పర్యావరణాన్ని కాపాడుకుందాం


గతంలో భారతదేశం స్వయం పోషక స్వతంత్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కలిగి వుంది. ఫ్యూడల్‍ వ్యవస్థలో భాగంగా వుండేది. తర్వాత కాలాన ఫ్యూడల్‍ వ్యవస్థ స్థానంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. ఒకవైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు అప్రతిహతంగా పురోగమిస్తున్నాయి. అదే సమయాన గుత్త పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదం విజృంభించింది. వీటికి లాభమే పరమార్థం. ఈ పెట్టుబడిదారీ శక్తుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్న విధానాల వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. అందులో ఘన (భూమి), ద్రవ, వాయు, శబ్ద కాలుష్యాలు ప్రధానమైనవి.


పెరుగుతున్న వాయు కాలుష్యం
నేడు ప్రపంచ వ్యాప్తంగానే పట్టణీకరణ వేగవంతమైంది. దీనిలో భాగంగా మోటార్‍ వాహనాల సంఖ్యతో పాటు వాయు కాలుష్యం పెరుగుతున్నది. ద్విచక్ర, బహుచక్ర, వ్యక్తిగత వాహనాలు అవసరానికి మించి వాడటంతో వాయు కాలుష్యం విపరీతమైంది. గతంలో చాలా దూరం అనాయసంగా నడిచేవారు. క్రమంగా మొదలయిన సైకిళ్లు, రిక్షాలు, జట్కాలు, లూనాలు, టీవీఎస్‍ల వంటి వాహనాల స్థానంలో ఎక్కువ సి.సి., ఎక్కువ స్పీడు కలిగిన బైకులు, కార్లు వాడుతున్నారు. కనుక దీనితో వాయు కాలుష్యం మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది. ఇంకోవైపున శారీరక శ్రమ తగ్గటంతో రెసిస్టన్స్ పవర్‍ తగ్గి అనారోగ్యం పాలవుతున్నారు. వాహనాలు ఎక్కువ కావడంతో ట్రాఫిక్‍ జాంలు, స్లో ట్రాఫిక్‍ల వల్ల ఇంధన ఖర్చు పెరగటం కార్బన్‍ డై ఆక్సైడ్‍, కార్బన్‍ మోనాక్సైడ్‍ లాంటివి గాలిలో కలిసి కాలుష్యం బారిన పడుతున్నారు జనాలు.


వాయు కాలుష్య నివారణకు చర్యలు

  • అసమాన అభివృద్ధికి బదులు, అభివృద్ధి వికేంద్రీకరించబడి వలసలను నివారించి వాహనాలపై ఆధారపడటం తగ్గించుట ద్వారా కాలుష్యాన్ని కొంత వరకు నివారించడం సాధ్యం.
  • పెద్ద పారిశ్రామిక, సర్వీసు సంస్థలు ఏర్పాటు చేసేటప్పుడు అదే ఆవరణలో ఉద్యోగులకు తప్పని సరిగా కనీసం 80 శాతం మందికి క్వార్టర్లు నిర్మించాలి. సుమారు వంద మంది కార్మికులు పైబడిన సంస్థ లన్నీ విధిగా క్వార్టర్లు నిర్మించాలి. కంపెనీ నిర్మించలేని పరిస్థితిలో ప్రభుత్వమే నిర్మించి అద్దె వసూలు చేయాలి. దీనివల్ల వాహనాలపై పెట్టే ఖర్చు తగ్గటమే కాకుండా బయట ఇళ్ళ అద్దెల విచక్షణా రహితంగా పెరగకుండా చూడొచ్చు.
  • అన్ని సంస్థలూ ఒకే చోట కేంద్రీకరించ బడిన హైదరాబాదు లోని హైటెక్‍ సిటీ ప్రాంతం ట్రాఫిక్‍ జాంలకు, కాలుష్య వాయువుల వ్యాప్తికి నిలయమైంది. రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థవారు సిటీ బస్సులలో గతంలోలాగా సైడు సీటింగు ఇచ్చి ఎక్కువ స్టాండింగ్‍ ప్యాసెంజర్లకు అవకాశం ఇచ్చి, ప్రతి బస్సుకు ఇద్దరు కండక్టర్లను నియమించి ఇప్పుడున్న ఆక్యుపెన్సీ రేటును పెంచాలి. ఇలా చేస్తే తక్కువ వాహనాలతో ఎక్కువ ప్రయాణీకులను గమ్యస్థానం చేర్చి కొంత వరకు వాహన కాలుష్యం తగ్గించవచ్చును.
  • మినీ బస్సులను ప్రవేశ పెట్టి నగరంలోని లోపలి బస్తీలకు, సబ్‍ అర్బన్‍ ఏరియా గ్రామాలకు నిర్ణీత సమయానికి అందు బాటులోకి తెస్తే ద్విచక్ర, త్రి చక్ర వాహనాలను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. ఈరకంగా చేస్తే వాహన కాలుష్యం తగ్గుతుంది. ప్రజలకు డబ్బు, ఇంధనం ఆదా అవుతాయి.
  • ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రయివేటు పాఠశాలలను నియంత్రించాలి. ఏ విద్యార్థి అయినా అమెరికాలో లాగా తానుంటున్న ప్రాంతంలోని ప్రభుత్వ/ ప్రయివేటు స్కూలులోనే అడ్మిషన్‍ తీసుకునేలా విధాన నిర్ణయాలు చేయాలి. తద్వారా వేలాది స్కూలు బస్సుల అవసరం ఉండదు. ఇది వాయుకాలుష్యం తగ్గించడానికి, డీజిలు ఆదా చేయడానికి మరో మార్గం.
  • గతంలో సంవత్సరంలో ఒకటి రెండు సార్లు దీపావళి లాంటి పండగలకు టపాసులు కాల్చేవారు. కానీ నేడు పండగలకు, పబ్బాలకు, పెళ్ళిళ్ళకు పేరంటాలకు, ఎన్నికల విజయాలకు, ప్రమాణ స్వీకారాలకు, ప్రారంభోత్సవాలకు మొదలయిన అన్ని సందర్భాలల్లో కాలుష్యాన్ని వెదజల్లే రకరకాల టపాసులు కాలుస్తున్నారు. టపాసుల వలన అనేక వేల మంది శ్రమ వ•ధా కావటమే కాకుండా ప్రమాదాలు జరుగుతు న్నాయి వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం పెరుగుతున్నది. కనుక టపాసులను సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే కాల్చటానికి అనుమతించాలి.
  • ఈ మధ్య కాలంలో నిమజ్జన కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. గణేష్‍ నిమజ్జనం, దేవీ నిమజ్జనం పేరు మీద మట్టి విగ్రహాలతో పాటు ప్లాస్టర్‍ ఆఫ్‍ పారిస్‍, వివిధ రంగులు, రసాయనాలు వాడిన వాటిని వేయటం వల్ల చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నదులు కాలుష్యం బారిన పడుతున్నాయి. ఇలాంటి నిమజ్జన కార్యక్రమాల్ని అదుపు చేయాలి.
  • ఒకప్పుడు రాజకీయ పార్టీలు పేపరు జండాలతో తోరణాలు, పోస్టర్లు ద్వారా ప్రచారం చేసుకునేవి. నేడు పేపరు స్థానంలో పాలిథీన్‍/ ప్లాస్టిక్‍ వాడటంతో భూ కాలుష్యం అధికమయింది. అందాల షోకుల పేరుమీద వివిధ రకాల సౌందర్య (రసాయన) సాధనాలు వాడటంతో నీటి కాలుష్యం ఏర్పడుతోంది.
  • రసాయనిక పరిశ్రమలు కాలుష్య కారకాలు. ఇటువంటి వాటికి తప్పనిసరి పరిస్థితులలో అనుమతి ఇవ్వవలసి వస్తే అందుకు తగిన భద్రతాచర్యలు చేపట్టాలి. రసాయన వ్యర్థాలను శుద్ధి చేసే యంత్రాల్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.
  • అనేక పరిశ్రమలు వ్యర్థ రసాయనాలను బయటకు వదలటం వలన కుంటలు, చెరువులు, ఏర్లు, భూమి కాలుష్యానికి లోనయి పంటలు పండని పరిస్థితి చూస్తున్నాం. కొన్ని పరిశ్రమల యజమన్యాలు భూమి లోపలికి బోర్లు వేసి రసాయనాలను భూమి లోపలికి వదులుతున్నారు. అందువలన రసాయనిక పరిశ్రమల విషయంలో ప్రభుత్వం కచ్చితంగా విధివిధానాలు పాటించేలా కఠినంగా వ్యవహరిస్తేనే కాలుష్య నివారణ సాధ్యం.
  • విద్యుత్తు ఉత్పత్తిలో హైడ్రో విద్యుత్తుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది చౌక. కాలుష్య రహితం. పరిశ్రమలు, వ్యవసాయం రెండు విధాల లాభం. బొగ్గును ఇంధనంగా వాడే ధర్మల్‍ విద్యుదు త్పత్తిని కాల క్రమేణా తగ్గించాలి. వాయుకాలుష్యం తగ్గుతుంది. బూడిద ద్వారా ఏర్పడే భూ కాలుష్యం, వాయు కాలుష్యం నివారించగలం. ఇందుకోసం ప్రత్యామ్నాయంగా పవన సౌర విద్యుత్తులను అధికం చేయాలి.
  • అడవులను పరిరక్షించి భూసారం కాపాడాలి. అలాగే భూమి వేడెక్కకుండా చూడాలి. నీటి పారుదల సౌకర్యం కల్పించి వ్యవసాయం, తోటలు అభివృద్ధి చేయాలి. సామాజిక అడవులను అభివృద్ధి చేసినట్లయితే పండ్లు ఫలాలు, స్వాభావిక ఎరువులు, కలప లభిస్తుంది. పర్యావరణ సమతుల్యత పాటించినట్లవుతుంది.


వ్యవసాయ రంగంలో జాగ్రత్తలు

వ్యవసాయంలో ఆధునిక యంత్ర పరికరాలు వాడకంతో కూడా భూ వాయు కాలుష్యం పెరుగుతోంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూనే కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగినవిధంగా వ్యవహరించాలి. గతంలో తాళ్ళ తాటి నార, జనపనార, గోగునార, సాగనార, కొబ్బరి పీచు, నూలు వంటి వాటితో తయారయిన ఉత్పత్తులను వాడేవారు. నేడు వాటి స్థానంలో ప్లాస్టిక్‍/ పాలిథీన్‍ తాళ్ళు వాడటం వలన భూ కాలుష్యం అధికమయింది. అలాగే నార సంచులకు బదులు పాలిథీన్‍ సంచులు వాడటం వలన టన్నుల కొలదీ ప్లాస్టిక్‍ వ్యర్థాలు భూమిలోకి చేరుతున్నాయి.


కొత్త విధానాలయిన గ్రీన్‍ హౌస్‍లు, పాలి హౌస్‍లు, ప్లాస్టిక్‍ మల్చింగులు, డ్రిప్‍ ఇరిగేషన్‍ల వలన కూడా కాలుష్యం పెరుగు తోంది. అవసర పంటలను మాత్రమే ఈ విధానంలో పండించాలి. పూలు, బోకేలకు వాడే పంటలకు వాడరాదు. గతంలో వ్యవ సాయంలో ఎద్దులు, దున్నలు ప్రముఖ పాత్ర పోషించేవి. నాగలి దున్నటం, బండ్లు లాగటం, కుప్పలు నూర్చటం లాంటి పనులు చేస్తూ మల, మూత్రాల ద్వారా స్వాభావిక ఎరువులు ఇచ్చేవి. గ్రామాల్లో ప్రతి ఇంటికి కనీసం 4,5 పశువులు వుండేవి. ట్రాక్టర్లు, టిల్లర్లు, ట్రాలీలు రావటంతో పశుపోషణ తగ్గిపోయింది. దీనితో పాటు స్వాభావిక ఎరువులు వాడకం మందగించింది. రసాయనిక ఎరువులపై ఆధారపడటంతో అనేక రకాల అనర్థాలు సంభవిస్తు న్నాయి. గతంలో మెట్ట వ్యవసాయంలో లక్షల ఎకరాల్లో వర్షాకాల పంటలు పండించేవారు. మిశ్రమ పంటలతో భూసారం రక్షించబడి జీవ వైవిధ్యం కొనసాగేది.


దెబ్బతింటున్న జీవ వైవిధ్యం

ఆయిల్‍ ఇంజన్లు, విద్యుత్తు మోటార్లు ప్రవేశంతో మగాణీ పొలాలు పెరిగి, వరికి ప్రాధాన్యం హెచ్చింది. ఈ కారణంగా వైవిధ్యమైన పంటలు పండిద్దామన్నా విద్యుత్తు పగలు, రాత్రి వేళల్లో రావటంతో వరికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్యాన్నిచ్చే తృణ ధాన్యాలు కనుమరుగు అవుతున్నాయి. పట్టణీకరణ పెరగటంతో నగరాల చుట్టు పక్కల లక్షల ఎకరాల్లో తోటల పెంపకం పేరుతో రియల్‍ ఎస్టేట్‍ దందా పెరిగి స్వాభావికత నాశనమవుతోంది. తోట పంటలు, కూరగాయ తోటలు ఎక్కువ చేసి యంత్రాలతోపాటు పశువులను కూడా వాడుకుంటూ జీవ రక్షణ, జీవ వైవిధ్యం కొనసాగించాలి. కానీ ఇవాళ రైతులు దేశవ్యాప్తంగా చెరకు నరికిన తరువాత వచ్చే ఆకులు, దవ్వ, కంది, ప్రత్తి కంప, వంగ, బెండ లాంటి కూరగాయల కంప మొదలయిన వ్యవసాయ వ్యర్థాలను లక్షల టన్నుల్లో తగుల బెడుతున్నారు. అందు వలన ప్రతి సంవత్సరం భూసారం తగ్గి వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఇందుకు ప్రత్యామ్నాయంగా చిన్నపాటి క్రషర్ల ద్వారా చిప్స్ పౌడర్లగా మార్చి మరల పొలంలో ఎక్కువగా వాడే ఏర్పాటు చేయాలి. అందుకు ప్రభుత్వ, ప్రయివేటు పరిశ్రమల వారు తగిన ఏర్పాటు చేయాలి.


నేడు శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. అయితే శాస్త్రం, సాంకేతిక ఫలాలు సామాన్య రైతుల వరకు చేరటం లేదు. రైతుల నైపుణ్యం పెంచే ప్రభుత్వ యంత్రాంగం లేదు. సాధారణంగా కాయకూరలకు, పండ్ల తోటలకు చీడపీడలు అధికంగా రావటం జరుగుతుంది. అందుకు క్రిమిసంహారక మందులు విచక్షణా రహితంగా వాడబడటంతో రోజుకొక కొత్త జబ్బు రావటం మిత్ర పురుగులు నశించటం జరుగుతున్నది. పక్షిస్థావరాలు, ఫెరమోన్‍ టాప్స్, రిఫ్లెక్టింగ్‍ రిబ్బన్లు, జిగురు రాసిన పసుపు రంగు రేకులు, ఎరపంటలు వైరస్‍ కల్చర్లు, ఆధునిక పద్ధతులు అనుసరించి నట్లయితే ప్రస్తుతం వాడబడే క్రిమిసంహారక మందులు గణనీయంగా తగ్గించవచ్చు. పంటల ఉత్పత్తి పెరగటం, కాలుష్యం తగ్గటం ఒకేసారి జరిగే అవకాశం వుంది. అందుకు ప్రభుత్వం ప్రతి గ్రామానికి వ్యవసాయ శాస్త్రవేత్తలను నియమించి రైతులకు సూచనలు ఇవ్వాలి. అవసర పంటలకు బదులు వ్యాపార పంటలు పండిస్తున్నారు ఒకవైపు వంటనూనెలు దిగుమతి చేసుకుంటూ వేల ఎకరాల్లో పూలకోసం లక్షల ఖర్చుచేసి గ్రీన్‍హౌస్‍లు, పాలి హౌస్‍లు, డ్రిప్పులు వాడుతున్నారు. ఇందుకు టన్నుల కొలదీ పాలిథీన్‍ వాడుతున్నారు. అలాగే ప్లాస్టిక్‍ మల్చింగ్‍ ద్వారా కూడా ప్లాస్టిక్‍ వాడబడి భూమి కాలుష్యం పాలవుతోంది. అందువల్ల అవసర పంటలకూ మాత్రమే ప్లాస్టిక్‍ వాడాలి.


ప్రణాళికా రహిత అభివృద్ధితో గతంలో నున్న అనేక మొక్కలు అంతరించిపోతున్నాయి. రబ్బీస్‍ చెట్లు, ఏనుగు పల్లెరు, పురిపిడి, నల్లేరు లాంటి చెట్లు, కొన్ని రకాల పక్షులు అంతరించిపోవుచున్నవి. హైదరాబాదు నగర చుట్టుపట్ల గుండ్లు, బండల మీద పెద్ద పెద్ద బల్లులు కనపడేవి. నగర వ్యాప్తితో ఆ బల్లులు అంతరించాయి. అపారు్ట మెంట్లు, భవనాలు పెరగటంతో పావురాళ్ళు వ•ద్ధి చెందుతున్నాయి. తోటల పెంపకంతో నెమళ్ళు, అడివి పందులు పెరుగుతున్నాయి. కొన్నింటికి అనుకూల, మరి కొన్నింటికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక ఈ విధానానికి ఫుల్‍స్టాప్‍ పెట్టాలి.
మరోవైపున గ్రామాల్లోను, పట్టణాల్లోను సామూహిక ఎలుకల, బొద్దింకల, ఈగల, దోమల నివారణ చర్యలు చేపట్టాలి. వీటిని నివారించి నట్లయితే మనకొచ్చే రోగాల్లో దాదాపు 80 శాతం జబ్బులు వాటంతటవే మాయం కాగలవు. అప్పుడు మందులు ఉత్పత్తి చేసే రసాయనిక ఫార్మా కంపెనీలు సగానికి పైగా తగ్గించి కాలుష్య నివారణ చేయడం సాధ్యమవుతుంది.
ప్రతి రైతు, తన వ్యవసాయ క్షేత్రంలో ప్రధానంగా మెట్ట ప్రాంత రైతు పొలం చుట్టూ బోర్డరుగాను, మధ్యవరుసలలో వేప, సరివి, టేకు, యూకలిప్టస్‍, నేరేడు, చింత వెదురు, సుబాబుల్‍ (పచ్చి మేతకు) లాంటివి పెంచాలి. వాటి ఆకులు ఎరుపుగాను పశువులకు మేతగాను, కలపగాను ఉపయోగపడి మంచి ఆదాయం వస్తుంది. పైగా కార్బన్‍ డై ఆక్సైడ్‍ ఆక్సిజన్‍గా మారుతుంది. భూమి వేడెక్కకుండా వుంటుంది. ఆహార పంటలతో పాటు సమాంతరంగా వ్యవసాయ అనుబంధ రంగాలను చేపట్టాలి. వైవిధ్య భరిత వ్యవసాయం వలన పర్యావరణం పదిలంగా ఉంటుంది. ఈ పరిస్థితులలో మనిషికి ఆరోగ్యాన్నిచ్చే పండ్లు, ఫలాలు, కాయగూరలు అందుబాటు శాతం పెరిగి ఆరోగ్యం బాగుంటుంది. నేడు శారీరక శ్రమ తగ్గి ముందు, జంక్‍ఫుడ్స్ పెరిగి కుర్రకారుకు పొట్ట పెరగటం, బీపీ, షుగర్లు, స్థూలకాయం పెరిగి మందుల మీద ఆధారపడటం ఎక్కువయింది. ఈ విధానం కొనసాగి అమెరికాలో నేడు అరవై శాతానికి స్థూల కాయులు పెరిగారు. ప్రపంచీకరణతో మంచి రాకపోయినా క్లబ్బులు పబ్బులు, బీర్లు- బ్రాందీలు, పిజ్జాలు -బర్గర్లు, డిస్కోలు – బ్రేకులు తన్నుకొస్తున్నాయి. కొద్దిమందికి అధికాదాయం, ఎక్కువ మందికి అల్పాదాయం వస్తోంది. అనేక అనర్థాలతో జనం అతలాకుతలమవుతున్నారు. కనుక సామ్రాజ్య వాద, గుత్తపెట్టుబడి దారీ అనుకూల ప్రపంచీకరణలో భాగమైన సర్వీసురంగ ప్రాధాన్యతను తగ్గించాలి. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి, కాలుష్య కారక వస్తు వినియోగదారీ విధానాన్ని విడనాడాలి.


పర్యావరణ పరిరక్షణ మానవాళి బాధ్యత
పారిస్‍ ఒప్పందంలో వివిధ దేశాలు భూతాపాన్ని తగ్గించ డానికి రూపొందించుకొన్న ప్రణాళికలకు చట్టబద్ధత లేకపోవడం ప్రధాన లోపం గా కనపడుతున్నది. ఈ ప్రణాళికల అమలుకు కూడా నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేదు. ఐరాస ఆధ్వర్యంలో సదరు దేశాల ప్రణాళికల అమలును పర్యవేక్షించ చవలసిన అవసరం ఉన్నది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఆశిద్దాం.
భారతీయ చింతనలో, వాఙ్మయంలో ప్రకృతికి ఆరాధనాభరిత మైన స్థానం ఇవ్వబడింది. సర్వేజనః సుఖినో భవంతు అనడమే కాకుండా సర్వేపి సుఖినః సంతు అనికూడా చెప్పారు. అంటే మనుషులే కాకుండా సమస్త జీవులు కూడా సుఖంగా ఉండాలని అభిలషించారు. అదేవిధంగా ప్రకృతిలోని ప్రతి అణువుకు దైవత్వాన్ని అపాదించారు. అందుకే భూమికి శాంతి, నింగికి శాంతి, అంతరిక్షానికి శాంతి, అగ్నికి శాంతి, నీటికి శాంతి, దిక్కులకు శాంతి, ఓషధులకు శాంతి, చివరికి శాంతికే శాంతి కావాలని ఋగ్వేదంలో ఆకాంక్షించారు. ఇంత భావాత్మకంగా, ఉదాత్తంగా, ఉద్వేగంగా ప్రకృతిని తాత్వీకరించడం మనిషిని ప్రకృతిలో అంతర్భాగంగా చూడటం ప్రపంచ వాఙ్మయంలో అరుదుగా కనిపిస్తుంది. ఈ విషయంలో పాశ్చాత్యుల కంటే మనం ఉన్నతంగా ఆలోచించినట్లు కనపడుతన్నది.


స్పినోజా అనే డచ్‍ తత్త్వవేత్త 17వ శతాబ్దంలో pantheism అనే భావన ద్వారా ప్రకృతిని దైవీకరించడం జరిగింది. ప్రకృతిలోని ప్రతి అంశలో దైవాన్ని చూడటాన్ని pantheism అంటారు. అంతకుముందు వేల సంవత్సరాల క్రితమే ప్రకృతిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్నది. నేటికి మన దేశంలో చెట్టు, పుట్ట, రాయి, పాము మొదలగు వాటిని ఆరాధించడం చూస్తున్నాం. విలియం వడ్స్వర్త్ అనే ఆంగ్లకవి 18వ శతాబ్దంలో ప్రకృతిని apparelled cellestial light అని వర్ణించాడు.


గత రెండు వందల సంవత్సరాలుగా పారిశ్రామిక విప్లవంతో ప్రారంభమైన పరిసరాల కాలుష్యం నేడు మనిషి మనుగడకే ప్రమాదం కలిగించే స్థాయికి చేరుకున్నది. పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వచ్చే వ్యర్థాలు గాలిని, నీటిని, భూమిని, అంతరిక్షాన్ని అన్నింటిని కాలుష్యం చేస్తున్నవి. కర్బన ఉద్గారాల వల్ల భూ తాపం పెరిగిపోతున్నది. భూగోళం అగ్నిగోళంగా మారుతుంది. భూ తాపం 2 డిగ్రీల సెల్సియస్‍కు చేరితేనే సముద్ర మట్టం పెరిగి అనేక తీర ప్రాంతాలు, ద్వీపాలు మునిగిపోతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రీతిలోనే వాతావరణ కాలుష్యం పెరిగితే ఈ శతాబ్దపు అంతానికి భూ తాపం 3.5 డిగ్రీల సెల్సియస్‍కు పెరిగి ప్రళయ విలయాలు సంభవించి జీవులు మనుగడ సాగించలేని స్థితికి చేరుతాయని చెప్తున్నారు.


గ్రీన్‍హౌజ్‍ వాయువులను తగ్గించుకుంటూ ఆర్థికాభివ•ద్ధి సాధించాలంటే అభివృద్ధి చెందుతున్న భారత్‍ లాంటి దేశాలు ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడుకొని ఇప్పటికే అభివృద్ధిని సాధించాయి. ఈ కారణంగా విడుదలైన కర్బన ఉద్గారాలు ఇప్పటికే పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగించాయి. అందువల్ల భూతాపం తగ్గించడానికి అవి వర్థమాన దేశాలకు పెద్ద ఎత్తున నిధులు, పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ కూర్చవలసిన అవసరం ఉన్నది. పర్యావరణ కాలుష్యానికి ఏ దేశాలు ఏ మేరకు కారణం అయ్యాయో ఆ మేరకు నిధులు సమకూర్చాలి. ఐరాస ఆధ్వర్యంలో సదరు దేశాల ప్రణాళికల అమలును పర్యవేక్షించచవలసిన అవసరం ఉన్నది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఆశిద్దాం.

ఎసికె. శ్రీహరి,
ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *