ఆరుట్ల కమలాదేవి


జనసంద్రంలో విరిసిన అరుణారుణ కమలం, నల్లగొండ నుండి వీరవిహారం చేసిన ఓరుగల్లు రుద్రమకు ప్రతిరూపం. విప్లవాల ముగ్గుపరిచిన నవనవోన్మేష క్రాంతి, మానవత్వానికి నిలువెత్తు తార్కాణం. నిర్మల స్వభావం, అన్యాయాన్నెదిరించే అగ్నిశిఖ. వీరోచిత సాహసాలకు ఎక్కుపెట్టిన ఆయుధం. పోరాట కాన్వాస్‍పై చెరగని చిత్రం. హక్కులకై కదం తొక్కిన ధీశాలి. సాయుధ పోరాటంలో వికసించిన అగ్నిపుష్పం. ఆమెనే ఆరుట్ల కమలాదేవి.


ఆరుట్ల రామచంద్రారెడ్డికి జీవిత సహచరి అయిన కమలాదేవి రాజకీయప్రస్థానంలోనూ అతని సాహచర్యాన్ని వదలలేదు. తల్లిదండ్రులు లక్ష్మీనర్సమ్మ వేంకటేశ్వర రెడ్డిలు. వారి గ్రామం మంతపురి, మండలం ఆలేరు. జిల్లా కొండంత చైతన్యం కల్గిన నల్గొండ. ఆమె అసలు పేరు రుక్మిణి. జననం 1920. పుట్టిన ఊరే పెద్ద బాలశిక్ష వరకు చదువుకునే అవకాశం కల్పించింది. పెద్దబాలశిక్షంటే జీవితానికి ప్రాథమికంగా ఉపయోగపడే లెక్కలు, భాషాపరిజ్ఞానం, నిత్య వ్యవహారంలో ఉన్న సామాజికాంశాలు. నిజాం పాలనలో భూస్వాములు పేద ప్రజల అవసరాలను అదునుగా భావించి వెట్టి చాకిరీతో పాటు అధికశాతం వడ్డీనో చక్రవడ్డీనో ఆధారంగా అప్పులు యిచ్చేవారు. లెక్కలన్నీ తప్పుల తడకలు, ఎంత డబ్బు చెల్లించినా చాకిరెంత చేసిన అప్పు అప్పుగానే ఉండేది. పైగా అవకాశం కల్పించుకొని ఆ సన్నకారు రైతులను భూమి నుండి బేధఖల్‍ చేసేవారు. భూమిలేని వారిని తరతరాలుగా వెట్టి చాకిరీకి ఉపయోగించుకొనేవారు. ఈ దోపిడీకి అనుకూలంగా గ్రామాల్లో పాఠశాలలపై గ్రంథాలయాలపై నిషేధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. పాఠశాలలు అందుబాటులో లేకపోవడం వల్ల రుక్మిణి చదువు పెద్దబాలశిక్షతో ఆగిపోయింది. ఆనాటి వాతావరణం స్త్రీ విద్యను ఏమాత్రం ప్రోత్సహించలేదు కూడా.


తెల్లదొరతనం ఒళ్ళు విరుచుకున్న వేళనే నల్ల దొరతనం కుళ్ళు పెంచుకున్నది. అధికారం అహంకారం వల్ల పూనకం దాల్చింది. వాళ్ళకు అరాచకం ఆత్మగా మారింది. అహంకారాధికారాలు జోడెద్దుల జంటైనాయి. స్త్రీలపై అత్యాచారాల బాకులను గుచ్చినారు. ప్రజల అమాయకత్వం వారికి అలుసైంది. కరువు రక్కసి తాడిత పీడిత జనం కడుపులను కాల్చేసింది. దగాపడ్డ జీవితాలు బానిస విషవలయంలో చిక్కినవి. కుక్కిన పేనులా బతుకులను వెళ్ళబోసు కున్నవి. బూర్జువా పెత్తందారీ వ్యవస్థలో ఆ జీవితాల శ్వాస ఇంకిపోయింది. గుండె బురువెక్కింది. కన్నీటి బిందువులు కళ్ళలోనే ఆగిపోయినవి. ఆ పరిస్థితుల్లో ఆకాశం ఎర్రటి ఛాయలను పీల్చుకుంది. చీకట్లను తరుముకుంటూ క్రాంతి కిరణం వెలిగింది. ప్రజల కోసం దగాపడిన వాళ్ళకోసం ఆరుట్ల మట్టి పొత్తిళ్ళ నుంచి రామచంద్రారెడ్డి ఉదయించినాడు. విద్య వినయానికి దక్షతకూ మానవతాదృక్పథాలకు పెన్నిధి. విద్యావంతుడైన రామచంద్రారెడ్డిని ఆంధ్రమహాసభ ఆకర్షించింది. చురుకైన నాయకుడిగా ఎదుగుదలనిచ్చింది. రామచంద్రారెడ్డి పెళ్ళే కూడదనుకున్నాడు. అది సంఘకార్యకలాపాలకు అంతరాయమని భావించినాడు. అందువల్ల ఆ ఆలోచనలను అల్లంత దూరంగా ఉంచినాడు. కాని మేనమామ కూతురు రుక్మిణిని చేసుకోమని తల్లిదండ్రుల ఆదేశం. సందిగ్ధంలో పడ్డా షరతులతో పెళ్ళికి సన్నద్ధమయ్యాడు. కట్నప్రసక్తి లేకపోవడం, వివాహ సమయంలో ఖద్దరు వస్త్రధారణ, వివాహానంతరం సహచరి విద్యాభ్యాసం కొనసాగింపు. ఆ చదువు కొనసాగింపులో భాగంగా సహచరిని తన వెంట హైదరాబాదుకు పంపించడం. ఇవే ఆ షరతులు. ఇరుపక్షాలకు షరతులు సమ్మతమైనవి. పెళ్ళి జరిగిపోయింది.


రామచంద్రారెడ్డికి జాతీయోద్యమ నాయకురాలు కమలాదేవి చటోపాధ్యాయ అంటే ఎనలేని గౌరవం, అభిమానం. అందువ్ల పెళ్ళిపీటల మీదే రుక్మిణి పేరు కమలాదేవిగా రామచంద్రారెడ్డి మార్చినాడు. పెళ్ళవుతూనే మకాంను హైదరాబాదుకు మార్చినాడు.
కమలాబాయి ఛటోపాధ్యాయిలా తన సహచరిలోనూ చైతన్యస్రవంతిని ఆశించాడు. మాడపాటి హన్మంతరావు స్థాపించిన బాలికల ఉన్నత పాఠశాలలో కమలాబాయి ఉరఫ్‍ రుర్మిణిని చేర్పించినాడు. స్కూళ్ళే అంతంత మాత్రంగా ఉన్న ఆ రోజుల్లో వసతి గృహాల విషయం చెప్పాల్సిన పనిలేదు. అవి గగన కుసుమాలే. రామచంద్రారెడ్డి రాజ బహద్దూర్‍ వెంకటరామరెడ్డిని ఒప్పించి రెడ్డి వసతి గృహానికి అనుబంధంగా బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయించినాడు. అందువల్ల కమలాదేవి మెట్రిక్‍లేషన్‍ వరకు తన చదువును కొనసాగించింది.


చదువు పూర్తికాగానే కమలాదేవి కొలనుపాక చేరుకుంది. కమలాబాయి చదువుతో రామచంద్రారెడ్డికి సంతృప్తి కలుగలేదు. ఆమెద్వారా ఎందరినో విద్యావంతులను చేయాలని ఆరాటపడ్డాడు. కొలనుపాకలోనే వంటశాలగా ఉన్న ఓ గదిలో కన్యాపాఠశాలను ప్రారంభించినాడు. ఈ సమాచారం ఊరి జాగీర్దారుకు చేరుకుంది. అతని హుకుంతో పాఠశాల మూతపడింది. అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. రామచంద్రారెడ్డి పాఠశాల నిర్వహణకై పరిపరివిధాల ఆలోచన చేస్తున్న సమయంలో జైనమందిర యాజమాన్యం ఉదారత్వంతో కొంత స్థలాన్ని పాఠశాలకై ఇచ్చింది. ఆ స్థలం రామచంద్రారెడ్డి కమలాదేవిల చొరవతో పాఠశాలగా పురుడు పోసుకుంది. కమలాదేవి సారథ్యంలో ఎంతోమందికి అక్షరజ్ఞానం లభించింది.


ఒకవైపు గ్రామప్రజలకు విద్యాబోధన చేస్తూనే సంఘకార్య కలాపాల వైపూ దృష్టి పెట్టింది కమలాదేవి. సంఘానికి సంబంధించిన విషయాలను ఆకళింపు చేసుకొంది. అందులోనూ క్రియాశీలకపాత్రను పోషించింది. 1943లో విజయవాడలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఆత్మరక్షణా శిబిరంలో సైనిక శిక్షణను పొందింది. 1944లో కమలా దేవి ఒక కొడుకుకు జన్మ నిచ్చింది. జీవిత సహచరులిద్దరూ విప్లవోద్యమం నిప్పుకణికలే. తమ భావాల కనుగుణంగా ఆ బాలునికి విప్లవరెడ్డి అని నామకరణం చేసుకున్నారు. అది నిజాం ప్రభుత్వం మార్షల్‍ లా విధించిన కాలం. కన్న మమ కారాన్ని అధిగమిస్తూ పసిబిడ్డను ఇంటివద్దే వదిలి రామచంద్రా రెడ్డితో పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది కమలాదేవి.
అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే (1948) కమలాదేవి ఆరోగ్యం దెబ్బతిన్నది. వైద్యం తప్పనిసరైన పరిస్థితి. ఇద్దరూ మంత్రపురికి బయలు దేరినారు. ఆలేరు శివారులో కమ్మగూడెం వద్ద మాటు వేసిన పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసినారు. రామచంద్రారెడ్డిని ఖమ్మం జైలుకు, కమలాదేవిని ఔరంగాబాదు జైలుకు తరలించినారు. జైల్లోనూ కమలాదేవి స్త్రీల హక్కులకై పోరాడేది. 1951లో అంటే రెండున్నరేళ్ళ కారాగార శిక్ష అనంతరం ఆమె విడుదలైంది.
ఆమె సంఘకార్యకలాపాల్లో ఏనాడూ గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. పైగా అవసరమైనప్పుడు రామచంద్రారెడ్డికే ధైర్యాన్ని నూరిపోసిన ధీశాలి. చల్లూరు బేగంపేట గుట్టల్లో సైనికుల కళ్ళు గప్పి ఇబ్రహీంపురం చేరుకోవడం ఆమె పోరాట ఎత్తుగడకు ఓ మచ్చుతునక. 1946-48న అంటే సాయుధపోరాటం జరిగిన కాలంలో రజాకార్ల దుర్మార్గాలను దౌర్జన్యాన్ని ఎదిరించడానికి మహిళా గెరిల్లాదళాన్ని ఏర్పాటు చేసిన పోరాట యోధురాలు.


1952లో హైదరాబాదు నియోజకవర్గం నుండి, ఆ తర్వాత అంటే 1957, 1962లలో భువనగిరి నియోజకవర్గం నుండి యం.యల్‍.ఎ.గా పోటీచేసి విజయదుందుభిని మ్రోగించింది. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య విదేశాలకు వెళ్ళిన సందర్భంగా (వైద్య చికిత్స నిమిత్తం) కమలాదేవి ప్రతిపక్ష ఉపనాయకురాలుగా బాధ్యతలు చేపట్టింది. పదిహేను సంవత్సరాలు యం.యల్‍.ఏగా రాజకీయ జీవితాన్ని గడిపిన ఈమె పలు సందర్భాలలో అవకాశం కలిసి రాగా బల్గేరియా, జెకోస్లవేకియా, రష్యా వంటి దేశాలలో పర్యటించింది. ఆ తర్వాత కాలంలో స్వచ్ఛందంగా రాజకీయాల నుండి తప్పుకుంది.
1998లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేటు బిరుదుతో సత్కరించింది. మొత్తంగా కమలాదేవి చరిత్రను పరికించినపుడు ఎన్నెన్నో ఆలోచనలు, మరెన్నెన్నో భావాలు.
ఆమె జీవితం ఎత్తిన పిడికిలే కాదు తోటి స్త్రీలలో పౌరుష పాటవాలను నాటి పిడికిలెత్తించి పల్లెపల్లెకు పరుగులెత్తించిన పటుశాలి. ఆమె చరితే ఓ ఎర్రజెండా. భూమికోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి. విముక్తికోసం అగ్నిపూలై వికసించిన ఎర్ర మందారం. రైతుకూలీ పోరాటంలో రాటుతేలిన స్త్రీ వజ్రం. బడుకు జీవుల బతుకు బాటకై భూస్వాముల గుండెల్లో నిదురించి గడగడలాడించిన అపరకాళిక. ప్రతిక్షణం ప్రజల క్షేమంకై పరితపించిన ప్రజాబంధు. బ్రతుకుప్పెన పెను తుఫానుగ పరిఢవిల్లగ పోరాటమే ఊపిరిగా పదం పాడుతూ కదం తొక్కిన వీరవనిత.


ఆశయాల నావను విప్లవాగ్నుల కొలనులో నడిపిస్తూ ఉద్యమాంబలి తాగిన వీరవనిత. పోరు వనిత. కాశీం రజ్వీ దురాగతాలను తుదముట్టింప కానె బిగించిన ఖలేజా. కాశిం రజ్వీ తొత్తులతో రణం సల్పి గ్రామ ప్రజల నిశాచరియై పోరుసల్పిన తెలుగు బిడ్డ. కులకంచెను పెరికివేసిన సామ్యవాది. చంద్రకాంతిలో విరిసిన ఎరెర్రని కలువ. ఆమె కార్వేషుదాసి కాదు. కరణేషు మంత్రి. సహచరుడికి వెన్నుదన్ను. ఈ కమలాచంద్రుల జీవితం ప్రపంచానికే ఆదర్శం. నిరాడంబర జీవితానికి నిలువెత్తు సాక్ష్యం. వారి జీవితమో కలినేత. విడివివిగా చూడడం కష్టసాధ్యం. ప్రజలను జాగృతపరిచిన అరుణారుణ కేతనాలు. జనవరి ఒకటి 2001న ఆమె తుదిశ్వాస విడిచింది


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-డా।। తిరునగరి దేవకీదేవి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *