ప్రకృతితో మనం మమేకమయినప్పుడు అది మనల్ని తన గుండెలకు హత్తుకుంటుంది. మనిషికీ ప్రకృతికీ స్నేహం కావాలంటుంది పర్యావరణ పరిరక్షణ ఉద్యమం. ప్రకృతి మనతో ఎప్పుడు స్నేహం చేస్తుంది? ప్రకృతికి మూలమైన మట్టినీ, చెట్టునీ, నీటినీ, గాలిని సహజంగా ఉండనిచ్చినప్పుడు, వాటిని స్వేచ్ఛగా, నిర్మలంగా ఎదగనిచ్చినప్పుడు ప్రకృతి మనిషిని ప్రేమించి మనిషి భౌతిక, మానసిక అవసరాలను తీర్చడంలో ముందుంటుంది. ఏ రంగంలోనైనా సహజాలను అసహజాలుగా మార్చడమే సకల సంక్షోభాలకీ కారణం. ఈ ఆధునిక సంక్షోభాలన్నీ దాని ఫలితమే. వ్యవసాయరంగం దానికి మినహాయింపు కాదు.
మనది వ్యవసాయక దేశమనీ, గ్రామీణ వ్యవసాయ వ్యవస్థే దేశానికి వెన్నెముక అని, రైతేరాజనీ, రైతులేనిదే దేశం లేదని చెప్పబడుతున్న నేలయిది.
గుప్పిటతో మట్టితీసుకొని ఏ నేల ఎటువంటిదో, దాని బలమేమిటో, దాని గుణదోషాలేమిటో, ఏం పంట పండుతుందో చెప్పగలిగిన నిరక్షరాస్య భూశాస్త్ర జ్ఞానులున్న నేలయిది.
మనదేశంలో 80 కోట్ల ఎకరాల భూమి ఉన్నదనీ, ప్రస్తుతం 36 కోట్ల ఎకరాలు సాగులో ఉందనీ, 14 కోట్ల ఎకరాలు అటవీభూమిగా ఉందనీ పరిశోధకుల అంచనా. మిగతా 30 కోట్ల ఎకరాలు ఉపయోగపడే భూములేననీ భూసార విధ్వంసం వల్ల నిరుపయోగంగా ఉన్నాయని వారి అంచనా.
ఇప్పటికీ మన వ్యవసాయం ప్రధానంగా 70 శాతం వర్షపాతం మీదే ఆధారపడి ఉంది. మనకి లభించే వర్షపాతంలో 30 శాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. మిగతా 70శాతం వృధాగా పోతుందని అంచనా. నదులమీద, వాగులమీద కట్టిన ప్రాజెక్టుల వల్ల వచ్చే సాగునీరు ప్రస్తుత సేద్యభూమిలో 12 శాతానికే ఉపయోగపడుతుంది. భూగర్భజలాలు, ఉపరితల జలాలు సేద్యపు భూమిలో 4వ వంతుకు చాలడం లేదు.
ఒకప్పుడు దక్కన్ పీఠభూమిలో చక్కని గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఉండేది. మోటబావులుండేవి. ఆనాడు వ్యవసాయవనరులన్నీ రైతు చేతిలో ఉండేవి. రైతే స్వయంగా దుక్కి దున్నేవాడు. దాచుకున్న బలమైన విత్తనాలను ఉపయోగించేవాడు. కావాల్సిన ఎరువులు కంపోస్ట్ విధానంలో తనే తయారు చేసుకునేవాడు. భూమిని సారవంతం చేయడానికి వానపాముల వంటి మిత్ర జీవరాసులుండేవి. ఈ ఆహార ఉత్పత్తితో గ్రామాలు, యితర ప్రాంతాలు సంతోషంగా పండగ వాతావరణంలో జీవించేవి. ఈ ఆరోగ్య వంతమైన వ్యవసాయ విధానం వల్ల భూసారం పెరగడమేకాక నిర్మల ప్రశాంత వాతావరణం పర్యావరణ రక్షణకు కవచంగా ఉండేది. ఈ విధాన కొనసాగింపు ఇవాళ మనకి అత్యంత అనుసరణీయం. ఆవశ్యం.
అన్ని సామాజిక వ్యవస్థలనూ వ్యాపారమయం చేసినట్టుగానే వ్యవసాయమూ వ్యాపారమైంది. అధిక దిగుబడి – అధికరాబడి పేరుతో వాణిజ్య పంటలవైపు రైతు నెట్టబడ్డాడు. కొనుగోలుదారుడికీ రైతుకీ మధ్య దళారీ వ్యవస్థ ఏర్పడింది. ఇవన్నీ అంతకుముందున్న భూమి-రైతు సంబంధాన్ని దెబ్బతీసాయి.
ఈ సంక్షోభాల నుంచి మనం మన వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. భూ వనరులు, జలవనరులను కాపాడుకోవాలి. సేద్యపుభూమి విస్తీర్ణాన్ని పెంచుకోవాలి. రసాయనాలు, కల్తీ విత్తనాలు, క్రిమిసంహారక మందుల ప్రమాదాల నుంచి భూమిని కాపాడుకోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులు, బావుల నిర్మాణాల ద్వారా నీటి సమస్యను పరిష్కరించు కోవాలి. వర్షపునీరు వృధాకాకుండా భూగర్భజలాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. పంట భీమా సౌకర్యం, మద్దతు ధర, గ్రామీణ వ్యవసాయ సబ్సిడీలు, పంట కొనుగోలు సౌకర్యాల ద్వారా రైతుకు బతుకు భరోసా యివ్వాలి.
వ్యవసాయానికి సామాజికగౌరవం ఉండాలి. నిరుపయోగిత విధానాలకు వీడ్కోలు పలకాలి. మానవీయ స్పర్శ కలిగిన విధానాలకు ప్రాధాన్యం యివ్వాలి. అప్పుడే మట్టికీ మనిషికీ అనుసంధానం కుదురుతుంది.
మణికొండ వేదకుమార్ , ఎడిటర్