వేదనాభరిత జీవితాలని చూపించే కోర్టు కథలు


సినిమాల్లో కోర్టు వాతావరణం చూసి చాలా మంది కోర్టులు అలా వుంటాయని అనుకుంటారు. కోర్టు వాతావరణాన్ని దారుణంగా సినిమా వాళ్ళు చూపిస్తూ వుంటారు. అలాంటి సినిమాలు చూసి అదే విధంగా కథలు రాస్తున్న రచయితలూ వున్నారు.
నేర న్యాయవ్యవస్థతో సంబంధం వున్న రచయితలు గానీ, న్యాయవాదులైన రచయితలు గానీ, న్యాయమూర్తులైన రచయితలుగానీ కోర్టుకు సంబంధించిన కథలు గానీ, నవలలు గానీ రాసినప్పుడు అలా వుండదు. కోర్టుల్లో వుండే పరిస్థితిని ఆ కథల్లో, నవలల్లో మనం చూడవచ్చు. అయితే తెలుగులో నాకు తెలిసి అలాంటి రచయితలు తక్కువ. రావిశాస్త్రి, బీనాదేవి, నందిగం క్రిష్ణారావు, జింబోలను పేర్కొనవచ్చు. కోర్టులో పని చేసిన యన్‍.కె.రామారావును కూడా పేర్కొనవచ్చు. ఆయన రాసిన కథలు తక్కువే అయినప్పటికీ, ఓ రెండు కథల్లో నేర న్యాయవ్యవస్థని చూపించారు. మిగతా రచయితల గురించి చెప్పాల్సిన పనిలేదు. చాలా కథల్ని వాళ్ళు రాశారు.


రావిశాస్త్రిగారి గురించి మాట్లాడినప్పుడు అందరికీ వెంటనే గుర్తుకొచ్చే కథ ‘మాయ’. మద్యపాన నిషేధం వున్న కాలంలో హెడ్డుకీ సారా అమ్మే ముత్యాలమ్మకి ఓ గొడవ జరిగి ఆమె మీద తప్పుడు సారా కేసు పెడతారు. కొత్తగా న్యాయవాద వృత్తిలో చేరిన మూర్తి ఆమె కేసుని వాదిస్తాడు. కేసు గెలుస్తానన్న ఊపులో వుంటాడు. హెడ్డుబాబు తేలగొట్టేస్తాడనుకున్నాన్లే అంటుంది ముత్యాలమ్మ మూర్తితో. మూర్తి ఆశ్చర్యపోయి ఆమెను ప్రశ్నిస్తాడు. ఆమె హెడ్డుకి ఆమెకు జరిగిన రాజీ గురించి వివరిస్తుంది.


మంచు వీడిపోయినట్టుగా కేసంతా ఎందుకు సులభంగా విడిపోయిందో అర్థమయ్యేసరికి బుంగలోంచి గాలిపోయినట్టు చప్పబడి పోతాడు మూర్తి. ముత్యాలమ్మ ఇచ్చే డబ్బుని తీసుకోవడానికి సిగ్గుపడి తీసుకోడు. మూర్తికి అంతా అసందర్భంగానూ కనికట్టుగానూ మాయగానూ తోస్తుంది.
సారా అసలు దొరకలేదు. దొరికిందని కేసు పెట్టేరు. దొరకలేదని తేలగొట్టేసారు. విషయం జరుగలేదు. జరగని విషయం జరిగిందన్నారు. జరిగినదని చెప్పబడిన జరగని విషయం జరుగలేదన్నారు. లేదూ వుంది. అంతా మాయచేసేరు. కానీ..
ఈ మాయ మధ్య ఎంతటి బాధ అనుకున్నాడు మూర్తి. మూర్తికి పెద్ద ప్లీడరు గుర్తుకొస్తారు. ఆయన మాయనే తెలుసుకున్నాడు కానీ బాధని తెలుసుకోలేడు అనుకున్నాడు మూర్తి. తెలిసీ పట్టించుకోలేదంటే! అని అనుకుంటాడు మూర్తి.


కోర్టుల్లో కేసులు ఏ విధంగా నమోదవుతాయి. ఎట్లా వీగిపోతాయి అన్న దానికి సజీవ నిదర్శనం ఈ కథ. నందిగం క్రిష్ణారావు రాసిన ‘పోలీసుదేముడు’ కథలో కోర్టు వాతావరణం కన్పిస్తుంది.


దేవుని గుడిలో దొంగతనం చేశాడన్న ఆరోపణతో మల్లికార్జునరావు మీద కేసు పెడతారు. అర్ధరాత్రిపూట సాక్షులు ఎవరూ లేనందున కానిస్టేబుల్స్నే సాక్షులుగా పెడతాడు ఇన్స్పెక్టర్‍. దేవుడికి కూడా సెక్యూరిటీ అవసరం ఏర్పడుతుందని ఇన్స్పెక్టర్‍ సాక్ష్యం చెబుతాడు. కానిస్టేబుల్స్ అదే విధంగా సాక్ష్యం చెబుతారు.
తనని అకారణంగా అరెస్టు చేశారని, అదీ బస్టాపులోనని లంచం ఇవ్వలేదన్న కారణంగా కేసు పెట్టారని ముద్దాయి వాదన. కేసు విచారణ పూర్తి అవుతుంది. దైవభక్తి బాగా వున్న మేజిస్ట్రేట్‍ ముద్దాయికి తాను ఎంత శిక్ష వేయవచ్చో అంతశిక్షని విధిస్తాడు. ముద్దాయి జైలుకు వెళ్ళిపోతాడు.


ఆ మేజిస్ట్రేట్‍ ఆ వూరికి కొత్తగా వచ్చాడు. ఆ గుడిని దర్శించి దండం పెట్టుకుందామని ఆ కేసులో చెప్పిన ములుగు రోడ్డుకి వెళతాడు. అతని వెంట కొంత మంది న్యాయవాదులు కూడా వస్తారు. ఆ ములుగు రోడ్డులో ఆ దేవుడి గుడి జాడ ఎక్కడా కన్పించదు. గుడిని కూడా దొంగతనం చేశారా అని అనుకుందామంటే అలాంటి ఆనవాళ్ళు కన్పించవు. అక్కడెక్కడా అలాంటి గుడి వున్న దాఖలాలు కూడా గోచరించవు. చుట్టు ప్రక్కల వాళ్ళని విచారిస్తే అక్కడ గుడి లేదని చెబుతారు. పోలీసులు ఇంత పెద్ద అబద్దం ఆడతారా అనుకొని కేసు పెట్టిన పోలీసులను కనుక్కోమని తనతో వచ్చిన న్యాయవాదులతో చెబుతాడు.


అక్కడ గుడిలేదని, ఆ కేసులోనే గుడి వుందని పోలీసులు చెబుతారు. మెజిస్ట్రేట్‍ తెల్లబోతాడు. ఇంటికి తిరిగి వస్తూ పోలీసు స్టేషన్‍ ముందు తన వాహనాన్ని ఆపించి దేవుడి గుడినే సృష్టించిన పోలీసులకి దండం పెడతాడు.
ఈ కథలో అంతా కోర్టు వాతావరణం వుంటుంది. ఓ సత్యాన్ని చెప్పడం కోసం గుడి కథని రచయిత చెబుతాడు. అంటే ఓ అబద్దాన్ని చెబుతాడు. అయితే కథలో ఎక్కడా కోర్టు వాతావరణం చెడిపోదు.


ఈ కథ యన్‍.కె. రామారావు రాసిన ‘ఉందిలే మంచి కాలం’ కథ. ఇది కూడా పోలీసుల ప్రవర్తనని, వాళ్ళు చేసే దుర్మార్గాలని వేలుపెట్టి చూపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులని కూడా పోలీసులు ఎట్లా సతాయిస్తారో ఈ కథలో చెబుతాడు రచయిత.
డాక్టర్‍ ప్రభావతికి వృత్తిపట్ల నిబద్దత ఎక్కువ. ప్రైవేట్‍ ప్రాక్టీస్‍ చేయదు. భర్త ఒత్తిడి చేసినా ఆమె వినదు. చివరికి ఆమె భర్త ఆమెను వదిలివేసి సిటీలో ఓ అమ్మాయితో కాపరం పెడతాడు. ఆమెకు 35 సంవత్సరాలుంటాయి. అందంగా వుంటుంది. తన డ్యూటీ తాను చేసుకుంటుంది.


ఇన్స్పెక్టర్‍ కోరినట్టుగా సర్టిఫికెట్లు ఆమె ఇవ్వదు. ఓ అమ్మాయి చనిపోయినప్పుడు ఆమె ఒంటి మీద గాయాలు వున్నాయని సర్టిఫికేట్‍ ఇవ్వమని అడుగుతాడు. ఆమె నిరాకరిస్తుంది. పోలీసు అధికారి ఆమెను బెదిరిస్తాడు. ఇది విన్న ఆమె అంతరాత్మ – అంతరాత్మని చిలకలా మాట్లాడిస్తాడు రచయిత. లోకాన్ని బట్టి నడుచుకోమ్మని సలహా ఇస్తుంది. ప్రభావతి చిలక మీద విసుక్కుంటుంది. చిలక లోపలికి వెళ్ళిపోతుంది. మరోసారి తీవ్ర గాయాలు వున్న వ్యక్తికి మామూలు గాయాలు వున్నట్లు సర్టిఫికెట్‍ అడుగుతాడు. ఆమె నిరాకరిస్తుంది. మొగుడులేని దానివి తన కోసం ఓ అరగంట స్పేర్‍ చేయమంటాడు. షటప్‍ అండ్‍ గెటౌట్‍ అంటుంది. సర్టిఫికెట్‍ ఇవ్వమంటే గొడవ చేస్తుందని ఆ పోలీసు అధికారి హాస్పిటల్‍ సిబ్బందికి చెబుతాడు. రాత్రికి గెస్ట్హౌస్‍కి రమ్మని చిన్న ఉత్తరం పంపిస్తాడు. లేకపోతే తీవ్ర పరిస్థితులు వుంటాయని హెచ్చరిస్తాడు. ఆదర్శాలని వదిలి పెట్టమంటుంది చిలక. ఆమె వినదు.


ఒకరోజు డ్యూటీ టైంలో మేజిస్ట్రేట్‍ భార్య ఆరోగ్యం బాగాలేదని చూడటానికి రమ్మని కోర్టు అటెండర్‍ వస్తాడు. ఆమెనే అక్కడికి తీసుకొని రమ్మని చెబుతుంది. దొరవారు పిలిస్తే రానందా? దాన్ని జైలుకి పంపించకపోతే పోలీసు ఉద్యోగానికే తాను పనికిరానని అంటాడు ఇన్స్పెక్టర్‍.
చివరికి ఓ అబద్దపు కేసులో ఆమెను ఇరికిస్తాడు. బలమైన సాక్ష్యాలు పెడతాడు. డబ్బుకోసం చేయకూడని పని నెత్తిమీద పెట్టుకొని నిర్లక్ష్యంగా చంపిందని ఆమె మీద కేసు. అది అబద్దపు కేసని మేజిస్ట్రేట్‍కి తెలుసు. సాక్ష్యమా? ధర్మమా అన్న మీమాంసలో వుంటాడు. ఉద్యోగ ధర్మంలో చేసిన తప్పుకి ప్రభుత్వ అనుమతి వుండాలి. ఈ కేసులో అది లేదన్న సాంకేతిక కారణంగా ఆమెపై వున్న కేసుని కొట్టివేస్తాడు మేజిస్ట్రేట్‍.
చిలక వున్న లేడీ డాక్టర్‍, చట్టం చట్రంలో చిక్కుకున్న మేజిస్ట్రేట్‍, పోలీసుల ఆధిపత్య ధోరణి ఇవన్నీ ఈ కథలో కన్పిస్తాయి. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ జీవితంలో దెబ్బలు తింటున్న నీకు నా అవసరం లేదు అని చిలక ఎగిరిపోతుంది.


ఈ కథ ఓ చిన్న పట్టణంలో జరిగే విషయాలకి అద్దం పడుతుంది. చివరగా జింబో రాసిన ‘ఫైలు శ్వాస’ కథ. ఈ కథని కాగితం చెబుతుంది. వెదురుబొంగు కాగితంగా మారిన వైనం కాగితం ఫైలుగా మారిన స్థితి ఈ కథలో కన్పిస్తుంది. కాగితాల కట్ట మొదట పోలీస్‍ స్టేషన్‍కి వస్తుంది. అక్కడ అది ఎఫ్‍ఐఆర్‍ కావడం, రిమాండ్‍ రిపోర్టు కావడం, ఆ తరువాత చార్జిషీట్‍ కావడం కోర్టులో ఓ ఫైల్‍గా మారడమూ జరుగుతుంది. మేజిస్ట్రేట్‍ కోర్టు నుంచి సెషన్స్ కోర్టుకి ఆ ఫైలు ఎలా వెళుతుందన్న విషయాలన్నీ కథలో మనకు కన్పిస్తాయి. ముద్దాయిలని ప్రశ్నించే వైనం, సాక్షుల విచారణ, కేసులోని వాదోపవాదాలు జరిగి కేసు తీర్పుకోసం వస్తుంది.
ఒకరోజు ఉదయం కేసు ఫైలుని బాక్స్ నుంచి బయటకు తీసి జడ్జి స్టెనోకి తీర్పుని డిక్టేట్‍ చేస్తాడు. టైప్‍ చేసి ఇచ్చిన కాగితాలని ఆ ఫైల్లో పెడతాడు. తీర్పు సారాంశం కేసు రుజువు కాలేదని.


తీర్పు సారాంశం అర్థమైన తరువాత ఫైలుకి కోపం వస్తుంది. ఈ మాత్రం తీర్పుని ప్రకటించడానికి ఇన్ని సంవత్సరాలా? జడ్జిని ప్రశ్నించాలని నిర్ణయం తీసుకుంటుంది ఫైలు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జడ్జి టిఫిన్‍ చేసి ఫైలుని తెరుస్తాడు.
ఫైలు గొంతు సవరించుకొని ‘‘యువరానర్‍ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి’’ అంటుంది తీవ్రమైన గొంతుతో.
జడ్జి ఆశ్చర్యపోతాడు. భయకంపితుడు అవుతాడు. ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాదు. చివరికి ఫైలు మళ్ళీ తాను మాట్లాడుతున్నానన్న విషయం చెబుతుంది. జవాబు తెలిసీ జవాబు చెప్పకపోతే బాగుండదని బేతాళుని శవంలా హెచ్చరిస్తుంది. చెబుతానని జడ్జి జవాబు చెబుతాడు.


‘‘ఈ కేసులోని నలుగురు నేరం చేయలేదని కేసులో ఇరికించిన ఎస్‍ఐకి తెలుసు. ఇన్స్పెక్టర్‍కి తెలుసు. కేసులో నేరాన్ని గుర్తించిన మేజిస్ట్రేట్‍కి తెలుసు. కేసుని మీకు పంపించిన సెషన్స్ జడ్జికీ తెలుసు. కేసుని విచారించిన మీకూ తెలుసు. అయినా వీళ్ళని కేసులో ఎందుకు బందీ చేశారు?’’ ప్రశ్నిస్తుంది ఫైలు.
‘‘వాళ్ళు నక్సలైట్‍ సానుభూతి పరులు. కానీ ఈ నేరంతో వాళ్ళకి సంబంధం లేదు. సాక్ష్యాధారాలు లేవు. అయినా పోలీసులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్‍ రిమాండ్‍ చేశారు. చార్జిషీట్‍ని పోలీసులు దాఖలు చేశారు. మేం విచారణ చేశాం. అందరికీ అన్నీ తెలుసు. అయినా కేసు విచారణ జరిగింది ఈ ఆరు సంవత్సరాలుగా. ’’ కేసులు నిలవాలని పెట్టరు. మనిషిని వంగతీయడానికి పెడతారు.’’ ఇలా జవాబు చెబుతాడు జడ్జి. ఇంకా ఇలా అంటాడు ప్లే సేఫ్‍ మేం చేసిందీ.


అంతా విన్న ఫైలు శ్వాస ఆగిపోతుంది. జడ్జికి చెమటలు పెడతాయి.
నేరన్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. మనుషులని లొంగతీయడానికి కేసులు ఎలా తయారవుతాయి. మనుషులు కేసు ఫైల్లో ఎలా బందీ అవుతారు. ఇవన్నీ ఈ కథలో కన్పిస్తాయి.


ఈ నలుగురు రచయితలకి కోర్టులతో, కేసులతో సంబంధాలు వున్నాయి. పోలీసులు ఎలా వుంటారు, నేర న్యాయవ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసు. అందుకే ఈ కథలు సహజత్వానికి దగ్గరగా వున్నాయి. తమకు తెలిసిన జీవితాన్ని వాళ్ళు కథల్లో చూపించారు. అందుకే ఈ కథలు దృశ్యాలుగా కన్పిస్తాయి. దృశ్యరూపంలో కనిపించి మనస్సుకి హత్తుకుంటాయి. జీవితం ఇంత వేధనాభరితమా అని భయం కూడా వేస్తుంది. సినిమాలకి భిన్నమైన కథలు ఇవి.
తాము చూడని జీవితం గురించి అద్భుతంగా చెప్పిన రచయితలూ వున్నారు. అయితే వాళ్ళ సంఖ్య తక్కువ.


-మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *