హైదరాబాద్‍కు చారిత్రకంగా పేరు ప్రఖ్యాతులు అందించిన వారసత్వ కట్టడాల్లో ఇవి కూడా ఉన్నాయి. నిజామ్‍లకు విధేయులుగా ఉండిన పైగా కుటుంబీకుల సమాధులివి. ఉన్నతాధికారులుగా, దాతలుగా, వీరులుగా పైగా కుటుంబీకులు పేరొందారు. హైదరాబాద్ లో ఆర్కిటెక్చర్ అద్భుతాలకు పేరొందిన వాటిలో ఈ సమాధులు కూడా ఉన్నాయి. అక్కడి మొజాయిక్ టైల్స్, హస్తకళానైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఊహకు అందని రీతిలో ఆనాటి వారు అక్కడ తమ అద్భుతాలను ఆవిష్కరించారు.
హైదరాబాద్‍లో చార్మినార్‍కు 4 కి.మీ. దూరంలో దబర్హానా షా సాహెబ్ ర్గాకు చేరువలో ఉన్న పైగా టూంబ్స్ ఉన్నాయి. లైమ్, మోర్టార్‍లతో మార్బుల్స్తో వీటిని నిర్మించారు. ఈ సమాధులు సు మారుగా 200 ఏళ్ళ క్రితం నాటివి.
పైగా టూంబ్స్ను చూడగానే తొలిచూపులో అక్కడ అంతా పాడుబడినట్లుగా, ఎవరూ పట్టించుకోనట్లుగా, ఎలాంటి విశేషాలు లేనట్లుగా కనిపిస్తుంది. దగ్గరగా వెళ్ళి వాటిని పరిశీలించడం మొదలు పెడితే మాత్రం ఒక అద్భుత ఆర్కిటెక్చర్ ప్రపంచంలోకి వెళ్ళినట్లుగా ఉంటుంది. ఆయా నిర్మాణాలను ఎంతో సున్నితంగా చెక్కారు. అక్కడి మార్బుల్ ఫకేడ్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. వీటిలో కొన్ని వరుసలుగా ఉంటే, కొన్ని అందంగా చెక్కిన స్క్రీన్‍లుగా, కానోపీస్‍గా ఉంటాయి.
ఇండో-ఇస్లామిక్ నిర్మాణశైలి ఇక్కడ కనిపిస్తుంది. అసఫ్‍జాహీ, రాజ్‍పుఠానా ఆర్కిటెక్చర్ మిశ్రమశైలిలో ఇవి నిర్మితమయ్యాయి. మొఘల్, పర్షియన్, దక్కన్ నిర్మాణ శైలులకు ప్రాతినిథ్యం వహించే కట్టడాలు సైతం ఇక్కడ చూడవచ్చు.
చరిత్ర
నిజాంల హయాంలో పైగా కుటుంబాలు ఎంతో శక్తివం తమైనవిగా ఉండినవి.ఈ కుటుంబీకులు ఇస్లాం రెండో ఖలీఫా అయిన హజ్రత్ ఒమర్ బిన్ అల్-ఖతాబ్ వారసత్వానికి చెందిన వారుగా చెబుతారు.వీరు జాగీర్లు 4,000 చ.మైళ్ళకు విస్తరించి ఉండినవి. అప్పట్లో అసఫ్ జాతో కలసి దక్కన్‍కు వచ్చిన అబ్దుల్ ఫతే ఖాన్ తెగ్ జంగ్ పైగా కుటుంబీలకు మూలపురుషుడు. క్రీ.శ.1760 నుంచి 1803 వరకు పాలించిన రెండో నిజాంకు కమాండర్ ఇన్ చీఫ్ అనే అత్యున్నత స్థానంలో ఆయన తన సేవలను అందించారు. ఆయనకు షమ్స్-ఉల్-ఉమ్రా అనే బిరుదు ఉండింది. ఉన్నత కుటుంబీకుల్లో సూర్యుడు అని దానికి అర్థం. వారి గౌరవప్రద కుటుంబ నేపథ్యం, నిజామ్‍లకు అందించిన విలువైన సేవలు, నిజాం వంశీకులతో వివాహ బాంధవ్యాలు లాంటివాటితో నిజాంల తరువాత అంతటి గొప్ప కుటుంబంగా పైగాలకు గుర్తింపు లభించింది. క్రీ.శ. 1797 నుంచి నిజాం రాజులు, పైగా కుటుంబీకుల మధ్య వివాహ అనుబంధాలు మొదలయ్యాయి.
హైదరాబాద్ నగరంలో పైగా కుటుంబీకులు ఎన్నో గొప్ప భవనాలను నిర్మించారు. అస్మాన్ జాహీ ప్యాలెస్, ఖుర్షీద్ జాహీ ప్యాలెస్, వికార్-ఉల్-ఉమ్రాహి ప్యాలెస్ లాంటివెన్నో వీటిలో ఉన్నా యి. ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఫలక్‍నుమా ప్యాలెస్ వీరు నిర్మిం చిందే. దేశంలో అప్పటికి ఉండిన సగటు రాజుల కన్నా కూడా వీరు సంపన్నులని భావిస్తారు. వీరికి సొంత ప్రైవేటు సైన్యం కూడా ఉం డేది. వేలాది మంది ఈ సైన్యంలో పని చేసేవారు.
పైగా కుటుంబీకులు గొప్ప కళాపోషకులు. అది వారి సమాధుల నిర్మాణ తీరుతెన్నుల్లోనూ కనిపిస్తుంది. 1786లో అబ్దుల్ ఫతేఖాన్ తెగ్ జంగ్‍ను ఈ ప్రాంతంలో ఖననం చేశారు. నాటి నుంచి ఆ కుటుంబీకుల్లో మరణించిన వారి సమాధులను ఇక్కడ నిర్మించం మొదలుపెట్టారు. అబ్దుల్ ఫతా ఖాన్ షమ్స్ ఉల్ ఉమ్రా 1 మొదలుకొని షమ్స్ ఉల్ ఉమ్రాఙ, సర్ అస్మాన్ జా, సర్ ఖుర్షీద్ జా, సర్ వికార్-ఉల్-ఉమ్రా, సుల్తాన్ ఉల్ ముల్క్, లేడీ వికార్ ఉల్ ఉమ్రా, లేడీ ఖుర్షీద్ జా, లేడీ అస్మాన్ జా, మొయినుద్దౌలా, జహీర్ యార్ జంగ్ తదితరుల సమాధులు ఇక్కడ ఉన్నాయి.
సంతోష్‍నగర్‍లో ఒవైసీ హాస్పిటల్‍కు చేరువలో ఉన్న పైగా టూంబ్స్ హైదరాబాద్ నగర ప్రధాన చారిత్రక ఆకర్షణల్లో ఒకటిగా ఉన్నాయి. పైగా టూంబ్స్ ప్రాంతం సుమారుగా 30 నుంచి 40 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ప్రధాన సమాధులు మాత్రం రెండు ఎకరాల స్థలంలోనే ఉన్నాయి. నిజాం రాజుల కుమార్తెలను వివాహం చేసుకున్న పైగా కుటుంబీకుల సమాధులు ప్రధానంగా ఈ స్థలంలో ఉన్నాయి. ఈ సమాధులకు చుట్టూ ప్రహరీలు ఉన్నప్పటికీ పై కప్పులు మాత్రం ఉండవు. ఏడో నిజాం కాలం నాటికి, అప్పటికి మరణించిన నిజాం రాజుల సమాధులకు పైకప్పు లేకపోవడంతో అదే సంప్రదాయాన్ని పైగా కుటుంబీకులు పాటించినట్లుగా చెబుతారు. ఈ ప్రహరీలపై అందమైన లతలను చెక్కారు. స్టక్కో వర్క్, జాలీ వర్క్ అప్పటి నిర్మాణశైలిని ప్రతిబింబిస్తాయి.
అందం, హస్తకళానైపుణ్యం చెట్టపట్టాలు వేసుకుంటే ఎలా ఉంటుందన్న దానికి ప్రతీకగా పైగా టూంబ్స్ నిలుస్తాయి. వాటిని చూస్తుంటే ఆనాటి అచ్చెరువొందించే నిర్మాణశైలికి ఎంతో సన్నిహితమై పోయామన్న భావన కలుగుతుంది. టైమ్ మెషిన్ లేకుండానే ఆనాటి కాలంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది.
ఇక్కడి నిర్మాణాల్లోని డిజైన్లలో ఉన్న ఒక విశిష్టత ఏమిటంటే ఒక చోట ఉన్న డిజైన్ తిరిగి మరోచోట కన్పించదు. ప్రతీది విభిన్నం గా, విశిష్టంగా, విలక్షణంగా ఉంటుంది.తొలినాటి నిర్మాణాలకు నవాబ్ సర్ అస్మాన్ జా బహదూర్, సర్ ఖుర్షీద్ జా, సర్ వికార్ ఉల్ ఉమ్రా మరిన్ని జోడింపులు చేశారు. ఈ తరహా నిర్మాణశైలి ఎంతో ప్రత్యేక మైందని, ప్రపంచంలోనే మరెక్కడా కానరాదని చెబుతారు.
ఇక్కడ ఉన్న టూంబ్స్లో ప్రధానంగా చెప్పుకోదగ్గవి అస్మాన్ జా, బేగం ఖుర్షీద్ జా సమాధులు. అత్యధిక సంఖ్యలో సందర్శకులను ఇవి ఆకర్షిస్తుంటాయి. వీటిని మార్బుల్‍తో నిర్మించారు. సీజన్‍ను బట్టి రంగు మారే రాళ్ళతో వీటిని అలంకరిచినట్లుగా చెబుతారు. సమాధుల చుట్టూరా ఉండే గోడలపై లతలు, రేఖాగణిత చిత్రాలు ఉంటాయి.
ప్రతీది విభిన్నంగా పండ్లు, పూలు, డ్రమ్స్, పాములు లాంటివాటితో అలంకృతమై ఉంటాయి. ఈ సమాధులన్నీ చూసేం దుకు ఒకేలా కనిపించినా, ప్రతీ దాంట్లోనూ ఒక విభిన్నత దాగి ఉంటుంది. అదేమిటో కనుగొనడం కూడా ఆసక్తిదాయకంగానే ఉంటుంది. పైగా టూంబ్స్ ప్రధాన భాగంలో మొత్తం 27 సమాధులున్నా యి. పైగా టూంబ్స్ ఆవరణకు వెలుపల సందర్శకులకు స్వాగతం పలుకుతున్నట్లుగా రెండంతస్తుల నిర్మాణాలున్నాయి.
-సువేగా
ఎ : 9030 626288