హమారా హైదరాబాద్‍ డబుల్‍ డెక్కర్‍ బస్సు

మూడు దశాబ్దాల క్రితం దాకా ఆంధ్ర ప్రదేశ్‍ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు హైదరాబాద్‍ నగరంలో డబుల్‍ డెక్కర్‍ బస్సులను పరిమిత మార్గాల్లో నడిపేవారు. దాదాపు పాతికేళ్ల పాటు ఆ బస్సులు నగర ప్రజల జీవనంలో ఒక భాగంగా ఉండేవి. సికింద్రాబాద్‍ రైల్వే స్టేషన్‍ నుండి 5వ నంబరు బస్సు మెహిదీపట్నంకు, 7వ నంబరు బస్సు అఫ్జల్‍ గంజ్‍ కు, 8 నంబరు బస్సు చార్మినార్‍ కు, 10వ నంబరు బస్సు సనత్‍ నగర్‍ కు నడుస్తుండేవి. అదే విధంగా 65వ నంబరు బస్సులు మెహిదీపట్నం నుండి చార్మినార్‍ కు నడిచేవి.


మొదటిసారి హైదరాబాదు నగరానికి వచ్చిన వారు కనీసం ఒక్క సారైనా డబుల్‍ డెక్కర్‍ బస్సు ఎక్కాలని ఉబలాట పడుతుండేవారు. ఆ రోజుల్లో గ్రామ ప్రాంతాల నుండి లేదా పట్టణ ప్రాంతాల నుండి వచ్చిన వారు సిటీ బస్సు ఎక్కాలంటే కొంత బెరుకు ఉండేది . ఎందుకంటే ఎక్కువ శాతం మంది సిటీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, కొంత మంది స్థానికులు తెలుగు వారు కూడా నాలుగు దశాబ్దాల క్రితం దాకా ఎక్కువగా ఉర్దూ భాష మాట్లాడే వారు. ఉర్దూ భాష గ్రామీణ ప్రాంతాల వారికి అర్థం కాక పోవటం కూడా కొంత కారణం కావచ్చు. కొంతమంది నిరక్షరాస్యులు ‘డబల్‍ బస్సు’ అనేవారు.
అప్పట్లో హైదరాబాదు నగర వాతావరణం ప్రతి ఒక్కరికీ చాలా అనుకూలంగా ఉండేది. సాయంత్రం పూట చల్లటి గాలులు వీచేవి. వేళ్ల మీద లెక్కించ గలిగే బహుళ అంతస్తుల భవనాలు మాత్రమే ఉండేవి. పెద్ద పెద్ద వృక్షాలు ఉండటం, నగర జనాభా తక్కువ ఉండటం, వాహన కాలుష్యం లేక పోవటం వలన నగర జీవనం ఆహ్లాదం కలిగించేది.


నగర సందర్శనకు కుటుంబాలతో వచ్చే వారు సందర్శన స్థలాలతో పాటు వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలతో సరదా కోసం డబుల్‍ డెక్కర్‍ బస్సు ఎక్కి పై అంతస్తు లోని ముందు సీట్లలో కూర్చొని ప్రయాణించటానికి ప్రాధాన్యత నిచ్చేవారు. క్రింది అంతస్తులో ఒక కండక్టర్‍, పై అంతస్తులో మరో కండక్టర్‍ ఉండే ఆ బస్సును డ్రైవర్‍ నడిపే విధానం కొత్తగా నగరానికి వచ్చే వారికి వింతగా అనిపించేది. పై అంతస్తులోని కండక్టర్‍ కొట్టే గంట కింది అంతస్తులోని కండక్టర్‍ కు వినిపిస్తుంది. క్రింది అంతస్తులో ని కండక్టర్‍ కొట్టే గంట డ్రైవర్‍ దగ్గర ఉంటుంది. ఆ విధంగాఒకరికొకరికి సమన్వయం ఉండేది.


రాత్రి వేళల్లో డబుల్‍ డెక్కర్‍ బస్సు పై అంతస్తులో కూర్చుని ప్రయాణం చేస్తుంటే విద్యుద్దీపాల వెలుగులో నగరం అద్భుతంగా కనిపించేది. ముఖ్యంగా టాంక్‍ బండ్‍ దగ్గరకు బస్సు రాగానే చల్లటి గాలులు , హుస్సేన్‍ సాగర్‍ లోని నీటి అలల చప్పుడుతో మనసు ఉల్లాసంగా ఉండేది. బస్సు ప్రయాణంలో కనిపించే ప్యారడైజ్‍ థియేటర్‍, లిబర్టీ థియేటర్‍, విధానసభ భవనం, రవీంద్ర భారతి, రేడియో స్టేషన్‍, పబ్లిక్‍ గార్డెన్‍, లాల్‍ బహదూర్‍ స్టేడియం, జనరల్‍ పోస్ట్ ఆఫీస్‍, గ్రామర్‍ స్కూల్‍, ఉస్మానియా మెడికల్‍ కాలేజీ, ఉస్మానియా ఆస్పత్రి, స్టేట్‍ లైబ్రరీ, గాంధీభవన్‍, మోజంజాహి మార్కెట్‍ దేనికవే హైలైట్‍. బస్సుల్లో రద్దీ బాగానే ఉండేది. కానీ రోడ్లపై వాహన రద్దీ సాధారణంగానే ఉండేది. సిటీ బస్సులు, కొన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు వాహనాలు మాత్రమే రోడ్లపై కనిపించేవి. ప్రజలు రిక్షాలు, సైకిళ్లు ఎక్కువగా ఉపయోగించేవారు. తర్వాత కాలంలో బజాజ్‍ స్కూటర్లు మెల్లగా రోడ్డెక్కటం ప్రారంభించాయి. మూసీపై నిర్మించిన నయాపూల్‍, పురాణ పూల్‍ లాంటి చిన్న చిన్న వంతెనలు కూడా రద్దీ లేకుండా కనిపించేవి. రంజాన్‍, బక్రీద్‍, దీపావళి, బోనాలు లాంటి పండుగల సమయంలో నగరం కోలాహలంగా ఉండేది. మదీనా చౌరస్తాలో రోడ్డుకిరువైపులా జరిపే చిన్న చిన్న వ్యాపారాలు కనుల కింపుగా ఉండేవి. డబుల్‍ డెక్కర్‍ పై అంతస్తులోని కిటికీ గ్లాసు తెరచి క్రిందకు చూస్తుంటే చివరి స్టేజీ దాకా ఏదో మైకం వచ్చినట్లు తన్మయత్వంలో మునిగి పోయే రోజులవి.


డబుల్‍ డెక్కర్‍ బస్సులను నడుపటానికి బాగా అనుభవమున్న డ్రైవర్లను మాత్రమే నియమించే వారు. రెండు అంతస్తుల్లో అరవై మంది పైగా ప్రయాణీకులు కూర్చునే వీలుండేది. కదిలే బస్సులోకి ఎక్కడానికి యువతకు కొంత సులువుగా ఉండేది. క్రింది అంతస్తులో నిలబడి ప్రయాణం చేయటానికి కూడా తగిన స్థలం ఉండేది. పై అంతస్తులో బస్సు రక్షణ దృష్ట్యా సాధ్యమైనంత వరకు నిలబడనిచ్చే వారు కాదు. రోడ్లపై వాహన రద్దీ తక్కువగా ఉండేది కాబట్టి డబుల్‍ డెక్కర్‍ బస్సులు నడపటానికి సులువుగా ఉండేదని చెబుతారు. కాకపోతే వాటి వేగం మామూలు బస్సుల కంటే తక్కువ. వాటి నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే అని అంటారు. వాటి ఉత్పత్తి వ్యయం, ఎక్కువ నిర్వహణ ఖర్చు, తక్కువ వేగం, రక్షణ పరంగా కొన్ని ఇబ్బందులు మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని డబుల్‍ డెక్కర్‍ బస్సు ప్రయాణాన్ని హాయిగా ఆస్వాదించే జన జీవన స్రవంతి నుండి దాదాపు మూడు దశాబ్దాల క్రితం తొలగించటం జరిగింది. మధ్యలో కొన్నిసార్లు డబుల్‍ డెక్కర్‍ బస్సులను తిరిగి నగర రోడ్లపై ప్రవేశ పెట్టాలనే డిమాండ్‍, ఆలోచన అమల్లోకి రాలేదు. అదే విధంగా ట్రెయిలర్‍ బస్సులను కూడా హైదరాబాదు నగరంలో పరిమిత మార్గాల్లో నడిపించే వారు. అందులో కూడా ఇద్దరు కండక్టర్లు ఉండేవారు. ఎప్పటికప్పుడు విపరీతంగా పెరుగుతున్న ప్రైవేట్‍ వాహనాల సంఖ్య, నగర జనాభా దృష్ట్యా చాలా కాలం క్రితమే వాటిని కూడా నగర రోడ్లపై నుండి తొలగించటం జరిగింది.


పాత ఒక వింత కొత్త ఒక రోత అన్నట్టు నేడు నగరంలో రవాణా సంస్థ వాహన ప్రయాణమంటే భయమేస్తుంది. విపరీతమైన రద్దీ, కాలుష్యం, వాతావరణంలో ఉష్ణోగ్రత ప్రభావము కొన్ని కారణాలు. మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్‍ పరిసరాల్లోకి చేరామంటే చల్లటి గాలులు వీచేవి. ఇప్పటికీ వివిధ సంస్కృతుల మేళవింపు హమారా హైదరాబాద్‍. కానీ ఇప్పుడు ఏదో తేడా గోచరిస్తుంది. ఏది ఏమైనా అప్పటి పాత తరం వారికి డబుల్‍ డెక్కర్‍ బస్సు ప్రయాణం మరపురాని మధురమైన జ్ఞాపకాల్ని మిగిల్చింది.


తడకమళ్ళ మురళీధర్‍,
: 9848545970

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *