తెలంగాణ ప్రాజెక్టులపై పసలేని విమర్శలు


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. తొలుత అనాదిగా తెలంగాణ వ్యవసాయానికి, గ్రామీణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థకు ఆదరవులుగా ఉన్న గోలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్దరించడానికి మిషన్‍ కాకతీయ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినప్పటికీ ప్రభుత్వాలు భూసేకరణ జరపకపోవడం, నిధులు సమకూర్చకపోవడం, పర్యావరణ, అటవీ అనుమతులు పొందలేకపోవడం, నిర్వాసిత గ్రామాల పునరావాసంపై దృష్టి పెట్టకపోవడం, అంతరాష్ట్ర వివాదాలను పరిష్కరించకపోవడం, రోడ్డు, రైల్వే క్రాసింగుల అనుమతులు పొందకపోవడం వంటి సమస్యల కారణంగా అవన్ని పెండింగ్‍ ప్రాజె క్టులుగా మారిపోయిన ప్రాజెక్టులను రన్నింగ్‍ ప్రాజెక్టులుగా మార్చడంపై దృష్టి పెట్టింది. అందులో కొన్ని.. ప్రాణహిత – చేవెళ్ళ, దుమ్ముగూడెం, దేవాదుల, శ్రీరాంసాగర్‍ వరదకాలువ, కాంతన పల్లి, పాలమూరు రంగారెడ్డి, డిండీ ఎత్తిపోతల పథకాలలో ఉన్న డెజయిం లోపాలను, పైన వివరించిన సమస్యల నుండి బైట పడేసే లక్ష్యంతో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్టికోణంతో వాటిని రీ ఇంజనీరింగ్‍ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‍ కొత్తదేమీ కాదు. గతంలో కూడా ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‍ జరిగింది. ఉదాహరణకు ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్‍ ఎల్‍ బి సి ప్రాజెక్టును తొలుత 11 స్టేజీల లిఫ్ట్ పథకంగా రూపొందించినారు. ఆ తర్వాత అది ఒకే స్టేజి లిఫ్ట్ పథకంగా రూపు దాల్చి అమలయ్యింది. నాగార్జునసాహర్‍, శ్రీరాంసాగర్‍ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా తొలుత ప్రతిపాదించిన విధంగా కాకుండా అనేక మార్పులకు లోనయినాయి. ఆనాటి పరిస్థితులు, ప్రజల డిమాండ్లు లేదా ఇతరత్రా సాంకేతిక కారణాల దృష్ట్యా ప్రాజెక్టుల ప్రతిపాదనల్లో మార్పులు అనివార్యం అవుతాయి. ఇది సర్వసాధారణంగా జరిగే పక్రియనే తప్ప అసాధారణం ఏమీ కాదు. అయినా కూడా ప్రాజెక్టుల రీ-ఇంజనీరింగ్‍ పైన ఇంజనీర్లు, ఇంజనీర్లు కానివారు విపరీతంగా గగ్గోలు పెట్టినారు. అనేక అనుమానాలు లేవనెత్తినారు. వాటిలో ముఖ్యమైన అంశాలను చర్చించే ప్రయత్నమే ఈ వ్యాసం.


ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఖర్చు 38 వేల కోట్లు మాత్రమే. రీఇంజనీరింగ్‍ పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా విలువను ఒక లక్ష కోట్లకు పెంచినారు.
ఈ విమర్శ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నది. మొదట ప్రాణహిత చేవెళ్ళ అంచనా విలువలు ఎట్లా మారినాయో చూద్దాము. తొలుత జి.ఒ. నంబరు 124 తేదీ 16.05.2007 ద్వారా రూ.17,875 కోట్లకు ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది ఉమ్మడి అంధప్రదేశ్‍ ప్రభుత్వం. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే జి.ఒ నంబరు 238 తేదీ 17.12.2008 ద్వారా రూ.38,500 కోట్లకు పరిపాలనా అనుమతిని సవరించింది. ప్రాజెక్టు పనులని 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసి మహారాష్ట్రాతో ఎటువంటి ఒప్పందం చేసుకోకుండానే తల నుండి తోక దాకా ఏకకాలంలో పనులని ప్రారంభింపజేసింది. ప్యాకేజీ 3 లో ప్రతిపాదించిన తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ పనులు తప్ప అన్ని ప్యాకేజీల్లో పనులు ప్రారంభమయినాయి. 2014 జూన్‍ వరకు ప్రాజెక్టుపై 5,347 కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. 2010 లోడిపిఆర్‍ని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపుతూ అంచనా వ్యయం 40,300 కోట్లకు పెంచినారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే ప్రాజెక్టుపై కూలంకషంగా ప్రభుత్వం సమీక్ష జరిపింది. ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి, నీటిని త్వరితగతిన రైతుల పొలాలకు మళ్ళించడానికి ప్రాజెక్టుని రీడిజైన్‍ చెయ్యాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది. 1) తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తగినంత లేదని కేంద్ర జల సంఘం హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కలు 2) ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యంపై కేంద్ర జల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలు, చేసిన సూచనలు 3) తమ భూభాగంలో ముంపుని అనుమతించే ప్రశ్నే లేదని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం 4) మహారాష్ట్రా, కర్నాటక రాష్ట్రాలు ఎగువన గోదావరి దాని ఉపనదులపై లెక్కకు మించి ప్రాజెక్టులు, బ్యారేజీలు కట్టినందున శ్రీరాంసాగర్‍, నిజాంసాగర్‍, సింగూరు జలాశయాలకు నీరు రాక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ జలాశయాలను దిగువ గోదావరిలో పుష్కలంగా లభ్యమయ్యే నీటితో తిరిగి పునర్జీవింప జెయ్యడం.. ఈ కారణాల వలన ప్రాణహిత రీ డిజైనింగ్‍ ని చేపట్టవలసి వచ్చింది. ప్రాజెక్టు రీడిజైన్‍లో కొత్త బ్యారేజీలు, పంప్‍ హౌజ్‍ లు, జలాశయాలు వచ్చాయి. కాబట్టి ప్రాజెక్టు అంచనా వ్యయం అనివార్యంగా పెరిగింది. కేంద్ర జల సంఘం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని2015-16 రేట్ల ప్రకారం రూ.80,190.46కోట్లుగా నిర్ధారించింది. ఇందులో పనులు, భూసేకరణ, పునరావాసం, యంత్ర పరికరాల కొనుగోళ్ళు తదితర ప్రత్యక్ష ఖర్చులు 79,061.64 కోట్లు, పరోక్ష ఖర్చులు 1128.81 కోట్లు అని నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ అంశం పత్రికల్లో కూడా ప్రముఖంగా అచ్చయ్యింది. అయినాకూడా ప్రాజెక్టు విమర్శకులు కాళేశ్వరం అంచనా వ్యయాన్ని 38 వేల కోట్ల నుండి ఒక లక్ష కోట్లకు పెంచినారని అసంబద్ద విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఎల్లంపల్లి నుంచి మీద మానేరుకు, మీద మానేరు నుంచి మల్లన్నసాగర్‍ వరకు 1 టిఎంసి ని తరలించడానికి పనులు చేపట్టింది. వాటి విలువ సుమారు రూ. 27 వేల కోట్లు.


కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎందుకు పెరిగింది?
ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,500 కోట్లు ఎప్పటిది? 2008 నాటిది. భూసేకరణ చెయ్యక, అటవీ అనుమతులు తేలేక, తుమ్మిడిహట్టి బ్యారేజీ సాంకేతిక అంశాలని పరిష్కరించక, మహారాష్ట్రాతో అంతరాష్ట్ర వివాదాలను పరిష్కరించక ప్రాజెక్టుని 8 ఏండ్లు దేకించిన తర్వాత కూడా ప్రాజెక్టు అంచనా వ్యయం 38,500 కోట్లే ఉంటుందా? ఇవ్వాళ్ళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును యధాథతంగా అమలు చేసినా కూడా ప్రాజెక్టు వ్యయం 70 నుంచి 80 వేల కోట్లకు ఎగబాకుతుంది. రీఇంజనీరింగ్‍ తర్వాత ప్రాజెక్టు అంచనా విలువ ఎందుకు పెరుగుతున్నది? ఇవీ కారణాలు

  1. సిడబ్ల్యూసి సూచనల మేరకు జలాశయాల సామర్థ్యాన్ని 14 టిఎంసిల నుంచి 141 టిఎంసిలకు పెంచడమైనది. మరికొన్నికొత్త జలా శయాలను ప్రతిపాదించడం జరిగింది. జలాశయాల ఎత్తు పెంచడం కోసం, కొత్త జలాశయాల నిర్మాణం కోసం అదనపు ఖర్చు తప్పదు.
  2. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడు బ్యారేజీల ద్వారా నదీ మార్గంలో గోదావరి నీటిని రోజుకు 2 టిఎంసిలు ఎత్తిపోయడానికి ప్రతిపాదించడం జరిగింది. సివిల్‍ పనులు మాత్రం రోజుకు 3 టిఎంసిలు ఎత్తిపోసుకోవడానికి వీలుగా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం అదనపు 1 టిఎంసి నీటిని ఎత్తిపోయడానికి కూడా పంపులు అమర్చడం పూర్తి అయ్యింది.
  3. ఆన్‍ లైన్‍ జలాశయాల నిల్వ సామర్థ్యాన్నిపెంచినందున భూసేకరణ, పునరావాసం కోసం అదనంగా ఖర్చు పెరిగింది.
  4. 2007 నుంచి 2016 దాకా ధరల పెరుగుదలను అనుమతించవలసిన నిబంధనలు గత ప్రభుత్వం కుదుర్చుకున్న టెండరు ఒప్పందాల్లోనే ఉన్నాయి.
  5. రీఇంజనీరింగ్‍ ద్వారా కేవలం ప్రాణహిత ప్రతిపాదిత ఆయకట్టుకే కాదు ఈ మూడు జలాశయాల కింద ఆయకట్టుని స్థిరీకరించడం రీఇంజనీరింగ్‍ లో ఒక అంశం. అంటే 18.25 లక్షల ఎకరాలకే కాక 25% ఆయకట్టును (18.83 లక్షల ఎకరాల్లో 25%) స్థిరీకరించడం రీఇంజనీరింగ్‍ లక్ష్యం.
  6. అప్పటి అంచనాలలో భూసేకరణ కోసం ఎకరానికి 1.50 లక్షలు మాత్రమే పెట్టారు. ఇప్పుడు కొత్త భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎకరానికి కనిష్టంగా 6 లక్షలు, గరిష్టంగా 13 లక్షలు చెల్లించింది.
  7. గత అంచనాలలో విద్యుత్‍ సబ్‍ స్టేషన్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించలేదు. ఇప్పడు కాళేశ్వరం ప్రాజెక్టులో 21 సబ్‍ స్టేషన్ల (400, 220, 132, 33 కెవి) నిర్మాణం కోసం నిధులు కేటాయించడం జరిగింది.

కాబట్టి రీ ఇంజనీరింగ్‍ వలన ప్రాజెక్టు అంచనా వ్యయం అనివార్యంగా పెరుగుతుంది. ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరగడం సహజమైన అంశమే. తొలి అంచనా విలువతో పూర్తి అయిన ప్రాజెక్టు రాష్ట్రంలో గాని, దేశంలోగానీ, ప్రపంచంలో గాని ఎక్కడా ఉండవు. ఉమ్మడి ప్రభుత్వం నిర్మించిన కొన్ని భారీ ప్రాజెక్టుల అంచనా విలువలు ఎట్లా పెరిగినాయో ఈ కింది పట్టికలో చూడవచ్చు.

కాబట్టి ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది అని ఒక ఆయాచిత వ్యాఖ్య చేయడం సరి అయినది కాదు. గత ప్రభుత్వాలు సవరించిన అంచనా వ్యయాలు అన్నీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే అని విమర్శలు చేయరెందుకు?


అప్పులు తెచ్చి ప్రాజెక్టును నిర్మిస్తున్నారు :
అప్పులుతెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించడం పట్ల కూడా ప్రాజెక్టు విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేసినారు. నిధులు సమకూర్చలేక ప్రాజెక్టులనుఏండ్ల తరబడి దేకించి ప్రాజెక్టు అంచనా వ్యయాలను విపరీతంగా పెంచిన పట్టికను పైన చూసాము. ప్రభుత్వం ఆ పద్దతికి స్వస్తి చెప్పి ప్రాజెక్టులను రెండు లేదా మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని సంకల్పించింది. నిధుల కొరత లేకుండా బ్యాంకుల ద్వారా నిధులు సమకూరుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి2019 నాటికి పాక్షికంగా నీటి సరఫరా ప్రారంభమయ్యింది. 2021 నాటికి సంపూర్ణంగా పూర్తి చేయాలని సంకల్పించింది. అందుకు అనుగుణంగా పనులు జరుగుతున్న సంగతిఅందరికీ తెలుసు. ప్రతి ఏటా దేశంలో ధరల పెరుగుదల 12 నుంచి 15 శాతం ఉంటున్నది. 18% వరకు పెరిగిన సందర్భాలు కూడా ఉన్నవి. కాళేశ్వరం ప్రాజెక్టుకు 9.2% సాధారణ వడ్డీ రేటుతో బ్యాంకులు నిధులు సమకూరుస్తున్నాయి. ప్రాజెక్టును అనుకున్నసమయానికి పూర్తి అవుతుంది. రైతులకు అతి స్వల్పకాలం లోనే నీటిని సరఫరా చేయగలుగు తాము. తద్వారా ఉత్పత్తి అయ్యే సంపద వలన రైతుల ఆర్ధిక, సామాజిక స్థితిగతులను మార్చడమే కాదు మొత్తంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా పురోగతి సాధిస్తుంది.ప్రాజెక్టు అతి త్వరలోనే తనపై పెట్టిన ఖర్చుని తీర్చివేయగలదు. చైనాలో త్రిగార్జేస్‍ డ్యాం, ఈజిప్ట్ లోని ఆస్వాన్‍ డ్యాంలు తమపై పెట్టిన భారీ ఖర్చులను పదేళ్ళలోనే తీర్చినాయని ఆర్ధిక రంగ విశ్లేషకులు తెల్చినారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆ పనే చేయబోతున్నది. బ్యాంకు లోన్‍ తీసుకుని ఇల్లు కట్టుకోవడం లాంటిదే ఇది కూడా. ఆ తర్వాత సులభ వాయిదాల పద్దతిలో బ్యాంకు అప్పు తీర్చినట్టే కాళేశ్వరం అప్పుని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చగలుగుతుంది. ప్రాజెక్టు సృష్టించే సంపద దాన్ని సుసాధ్యం చేస్తుంది.


కాళేశ్వరం ప్రాజెక్టులు నదులు లేని చోట కృత్రిమ రిజర్వాయర్లు .. మల్లన్నసాగర్‍(50 టిఎంసి), కొండపోచమ్మసాగర్‍ (15 టిఎంసి) సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప్రకృతి విరుద్దంగా భారీ నీటి నిల్వ వలన భవిష్యత్తులో భూకంపాలకు కారణం కావచ్చు. మహారాష్ట్రలో సతారా జిల్లాలోని కోయ్నా రిజర్వాయర్‍ సృష్టించిన భూకంపం మరువరాదు.
డ్యాంలని నదికి అడ్డంగా నిర్మించాలే తప్ప ఈ రకంగా నది లేనిచోట నిర్మించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు అని గతంలో కొంతమంది ఇంజనీర్లు, ఇంజనీర్లు కానివారు కూడా అన్నారు.ఎక్కడో ఎందుకు ఉమ్మడి ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోనే నది లేని చోట, లేదా చిన్నవాగులపై అవి సమకూర్చే నీటి పరిమాణం (Yields) కంటే ఎన్నో రేట్లు ఎక్కువ నిల్వ సామర్థ్యంతో నిర్మించిన జలాశయాలు రాయలసీమలో ఉన్నాయి. కండలేరు-68 టిఎంసి, గోరకల్లు-10 టిఎంసి, వెలిగొండ-41 టిఎంసి, వెలుగోడు-17టిఎంసి, బ్రహ్మంగారి మఠం-17 టిఎంసి, అవుకు-7టిఎంసి,అలుగునూరు-3 టిఎంసి. ఇవన్నీ నదులు లేని చోట నిర్మించినవి కావా? అవసరమైతే కృత్రిమ జలాశయాలు నిర్మించుకోవాలంటూ కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. ఎత్తిపోతల పథకాలలో పెద్ద జలాశయాల నిర్మాణం అత్యంత అవసరం. 50 టిఎంసిలతో మల్లన్నసాగర్ను రీడిజైను చేయడం తప్పనిసరైంది. నది లేని చోట డ్యాం నిర్మిస్తున్నారని విమర్శిస్తున్న వారు, మేధావులు పైన పేర్కొన్న జలాశయాలు నిర్మిస్తున్నప్పుడు కిక్కురుమనలేదెందుకు? ఇప్పుడు అటువంటిదే మల్లన్నసాగర్‍ జలాశయం, కొండపోచమ్మసాగర్‍ నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏదో నేరం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు.


మల్లన్నసాగర్‍లో 50 టిఎంసిల భారీ నీటి నిల్వ కారణంగా భూకంపాలు వస్తాయని కూడా భూకంప కుట్ర సిద్దాంతాన్ని ప్రచారం చేసినారు ప్రాజెక్టు వ్యతిరేకులు. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు మల్లన్నసాగర్కు కోయ్నా డ్యాంని సాక్ష్యంగా చూపెడతారు. దేశంలో భూకంపాల చరిత్రను పరిశీలిస్తే తెలంగాణలో భూకంపాలు వచ్చిన దాఖలాలు లేవు. హిమాలయాల ప్రాంతం, వింధ్య పర్వతాలకు ఆవల ఉండే ప్రాంతాలు, ఆరావళి పర్వత శ్రేణులు, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు, పశ్చిమ కనుమలు దేశంలో భూకంపాలకు నిలయంగా ఉన్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న దక్కన్‍ పీట భూమిలోపల గట్టి రాతి పొరలతో నిర్మితమైన Sub Strata ఉన్నదని భూబౌతిక శాస్త్రవేత్తలు నిర్ధారించినారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తవ్వుతున్న పంపు హౌజ్‍లు, సొరంగాల నుంచి బయటపడుతున్నగట్టి సాంద్రత కలిగిన గ్రానైట్‍ రాళ్ళు ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. భూకంపాలని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు దేశాన్నిమొత్తం5 జోన్లుగా వర్గీకరించినారు. దక్కన్‍ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశాలు లేనందున ఈ ప్రాంతాన్ని భూకంప ప్రాంతాల వర్గీకరణ చేసినప్పుడు అతి తక్కువ అవకాశాలు ఉన్న జోన్‍ 1,2,3లో చేర్చినారు. అందులో 80% తెలంగాణా జోన్‍ 1,2లో ఉంటె 20% జోన్‍ 3లో ఉన్నది. అత్యధిక భూకంపాలు సంభవించే అవకాశాలు జోన్‍ 4, 5లోనే ఉన్నాయి. దేశంలో భూకంపాల చరిత్ర కూడా అదే నిరూపిస్తున్నది. ఇక మల్లన్నసాగర్‍ నిర్మించబోతున్న సిద్దిపేట జిల్లా జోన్‍ 2లో ఉన్నదన్న సంగతి విజ్ఞులు గమనించాలి. (కింద పటాన్ని చూడగలరు).


ఇకపోతే మహారాష్ట్రాలో సతారా జిల్లాలో నిర్మించిన కోయ్నా డ్యాంలో నీటి బరువుకు అక్కడ భూకంపం వచ్చిందని విమర్శకులు పేర్కొన్నారు. అక్కడభూమి పొరల్లో స్వల్ప కదలికలు ఏర్పడిన మాట వాస్తవమే కాని ఆ కదలికలు నీటి నిల్వ కారణంగానే ఏర్పడిందని స్పష్టమైన నిర్ధారణకు శాస్త్రవేత్తలు రాలేదు. కోయ్నా డ్యాం పశ్చిమ కనుమల్లో ఉన్నది. కోయ్నా డ్యాం ఉన్న ప్రాంతం జోన్‍ 4లో ఉన్నందున భూమి లోపల పొరల్లో కదలికల కారణంగా భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువే. అయితేఆ ప్రాంతంలో 1967 వచ్చిన భూకదలికల కారణంగాకోయ్నా డ్యాం బ్రేక్‍ కాలేదు. చిన్నపాటి పగుళ్ళు మాత్రమే వచ్చినాయి. ఆ పగుల్లను సిమెంట్‍ గ్రౌటింగ్‍ ద్వారా మూసివేసినారు. ఏ విపత్తు సంభవించలేదు. కోయ్నా డ్యాం నిశ్చలంగా 50 ఏండ్లుగా నిలబడే ఉన్నది.1964లో నిర్మాణం పూర్తి చేసుకున్న కోయ్నా డ్యాం 93 టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నది. మహారాష్టాకు 1960 మే.వా జలవిద్యుత్తును సరఫరా చేస్తున్నది. కోయ్నా డ్యాం ఉన్న పరిస్థితిని మల్లన్నసాగర్‍ ఉన్న భూబౌతిక పరిస్థితులకు పోల్చి ఇది ప్రమాదకరమైనదని తేల్చి ప్రజలని అయోమయంలోనికి నెట్టివేయడం మేధావులకు తగదు.


కేవలం 0.78 టిఎంసిల సామర్థ్యం కలిగిన నందిమేడారం రిజర్వాయర్‍ నుండి రోజుకు2 టిఎంసిల నీటిని తరలించడం సాధ్యమా?

హైడ్రాలిక్స్ తెలిసిన వారెవ్వరూ ఇటువంటి అమాయకపు ప్రశ్న వెయ్యరు. నిజానికిఅది కేవలం బ్యాలెన్సింగ్‍ రిజర్వాయర్‍ మాత్రమే. ఎల్లంపల్లి జలాశయం నుంచి జంటసొరంగాల ద్వారా భూగర్భ పంప్‍ హౌజ్‍ ద్వారా 23వేల క్యూసెక్కులు నందిమేడారం జలాశయంలోనికి జార విడుస్తారు. అంతే పరిమాణంలో మేడారం జలాశయం నుంచి నీటిని తోడేస్తారు. మేడారం ఒక ట్రాన్సిట్‍ పాయింట్‍గా ఉపయోగ పడుతుందే తప్ప నిల్వ కోసం కాదు. 23 వేలక్యూసెక్కులు 24 గంటల పాటు ప్రవహిస్తే అది 2 టిఎంసిలకు సమానం. 11,500 క్యూసెక్కులు 24 గంటల పాటు ప్రవహిస్తే అది 1 టిఎంసికి సమానం. 11,500 క్యూసెక్కులతో 0.78 టిఎంసి నింపడానికి పట్టే సమయం 18 గంటలు. 23 వేల క్యుసేక్కులతో 0.78 టిఎంసి నింపడానికి పట్టే సమయం 9 గంటలు. కాబట్టి నందిమేడారం జలాశయం నుంచి వచ్చిన నీటిని వెంటనే తోడేయడానికి కనిష్టంగా 9 గంటల సమయం ఉంటుంది. కాబట్టి 2 టిఎంసిల నీటిని తరలించడానికి నందిమేడారం జలాశయం నిల్వసామర్థ్యం సమస్య కానే కాదు.


ప్రపంచంలోఏ ప్రాజెక్టు కింద నీటి నిల్వ కోసం అధిక సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు లేవు. రెండో పంటకు నీరందించే అధికారిక పద్దతి లేదు. దేశంలో ఆరుతడి పంటలకు మాత్రమే అధికారికంగా నీరందిచ వచ్చు.
ఇది కూడా ఒక సాంప్రదాయిక తప్పుడు అవగాహనతో చేసిన విమర్శ. ప్రపంచంలో ఎక్కడా లేనిది తెలంగాణలో ఉండకూడదా? ఇది విచిత్రమైన వితండ వాదన. ప్రపంచ దేశాలు సాహసించని మహా నిర్మాణాలు చైనాలో ఉన్నాయి. మరి తెలంగాణలో ఉంటె అభ్యంతరం దేనికి? నీరు వచ్చినప్పుడే నిల్వ చేసుకోవడానికి రాయలసీమలో పెద్ద రిజర్వాయర్లు నిర్మించారని పైన చెప్పాను. నైలు నదిపై ఈజిప్ట్ ప్రభుత్వం నైలు నదిలో 75% విశ్వసతనీయతతో లభ్యమయ్యే నీటి కంటే ఐదింతల ఎక్కువ అంటే 4660 టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగిన హై ఆస్వాన్‍ జలాశయాన్ని నిర్మించింది. నైలు నదికి వస్తే అత్యధిక వరద, రాకపోతే వరుస కరువులు. ఆస్వాన్‍ డ్యాం నిర్మాణం తర్వాత వరదలు, కరువులు నివారించబడినాయి. నాలుగేళ్ళు వానలు లేకపోయినా ఆస్వాన్‍ డ్యాంలో నిల్వ ఉండే నీరు ఈజిప్ట్ వ్యవసాయాన్ని, విద్యుత్‍ అవసరాలను తీర్చగలుగుతుంది. ఆస్వాన్‍ డ్యాం నిర్మాణం తర్వాత ఈజిప్ట్ ముఖ చిత్రమే మారిపోయింది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా 141 టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలను నిర్మించడం జరుగుతున్నది. భారత దేశం రుతుపవనాల మీద ఆధారపడిన దేశం. 4 నెలలు మాత్రమే నదుల్లో వేల టిఎంసిల నీరు ప్రవహిస్తుంది. ఆ తర్వాత నదులు ఎండిపోతాయి. ఈ నీటిని ఇల్వ చేసుకోకపోతే మిగతా 8 నెలలకు వ్యవసాయానికి, తాగునీటికి నీటిని ఎక్కడ నుంచి తెస్తాము? తెలంగాణా భౌగోళికతను చూసినప్పుడు గోదావరి150 నుంచి 70 మీటర్ల తక్కువ ఎత్తులో ప్రవహిస్తాయి. వ్యవసాయ యోగ్యమైన భూములు 200 నుంచి 620 మీటర్ల ఎత్తున ఉంటాయి. ఈ భూములకు నీరు అందించాలంటే ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేదు. ఇది అందరూ అంగీకరించేదే. అయితే ఎత్తిపోతల పథకాలను ఖర్చు ఎక్కువ అని వారే వ్యతిరేకిస్తారు. ఖర్చు ఎక్కువైనా ఎత్తిపోతలు తప్పవు. గుండె జబ్బు చికిత్స ఖర్చుతో కూడుకున్నదే. ఖర్చు ఎక్కువ అని ఆపరేషన్‍ చేసుకోకుండా ఉంటామా? అది ఖర్చుతో నిమిత్తం లేని అవసరం. అట్లే ఖర్చు ఎక్కువ అని ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణా ప్రాంతాన్ని కరువు పీడిత, ఫ్లోరైడ్‍ పీడిత ప్రాంతంగా, రైతు ఆత్మహత్యల ప్రాంతంగా, వలసల ప్రాంతంగా ఉండిపోనివ్వాలా? తెలంగాణా రైతులకు రెండు పంటలకు నీరు పొందే అర్హత లేదా? ప్రపంచంలో ఎక్కడా ఇంతటి భారీ ఎత్తిపోతల పథకాలు లేకపోయి ఉండవచ్చు. తెలంగాణాకు ఉన్న ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇక్క భారీ ఎత్తిపోతల పథకాలు ఉంటాయి. ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో తెలంగాణా దేశానికే కాదు ప్రపంచానికి కూడా మార్గనిర్దేశనం చేయగలిగే అనుభవాన్ని పొందింది. కాళేశ్వరం, ఎలిమినేటి మాధవరెడ్డి, ఆలీసాగర్‍, గుత్పా, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‍ సాగర్‍, ఎల్లంపల్లి, గూడెం, మంథని, ముక్తేశ్వరం, సింగూరు, చౌటుపల్లి హనుమంత రెడ్డి, శ్రీరాంసాగర్‍ పునరుజ్జీవన పథకం, తుమ్మిళ్ళ, భక్త రామదాసు లాంటి భారీ ఎత్తిపోతల పథకాలు ఎటువంటి సమస్యలు లేకుండా పని చేస్తున్నాయి. నిర్మాణంలో ఉన్నపాలమూరు రంగారెడ్డి, డిండీ, ఉదయ సముద్రం, సీతారామా, చనాకా కోరాట, సంగమేశ్వర, బసవేశ్వర, మంజీరా నాగమడుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో కూడా మనకున్న అనుభవాన్ని వినియోగించుకొని స్వదేశీ డిజైన్లతో శరవేగంగా పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తి అయిన తర్వాత తెలంగాణా ముఖ చిత్రమే మారిపోతుంది. ఈ ప్రాజెక్టులు సరఫరా చేసే నీరు విలువైనదే. వాటిని పొదుపుగా వాడుకోవలసిన భాద్యత మన రైతాంగానిది. ప్రభుత్వం ఒక టిఎంసి నీటితో 18 నుంచి 20 వేల ఎకరాలను సాగు చేయగలిగే piped ఇరిగేషన్‍ పద్దతిని కాళేశ్వరం ప్రాజెక్టులో నిజామాబాద్‍ జిల్లా ప్యాకేజి పనుల్లో, ఆదిలాబాద్‍ జిల్లా మత్తడివాగు కుడి కాలువ నిర్మాణంలో పైలట్‍ ప్రాజెక్టులుగా చేపట్టింది. ఈ పైలట్‍ ప్రాజెక్టుల ఫలితాలను అధ్యయనం చేసి మిగతా ప్రాజెక్టుల్లోకూడా ప్రవేశ పెట్టె యోచనలో ప్రభుత్వం ఉన్నది.


ప్రాణహిత చేవెల్ల ప్రతిపాదనలో ఆన్‍ లైన్‍ జలాశయాల నిల్వ సామర్థ్యం 14 టిఎంసిలే. ఈఅంశంపైకేంద్ర జల సంఘం రిమార్కస్ అప్పటి ప్రభుత్వానికి తెలియజేసింది. 160టిఎంసిలు తరలించే ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం చాలా తక్కువ. ఆన్లైన్‍ జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోండి, మరికొన్ని కృత్రిమ జలాశయాలని నిర్మించండి అని సలహా ఇచ్చింది. ఆ సలహా ప్రకారమే రీఇంజనీరింగ్‍ లో ఆన్లైన్‍ జలాశయాల సామర్థ్యాన్ని పెంచడం, కొన్ని కొత్త జలాశయాలను ప్రతిపాదించడం జరిగింది. అందులో భాగంగానే మల్లన్నసాగర్‍ 50, కొండ పోచమ్మ సాగర్‍ 15 టిఎంసిల సామర్థ్యంతో ప్రతిపాదించడం జరిగింది.కేంద్ర జల సంఘం నిబంధనల ప్రకారం నీటి నిల్వకు, నీటి వినియోగానికి ఉండే నిష్పత్తి 1:1.50 ఉండాలి. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో ఆ నిష్పత్తి 1:10.95 గా ఉన్నది. రీఇంజనీరింగ్‍ తర్వాత 1:1.70 గా మారింది.వర్షపాతం కొన్నిసార్లు రెండు మూడు సంవత్సరాలు ఏకబిగిన తక్కువగా రావచ్చు. గతంలో ఈ వరుస కరువు పరిస్థితిని మనం చూశాం. అట్లాంటి సందర్భాల్లో వర్షాలు ఎక్కువగా వచ్చిన సంవత్సరాల్లో నీటిని నిల్వ చేసుకుంటే వాటిని ఆ తరువాతి సంవత్సరం వినియోగాలకు క్యారీ ఓవర్‍ స్టోరేజీగా వాడుకోవచ్చు. నీటి లభ్యత, వినియోగం గురించి చెబుతూ దివంగతసాగునీటి ప్రభుత్వ సలహాదారు ఆర్‍.విద్యాసాగర్‍ రావు గారు ‘జుట్టుంటే కొప్పు ఎట్లాగైనా పెట్టుకోవచ్చు’ అనేవారు.సరిపోయినంత నీటి నిల్వసామర్థ్యం రైతులకు, భవిష్యత్తు తరాలకు అందించడం మనందరి భాధ్యత.


కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టులో 62% మల్లన్నసాగర్‍ రిజర్వాయర్‍, ఇంకా దానికి దిగువనే ఉంది. జూన్‍ నెలలో రైతులకు సాగునీరు అందించాలంటే జులైలో కాళేశ్వరం వద్ద లభించే నీటిని వినియోగించలేము. ఋతుపవనాలు సకాలంలో రాని సంవత్సరాలు, మూడు నాలుగు వారాల పొడి సమయం (dry spells) ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి మల్లన్నసాగర్‍ లో నిల్వనీటిని ఆ పై సంవత్సరం క్యారీ ఓవర్‍ స్టోరేజీగా వినియోగింఛుకొని జూన్‍ లోనే సాగునీరందించవచ్చు. ఇక్కడ గమనించవలసిన ఇంకో ముఖ్య విషయం నీటి రవాణాకు పట్టే కాలం (travel time). మేడిగడ్డ వద్ద జూన్‍/జులై నెలలో లిఫ్ట్ చేయడం మొదలైన రోజునుంచి మల్లన్నసాగర్‍ అవతలనున్న ఆయకట్టుకు నీరు అందించాలంటే బ్యారేజీల్లో, బ్యాలెన్సింగ్‍ రిజర్వాయర్లలో కనీస స్థాయిల్లో నీరు చేరినాకనే లిఫ్ట్ చేయడమయినా, కెనాళ్ళల్లో ప్రవహించడమయినా సాధ్యమవుతుంది. ఇక కెనాళ్లలో నీటి ప్రవాహం పూర్తి స్థాయిలో ఉండడానికి మొదట అవి పూర్తిగా నిండాలి. ప్రాజెక్టులో మొత్తం దాదాపుగా 22 చోట్ల లిఫ్ట్ చేయాలి. అక్కడ పంపులు ఒక క్రమ పద్దతిలో ఆన్‍ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి కూడా కొంత సమయం పడుతుంది. నీటి ప్రవాహవేగం కూడా దాదాపుగా సెకన్‍కు 3.0 మీ ఉంటుంది. ఇట్లా మొత్తం నీటి ప్రవాహం మేడిగడ్డ నుండి ప్రతిపాదిత ఆయకట్టుకు అందించడానికి కనీసం ఒకటి నుండి మూడు వారాల సమయం పడుతుంది. మనం ఖరీఫ్‍ సీజన్‍ మొదటి రోజునే నీళ్ళు అందించాలంటే నీటి సోర్సుకు దాదాపుగా 200 కిమీ దూరంలో ఉన్న మల్లన్నసాగర్‍ రిజర్వాయర్లో కావల్సినంత స్టోరేజి ఉంటేనే సాధ్యమవుతుంది.


ఇక మల్లన్న సాగర్‍ వద్దనే 50 టిఎంసిల స్టోరేజి అవసరం ఏమిటి అన్నది పూర్తిగా సాంకేతిక పరమైన అంశం మాత్రమే అయినప్పటికీ దానికి తోడు భౌగోళికంగా ఆ ప్రదేశానికి ప్రాధాన్యత ఉన్నది. మల్లన్న సాగర్‍ (i)నైసర్గికంగా ఎత్తైన ప్రదేశంలో ఉండడం (ii)గోదావరి, కృష్ణా నది బేసిన్ల పరీవాహక ప్రాంతాల మధ్యగల ప్రదేశం (ridge). ఇక్కడ 0557మీ FRLవద్ద నీటిని నిలువ చేస్తే అక్కడి నుండి స్వంత ఆయకట్టుతో పాటుగా, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన బ్యాలెన్సింగ్‍ రిజర్వాయర్‍గా ఎగువకు నీటి సరఫరా చేయడంతో పాటుగా, చుట్టూ అన్నీ వైపులనున్న స్కీంలకు నీటిని అందించి ఆదుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్‍ (11.39 టిఎంసి), గంధమల్ల (9.87 టిఎంసి) రిజర్వాయర్ల కింది ఆయకట్టు, సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్‍ రిజర్వాయరు (15టిఎంసి) కింద అయకట్టు, షామీర్‍ పేట్‍ త్రాగునీటి రిజర్వాయర్‍ కు, హల్దివాగు ద్వారా నిజాంసాగర్‍ రిజర్వాయర్‍కు, ప్రత్యేక లింక్‍ ద్వారా సింగూర్‍ రిజర్వాయర్‍ కు నీళ్ళివ్వవచ్చు. ఒకసారి మల్లన్నసాగర్‍కు ఎత్తిపోసినాక కొండపోచమ్మసాగర్‍కు తప్ప అన్ని వైపులా గ్రావిటి ద్వారానే ఇవ్వవచ్చు. మల్లన్నసాగర్‍ వద్ద నిల్వ చేసుకుంటే వీటన్నింటికి అవసరాన్ని బట్టి ఇవ్వడానికి వెసులుబాటు ఉంటుంది. అందుకు 50 టీఎంసీల నీటి సామర్థ్యం అత్యంత అవసరం. ఇది కాళేశ్వర ప్రాజెక్టు మొత్తానికే ఒక మదర్‍ రిజర్వాయర్‍ (Mother Reservoir).


మల్లన్నసాగర్‍, కొండ పోచమ్మసాగర్‍ ఆయకట్టులో రైతులు చేయబోయే వ్యవసాయం బహుశా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యవసాయం. ఈ ప్రాజెక్టులో కరెంటు ఖర్చే ఎకరానికి 80 వేల నుండి ఒక లక్ష వరకు ఉండే అవకాశం ఉన్నది.
ప్రాజెక్టు వ్యతిరేకులు గతంలో ఇదే రకమైన ఆరోపణ చేసినారు. కరెంటు వ్యయం ఎకరానికి 80 నుండి ఒక లక్ష వరకుఉంటుందని ఏ ఆధారాలతో చెబుతున్నారో వారికేతెలియాలి. ఇంతకు ముందు చెప్పినట్టు ప్రాజెక్టు అంచనావ్యయాన్ని కేంద్ర జల సంఘం 80,190 కోట్లకు నిర్ధారించింది. ఈఅంచనా వ్యయంతో ఎకరానికి అయ్యే వ్యయం : 80190 / (18.25ం4.70 (స్థిరీకరణలో 25%) = 3,49,412 రూపాయలు మాత్రమే. స్థిరీకరణ ఆయకట్టును 100% పరిగణిస్తే ఎకరానికి అయ్యే వ్యయం 2,16,730రూపాయలు. విద్యుత్‍ వ్యయం సంగతి చూస్తే.. మొత్తం ప్రాజెక్టుకు అవరమయ్యే విద్యుత్తు 13558 మిలియన్‍ యూనిట్లు. అయితే ఇందులో 75% విద్యుత్తు మాత్రమే వాస్తవంగా వినియోగమవుతుంది. అంటే వాస్తవ వినియోగం 10168.5 మిలియన్‍ యూనిట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలోవిద్యుత్‍ వినియోగం మొదలయ్యేనాటికి ఉత్తర భారత దేశంలో ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్‍ (కాళేశ్వరం పంపులు వానా కాలంలోనే తిరుగుతాయి) రూ. 1.25 నుంచి రూ. 3.00 లకే అందుబాటులోకి వస్తుంది. అప్పుడు విద్యుత్‍ వినియోగ వ్యయం ఇంకా తగ్గుతుంది. ప్రస్తుతం యూనిట్‍కి రూ. 3.00 చొప్పున లెక్కిస్తే మొత్తం విద్యుత్‍ వ్యయం 3051 కోట్లు. ఎకరానికి అయ్యే విద్యుత్‍ వ్యయం రూ. 13,051 మాత్రమే. యూనిట్‍కి రూ. 1.25 చొప్పున లెక్కిస్తే మొత్తం విద్యుత్‍ వ్యయం రూ.1271 కోట్లు. ఎకరానికి అయ్యే విద్యుత్‍ వ్యయం రూ.5400 మాత్రమే. దీనికి తోడు ఇప్పుడు ప్రపంచంలో తయారవుతున్న పంపులు 88 -89% ఎఫిషియన్సీ కలిగినవి. వాటి పవర్‍ ఫ్యాక్టర్‍ 0.95 గా ఉంటుంది. కనుక 10% వరకు ప్రత్యక్షంగా విద్యుత్‍ వినియోగంలో సేవింగ్స్ఉం టాయని విద్యుత్‍ రంగ నిపుణులు చెపుతున్నారు. గతంలో కొంతమంది విమర్శకులు దాన్ని తమ ఊహాగానాల లెక్కలతో మొత్తం విద్యుత్‍ వ్యయం రూ.8 వేల కోట్ల నుంచి 13 వేల కోట్లకు ఉంటుందని, ఎకరానికి అయ్యే విద్యుత్‍ వ్యయాన్ని ఒక లక్ష నుంచి లక్షా ఎనభై వేలకు లెక్క గట్టినారు. ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ఖరీదైన నీటిని సరఫరా చేస్తుందని అన్యాయపు నిర్ధారణకు వచ్చినారు. కాళేశ్వరమే కాదు ఏ ఎత్తిపోతల పథకం నుంచి సరఫరా అయ్యే నీరు ఖరీదైనదే. అయితే ప్రాజెక్టు విమర్శకులు ఈ ఖర్చును భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. మల్లన్నసాగర్‍, కొండపోచమ్మసాగర్‍ కింద ఆయకట్టు రైతులు చేసేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యవసాయం అని అన్యాయమైన వ్యాఖ్య చేసిపారేసినారు. ఇది అవాస్తవం సత్యదూరం. పాఠకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.


కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదు. తిప్పిపోతల పథకం!
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తునుండి కిందకి ప్రవహించిన నీటినే తిరిగి పైకి అదే ప్రాంతానికి ఎత్తిపోస్తారు కాబట్టి ఇది తిప్పిపోతల పథకం అని విమర్శకులు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్వరూప స్వభావాలపై, పంపింగ్‍ పక్రియపై ఏ మాత్రం అవగాహన లేని విశ్లేషణ ఇది. ప్రాజెక్టును రూప కల్పన చేసిన ఇంజనీర్ల విజ్ఞతపై పరిహాసం చేయడం, దేశంలో నీటి ప్రాజెక్టులను ఆమోదించే అత్యున్నత సంస్థ అయిన కేంద్ర జల సంఘం సామర్థ్యాన్ని శంకించే సాహాసం చేయడం తప్ప మరొకటి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసే పక్రియ ఎట్లా ఉంటుంది? మూడు మార్గాల ద్వారా నీటిని సరఫరా చేసే అవకాశాలు కాళేశ్వరం సిస్టంలో ఉన్నది. మొదటిది శ్రీరాం సాగర్‍కు వరద వచ్చినప్పుడు వరద కాలువ ద్వారా మిడ్‍ మానేరుకు, కాకతీయ కాలువ ద్వారా దిగువ మానేరు చేరతాయి. ఇవి పోగా ఇంకా వరద ఉంటే స్పీల్‍ వే గేట్ల ద్వారా నదిలోకి వదులుతారు. అవి ఎల్లంపల్లికి వెళతాయి. ఎల్లంపల్లి నిండితే సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డకు, సమ్మక్కసాగర్‍ (తుపాకులగూడెం), దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నిర్మించబోయే సీతమ్మసాగర్‍ బ్యారేజి ద్వారా పోలవరానికి వెళతాయి. శ్రీరాంసాగర్‍ కు వరద వచ్చిన స్థితిలో కాళేశ్వరం లింక్‍-1 పంపులు (మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి), లింక్‍-2 పంపులు (ఎల్లంపల్లి నుంచి మిడ్‍ మానేరుకు) తిప్పేఅవసరం రాదు. ఇక రెండో స్థితి శ్రీరాంసాగర్‍ కు వరద రాకున్నా ఎల్లంపల్లికి కడెం నది నుంచి, శ్రీరాంసాగర్‍ ఎల్లంపల్లికి మధ్యన ఉన్నపరివాహక ప్రాంతం నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నది. ఈ స్థితిలో కాళేశ్వరం లింక్‍-1 పంపులు తిప్పే అవసరం రాదు. ఎల్లంపల్లి నుంచే లింక్‍-2 పంపులు తిప్పినీటిని మిడ్‍ మానేరుకు చేరవేయడం, అక్కడినుంచి ఎగువన అనంతగిరి, రంగనాయకసాగర్‍, మల్లన్నసాగర్‍, కొండపోచమ్మసాగర్‍ దాకా ఎత్తిపోయడం, దిగువ మానేరు నుండి కాకతీయ కాలువ ద్వారా శ్రీరాంసాగర్‍ మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు నీటి సరఫరా, పునరుజ్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్‍ జలాశయానికి నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది.ఈ రెండు చోట్ల నీటి లభ్యత లేని సందర్భాల్లో మాత్రమే లింక్‍-1, లింక్‍-2 పంపులను తిప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. పై నుంచి నీటిని కిందకి పోనిచ్చి మళ్ళీ పైకి అదే ప్రదేశానికి ఎత్తిపోసే స్థితి ఎక్కడ ఉన్నది? పైన నీళ్ళు ఉన్నప్పుడు పైనుంచే వాడుకోవడం జరుగుతుంది తప్ప ఈ నీళ్ళను కిందకి పోనిచ్చి మళ్ళీ పైకిఎత్తిపోసే మూర్ఖపు పని మన ఇంజనీర్లు చేస్తారని ఈ (కు)విమర్శకులు ఎట్లా ఊహించగలిగినారు?


రేపటి రోజు ఈ ప్రాజెక్టులు సందర్శకులకు వినోదాన్ని పంచే పర్యాటక కేంద్రాలుగా, చేపల చెరువులుగా మిగిలిపోకూడదు. ప్రాజెక్ట్ సందర్శకులు మెచ్చుకుంటున్నది, కీర్తిస్తున్నది కట్టడాల నిర్మాణ కౌశల్యాన్ని తప్ప ప్రాజెక్టు ఇవ్వబోయే ప్రయోజనాలను ఎంతమాత్రం కాదు.
ఇది నిజం కావాలని ప్రాజెక్టు విమర్శకులు బలంగా కోరుకుంటున్నట్టు అనిస్తున్నది. అయితే వారి కోరిక తీరే అవకాశం లేదని కాళేశ్వరం ప్రారంభం అయిన రెండేండ్లకే రుజువయ్యింది. ఈ ప్రాజెక్టుని మెచ్చుకుంటున్నది ఎవరో అనామకులు కాదు. ఈ ప్రాజెక్టు నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి, మదించి అనుమతులు మంజూరు చేసిన కేంద్ర జల సంఘం చైర్మన్‍ మసూద్‍ హుస్సేన్‍ గారు, ఆ సంస్థలో పని చేస్తున్న చీఫ్‍ ఇంజనీర్లు, డైరెక్టర్లు, ఐఎఎస్‍, ఐపీఎస్‍ అధికారులు, హైకోర్టు జడ్జీలు, అడ్వకేట్లు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, కె రామచంద్రమూర్తి, టంకశాల అశోక్‍ లాంటి సీనియర్‍ పాత్రికేయులు, వాటర్‍ మ్యాన్‍ ఆఫ్‍ ఇండియాగా పేరుగాంచిన మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‍ ఉన్నారు. వారి విజ్ఞతని ఈ రకంగా పరిహసించడం ద్వారా విమర్శకులు తప్పులో కాలేసినారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో తెలంగాణా ఇంజనీర్లకు ఉన్న అపారమైన అనుభవాన్ని అపహాస్యం చేయడం తగదు. కాళేశ్వరం ప్రాజెక్టులో, పాలమూరు రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టులలో నిర్మాణం అవుతున్న కట్టడాలు మాన్యుమెంట్స్గా మిగిలిపోతాయో, లేదా తెలంగాణా ఆర్ధిక సామాజిక ముఖ చిత్రాన్నిమార్చే గ్రోత్‍ ఇంజన్లుగా చరిత్రలో నిలబడిపోతాయో ఇప్పటికే ప్రజల అనుభవంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వలన సాగులోనికి వస్తున్న భూవిస్తీర్ణం క్రమంగా పెరుగున్నది. సాగు విస్తీర్ణం పెరుగుదల వివరాలు లక్షల ఎకరాలలో ప్రాజెక్టులను పూర్తి చేసినందు వలన సాగునీటి సౌకర్యం పెరగడం, భూగర్భ జలాలు గణనీయంగా వృద్ది కావడంతో ప్రాజెక్టుల కింద, బోరు బావుల కింద రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. 2020-21 యాసంగీ పంట కాలమో ఒక కోటి ఎకరాల్లో పంటలు వేయడం మనం గతంలో ఎన్నడూ కలలో కూడా ఊహించని సందర్భం. తెలంగాణలో అది సాధ్యం అయ్యింది. 2020 సంవత్సరంలో సేకరించిన ధాన్యంలో 52 శాతం తెలంగాణ రాష్ట్రం నుంచే సేకరించామని భారత ఆహార సంస్థ ప్రకటించడం గమనార్హం.


ప్రాజెక్టులపై విమర్శలు చేసే మాకు ప్రత్యామ్నాయాలు సూచించే అవసరం లేదు.
ఇదీ తెలంగాణ ప్రాజెక్టు విమర్శకుల వైఖరి. ప్రత్యామ్నాయాలను సూచించే భాధ్యతను తెలివిగా వదిలెయ్యడమే కాదు భాధ్యతని నెరవేర్చాలని అనుకుంటున్నప్రాజెక్టు విమర్శకులని కూడా వీరు ఎద్దేవా చేసినారు. ప్రత్యామ్నాయాల్ని సూచించలేనివారికి, సూచించాలని అను కోనివారికి తప్పులు ఎత్తిచూపే నైతిక హక్కు ఎక్కడిది? ప్రత్యామ్నా యాలని సూచిస్తూ ప్రాజెక్టుని విమర్శిస్తున్న వారికంటె ఈ రకమైన విమర్శకుల వలన సమాజానికి జరిగే నష్టం ఎక్కువ. ఈ సందర్భంగా వాట్సాప్‍ గ్రూపుల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టిన ఒక కథ గుర్తుకు వస్తున్నది.
ఒక ఆర్టిస్టు తన మొదటి పెయింటింగ్‍ పై విమర్శకుల అభిప్రాయాన్ని తెలుసుకుందామన్న ఆసక్తితో దాన్ని ఉదయం ఒక బహిరంగ ప్రదేశంలో వేలాడదీసి దాని కింద ‘‘ఇది నా మొదటి పెయింటింగ్‍. ఈ బొమ్మలో మీకు ఎక్కడ తప్పులు కనిపిస్తే అక్కడ X మార్క్ పెట్టండి’’ అని ఒక నోట్‍ని రాసినాడు. ఎర్ర రంగు, ఒక బ్రష్‍ని కూడ పెట్టినాడు. సాయంత్రం వెళ్ళి చూసే సరికి అతనికి కండ్లు బైర్లు కమ్మినాయి. మొత్తం పెయింటింగ్‍ నిండా X మార్కులే! అతను నిరాశతో తన గురువుగారి దగ్గరికి వెళ్ళి చూపించినాడు. గురువుగారు నిరాశ చెందవద్దని, అదే బొమ్మని మరొకసారి వేసి అదే ప్రదేశంలో వేలాడదియ్యమని సూచించినాడు. అయితే ఈసారి నోట్‍లో రాయవలసిన అభ్యర్థనని మార్చమన్నాడు. గురువుగారి సూచన మేరకు అతను తన పెయింటింగ్‍ని అదే ప్రదేశంలో వేలాడదీసి కింద ఈరకంగా అభర్థించినాడు. ‘‘ఇది నా మొదటి పెయింటింగ్‍. ఈ బొమ్మలో మీకు ఎక్కడ తప్పులు కనిపిస్తే అక్కడ సరి చేయగలరు.’’ సాయంత్రం వెళ్ళి చూసే సరికి తన పెయింటింగ్‍ గీసింది గీసినట్లు అట్లనే ఉన్నది. సారాంశం ఏమిటంటే తప్పులు ఎన్నడం తేలికే. తప్పులు సరిదిద్దడం కష్టం. ప్రాజెక్టు విమర్శకులు తేలికైన తప్పులు ఎన్నే పనిని ఎంచుకున్నారు. కష్టమైన తప్పులు సరిదిద్దే పనిని వదిలేశారు. పైగా అది మా పని కాదు అని దబాయింపు. ప్రభుత్వం తెలంగాణ రైతులకు సాగునీళ్లివ్వాలా? వద్దా? నల్లగొండ, మహబూబ్‍ నగర్‍ జిల్లాల్లో ఫ్లోరోసిస్‍ పీడ విరగడ కావద్దా? తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం కొనసాగవలసిందేనా? తెలంగాణలోరైతుల ఆత్మహత్యలు కొనసాగ వలసిందేనా? తెలంగాణ ఇంకా కరువు ప్రాంతంగా మిగిలి పోవలసిందేనా? తెలంగాణ ప్రజలకు తాగునీళ్ళు కావాలి. సాగు నీళ్ళు కావాలి. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం రాజీలేకుండా పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలకు దక్కకుండానే గోదావరిలో 3 వేల నుంచి 3500 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళాల్సిందేనా! ప్రాజెక్టు విమర్శకులుఅదే కోరుకుంటున్నరా? గ్రావిటీ మార్గాన నీరు ఇవ్వలేమని తెలిసినప్పుడు ఆర్థికంగా భారమైనా ఎత్తిపోతల పథకాలని చేపట్టక తప్పదు. తెలంగాణకు సాగునీరు ఇవ్వాలంటే ఎత్తిపోతల పధకాలు తప్ప ప్రత్యామ్నాయం లేదని ఈ మేధావులకు తెలియదని కాదు. ఆర్థిక సానుకూలత లేదన్న కారణంతో ప్రాజెక్టులను కట్టొద్దా? ఈ డొంక తిరుగుడు వాదనల కంటే అసలు ప్రాజెక్టులే వద్దని నేరుగా ప్రకటించవచ్చు కదా! ఏదో రకంగా కాళేశ్వరం ప్రాజెక్టును, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విమర్శించాలనో, కిరికిరి పెట్టాలనో, ప్రజలను.. ముఖ్యంగా రైతాంగాన్ని గందరగోళంలో పడవేయాలనో వారు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నది.


దశాబ్దాలుగా తాగునీటికి, సాగునీటికి అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు తమకిచ్చిన కాలపరిమితిలోనే సాగునీరు, తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యం. గతంలో ఆంధ్రా వలస పాలకులు మీరు (తెలంగాణ) ఎత్తుగడ్డ మీద ఉన్నారు. నీరు పల్లమెరుగు. కాబట్టి మీకు నీళ్ళు రావు అనేవారు. ఎత్తిపోతల ద్వారా తప్ప గోదావరి నీరు ఎత్తుగడ్డ మీద ఉన్నతెలంగాణ భూములకు తరలించే మార్గం లేదని తెలిసీ కూడా వీరు ఆర్థిక సానుకూలత లేదన్న సాకుతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని, ఇతర పథకాలను వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరి లక్ష్యం తెలంగాణకు సాగునీరు అందకుండా చెయ్యడమే.

  • శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *