గులాం అహ్మద్‍


ఆయారాం, గయారాం అనే పదం భారత క్రికెట్‍లో గులాం అహ్మద్‍కే జరిగిందా అనిపిస్తుంది. తొలి టెస్ట్ మ్యాచ్‍ ఆడితే, మలి టెస్ట్లో ఆయనకు స్థానం ఉండదు. పోనీ ఆడిన టెస్ట్లో ప్రదర్శన బాగోలేదంటే అనుకోవచ్చు. బాగా ఆడినప్పటికీ ఆయనకు తదుపరి టెస్ట్లో చోటులేదు. ఇది గులాం అహ్మద్‍ టెస్ట్ల గురించిన విశేషం.
అప్పట్లో అంటే 1950ల్లో క్రికెట్‍ ఆణిముత్యంగా, తెలుగుతల్లి తేజంగా గులాం అహ్మద్‍ ప్రతిభను భారత క్రికెట్‍ బోర్డు ఆపలేకపోయింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జట్టులోకి వచ్చినప్పటికీ రాకపోకలు ఆయన చేతిలోకాకుండ జట్టు నాయకుడి చేతిలోవుండేవి. అప్పట్లో, ఇప్పటికీ క్రికెట్‍లో దక్షిణాది, ఉత్తరాది అనే భేదభావం ఉంది. నిజానికి గులాం అహ్మద్‍ క్రికెటర్‍కాదు, ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి. రాష్ట్ర ప్రభుత్వంలో సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్‍ అధికారి.


గులాం అహ్మద్‍ జులై 4, 1922లో హైదరాబాదులో జన్మించారు. స్కూల్‍ చదువుతో పాటు క్రీడలపట్ల మక్కువతో అన్ని ఆటల్లో పాల్గొనేవారు. హైస్కూల్‍ చదువు ముగియగానే, నిజాం కళాశాల చదువుతోపాటు క్రికెట్‍ ఆటపై శ్రద్ధ చూపిస్తూ ఇంటర్‍ కాలేజ్‍ పోటీలలో ఆయన బౌలింగ్‍పై శ్రద్ధ వహించారు. తన స్పిన్‍ బౌలింగ్‍ ప్రతిభతో రంజీట్రోఫీలో 17 సంవత్సరాల వయస్సులోనే గులాం అహ్మద్‍ తొలి రంజీట్రోఫీ మ్యాచ్‍ను అప్పటి మద్రాసు జట్టుతో డిసెంబర్‍ 1, 1939లో ఆడారు. తొలి రంజీ మ్యాచ్‍లో ఆయన బౌలింగ్‍లో అద్భుతం చేశారు. తొలి ఇన్నింగ్స్లో 95 పరుగులిచ్చి 5 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 62 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నారు. తన బౌలింగ్‍ ప్రతిభతో మద్రాసు జట్టును ఆడించారు. దాదాపు 20 సంవత్సరాల వరకు ఆయన రంజీ మ్యాచులు ఆడారు.


20 సంవత్సరాలలో ఆయన బౌలింగ్‍తోను, బ్యాటింగ్‍తోను సత్తా చాటారు. 1939 నుండి 1959 వరకు హైదరాబాదు తరపున పోటీల్లో పాల్గొన్నారు. ఆయన ఫస్ట్ క్లాస్‍ మ్యాచ్‍లల్లో 407 వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్‍లో ఆయన 1,379 పరుగులు సాధించారు. ఇందులో ఐదు హాఫ్‍ సెంచరీలు కూడా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్‍ల్లో గులాం అహ్మద్‍ అత్యధిక స్కోరు 90 పరుగులు.
రంజీ మ్యాచ్‍లలో ఆయన ఆఫ్‍స్పిన్‍ బౌలింగ్‍తో అద్భుతాలు చేయడంలో భారత్‍ క్రికెట్‍ బోర్డు ఆయనను భారత్‍ జట్టుకు ఎంపిక చేసారు. అప్పట్లో వెస్ట్ ఇండీస్‍ జట్టు భారతదేశంలో పర్యటిస్తూ ఐదు టెస్ట్ మ్యాచులు ఆడవలసివుంది. తొమ్మిది సంవత్సరాల తన శ్రమకు ఫలితం భారత జట్టులోకి వచ్చిన గులాం అహ్మద్‍ కొద్దిగా నీరసపడ్డారు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‍లో గులాం అహ్మద్‍కు జట్టులో చోటు దక్కలేదు.


అయితే ప్రతి క్రికెటర్‍కి భారత్‍లోని కలకత్తా ఈడెన్‍ గార్డెన్స్లో మ్యాచ్‍ ఆడాలనే కోరిక. ఎందుకంటే స్టేడియంలో లక్షల మంది మ్యాచ్‍ను చూస్తారు. ‘డ్రీం కం ట్రూ’ వెస్ట్ ఇండీస్‍తో మూడవ టెస్ట్లో మొత్తానికి గులాం అహ్మద్‍కు చోటు దక్కింది. గులాం అహ్మద్‍ 1948 డిసెంబర్‍ 31న తన తొలి టెస్ట్ మ్యాచ్‍ ఆడారు. అయినా రంజీ, టెస్ట్ మ్యాచ్‍ డిసెంబర్‍లోనే ప్రారంభించారు.


తొలి టెస్ట్లో ఆయన బౌలింగ్‍లో వెస్ట్ ఇండీస్‍ మేటి బ్యాట్స్మెన్‍లైన వాల్‍కాట్‍, వీక్స్లను అవుట్‍ చేసారు. తొలి ఇన్నింగ్స్లో గులాం అహ్మద్‍ 94 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నారు. రెండవ ఇన్నింగ్స్లో మరొక రెండు వికెట్లు తీయడంతో మూడవ టెస్ట్ వెస్ట్ ఇండీస్‍తో ‘డ్రా’ అయ్యింది. నాల్గవ, ఐదవ టెస్ట్ల్లో ఆయన ప్రదర్శన సరిగా చేయలేక పోయినా, భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండు జట్టుతో ఆడే భారత జట్టులో సభ్యుడుగా వున్న మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‍లో ఆడించలేదు.
నాల్గవ టెస్ట్ కాన్పూరులో జరిగింది. జట్టులోకి తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో గులాం అహ్మద్‍ 70 పరుగులిచ్చి అమూల్యమైన 5 వికెట్లు తీసుకున్నారు. తరువాత ఇండియా జట్టు ఇంగ్లాండు పర్యటన 1952లో జరిగింది. అప్పుడు ఇంగ్లండ్‍లో ఫస్ట్ క్లాస్‍ మ్యాచ్‍లలో 80 వికెట్లు సాధించి మొదటి స్పిన్నర్‍గా మిగిలాడు. అలాగే 4 టెస్ట్ మ్యాచ్‍లలో 15 వికెట్లు తీసి బౌలింగ్‍ సత్తా చాటారు.


1954-55లో భారత జట్టుతో పాకిస్తాన్‍లో పర్యటించారు. అయితే అప్పట్లో భారత జట్టులో అత్యధికంగా బొంబాయికి చెందిన ఆటగాళ్ళు ఉండేవారు. దక్షిణాది నుండి తక్కువమంది ప్రాతినిధ్యం వహించారు. జట్టులో ఉన్నా దక్షిణాది క్రీడాకారులుపై వారికి చిన్న చూపు ఉండేది.
కాని మైదానంలో ఎంతో స్నేహం ఉండేవారిలాగ ప్రవర్తించేవారు. గులాం అహ్మద్‍ అలాంటి ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొని, ఆటలో ఏమాత్రం తగ్గకుండా ప్రదర్శన ఇచ్చేవారు. ఏ క్రికెటర్‍కైనా భారత జట్టులో స్థానం సంపాదించాలనే కోరిక ఉంటుంది. దానితో పాటు తన జీవితకాలంలో కలకత్తాలోని ఈడెన్‍ గార్డెన్‍ స్టేడియంలో క్రికెట్‍ ఆడాలనే బలమైన కోరిక, అలాగే నాయకత్వం వహించాలనే కోరిక ఉంటుంది. అది గులాం అహ్మద్‍ జీవితంలో నెరవేరింది. తన జీవితంలో రెండు కోరికలను సాకారం చేసుకున్న వ్యక్తి గులాం అహ్మద్‍. ఈడెన్‍ గార్డెన్‍లో తన తొలి టెస్ట్ మ్యాచ్‍ని 1955-56 భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‍ తొలి టెస్ట్ మ్యాచ్‍కు నాయకత్వం బాధ్యతలు వహించారు. సొంత ఊరు హైదరాబాదులో న్యూజిలాండు తన తొలి టెస్ట్ మ్యాచ్‍ ఆడింది.


హైదరాబాదులో భారతజట్టుకు నాయకత్వం వహించిన గులాం అహ్మద్‍ జీవితంలో మర్చిపోలేనిరోజు. మిగత టెస్ట్లలో నాయకత్వ బాధ్యతల నుండి గులాం అహ్మద్‍ను తొలగించారు. గులాం అహ్మద్‍ మళ్ళీ 1958-59 వెస్ట్ ఇండీస్‍ పై రెండు టెస్ట్ మ్యాచ్‍లను కెప్టెన్‍గా కొనసాగారు. జీవితంలో పాకిస్తాన్‍తో టెస్ట్ మ్యాచ్‍లు ఆడాలనే గులాం అహ్మద్‍ బలమైన కోరిక, అలాంటి అవకాశం 1958-59లో లభించింది. 4 టెస్ట్ల్లో ఆయన 15 వికెట్లు సాధించారు. బ్యాటింగ్‍లో ఆయన హేమూ అధికారితో కలిసి చివరి పదవ వికెట్టుకు రికార్డు స్థాయిలో 109 పరుగులు జోడించారు. ఇది పదవ వికెట్టు రికార్డు. ఆయన చివరి టెస్ట్ మ్యాచ్‍ వెస్ట్ ఇండీస్‍తో డిసెంబర్‍ 31, 1958లో ఆడారు. ఆయన తొలి టెస్ట్ చివరి టెస్ట్ ఆడింది డిసెంబర్‍ 31.


1952-53 పాకిస్తాన్‍ జట్టు భారత పర్యటనకు వచ్చింది. తొలి టెస్ట్ ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‍లో ఇండియా పాకిస్తాన్‍పై భారీ స్కోర్‍ (372) సాధించింది. నిజానికి టాప్‍ ఆర్డర్‍ బ్యాట్స్మన్‍ అవుట్‍ అయినప్పటికీ చివరి మరియు 10వ వికెట్టు హేమూ అధికారితో కలిసి గులాం అహ్మద్‍ అమూల్యమైన 109 పరుగులు జోడించారు.
పాకిస్తాన్‍ సిరీస్‍లో శక్తివంచన లేకుండా ఆడినప్పటికి, మరుసటి సంవత్సరం భారత క్రికెట్‍ జట్టు వెస్ట్ ఇండీస్‍ పర్యటనకు బయలుదేరవలసింది. కాని గులాం అహ్మద్‍కు ఆ సిరీస్‍లో జట్టులో అవకాశం ఇవ్వలేదు. వెస్ట్ ఇండీస్‍ సిరీస్‍కు భారత జట్టులో అవకాశం రాకపోవడంతో గులాం అహ్మద్‍ బాగా నిరాశపడ్డారు. గులాం అహ్మద్‍ తనలో లోపం ఎక్కడ వుందని ఆత్మ విమర్శ చేసుకున్నారు. లోపం లేకున్నా జట్టు నుండి తొలగించడంపై, ఎంతోమంది క్రికెట్‍ మేధావులను అడిగారు.
అప్పట్లో స్వర్గీయ భూపతిగారు ఆయనకు కొన్ని బౌలింగ్‍ టిప్స్ అందించడం జరిగింది. దానిపై దృష్టిపెట్టి తీవ్రంగా కృషి చేసి తిరిగి జట్టులోకి ఏ విధంగా రావచ్చు అనే దృష్టితో సాధన చేసారు. వెస్ట్ ఇండీస్‍ పర్యటన పోతే పోయింది. తరువాత 1954-55లో పాకిస్తాన్‍ పర్యటనకు భారతజట్టులోకి గులాం అహ్మద్‍ తిరిగి వచ్చారు. పాకిస్తాన్‍ పర్యటనలో ఇండియా ఆడవలసినది 5 టెస్ట్ల సిరీస్‍.


పాకిస్తాన్‍ సిరీస్‍కి భారతజట్టు క్యాప్టెన్‍గా వినూమన్కడ్‍ నియమించబడ్డాడు. అప్పటికే గులాం అహ్మద్‍, వినూమన్కడ్‍ల మధ్య తీవ్రమైన విభేదాలు ఉండేవి. ఎన్ని విభేదాలున్నప్పటికి మైదానంలో మాత్రము ఆటగాళ్ళలో సమిష్టి పోరాటం కన్పించేది. వారు తమ రాష్ట్రాల కోసం కాదు, తమ దేశం కోసం ఆడుతున్నామనే ఆరాటం ఉండేది.


పాకిస్తాన్‍ పర్యటనలో గులాం అహ్మద్‍ ఐదు టెస్ట్ల్లో, నాలుగు టెస్ట్ల్లో మాత్రమే ఆడారు. అనుకున్నట్టు ఆయన బౌలింగ్‍లో ఏ అద్భుతం జరగలేదు. గెలవడానికి కావలసిన ప్రదర్శన చేయలేకపోయారు. తొలి టెస్ట్లో మాత్రమే ఐదు వికెట్లు తీసుకున్నప్పటికీ సిరీస్‍ మొత్తంలో 335 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్‍ అంతంత మాత్రమే. పాకిస్తాన్‍ పర్యటన స్వయంగా గులాం అహ్మద్‍కు తృప్తి కలిగించలేదు.


భారత జట్టులోకి రావడం, పోవడం ఆయనకు కొంత అసహనానికి గురి చేసింది. చివరకు తన ఇష్టమైన ఈడెన్‍ గార్డెన్స్లో వెస్ట్ ఇండీస్‍తో చివరి మ్యాచ్‍ ఆడారు. తనకిష్టమైన క్రికెట్‍ టెస్ట్ మ్యాచ్‍ ఎక్కడ నుండి మొదలుపెట్టారో, చివరకు అక్కడే తన రిటైర్డ్మెంటు ప్రకటించారు. ఐఏఎస్‍ అధికారి. గులాం అహ్మద్‍ ప్రభుత్వంలో ఉన్నత అధికారి, సెక్రటరీ హోదాలో పని చేసారు ప్రభుత్వ రంగ వివిధ శాఖల్లో పనిచేసిన గులాం అహ్మద్‍ నూతనంగా కొన్ని కొత్త పరిపాలనా విధానాలతో, గొప్ప మార్పులు చేర్పులు చేసి పరిపాలన సులభతరం చేసారు. తన పరిపాలన అనుభవంతో హైదరాబాదు క్రికెట్‍ అసోసియేషన్‍ను తీర్చిదిద్దారు. పరిపాలన దక్షతతో అసోసియేషన్‍ను మంచి దారిలో పెట్టారు. 17 సంవత్సరాలు గులాం అహ్మద్‍ సెక్రటరీ పదవిలో కొనసాగారు.


తరువాత హైదరాబాదు క్రికెట్‍ అసోసియేషన్‍ అధ్యక్షుడుగా 1984-86 వరకు ఉన్నారు. భారత క్రికెట్‍ బోర్డులో వివిధ హోదాల్లో పనిచేసి బోర్డును చక్కదిద్దారు. ప్రభుత్వ ఉన్నతాధికారి, మంచి పరిపాలన దక్షకుడైన ఆయన ప్రయాణం క్రికెట్‍ అసోసియేషన్‍తో కొనసాగించి మంచి పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్‍ క్రికెట్‍ అసోసియేషన్‍ సెక్రటరీగా 17 సంవత్సరాల పాటు 1959 నుండి 1976 వరకు కొనసాగారు. అధ్యక్షుడుగా 1984-86 ఉన్నారు.


గులాం అహ్మద్‍ ఇండియన్‍ క్రికెట్‍ బోర్డు సెక్రటరీగా 1975-76, మరియు 1979-80 రెండుసార్లు ఎన్నుకోబడ్డారు. జెయింట్‍ సెక్రటరీగా 1970-71, నుండి 1974-75 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆల్‍ ఇండియా సెలక్షన్‍ కమిటి సబ్యుడుగా 1963 నుండి 1967 వరకు కొనసాగిన గులాం అహ్మద్‍ ఐదు సంవత్సరాలపాటు పాకిస్తాన్‍లో నివాసం ఉన్నారు.


పాకిస్తాన్‍ మాజీ కెప్టెన్‍, తన మేనల్లుడైన అసిఫ్‍ ఇక్బాల్‍తోపాటు ఉన్నారు. ఐదు సంవత్సరాల అనంతరం తిరిగి వచ్చారు. క్రికెటర్‍గా క్రికెట్‍ పరిపాలనదక్షుడుగా గులాం అహ్మద్‍ క్రికెట్‍కు గొప్ప సేవలు అందించారు. క్రికెటర్స్లో మంచి పేరు సంపాదించిన గులాం అహ్మద్‍ అక్టోబరు 28, 1998లో హైదరాబాదులో మరణించారు. మరణించేటప్పుడు గులాం అహ్మద్‍ వయస్సు 78 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం గొప్ప క్రికెటర్‍, పరిపాలనాదక్షుడిని కోల్పోయింది.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-భాను శ్రీదేవి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *