నక్షత్రనౌక భరణి అంతరిక్షంలో ఆవగింజలా తేలిపోతోంది. కాప్టెన్ మారుతి నౌకను నెఫ్ట్యూన్ కక్షలోంచి ఇవతలికి లాగాడు. భరణిలో దాదాపు వెయ్యిమంది సైనికులున్నారు. అత్యంత శక్తివంతమైన ఎన్నో మారణాయుధాలున్నాయి. నెప్ట్యూన్‍కి ఆవలగల ‘జంబూ’ గ్రహంలో తలెత్తిన తిరుగుబాటును అణిచివెయ్యడానికి భరణి వెడుతోంది. మారుతి పక్కనే గోడలో టీ.విలాంటి ఒక పరికరం బిగించబడి ఉంది. మారుతి సహాయకురాలు శశిరేఖ ఆ టి.విలోకి పరీక్షగా చూస్తోంది. ఉన్నట్టుండి శశిరేఖ ‘‘మారుతీ’’ అని గట్టిగా అరిచింది. మారుతి ఉలిక్కిపడ్డాడు. అయోమయంగా శశిరేఖ మొహంలోకి చూశాడు. ‘ఇదిగో ఇటు చూడు’ అంటూ తెరవైపు చూపించింది శశిరేఖ. తెరలోకి చూసిన మారుతికి భరణి బయటున్న విశాల విశ్వం కనిపించింది. ఇంకా పరీక్షగా చూసిన అతనికి భరణి వెనుకాలే వస్తున్న ఒక బంతిలాంటి ఆకారం కనిపించింది. ఆ బంతి ధగ ధగా మెరిసిపోతూంది. వెంటనే మారుతి తన ముందున్న ఒక స్విచ్చ్ని నొక్కాడు. ‘కల్నల్ మహా బాహుని మాట్లాడుతున్నాను’ అని వినిపించింది. ‘‘కల్నల్! ఒకసారి కాక్‍పిట్‍లోకి రండి. ఏదో వింత వస్తువు మన నౌకను వెన్నంటి వస్తోంది’’ అన్నాడు మారుతి. క్షణంలో కల్నల్ మహాబహు కాక్ పిట్‍లోకి వచ్చాడు. తెరలోకి చూసిన మహా బాహు మొహం బిగుసుకుపోయింది. ‘‘ఇది శత్రువులు మన నౌకమీద ప్రయోగించిన ఆయుధం అని తోస్తోంది. దాన్ని వెంటనే పట్టుకోవాలి’’ అన్నాడు.
మారుతి తన ముందు ఉన్న బల్లకి అమర్చిన వందలాది స్విచ్చులలో ఒక స్విచ్చిని నొక్కాడు. వెంటనే భరణి కింది భాగంలో పక్కగా అమర్చిన తలుపు ఒకటి తెరుచుకుంది. మారుతి మరొక స్విచ్చి నొక్కాడు. తెరుచుకున్న మార్గం ద్వారా లేజర్ కిరణాలు ఆ బంతి దగ్గరకి వెళ్ళాయి. ఆ బంతి చుట్టూ గొలుసుల్లాగ చుట్టుకుపోయాయి. మారుతి ఇంకో స్విచ్చి నొక్కాడు. లేజర్ గొలుసులు ఆ బంతిని భరణిలోకి తెచ్చాయి. వెంటనే తలుపు మూసుకుపోయింది.
భరణి మొదటి అంతస్థులో ఇంజినీర్ రామప్ప తనకు ఎదురుగా బల్లమీద ఉన్న ఆ బంతిని పరీక్షగా చూస్తున్నాడు. కల్నల్ మహాబాహు, డాక్టర్ ధన్వంతరి అతనికి చెరో వైపున ఉన్నారు. బల్ల చుట్టూ పదిమంది మెరికల్లాంటి కమెండోలు ఉన్నారు.
‘‘ఇది గాజు బంతి – ఇందులో రెండు ఆకారాలున్నాయి’’ అన్నాడు రామప్ప. వెంటనే కప్పు ఎగిరి పోయేలా తుమ్మాడు. జేబులోంచి చేతిగుడ్డ తీసుకొన్ని ముక్కు తుడుచుకున్నాడు.
‘‘ఆ బంతిని పగలగొట్టు. లోపల ఆకారాల సంగతేమిటో తేల్చుకుందాం’’ అన్నాడు మహాబాహు.
‘‘హాచ్’’ అని మళ్ళీ తుమ్మాడు రామప్ప. చాలాసేపు తంటాలు పడి ఆ బంతిని తెరిచాడు. వెంటనే ధన్వంతరి ఆ బంతి దగ్గరికి వెళ్ళాడు. దాదాపు ఒక గది అంత ఉన్న ఆ బంతిలో రెండు బల్లలున్నాయి. ఆ బల్లల మీద రెండు ఆకారాలు నిద్రపోతున్నట్లు పడుకొని ఉన్నాయి. ఒక ఆకారం దాదాపు 8 అడుగుల పొడవు ఉంది. దానికి ఈ చెవి నుంచి ఆ చెవి దాక కనుబొమల మీదుగా దట్టమైన వెంట్రుకలున్నాయి. ఆ జాతి మగవాళ్ళకు మీసాలు కళ్ళమీద ఉంటాయి కాబోలు అనుకున్నాడు ధన్వంతరి. రెండో ఆకారం సుమారు 7 అడుగుల పొడవు ఉంది. అది ఆడమనిషి అని చూడగానే తెలిసిపోతుంది. ఆ ఆకారాల మూతులు మటుకు గుండ్రంగా సున్నాలలాగ ఉన్నాయి.
‘‘ఒక మగవాడు ఆడది లోపల ఉన్నారు’’ అన్నాడు ధన్వంతరి. అతని మాటలు పూర్తి అయ్యాయో లేదో, బంతిలోని ఆకారాలు లేచి కూర్చున్నాయి.
‘‘ఎవరు మీరు? ఈ బంతిలో పడుకొని ఎక్కడికి వెడుతున్నారు? ఏదీ దాచకుండా చెప్పండి’’ గర్జించాడు మహాబాహు.
ఆ బంతిలో మనుషులు జవాబివ్వలేదు. కుడిచేతి చూపుడు వేలును, ఎడమచేతి బొటన వేలుమీద పెట్టి అరగదీసినట్టు కాసేపు రాశారు. మహాబాహు మళ్ళీ గర్జించాడు.
‘‘మీరు ఎవరు? ఈ నౌకలో ఎక్కడికి వెడుతున్నారు? ఏదీ దాచకుండా చెప్పండి’’ అన్నాడు ఆ బంతిలో మగాడు.
మహాబాహుతో సహా అందరూ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు. ‘‘మీ భాష నాకెలా తెలిసింది అని కదూ మీ ఆశ్చర్యం’’ అన్నాడు బంతిలో మగాడు.
‘‘అంతేకాదు మా భాషలో నువ్వెలా మాట్లాడగలుగుతున్నావో కూడా, అర్థం కావడం లేదు’’ అంటూ ముక్కు ఊడేలాగ తుమ్మాడు రామప్ప. తరవాత జర్రున చీదాడు. ‘‘పాడు ఫ్లూ. మూడు రోజుల నుంచి బంకలా పట్టుకొని ఒదలడం లేదు’’ అంటూ మూతి, ముక్కు తుడుచుకున్నాడు.
‘‘మా బొటన వేలిలో భాషా విశ్లేషిణి ఉంది. అది ప్రతి భాషని మా భాషలోకి తర్జుమా చేస్తుంది. అంతేకాదు. ఆ భాష మాట్లాడటానికి కావలసిన సంకేతాలను కూడా మా స్వరపేటికకు పంపిస్తుంది. అయినా మీ ఆటవికులకు ఇలాంటి విషయాలు తలకెక్కవులే’’ అంది బంతిలో ఆడది.
మహాబాహు మొహం కోపంతో జేవురించింది. ‘‘ఎన్నో గ్రహాలను ఆక్రమించి, ఎన్నో జాతులను లొంగదీసుకున్న మేము ఆటవికులమా?’’ అని కోపంతో అరిచాడు. వెంటనే తమాయించు కొన్నాడు. ‘‘సరే వీళ్ళ సంగతి తెల్లారాక చూద్దాం. వీళ్ళను బంధించండి. అందరూ వెళ్ళి పడుకోండి’’ అంటూ వెళ్ళిపోయాడు. రామప్ప వాళ్ళతో ఏదో మాట్లాదామనుకునే లోపలే పెద్ద తుమ్ము ముంచుకు వచ్చింది. ‘హాచ్’ అని ఆ బంతి మనుషుల మొహం మీద తుమ్మాడు. ‘క్షమించండి వెధవ ఫ్లూ’’ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయాక కమెండోలు బంతి మనుషుల్ని నాలుగో అంతస్థులోకి తీసుకెళ్ళారు.
‘‘హామన్, చక్కగా పడుకున్నావేమిటి! మనం వచ్చింది పెళ్ళికి కాదు. తొందరగా పని ముగించుకొని పోదాం’’ అంది బంతిలో ఆడది. పక్కనే మంచం మీద పడుకొని ఉన్న బంతిలో మగాడితో.
‘‘మకలా, తొందరపడితే లాభం లేదు. ఓడనిండా వీళ్ళ సైన్యముంది. ఎన్నో ఆయుధాలున్నాయి. వీళ్ళను తుడిచి పెట్టాలంటే మనం ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి.’’ అన్నాడు హామన్.
‘‘స్వేచ్ఛ కోసం పోరాడుతున్న జంబూ గ్రహవాసులకు అండగా ఉంటామని మాట ఇచ్చాం వాళ్ళకు ఈ భూమి మనుషుల పీడ తొలగించాలి. మనం వెంటనే రంగంలోకి దిగాలి’’ అంది మకల.
‘‘దిగుదాం. అందుకేగా మనం కావాలని వీళ్ళకు పట్టుబడింది. అయితే మకలా! ఒక విషయం మరిచిపోకు. ఈ భూగ్రహవాసులకు ఏమున్నా లేకపోయినా ఆయుధాలు మటుకు కొల్లలుగా ఉన్నాయి. మన విశ్వంలో వీళ్ళకున్నన్ని ఆయుధాలు ఎవరి దగ్గరాలేవు. వీళ్ళకున్నంత దోపిడి గుణం కూడా ఎవరి దగ్గరా లేదు’’ అంది మకల.
‘‘మకలా! నేను చెప్పేది జాగ్రత్తగా విను. ముందుగా మన మానసిక శక్తినంతా కళ్ళల్లోకి తెచ్చుకుందాం. మన చూపుల ద్వారా వీళ్ళను చంపుదాం. అంతగా అవసరమయితే మనశక్తిని వేళ్ళలోకి కూడా తెచ్చుకుందాం. వేళ్ళ ద్వారా కూడా వీళ్ళని చంపేద్దాం. తెల్లవారేలోగానే వీళ్ళను మట్టు బెట్టాలి. లేకపోతే వాళ్ళ ఆయుధాల్ని మనం ఎదుర్కోలేం’’ అన్నాడు హామన్.
హామన్ మాటలు పూర్తవుతుండగానే తలుపు చప్పుడయింది. తయారుగా ఉండమని హామన్, మకలికి సంజ్ఞ చేశాడు. వెంటనే వాళ్ళిద్దరూ కళ్ళు మూసుకొని చచ్చిన వాళ్ళలా బిగుసుకుపోయారు. వాళ్ళ శరీరాలు కుత కుత ఉడుకుతున్నట్టు కంపించిపోయాయి. మొహాలు వికృతంగా మారిపోయాయి. కాసేపు వాళ్ళు అలాగే ఉండిపోయారు. తరవాత వాళ్ళ మొహాలు ప్రశాంతంగా మారిపోయాయి. కళ్ళు తెరిచారు. తెరిచిన వాళ్ల కళ్ళు పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబుల్లా ఉన్నాయి.
టకటకమని మళ్ళీ చప్పుడయింది. హామన్ లేచాడు. అడుగులో అడుగు వేసుకొంటూ వెళఙ్ళ తలుపు తీశాడు. ఎదురుగా పళ్లెంలో భోజనం పట్టుకొని నించుని ఉన్న బట్లర్ కనిపించాడు. హామన్ అతని వైపు ఒకసారి చూశాడు. అంతే బట్లర్ ఒక్కసారిగా విరుచుకు పడిపోయాడు. వెంటనే హామన్, మకల కళ్ళజోడు పెట్టుకున్నారు. గదిలోంచి ఇవతలికి వచ్చారు.
వరండాలో ఒకళ్ళ వెనుకగా మరొకళ్ళు నక్కినక్కి నడుస్తున్నారు. ఇంతలో మకల కెవ్వున అరిచింది. గిరుక్కున వెనక్కి తిరిగాడు హామన్. ఒక కమెండో మకలను రెండు చేతులలో బిగించి పట్టుకొన్నాడు. వెంటనే హామన్ కళ్ళజోడు తీసి ఆ కమెండో వైపు చూశాడు. ఆ కమెండో విరుచుకుపడిపోయాడు. అతని చేతులలో చిక్కుకుపోయిన మకల కూడా అతనితో పాటే పడిపోయింది. హామన్ కమెండో చేతుల్లోచి మకలను బయటకు లాగాడు. మకల కూడా కళ్ళ జోడు తీసేసింది. అన్ని గదులూ తిరుగుతూ నిద్రలో ఉన్న సైనికులను చూపులతో చంపేశారు.
‘‘హమ్మయ్య అంతా చచ్చారు’’ అంటూ కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు. చివరికి భరణి కింది అంతస్థులోకి వచ్చారు.
‘‘హామన్ నాకు ఎలాగో అవుతోంది. కళ్ళు మసకలు కమ్ముతున్నాయి’’ అంది మకల.
‘‘అయిపోయింది ఆయుధాల కొట్టును పట్టుకొంటే ఈ నౌక మన చేతిలోకి వచ్చేస్తుంది. ఎందుకో అర్థం కావడం లేదు. నాకూ చెమటలు పోస్తున్నాయి’’ అన్నాడు హామన్.
ఇంతలో హఠాత్తుగా వాళ్ళను కమెండోలు చుట్టు ముట్టారు. ‘‘చేతులెత్తి నించోండి. పిచ్చి పిచ్చి వేషాలేశారంటే కాల్చి చంపేస్తాను’’. ఒక కమెండో అరిచాడు.
మకల కళ్ళజోడు తీసి వాళ్ళ వైపు చూసింది. కమెండోలు విరుచుకుపడిపోలేదు. మకల మొహం భయంతో వికృతంగా మారి పోయింది. ‘‘హామన్, నా చూపులలో శక్తి హరించుకుపోయింది. నా ఒళ్ళు తేలిపోతుంది.’’ అంటూ దభీమని పడిపోయింది. పడిపోయిన మకలని ఒక కమెండో ఎత్తి స్టూలు మీద కుదేశాడు. ఆ స్టూలుకు ఉన్న ఒక స్విచ్చిని నొక్కాడు. వెంటనే ఒక ఇనుపవల మకల చుట్టూ అల్లుకుపోయింది.
మకల పడిపోగానే హామన్ కళ్ళు మూసుకొన్నాడు. మానసిక శక్తినంతా కూడగట్టి పైకి ఎత్తి పట్టుకొన్న చేతి వేళ్ళలోకి పంపసాగాడు. అతనిలో క్షణక్షణానికి అలసట ఎక్కువ కాసాగింది. ఓపిక
ఉడిగిపోసాగింది. ఎలాగయితేనేం వేళ్ళలోకి శక్తిని తెచ్చుకోగలిగాడు. తరవాత ఒక వేలును కిందికి వంచి ఒక కమెండో వైపుకు ఎక్కు పెట్టాడు. ఆ వేలులోంచి దూసుకు వచ్చిన మంట కమెండోను చంపివేసింది. మిగతా కమెండోలు ఆషాకు నుంచి తేరుకోక ముందే వేళ్ళను బాణాల్లా వాళ్ళవేపు ఎక్కుపెట్టాడు. కమెండోలు ఎక్కడ వాళ్ళక్కడ పడిపోయారు. ఒక కమెండో పడిపోతూ పక్కనే ఉన్న బల్లకు బిగించి ఉన్న తీగను లాగాడు. వెంటనే భరణి అంతా దీపాలతో వెలిగిపోయింది. ప్రతీ గదిలోనూ, కాక్‍పిట్‍లోనూ గణగణ మంటూ గంటలు మోగాయి.
ఆ వెలుగులో హామన్‍కి ఎదురుగా స్టూలు మీద ఇనుప వలలో చిక్కుకొని కూర్చుని ఉన్న మకల కనిపించింది. ఒక్క దూకులో ఆమె దగ్గరకు వెళ్ళాడు. వేళ్ళను కత్తుల్లా వాడుతూ ఆమెను చుట్టుకొన్న వలను కోసేశాడు. మకల నిర్జీవంగా కింద పడిపోయింది. హామన్ మకలను అటూ, ఇటూ కదిపాడు. అతని ముఖంలోకి రక్తం చిమ్ముకువచ్చింది. ‘‘నిన్ను చంపిన వీళ్ళ అంతు చూస్తాను. ఒకళ్లనీ మిగల్చను’’ అంటూ గిరుక్కున వెనక్కి తిరిగాడు. అలా వెనక్కి తిరిగిన అతనికి మహా బాహు, చావకుండా మిగిలిన సైనికులు కనిపించారు. మహా బాహు మొహం కోపంతో కందగడ్డలా ఉంది. ‘‘నిన్ను బతకనివ్వను. చిత్ర హింసలు పెట్టి చంపుతాను’’ అంటూ హామన్ మీదకి దూకాడు. హామన్, మహా బాహు వైపు వేలు ఎక్కు పెట్టాడు. మహా బాహు పెద్దగా అరుస్తూ పడిపోయాడు. వేళ్ళను బాణాల్లా ఎక్కు పెడుతూ ఆ సైనికులను కూడా చంపేశాడు హామన్. తరవాత కాక్‍పిట్ వైపు పరిగెత్తాడు. కానీ మధ్యలోనే కూలిపోయాడు. లేద్దామని ప్రయత్నించాడు. అతని వల్ల కాలేదు. వెనక్కిపడిపోయి బిగదీసుకు పోయాడు.
భరణిలో ఎవరయినా ప్రాణాలతో ఉన్నారేమో అని కెప్టెన్ మారుతి ప్రతీ గదిలో టి.వి. తెరమీద చూస్తున్నాడు. ప్రతి గదిలో చచ్చిపడి ఉన్న సైనికులే కనిపిస్తున్నారు. శశిరేఖ వెక్కి వెక్కి ఏడుస్తోంది.
‘‘శశిరేఖా! రామప్ప, ధన్వంతరి బతికే ఉన్నారు’’ అని గట్టిగా అరిచాడు. వెంటనే శశిరేఖ రెండు స్విచ్చిలు నొక్కింది. వాళ్ళ గదుల్లో గంటలు పెద్దగా మోగాయి.
రామప్ప, ధన్వంతరి ఇద్దరూ కాక్‍పిట్‍లోకి వచ్చారు. రామప్ప ఇంకా తుమ్ముతూనే ఉన్నాడు. ధన్వంతరి మొహంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘‘అందరినీ పరీక్షించాను. మనం నలుగురం తప్ప అంతా చచ్చిపోయారు’’ అన్నాడు ధన్వంతరి.
‘‘ఆ బంతిలో మనుషులు ఎలా చచ్చిపోయారు? అడిగాడు మారుతి. ‘‘వాళ్ళను రామప్ప చంపాడు’’ అన్నాడు ధన్వంతరి.
‘‘నేనా? నేను నిద్ర మాత్రలు వేసుకుని పడుకున్నాను. ఇప్పుడే కదా లేచాను’’ అన్నాడు రామప్ప.
‘‘అవును నువ్వే చంపావు. ఆ బంతిలో మనుషులకు ప్లూ అంటించావు. వాళ్ళ గ్రహంలో ఫ్లూ ఉండి ఉండదు. అందువల్ల ఫ్లూ వైరస్‍ని తట్టుకోగల శక్తి వాళ్ళ శరీరాలకి అలవడలేదు. అందుకే వాళ్ళు చచ్చిపోయారు’’ అన్నాడు ధన్వంతరి.
దక్కన్‍న్యూస్,
ఎ : 9030 6262 88