వెదురులో ఎంతెంతో సృజనాత్మకత


కళకు, కులానికి మధ్య అనుబంధం వేల ఏళ్ళుగా కొనసాగుతూనే వస్తోంది. ఒక సృజనాత్మకత కళ పేరు చెబితే కులం గుర్తుకురావడం, కులం పేరు చెబితే ఆ కళ సృజనాత్మకత గుర్తుకు రావడం సహజమే. ఒకప్పుడు పారిశ్రామిక విప్లవానికి ముందు గ్రామాల్లో ప్రజలు చేతివృత్తులపై ఆధారపడి గౌరవంగా జీవనం కొనసాగించేవారు. ఉమ్మడి కుటుంబంలో చిన్నా, పెద్దా అంతా కూడా ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకునేవారు. ఈ చేతివృత్తుల్లోనే వివిధ కళలు చోటు చేసుకునేవి. వాటిల్లో సృజనాత్మకత కూడా ఎంతగానో వెల్లివిరిసేది. క్షణం తీరికలేకుండా చేతినిండా పనితో కుటుంబాన్ని సంతోషంగా పోషించుకునేవారు. వెదురుతో వివిధ రకాల వస్తువులు చేయడం కూడా ఒక కళనే. ఆ కళలో నిపుణులు మేదరి కులం వారు. ఇది వెనుకబడిన కులాల్లో ఒకటి. మహేంద్ర అని కూడా అంటారు.


ఈ కులంతో సమాజానికి గల అనుబంధం ఎంతో. హిందూ సంప్రదా యంలో పుట్టిన శిశువును చేటలో వేస్తారు…. మమృతి చెందాక వెదురు బద్ద లతో చేసిన పాడెపైనే అంతిమయాత్రకు తీసుకువెళతారు. వెదురుతో బంధం చావు-పుట్టుకలకే పరిమితం కాలేదు. చావు పుట్టుకలమధ్య జరిగే అనేక కార్యక్రమాలతో వెదురు అవసరం కనిపిస్తుంది.
గ్రామీణ చేతివృత్తుల్లో ప్రధానమైనది మేదరి వృత్తి. మేదరి వృత్తి దారులు తాతముత్తాల కాలం నుంచి వస్తున్న వెదురుతో చేసిన వస్తువులను తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. నేటికీ మేదరి వృత్తిదారులు వెదురును సేకరించి వాటి ద్వారా ఇళ్లలో ధాన్యం శుధ్ది చేసేందుకు ఉపయోగించే చాటలు, గంపలు, గుల్లలు, విసన కర్రలు, చిన్నపిల్లల ఆటవస్తువులు తయారు చేస్తున్నారు. పట్టణాల్లో బోనాల తొట్టెలు, ఇతర ఉత్సవాలు, కార్యక్రమాల కోసం చలువ పందిరి కోసం ఉపయోగించే తొడుకలు, గృహనిర్మాణాలకు ఉపయో గించే వెదురు నిచ్చెనలు తయారు చేస్తూ జీవనం కొనసాగించేవారు.


ఒకప్పుడు అడవులలో వున్న వెదుర్లను కొట్టి తెచ్చి తట్టలు, బుట్టలు అమ్మేవారు. అప్పట్లో బొట్టలు, మక్కెనలు, వంటి పెద్ద పెద్ద సామానులను తయారు చేయడంలో వారికి ఆదాయం బాగా వుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ వృత్తిలో కొనసాగుతున్న వారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. అక్కడక్కడ వున్న వారు తట్టలు బుట్టలు చేసి సంతలలో అమ్ముతున్నారు. మొత్తం మీద క్రమక్రమంగా ఈ వృత్తిపై కాలం వెళ్ళదీసేవారు కనుమరుగైపోతున్నారు.
రెండు దశాబ్దాల కిందటి వరకు మేదరి కులస్తులకు చేతినిండా పనే! ఇళ్లల్లో ఉపయోగించే గంపలు, చాటలు, తడికెలు, విసనకరల్రు వీరు తయారు చేసేవే. పండిన కూరగాయలు మార్కెట్‍ చేయడానికి అనువైన బుట్టలు, తమలపాకు బుట్టలు, బొగ్గుగనుల్లో ఉపయోగించే తట్టలు మొదలు… పెళ్లి పందిళ్లు, మేనమామలు పెళ్లికూతుర్ని తీసు కువచ్చే గంపలు, సారె గంపలు… వీరి చేతులమీదుగా తయారైనవే. అప్పట్లో శుభకార్యాలలో వెదురు గంపలలోనే భోజనం తీసుకొచ్చి వడ్డించేవారు. అంతేకాదు… ఇంటికి కావలసిన అలంకరణ వస్తువులను కూడా వీరే తయారుచేసేవారు.


కనుమరుగవుతున్న సృజనాత్మకత

సమాజంలో అంతర్లీనంగా పెనవేసుకున్న ఈ వెదురుకు రూపాన్నిచ్చే మేదర్ల పరిస్థితి మాత్రం దినదినగండం నూరేళ్ల ఆయుష్షూలా మారింది. ప్లాస్టిక్‍ రంగప్రవేశంతో వృత్తి కోలుకోలేని దెబ్బతింది. అ యినప్పటికీ తమ సృజనను ప్రోదిచేసి కుల వృత్తికి జీవంపోసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మేదర్లు. గతంలో వీరి ఉత్పత్తుల్లో ఎంతో సృజనాత్మకత కనిపించేది. ఇప్పుడది బాగా తగ్గి పోయింది. అయితే, ఇప్పటికీ, వెదురుబద్దలతో చేసిన అనేక అలంకరణ వస్తువులు ప ట్టణాలలో అమ్ముతున్నారు. వీటి ధరలు అధికంగా ఉంటున్నాయనే మాటలు వినబడడం సహజం. అందుకు రకరకాల కారణాలున్నాయి. రేట్లు ఎంత ఎక్కువగా ఉన్నా వీరికి మిగిలేది మాత్రం తక్కువే. కళాత్మకమైన ఇటువంటి వస్తువుల తయారీతోనైనా ఈ మేదర వృత్తి వారు కొంతవరకు బతుకు వెళ్లదీస్తున్నారు.


ప్లాస్టిక్‍ వస్తువులపైనే మోజు
ప్లాస్టిక్‍ రంగ ప్రవేశంతో వీరి వృత్తి దెబ్బతింది. వీరుచేసే ప్రతీ వస్తువూ ప్లాస్టిక్‍ రూపంలో దర్శమిస్తున్నాయి. ప్లాస్టిక్‍ వస్తువుల వినియోగం పెరుగుతున్న కొద్దీ వృత్తిదారులకు ఉపాధి కరువై ఉనికి కోల్పోతున్నారు. ప్లాస్టిక్‍ వస్తువులు విరివిగా అందుబాటులోకి రావడం వీరి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ప్లాస్టిక్‍ వస్తువుల మీదే ప్రజలు మోజు పడుతూ వాటి మీద ఆదరణ చూపుతున్నారు. గతంలో వెదురు తడికలు, వెదురు నిచ్చెనలు విరివిగా వాడేవారు. ప్లాస్టిక్‍ రావడంతో రేషం తట్టలు, మైలబట్టల బుట్టలు, ఇనప నిచ్చెనలు అందుబాటులోకి వచ్చి మేదరుల కులవృత్తి దెబ్బతింది.


పారిశ్రామిక విప్లవం మొదలైన నాటి నుంచి చేతివృత్తులకు తీవ్ర నష్టం జరిగింది. ప్రపంచీకరణలో భాగంగా విదేశీ వస్తువులు, ప్లా స్టిక్‍ వినియోగం పెరగుతున్న కొద్దీ చేతి వృత్తిదారుల ఉపాధి దెబ్బ వా టిల్లింది. ప్రతి వస్తువు ప్లాస్టిక్‍తో తయారు కావడంతో పాటు ఆకర్షణీ యంగా ప్రతిఒక్కరి అందుబాటులో ఉండే ధరల్లో ఉండడంతో ప్లాస్టిక్‍ వాడకం పైనే ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‍ వ్యాపారంలో పోటీ పె రగడంతో ఎన్నో రకాల వస్తువులు నేడు వివిధ దేశాల నుంచి నగరాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలు, చివరికి గ్రామాలకు సైతం వచ్చేస్తున్నాయి. దీంతో నేడు మేదరి వృత్తిదారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. వృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిన్నవారు ఉపాధి లేక దుర్భర స్థితుల్లో బతుకీడుస్తున్నారు.


ముడిపదార్థాల ధరల పెరుగుదల
మేదరి వృత్తిదారులకు పనిభారం అధికం అవడం, పెరిగిన ధరలతో తాము తయారు చేసే వస్తువులకు ధరలు లభించక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చేతితో తయారు చేసిన వస్తువులకు ఆదరణ కరువైంది. అనేక అవస్థలు పడుతూనే కొందరు జీవనం సాగి స్తుండగా, మరికొంత మంది ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొట్టకూటి కోసం కూలీలుగా మారుతున్నారు. వెదురు వస్తువుల తయారీ కూడా అంత సులభమైందేం కాదు. రేయింబవళ్లూ శ్రమిస్తేనే ఆయా వస్తువులు తయారవుతాయి. ఒకచాట లేక గుల్లను అల్లేందుకు ఒక రోజు సమయం పడుతుంది. అదే గ్రామాల్లోరైతులు ధాన్యం నిల్వ చేసే గుమ్మిలను తయారు చేసేందుకు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. తమ శ్రమను అర్థం చేసుకొని పైసలిచ్చేవారు మాత్రం తగ్గిపోతున్నారని ఈ వృత్తిలో కొనసాగు తున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీడీ కార్మికులు ఉపయోగించే చాటలు రూ.50 నుంచి రూ.100 ధర పలుకుతాయి. వీటిని తయారీకి ఒకటి నుంచి రెండు రోజుల సమయం పడుతుంది. పెరిగిన ధరలతో వీరు తయారుచేసే వస్తువులు సరైన ధర గిట్టుబాటు రాక కనీసం రోజు కూలీ కూడా మిగలక దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరు తయారు చేసే వస్తువుల కంటే మార్కెట్లో ప్లాస్టిక్‍ వస్తువులు అతి చౌకధరలకు లభిస్తున్నాయి. దీంతో అధిక శాతం ప్రజలు వాటివైపే మొగ్గు చూపడంతో నేడు వీరికి ఉపాధి కరువైంది.


వెదురు వెతలు
జిల్లాల్లో పెద్ద ఎత్తున వెదురు వస్తువులు తయారు చేసినా అక్కడ మార్కెట్‍ లేకపోవటంతో హైదరాబాద్‍కు తరలిస్తున్నారు. ఈ విధంగా వచ్చే వెదురు వస్తువుల లారీలను ఫారెస్టు శాఖ వారు అటకాయించి మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఫైన్‍ వేయటంతో అంత పెద్ద మొత్తం చెల్లించుకోలేని మేదర్లు ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోందంటారు. ఒరిస్సా, మిజోరం, త్రిపుర నుండి అలం కరణ వస్తువులు రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. కళాకృతులను రూపొందించే సత్తా తమకూ ఉందనీ, ఇందుకుగాను శిల్పా రామం, ఎగ్జిబిషన్‍ స్టాల్స్లో తమకూ అవకాశం ఇవ్వాలని మేదర వృత్తి వారు కోరుతున్నారు. అంతేకాదు… అస్సాం, ఒడిషా రాష్ట్రాలలో అటవీ ప్రాంతం నుండి మేదర్లు కావల్సినంత వెదుర్లు తెచ్చుకోవచ్చనీ, అదే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని వీరుకోరుతున్నారు.


అన్నింటా వెనుకబాటు
మేదరి వారు దేశంలో పలు రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నారు. ఆంధప్రదేశ్‍, తెలంగాణలలో వీరు బీసీలుగానే గుర్తించబడ్డారు. మేదరి వారు వెనుకబడిపోవుటకు పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాలు కూడా ఒక కారణం. కులవృత్తి సరిగా కొనసాగేందుకు రాష్టప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం అందక క్రమంగ వెనుకబడి పోయారు. రాజకీయాల్లో వీరి ప్రాతినిథ్యం కూడా తక్కువే. క్రమంగా ఈ కులం వారు వివిధ రకాల వృత్తులను చేపట్టడం మొదలైంది. క్రమేణా ఈ కులంలో విద్యావంతులు కూడా బాగా పెరిగారు.


సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి
రాష్ట్ర ప్రభుత్వాలు మేదర్లకు ఫెడరేషన్‍ ప్రకటించినా విధులు… నిధులు… లేవని మేదరి సంఘం నాయకులు అంటున్నారు. మేదరి సామాజిక వర్గానికి చెందివవారు ఇతర రాష్ట్రాలలో ఎస్టీలుగానో, ఎస్సీలుగానో ఉన్నారనీ, మన రాష్ట్రంలో మాత్రం బీసీలుగా ఉన్నారని చెప్పారు. ఆది నుండీ తాము సంచార జీవు లమని అంటారు. మేదర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరు తున్నారు. నేటికీ పలు వురు మేదర్లు కుల వృత్తిపైనే ప్రధానంగా ఆధారపడి జీవిస్తున్నారు కనుక ఈ వృత్తి దారులను ఆదుకునేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలని కోరు తున్నారు. ప్రతి జిల్లాలో ఉన్న తమ సొసైటీలకు వెదురు వనాలు పెంచటానికి 50 ఎకరాలకు భూమి హక్కు ఇస్తే మంచి ఫలితం ఉంటుందంటారు. మేదర్లు అత్యంత వెనుకబడిన తరగతులకు చెందివవారు కావడంతో ప్రభుత్వమే తమకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నారు. చట్టసభలలో తమ సామాజిక వర్గానికి చెందిన వారు లేరు కనుక కనీసం నామినేటెడ్‍ పోస్టులైనా కేటాయించాలని కోరుతున్నారు.


-సువేగా,
ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *