కులవృత్తుల నైపుణ్యం ప్రగతికి సోపానం


తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‍ యాదవ్‍


‘రాష్ట్ర ఏర్పాటుతో విశ్రమిస్తే సరిపోదు. ఎన్నో సహజ వనరులున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజల వెనుకబాటుతనాన్ని పోగొట్టి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సార్థకత చేకూరుతుందని’ కేసీఆర్‍ తరచూ చెప్తుంటారు. అందులో భాగంగానే ఆయన కలలుగన్న ‘బంగారు తెలం గాణ’ సాధన దిశగా గత ఏడేండ్లుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్‍ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు. జనాభాలో 60 శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల సమస్యల మీద ఆయన సమగ్ర దృష్టిసారించారు.’ చేతివృత్తుల్లో వేటికైతే ఆదరణ ఉన్నదో వాటికి ఆధునిక సాంకేతికత కలిగిన పనిముట్లు పంపిణీ చేసి, ఆయా వృత్తుల వారికి శిక్షణ ఇప్పించి వారి బతుకులకు భరోసా కలిగిం చారు.


గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, గంగపుత్రులకు చేప పిల్లలను సరఫరా చేసి ఉత్పత్తిని పెంచి, వారి ఆదాయ మార్గాలను బలోపేతం చేశారు.
ఊరంతా తిరిగి తాము తయారుచేసిన వస్తువులను అమ్ముకు వృత్తి నైపుణ్యాన్ని పెంచేవిధంగా ఆధునిక శిక్షణ ఇప్పించారు. సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు వారికి బతుకమ్మ చీరల తయారీ పనులను అప్పగించారు. ఇటీవలే దోభీ ఘాట్లకు, లాండ్రీ షాపులకు, క్షౌరశాలలకు గ్రామస్థాయి నుంచి గ్రేటర్‍ హైదరాబాద్‍ వరకు నెలకు 250 యూనిట్ల కరెంటును ఉచితంగా సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా రాష్ట్రంలోని లక్షల మంది రజకులకు, నాయీబ్రాహ్మణులకు లబ్ధి చేకూరనున్నది.


ఇంకా కులవృత్తులు చేసు కుంటూనే బతకాలా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమాజంలో బతక డానికి గౌరవంతో కూడిన ఏ పని చేసినా తప్పు లేదు. ఏ రంగంలో ఆసక్తి ఉన్న వారు ఆ రంగంలో రాణిస్తారు. ఏ కులవృత్తి అయినా సమాజానికి పనికొచ్చేదే. సమాజ అవసరాలను తీర్చేదే.
ఇంగ్లీషులో ఒక సామెత ఉన్నది. ‘రోమ్‍ వాజ్‍ నాట్‍ బిల్ట్ ఇన్‍ ఏ డే..’ అంటే ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించే రోమ్‍ నగర నిర్మాణం ఒక్క రోజులో పూర్తి కాలేదు, అది కట్టడానికి చాలాకాలం పట్టింది. అభి వృద్ధి అనేది నిరంతర పక్రియ. సాధించుకున్న రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణగా సస్యశ్యామలం చేసింది కేసీఆర్‍ ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకుపోతుండటంతో ఆ ఫలాలను ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో అందుకుంటున్నది.


దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు ఓ ‘రైతుబిడ్డ’, హైదరాబాద్‍ను ఐటీలో మేటిగా చేసినందుకు ఓ ‘టెక్‍’, నగరాన్ని పెట్టుబడుల ధామంగా మార్చడంతో ఉపాధి పొందిన ఓ ‘ప్రైవేటు ఉద్యోగి’, నిన్నటి దాకా నిలువ నీడ కరువై ఇప్పుడు ‘డబుల్‍ బెడ్‍రూం’ ఇంట్లో ఆత్మగౌరవంతో బతుకున్న ఓ ‘ఇల్లాలు’, చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ‘షాదీ ముబారక్‍’తో లక్ష రూపాయల్ని ఆడబిడ్డకు కానుకగా ఇచ్చిన ఓ కన్న తండ్రి, దశాబ్దాల పద్మవ్యూహాన్ని మరిచిపోయి నగర రోడ్లపై సాఫీగా ప్రయాణం చేస్తున్న ఓ వాహనదారుడు, కన్న కొడుకులు ఆదరించకున్నా ఆసరా పింఛనుతో కంటినిండా నిద్రపోతున్న ఓ అవ్వ. ఇలా ప్రతి కుటుంబానికి కేసీఆర్‍ ప్రభుత్వం అండగా వుంటుందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‍ యాదవ్‍ తెలిపారు.


తెలంగాణ నంబర్‍ 1 స్థానంలో నిలవటం గర్వకారణం. సీఎం కేసీఆర్‍ ఏ లక్ష్యంతో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారో ఆ లక్ష్యం అనతికాలంలోనే నెరవేరటం సంతోషకరం. రాష్ట్రంలో జంతుసంపద గణనీయంగా పెరుగుతున్నది. దీంతోపాటే పాలు, మాంసం, గుడ్ల వృద్ధిరేటును నమోదు చేసింది. ఇదే స్ఫూర్తితో గ్రామీణ వ్యవస్థను, కులవృత్తులను పటిష్టం చేసే దిశగా మరింత కృషిచేస్తామని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‍ యాదవ్‍ తెలిపారు.


గొర్రెలతో 6వేల కోట్ల సంపద
గొల్ల, కురుమలు లేని ఊరుండదు. వీరి సంస్కృతి, ఆచార వ్యవహారాలు సుసంపన్నమైనవి. గొర్ల, మేకల, పశువుల పెంపకం, పాలు, మాంస ఉత్పత్తి, గొంగళ్ల నేత మొదలైనవి వీరి వృత్తి. గొర్రె ఉన్నితో తయారయ్యే గొంగళ్లు మనుషులను చలి నుంచి కాపాడుతున్నాయి. గొర్రె తోలుతో తయారయ్యే జగ్గు, డోలు, కంజెర లాంటి వాయిద్యాలు తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో ముఖ్యమైనవి.


గొర్రె ఎరువుతో భూములు సారవంతమవుతున్నాయి. తెలంగాణలో గొల్ల, కురుమల జనాభా 12 శాతం. వీరి ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. భారతీయ గ్రామీణ సమాజంలో వ్యవసాయం తర్వాత చెప్పుకోదగింది గొల్ల, కురుమల వృత్తి. దేశంలో వృత్తిపనుల ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా మాత్రమే నిరుద్యోగాన్ని రూపుమాపటం సాధ్యమవుతుంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసి అన్ని కులాల వారికి వృత్తిపనుల ద్వారా చేతి నిండా ఆదాయం ఉండేలా కేసీఆర్‍ అనేక పథకాలకు రూపకల్పన చేశారు. ఇదేరీతిలో గొల్ల, కురుమలకు గొర్లు, మేకలు అందిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఘనతను సాధిస్తున్నది. గొర్రెల పంపిణీతో రూ.6,169 కోట్ల సంపదను సృష్టిస్తున్నది. మాంసం ఉత్పత్తి, గొల్ల కురుమల ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం 2017 జూన్‍లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుత ఫలాలను అందిస్తున్నది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. మాంసం


ఉత్పత్తి, గొర్రెల సంఖ్య పెరుగుదలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‍వన్‍గా నిలిచింది. గొర్రెల దిగుమతిని సగానికి పైగా తగ్గించింది. తాజాగా మరో 28,335 మందికి రూ.360 కోట్ల ఖర్చుతో 5,95 లక్షల గొర్రెలను పంపిణీ చేయనున్నది.
రాష్ట్రంలో పింక్‍ విప్లవం (మాంస ఉత్పత్తుల పెరుగుదల) కొనసాగుతున్నది. 2012లో రాష్ట్రంలో 1.10 కోట్ల గొర్రెలు ఉన్నాయని జాతీయ పశుగణన లెక్కల్లో వెల్లడైంది. 2019లో రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 1.91 కోట్లకు పెరిగినట్టు తేలింది. ప్రస్తుత లెక్కలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో గొర్రెల సంపద 2 కోట్లు దాటింది. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల ద్వారా రాష్ట్రంలో 1.37 కోట్ల గొర్రె పిల్లలు పుట్టాయి. 48.51 శాతం గొర్రెల సంఖ్య పెరుగుదలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఏపీలో 30 శాతం, కర్ణాటకలో 15.31 శాతం పెరుగుదల నమోదైంది.


మాంసం ఉత్పత్తిలోనూ మేటి

ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. జాతీయ పశుగణన లెక్కల ప్రకారం.. మాంసం ఉత్పత్తి వృద్ధిరేటులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. దేశ సగటు వృద్ధిరేటు 16.9 శాతంగా నమోదైంది. ఐదేండ్లలోనే 2.49 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి పెరిగింది. గొర్రె మాంసం విషయానికొస్తే 2017-18లో 1.58 లక్షల టన్నుల గొర్రె మాంసం ఉత్పత్తి కాగా 2018-19లో 2.36 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి అయింది. ఏడాదిలోనే 78 వేల టన్నుల గొర్రె మాంసం ఉత్పత్తి పెరిగింది. అధికార లెక్కల ప్రకారం తెలంగాణలో 90 శాతం మంది మాంసాహారులే. దేశంలో ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 4 కేజీల మాంసం తింటే… తెలంగాణలో ఒక వ్యక్తి సగటున 9 కేజీల మాంసం తింటున్నారు. దీంతో తెలంగాణలో మాంసానికి భారీగా డిమాండ్‍ ఉన్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‍, రాజస్థాన్‍, తమిళనాడు నుంచి ప్రతి వారం 400-500 లారీల గొర్రెలు రాష్ట్రానికి వచ్చేవి. ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం చేపట్టిన తర్వాత దిగుమతి సగానికి సగం తగ్గిపోయింది. ఇప్పుడు 100-200 లారీల గొర్రెలే వస్తున్నాయి.


తెలంగాణ మాంసం మస్తు రుచి
పండుగకు, పబ్బానికి, పార్టీకి, ఫంక్షన్‍కు.. మాంసం ముక్క ఉడకాల్సిందే. అదిలేకపోతే నోట్లోకి ముద్ద దిగదు. చికెన్‍, మటన్‍, గుడ్డు… నాన్‍వెజ్‍ ఏది కనిపించినా సరే జిహ్వకు రుచి చూపించాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఫలితంగా రాష్ట్రం నుంచి పెద్దమొత్తంలో మాంసం ఉత్పత్తి అవుతున్నది. ఎంతలా అంటే.. ఒక్క ఏడాదిలోనే 10.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.


ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పక్కాగా, పకడ్బందీగా, ప్రజల ఇబ్బందులు దూరం చేసేలా ఉండాలి. అలా ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమే. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం. ఈ పథకం వల్ల లక్షలాది మంది ప్రత్యక్షంగా లబ్ధిపొందారు. ఇప్పుడు కోట్లాది మంది ఆ పథక ఫలితాన్ని అనుభవిస్తున్నారు. అవును! రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల మాంసం ఉత్పత్తిలో తెలంగాణ దూసుకుపోతున్నది. దేశంలోనే మరే రాష్ట్రానికి సాధ్యంకాని విధంగా మాంసం ఉత్పత్తిలో రాష్ట్రం ఘనమైన వృద్ధిని సాధించింది. ఫలితంగా దేశం లోనే నంబర్‍ 1 స్థానంలో నిలిచింది. గొర్రె మాంసం, పౌల్ట్రీ, మేక, గుడ్డు, పాలు,
ఉన్ని ఉత్పత్తిలో రాష్ట్రం గొప్ప వృద్ధిని సాధించటంతో ఇటు పెంపకం దారులకు, అటు వినియోగదారులకు మేలు జరుగుతున్నది.
గణాంకాలను పరిశీలిస్తే… 2018-19లో మాంసం ఉత్పత్తిలో తెలంగాణ 16.9 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. ఈ రేటు దేశ సగటు వృద్ధిరేటు (6శాతం) కంటే రెండింతలు ఎక్కువ. గొర్రె మాంసతం ఉత్పత్తిలో మరే రాష్ట్రం కూడా తెలంగాణ దరిదాపుల్లో లేదు. తెలంగాణ నుంచి గొర్రె మాంసం అధికంగా ఉత్పత్తి కావటానికి ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం దోహదం చేసిందనేది పలువురి అభిప్రాయం. 1.91 కోట్ల గొర్రెలతో దేశంలోనే అధిక గొర్రెలు కలిగిన రాష్ట్రంగా తెంగాణ తొలిస్థానంలో నిలిచింది.


సర్కారు గొర్రెలకు ఉచిత దాణా
వేసవిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు రూ.66 కోట్లతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‍యాదవ్‍ వెల్లడించారు. కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే కాకుండా వాటికి దాణా, నీరు, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. యూనిట్‍కు 4 బస్తాల దాణా అందిస్తామన్నారు. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించామని, చనిపోయిన వాటి వివరాలను అధికారులకు తెలియజేస్తే క్లెయిమ్స్ చెల్లిస్తారన్నారు. గొర్రెల పెంపకందారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.ఆరు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఆధునిక సౌకర్యాలతో గొర్రెల పెంపకంపై శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వేసవిని వృష్టిలో ఉంచుకొని ఎక్కువ కోతలు ఇచ్చే మేలు రకపు పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై రైతులకు ఇస్తామన్నారు.


విజయ డెయిరీ
రోజూ 5 లక్షల లీటర్లు, రూ.30 కోట్ల నష్టాలు పూడ్చుకొని ఇప్పుడు రూ.31 కోట్ల లాభాల్లోకి

నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని లాభాల బాట పట్టించాలనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకొన్నాం. అవి ఫలించాయి. పాడి రైతులకిచ్చే ప్రోత్సాహకం ప్రభుత్వం నుంచి కాకుండా విజయ డెయిరీనే సొంతంగా ఇచ్చేస్థాయికి తీసుకెళ్లేలా, విజయ ఉత్పత్తులు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటున్నాం అని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‍ యాదవ్‍ తెలిపారు.
పాలసేకరణ, అమ్మకంలో విజయ తెలంగాణ డెయిరీ విజయ పథంలో దూసుకుపోతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో నష్టాల నుంచి బయట పడడమే కాకుండా లాభాలు గడించే స్థాయికి చేరింది. పాడి రైతుకు ఇన్సెంటివ్‍ అందిం చడంతోపాటు, నిరుద్యోగులకు ఉపాధినీ కల్పిస్తున్నది. రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో నాణ్యమైన పాలు, పాల పదార్థాలను సరఫరా చేస్తున్నది.
రాష్ట్రంలో పాల సేకరణలో విజయ డెయిరీ రికార్డులు సృష్టిస్తున్నది. రూ.30 కోట్ల నష్టాన్ని పూడ్చుకుని… ప్రస్తుతం రూ.31 కోట్ల లాభాల్లోకి వచ్చింది. వార్షిక టర్నోవర్‍ను రూ.750 కోట్లకు పెంచుకున్నది. పాల సేకరణ, ఉత్పత్తుల్లోనూ ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో జాతీయస్థాయిలో అవార్డులు సాధిస్తున్నది. గతంలో రోజూ 2.50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తే ఇప్పుడు రెట్టింపు స్థాయిలో 5 లక్షల లీటర్లు సేకరిస్తున్నది. విక్రయాలనూ అదేస్థాయిలో పెంచుకుంది. 3.70 లక్షల నుంచి 4 లక్షల లీటర్ల పాలను రోజూ విక్రయిస్తున్నది. విజయ డెయిరీతో భాగస్వామ్య రైతుల సంఖ్య 60వేల నుంచి 75వేలకు పెరిగింది.


ఫలితానిచ్చిన బర్రెల పంపిణీ

పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ బర్రెల పంపిణీ సత్ఫాలితా లిచ్చింది. ఇప్పటివరకు 45 వేల బర్రెలను పంపిణీ చేసింది. దీంతో పాడిరైతుల సంఖ్యతోపాటు పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. విజయ ఉత్పత్తుల విక్రయాలద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి చూపేందుకు ప్రభుత్వం విజయ డెయిరీ పార్లర్ల ఏర్పాటును పెంచింది. సంచార పార్లర్లనూ ప్రోత్సహించింది. 10 రకాలకు పైగా పాల ఉత్పత్తులను విజయ బ్రాండ్‍ పేరుతో విక్రయిస్తున్నది. ఐస్‍క్రీం ఉత్పత్తులను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్రలో విజయ ఉత్పత్తులు విక్రయిస్తుండగా ఇటీవలే ఏపీలోనూ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. త్వరలోనే ఒడిశా, పశ్చిమ బెంగాల్‍లో కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రభుత్వం 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో రూ.250 కోట్లతో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో మెగా డెయిరీ నిర్మాణ పనులను ప్రారంభించింది.


సబ్సిడీపై 2.13 లక్షల పాడి పశువులు
విజయ, కరీంనగర్‍, ముల్క నూర్‍, మదర్‍ డెయిరీలకు పాలు పోస్తున్న 2.13 లక్షల మంది రైతులకు సబ్సిడీపై పాడిగేదెలు, పాడి ఆవులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం. ఒక్కో పాడిగేదెకు రూ. 80 వేలు కాగా ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీని యిస్తున్నది. మొదటగా 15 వేల మంది లబ్ధిదారులకు గేదెలను పంపిణీ చేసింది. ప్రతినెలా 15 వేల నుండి 16 వేల పశువులను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ గేదెలను హర్యానా, పంజాబ్‍, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్‍ నుండి కొనుగోలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో గేదెల లభ్యత, నాణ్యతను పరిశీలించేందుకు డెయిరీల ప్రతినిధులు, అధికారులు, రైతులతో కూడిన బృందాలు పర్యటించారు.


రైతుల ఇష్టాఇష్టాలపై ఆధారపడే విధంగా పాడిగేదెల కొనుగోలు పథకం నిబంధనలు రూపొందించారు. పశువుల కొనుగోలు విధివిధానాలను 2.13 లక్షల మంది సభ్యులకు తెలుగులో కరపత్రం రూపంలో ముద్రించి అందజేశామన్నారు. బల్క్మిల్క్ చిల్లింగ్‍ సెంటర్ల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు అధికారులు స్థానిక డెయిరీతో కూడిన 300 బృందాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు చేసిన ప్రతి గేదెకు తప్పనిసరిగా బీమా చేస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే పాడిరైతులను ప్రోత్సహించేందుకు లీటర్‍ పాలకు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకోవాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు.


300 కోట్లతో విజయ డెయిరీ ఆధునీకరణ
తెలంగాణ విజయ డెయిరీని రూ.300 కోట్లతో ఆధునీకరించి మెగా డెయిరీగా అభివృద్ధి చేయనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‍ యాదవ్‍ ప్రకటించారు. ప్రైవేటు డెయిరీలకు దీటుగా ఉత్పత్తులు, విక్రయాలను పెంచేందుకు విజయ డెయిరీలో కీలక మార్పులు తెస్తామన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‍ లాలాపేట్‍లోని డెయిరీ కేంద్రంలో రోజుకు 5 లక్షల లీటర్ల సామర్త్యంగల ప్లాంటు పనిచేస్తోందని, దీనికి అదనంగా మరో 5 లక్షల లీటర్ల సామర్థ్యంగల మరో ప్లాంట్‍ను ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేయనున్నట్లు తలసాని వివరించారు. ఇందుకోసం షామీర్‍పేట సమీపంలో 100 ఎకరాల స్థలాన్ని గుర్తించామన్నారు. ప్రతి జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రాల్లో విజయ డెయిరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజయ డెయిరీ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై ప్రైవేటు సంస్థతో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు.


రాజధానిలో మరో 100 ఔట్‍లెట్లు
డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు హైదరాబాద్‍లో ప్రస్తుతమున్న వాటికి అదనంగా 100 ఔట్‍లెట్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో విజయ డెయిరీకి పాల సేకరణను పెంచేందుకు సొసైటీలను ఏర్పాటు చేయాలన్న తలసాని… ప్రయోగాత్మకంగా ఐదు ప్రాంతాల్లో డెయిరీకి పాలు పోసే రైతులకు వెంటనే డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఖాళీగా ఉన్న 110 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. విజయ నెయ్యికి మార్కెట్‍లో మంచి డిమాండ్‍ ఉందన్నారు. అమ్మకాలు పెంచుకునేందుకు ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు ఇస్తున్న కమీషన్‍కు సమానంగా ఇస్తామన్నారు.


మీనం మెరిసె.. మత్స్యకారుడు మురిసె
నాడు సిరిసిల్ల మెట్ట ప్రాంతం… కరువు నేల.. సాగునీటి సంగతి దేవుడెరుగు, తాగునీటికీ తండ్లాటే… అన్ని వర్గాలకూ ఉపాధి కరువే… కానీ, నేడు అదే సిరిసిల్ల పచ్చబడ్డది. కాళేశ్వర జలాలు తరలిరావడం, భూగర్భ జలాలు పైపైకి చేరడంతో ఆహార పంటలే కాదు, చేపల పంటా దండిగా పండుతున్నది. కదిలివచ్చిన గోదారి… సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ఫలాలతో బొచ్చె బొమ్మె, జెల్ల, వాలుగ, రవ్వ, రొయ్య, పాపెర్లు, పాంప్లెట్లు, బంగారు తీగ, మెరిగ ఇలా తీరొక్క చేప ఎదుగుతున్నది. మధ్య, ఎగువమానేరుతోపాటు 800 చెరువుల్లో మత్స్య సంపద భారీగా వృద్ధి చెందుతున్నది. నాడు ఉపాధి లేక పూటగడవడమే కష్టంగా బతికిన మత్స్యకారులకు నేడు చేతినిండా పని దొరుకుతున్నది. ఏ ప్రాజెక్టుకు వెళ్లినా.. ఏ చెరువుకు వెళ్లినా చేపలు పుష్కలంగా చిక్కుతున్నాయి. ఒక్క ఎస్సారార్‍ జలాశయంలోనే రోజుకు 20 క్వింటాళ్ల సంపద బయటికి వస్తుండగా, మత్స్యకార కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


మంత్రి కేటీఆర్‍ ప్రత్యేక చొరవ తీసుకొని గతేడాది నెల్లూరు నుంచి 14 లక్షల విత్తన రొయ్య (మంచినీటి) లను తెప్పించి ఎస్సారార్‍ రిజర్వాయర్‍లో పోయించారు.
ప్రభుత్వ ఆధానంలోని మొత్తం విస్తీర్ణాన్ని ఉపయోగించుకుంటే ఏటా సుమారు 23 కోట్ల చేపపిల్లలను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నదని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‍ యాదవ్‍ తెలిపారు. పంపిణీకి అవసరమైన చేప పిల్లలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 389 ఎకరాల్లో 24 చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలున్నాయని, వీటిలో కొన్ని కేంద్రాలను మాత్రమే ఉపయోగిస్తున్నారని, మిగిలిన విస్తీర్ణంలోనూ చేప పిల్లలను ఉత్పత్తి చేయాలని తెలిపారు. 2019-20లో 2.11 కోట్ల చేపపిల్లలు, 2020-21లో 2.40 కోట్ల చేపపిల్లలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో నీటి వనరులు పెరగడం వల్ల భారీ సంఖ్యలో చేప పిల్లలు అవసరం అవుతాయని చెప్పారు. ప్రతిసారీ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తున్నదని, ఇకపై మన వద్దే ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఎన్‍ఆర్‍ఈజీఎస్‍ పథకాన్ని ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు. ఇక మత్య్సకారులు సొంతంగా విక్రయించుకునేలా రిటైల్‍ ఔట్‍లెట్లను ఏర్పాటు చేశారు.


పదివేల కుటుంబాలకు ఉపాధి…

గతంలో ఉపాధి దొరక్క ఎలాంటి ప్రోత్సాహం లేక చాలా మంది మత్స్య కారులు ఇతర రంగాల వైపు వెళ్లారు. కానీ, తెలంగాణ సర్కారు కులవృత్తులకు జీవం పోయడంతో సంబురపడుతున్నారు. మళ్లీ తెడ్డు, తెప్ప పట్టి నీళ్లలోకి దిగుతున్నారు. చెరువుల్లో చేపల సంపద పెరుగడం, రాయితీపై వలలు, బుట్టలు, చేపల మార్కెటింగ్‍ కోసం టైకులు, టాటా ఏస్‍లు అందిస్తుండడంతో వృత్తి వదిలేసి వారు సైతం తిరిగి వస్తున్నారు. దీనికితోడు మధ్య మానేరు నిర్వాసితు లందరికీ ఉపాధి కల్పించేందుకు ఆసక్తి ఉన్న వారందరికీ సర్కారు లైసెన్స్లు ఇచ్చింది. 42 సంఘాల పరిధిలో సుమారు 3070 మందికి సభ్యత్వం ఇచ్చింది. సిరిసిల్లా జిల్లాలో మొత్తంగా 89 మత్స్య సహకార సంఘాలు ఉండగా, సుమారు 10వేల మందికి ఉపాధి దొరుకు తున్నది.


పుష్కలంగా మత్య్స సంపద..
ఎస్సారార్‍, ఎగువ మానేరుతోపాటు 800 చెరువులు, కుంటల్లో సర్కారు ఏటా కోటికి పైగా చేప విత్తనాలను పోస్తున్నది. 1.15 కోట్లకు పైనే విడుదల చేసింది. దీనికి తోడు గోదావరి జలాలు రావడం, అందులోనూ చేపలు భారీగా తరలివస్తుండడంతో మానేరు సహా పలు ప్రాజెక్టుల్లో బొమ్మెలు, పాపెర్లు, బొచ్చెలు, బంగారు తీగలు, రవ్వలు, జెల్లలు, వాలుగ సహా గంగరొయ్యల సంతతి భారీగా పెరిగింది. ఒక్క ఎస్సారార్‍ రిజర్వాయర్‍లో రోజుకు 20 క్వింటాళ్ల చేపలు దొరుకుతున్నాయి.

బొమ్మెకు భలే గిరాకీ..
పుష్కలమైన మత్స్యసంపదతో మత్స్య కారులకు రోజుకు భారీగా గిట్టుబాటవుతున్నది. రకాన్ని బట్టి కిలోకు రూ.100 నుంచి రూ.500 దాకా విక్రయిస్తున్నారు. ఇందులో చేపల ప్రియులు చాలా ఇష్టపడే బొమ్మె రకానికి పుల్‍ గిరాకీ ఉంటుంది. కిలోకు రూ.400 నుంచి రూ.500 పలుకుతుండగా, ఇవి చిక్కిన మత్సకారులకు ఆ రోజే పండుగ అవుతుంది. ఇక రవ్వ రూ.120-150, పాపెర రూ.300 – 400, వాలుగ రూ.100-150, జెల్ల రూ.150, రొయ్యలు రూ.300 విక్రయి స్తున్నారు. అంచనా ప్రకారం జిల్లాలో సగటున ఒక్కో మత్సకారుడు నెలకు రూ.10-15వేల పైగానే సంపాదిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


ఎక్కడికక్కడే వ్యాపారం

మానేరు ప్రాజెక్టులో మత్స్య సంపద భారీగా పెరగడంతో ప్రజలకు జిమ్మలు పుష్కలంగా అందుబాటులో ఉంటున్నాయి. మానేరు పొడువునా ఎక్కడికక్కడ మార్కెట్లు వెలుస్తున్నాయి. చేపలు పట్టే మత్స్యకారులు అకడికక్కడే విక్రయిస్తున్నారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, కొదురుపాక, వెంకట్రావుపల్లె, అగ్రహారం, వేములవాడ, రుద్రవరం, నాంపల్లి, కంది కట్కూరు, చింతల ఠాణా గ్రామాల్లో మత్స్య కార్మికులు రోడ్ల పక్కన పెట్టుకుని అమ్ము తున్నారు. మత్స్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం మధ్యమానేరు పరిధిలో రోజుకు 20 టన్నుల చేపలు విక్రయిస్తున్నారు. కొద్దిరోజులుగా మొబైల్‍ మార్కెట్ల ద్వారా మండల కేంద్రాల్లోనూ వ్యాపారం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చేతి వృత్తుల్లో వేటికైతే ఆదరణ ఉన్నదో వాటికి ఆధునిక సాంకేతికత జోడించి, ఆయా వృత్తుల వారికి శిక్షణ ఇప్పించి వారి బతుకులకు భరోసా కలిగిస్తుంది టీఆర్‍ఎస్‍ ప్రభుత్వం.

కట్టా ప్రభాకర్‍
ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *