తెలుగు కావ్యాలలో కుల వృత్తులు

తెలుగు సాహిత్యంలో భారతీయ సాంప్రదాయాలను విలువలను ప్రతిబింబించే రచనా పక్రియలెన్నో కన్పిస్తాయి. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. ఇక్కడి ప్రజల జీవనంలో కుటుంబ వ్యవస్థలో ప్రకృతితో పాటు సాహిత్యం భాగంగా ఉంటుంది. వీటన్నింటిని సమ్మేళనం చేసి సాహిత్యలోకంలో వికసింపచేసినవారు తెలుగు కవులు, తమ కమనీయమైన కావ్యాలలో అన్నదాతలైన రైతులు. వారు నివసించే పల్లెసీమలు, పచ్చని చెట్లు చెట్లమధ్య ఇళ్ళు, గ్రామాలలోని కుల వృత్తులు వారి వారి వృత్తులకు తగినట్లు గ్రామంలోని వీధులను వర్ణించారు. ఇంకా గ్రామాలలోని ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు కవులు అద్భుతంగా చిత్రించారు. నేటి గ్రామాలలో కుల వృత్తులు ఆదరణ లేక ఆధునీకీకరణ కారణంగా బోసిపోయినవి. కాని తెలుగు కావ్యకర్తలు అందమైన రాసౌధాలనే కాక ఆనాటి పల్లెలలో కుల వృత్తులను వృత్తి పరికరాల ప్రాముఖ్యాన్ని వర్ణించిన తీరు హర్షనీయం.


ఆనాటి కుల వృత్తులకు ఉన్న గౌరవం వృత్తి పరికరాలను దైవసమానంగా పూజించే దృశ్యాలెన్నో మనకు తెలుగు కావ్యాలలో కన్పిస్తాయి. అటువంటి కావ్యరచన చేసిన కవులు బొమ్మకంటి తెలగనార్యుడు, గణపవరపు వెంకటరవి, వేములవాడ భీమకవి, ఆంధ్రబోజుడు, విద్యానాథుడు, భట్టుమూర్తి, చిమ్మపుడి అమరేశ్వరుడు, కొరవి గోపరాజు, పొన్నగంటివారు, తిమ్మనగారు, పంచదాయిలైన విశ్వబ్రాహ్మణ వృత్తి పరికరాలను వాటిచే తయారు చేయబడిన వస్తు ప్రయోజనాలను చక్కగా వర్ణించారు.


కావ్య సాహిత్య రచనలలోను సమకాలీన సమాజంలో విశ్వబ్రాహ్మణులు కుల వృత్తులపై ఆధారపడిన విధానాన్ని కవులు సవివరంగా నిక్షిప్తం చేసినారు. స్వర్ణ శకలాలు అనే తన గ్రంథ రచనలో కపిలవాయి లింగమూర్తిగారు ఈ విషయాలను పేర్కొన్నారు. పంచానన విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించి అనేక ఇతర రచనలు చేసి, వాటితో పాటు, కుల వృత్తి సంబంధ సాహిత్య గ్రంథాలను తెలుగులోనికి తెచ్చారు, అట్టివారి రచనలలోని తెలుగు కావ్యాలలో వృత్తి పరికరాల చిత్రణ రూపాలివి.
బొమ్మకంటివారి సుత్తి దెబ్బ
సీ।। రథములు ధనువులు రాజశస్తాస్త్రముల్‍
మేటి కేయూర కిరీటములున్‍
ఉదకుంభపాత్ర గృహోపకరణములు
శాలలు ఘనమగు సౌధములును
అఖిల సస్యధార హల సాధనంబులు
భవ్య భద్రాసన పరికరములు
పత్నీపతిత్వ సంబంధ మాంగల్యముల్‍
పూర్ణ రతోజ్వల భూషణములు
చిత్ర ప్రభలు సర్వశిల్పంబుతాహింప
తెలయుగాదె సుత్తె వ్రేటువలన
సృష్టి విశ్వకర్మ స్రష్ట పంచబ్రహ్మ
కారణంబు దెలియు మోయి దుష్ట!
బొమ్మకంటి తెలగనార్యుడు తన ధర్మపాల విజయం అనుకావ్యంలో అంజమడనే చోళరాజు సేనానితో ధర్మపాలుడన్న మాటలివి.

ఈ సకల ప్రపంచంలో రాజులు వాడే రథాలు, ఆయుధాలు మేడలు శాలలు, గృహాలు సామాన్యులు వాడే ఇండ్లలోని ఇతర వ్యవసాయ పరికరాలే కాకుండా భార్య భర్తల బంధానికి ప్రతీక అయిన మాంగల్యం కూడా సుత్తి దెబ్బతోనే తయారౌతుంది అనే వాస్తవాన్ని ప్రకటిస్తాడు. అంతే కాదు ఈ సత్యాన్ని గ్రహించిన వేమనగారు కూడా ‘‘విశ్వకర్మ లేక విశ్వంబు మరిలేదు / కుడువ కూడు లేదువీ కోక లేదు’’ – అని తన పద్యాలలో చెప్తాడు.
ఈ సుత్తి దెబ్బ యొక్క మహిమను గుర్తించి నందుకేమో కమ్యూనిస్టులు కూడా తమ జండాకు కొడవలితో పాటు సుత్తిని కూడా జోడించారు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు కవి కపిలవాయి లింగమూర్తిగారు.
ఆంధ్రభోజుడు తన కావ్యంలో కమ్మరి వృత్తి చేయు పంచాననుల కొలిమి పనిలో (పాత్రలకు) కాగులకు ఇనుపముక్కలు వేసి అతుకు వేసే నేర్పును ఇలా వర్ణిస్తారు
‘‘అల పర్జన్యుడు భానుడు న్కొలిమిలో నభ్రంపుపెన్గొప్పెరన్‍
జలమాగన్‍ పిడుగుక్కు జాత్యపు టయస్కాంతపు నత్తున్కలో
పల జూపన్‍ మహిమీది లోహ రజముల్‍పై బర్వెనా లౌచె వా
త్వల ప్రాగ్దావమషుల్‍ మొగిల్‍ మొదలగ్రద్దంతై దివిన్‍
లేచినన్‍’’

నీటిని కాగబెట్టెటి కాగులను వేసవి కాలంలో ఉపయోగించక అవి తుప్పపట్టి చిల్లులు పడేవి. వాటిని వర్షాకాలం రాగానే తీసి ప్రజలు వాడుకుంటారు. లోహపు కాగులు వాడకంలేక తుప్పుపట్టి చిల్లులు పడుతుంటాయి. వాటిని కమ్మరి దగ్గరికి పోయి అతికించు కుంటారు. కమ్మరివారు ఆ కాగులకు ఇనుపముక్కలు వేసి అతుకుతుంటారు. ఆ సందర్భాన్ని కవి గుర్తు చేస్తూ కాగును మాటు వేయించడానికి వచ్చినవారిలో ఎవరైన కాస్తగట్టిగా అతుకు వేయమంటే ఆ కాగుకు అయస్కాంతం అంటుగల ముక్క వేస్తారు. అప్పుడది అయస్కాంతం కాబట్టి దానిలో అంతకుముందుంచిన ఇనుపరజను లోంచి ముక్కలు అంటుకుంటుంది.
యుద్ద సమయంలో రాజయొక్క శక్తిని పెంచేవి ఆకురాళ్ళతో రాసిన పదునైన ఆయుధాలు అవి పదునుగా లేకపోతే మొద్దులతో సమానం. భారత యుద్ధ సమయంలో ఓడిన దుర్యోధనుడు కుటుంబం పూర్తిగా క్షీణించింది. గెలిచిన ధర్మరాజు బంధువధ పాతకంచేత శాంతిలేక బాధపడుచున్నాడు. ఆ సందర్భాన్ని కవి ఇలా వర్ణిస్తాడు. ‘‘ఆకు రాయివలె కుశాగ్ర బుద్ధులను మ్రాకులు గుణములు కొరవడినంత’’ అంటు చురుకైన బుద్ధిగల వారికి మంచి గుణాలు లేకుంటే వారు మొద్దులతో సమానం. అందుకే బుద్ధికి పదును పెట్టె మంచి గుణాలు ఆకురాయి లాంటివని కవి అభిప్రాయం.
అలాగే వేములవాడ భీమకవి. చాటు పద్యాలు మన తెలుగు సాహిత్యంలో చాలా ప్రసిద్ధాలు. అటువంటి భీమ కవి చాటువులలో కమ్మరి కొలిమికి ఇంతి చోటిచ్చినారు. ఆనాటి సమాజంలోని కమ్మరి వృత్తి చేసేవారు కత్తులను తయారు చేయడానికి ఇనుము, ఒక కొలిమి, డాకలి, సమ్మెట, పట్టుకారు, అనే పరికరాలు సిద్ధం చేసుకొని వాటి సహాయంతో కత్తులను తయారు చేసేవారు. ఈ విషయాలను కవి తనచాటు పద్యంలో ఇలా వర్ణిస్తారు.
చ।। గరళపు ముద్ద లోహ మవగాఢ మహాని కోట్లు సమ్మెటల్‍
హరు నయనాగ్ని కొల్మి యురగాధిపు కోరలు పట్టు కార్లుది
క్కరటి శిరంబు దాయ లయకారుడు కమ్మరి వైరివీర సం
హరణ గుణాభి రాముడగు మైలమ భీమన ఖడ్గసృష్టికిన్‍

ఈ పద్యంలోని కవిత్వానికి ముగ్ధుడైన మహాకవి శ్రీశ్రీ ‘‘ఖడ్గసృష్టి’’కి ముఖతిలకంగా స్వీకరించాడు. అందుకే శ్రీశ్రీ తన మహా ప్రస్థానం. ‘‘పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంబున హేమం పండగా…’’ అంటారు. ఇలా వారి రచనలో కొలిమిపని దాగి ఉంది. వారి శ్రమ ఫలితమే బంగారు పంటలు. పొలాన్ని దున్నె పక్రియలో హలానికున్న కర్రు కొలిమి సృష్టియే అనే అంశం ఇందులో దాగి ఉంది.


ఇక కత్తుల విషయం చూస్తే పల్నాటి వీరచరిత్రలో ఇనుము మిశ్రమంతో తయారైన అనేక కత్తులు కన్పిస్తాయి. పూర్వం మన వాళ్ళు రాగి, ఇత్తడి, కంచు, పంచలోహం, ఇనుము, ఉక్కు అనే లోహాలతో కత్తులు తయారు చేసేవారు.
సంస్కృతాంధ్ర సాహిత్యాలలోను ఈ కత్తులు కన్పిస్తున్నాయి. వాటికి సంబంధించిన అంశాలు కావ్యాలలోనే కాదు శాసనాలలోనూ ఉన్నవి. వాటిలో కొండిపర్తి శాసనం దుర్జయ వంశానికి చెందినది, దీనిలో కాలూరి కాటసేనాని కత్తి వర్ణన ఉంది, దీనికే ఆఫి ధౌనువు, చురకత్తి అనే పర్యాయ పదాలు ఉన్నాయి. ఆపదలో ధర్మాన్ని రక్షించేది. విచక్షణ లేక ప్రాణాలు తీసేది ఈ కత్తి.
1. శ్లో।। యస్యస్సర్వ స్ఫుత యశసః శాతధారాసి ధేనుః
యద్వైరిణీం విబతి రుధిర మాంసమత్తి ప్రకామం
ఏషాం దృష్టం నయన యుగళే… వాగిన త్రిణంవా
సద్యఖ్యో భవతి విముఖే ధేను ధర్మం విహాయ
కొండిపర్తి శాసనం.
వర్థమానపుర శాసనంలో మల్వాల గుండయగారి కత్తివర్ణన ఉంది. శత్రువు తలని త్రుంచేది. అనే ఖడ్గయోగిని అని ఇక్కడ శాసన కర్త ప్రకటించారు.
‘‘శో।। పీత్వావైరి కళోదగ్ర నిర్గతం శాణశోణితం
ఉద్యమ త్యుజ్జ్వలాం కీర్తించిత్రం యత్థడయోగిని.
ఇలా శాసనాలలో కమ్మరి కొలిమిలో పదునుతీరిన కత్తుల వర్ణన ఉంటే ఇక కావ్యాలలో విద్యానాథుడు తన ‘‘ప్రతాపరుద్ర యశోభూషణం’’లో కాకతీయ ప్రతాపరుద్రుని కత్తిని తొమ్మిది (9) పద్యాలలో వర్ణించారు. ఈ వర్ణన చూసిన భట్టుమూర్తి తన ‘‘నరస భూపాలీయం’’తో ఓబయ నరసరాజు కత్తిని 16 పద్యాలలో వర్ణించారు.
ఇక్కడ కవి పూర్వం నదీ స్నానం వలన ఎంత పుణ్యం వస్తుందో యుద్ధంలో ఆ కత్తిచేత మరణించిన వారికి వీరస్వర్గం వస్తుందని ఒక పద్యంలో వర్ణిస్తే మరొకచోట కవి ఖడ్గాన్ని ‘‘ఓబయ నరసనాయకుని ఖడ్గ పుత్రికగా శత్రురాజుల కంఠాలను కౌగిలించుకొనే మోహనాంగిగా వారిని శాశ్వత నిద్రపుచ్చె దానిగా వర్ణిస్తాడు. ఇది కవి యొక్క చమత్కారం.
ఘనత నృసింహుని కరమున
దనరెడు నసినిజ సమగ్ర ధారాగ్రనిమ
జ్ఞన తత్పరులను నరులకు
వనిమిష బావం బొనర్చు ననవరతంబున్‍ (కావ్య-2-69)
ఇక్కడి కమ్మరి కొలిమి ఒక పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. ఇక్కడ తయారైన ఖడ్గం ఎందరో యుద్ధ వీరులకు వీర మరణాన్ని ప్రసాదించి పుణ్యనదీ స్నానం వలన కలిగే వీర స్వర్గాన్ని, పుణ్యాన్ని వారికి ప్రసాదిస్తుంది. ఇంకా ఇక్కడ కవి, యుద్ధరంగంలో ఓబయ నరసరాజు చేత కదిలే కత్తిని నటిస్తున్న నాట్యగత్తెగా, వశిష్టుని కత్తిగా కవి వర్ణించారు.
ఇంకా తెలుగు వారు ఖడ్గాన్ని నారాయణాంశగా భావిస్తారు. అందుకే ఖడ్గంతో చంపబడిన వారు స్వర్గానికి పోతారని హిందువుల విశ్వాసం. నేలాద్రి రాజు చేతి కత్తి స్వర్గంలోని రంభ కౌగిలికి చేర్చేదారని ప్రతాప రుద్రీయంలో కవి వర్ణిస్తాడు.
కత్తులను తయారు చేసే కొలిమిని ‘‘విక్రమ సేనం’’ అనే తన కావ్యంలో కవి చిమ్మపుడి అమరేశ్వరుడు ఇలా వర్ణించారు.
‘‘సీ’’ అరుణ పుష్పావళి నగ్నిగా సంధించి
– అళుల నుల్కలు గాగ నావహించి
దందడి వీతెంచు దక్షిణ పవనంబు
– భస్త్రానిలంబుగా పరిఢవించి
చిలుకలు పికములు చేదోడు సేయంగ
– మాధవుండను కనుమరి గడంగి
అంగజుడను పతి యానతి పని బూని
– మొగడలన్ములుకల మొనలు చరుచు
కొలిమి యొక్కొయనగ గురియు పరాగంబు
విస్ఫులింగములుగా విరహులలుక
నేచిపూచి యున్న యీ యశోక మహీరు
హమ్మ గంటె మాళవాధినాథ!
– చిమ్మపూడి అమరేశ్వరుని ‘‘విక్రమ సేనం’’లోని ఈ పద్యాన్ని శ్రీ ఆచార్య రవ్వా శ్రీహరిగారు తమ ‘‘అలబ్ద కావ్య పద్యముక్తావళి’’లో తెలిపినారు.
ఇదే పద్యాన్ని ‘‘స్వర్ణ శకలాలు’’ రచనలో కపిలవాయి లింగమూర్తిగారు వర్ణనలో దాగిన వివరణ కొలిమిని కవి అశోక వృక్ష వర్ణనతో పోల్చి విషయ విశ్లేషణ చేసినారు.
వసంత మాసంలో పుష్పించే అశోక వృక్షం మొగ్గలు పూలతో కలకలాడే ఆ చెట్టు పూలలోని మకరందం కోసం వచ్చే తుమ్మెదలు, అలలుగా వీచేగాలి, ఈ దృశ్యాన్ని కవి కొలిమి పని చేస్తున్న కమ్మరిని వసంతునిగా కొలిమిని అశోక వృక్షంగా ఇందులోని ఉల్కలు తుమ్మెదలుగా (బొగ్గులు) పొగలు అలల తరంగాలుగా కవి వర్ణించారు. తెలుగు సాహిత్యంలో కవులెందరో వర్ణించారు కాని అశోక వృక్షాన్ని కమ్మరి కొలిమితో ఎవరు వర్ణించలేదు. (ఈ కీర్తి ఒక్క అమరేశ్వరునిదే).
ప్రబంధరాజ వేంకటేశ్వర నిజ విలాసం అనే కావ్యంలోగణపవరపు వెంకటకవి చిమ్మపుడివారిని అనుకరించారు. తెలంగాణాలో కొన్ని ప్రాంతాలలో కొలిమిని దాతి అనికూడా అంటారు. ఈ కొలిమి పనిలో ఉపయోగించే పట్టుకార్లు పరిచయం చేస్తూనే కవి రాత్రి వేళలలో కన్పించే కొలిమి మంటకు పైకి మెరిసే కణాలను మిణుగుర్లుగా వర్ణిస్తారు.


చిమ్మపుడివారు కొలిమి అశోక వృక్షంగా వర్ణిస్తే గణపవరపు వేంకటకవిగారు సామాన్యంగా అందరికి కన్పించేందుకు చెట్టుతో వర్ణించి తన లోకజ్ఞతను చాటారు. ‘‘వేంకటేశ్వర నిజ విలాసం’’ కావ్య రచన తరువాత ఒక సీస పద్యంలో కవి కొలిమి పెట్టుకున్న కొలిమి పనిచేసే కమ్మరివారిని వర్ణించారు. అందులో కవి విశబ్రాహ్మణ కులంలో కుల వృత్తిచేసేవారు సంవత్సరానికి మూడు రోజులు తమ పనిముట్లన్ని కడిగి చమురు రాసి తుప్పు పట్టకుండా పూజా పీఠంపై పెట్టి కాళిమాతను ఆవాహన చేసి పూజ చేస్తారు. ఆ తరువాత శూన్యతిథి కాకుండా తదియనాడో పంచమినాడో మళ్లీ కొలిమి పని ప్రారంభిస్తారు. ఇటువంటి ఒక సాంప్రదాయాన్ని కూడ కవి ఈ గ్రంథంలో వర్ణిస్తారు. ఉగాది తరువాత వ్యవసాయదారులు తమ వ్యవసాయ పనులు కొత్తగా ప్రారంభిస్తారు. అందుకే వ్యవసాయ పనులకు కావలసిన పలుగులు, పారలు, గొడ్డండ్లు, కొడవండ్లు, కఱ్ఱులు కొలిమి దెగ్గర చరిపించుకుంటారు. కాబట్టి కమ్మరి కొలిమి పెట్టేదే మొదలు, కొలిమి పనితో, విశ్వబ్రాహ్మణ కమ్మరి వారికి పనిలో తీరికే దొరకదు. అందుకే వీరు ఉగాదికి ముందు మొదలు ఉగాది నాటికి పనిముట్లతో కూడిన కాళిపూజను పూర్తిచేస్తారు.
అంతేకాదు ఋతువులలో మొదటి ఋతువు వసంతం, విశ్వకర్మలలో మొదటి బ్రహ్మ మను బ్రహ్మ, మొదటి వృత్తి కమ్మరం, తన కావ్యంలో కవి వసంతుని కమ్మరితో పోల్చి వర్ణించడం లోకజ్ఞతకు అద్దం పడుతుంది.


-యలగందుల కనకదుర్గ
9493558030

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *