సోలార్ విద్యుత్తును నిలువ ఉంచడమే లక్ష్యం.. పైలెట్ ప్రాజెక్ట్‌గా ఒక మెగావాట్ ప్లాంట్
దీని ద్వారా ఏడాదికి రూ.1.6 కోట్ల విలువైన సోలార్ సద్వినియోగం
ప్రయోగాత్మకంగా మందమర్రి సోలార్ ప్లాంట్‌లో ఏర్పాటు
ప్రయోగం సఫలమైతే మరో 2 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఏర్పాటు
తద్వారా మొత్తం రూ.4.8 కోట్ల లబ్ధి
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి
సోలార్ విద్యుత్ సద్వినియోగం, పొదుపు చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మందమర్రి సోలార్ ప్లాంట్‌లో పగటిపూట ఉత్పత్తి జరిగి, వినియోగం తర్వాత ఇంకా మిగిలిన సోలార్ విద్యుత్ ను వృథాగా పోనీయకుండా బ్యాటరీలో నిలువ చేసే ‘‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను’’ పైలెట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేస్తోంది. సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ ఈ వినూత్న పద్ధతికి సంబంధించిన వివరాలను ఒక ప్రకటనలో తెలియజేశారు.
మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌లో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపడుతున్న ఒక మెగా వాట్ నిలువ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పద్ధతి వల్ల నెలకు రూ.13 లక్షల విలువైన (ఏడాదికి రూ.1.6 కోట్ల) సోలార్ విద్యుత్ వృథా కాకుండా సద్వినియోగం కానున్నదని తెలియజేశారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే మరో రెండు మెగా వాట్ల సామర్థ్యం గల సిస్టమ్‌లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నామని, తద్వారా నెలకు దాదాపు 40 లక్షల రూపాయల (ఏడాదికి రూ.4.8 కోట్ల) విలువైన సోలార్ విద్యుత్ సద్వినియోగం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
మందమర్రిలో సింగరేణి సంస్థ తన గనుల విద్యుత్ అవసరాల నిమిత్తం 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను 2021లో ఏర్పాటు చేసుకుంది. సొంత అవసరాల కోసం ఏర్పాటు చేశారు కనుక దీనిని ‘‘ఇన్ హౌస్ క్యాప్టివ్ ప్లాంట్’’గా పేర్కొనడం జరుగుతుంది. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలలో ఉన్న మొత్తం 11 భూ గర్భ గనులు, 4 ఓపెన్ కాస్ట్ గనులు, తదితర పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తూ వస్తున్నారు.
ఈ ప్లాంట్ ద్వారా రోజుకు సగటున ఒక లక్ష 34 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా దీనిలో సుమారు ఒక లక్ష 14 వేల యూనిట్ల విద్యుత్‌ను కంపెనీ వినియోగిస్తుంది. కానీ ఇంకా మిగిలి ఉన్న సుమారు 20 వేల యూనిట్ల విద్యుత్ ను మాత్రం వినియోగించలేకపోతుంది. మధ్యాహ్నం వేళ కార్మికులకు భోజన విరామ సమయం ఉండడం, యంత్రాలు కూడా విశ్రాంతిలో ఉండటం వలన ఈ విద్యుత్ ను వాడలేకపోతున్నారు. ఫలితంగా ఈ విద్యుత్ స్థానిక సబ్ స్టేషన్ ద్వారా తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్)కు ఉచితంగా అందజేయాల్సి వస్తుంది. ఇన్ హౌస్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ద్వారా ఈ మిగులు విద్యుత్ రాష్ట్ర విద్యుత్ శాఖ లైన్లలో కలుస్తుంది. కనుక దీనికి డిస్కమ్ వారు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా
ఉచిత విద్యుత్తుగా పరిగణిస్తూ వాడుకుంటున్నారు.
ఈ విధంగా గ్రిడ్‌కు ఉచితంగా వెళ్లిపోతున్న 20 వేల యూనిట్ల సోలార్ విద్యుత్ ను సద్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ దీనిని నిలువ ఉంచుకొని, తిరిగి అవసరమైనప్పుడు వినియోగించుకునే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బి.ఈ.ఎస్.ఎస్.) ను ఇక్కడ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ ప్రత్యేక చొరవతో ఈ సిస్టం ఏర్పాటులో అనుభవం ఉన్న కంపెనీలను ఆహ్వానించడం జరిగింది. వీటిలో కాన్పూర్‌కు చెందిన మెస్సర్స్ మార్స్ ఇండియా యాంటేనాస్ అండ్ ఆర్ ఎఫ్ సిస్టమ్స్ అనే ప్రైవేటు కంపెనీకి పైలెట్ ప్రాజెక్ట్‌గా ఒక మెగావాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు పనిని అప్పగించారు.
మరి కొద్ది రోజుల్లో ఈ సిస్టం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఏర్పాటైతే మధ్యాహ్నం పూట వృథా అవుతున్న సోలార్ విద్యుత్‌లో ఒక మెగావాట్ సామర్థ్యం గల విద్యుత్ ను బ్యాటరీ ఎనర్జీ సిస్టంలో నిలువ ఉంచి, రాత్రివేళ సింగరేణి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా నెలకు రూ. 1 3 లక్షల విలువైన సోలార్ విద్యుత్ ను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఇది విజయవంతం అయితే మరో రెండు మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఒక మెగావాట్ (బి.ఈ.ఎస్.ఎస్.)కు దాదాపు 2.5 కోట్లు ఖర్చు అవుతుండగా.. మూడు మెగావాట్ల ప్లాంట్లకు అయ్యే వ్యయం దాదాపు రూ.7.5 కోట్లుగా అంచనా. సోలార్ విద్యుత్ సద్వినియోగం ద్వారా ఈ ఖర్చు రెండు సంవత్సరాల లోపే తీరినున్నది.
సొంత సోలార్ ప్లాంట్‌తో నెలకు నాలుగు కోట్ల రూపాయలు ఆదా మందమర్రి ఏరియాలో సింగరేణి సంస్థ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయక ముందు శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాలలో గల 15 గనుల అవసరాలకు నెలకు 13 కోట్ల రూపాయల విలువైన విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ నుండి కొనుగోలు చేస్తుండేది. కాగా 2021 ఏప్రిల్ 17 తేదీన 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన తరువాత నుండి నెలకు కేవలం 9 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు మాత్రమే చెల్లిస్తుంది. అంటే సోలార్ ప్లాంట్ వల్ల నెలకు నాలుగు కోట్ల రూపాయల ఆదా చేకూరింది. ఇప్పుడు ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం విజయవంతం అయితే మరో రూ.4.8 కోట్ల ఆదా చేకూరనుంది. సోలార్ విద్యుత్ సద్వినియోగానికి, పొదుపుకు సంస్థ ఛైర్మన్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి.
-చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ప్రభుత్వ సంస్థ), ప్రజా సంబంధాల విభాగం, హైదరాబాద్