మల్యాలరెడ్ల రాజధాని సంకీసపురంలో కొత్త తామ్రశాసనం

ఇటీవల మహబూబాబాద్‍ జిల్లా, డొర్నకల్‍ మండలంలోని పెరుమాండ్ల సంకీస గ్రామంలోని రామాలయాన్ని సందర్శించినపుడు దేవాలయ పూజారి గుడికి సంబంధించిన రాగిరేకు దానశాసనాన్ని చూపించారు. ఇంతవరకు వెలుగుచూడని ఈ శాసనం ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలియజేస్తున్నది. మనమింతవరకు తెలుసుకున్న శాసనాలలో ఈ శాసనానిది ప్రత్యేకస్థానం. ఒకనాటి సామాజిక చరిత్రను నిర్దుష్టంగా చెప్పగలవి శాసనాలేకదా. పెరుమాండ్ల సంకీస తామ్ర శాసనం ఆలయచరిత్రతోపాటు వైష్ణవ దేవాలయ సాంస్కృతిక వివరాలను ప్రస్తావిస్తున్నది.


ఈ శాసనం రాగిరేకు మీద రెండువైపులా లిఖించబడ్డది. తెలుగుభాషలో, తెలుగులిపిలో కరణీకం రాతశైలిలో రాసివున్న శాసనంలో శాసనకాలం సాధారణ శకసంవత్సరంలో రాసే రివాజులో కాకుండా నాటి పాలకులు పాటించే హిజ్రీశకంలో చెప్పబడ్డది. శాసతి ఇతి శాసనం. రాజులు శాసిస్తారు. ప్రజలు పాటిస్తారు. శాసనభాషమీద పాలనాకాలం నాటి వ్యవహారభాషా ప్రభావం సహజం. ఈ శాసనంలో ఉర్దూభాషాపదాలు వాడబడ్డాయి. వైష్ణవమత సాంప్రదాయిక విశేషపదాలు ఈ శాసనంద్వారా మనకు తెలుస్తున్నాయి. తామ్రపత్రం పై అంచున వైష్ణవ ఆరాధనాచిహ్నాలైన ఊర్ద్వ పుండరీకాలు శంఖు, చక్రసహితంగా చెక్కి తోరణంతో అలంకించారు. వాటిక్రింద శ్రీ సీతారామ చంద్రస్వామి, శ్రీ వేణుగోపాల స్వామి అని రాసారు. అంటే ఈ ఆలయం ఇద్దరు దేవుళ్ళ కొలువు అన్నమాట. లేదా ఒకప్పటి వేణుగోపాల స్వామి ఆలయంలో సీతారాముడిని చేర్చారేమో అని శాసన విశేషాలు పరిశీలించినప్పుడు అర్దం అవుతుంది.


ఈ శాసనం హిజ్రీశకం 1237లో వేయించబడింది. గ్రెగోరియన్‍ ప్రకారం అది క్రీ.శ 1820వ సంవత్సరం తామ్ర దానపత్రం రాయించిన సంవత్సరం అవుతుంది. శక సంవత్సర పద్దతిలో విక్రమనామ సం.ర చైత్ర శుద్ద పంచమినాడు. అంతకు మునుపు హిజ్రీశకం 1230లో శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రతిష్టాపనా చార్యులయిన మంగళగిరి రామాను జాచార్యులు గోపాచార్యులగారికి యర్రసాని వెంకట తిమ్మయ చిననర్సయ్య గోపాలరాయుడు దేశముఖు, హవేలి తాలూకా కంభం మెట్టుగార్లు వ్రాయించి యిచ్చిన భూదాన పత్రిక (కాగితం కావడంవల్ల) శిథిలమైపోతే, కొత్తగా రాగిరేకుమీద దేవాలయంలో నిర్వహించే నిత్యవిధులకు, అంగరంగభోగాలకు ఆనాటి స్థానిక పాలకులు యర్రసాని వెంకట తిమ్మయ దేశముఖ్‍, యర్రసాని చిన నర్సయ దేశముఖ్‍, యర్రసాని గోపాల రాయుడు దేశముఖులు ముగ్గురు ఉమ్మడిగా దేవాలయ అర్చకులకు రాయించి యిచ్చిన దానాల వివరాలు ఈ శాసనంలో వున్నాయి.


ఈ శాసనకర్తల తాతగారైన అంకం బాలన్నగారు తూర్పునుంచి స్వామి వారిని వేంచేపు చేసుకుని వచ్చే కాలంలో శాసనకాలంనాటి దానగ్రహీత రామానుజాచార్యులుగారి తాతగారైన మంగళగిరి భావనాచార్యులుగారిని కూడా తీసుకుని వచ్చినట్లు పేర్కొన్నారు. మన్నెగూడెంకు తూర్పునుంచి తీసుకుని వచ్చిన స్వామివారికి భావనాచార్యుల వారి ద్వారా కైంకర్యములు నిర్వహణ జరిపేవారు. కానీ ఆ గ్రామం వయిదాను తప్పి బేచిరాగు కావడంతో శ్రీవారిని సంకీసలో ప్రవేశింపబెట్టి ఆకాలంలో అదే మంగళగిరివంశం వారైన పెదనర్సయగారికి కాగితం రాయించి ఇచ్చారట. దీనికి ముందు కన్నెగుండ్లలో శ్రీవారి ప్రతిష్ట జరిగిందని అట్టి ప్రతిష్ట ఘంటావారు చేసారని తెలిపారు. అటువంటి కాగితం కాల క్రమంలో శిధిలం కావడంతో ఈ మూడు కరణపు కుటుంబాల దేశముఖ్‍ లకు సావధానం అయిన కాలం చూసుకుని, సంతోషంతో శాశ్వతకాలం వుండేలాగా ఈ తామ్ర దానపత్రం రాయించినట్లు ప్రస్తావించారు. దీనిలో అర్చక జీవనం కోసం, స్వామివారి ప్రసాదాలుగా దద్యోదనం, పొంగలిలాంటివి ఆరగింపు సేవలకు దిట్టం కొలతలు తెలిపారు. పండుగ పర్వాదులు, మారుఫళి, అధ్యయన ఉత్సవాలు, తిరుకళ్యాణ ఉత్సవం, నిత్యవిధి, ధూపదీపాలు నందాతిరువళికి ఏర్పాట్లకై నూనె వంటివి కేటాయించారు. ఇవి మొదట కొన్నాళ్ళు తమ స్వంతం నుంచే జరిపించేవారని ఆ తర్వాత శాశ్వత ఏర్పాట్లకోసం ఈ భూముల కేటాయింపుతో పాటు ముప్పై గ్రామాలనుంచి దేవదోసిళ్ళు, పెళ్ళికట్నాల ద్వారా ఆదాయం అందే ఏర్పాటు చేసారు. పంటకాలంలో తొలిగా కొన్నిదోసిళ్ళ వడ్లు దేవుని సమర్పణగా తీసేవాటిని దేవదోసిలిగా పేర్కొంటారు. ముప్పై గ్రామాలలో ఎక్కడ వివాహం జరిగినా ఆడపెళ్ళివారైతే అర్ధరూపాయి, మగపెళ్ళివారైతే రూపాయి చొప్పున స్వామివారికి కట్నంగా సమర్పించాల్సి వుంటుంది. ఈ దానశాసనం ఇచ్చిన మూడు సంప్రతులవారు వీటిని వంశ పారంపర్యంగా అనుభవించ మని చెపుతూ ఆస్తులను నగర తర్పణగా వ్రాయించి ఇస్తూ, వారికోసం స్వామి సన్నిధిని త్రికాలమందు వారి పేర్లతో మంత్రపుష్పం జరిపించమని కోరుకున్నారు. ఇట్టి కట్టు బాటును ల్లంఘించరాదని శాపోక్తులతో శాసనపాఠం ముగుస్తుంది.


చరిత్రలో పెరుమాండ్ల (దేవుని) సంకీస:

కాకతీయులకు సామంతులుగా వ్యవహరించిన దుర్జయ కులాన్వయులు మల్యాలరెడ్డిరాజులు దండనాయకులై పాలించిన రెండు రాజధానులు వర్ధమానపురము, సంకీస పురాలు. ఆ సంకీస పురము ఇప్పటి డోర్నకల్‍ మండలంలోని సంకీసనే అని బియన్‍. శాస్త్రిగారు నిర్దారణగా తన మల్యాలరాజుల చరిత్రలో ఆధార సహితంగా పేర్కొన్నారు. ఈ వంశపు మూలపురుషుడు దన్నసేనానికి ఇద్దరు కొడుకులు మొదటివాడు సబ్బదండ నాయకుడు, ఈయనే సంకీస పురాధీశ్వరుడు. రెండవకొడుకు పెదముత్తుగండ బాచవరూధి నీశుడు వర్దమానపుర పాలకుడు. ఈయన గోనబుద్దారెడ్డికి వియ్యంకుడు కూడా. చౌండసేనాని వేయించిన శక సం.1125 అంటే క్రీ.శ.1203 నాటి కొండిపర్తి శాసనంలో సంకీశాధీశ్వరుడైన సబ్బసేనాని అంటూ ‘సంకీస’ ప్రస్తావన వస్తుంది. సబ్బసేనాని మనవడు చౌండసేనాని భార్య మైలమ శక సం.1124లో ప్రకటించిన శాసనములో సబ్బసేనాని కుమారుడు కాటసేనానిని ‘‘తతోజనిష్ట మేధావీ కాటయః సంకిసాధిపః’’ అంటూ సంకీస పురాధినాదునిగా పేర్కొన్నది. కాటయసేనాని స్వయంగా వేయించిన శక.సం 1162 నాటి కొండిపర్తి శాసనంలో ‘‘సంకీసాధీశ మథ్థిన్నామద్ధిన్‍ తాత్థన్దం ’’ అంటూ ‘సంకీస’ ప్రస్తావన వస్తుంది. మల్యాల గుండన శక.సం 1667లో వేయించిన వర్ధమానపురశాసనంలో ‘‘సంకీసపురాధినాథ తిమిర మార్తాండునుం బెడముట్టు గండండును’’ అనే ప్రస్తావన వుంది. అలాగే మల్యాలగుండన మంత్రి వేయించిన శక.సం 1194నాటి బూదపుర శాసనంలో ‘‘సంకీస పురాధినాథ….’’ అని కనిపిస్తుంది. ఇటువంటి ప్రస్తావనల ఆధారంగా నేటికికూడా కనిపిస్తున్న దుర్గాల ఆనవాళ్లతోనూ ఈ సంకీస పురము ఒకప్పుడు రాజఠీవితో విలసిల్లినది అని నిర్ధ్వందముగా చెప్పవచ్చు.


ఇదే గ్రామంలోని శిధిల శివాలయ ప్రతిమలతోపాటు, కోటగోడల ఆనవాళ్ళు, ఆలయనిర్మాణం వాహనభోగాల వంటివి పరిశీలిస్తే మనకిది ప్రాచీనమైనదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. గరుడవాహనం, హనుమ వాహనం, శేష వాహనం, గజ వాహనం, తురగ వాహనం, హంస వాహనం, కల్పవృక్ష వాహనం వంటి ఉత్సవ వాహనాలు లోహ నిర్మితాలుగా ఈ గుడి ఆవరణలో కనిపిస్తాయి.


ఈ ఆలయంలో పంచతల రాజగోపుర నిర్మాణ విధానం ప్రత్యేక ఆకర్షణ, గోపురపు కుడ్య చిత్రంలో కనిపించే రెండుతలల గంఢభేరుండ పక్షి శైవ, వైష్ణవ విభేధాలు వాటి ఆధిపత్యపోరుకు సంబంధించిన ఒకానొక చారిత్రక చిహ్నం. కళ్ళాణ మంటప ఈశాన్య స్థంభంకు ధక్షిణ తూర్పుదిశలలో వున్న మండపనిర్మాణ సంబంధమైన లఘుదాన శాసనం ఖరనామ సంవత్సరం నాటిది. ఈ కళ్యాణ మండపం మల్యాల రెడ్డిరాజుల ఇతర కళ్యాణమండప నిర్మాణాలతో అచ్చంగా పోలికలతో వుంది. అద్యయననోత్సవాలు నిర్వహించే ముందువాకిలి దగ్గరి నాపరాళ్ళపై వేయించిన 45 ఏళ్ళ క్రితపు, 1975నాటి ఆధునికశాసనం నాపరాళ్ళు వేయించిన విషయాన్ని ప్రస్తావిస్తుంది. మూలవిరాట్టు ప్రత్యేకత గమనిస్తే హనుమత్సమేత సీతారామలక్ష్మణులతోపాటు భరత, శత్రుఘ్నులు కూడా వున్నారు. గర్భాలయం అభిముఖ మండపాలలో ఒకవైపు రామానుజులు తదితర ఆళ్వారులు, మరోవైపు గోదాదేవీ కనిపిస్తారు. అంతరాలయం బయటి గోడల క్రింది వరుసలో సీతారామ, లక్ష్మణుల వనవాసఘట్టం ఉల్బణశిల్పాలున్నాయి. సంకీస రాముడి అందం గురించి ఈ ప్రాంతంలో ‘వైభవంలో భదాద్రి రాముడు -చక్కదనంలో సంకీస రాముడు’ అనడం జనంవాడుక.


సంకీస ఆలయ తామ్ర పత్రం ముందువైపు

  1. వర్తమాన వ్యవహారిక చాంద్రమాన విక్రమ నామ సంవత్సర చెత్ర శుద్ద 5(పంచమి) గు
  2. రువారము నాడు శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాం
  3. త ప్రతిష్టాపనా చార్యులయిన మంగళగిరి రామానుజాచార్యులు గో
  4. పాచార్యుల గారికి యర్రసాని వెంకట తిమ్మయ చిన నర్సయ్య గోపాల
  5. రాయుడు దేశముఖు గార్లు పా।। హవేలి తాలూక కంభం మెట్టు గారు వ్రాయు
  6. 0చి యిచ్చిన భూదాన పత్రిక స్నా 1230 సాలుబా మ।। సంకీస సీతా రామ
  7. స్వామి గోపాల స్వామి వారి అర్చన కయింకర్యమో వుండె నిమిత్తంము
  8. పూర్వము మం।। మన్నెగూడెములో మా తాతగారు అయిన అంకం
  9. న బాలన్న గారు తూర్పు నుంచి స్వామి వారిని వెంచేపు చేసుకుని వచ్చే కా
  10. ల మందు మీ మూల పురుషులు అయిన మంగళగిరి భావనా చా
  11. ర్యుల గారిని కూడా తీసుకుని వచ్చి మన్నెగూడెములో కొన్ని సంవత్స
  12. రములు స్వామి కయింకర్యము జర్పుతూ వుండిరి కనక మధ్యన ఆ గ్రామం
  13. వయిదాను తప్పినంద్ను బేచిరాగు కాబట్టి శ్రీవారిని మ।। సాంకిసా లో
  14. ప్రావెంశింప్యా బెట్టిన కాలమందు మంగళగిరి పెదనర్సయ గారికి కాయి
  15. దం వ్రాయించి యిచి నారు హలు వరకు ఆ కాయిదం శిధిలం ఆయి
  16. పోయినదని అంటరి కనక మాకు సమాధానం అయ్యి మా మూడు
  17. సాంప్రతుల వారము హరుషించి మీకు శాశ్విత కాలము వుండ
  18. గలందుల కయిన రాగి శాసనము మీద వ్రాయించి యిచ్చిన భూ
  19. దానపత్రిక ।।। 1 ।।మ।। సాంకిసాలో అర్చక జీవనము కిందికి 30 12
  20. యెడుదుం యిత్తుల బాడువ పొలం పయి తోటల గడమిట పొలం
  21. దజ్యోయనం మళ్ళు సాహా 0।0 యెడుంరిత్తుల పొలం మం ।। కన్నెగుం
  22. డ్ల చమోన మోట బావి కింద 71 తళి హెత్యం కిందికి తూమెడు విత్తు
  23. ల పొలం అర్చక జీవనం క్రింద ।।1 పాదకాలు 20 విత్తుల పొలం 01 డరా
  24. విగడ పొలం నిత్య విధికి కంయింకర్యము కిందికి యెంమ్మండుం విత్తుల పొ
  25. లం జ్మలాప్రాటు తూమెడు విత్తుల పొలం ।।1।। శ్రీ వారికి నిత్య క
  26. యింకర్యము నిర్ణయము చేశ్నిరి శె 30 నెల వక్కట బియ్యంము పావు
  27. శేరుల (పైసలా/పెసలా) దద్యొయనంకు రోజు 1కి శే 1 శేరు చొప్పున శె 2110 నెయి అరద శే
  28. రు వుప్పు మూడు శేరుల పెరుగు సవాశేరు జీలకర్ర తులాలు యన్మిది
  29. సొంటి యన్మిది తులాలు సాంబ్రాణి యన్మిది తులాలు పెర్గు నిత్య
  30. 0 కానిలెక పొంగలి చేస్తే కానిని నె 1 కి నెయి 30 ముప్పయి చొప్పున మాపటి
  31. పూట ఆరగింపు ని।। పావు శేరు పాంనె దానికి పొరియం కొసనంయో కి బెల్లం అ
  32. యిదు తులాలు శితళానికి పోకలు టంక మొత్తు చొప్పున యిచ్చే।।
  33. న నిత్యవిధి కయింకర్యం పూర్ణతళిహస మెతుయెర్వరి తిమిగన్కయూ
  34. చొప్పున నిత్యవిధి జరిగించుతూ వుండవలశినది మీకు సమాధానం
  35. అయిన భూమిలో తూమెడు జొన్నల చెల్క చేసుకోవలశినది మ।।
  36. కన్నెగుండ్లలో శ్రీవారికి ప్రతష్ట ఘంటావారు చేశిన కాలమందు
  37. యిప్పించిన పొలం 0।0 మయిసి తూముకాల్వ కింద దక్షిణ భాగ
  38. మందు అరుదుం(అరతూము) విత్తుల పొలం 01 మొగిలబావి కింద యొదుం విత్తు
  39. ల పొలం ।।- 070 l కుంచెడు జొన్నల పెరడు 1 చింత చెట్టు నకటయి
  40. వెనక వైపు
  41. ప్రకారం యిప్పించిత్మి 1 మ।। మంన్నెగూడెములో కాశ చెర్వు పెగ్కుంతిని యిద్దుం
  42. విత్తుల పొలం 08 0।0 గడికి దక్షిణ భాగమందు మల్లన్న విపర్యకుం చెరు జొన్నల చా
  43. రడు రెండు అంత్యలు ।। యూ ప్రాకారం సదర్న వ్రాశ్నినిబంధన చొప్పున మూడు గ్రా
  44. మాల యినాములు ప్రతి సంవత్సరం శెవ్వ పారుచుకుని అనుభవించుతూ శ్రీ
  45. వారికి కయింకర్యములో లోపము లేకుండా నిత్యవిధి జర్గించుతూ వుండవల్సి
  46. నది ।- శ్రీవారికి నందా తిరువళిఫకు నూనే నెల వంక్కిట మణ్ము చొ।।న తి రు
  47. నక్షత్రాలు పండుగ, పారువదులు, మారుఫళి, అధ్యయన వుత్సవం, తిరు
  48. కల్యాణ ఉత్సవం, యీ మొదలయినవి మా స్వంతము నుంచి జర్గించుతూ
  49. వున్నాము ।।- ఉత్సవముతో మీకు యిప్పించె నిబంధనం ళని 10 బియ్యం యిదుం
  50. కుంచెడు పావుయెంమ్మిది మాన్కులు(మానికలు) పుప్పు నాల్గు శేరుల నరపాండు రెండు తక్కళ్ళు రెండు త
  51. క్కళ్లు నెయ్యి మిరియపు వడ్లు ఆడికి శేరు గోపాల స్వామి ఉత్సవంకు పాయినని వ్రా
  52. యించిన పద్దతిలో సముదాయించుతూ వున్నాము. ఈ ప్రకారం మూడు గ్రామా
  53. ల యీనాములు అనుభవించుకుంటా మా మూడు గ్రామాల దెవదొశిలి
  54. పాటి మాన్కలు, కట్టుమేర మా తా ।। లో, ముప్పాయి గ్రామాల పెండ్లి కట్నాలు
  55. ఆడపెండ్లికి అరద వెంబది మెగపెండ్లికి రూపాయి వెంబది యిప్పించుతూ వున్నా
  56. ము. సదరు నిభందనల ప్రకారం పుత్రపౌత్రపారంపర్యాయం అనభవించు
  57. తూ స్వామి సన్నిధిన త్రికాలముల యందు మా పేరున మంత్రపుష్పం జర
  58. పించుతూ వుండగలరు యిది మా సమ్మతిన మూడు సంప్రతుల వారం సంక్కిసా
  59. స్వామి కోవిల్లో నగర తర్పణముగా వ్రాయించి యిచ్చిన భూదాన పత్రి
  60. క మా మూడు సాంప్రతుల వారితో యవరం వున్న పాటికిని స్వామి కయిం
  61. కర్యం లోటు లేకుండా జర్గించుతూ వున్నాము. సాహిత్యమూ మెరబవ్వలుక్ష
  62. 1237 హిజిరి
    ద।। యర్రసాని వెంకట తిమ్మయ దేశముఖ్‍
    ద।। యర్రసాని చిన నర్సయ దేశముఖ్‍
    ధ।। యర్రసాని గోపాల రాయుడు దేశముఖ్‍
    (శ్రీరామోజు హరగోపాల్‍ సహాయంతో క్షేత్ర పరిశోధన)

కట్టా శ్రీనివాసరావు,
ఎ : 9885133969

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *