అనేక బాధలను తట్టుకున్న మానవజాతి : కె.బి.గోపాలం

సైన్స్ రచయిత కె.బి.గోపాలం గారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ

ప్రముఖ సైన్స్ రచయిత, అనువాదకులు కె.బి.గోపాలం డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి, తరువాత ఆకాశవాణిలో సైన్స్ ఆఫీసర్‍గా, అసిస్టెంట్‍ స్టేషన్‍ డైరెక్టర్‍గా, స్టేషన్‍ డైరెక్టర్‍గా, డిప్యుటీ డైరెక్టర్‍గా వివిధ హోదాలలో హైదరాబాదు, ఆదిలాబాదు, న్యూఢిల్లీ కేంద్రాలలో పనిచేశారు. కరోనా విపత్తుపై మే మాసంలో దక్కన్‍ ల్యాండ్‍కు వారు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు.


కరోనా సమయంలో మీకు కలిగిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?
దీనిమీద ఒక పుస్తకం రాయాలి. రెండు లక్షల సంవత్సరాల నాడు మానవ జాతి పుట్టింది. ఆ నాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఉత్పాతాలు వచ్చినాయి. లక్ష సంవత్సరాల నాడు వచ్చిన ఐస్‍ ఏజ్‍ కొంత కాలం పాటు ప్రపంచ మంతా చల్లబడి పోయింది. ప్రపంచ మంతా మంచుతో కప్పబడిపోయింది. అయితే మనిషి జాతి మాత్రం పోలేదు. మనిషి ఐస్‍ఏజ్‍ వచ్చినప్పుడు సముద్రాలు గడ్డ కట్టి నీళ్ళు తక్కువైన సందర్భాన్ని వాడుకొని మనిషి రకరకాల ప్రదేశాలకు వలస పోయినాడు. నేనేం చెబుతున్నానంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు, వరదలు, చివరికి ఐస్‍ఏజ్‍ వచ్చిన సరే మనిషికి హాని చాలా తక్కువ జరిగింది. ఎక్కువ నష్టం ఎప్పుడు జరిగిందంటే మనిషి కారణంగానే జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మొత్తం యుద్ధం జరిగిన ఆ నాలుగు, నాలుగున్నర కాలంలో ఐదు నుంచి ఎనిమిది కోట్ల మంది చనిపోయారు. ఇవాళ లెక్క తీయండి, మానవజాతి జనాభా ఎంత, దాంట్లో కరోనా వల్ల చనిపోయిన వాళ్లు ఎంత, కరోనా ఇన్ఫెక్షన్‍ వచ్చిన వాళ్లు ఎంత, దీనికి భయపడాలా, భయపడనవసరం లేదు. అయితే ఇవాళ ఉన్న సాంఘిక పరిస్థితుల కారణంగా ఈ సమాచార ప్రపంచం కారణంగా, ప్రపంచం ఏదో ఒక మూలన ఒక చిన్న విషయం జరిగితే క్షణాలో అందరికి తెలిసిపోతుంది. దీని కారణంగా అందరిలోను ఇంతకు ముందు ఏనాడులేని ఒక భయం తయారయింది. ఇన్ని బాధలలోనుంచి తట్టుకుని వచ్చిన మానవ జాతి తుడిచిపెట్టుక పోతుంది, మరేదో అయిపోతుంది అంటే నమ్మలేం. కానీ మన జాగ్రత్తలో ఉండాలి. ఎంతసేపు ఈనాగరిక ప్రపంచం పట్టణాలలో ఉండేవారిని గూర్చి మాట్లాడుతుంది. కష్టపడుతున్నది బీదవాడు, కూలికోసం అని పల్లె వదిలి బయటికి వచ్చిన వాళ్లు వందల కిలోమీటర్లు నడిచిపల్లెలకు పోతున్నారట. వీళ్లను గురించి ఆలోచించాలి. రేపు పొద్దున వీళ్లు ఏమౌతారు. విచిత్రమైన పశ్న. వర్కింగ్‍ ఫ్రం హోం అని కొంతమందికి వీలు అవుతుంది. అందరికి వీలు అవుతుందా, అన్ని సమయాలలో వీలు అవుతుందా దీని గురించి ఆలోచించాలి. వైన్‍షాపులు, పాన్‍ షాపులు లేవు, సిగరేట్‍లు దొరకటం లేవు. ఇవన్నీ లేకుండా కూడా బతకొచ్చని తెలిసింది. రేపు పరిస్థితి మామూలు అయిన తరువాత కూడా వీటిని ఆపేస్తే ఏమౌతుంది. బజారులో తిరుగనవసరం లేదు. కనిపించే వస్తువు కొననవసరం లేదు, బజారులో దొరికే తిండి తిననవసరం లేదు ఇలా ఎన్ని విషయాలు తెలిసినాయి. ఇలాంటివి మున్ముందు కూడా ఇంకెన్ని విషయాలను మనం ఈ అనుభవం ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లాగే మనదేశంలో స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానికి తరువాత అని చెబుతారు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలోను కరోనాకు ముందు కరోనా తరువాత అని చెబుతారు. ఈ కరోనా మనకు కొత్తగా రాలేదు.


ప్రజలు ఇలాంటి వైరస్‍లకు భయపడాల్సిన అవసరం ఉందా? ఒకవేళ కరోనా వచ్చి ఎలాంటి లక్షణాలు కూడా కనబడుటలేదు. దానికి మీరు ఏమంటారు?

బయాలజీ బాగా చదువుకున్న వాణ్ణి. డాల్మన్‍స్టేట్‍ అని ఒకటి ఉంటుంది. ఈ లక్షణం కనిపించిందా, కనిపించలేదా అనే దాని కంటే నీ శరీరంలో రోగ నిరోధక శక్తి ఏ స్థాయిలో ఉన్నది అనేది అతి ముఖ్యమైన విషయం. వయోవృద్ధులు డెభ్బై ఏండ్లు పైబడిన వాళ్లు మామూలుగానే అన్ని రకాలు రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఉంటుంది. లక్షణాలు బయట పడలేదు అన్నంత మాత్రాన జబ్బలు తరుచుకుని మనం ఊరిమీద తిరిగితే కొంప మునుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన వ్యాప్తికి ఒక వర్గానికి చెడ్డపేరు పెట్టారు. వాళ్ల వల్ల జరిగింది అంటున్నారు. మిగిలిన వాళ్లకు ఎందుకు వచ్చింది అని ఆలోచించట్లేదు. దీని గురించి సైన్స్ ప్రకారం సిద్ధాంతాలు చెప్పటానికి లేదు. ఇది మొదటి అనుభవం. సైన్స్లో ఇక మీద ఏం జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు పట్టించుకోని వారు కూడా పరిశోధనలు చేస్తారు.
ఇదివరకు ప్లేగు, కలరా వచ్చి వందల కొద్ది శవాలు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎన్ని హాస్పటల్స్, ఎంత వైద్య సదుపాయం. ఇది ఎప్పుడు మామూలు అవుతుందో చెప్పలేం. మసీదులో పోయే ముందు గాడిదను కట్టేసి పో లేకపోతే నీవు మళ్లీ వచ్చేసరికి గాడిద లేకపోవచ్చు అన్నాడు ఒకపెద్దాయన. ఎంత బాగా చెప్పాడు ఆ పెద్దాయన. తీసుకోవల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం జరుగుతున్నది అనేదాన్ని ఆలోచించాలి తెలిసిన వాళ్లు చెబితే అవును కదా వినడం నేర్చుకోవాలి. మీకు ఆలోచన వచ్చిదంటే చాలా మంది ఆలోచించ కుండా బతుకుతారు. ఆలోచించకపోతే ఈ ప్రపంచం ముందరికి ఎట్లా పోయింది. కరోనా వచ్చి మనకు ఒక కొత్త బతుకును చూపించింది.

ఇంతకు ముందు కొన్ని వైరస్‍లు వచ్చినాయని తెలుసు. ఇట్లాంటి వైరస్‍లకు మున్ముందు గానీ పరిశోధనలు అంత పటిష్టంగా ఎందుకు జరగట్లేదు?
చాలా బ్రహ్మాండంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్‍ను ఏమీ చేయలేము. అది రూపాలు మారుతుంది. నేషనల్‍ ఇన్సిట్యూట్‍ ఆఫ్‍ వైరాలజీ అనేది ఒకటి ఉంది. మనదగ్గర బయలాజీ సబ్జెక్ట్ మీద ఎవరికి తెలియని ఒక ఇన్సిట్యూట్‍ ఉంది. వెక్టర్‍ బయాలజీ రీసెర్చ్ ఇన్సిట్యూట్‍ (విబిఆర్‍ఐ) అని ఉంది. ఏ జంతువుల ద్వారా లేదా మిగతా ప్రాణుల ద్వారా ఎట్లా వ్యాధులు వ్యాపించుతాయని పరిశోధనలు జరుగు తున్నాయి. ఇది అనుకోకుండా ఒక్కసారిగా బయటికి వచ్చింది. ప్రపంచంలో ప్రయాణ సౌకర్యాలు ఎక్కువగా పెరిగాయి. ప్రయాణ సౌకర్యాలతో పాటు అవసరాలు కూడా పెరిగాయి. హ్యూహాన్‍లోని వాళ్లందరు ఇటలీలో వచ్చి అక్కడి బట్టల పరిశ్రమలో పనిచేస్తున్నారు. వాళ్లందరికి కొత్త సంవత్సరానికి గాను నెల రోజులు సెలవు ఇచ్చినారు. వాళ్లందరు వ్యూహాన్‍కు పోయినారు. పోయి వైరస్‍ ఎక్కించుకుని తిరిగి వచ్చినారు. కనుక ఇటలీలో ఎక్కువ వచ్చింది.


కరోనా-2, కరోనా అనేది క్రిమిపేరు. కరోనా -1 జలుబు, కరోనా -2 అంటే ఇప్పుడున్న కరోనా పరిశోధన జరుగుతుంది. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర కొంతమంది టీకా మందు వస్తుంది, వ్యాక్సిన్‍ వస్తుంది అంటున్నారు. ఒక వ్యాక్సిన్‍ తయారు అవటానికి సంవత్సరాలు పడుతుంది. తయారు అయిన తరువాత ప్రజలకు అందటానికి ఎన్ని పరీక్షలు జరగాలో జరుగుతాయి. దీని మీద ఎన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయో తెలుసా. లాంగ్‍ టర్మ్ స్టడీస్‍ అని ఉంటాయి. ఈ వ్యాక్సిన్‍ వేసినాక ఏమౌతుందో చూడాలి. పరిశోధనల గురించి అందరు ఆలోచించిస్తున్నారంటే ఆనందంగా ఉన్నది. ఇన్ని రోజులు సైన్స్, పరిశోధన, వైరస్‍ దాని గురించి మనకెందుకు అనుకున్న వాళ్లకు కూడా ఇవాళ సైన్స్ సమాధానాలు చెబుతున్నది. ప్రపంచాన్ని కాపాడగల్గింది ఏదన్నా ఉంది అంటే అది సైన్స్. మిగతాది వ్యక్తిగతం. సైన్స్ వెరీ ఓపెన్‍, యూనివర్సల్‍. తరాల వెంబడి, సంవత్సరాల వెంబడి ఒక సామూహిక జీవనానికి సరపడ ఒక సమాజాన్ని, దానికి సరిపడిన మిగతా వనరులు, విషయాలు నిర్మించుకున్నాం.


ప్రకృతిని కాపాడక పోవటం వల్లనే ఈ వైరస్‍ వ్యాపించింది అంటారు?

మానవుడు రెండు లక్షల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు. కానీ ప్రకృతి ఈ రెండు లక్షల సంవత్సరాల కంటే ముందు నుండి ఉంది. మనిషి మధ్యలో వచ్చినాడు, ఉన్నాడు. ప్రకృతి ఎవరిని కాపాడదు. ప్రకృతిని ఎవరు కాపాడరు. ప్రకృతి తనను తాను కాపాడుతుంది. ప్రకృతి తనకు తాను చుట్టుప్రక్కల పరిస్థితులను బట్టి కంటిన్యూ అవుతుంది. ఒకప్పుడు మొదట్లో ఉన్న మొక్కలన్ని ఆక్సిజన్‍ అంటే తెలియక కార్బన్‍డయాక్సైడ్‍తో బతికేవి. ఆ తరువాత ఆక్సిజన్‍తో బతకడం మొదలు పెట్టాయి. ఆతరువాత రేపు పొద్దున ఎట్లాంటి మొక్కలు వస్తాయో. ప్రకృతిని పాడు చేయకుంటే చాలు. పరిరక్షించేది నీవు కాదు.


ఇమ్యూనిటీ పవర్‍ను పెంచుకోవాలంటే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి?
వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడము అంటే ఆరోగ్యంగా ఉండటం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి, పనికిరాని తిండి అక్కర్లేదు. చలాకీగా ఉండేటందుకు శరీరానికి కావల్సినంత శ్రమ ఉండాలి. మన తిండి విషయంలో విచిత్రమైన అలవాట్లు, కోరికలు, పద్ధతులు ఉన్నాయి. రోజులో రెండుసార్లు తినేది. మిగతా సమయమంతా తినకుండా ఉండేది. శరీరంలో చక్కెర నిలకడగా ఉండాలంటే ప్రతి మూడు గంటల కొకసారి కొంచెం తినాలి. వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడం అంటే స్థూలంగా ఒకే మాట ఆరోగ్యాన్ని కాపాడుకోవటం. ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నవాడికి ఎదీ జరగదు. ఇట్లాంటి క్రిములు, వైరస్‍లు వస్తే జాగ్రత్తగా ఉండగల్గుతాడు. తప్పుడు అలవాట్లవల్ల, పద్ధతుల వల్ల, వీక్‍నెస్‍గా ఉంటే జబ్బు వచ్చిదంటే మరింత వీక్‍నెస్‍ జరగదా. వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు మార్గాలు మంచి తిండి, నిద్ర, శ్రమ, మంచి వాతావరణంలోఉండాలి, కలుషిత వాతావరణంలో ఉండకూదడు ఇవన్నీ ఉన్నాయి. మామూలు ఆరోగ్య సూత్రాలు కూడా ఇవే కదా అది గుర్తించాలి.


ప్రపంచ దేశాల మధ్య సంబంధాలపై కరోనా ప్రభావం ఎలా ఉండబోతుంది?

ఒకదేశంలో ఈ వ్యాధివలన ఒకరకమైన ప్రభావం, ఇంకొక దేశంలో ఇంకోక రకమైన ప్రభావం ఉండి తేడాలు కన్పించి ఉంటే సంబంధాలు ఏమన్నా క్రింద మీద అయ్యేదేమో. ఇప్పుడు అందరు ఒకచోటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. తొందరగా జాగ్రత్తలు తీసుకున్న దేశాల్లో బాగుపడ్డారు. వాళ్ల దగ్గర ఎక్కువ మరణాలు లేకుండానే బాగున్నారు. ఇంకో దేశం బీదగా ఉంది. లేదా వాళ్లకు వనరులు తక్కువగా ఉన్నాయి. లేకుంటే వాళ్లకు ముందుగా తెలియలేదు. మిగతా వాళ్లందరు కూడా వాళ్లకు సహాయం చేస్తారు. ఇంతకంటే సంబంధాలు ఏమీ మారవు. ఏదేశంలో ఉన్నా మనిషే కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ఇకమీద కూడా అట్లాగే ఉంటాయి. అయితే ఆర్థిక సంబంధాలు మాత్రం మారతాయి. మనదేశంలోనూ ఆర్థిక పరిస్థితి మారుతుంది.


ఈ కరోనా పరిస్థితులలో ఇమ్యూనిటీ పవర్‍ పెంచు కోవడానికి మాంసం, గ్రుడ్లు తినాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇమ్యూనిటీ పవర్‍ కూరగాయలలో ఉండదా?
మాంసంలోను, గుడ్డులోను మాంసకృతులు (ప్రొటీన్‍లు) ఎక్కువగా ఉంటాయి. వెజిటేరియన్‍ తిండి తినేవాళ్లకు ఇంతెత్తు అన్నం కుప్పపోసుకుని, లేకపోతే రొట్టే వేసుకుని దానిలో కొంచెం పచ్చడి రాసుకుని తినటం అలవాటు. ప్రోటీన్‍ తినటం అలవాటు లేదు మనకు. గ్రీన్‍రెవల్యూషన్‍ అని బియ్యం పండిస్తున్నాం. నిజమే ఈ బియ్యానికి సరిపడా పప్పులు, వేరుశెనగలు, నువ్వులు, ఇవన్నీ పండిస్తున్నామా. దీని గురించి ఎవరు ఆలోచించ లేదు. సరిఅయిన తిండి ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం కావాలి. కోడి గుడ్డులో ప్రోటీన్‍ ఉంటుంది. గుడ్డంత పరిణామంలో పల్లీలు తిన్నా కూడా గుడ్డు తిన్నంత ఫలితం వస్తుంది. అన్నం అంతా చెక్కర. అన్నంతిని ఉరకుంటే సరిపోదు. మాంసకృత్తులతో కూడిన తిండి కావాలి. మాంసం, గుడ్డు తినగల్గితే తిను. లేకపోతే పండ్లు, కూరగాయలు, వేరు శెనకాయలు తిను. బెల్లంలో బోలెడు ప్రోటీన్‍లు, కార్బోహైడ్రేట్స్, ఐరన్‍ తదితరాలు ఉంటాయి. అందువల్ల అందరు సంతోషంగా బెల్లం, పల్లీలు తినండి. ఎవరి స్థోమతను, అలవాటును బట్టి వారు సమతుల ఆహారం తీసుకుంటారు.


రాబోయే రోజులలో విద్యారంగం, పర్యాటక రంగం, రవాణా వ్యవస్థలోను ఎటువంటి మార్పులు ఉంటాయి?

పరిస్థితులు మామూలు స్థితికి వచ్చినాయని చెప్పడానికి చాలా రోజులు పడుతుంది. బయటికి రావటానికి భయపడుతున్నారు. పర్యాటక రంగం, ప్రయాణాలు, సినిమా, సూపర్‍ బజార్‍ ఇలా చాలా విషయాలలో ఈ భయం కొంత కాలం పాటు అందరి మనస్సులోనూ ఉంటుంది.

వాహనాలు ఎక్కువ పెరిగితే పర్యావరణానికి కాలుష్యం అనేది ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది?
కరోనా వచ్చిందని ఇంత భయపడి, ఇంత జాగ్రత్త పడుతున్నాం కదా. కార్బన్‍ మోనాక్సైడ్‍ పొల్యూషన్‍ విషయంలో కూడా ఈ రకంగా భయపడి జాగ్రత్త పడితే బాగుండు. అవసరమైతే తప్పించి వాహనాలు తీసుకుని బయటికి పోకూడదని ఎవరు చెప్పాలి. కరోనాను వచ్చే భూచి, వచ్చే భూచి అని భూతద్దంలో చూపించితే తలుపులు పెట్టుకున్నాం. ఇంతకంటే భయంకరమైన భూచి వాహనాల పొల్యూషన్‍, పెట్రోలు వాడినందుకు వచ్చే పొల్యూషన్‍ కరోనా కంటే చాలా భయంకరమైన భూచి. పొల్యూషన్‍తో ప్రతి వాడు ప్రమాదం చెందుతాడు. ఊపిరి తీసుకున్న ప్రతి వాడి ఊపిరితిత్తులోను ఆ మురికి చేరుకుంటుంది. ఈ రోజు వాహనాలు లేవు కనుక హైదరాబాద్‍లో గాలి ఎంత మారింది. కనుక ఇక మీదట అవసరం ముంటే తప్ప తిరగము అనుకుంటే ఎంత బావుంటుంది. కరోనా లాంటిది మరొకటి రాదు అనే గ్యారంటీ ఎవరు చెప్పలేరు. వాహనాలు లేకపోతే సిటీ ఎంత బావుంది. అంటే వాహనాలు తక్కువైతే బాగుంది అని తెలిసింది. ఇవాళ ఎందుకు ఇంటికి నాలుగు కార్లు, నాలుగు స్కూటర్లు అవసరం లేదు. మనకు ఒక అనుభవం కల్గింది. ఈ అనుభవం ఆధారంగా మరొక ప్రపంచాన్ని నిర్మించుకోవటానికి మార్గాలు వెతుక్కుని ముందుకు నడవాలి.


అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన దేశాలు కరోనాను ఎందుకు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాయి?
అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందని దేశం అంటే, ఆర్థికంగా బావున్న దేశం, ఆర్థికంగా బాలేని దేశమని. అభివృద్ధి అన్నది కేవలం ఆర్థిక, సామాజిక అభివృద్ధి కాదు. అన్ని రకాల అభివృద్ధి చెంది ఉండాలి. ఒక సార్వజనీనమైన, ప్రాపంచిక మైన, విశ్వజనీనమైన దృష్టిని డెవలప్‍చేసుకునే పరిస్థితికి ఇప్పుడు మంచి మార్గం ఏర్పడింది.


వ్యూహాన్‍లో వైరస్‍ వచ్చిందని డిసెంబర్‍లో మనకు ప్రకటన వచ్చింది. దాని తరువాత మన భారతదేశంలో 70 రోజుల తరువాత లాక్‍డౌన్‍ పిరియడ్‍ విధించారు? అన్ని రోజులు ప్రభుత్వం ఏం చేస్తుంది?
మనదగ్గర లిమిట్‍ దాటుతున్నది ఇక్కడ కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది అనగానే లాక్‍డౌన్‍ ప్రకటించారు. మనదేశంలో, మనరాష్ట్రంలో నిజంగా చాలా చక్కగా రియాక్షన్‍ వచ్చిందని నాకు అనిపిస్తుంది. డాక్టర్లు, పోలీసులు ఎందుకు బయట పడుతున్నారు. వాళ్ల దగ్గర అంతో ఇంతో ఉంటుంది కదా తినటానికి. కాదు నేను చేయకపోతే మరేవరు చేస్తారని బయటికి వస్తారు. మనకు ఇవాళ ఈ సంగతి అర్థం అవుతున్నది.


ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి?
ప్రపంచం ఉన్నట్టు ఉండి ఒకసారి మారదు, మారలేదు. మార్పు క్రమంగా ఉంటుంది. రేపటి ప్రపంచం కొంతకాలం వరకు అనుమానాల ప్రపంచంగా ఉంటుంది. కరోనా ఎంత భయపెట్టిందో, అంతకాకున్నా అంతవరకు భయపెట్టగలిగే సమస్యలు మరిన్ని మన ముందు ఉన్నాయి. అన్నింటి కంటే ముఖ్యమైనది ఆకలి సమస్య, బీదరికం అయితే రేపటి ప్రపంచం కొత్తగా ఉంటుంది అనే గ్యారంటీ చెప్పలేము. రాను రాను మనిషికి, మనిషికి మధ్యన కొంత దూరం పెరుగుతుందని అనుకోవచ్చు. వచ్చిన విషయాలనే నమ్మే పరిస్థితి వస్తుంది. కానీ ఎవరు ఏదీ చెప్పినా వెంటనే నమ్మే ప్రపంచం పోతుంది. నీవు చెప్పిన మాటకు ఆధారం ఏమి, నీవు చెప్పిన మాట నేను ఎందుకు నమ్మాలి అన్న ప్రపంచం వస్తుంది. సంస్థలు, పద్ధతులు అందరు పాటించే విధానాల మీద నమ్మకం పెరుగుతుంది. సైన్స్ మీద మనిషికి నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే సైన్స్ చెప్పిన సత్యాల మీదనే మనం కరోనాతో ప్రపంచ యుద్ధాన్ని చేస్తున్నాం. ప్రపంచంలో ఒక కొత్త ఆర్ధ్రత, ఒక కొత్త ఆలోచన. విశ్వసనీయత అనే ఆలోచన పెరుగుతోంది. ఇనోవేషన్స్ ఎక్కువ అవుతాయి. ఆన్‍లైన్‍ పద్ధతి, ఆన్‍లైన్‍ బిజినెస్‍, క్లాసులు, బ్యాంకు సౌకర్యాలు, ఆరోగ్యం, ఫుడ్‍డెలివరీ, పల్లె పల్లెకు ఇంటర్‍నెట్‍, ఐటీ ఇండ్రస్టీలో వర్క్ ఫ్రం హోం, ఒక కొత్త ఆలోచనల ప్రపంచం ఉంటుంది. ఒకరిమీద మరొకరు ఆధారపడి ఉండే ప్రపంచం మనిషి ధోరణిలో మార్పు కనపడుతుంది.

ప్రైవేట్‍ రంగంలో విద్యా సంస్థలు వాళ్లకున్న ఇన్‍ఫ్రాస్టక్చర్‍ చూసుకుంటే స్కూలు విధానంలో ఏ విధంగా క్లాసులు నడపబోతారు?
ఎంతమంది దగ్గర కంప్యూటర్లు ఉన్నాయి. కంప్యూటర్లు ఇచ్చి నీవు ఇంటికి పోరా, ఇంట్లో పాఠం చూడరా అంటే వాడు దాంట్లో మరేదో చూస్తాడు. విద్యారంగం అంత తొందరగా మారబోదు. వెనుకటి మన భారతీయ తత్వంలోనే పాదం సబ్‍ బ్రహ్మాచారి నహణ్‍ గురువుగారు చెప్పే విద్య పావు భాగం మాత్రమే, మిగతా పావు భాగం నీ స్నేహితులతో కలిసి వస్తుంది అంటున్నారు. గవర్నమెంట్‍ స్కూల్స్ మూస్తారంటే జరగదు. అది పద్ధతి కాదు.

ఇప్పుడున్న సందర్భంలో మనం మైగ్రెంట్‍ వర్కర్లను చూస్తున్నాం. మున్మందు రేపటి రోజులలో మైగ్రెంట్‍ వర్కర్లలకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?
పని కోసం ఇల్లు వదిలి బయటికి వచ్చిన వాడికి కష్టం అయింది. ఇంతకు ముందు ఇలా జరగలేదు. ఈ సమస్య చాలా తొందరగా సమసిపోతుంది. లేకపోతే పనిచేసేవాడికి, పని ఇచ్చేవాడికి ఇద్దరికి జరగదు. ఇప్పుడు వీళ్లు ఒక్కరికే కాదు. తక్కువ ఆదాయం ఉన్న వాళ్లందరికిను ఈ సైకాలజీ మొదలౌతుంది. కష్టకాలం వస్తే డబ్బులు లేకుంటే చాలా కష్టంగా ఉంటుంది. కనుక కొన్ని డబ్బులు దాచుకోవాలి. మొత్తం తింటే పనికిరాదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా కొన్ని పైసలు దాచిపెట్టు కోవాలి. చీమ మాదిరి తిండి వస్తువులు పక్కన పెట్టుకోవాలి.


మనదేశ ఫెడరల్‍ వ్యవస్థ ఎలా ఉండబోతుంది?
ఏమి కాదు, మనదేశం ఇట్లాగే రాయిలాగా ఉంటుంది. ఈ ఫెడరల్‍ వ్యవస్థకి ఏనాడు తేడా రాదు. తేడా లేదు దీనికి. ఎందుకంటే ఇది ఇంత చిన్న వాటికే కదిలే వ్యవస్థ కాదు మనది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదన్నా వైరస్‍ వస్తేనే ప్రభుత్వాలు హాస్పిటల్స్ మొదలు పెట్టటం గానీ, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు రాకుండా మున్ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇది కరువుకు సద్దులు కట్టడం అనే మాట ఉండేది. మేము చిన్నగున్నప్పుడు కరువు వస్తుందని ఇవాల్టి నుంచే కట్టి పెట్టాడంట ఉట్టి మీద. కరోనా వచ్చింది, కరోనా వస్తే హైడ్రాక్సిక్లోరోక్విన్‍ కావాలి కొత్తగా రాబోయే వైరస్‍కి ఏ మందుకావాలో ఎలా చెబుతాం. వచ్చినప్పుడే చేస్తారు. ఇక్కడ ఎవర్నీ తప్పు పట్టేది లేదు. దేనికని హాస్పటల్స్ కడతావు, దేనికని రీసెర్చ్ చేస్తావు. రీసెర్చ్లో కొన్ని ప్రయరిటీస్‍లు ఉంటాయి. ఇప్పుడు ముందుగా ఉన్న సమస్యలు ఎక్కడికి పోవాలి. మనదగ్గర సమతుల ఆహారం పెద్ద సమస్య. బీదవాళ్ల పిల్లలకు సమతుల ఆహారం దొరకట్లేదు. దాని గురించి ఆలోచిద్దామా, మంచి పంటలు పండించటం గురించి ఆలోచిద్దామా. లేకపోతే రేపు కోవిడ్‍ వస్తుంది. ఎల్లుండి ఇంకేదో వస్తుందని ఆలోచిస్తామా? ఇది కరెక్ట్ కాదు. అవసరం కొద్ది చేసేవి కొన్ని ఉంటాయి. ప్రణాళిక కొద్ది ఒక పద్ధతి ప్రకారం సమాజాన్ని, మొత్తం దేశాన్ని పరిశీలిస్తు చేసేవి కొన్ని ఉంటాయి. ఎమర్జెన్సీ అవసరం కొద్ది చేసేవి కొన్ని ఉంటాయి.   (సచిన్‍, మల్లేష్‍ – దక్కన్‍ ఛానల్‍ ఇంటర్వ్యూ ఆధారంగా)


ఎసికె. శ్రీహరి, ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *