అంగారకుడిపై తరగని మానవుని మమకారం..!! జీవాన్వేషణ కోసం వరుస కడుతున్న అంతరిక్ష నౌకలు..!!


(గత సంచిక తరువాయి)
ఈ నేపథ్యంలో ఇటీవల యూఏఈ, చైనా, అమెరికాలు అంగారకుని మీదకు అంతరిక్ష నౌకలు పంపించాయి. వాటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.


యూఏఈ మొట్టమొదటి మార్స్ మిషన్‍ – హోప్‍

10 లక్షల జనాభా (1 మిలియన్‍) కలిగిన అతిచిన్న మరియు ధనిక దేశం యూఏఈ అంగారకుడి మీదకు అంతరిక్ష నౌకను పంపి, ఆ ఘనత సాధించిన 5వ దేశంగా (అమెరికా, రష్యా, యూరోపియన్‍ యూనియన్‍, ఇండియాల తర్వాత) చరిత్ర సృష్టించింది. యూఈఏ అంగారకుడి మీదకు పంపిన అంతరిక్ష నౌక (Space Craft)పేరు అల్‍ అమల్‍. దీనినే ఆంగ్లంలో ‘‘హోప్‍’’ (విశ్వాసం) అని పిలుస్తారు.
యూఏఈ మొదట తన మార్స్ మిషన్‍ని జులై 2014లో ప్రకటించింది. తర్వాత యూనివర్సిటీ ఆఫ్‍ కాలిఫోర్నియా, అరిజోనా, బర్క్లీ, కొలరెడో తదితర అమెరికా విశ్వవిద్యాలయాల సహకారంతో యూఏఈలోని మొహమ్మద్‍ బిన్‍ రషీద్‍ స్పేస్‍ సెంటర్‍ నందు దీనిని అభివృద్ధి పరిచారు. 2020, జులైలో జపాన్‍లోని తనెగషిమా అంతరిక్ష కేంద్రం నుండి H- llA రాకెట్‍ ద్వారా ప్రయోగించారు. హై రిజల్యూషన్‍ కెమెరా, స్పెక్ట్రోమీటర్‍తో పాటు మూడు రకాలైన పరికరాలను అంతరిక్ష నౌక తనతో పాటు మోసుకెళ్ళింది.
‘‘హోప్‍’’ అనేది యూఏఈ యొక్క మొదటి గ్రహాంతర మరియు నాల్గవ స్పేస్‍ మిషన్‍గా చెప్పవచ్చు. మిగిలిన మూడు భూపరిశీలక ఉపగ్రహాలు (Earth observation satellites). హోప్‍ మిషన్‍ అంగారకుడిని చేరిన వెంటనే దాని కక్ష్యలో తిరగడం ప్రారంభిస్తుంది. దీని జీవిత కాలం ఒక మార్షియన్‍ సంవత్సరం, అనగా 687 రోజులు.


హోప్‍ మిషన్‍ ఎందుకు??

అంగారకుడి వాతావరణం యొక్క గతిశీలతను అధ్యయనం చేయడం హోప్‍ మిషన్‍ యొక్క ప్రాథమిక లక్ష్యంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అదేవిధంగా అంగారకుడి యొక్క ఎగువ మరియు దిగువ వాతావరణాల మధ్య గల సహ సంబంధాన్ని కూడా పరిశీలిస్తుంది.
ప్రధానంగా అంగారకుడిపై గతంలో మన భూమి లాంటి వాతావరణం ఉండేదని శాస్త్రజ్ఞుల నమ్మకం. అయితే కాలగమనంలో అంగారకుడు ఆ వాతావరణాన్ని ఎందుకు ఎలా కోల్పోయాడనేది ఇప్పటికీ అంతుచిక్కడంలేదు. వాతావరణం కోల్పోవడం వల్ల అంగారకుడి ఉపరితలంపై నున్న నీరు కూడా అదృశ్యమైంది. తద్వారా జీవులు నివసించేందుకు అనుకూల పరిస్థితులు అక్కడ లేవు.
హోప్‍ మిషన్‍ అంగారకుడిపై గల ఆక్సిజన్‍, హైడ్రోజన్‍లు అదృశ్యమయ్యేందుకు అక్కడి వాతావరణంలో కల్గిన ప్రధాన మార్పులను కనుగొనే ప్రయత్నం చేస్తుంది. ఎంత పరిమాణంలో ఆక్సిజన్‍ మరియు హైడ్రోజన్‍లు అంగారకుడి ఉపరితలం నుండి విశ్వాంతరాళంలోకి వెదజల్లబడ్డాయన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని అంగారకుడు తన ఉపరితలంపై నున్న వాతావరణాన్ని మరియు నీటిని ఎలా కోల్పోయాడన్న దిశగా శాస్త్రజ్ఞులు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో హోప్‍ అంగారకుడి కక్ష్యలో 20,000 నుండి 43,000 కి.మీ. ఎత్తులో తిరుగుతూ తనలోని మిగిలిన మూడు పరికరాలను కూడా గరిష్ఠంగా వినియోగించుకుంటూ అంగారకుడి వాతావరణానికి సంబంధించి రాబోయే రెండు సం।।రాలలో ప్రతి 9 రోజులకొకసారి సమగ్ర పరిశోధనను చేపట్టి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అంగారకుడి ఉపరితలం మరియు దానిపై నున్న వాతావరణ పరిస్థితులను సమగ్రంగా అవగాహన చేసుకొనేందుకు శాస్త్రజ్ఞులకు హోప్‍ మిషన్‍ ఇతోధిక తోడ్పాటునందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని యూఏఈ ప్రగాఢంగా విశ్వసిస్తోంది.


చైనా తొలి అంగారక యాత్ర
చైనా ఏప్రిల్‍ 24, 1970న డాంగ్‍ ఫాన్‍గాంగ్‍-1 అన్న ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా తన అంతరిక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత సం।। 2020 ఏప్రిల్‍ 24 నాటికి చైనా స్పేస్‍ పోగ్రామ్‍ను ప్రారంభించి 50 సం।।రాలు దాటింది. అదేవిధంగా 2003లో అంతరిక్షంలోకి మానవుడిని పంపిన మూడవ దేశంగా (రష్యా, యూఎస్‍ఏల తర్వాత) చైనా రికార్డు సృష్టించింది. చాంగే-4 అంతరిక్ష నౌకను చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంలో Aitken Basinలో సురక్షితంగా దించింది. చంద్రుడి దక్షిణ ద్రువంపై ప్రపంచంలో మరే దేశము అంతరిక్ష నౌకలను సురక్షితంగా ల్యాండ్‍ చేయించలేదు. అంతరిక్ష కార్యక్రమాల్లో ఇటువంటి గొప్ప ట్రాక్‍ రికార్డ్ కలిగిన చైనా అంగారకుడిపైకి మాత్రం ఇంతవరకూ ఎలాంటి అంతరిక్షనౌకను పంపలేదు.
ఈ కొరతను కూడా తీరుస్తూ టియాన్‍ వెన్‍-1 అన్న అంతరిక్షనౌకను గత జులై 2020న చైనా లాంగ్‍మార్చ్-5 రాకెట్‍ ద్వారా, చైనా హైవన్‍ దీవుల్లోని వెన్‍బాంగ్‍ లాంచింగ్‍ స్టేషన్‍ నుండి విజయవంతంగా ప్రయోగించింది.


టియాన్‍ వెన్‍ అనగా
ప్రాచీన చైనా రచయిత క్యుయువాన్‍ రచించిన దీర్ఘ పద్యం నుండి టియాన్‍ వెన్‍ అన్న పదం తీసుకోబడింది. ‘‘టి యాన్‍ వెన్‍’’ అనగా ‘‘స్వర్గానికి ప్రశ్నలు’’ (Questions to Heaven) అని అర్థం.


టియాన్‍వెన్‍-1లో ఆర్బిటార్‍తో పాటు రోవర్‍, ల్యాండర్‍ కూడా ఉంటాయి. తనతోపాటు 13 రకాల పరికరాలను టియాన్‍ వెన్‍ అంగారకుడి మీదకు తీసుకువెళ్ళింది. ఆర్బిటార్‍ గత ఫిబ్రవరి 10న అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించగా, రోవర్‍ ప్రస్తుత మే నెలలో అంగారకుడి ఉపరితలంపై దిగనుంది. రిమోట్‍ సెన్సింగ్‍ కెమెరా, ఉపరితలాన్ని త్రవ్వే రాడార్‍ (Surface Penetrating Radar-SPR),ఇంకా Martian Surface magnetic field detector మరియు Climate detector మొ।।నవి కొన్ని ప్రధానమైన పరికరాలు. రోవర్‍ బరువు సుమారు 200 కేజీలు ఉంటుంది. సోలార్‍ ప్యానెల్స్ ద్వారా తనకు కావాల్సిన ఇంధనాన్ని సమకూర్చుకుంటుంది.


మిషన్‍ ప్రధాన లక్ష్యం
ఇది వరకే చెప్పుకున్నట్లు అంగారకుడి ఉపరితలం సుమారు 4 బిలియన్‍ సం।।రాల క్రితం ఎన్నో మార్పులకు గురైనదని, తత్ఫలితంగా అంగారకుడి ఉపరితలంపై గల నీరంతా ఆవిరై పోయింది. అయితే అంగారకుడి అంతర్భాగంలో ఇప్పటికీ నీటి నిల్వలు ఉండవచ్చనేది కొంతమంది శాస్త్రజ్ఞుల నమ్మకం. దీనినే Sub Surface Waterగా వ్యవహరిస్తున్నారు. అంగారకుడి ఉపరితలం పై నున్నUtopia Planitia అన్న ప్రాంతం యొక్క అంతర్భాగంలో పెద్దమొత్తంలో మంచు నిల్వలు ఉన్నాయని, దీని ద్వారా వచ్చేనీరు భూమిపై నున్న సుపీరియర్‍ సరస్సు నీటితో సమానంగా ఉంటుంది అని 2016, నవంబర్‍లో నాసా ప్రకటించింది. దీంతో చైనా కూడా Utopia Planitia అన్న ప్రాంతంలోనే తన ల్యాండర్‍ను ల్యాండ్‍ చేయించనుంది. ల్యాండర్‍, రోవర్‍ మిషన్‍ నుండి విడిపోగానే SPR పరికరం అంగారకుడి ఉపరితలాన్ని తవ్వి, ఉపరితలం యొక్క స్వరూపం అంగారకుడి అంతర్భాగంలోని ఖనిజాలు – వాటి మిశ్రమాలు, అంతర్భాగం యొక్క మందం మరియు అంగారకుడి నేలలోని రసాయనాలను విశ్లేషించడంతో పాటు, జీవం ఉనికికి సంబంధించి Biomolecules, biosignatures తదితరాలను కూడా అన్వేషించనుంది.


అమెరికా పర్సీవరెన్స్
1997లో ప్రయోగించిన పాత్‍ ఫైండర్‍ మిషన్‍తో ప్రారంభమైన అమెరికా అంగారకయాత్ర, 2004లో మార్స్ ఎక్స్ప్లోరేషన్‍ మిషన్‍ ద్వారా స్పిరిట్‍ మరియు ఆపర్చ్యూనిటీ మరియు 2012లో మార్స్సైన్స్ ల్యాబొరేటరీ ద్వారా క్యూరియాసిటీ రోవర్‍ను ప్రయోగించగా, ప్రస్తుతం గత ఫిబ్రవరి 18న అంగారక గ్రహంపై వాలిన పర్సీవరెన్స్ అత్యంత అధునాతనమైన 4వ తరానికి (4th Generation) చెందిన రోవర్‍గా శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు.
అంగారక గ్రహయాత్ర అత్యంత సంక్లిష్టమైనది. దానిపైకి ఇంత వరకు పంపిన అంతరిక్ష నౌకల్లో 50 శాతం వరకూ విఫలమయ్యాయి. అందుకే పర్సీవరెన్స్ను ప్రయోగించిన దగ్గర నుండి అది గత ఫిబ్రవరిలో అరుణగ్రహంపై దిగేంత వరకూ రోవర్‍ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు ఇస్తూ అది సజావుగా గమనస్థానానికి చేరేలా శాస్త్రజ్ఞులు తగు చర్యలు తీసుకున్నారు. ఇదంతా ఎంతో ఓర్పుతో, పట్టుదలతో జరగాల్సిన సుదీర్ఘ పక్రియ అందుకే పర్సీవరెన్స్కు (తెలుగులో పట్టుదల) ఆపేరు పెట్టడం సరైనదేనని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.


పర్సీవరెన్స్ – అందులోని భాగాలు
ఇంతవరకూ వివిధ దేశాలు పంపిన రోవర్‍ల కన్నా పర్సీవరెన్స్ చాలా పెద్దది. ఒక కారు సైజున్న ఈ రోవర్‍కు ఇన్‍జెన్యుటీ అన్న మినీ హెలీకాప్టర్‍ను అమర్చారు. అక్కడి మట్టి నమూనాలను సేకరించడానికి, వాటిని విశ్లేషించి ఎప్పటికప్పుడు సమాచారం నాసాకు చేరవేయడానికి, అందులో అత్యాధునికమైన ఏడురకాల
ఉపకరణాలున్నాయి. ఛాయా చిత్రాలు తీసేందుకు, వాటిని జూమ్‍ చేసేందుకు వీలుగా ఇరవై త్రీడీ కెమెరాలు, ఆ రోవర్‍ను తాకుతూ వీచే గాలుల ధ్వనిని, మట్టిని సేకరించడానికి రాళ్ళను తొలిచినప్పుడు వెలువడే శబ్దాలను రికార్డు చేసేందుకు మైక్రోఫోన్‍లు, ఇతర సెన్సార్లు కూడా అమర్చారు. అలాగే అది సేకరించిన నమూనాలను భద్రపరచడానికి 43 కంటెయినర్లు ఉన్నాయి. అందుకే దీనిని రోవర్‍ అనడం ఒక రకంగా చిన్నబుచ్చడమేనని శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు. ఇది ఏకకాలంలో భిన్నమైన పనులు చేయగల బుద్ధికుశలతను సొంతం చేసుకున్న ఒక అద్భుత వాహనంగా చెప్పవచ్చు. ఒకటి, రెండు నెలలు గడిచాక రోవర్‍కి అమర్చిన హెలికాప్టర్‍ను విడిపోయేలా చేస్తారు. అన్నీ సక్రమంగా పనిచేసి రోవర్‍ నిర్దేశించిన కర్తవ్యాలను పూర్తిచేస్తే, అది ఇంత వరకూ మానవాళి సాధించిన విజయాల్లోకెల్లా తలమానికమైనదౌతుంది.


కీలక ప్రదేశంలో దిగిన పర్సీవరెన్స్
అరుణగ్రహం ఒకప్పుడు నీటితో అలరారిందని, వరదలు కూడా సంభవించాయని తద్వారా జీవరాశికి అనువైన పరిస్థితులుండేవన్నది శాస్త్రజ్ఞుల నమ్మకం. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం మిగిలాయి. అయితే గ్రహం లోపలి పొరల్లో ఇంకా ఎంతో కొంత నీటి జాడలు ఉండవచ్చని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పర్సీవరెన్స్ను కూడా సరిగ్గా అలాంటి ప్రాంతాన్ని చూసుకునే దించారు. 350 కోట్ల సం।।రాల క్రితం అతి పెద్ద సరస్సు ఉన్నదని భావించే బిలం అంచుల్లో పర్సీవరెన్స్ సురక్షితంగా దిగడం శాస్త్రవేత్తల ఘనవిజయంగానే చెప్పవచ్చు. ఆ దిగిన ప్రాంతానికి శాస్త్రవేత్తలు ‘‘బోస్నియా- హెర్జెగోవినా’’ లోని ఒక పట్టణం పేరైన జెజిరోగా నామకరణం చేశారు. సరస్సు అని దాని అర్థం. ఒక పెద్ద స్నానాల తొట్టె ఆకారంలో ఉన్న ఆ ప్రాంతంలోని రాళ్ళలో రహస్యాలెన్నో దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటి రసాయన నిర్మాణాన్ని ఛేదిస్తే కోట్లాది సం।।రాల క్రితం ఆ సరస్సు ఎలాంటి పరిస్థితుల్లో అంతరించి పోయిందో అంచనావేయవచ్చు నన్నది శాస్త్రజ్ఞుల విశ్వాసం. ఈ భూగోళంపై కూడా మనిషితో పాటు జీవులన్నీ నదీతీరాలను ఆశ్రయించుకొని ఉండేవి. అక్కడే తొలి నాగరికతలు వర్ధిల్లాయి. అంగారకుడిపై సైతం అదే జరిగి ఉంటుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.


పర్సీవరెన్స్ మిషన్‍ – ప్రధాన ఉద్దేశ్యం

ప్రధానంగా పర్సీవరెన్స్ రోవర్‍ అరుణగ్రహ ఉపరితలంపై జీవం ఉనికికి సంబంధించిన అంశాలను పరిశీలించడంతో పాటు ఆ గ్రహ వాతావరణంలో నున్న బొగ్గు పులుసు వాయువు (CO2)నుపయోగించి ఆమ్లజని (O2)ని ఉత్పత్తి చేయబోతోంది. ముందే చెప్పుకున్నట్లు జెజెరో బిలం 350 కోట్ల సం।।ల క్రితం పెద్ద సరస్సు. అక్కడి నీటిలో పురాతన జీవజాలం ఉండి ఉంటే, జెజెరో శిలాజాల్లో కానీ, అక్కడి నేల రసాయన స్వభావంలో గానీ జీవం ఆనవాళ్ళు దొరకవచ్చు. ఆ జీవం యొక్క ఉనికిని కనిపెట్టగల ఉపకరణాలు పర్సీవరెన్స్లో ఉన్నాయి. అరుణ గ్రహంపై ఇంతకు ముందు దింపిన ఏ రోవర్‍కూ ప్రాచీన జీవం ఆనవాళ్ళను కనిపెట్టే బాధ్యత అప్పగించలేదు. అవి ప్రధానంగా కుజగర్భంలోని నీటి జాడలను కనిపెట్టడంలో మాత్రమే నిమగ్నమయ్యాయి.


పర్సీవరెన్స్ జెజెరోబిలంలో 40చోట్ల తవ్వి కుజుని శిలలను వెలికితీస్తుంది. ఈ 40 శిలా నమూనాలను ఒక గొట్టంలో ఉంచి కుజ ఉపరితలం మీద భద్రపరుస్తుంది. భవిష్యత్తులో కుజుని మీద దిగే అమెరికా, ఈయూ అంతరిక్ష నౌకల్లో ఏదో ఒకటి ఆ గొట్టాన్ని కుజ కక్ష్యకు చేరుస్తుంది. ఈ కార్యక్రమమంతా 2026 నాటికి పూర్తికావచ్చు. అక్కడి నుండి ఆ శిలల గొట్టాన్ని మరోనౌక 2030లో భూమికి తీసుకొస్తుంది. వాటిని పరిశీలించాక కుజునిపై ఒకప్పుడు జీవం ఉన్నదో లేదో నిర్ధారించవచ్చు. భూమి మీద 380 కోట్ల సం।।రాల క్రితం జీవం పుట్టింది. అరుణగ్రహంపై 400 కోట్ల సం।। క్రితం అచ్చం భూమిలాగానే దట్టమైన వాతావరణం, నీరు ఉండేవి. ఆ పరిస్థితులు జీవం పుట్టుకకు దారితీసే అవకాశాలే ఎక్కువ. ఆ సంగతి నిర్ధారించుకోవడానికి పర్సీవరెన్స్ తోడ్పడనుంది.
జెజిరో బిలంలో దాదాపు రెండు భూ సంవత్సరాలు (ఒక కుజ సంవత్సరం) పాటు సంచరించిన తరువాత పర్సీవరెన్స్ 610 మీ।। ఎత్తయిన బిలం అంచును ఎక్కి బయటకు వెళుతుంది. పర్సీవరెన్స్ 2023 ఏప్రిల్‍ వరకూ కుజుని మీద సంచరిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నా, వాస్తవంలో అంతకన్నా ఎక్కువ కాలమే, అది కార్యకలాపాలు నిర్వహించే అవకాశముంది.


చివరిగా
పర్సీవరెన్స్ ద్వారా రమారమి ఒక దశాబ్ద కాలం పాటు వివిధ దశల్లో జరిగే ప్రయోగాలన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఆ పరిశోధనల ద్వారా వెలుగులోకొచ్చే అంశాలు రాగల రెండు, మూడు దశాబ్దాల పాటు కుజునిపై పరిశోధనలకు ప్రాతిపదికగా నిలుస్తాయి. అక్కడ సేకరించిన మట్టి నమూనాలు జయప్రదంగా వెనక్కి తీసుకురాగలిగితే అరుణ గ్రహంతో పాటు, మొత్తంగా సౌర కుటుంబ నిర్మాణంపై ఇప్పటి వరకూ మనకుండే అవగాహన మరిన్నిరెట్లు విస్తరిస్తుంది. మన భూగోళం పుట్టుక గురించి మనకుండే జ్ఞానం సైతం మరింత పదునెక్కుతుంది. ఆ దిశగా యుఎస్‍ఏ, యుఏఈ, చైనా దేశాలు అంగారక గ్రహంపై చేస్తున్న పరిశోధనలు విజయవంతమై శాస్త్రవిజ్ఞానంపై కొత్త వెలుగులు ప్రసరించేందుకు దోహదపడాలని మనమూ ఆశిద్దాం.


-పుట్టా పెద్ద ఓబులేసు,
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *