అన్నీ ప్రభుత్వాలే చేయాలను కోకూడదు పౌరులు ఉత్పత్తిదారులు కావాలి : చెలికాని

సాంఘిక – ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్న చెలికానితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ

సాంఘిక-ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వెంకట భూసుర జగన్నాధరావు (రావు వి.బి.జె.) చెలికానిగా పాఠకులకు సుపరిచితులు. వీరు భారతదేశంలో నివాస సంక్షేమ సంఘాలను రూపొందించడానికి ఎంతో కృషి చేశారు. అవి ఇప్పుడు భారత రాజకీయాలలో నాల్గవ శ్రేణి స్వపరిపాలనగా అంగీకరించబడుతున్నాయి. యునెస్కోతో, ఇంటర్నేషనల్‍ ఫౌండేషన్‍ ఆఫ్‍ హ్యూమన్‍ డెవలప్‍మెంట్‍, సీనియర్‍ సిటిజన్స్ సమాఖ్య తదితర సంస్థలలో పనిచేస్తున్నారు. కోవిడ్‍-19పై చెలికాని గారు దక్కన్‍ల్యాండ్‍కు ఏప్రిల్‍ మాసంలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలు.

కరోనాలాంటి విపత్కర పరిస్థితికి కారణాలేమిటి?
రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి ప్రకృతిలోనే సహజ సిద్ధంగా ప్రపంచం చాలా మారుతుంది. సంఘానికి చాలా అవసరాలున్నాయి కాబట్టి ప్రకృతిని మనం బాగా మారుస్తున్నాము. అందుచేత సహజ సిద్ధంగా రావొచ్చు. రెండోది మానవ కల్పితం కూడా కావొచ్చు. అంటే మనం రకరకాల పరిశోధనలు చేస్తున్నాం. మంచికో చెడుకో రసాయనికమైనటువంటి ఆయుధాలను కూడా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ పరిస్థితుల్లో ఏదైనా ఒక మాలిక్యూర్‍ ల్యాబోరేటరీ నుండి బయటికి వచ్చి ఈ ప్రమాదాలకు కారణం కావొచ్చు. ఈ రెండు కూడా కావొచ్చు. చైనా చేస్తున్న రసాయనిక పరిశోధనల దృష్ట్యా వచ్చి ఉంటుందేమో అని అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఆధారం లేదు.

ప్రజలు, ప్రభుత్వాలు ఏ మేరకు ఈ విపత్కర పరిస్థితులను తట్టుకోగల్గుతున్నాయి?
ప్రభుత్వం ఒక పరిష్కారం అంటూ ప్రపోజల్‍ చేయలేదు. ప్రజలు అప్రమత్తం కావాలి. ఇప్పటికే కాదు మున్ముందు కూడా రకరకాల సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అందుచేత ప్రజలు కూడా ఎవరికి వారు పరిస్థితులకు తగ్గట్టు తయారు కావాలి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు క్రమశిక్షణ, సాంఘిక స్వయం నియంత్రణ పాటించటం నేర్చుకోవాలి.

ప్రభుత్వాలు వైద్యరంగంలోను, శాస్త్ర సాంకేతిక రంగాల్లోను అనుసరించవలసిన ప్రణాళికలు ఏమిటి?
ఈ విషయం చాలా ప్రముఖమైనది. కాకపోతే ఏదో వైరస్‍ వచ్చినప్పుడో, ఇలాంటి ఆపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడో చర్యలు తీసుకోవడంతో సరిపోదు. ప్రభుత్వం నిత్యం చేసేటటువంటి కార్యక్రమాలే ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు తట్టుకోవడానికి వీలుగా ఉండాలి. ఆపత్కాలం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం మిగతా అన్ని పనులు మానేసి ఇదే చేద్దామంటే ఎంతోకాలం నడువదు. ప్రభుత్వం వైద్యరంగంలో తక్కువ కృషి చేసింది కాబట్టే ఇప్పుడు మనకింత ఆపద జరిగింది. వైద్య, విద్యరంగంలోను కూడా మనం సరియైనటువంటి వ్యవస్థలను సృష్టించు కోకపోవటం వల్ల ఇంత ప్రమాదకరంగా తయారైంది.

పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
పర్యావరణ పరిరక్షణకోసం కోసం కాకుండా మన పరిరక్షణకోసం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతి కూడా మనల్ని పరిరక్షించ గల్గుతుంది. మనకు ఎంత వరకు అవసరమో అంత వరకు ప్రకృతిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలంటే మన పరిరక్షణ ఏంటో మనకు అర్థం కావాలి ముందు.

కరోనా పుట్టుకకు ప్రకృతి వైపరీత్యాలే కారణమా?
ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మానవుడు పుట్టుక ముందు నుండి కూడా ప్రకృతిలో చాలా విధ్వంసాలు, మార్పులు జరిగాయి. మానవుడు పుట్టడానికి, ఆక్సిజన్‍ పుట్టడానికి కూడా యివే కారణమయ్యాయి. మనం ప్రకృతిని సరియైన రీతిగా ఉపయోగించు కోవాలి. ప్రకృతి పరిరక్షణ అంటే ప్రకృతిని మనకు అనుకూలంగా మలచుకోవటం అనేది ధ్యేయంగా ఉండాలి. లేదంటే ప్రకృతిలో ఇలాంటివి రావొచ్చు మున్ముందు. ఎందుచేతనంటే సంఘంలో మనం జీవించే వేగం పెరిగింది. కాబట్టి అనేక రసాయనికమైనటువంటి మార్పులు తెస్తున్నాం మనం. ఈ మార్పుల్లో ఏదైనా ఒకటి వికటించి ప్రమాదం తీసుకురావొచ్చు.

కరోనాను ఎదుర్కోవటంలో వైద్య సాంకేతిక రంగాలలో జరుగవలసిన కృషి ఏమిటి?
మన ప్రయత్నాల లోపాలు చాలా ఉన్నాయని ఈ విపత్కర సందర్భంలో అర్థమయింది. ఈ అనుభవాన్ని బట్టి వైద్యరంగంలో ఏం చేయాలి, వైద్యవిద్య ఎలా ఉండాలి, ఈ సాంకేతిక నైపుణ్యతను మనం ఎలా ఉపయోగించుకోవాలో అనేదాంట్లో మనం చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మనం వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాలంటే ప్రజల్లో సాంకేతిక జ్ఞానం కలగాలి. అంటే శాస్త్రోత్తంగా జీవించడం అనేది చాలా అవసరం. కొత్త విషయాలు నేర్చుకుని వాటి ఆధారంగా మనం మంచి ఆచరాణాత్మక మైనటువంటి కొత్త మార్గాలను అన్వేషించి తెలుసుకుని వాటిని మనం అవలంబించవలసి ఉంది.

అంతర్జాతీయంగా ఆయా దేశాలు కరోనా విపత్తును ఎందుకు సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయాయి?
సమర్థవంతంగా ఎదుర్కొనలేక పోయిందని చావులను బట్టి చెబుతున్నాము. వారు కూడా కొంత నిర్లక్ష్యం చేశారు. అయినప్పటికి చూడండి సమస్యలకు వాళ్ళు త్వరగా పరిష్కారాలు చేసుకుంటున్నారు. అప్రమత్తంగా లేకపోవటం వలన జరిగింది. కానీ వ్యక్తిగత క్రమశిక్షణ ఉంది కాబట్టి త్వరగా అర్థం చేసుకున్నారు. అమెరికాలో లాక్‍డౌన్‍ చేయమన్నారు. స్వతంత్రంగా వదిలేశారు. అయినప్పటికి అంత ఉధృతంగా వచ్చి, త్వరగా తగ్గిపోతుంది. మన దగ్గర అలా సాధ్యం కాదు. మనం అర్థం చేసుకోవటంలో, ఆచరణలో పెట్టటంలో చాలా ఆలస్యం జరుగుతుంది. చావులు కూడా చాలా స్లోగా జరుగుతున్నాయి. ఆ తరువాత పరిష్కారం కూడా చాలా స్లో అవుతుంది వాళ్ల కంటే.

ఆర్థిక సాంకేతిక రంగాలలో అభివృద్ధి కల్గిన దేశాలు దీనిని ఎదుర్కోవడంలో ఎందుకు విఫలమయ్యాయి? చిన్న చిన్న దేశాలు ఎలా బయట పడతాయి?
చిన్న దేశాలు కాబట్టి జనాభా తక్కువ. పైగా బాగా క్రమశిక్షణ పాటించారు. మనదేశంలో కేరళలోనే చూడండి త్వరగా నివారణకి ప్రయత్నాలు చేశారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. అదే విధంగా సింగపూర్‍, సౌత్‍కొరియా, డెన్‍మార్క్, అవి చిన్న దేశాలు. వాళ్లు కోటి కంటే తక్కువ. వాళ్ళల్లో హై ఎడ్యుకేషన్స్ ఉంది. ఏది చేయవచ్చు, ఏది చేయకూడదనే శాస్త్ర జ్ఞానం ఉంది.  శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్లను సంఘంలో భాగస్వాములుగా చేయడం వల్ల సమర్థవంతంగా ప్రయత్నాలు చేయగల్గుతాం.

ప్రపంచ దేశాల మధ్య సంబంధాలపై కరోనా ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది?
ఇప్పుడు అర్థమయింది ఏమిటంటే ప్రపంచంలో అందరి సహకారం ఉంటేగానీ మనం ముందుకు వెళ్లలేం. ఆరోగ్యం, సౌకర్యాలే కాకుండా, అభివృద్ధి కూడా సాధ్యం కాదు. ఇది వరకే మనకి తెలిసినప్పటికీ పాటించలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఇది పాటించితీరాలనే అవగాహనకి వచ్చేశాయి.

ప్రపంచ ఆర్థిక రంగంలో రాబోయే మార్పులు ఎలా ఉండబోతున్నాయి?
నిజానికి వైద్యరంగంలో ప్రపంచంలో ఎన్నో దేశాలలో మన వైద్యులే. ఇంగ్లాండులోను, అమెరికాలోను పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలలోను భారతీయ వైద్యులు ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అపారమైన సేవ చేస్తున్నారు వైద్యులు, నర్సులు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో మెడికల్‍ నాలెడ్జ్ ప్రజలకు ఇవ్వడానికి ఈ వైద్యులను ఉపయోగించుకోలేదు మనం. ఇప్పుడు సాంకేతిక నాలెడ్జ్ పెరిగింది. ప్రజలు ఒక క్రమశిక్షణతో వారి శక్తిని తెలుసుకోగలరు, సృష్టించగలరు, ఉత్పత్తిని చేయగలరు. ప్రభుత్వరంగ ఉత్పత్తి సంస్థలన్ని మనకు నష్టాలను తీసుకొస్తున్నాయి. ఎయిర్‍ ఇండియాగానీ, బస్‍ ట్రాన్స్పోర్టు, బి.ఎస్‍.యన్‍.యల్‍లు ఉదాహరణలు. పౌరులు ఉత్పత్తి దారులు కావాలి, పౌరులు వినియోగదారులు కావాలి, వాళ్లు అభివృద్ధిలోకి రావాలి అన్నదానికి సహాయం చేయాలేతప్ప, నేనే మీకు ఉత్పత్తి చేయిస్తాను, నేనే మీకు ఏం తినాలో చెప్తాను. నేనే పంపిణీ చేస్తాను. ఆ ధోరణి గత ఇరవై, ముఫ్పై సంవత్సరాలలో అవసరమైంది. ఇప్పుడు అవసరం కాదు. ఈ లాక్‍డౌన్‍ను కంటిన్యూ చేస్తే ప్రభుత్వం ఇన్ని రోజులు ఇంతమంది అవసరాలను చూడలేదు. ఎవరో ఒకరు చేయాలి. ఎవరు చేయాలంటే స్వచ్ఛంద సంస్థలు చేయాలి. ఆ స్వచ్ఛంద సంస్థలకి అవకాశం ఇవ్వాలి. వీళ్లు మెల్లిగా తప్పుకుని వాళ్లని ఆ మార్గంలోపెట్టి పర్యవేక్షణతో ఉండాలి. వలసకూలీలకు ఇప్పుడు భోజనాలు సప్లై అక్షయపాత్ర ద్వారా హరేరామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ వాళ్లు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారితో సహకరించటం వలన ఇప్పటికే మూడు వేల కోట్ల భోజనాలు పెట్టగలిగారు. ఇప్పుడు కూడా వాళ్లే చేస్తున్నారు.

భారతదేశంలో ఆర్థికరంగం ఎలా ఉండబోతుంది?
చాలా అభివృద్ధి పొందుతుంది. మనకు ఇది మంచి అవకాశం. అంతర్జాతీయ స్థాయిలో వైద్యరంగం, మందుల యొక్క ఉత్పత్తిలో మనము మొదటి నుండే మంచి స్థానంలో ఉన్నాం. ప్రపంచ మంతా సరఫరా చేస్తున్నాం. ఈ రంగంలో మన తర్వాత చైనా వుంది. ఇప్పుడు చైనా మీద విశ్వసనీయత తగ్గింది. ప్రస్తుతం మనం మందులు ఉత్పత్తి చేస్తూ ఎక్స్ఫోర్ట్ చేస్తున్నప్పటికి దీనికి కావాలిసిన ముడి సరుకు అనేది చైనా నుండే వస్తుంది మనకు. మన ఎక్స్ఫోర్ట్ పెరిగినట్లు అయితే ఎవరూ చైనా నుంచి కొనరు. ముడి సరుకును కూడా మనదేశంలోనే వెతికేటటువంటి పరిస్థితులను కల్పించుకోవాలి. దానికి ప్రభుత్వం సహకరించాలి. వెనుకబడిన దేశాలలో తగిన వైద్యం దొరకదు. కాబట్టి మనదేశానికి వస్తున్నారు. మెడికల్‍ టూరిజం అంటారు. వారికి ప్రైవేట్‍ హాస్పిటల్స్ ట్రీట్‍మెంట్స్ ఇస్తున్నాయి. ఫారెన్‍ ఎక్సైంజ్‍ వస్తుంది మనకి. దానివల్ల విలువ పెరుగుతుంది, ఆదాయం వస్తుంది. మనం ప్రపంచంమంతటా ఉపయోగకరమైన అవసరాలు తీరుస్తున్నామన్న తృప్తి ఉంటుంది. కావున వైద్య విద్యకు ఎక్కువ అవకాశాన్ని ఇవ్వాలి. హాస్పిటల్స్కి ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ప్రపంచ వాణిజ్య రంగంలో ముందుకు వెళ్లాలంటే విదేశస్తులు మనదేశానికి రావటానికి మనం అనుమతులు ఇవ్వాలి. స్వచ్ఛంద సంస్థలను ఎంకరైజ్‍ చేయాలి.

కరోనా పుట్టుకకు ప్రకృతి వైపరీత్యాలే కారణమా?
ఇలాంటి వైఫల్యాలు రాకుండా ఉండడానికి కృషి చేయాలే తప్ప ఇవి రాకుండా ఆపలేము. ప్రకృతిలో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరిగింది, ముందు ముందు ఏం చేయాలి అని ఆలోచించాలి. ఇవి రావడానికి ముందే గ్రహించి వీటిని అదుపు చేయటానికి, తగ్గించటానికి, వచ్చిన తరువాత నివారణకి మనం సైన్స్, జ్ఞానం, పరికరాలు పెంచుకోవాలి. మానవ శరీరంలోనే వైరస్‍లు, బ్యాక్టీరియాలు కోట్లాను కోట్లున్నాయి. ఇవి ఎప్పుడు మంచి, ఎప్పుడు చెడు చేస్తాయో చెప్పలేము. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని, అలవాట్లను బట్టి ఈ మార్పులు వస్తాయి. మన శరీరంలో కొన్ని యాంటీ బాడీస్‍లను రక్తం సృష్టించాలి. అవి ఉత్పత్తి అయ్యే దాన్నే ఇమ్యూనిటీ అంటారు. మన శరీరపు ఇమ్యూనిటీ పవర్‍ను పెంచుకోవటానికి గతంలో యునాని, సిద్ధ ఆయుర్వేదంలో ఇలాంటి వాటికి ప్రాముఖ్యత ఉండేది. కొంత మంది సైంటిస్టులు కూడా అంటున్నారు, మనదగ్గర వైరస్‍ తక్కువగా ఉండటానికి కారణం ఏమిటంటే మనలో స్వతహాగానే మసాలాల శక్తి చాలా తీక్షణమైనది. అల్పమైనటువంటి సూక్ష్మకణాలను అదే చంపేస్తుంది. శ్రాస్తీయ విజ్ఞానంతో పాటు మన ట్రెడిషినల్‍ జ్ఞానాన్ని కూడా ఉపయోగిం చుకుని న్యూట్రిషియన్‍ జ్ఞానాన్ని పెంచవలసి ఉంది. హరితహారంలో మొక్కలు ఎక్కువగా నాటటం వలన ఆక్సిజన్‍ ఉత్పత్తి పెరుగుతుంది. తన శరీరాన్ని, పరిసరాలను ఏవిధంగా మెయిన్‍టెన్స్ చేసుకొంటే ఆరోగ్యంగా ఉంటామో అనేది తెలుసుకోవటానికి ఇది మంచి అవకాశం.

వలస కార్మికుల పరిష్కారానికి ఏం చేయాలి?
మనదేశంలో వలస కార్మికులు చాలా ముఖ్యం. వలసకార్మికులు మనకు గెస్ట్లు, ప్రభుత్వం వారి దగ్గరికి పోయి భోజన ప్యాకెట్లు పంచడం, రైస్‍ పంచడం కంటే వారు ఎవరి దగ్గర పనిచేస్తున్నారో, ఆ యజమానులకే సహాయం చేసి వారి యజమానులు వారిని చూసుకొన్నట్లైతే వ్యక్తిగతమైన భద్రత కల్గుతుంది. ఈ భద్రత లేకపోవటం వలన యజమాని తీసుకుంటాడో, లేదో నన్న భయంతో వేల కిలోమీటర్లు నడిచిపోయి ఇంటికి పోతున్నారు. దీని వల్ల చాలా నష్టం కల్గుతుంది. మళ్లీ పరిశ్రమలు ముందుకు సాగాలంటే వీళ్లు కావాలి. కావున వాళ్లు పోకుండా ఎవరైతే ఉద్యోగాల్లో పనులు చేయించుకుంటున్నారో ఆ యజమానులే వీరిని కాపాడుకోవాలి. గ్రూపులుగా వెళ్లడం వల్ల కరోనా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్వయంగా చేయడం కాకుండా, ఇప్పుడైనా ప్రభుత్వం ఎవరైనా వెళ్లిపోయినట్లైయితే వారిని పిలిచి ఖర్చులు ఇచ్చి యజమానుల ద్వారా సహకరించాలి. అంటే ప్రభుత్వం పరిశ్రమలకు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఉత్పత్తిదారునికి సహాయం చేయకుండా కొనుగోలు దారునికి సహాయం చేస్తే వస్తువు లేకపోతే ఇతనేం చేస్తాడు. ఉత్పత్తిదారులు అప్పులివ్వమంటున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం 20వేల కోట్లు కేటాయించింది. కానీ కోనుగొలుదారుతనం పెంచుదామనేది పూర్తిగా సమంజసం కాదు. ఉత్పత్తిదారులకు పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని పెంచితే కొనుదారులకు అవకాశాలు పెరుగుతాయి. ఉత్పత్తులు పెంచడం వలన ఉద్యోగాలు పెరుగుతాయి. దానికి పెట్టుబడులు పెట్టాల్సిఉంది. ప్రభుత్వంను ప్రజల ట్యాక్స్ వల్లే నడిపిస్తున్నారు. ప్రభుత్వం దానాలు సేకరించి, ప్రజలకు దానం చేయటం సరియైన మార్గం కాదు. ప్రజలే పరస్పర సహకారం చేసుకోనేలాగా చేయాలి. చేసుకుంటేనే ప్రజల మధ్య అవగాహన పెరుగుతుంది. సమస్యను రాజకీయ దృక్పథంతో చూస్తున్నాం తప్ప, మానవతా దృక్పథంతోగానీ, దేశభవిష్యత్తు, మన అభివృద్ధి దృష్ట్యా మన వ్యూహాలు అనుకూలంగా లేవు.

లాక్‍డౌన్‍ పిరియడ్‍లో మీకు కల్గిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?
ఎవరి వృత్తిలో వారికి ఆలోచించటానికి అవకాశం ఉంది. ఒక నిర్దేశ సమయాన్ని కేటాయించుకొని ఆ పనులు చేసుకుంటు పోతున్నాం తప్ప, ఒక కుటుంబంలో ఒకరిపైఒకరు ప్రేమ ఆప్యాయతలు చూపించటానికి, పెంపొందించటానికి సమయం కేటాయించలేదు. ఈ సమయంలో వీటి గురించి ఆలోచించి మానవ సంబంధాలు, ప్రవర్తన మెరుగుపరచుకోవాల్సి ఉంది. వ్యక్తిని ప్రోత్సహించి, అతనిలోని మంచిని, నైపుణ్యాన్ని, శక్తిని బయటకి తీసుకొచ్చి వాటిని మనం పంచుకోవాలి. అలాంటి భావన కల్గటానికి ఇది మంచి అవకాశం.

పర్యావరణ పరిరక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు?
పర్యావరణ పరిరక్షణ మానవుడి ముఖ్య కర్తవ్యం కాదు. మనిషి అభివృద్ధికి, పరిరక్షణకు ప్రకృతిని ఎలా మలచుకోవాలి, హానికరంగా కాకుండా, అనుకూలంగా ఎలా మలచుకోవాలి అనేది ఆలోచించాలి. ఆ దృక్పథంతో చూడాలే తప్ప. ప్రకృతే ముందు, మానవుడి అభివృద్ధి తర్వాత అని ఆలోచించకూడదు. స్పష్టంగా మానవుడి యొక్క పరిరక్షణ, అభివృద్ధి ముఖ్యం. దానికి దోహదంగా ప్రకృతిని ఎలా మలచుకోవాలి. మన సంస్క•తిలో ప్రకృతి ఒక భాగం, ప్రకృతిలో జీవిస్తున్నాం. కాకపోతే మానవుడి అవసరాలు పెరిగాయి. అధునాతన సమస్యలకు, అధునాతన పరిష్కారాలు ఉండాలే తప్ప, ప్రకృతి పవ్రితమైనది దాన్ని ముట్టుకోవద్దు అనే దృక్పథంతో పరిరక్షణ అనే పదాన్ని చూడకూడదు. మార్పులు చేసి సంరక్షించుకోవాలి.

మున్ముందు విద్యా వ్యవస్థ ఎలా ఉండబోతుంది?
పూర్వకాలంలో విద్య అనేది సంఘంలో కొంతమంది నేర్చుకుని, కొంతమంది మార్గదర్శకాలు ఇచ్చేవారు. విద్య అంటే జ్ఞానం. జ్ఞానాన్ని పర్మనెంట్‍గా నేర్చుకోవటం అవలంభించాలి. ప్రజలందరిని విద్యావంతులుగా చేయటం ప్రభుత్వం బాధ్యత కాదు. ప్రజలు జ్ఞానం సంపాదించుకోవటానికి అవకాశాలు కల్పించాలి. విద్యను చెప్పేవాళ్లను గౌరవించాలి, వారికే ఎక్కువ జీతం ఇవ్వాలి. మానవ అభివృద్ధికి కృషి చేసే రంగాలలో పెట్టుబడులు పెట్టటం లేదు.

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఫిజికల్‍ దూరం ఏ విధంగా ఉండ బోతుంది? అదే విధంగా ప్రైవేట్‍ స్కూల్స్లో ఏ విధంగా ఉండబోతుంది? వారికి ఏ విధంగా గవర్నమెంట్‍ సపోర్టు ఉంటుంది?
గవర్నమెంట్‍ తక్కువ కలగజేసుకుంటేనే ఎక్కువ సహకరించినట్లు నా ఉద్దేశం. స్కూల్‍లో ఉండే టీచర్‍కు, హెడ్‍ మాస్టర్‍కు అవగాహన ఉంటే వారు ప్లాన్‍ చేసుకుంటారు. అంటే ఒకే క్లాస్‍ను రెండు క్లాస్‍గా మార్చుకోవచ్చు. లేదా ఈ గంట ఒకళ్లకు ఇంకో గంట వేరే వాళ్లకు పెట్టొచ్చు. అది ఒక హెడ్‍మాస్టర్‍, ఎడ్యుకేషన్‍ సంస్థల విజ్ఞతకు వదిలిపెట్టాలి. వారికి సలహా ఇవ్వాలి. ప్రభుత్వం నిబంధనలు పెడతామంటే టీచర్‍కు, హెడ్‍మాస్టర్‍కు ఆ బాధ్యతనివ్వాలి. ప్రభుత్వం ఎంత వరకు అవసరమో అంతవరకు ఉండాలి.

ఈ సంవత్సరం విద్యాసంవత్సరం ఉంటుందా? ఉండదా?
స్కూల్స్, కాలేజీకి గానీ ఆ బాధ్యత ఇచ్చినట్లైయితే వాళ్లు రెండు నెలలు పాఠాలు చెప్పకపోతే మూడో నెలలో ఏదో విధంగా చెప్పుకుంటారు. ఎగ్జామినేషన్‍ కూడాను వాళ్లేకే అవకాశం ఇవ్వాలి. గవర్నమెంట్‍ ఎగ్జామ్‍ పెట్టడం, పేపర్లు దిద్దించటం, ఇది పద్దతి కాదు. విద్యారంగంలో ప్రభుత్వం అతిగా కలగజేసుకుంటుంది. దీని వల్ల నష్టం కలుగుతుంది. విద్యా వ్యాప్తి జరగటం లేదు. కానీ ప్రభుత్వం ఇన్ని గంటలు చెప్పాలి అనే నిబంధనలు పెట్టి వదిలేస్తే ఆ గంటలు ఎప్పుడున్నాయి వాళ్లు చూసుకుంటారు. టెలివిజన్‍, టెలికమ్యూకేషన్‍, కంప్యూటర్‍, జూమ్‍ యాప్‍ ద్వారా వాళ్లు చూసుకుంటారు. ప్రజా ప్రభుత్వం ప్రజలను నమ్మాలి, ప్రజలకు అవకాశాలివ్వాలి. ప్రతి ఒక పౌరుడు విద్యావంతుడు కావాలి, చైతన్యవంతుడు కావాలి, తన అభివృద్ధిని తానే పెంచుకొనేలా పౌరునికి సహకరించేలా ఉండాలి.

ఇటువంటి పరిస్థితుల్లో రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది?
తాత్కాలికంగా రవాణా ఆపడం అవసరం కావొచ్చు. నడపడం అవసరం. ఎక్కువ కాలం ఆపడం వలన సంఘానికి నష్టం వస్తుంది. ఉదాహరణకి గ్రామాల్లో పండించిన కూరగాయలు, ఆహార పదార్థాలు పట్టణాలో అందరికి కావాలి కదా. వాటిని మొదట్లో ఆపడం సమంజసం, తరువాత పొడిగించకుండా, మార్పులు తీసుకురావాలి. మానవుని కదలిక అనేది చాలా అవసరం. అది లేకుండా చేయలేం. దానిలో ఎటువంటి సౌలభ్యం ఉండాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటిలో సూచనలు ఇవ్వటం మంచిది. ప్రజా రవాణా చాలా అవసరం. డబ్బు కావాలంటే, కొనుగోలు జరగాలంటే, ఉత్పత్తి పెరగాలంటే, రవాణా కదలాలి. మొదట్లో సమస్య అర్థం కానప్పుడు ఆపాం. తరువాత ఏది వీలు అవుతుందో దాన్ని అనుమతించాలి. ప్రజా సంస్థల యొక్క సలహా తీసుకోవాలి.

రాబోయే రోజుల్లో టూరిజం ఎలా ఉండబోతుంది?
టూరిజం బాగా పెరగాల్సి ఉన్నది. ఇప్పుడున్న నియమాలు, నిబంధనలు దోహదం చేయవు. మార్చవలసి ఉన్నది. కరోనా ప్రభావం తాత్కాలికమే. మనదేశంలో రెండు రకాల టూరిజం ఉన్నది. సోషల్‍ టూరిజమని ఫ్రాన్స్లో ఫ్రెంచ్‍వాళ్లకి మనదేశ జాతీయ సంస్క•తి మీద ఉన్న అవగాహన మనదేశంలో ఉన్న మనవాళ్లకే చాలా మందికి లేదు. ఎందుకంటే వాళ్లు పర్యాటన వలన ఇక్కడికి వచ్చి స్టడీ చేసి అవగాహన చేసుకోగల్గిగారు. మనవాళ్లు పర్యాటన కోసం బయటికి వెళ్లకపోవటం వలన మనకి ప్రపంచం మీద అవగాహన తక్కువ. మనదేశంలో సమైక్యత పెరగకపోవటానికి కారణం ఏమిటంటే ఒక రాష్ట్రం వాళ్లు ఇంకో రాష్ట్రానికి రాలేరు. దీన్నే ఇంటర్నల్‍ టూరిజం అంటారు. మనదేశంలో ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి తిరిగి వీరు భారతీయులేనా అనే విధంగా ఉండాలి. టూరిజం అనేది సోషల్‍ టూరిజం కావాలి. కొన్ని దేశాల నుంచి టూరిజాన్ని అనుమతించవచ్చు. ఎక్కడైతే కరోనా వైరస్‍ ఉధృతంగా లేదో లేక పూర్తిగా తగ్గిపోయిందో వారిని మనం అనుమతించాలి. ప్రభుత్వ అధికారులకు ఇది తెలియదు. అంటే ఈరంగంలో కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలున్నాయి. మన సంస్క•తి, సంప్రదాయాలను, సంపదలను పరిరక్షించుకోవటానికి కొన్ని సంస్థలున్నాయి. అలాంటి సంస్థలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీయులు రావటానికి చాలా అనుమతులు అడుగుతున్నారు. ఈ షరతులు పర్యాటనకు ఆటంకాలు. చాలా అవసరమైన పరిశ్రమ టూరిజం. మనదేశానికి ఆర్థికంగా చాలా లాభాలే. మనం మున్ముందు పెంపొందించు కోవాల్సినటువంటి రంగాల్లో మందుల తయారీలో, వైద్యులను బయట సహకారానికి పంపించటం లాంటిదే పర్యాటకులను ఆహ్వానించి, వారు మన సంపదను పంచుకునేలా చేయటం కూడా అంతే అవసరం.

ఇటువంటి విపత్తులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి?
ఇలాంటి విపత్తులు ఎప్పుడూ వస్తునే ఉంటాయి. ప్రతి వ్యక్తి రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. ఇలాంటి వ్యాధులు, సమస్యలు వస్తున్నప్పుడు పరిష్కారానికి కావాల్సిన వ్యవస్థలన్ని రెడీగా ఉంచుకోవాలి. మంచి ఎడ్యుకేషన్‍ ఉండాలి. వైద్యం, హాస్పిటల్స్ అందరికి అందుబాటులో ఉండాలి. ప్రైవేట్‍ హాస్పిటల్స్కు సమర్థత పెంచటానికి శిక్షణనివ్వాలి. సైంటిఫిక్‍ రీసెర్చ్ ల్యాబ్‍ గవర్నమెంట్‍ పెట్టాలి. శాస్త్ర విజ్ఞాన పరిశోధనమీద ప్రయోగాలు చేయటానికి, కృషి చేయటానికి డబ్బు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంది. జాతీయ ఆదాయంలో 1% కంటే ఎక్కువ ఖర్చు పెట్టడంలేదు. అభివృద్ధి చెందిన దేశాలు 6% ఖర్చు పెడుతున్నారు. మనదేశంలోనే వస్తువు ఉత్పత్తి యొక్క సామర్థ్యాన్ని ప్రజల్లో పెంచాలి. ల్యాబోరేటిరీస్‍కు ఎక్కువ ఫండ్స్ ఇచ్చి, సైంటిస్టులకు పరిశోధన చేయటానికి స్వాతంత్య్రం ఇవ్వాలి. అది కాకుండా గవర్నమెంట్‍ లాబోరేటరీస్‍లో మాత్రమే చేయాలంటే కుదరదు. ప్రైవేట్‍ ఇండ్రస్టీస్‍ని వాళ్లు పరిశోధన చేయమని అడగాలి. మనం ప్రైవేట్‍ ఇండ్రస్టీస్‍కు అవకాశం కల్పించటం లేదు. రీసెర్చ్ ప్రభుత్వమే చేయాలి, ఉత్పత్తి ప్రభుత్వమే చేయాలి అనే దృక్పథం వల్ల నష్టపోతున్నాం. గ్రాంట్స్ ఇచ్చి ప్రైవేట్‍కు చేసుకోమనాలి. ప్రభుత్వ విధానాలు మారాల్సి ఉంది.

మనదేశ ఫెడరల్‍ వ్యవస్థ ఎలా ఉండబోతుంది?
నిజానికి ఫెడరల్‍ వ్యవస్థ మనకు అవసరంలేదు. మనం ఒకేజాతి, ఒకే సం, ఒకే చరిత్ర. ఫెడరలిజం అనేది వేరు వేరు ఇండిపెండెంట్‍ సంఘాలున్న దేశాల్లో, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రాష్ట్రాలన్ని వేరుగా ఉండి స్వభిమానంతో ప్రక్క రాష్ట్రం కంటే మేమే గొప్పరాష్ట్రం అనుకునే వాళ్ల మధ్యన ఫెడలిజం అనే పదాన్ని సృష్టించారు. మనదేశంలో ఒక రాష్ట్రానికి, ఇంకో రాష్ట్రానికి తేడా ఏమి ఉంది. ఎంతోకాలంగా మనం కలిసి జీవిస్తున్నాం. రాష్ట్రానికి అంటూ ప్రత్యేకమైన ప్రత్యేకతలు ఏమీ లేవు. అప్పట్లో కొన్ని ఇండిపెండెంట్‍ రాష్ట్రాలు ఉన్నాయి. హైదరాబాద్‍, మైసూరు, బరోడా ఇలాంటి మహారాజాలు ఉన్నారు. కాబట్టి మహారాజాలు అందరు కలవటానికి అని వాళ్ళ కోసం ప్రత్యేక హామీలు ఇవ్వటం కోసమని చెప్పి, మనం వాళ్లను కలుపుకోవటానికి అని చెప్పి, ఒక ఐక్య జాతీయ సంస్థ ఏర్పాటు అని చెప్పి, మీరు కూడా ఉండండి, మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తిస్తాం అన్నాం. ఫెడలిజం లేదు మనదేశంలో ఒక్కటే యిజం. ఫెడలిజం అనేది వ్యతిరేక ఉన్న రాజకీయ శక్తుల మధ్యలో ఉంది. దీని వలన దేశానికి పెద్దగా ఉపయోగం లేదు. (సచిన్‍, మల్లేష్‍ – దక్కన్‍ ఛానల్‍ ఇంటర్వ్యూ ఆధారంగా)


– కట్టా ప్రభాకర్‍, ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *