మునగ సాగు ఆవశ్యకత

భారతదేశంలో మునగ ఒక ముఖ్యమైన కాయగూర పంట. మునగ చెట్టును మానవులు క్రీస్తు పూర్వం 150 సంవత్సరం ప్రాంతంలో ఉపయోగించారు. కొందరు చరిత్రకారుల ప్రకారం, మౌర్య సైన్యం యొక్క ప్రధాన పోషక పదార్థంగా మునగ కాయ వుంది. అదే అలెగ్జాండర్‍ సైన్యాన్ని ఓడించిందని ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేదం ప్రకారం కనీసం 300 మానవ వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం మునగకు ఉంది.


ఈ కాయలు, ఆకులను ఎక్కువగా వంటకాల్లో వాడటం మన రాష్ట్రంలో ఆనవాయితీ. ఆకుకూరలతో మునగను కూడా వాడాల్సిన అవసరం ఎంతో ఉంది. మునగ కాయలకన్నా అధిక పోషకాలందించే ఆకుల వాడకం మన రాష్ట్రంలో చాలా తక్కువ. మన రాష్ట్రంలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మునగను సాగుచేస్తూ, అధిక దిగుబడులతో మంచి ఆదాయం పొందుతున్నారు. తమిళనాడు, ఆంధప్రదేశ్‍, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు మునగ ఆకులను ఎక్కువగా యూరోపి యన్‍ యూనియన్‍, యు.ఎస్‍.ఏ, చైనా, గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.


వాతావరణం:
మునగ ఉష్ణ, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగును. దీని పెరుగుదలకు 25-350 సెం. ఉష్ణోగ్రత అనువైనది. 480 సెం. ఉష్ణోగ్రత వరకు కూడా సాగు అనుకూలమే. తెలంగాణ రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 15 నుండి 400 సెం. అందువలన తెలంగాణ రాష్ట్రం మునగ సాగుకు చాలా అనుకూలం.
నేలలు :
మునగ అన్ని రకాల నేలలో సాగు చేయవచ్చును. మునగ పెరుగుదలకు నేల యొక్క పిహెచ్‍ 6-7 అనువైనది.
రకాలు :
పికెఎం-1, పికెఎం-2, కెఎం-1, రోహిత్‍-1, కోయంబత్తూర్‍-1 లాంటి అభివృద్ధి చేయబడిన విత్తనాల రకాలే కాకుండా స్థానిక రకాలైన జాప్త, యాజ్పనం, పూనా, పాల్‍, చవకచెరి, మొలనోల్‍, దుర్గ, జికెవికె-1. 2, 3 రకాలు మునగ ఆకు ఉత్పత్తికి అనుకూలమైన రకాలు.
నేల తయారీ :
నేలను లోతుగా దున్ని 45 సెం.మీ3 సైజు గల గుంతలను కాయల కొరకు అయితే 2.5×2.5 మీటర్లు లేదా ఆకు కొరకు అయితే 1×1 మీటర్ల దూరంతో తవ్వి పది కేజీల పశువుల ఎరువు, 100 గ్రాముల నైట్రోజన్‍, 200 గ్రాముల పాస్పరస్‍, 50 గ్రాముల పొటాషియం వేసి గుంటలను మూసివేయవలెను.
విత్తనాలను రెండు నుండి మూడు సెంటిమీటర్ల లోతులో జులై నుండి అక్టోబర్‍ మాసం వరకు నాటుకోవచ్చు. ఒక ఎకరానికి 650 గ్రాముల విత్తనాలు అవసరం అవుతాయి. 6×6 అడుగుల దూరంలో ఒక ఎకరానికి 1200 మొక్కలను నాటుకోవచ్చును.


కాయకోత :
కాయలు లావుగా, నున్నగా పెరిగి, కాయలో గింజలు ఉబ్బెతుత్తగా కన్పించినపుడు, కాయలు పెలుసుదనం రాకముందే కోసి మార్కెట్‍కి తరలించాలి. సరైన యాజమాన్య పద్ధతులను సమర్థంగా చేపడితే మునగ సాగుతో లాభాల దిగుబడులను పొందవచ్చు.
ఆకులు మరియు లేత కొమ్మల కోత :
100-150 సెంటిమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఆకులు మరియు లేత కొమ్మలను మాత్రమే కత్తిరించవలెను.
దిగుబడి :
మొక్క నాటిన తరువాత ఏడు నెలల నుండి కాయ కోయవచ్చును. మంచి యాజమాన్య పద్ధతులలో ఒక చెట్టుకు సంవత్సరమునకు 15 కేజీల కాయల చొప్పున ఒక ఎకరానికి 18 టన్నుల మునగ కాడలు వస్తాయి. మొక్క నాటిన తరువాత రెండున్నర నెలల నుండి ఆకులను కోయవచ్చును. ఒక ఎకరానికి 25 టన్నుల ఆకులను పొందవచ్చును. తాజా ఆకులు ఆరబెట్టి పొడి చేయుట వలన 2 నుండి 2.5 టన్నులు అనగా 10% పొడి పొందవచ్చును. సగటున ఒక టన్ను మునగ ఆకుపొడి ధర రూ.2.50 లక్షలు ఉంటుంది. ఆ విధంగా ఎకరానికి మునగాకు పొడికి రూ.5 లక్షలు ఆదాయం వస్తుంది.


మునగ ఆకు ఉపయోగాలు :
వంద గ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలు, నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రా, ఫ్యాట్స్ 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రా, కాల్షియం 440 మి.గ్రా, పాస్పరస్‍ 70 మి.గ్రా, ఐరన్‍ 7 మి.గ్రా, ‘సి’ విటమిన్‍ 200 మి.గ్రా, ఖనిజ లవణాలు 2.3 శాతం, పీచు పదార్థం 0.9 మి.గ్రా, ఎనర్జీ 97 కేలరీలు
ఉంటాయి.మునగ ఆకు అధిక పోషకాలు కలిగి ఉంటుంది.

  •  పొటాషియం అరటి పండులో కన్నా 15 రెట్లు అధికం
  •  మెగ్నీషియం గుడ్డులో కన్నా 36 రెట్లు అధికం
  •  విటమిన్‍ ‘ఇ’ బాదంలో కన్నా 12 రెట్లు అధికం
  •  విటమిన్‍ ‘ఎ’ క్యారెట్‍లో న్నా 10 రెట్లు అధికం
  •  ప్రొటీన్‍ పెరుగులో కన్నా 9 రెట్లు అధికం
  •  విటమిన్‍ ‘సి’ కమల పండులో కన్నా 0.75 రెట్లు అధికం
  • ఐరన్‍ బచ్చలి కూరలో కన్నా 25 రెట్లు అధికం
  •  క్యాల్షియం పాలలో కన్నా 17 రెట్లు అధికం
  •  మొత్తం మీద 92 పోషకాలు, 18 ఎమినో ఆసిడ్స్, 46 యాంటి ఆక్సిడెంట్‍, 9 అవసరమైన ఎమినో ఆసిడ్స్, 36 యాంటి ఇన్‍ఫ్లామ్మటరీ కలిగి ఉంటుంది.
    25% ప్రొటీన్స్ మరియు 9 అవసరమైన ఎమినో ఆసిడ్స్
    ఉండటం వలన కండరాల పెరుగుదల వుంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
  •  24.7% క్యాల్షియం ఉండటం వలన జీర్ణ శక్తి బాగా పెరుగుతుంది
  •  32.2% ఐరన్‍, 24.7% క్యాల్షియం ఉండటం వలన శరీరంలో శక్తిని పెంపొందిస్తుంది.
  •  18.9% విటమిన్‍ ‘ఎ’ వుండటం వలన దృష్టి లోపాలు నివారిస్తుంది.
  •  మధుమేహం నివారిస్తుది. రక్తపోటు తగ్గిస్తుంది.
  •  ఎముకలకు గట్టితనం చేకూరుస్తుంది.
  •  బరువును తగ్గిస్తుంది. బిఎంఐ మెరుగు పరుస్తుంది.
  • జుట్టు పెరుగుటకు తోడ్పడుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది.

ఈ మునగాకు నూనె ఔషధాలు తయారీలో సౌందర్య సాధనాలు (కాస్మోటిక్స్), సుగంధ ద్రవ్యాలలో, రంగుల తయారిలో ఉపయోగిస్తారు. అంతే కాకుండా జంతువులు మరియు చేపల ఆహారంలో కూడా ఉపయోగిస్తారు. నీటి శుద్ధీకరణకు కూడా ఈ నూనె ఉపయోగపడుతుంది. మల్లె, గులాబి, ట్యూబ్‍ రోజ్‍ పూల మొక్కలకు ఎరువుగా ఈ నూనె వాడటం వలన పూలు అధికంగా రావడంతోపాటు పువ్వు సైజు కూడా పెరుగుతుంది.


ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍రెడ్డిగారు మరియు ఉద్యాన సంచాలకులు లోక వెంకట్రామిరెడ్డి గారు అధికారుల బృందంతో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలను సందర్శించి, ఈ మునగ సాగు పై విశేషాలు సేకరించి, తెలంగాణ రాష్ట్రంలో మునగ సాగుని లాభసాటి సాగు చేయడానికి కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా భదాద్రి కొత్తగూడెంలో జిల్లాలోని ఉద్యాన నర్సరీ అచ్యుతాపురం, ఉద్యాన నర్సరీ గరిమెళ్ళపాడులని డెమో ప్లాట్లుగా తీర్చిదిద్దారు.


-సముద్రాల విజయ్‍ కుమార్‍,
ఎ : 83744 49922

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *