కూడా ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక విభేదాలు ఉంటాయన్న సంగతి మీకు తెలుసా? ఇప్పటికీ మన హైద్రాబాద్‍ నగరంలో ‘‘ముల్కీలు’’ మాత్రమే ఇరానీ చాయ్‍ను వరిస్తారు. అది స్థానికతకు ఒక సంకేతం ఒక సింబల్‍. ‘‘అఫాకీలు’’ (ముల్కీలు కానివారు) మాత్రం ‘‘కాఫీ’’ని కావలించుకుంటారు. తెలంగాణాలో చాయ్‍ వాడకం ఎక్కువ, ఆంధ్రాలో కాఫీ. ఒక తెలంగాణ తప్ప దక్షిణ భారతమంతా ‘‘కాఫీ’’. తెలంగాణాతో సహా ఉత్తరమంతా ‘‘చాయ్‍’’. కాఫీలు స్టీలు గ్లాసులల్ల అందిస్తేనే అందం. చాయ్‍లు మాత్రం పింగాణీ కప్పు సాసర్లల్ల. ఇరానీ హోటళ్లకు, ఆంధ్రా హోటళ్లకు వాస్తుశిల్ప నిర్మాణంలోనూ, సాంస్కృతిక స్వభావాల్లోనూ విభేదాలు కొట్టవచ్చినట్టు కనబడతాయి. మొదటివి బహిర్ముఖంగా ఉంటే రెండవది అంతర్ముఖంగా ముడుచుకుని ఉంటాయి. ఒక మన దేశంలోనే కాదు కాఫీ, చాయ్‍ల విభజనలు ప్రపంచమంతటా ఉన్నాయి. యూరపు, అమెరికా ఆస్ట్రేలియా లాంటి తెల్లవాళ్ల దేశాలలో కాఫీదే అగ్రస్థానం. ఆసియా దేశాలల్నింటా, కొన్ని ఆఫ్రికా దేశాలలో ‘‘చాయ్‍’’ది ప్రముఖ స్థానం.
ఇక ముగింపులో చాయ్‍లు వాటి వైనవైనాల గురించి వివరిస్తాను. ‘‘ఖడక్‍ చమచ్‍ చాయ్‍’’ ఇది ఉత్తర ప్రదేశ్‍లో ప్రసిద్ది. లక్నో నగరంలోని ‘‘ఇమాం బాడాకు’’ వెళ్లే దారిలో ‘‘తుండేనవాబ్‍సాబ్‍’’ హోటల్‍ కబాబులకు చాలా ప్రసిద్ది. అక్కడ కారం, కారం – గరం, గరం, సీకు కబాబులు తిన్న తర్వాత ఈ ‘‘ఖడక్‍ చమచ్‍ చాయ్‍’’ త్రాగాలి. గ్లాసులో సగం వరకు శక్కర నింపి పావుసగం డికాషన్‍ పావుసగం పాలు పోసి చాయ్‍ చేసి ఆ చెక్కరలో చమ్చాను నిలువుగా నిలబెడతారు. ‘ఆరోగ్యవంతులు, సాహసవంతులు, తీపి ప్రియులు ఆ పానకాన్ని లొట్టలు వేసుకుంటూ తాగుతారు. ‘‘మలాయ్‍ దార్‍ పౌనా’’ మజా తెలియాలి అంటే భోపాల్‍ రైల్వే స్టేషన్‍ వెళ్లవలసిందే. మన తెలంగాణా ఎక్స్ప్రెస్‍ రైలు భోపాల్‍కు సరిగ్గా మధ్యరాత్రి చేరుకుంటుంది. ఆ చాయ్‍ ప్రియులు మంచి నిద్రలో వున్నా లేచి ప్లాట్‍ఫాంపైకి వెళ్లి ఆ చాయ్‍ తాగుతారు. ఆ చాయ్‍లో గ్లాసులో చిక్కటి మీగడ దట్టంగా వేస్తారు. మూడొంతులు చాయ్‍ ఒక వంతు మలాయ్‍ కావున, మలయ్‍ దార్‍ పౌనా అయ్యింది. కాశ్మీర్‍ – శ్రీనగర్‍ హోటళ్లలో మనం దిగగాలే వెల్‍కం డ్రింకుగా ‘‘గులాబీ పత్తా కా చాయ్‍’’ అందిస్తారు. అందులో పాలు, శక్కరా ఏమీ ఉండవు. తాజా గులాబీ పూలరేకులను, కుంకుమ పువ్వును ఇలాచీ జాపత్రిలను నీళ్లలో మరిగిస్తే ఘుమఘుమలాడే పానీయం తేనెరంగులో తయారవుతుంది. అదే గులాబీ చాయ్‍. ‘‘ఘావా లేక ఖావా’’ చాయ్‍ మన హైద్రాబాద్‍ పాతనగరంలోని బార్కాస్‍ల మాత్రమే దొరుకుతుంది. ఇది చావూష్‍లు తయారు చేస్తారు. వారు ఆఫ్రికా లోని ఇథియోపియా ఎమన్‍, సుడాన్‍ లాంటి దేశాల నుండి వలస వచ్చిన ముస్లింలు.


ఇరాన్‍ దేశంలో మన ఇరానీ చాయ్‍ దొరకదు. పల్చటి నల్లటి డికాషన్‍ తాగుతూ ఒక మిస్రీ గడ్డను పుక్కిట పెట్టుకుంటారు. అప్ఘానీలు అంతే కాకపతే మిస్రీ బదులు చాక్లెట్‍ పెట్టుకుంటారు. నేను మధ్యాసియా దేశాలను దర్శించినపుడు వారి ‘‘చాయ్‍ ఖానాలలో’’ నీళ్లకు బదులు బల్లలపై ‘‘సమోవార్‍’’ ‘సన్నటి సెగలతో నిప్పుల పొయ్యి)పై పల్చటి వేడి వేడి డికాషన్‍ ఉంటుంది. నీళ్లు ఉండవు. తింటూ ఆ ‘‘చాయ్‍’’ను చప్పరిస్తూ ఉంటారు. చైనాలో మన చాయ్‍ కాగడా పెట్టి వెదికినా దొరకదు. వేడివేడి నీళ్లల్లో రకరకాల మూలికలు వేసుకుని నిరంతరం సేవిస్తూ ఉండటమే వారి అలవాట్లు. అందుకే వారికి మనలాగా బానపొట్టలు ఉండవు. మనకు హైద్రాబాద్‍ ఇరానీ చాయ్‍ ఉంది. కావున మన నసీబ్‍ చాలా బాగుంది. ఇరానీ చాయ్‍ జిందాబాద్‍
నాకొక జిగ్రీదోస్దు ఉన్నాడు. వాడు ‘‘చాయ్‍ కా షౌకీన్‍’’ అంటే చాయ్‍ ప్రియుడన్న మాట. చాయ్‍ల మీదనే బ్రతుకుతూ అన్నం తక్కువ తిని చాయ్‍లు ఎక్కువ తాగుతుంటాడు. వాడు తన చివరాఖరి రహస్య కోరిక ఒకటి నాకు చెప్పాడు. వాడు చనిపోయాక సమాధి కడితే దానిపై ఒక ఖాళీ కప్పు సాసరూ గట్టిగా అతికించి దాని క్రింద ‘‘ఎపిటాఫ్‍’’ (స్మృతి గీతం) ఇట్లా రాయాలట.
‘‘ప్రియమైన సందర్శకులారా!
చాన్నాళ్లుగా చాయ్‍లేక
నా గొంతు ఎండుకపోతుంది.
దయచేసి ఈ ఖాళీ కప్పులో
జరంత చాయ్‍ పోసి
పుణ్యం కట్టుకోండి’’
వీలైతే ఒక ఉస్మానియా బిస్కెట్‍ కూడా.


పరవస్తు లోకేశ్వర్‍, ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *