ప్రమాదంలో జీవవైవిధ్యం

సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికం కాదు, ఏదీ తక్కువ కాదు. అన్ని సమానమే, ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడతాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవవైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా, మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను వివరించారు.
నేడు భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల వైవిధ్యం సుమారు 3.5 బిలియన్‍ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతున్నది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. వివిధ కారణాల వల్ల ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి.


ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారతదేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతుజాతులు ఈ దేశంలో గతంలో ఉండేవి. కారణాంతరాల వల్ల అనేక జీవాలు కనుమరుగవుతున్నాయి. నేడు జీవ సంపదలో 10 శాతానికి పైగా ప్రమాదంలో ఉంది. చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికి పైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటివనరులు మృగ్యమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను స్వార్థ ప్రయోజనాల కోసం రూపుమాపారు. అరణ్యాలలోని వన్యప్రాణుల్ని నిత్యం వేటాడి మరీ అంతమొందిస్తున్నారు.


వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటకనాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని విచక్షణా రహితంగా వాడేలా చేస్తున్నది. దీంతో నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వస్తున్నది. అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా భారత్‍ విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోతున్నాం. అంతేకాదు ఎన్నో జీవజాతులు కాలక్రమంలో అంతరించి పోయాయి.


భారతదేశంలో ఆదివాసులు అధికంగా ఉన్నచోట జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగానూ ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‍, మిజోరాం, అరుణాచల్‍ ప్రదేశ్‍లో 80 శాతానికంటే ఎక్కువ మంది గిరిజనులున్నారు. అక్కడే జన్యువైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం. ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బ తీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యు మార్పిడి వల్ల వచ్చే ప్రభావాలు స్వల్ప కాలంలో, దీర్ఘ కాలంలో ఎలా
ఉంటాయో పూర్తిగా అధ్యయనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశపెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లుతుంది.


ఈ సృష్టిలో అన్నిటిలో ఏకత్వం ఎంత ఉందో, భౌతికంగా, మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. వ్యవసాయ పద్ధతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహారపు అలవాట్లే కావచ్చు, అన్ని సృష్టి చక్రానికి లోబడే ఉంటాయి. చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక నిరంతర ఆవృత వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగతా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది, మిగతా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఇలా జగత్తులో అనేక వృత్తాలు ఉంటాయి. వాటిలో మనిషి ఏ మాత్రం జోక్యం చేసుకున్నా అది వినాశనానికి దారి తీస్తుంది. ఏ ఒక్క జీవి అంతరించినా, మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అనారోగ్యాలకు చికిత్స, వైద్యం చేయడానికి జీవవైవిధ్యం చాలా ముఖ్యం. అనేక మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలను మందుల తయారీకి వాడడం చూస్తున్నాం.


ప్రపంచవ్యాప్తంగా ఏటా వేలాది జాతుల జీవరాశులు అంతరించిపోతున్నాయి. వాతావరణ సమతుల్యానికి, పర్యావరణ పరిరక్షణకు జీవరాశులను కాపాడుకోవడం అవసరం. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఇందుకోసం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమైంది.
(అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా..)


రామకిష్టయ్య సంగనభట్ల
ఎ : 99085 5453

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *