ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -3

ప్రకృతి సూత్రాలలో 16వది – అనగా జీవశాస్త్ర పరంగా రెండవది:
జీవం కేవలం కణాల్లో మాత్రమే ఉంటుంది!
(Life exist only in the cell))
సినిమాల ప్రభావం, ముఖ్యంగా పౌరాణిక సినిమాలు నమ్మకాల్ని మరింత బలోపేతం చేసాయి. ఇక బుల్లితెర వచ్చిన తర్వాత మూఢనమ్మకాల్ని మరింతగా పెంచి పోషించాయి. ఈ భావజాలమే ఏడేడు లోకాలని, స్వర్గమని, నరకమని నమ్మేలా చేసాయి. ఒకదానికి ఇంద్రుడు (సర్వ దుర్గుణాలు గలవాడు) రాజైతే, సుగుణ వంతుడైన యముడు నరకానికి రాజు. సతీసావిత్రి సినిమాలో ఓ దున్నపోతుపై వచ్చి, చేతిలోని పగ్గం (యమపాశం) వేసి ప్రాణం హరించే విధానాన్ని చూపడం, జనాలంతా నిజంగానే ప్రాణం జ్యోతి రూపంలో వుంటుందనే భ్రమలకు లోనుకావడం తెలిసిందే! దీన్ని వాస్తవమని నమ్మేవారు అత్యధికులు కణం గూర్చి, కణ నిర్మాణం గూర్చి, జంతు, వృక్ష కణాల తేడాల గూర్చి, అందులో వుండే వివిధ పదార్థాల గూర్చి, వాటి నిర్మాణం, విధుల గూర్చి బాగా చదువుకొని, రాసి అత్యధిక మార్కుల్ని కొట్టేసినవారే!


నిజాంగా ప్రాణం ఓ జ్యోతి రూపంలో వుంటే, అది గుండెలోనో మరో అంగంలోనో వుంటే, మిగతా అవయవాలెలా పని చేస్తాయో ఆలోచించం. అసలిలా ఆలోచించడమే ‘తప్పు’ అనే భావనగల పంతుల్లున్న పాఠశాల వ్యవస్థ మనది. అయినా ఓ క్షణం దీన్ని నమ్ముదాం! మరి అవయవదానం (కార్నియా, గుండె, మూత్ర పిండాలు, లివర్‍ మొ।।) ఎలా జరుగుతున్నది. చనిపోయిన వ్యక్తుల ‘కార్నియా’ మరో అందునికి దృష్టినిస్తుంది. ప్రాణం పోయిన వ్యక్తి కార్నియా ఎలా పని చేస్తుందో ఆలోచించం. అలాగే బ్రేన్‍ డెడ్‍ (brain dead) అయిన వ్యక్తుల అవయవాలు మరో నలుగురైదుగురికి ఎలా పనిచేస్తున్నాయో మన ‘మత’ బుర్రలకు తట్టదు.
కాబట్టే, శాస్త్ర పరిజ్ఞానం ఈ నమ్మకాలకు చెల్లుచీటి నిచ్చి ‘జీవం’ కణాలల్లో వుంటుందని ఈ కణాల సముదాయమే అవయవాలుగా, భాగాలుగా, రక్తనాళాలుగా, నాడులుగా, కండరాలుగా, ఎముకలుగా, వృక్షాలల్లో జైలం (xylem), ఫ్లోయం (phloem) నాళాలుగా, బెరడుగా, కాండంగా, పువ్వులుగా, కాయలుగా మారుతాయి. ఇది మరింత సులభంగా అర్థం కావాలంటే, విత్తనం మొలకెత్తుటే చక్కని ఉదాహరణ. మనం పాఠశాలలో చదువుకున్నప్పుడు మూడు విత్తనాలను ఓ బీకరులో నిలువుగా అమర్చి, మధ్య విత్తనం సగం నానే వరకు నీటిని పోసి, పరిశీలించి చూసింది తెలిసిందే! అంటే, అప్పటి దాకా నిద్రావస్థలో వున్న విత్తనం, బాహ్యశక్తులతో (వేడి, నీరు, గాలి) ప్రేరేపితమై మొలకెత్తడం చూస్తాం. అంటే, జఢత్వంలో వున్న విత్తనం అనుకూల పరిస్థితుల్లో చైతన్యం పొంది మొలకగా మారడం! అప్పటిదాకా ఓ రసాయనిక ముద్దలావున్న విత్తనం జీవిగా రూపాం తరం చెందడం జరుగుతుంది.


ఈ ప్రకృతిచర్య విశ్వజనీనమా అనే ప్రశ్నవ రావచ్చు! ఇప్పటిదాకా గ్రహిం చిన అంశాల ప్రకారం ‘జీవం’ భూమిపైన మాత్రమే గుర్తించడం జరిగింది. భూమి లాంటి గ్రహాలు విశ్వంలో కోట్ల సంఖ్యలో వుంటాయనేది ఓ అంచనా! అనగా మన సౌరకుటుంబం లాంటి వ్యవస్థలు లక్షలల్లో వుంటాయని. ఆ వ్యవస్థల్లో జీవం వున్న మనలాంటి ‘భూ’ వ్యవస్థలు వుండచ్చు! వుండక పోవచ్చు! పోతే సైన్సు ఎప్పుడు వుంటుందనే ఓ పరికల్పనతో (hypothesis) ప్రయోగాలు చేస్తుంది.
జీవి : (కణం : CELL)
నిర్జీవ (inorganic) పదార్థాల సహాయంతో తమలాంటి నిర్మాణాల్ని (కణాల్ని) ఉత్పత్తి (reproduce) చేసుకునే శక్తిగల పదార్థాల్ని జీవులుగా చెప్పవచ్చు. ఇవి ప్రకృతిలో జరిగే అనుకూల మార్పులకు ఎదురు నిలిచి, అసహజ రసాయనిక చర్యల్ని స్వయంగా కొనసాగించుకోగల శక్తిగలిగిన పదార్థ స్వరూపాలను మాత్రమే జీవులుగా గుర్తిస్తాం.
కాబట్టే ఇవి విధిగా కణ నిర్మితాలు (cellular). చుట్టూ కణ కవచం (cell membrane) లోపల కణద్రవం (cytoplasm), మధ్యన కేంద్రకం (nucleus), లోపల న్యూక్లిక్‍ ఆమ్లమైన డిఎన్‍ఎ (DNA)తో పాటు న్యూక్లియోలిస్‍  (nucleolus) వుంటుంది. కణద్రవంలో మరో న్యూక్లిక్‍ ఆమ్లమైన ఆర్‍ఎన్‍ఎ (RNA), జీవక్రియల్ని (metabolic) జరిపె మైటోకాండ్రియా  (mitochondria) లాంటి తదితర పదార్థలుంటాయి. ఇలా నిర్మితమైన వాటినే జీవకణ మంటారు. జంతువుల, వృక్షాల జీవకణంలో కొంచెం వ్యత్యాసం వుంటుంది.


వైరస్‍ : (VIRUS)
వైరస్‍ల గూర్చి తెలిసింది తక్కువ. తెలియందే ఎక్కువ. ఇప్పటికి దీన్నో కణం (cell)గా గుర్తించని స్థితి. కారణం, ఇది స్వయంగా ఉత్పత్తిని (reproduce) చేసుకోలేదు. అందుకే దీనికి రెండు రూపాలుంటాయని అంటారు. స్వతాహ బయట వున్నప్పుడు ఇదో నిర్జీవి (non-living)గా, ఏదైనా అతిథి (host)లో ప్రవేశించినప్పుడు జీవిగా (living) పరిగణించబడుతుంది. అంటే, బయట వున్నప్పుడు ఇతర జీవకణాల్లా నిర్జీవ పదార్థాల సహాయంతో ప్రత్యుత్పత్తిని జరుపుకోలేదు. ఏదైన ఇతర జీవి శరీరంలోకి (కీటకాలు, పక్షులు, జంతువులు, మనుషులు మొ।।) ప్రవేశించిన తర్వాతనే ఇతర జీవకణాల్లా నిర్జీవ పదార్థాలతో చర్య జరిపి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. ఈ ప్రత్యుత్పత్తి ద్విసంఖ్యామానంలో క్షణాల్లో జరగవచ్చు! ఒక్క వైరస్‍ లక్షలుగా ఎదగవచ్చు!
అందుకే దీని నిర్మాణము ఇతర జీవకణాల్లా వుండదు. వైరస్‍ కూడా DNA, RNA లను ఓ ప్రొటీన్‍ (protein) అనే రక్షణ కవచంలో కల్గి ఉంటుంది. దీన్ని కాప్సిడ్‍ (capsid) అంటారు. ఈ కాప్సిడ్‍ నిర్మాణాలు వైరస్‍కు వైరస్‍కు తేడాల్ని కల్గి వుంటాయి. వైరియన్‍ (virion)గా పిలవబడే ఈ వైరస్‍లు అతిథిలో ప్రవేశించిన తర్వాత అతిథికి సంబంధించిన కణకవచాల్ని లిపిడి కవచంగా (lipid envelop) మార్చుకుంటుంది. ఈ విధానమే అతిథికి ప్రాణాంతకంగా మారుతుంది.


కరోనా వైరస్‍ :

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఈ సుగుణాల్నే కల్గి వున్నది. ఇది ఒకే ప్రజాతికి (genus) చెందినా, అనేక రకాలని పరిశోధనలు చెప్పుతున్నాయి. అంటే ఇవి అనేక జాతులుగా (species) వుండి వుంటాయి. అందుకే ఒక్కోదేశంలో, ప్రాంతంలో ఒక్కో తీరుగా ఇవి ప్రభావం చూపుతున్నాయి.
చివరగా తెలిసిం దేంటంటే, అతిథికి బయట వున్నంతసేపు ఈ వైరస్‍లతో ఎలాంటి ప్రమాదం వుండదు. అతిథిలోకి ప్రవేశిస్తేనే ప్రమాదకరం! అందుకే వైరస్‍లు ప్రవేశించ కుండా జాగ్రత్తల్ని తీసుకోవాల్సిందే. ముఖానికి దళసరి గుడ్డను కట్టుకోవడం, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడమే ఈ వైరస్‍ల నుంచి రక్షణ!
(ఈ సందర్భంగా మాయలఫకీర్‍ ప్రాణం ఏడు సముద్రాల అవతలగల మర్రిచెట్టు తొర్రలో వుండే చిలుకలో వుంటుందనే జానపద గాథల్ని గతితర్కంతో చూడాలి)
ఇలాంటి అభూత గాథలు ప్రపంచవ్యాపితంగా వున్నాయి. అరేబియన్‍ నైట్‍ కథలు, అల్లావుద్దీన్‍ అద్భుత దీపం ఇలాంటి కాల్పనికాలే!
అందుకే ప్లాటో (plato) పిల్లలకు అభూత కల్పనతోగల గాథల్ని, శక్తిమాన్‍లాంటి సాహస కథల్ని చెప్పవద్దని సూచించాడు. (వచ్చే సంచికలో 17వ ప్రకృతి సూత్రాన్ని చూద్దాం!)


– డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *