దేవునిగుట్టమీద దేవుడెవరు? తెగని దేవులాట


2017సం. పర్యాటకదినోత్సవంరోజు మా చరిత్రబృందం సందర్శించింది. దేవునిగుట్ట జయశంకర్‍ భూపాలపల్లి, ములుగు మండలంలోని కొత్తూరు గ్రామం బయట వుంది. మేమందరం కలిసి వెళ్ళక ముందు ఈ గుడిని టీవి99 వారు, మిత్రుడు తోపుడుబండి ఫేం సాదిక్‍ అలీ బృందం, మరికొందరు చూసారు. దేవునిగుట్టమీద కొత్తూరు ప్రజల జాతరను చిత్రించిన టీవీ99 వారి వీడియో చూడడంతో మొదటిసారి వ్యక్తిగతంగా నాకు దేవునిగుట్ట గురించి తెలిసింది. వీడియోలో గుడిని చూసిన వెంటనే ఇది ఆంగ్‍ కర్‍ వాట్‍(బౌద్ధ ఆరామం)ను పోలివున్నదని, వెంటనే వెళ్ళి చూడాలనే ప్రతిపాదన చేసాను మా చరిత్రబబృందంలో. అయితే కారణాంతరాలవల్ల మేం వెంటనే వెళ్ళలేక పోయాను. సాదిక్‍ అలీ తన బృందంతో వెళ్ళివస్తూ దారిలోనే నాకు ఫోటోలు పోస్టు చేసాడు. నేను దేవునిగుట్ట గుడికి ఆంగ్‍ కర్‍ వాట్‍ దేవాలయంతో, జావాలోని బొరొబుదూర్‍ బౌద్ధారామంతో పోలికలున్నాయని చెప్పాను సాదిక్‍ భాయితో.


అరుదైంది, అద్భుతమైంది, అపూర్వమైంది, అనితరమైంది, సాటిలేనిది. దేశంలో దేవునిగుట్ట గుడిని పోలినవి చాలా అరుదు. మట్టి ఇటుకలతో నిర్మించిన గుడులలో ఉత్తరభారతదేశంలో ఒక గుడి వుంది, రెండవది గొల్లత్తగుడి మన తెలంగాణాలోనే వుంది. కాని రాతిఇటుకలతో నిర్మించిన దేవాలయాలు దేశంలో చాలా తక్కువ.


6 లేదా 7వ శతాబ్దంలో నిర్మించబడ్డ వజ్రయాన(మహాయాన) బౌద్ధారామం లేదా చైత్యాలయమిది. 9వ శతాబ్దంలో ఇండోనేషియా సెంట్రల్‍ జావాలోని మేగలాంగ్‍ లో నిర్మించిన బోరోబుదూర్‍ మహాయాన బౌద్ధ దేవాలయానికి, 13వ శతాబ్దంలో కాంబోడియా దేశంలో 400 ఎకరాలలో నిర్మించబడ్డ ప్రపంచప్రఖ్యాతమైన అంకర్‍ వాట్‍ దేవాలయానికి ఈ చైత్యాలయం మాతృక వంటి నిర్మాణం. అంకర్‍ వాట్‍ వజ్రయాన బౌద్ధదేవాలయం పెద్ద, పెద్ద రాళ్ళను ముక్కలుగా చేసి వాటిమీద చెక్కిన శిల్పాలను ఇటుకల లెక్క పేర్చి కట్టినది. అవి ఎత్తైన శిల్పాలు. అవి భారీనిర్మాణాలు. మన తెలంగాణలోని జయశంకర్‍-భూపాలపల్లి జిల్లా, ములుగు మండలంలోని కొత్తూరు గ్రామానికి ఈశాన్యంలో వున్న దుర్గమారణ్యంలో దేవునిగుట్టమీద రాతి ఇటుకలమీద చెక్కిన శిల్పాలతో కట్టిన గుడివుంది. 24 (30-6) అడుగుల ఎత్తున్న ఈ బౌద్ధ చైత్యాలయం గోడలు బయటివైపు, లోపటివైపు రెండువైపులా శిల్పాలతో అలంకరించబడ్డాయి. గుడిలో లోపలివైపు విమానం మొనదేలిన పిరమిడ్‍ ఆకారంలో కనిపిస్తుంది. ప్రస్తుతం అది కొంత 6అడుగుల దాకా కూలిపోయివుంటుంది. పైన శిఖరానికి రంధ్రం ఏర్పడివుంది. అంకర్‍ వాట్‍ దేవాలయానికి, దేవునిగుట్ట గుడికి గుడి నిర్మాణంలో, బౌద్ధశిల్పాలలో పోలిక వుంది. అంకర్‍ వాట్‍ దేవాలయం అతిపెద్ద దేవాలయాల కాంప్లెక్స్. కాని దేవునిగుట్ట మీది గుడి ఒక్కటే. ఆకారంలో చిన్నదే. కాని చారిత్రకంగా గొప్పది. ఈ చైత్యాలయం నిర్మాణంలో వాడిన రాతిఇటుకలను గుడిపక్కన వున్న రాతిబండల నుండి తీసినట్టున్నారు. లేత ఎరుపురంగులో వున్న ఇసికరాతి ఇటుకలతో కట్టారు. ఈ రాతిఇటుకలు సాధారణమైన రాళ్ళకంటే చాలా తక్కువ బరువును కలిగి వుంటాయి. అయితే ఈరాతిముక్కల అంచులు తొందరగా రాలిపోతాయి కనుక మొదట వీటిని చిన్న, చిన్న సైజులలో (2×2 అడుగులు, 2×1 అడుగుల కొలతలలో) రాతిబిళ్ళలుగా చేసుకుని ఆలయనిర్మాణం చేసారు. గుట్టమీద పునాదుల అవసరం లేకుండా, మొత్తం 4.5అడుగుల మందంతో మధ్యలో ఖాళీని వదిలిన రెండు పొరల గోడలతో నిర్మించినట్టు తెలుస్తున్నది. గుడిలోపల 10అడుగుల వైశాల్యంతో, బయటిగోడలు ఒక్కొక్కటి 19.6 అడుగుల కొలతతో గుడినిర్మాణంలో కూడా ఈ చైత్యాలయం ప్రత్యేకత కలిగివుంది. ఈ చైత్యాలయానికి ముందువైపు ద్వారంతో 3 రాతిఇటుకలగోడలు 6అడుగుల ఎత్తున కట్టబడి వున్నాయి. ఆలయానికి వంద అడుగులకన్నా ఎక్కువదూరంలో రాతిగుండ్లు పేర్చిన గోడ నలువైపుల వుంది. గుడికి ఉత్తరం దిశలో సహజసిద్ధంగా ఏర్పడిన గుండం వుంది.


గుడికి ఒక మూలన నిలబెట్టివున్న పాలరాతి స్తంభం బౌద్ధస్తూపాలవద్ద నిలిపివుంచే ఆయకస్తంభం, దానికి నాలుగువైపుల అర్ధపద్మాలు, సింహాలు చెక్కివున్నాయి. క్రీ.శ. 1లేదా2వ శతాబ్దాలకు చెందినదనిపించే ఆయకస్తంభం వల్ల ఈ స్థలం చైత్యాలయం కన్నా ముందునుంచే బౌద్ధస్థావరంగా వుండేదని అర్థమవుతున్నది.
దేవునిగుట్ట చైత్యాలయం తూర్పుకు ఎదురుగా ఒకేద్వారంతో నిర్మించబడ్డది. ఎత్తు తక్కువున్న చిన్నద్వారం. ద్వారానికిరువైపుల ద్వారపాలకులవలె కన్పిస్తున్న వజ్రయాన బౌద్ధమూర్తులలో ఒకరు హరివాహన లోకేశ్వరుడు. 10అడుగుల చతురస్రాకారపు చైత్యాలయపు లోపల 20,30యేండ్ల కింద ఏ దేవుని ప్రతిమ లేదు. ఈ గుడిబయట ఒక రాతివేదికమీద నంది విగ్రహం వుండేదిట. ఇపుడది లేదు. ప్రస్తుతం గుడిలో ఒక సిమెంటు వేదికమీద కొత్తూరు గ్రామప్రజలు ప్రతిష్టించుకున్న లక్ష్మీనరసింహస్వామి విగ్రహం వుంది. ఆ దేవునికే ప్రతి కామునిపున్నమి లేదా హోళిపండుగ సందర్భంగా జాతర చేసుకుంటున్నారిక్కడి గ్రామస్తులు.


లోపలి గోడలకు ద్వారంవైపు తప్ప మిగతా 3గోడలమీద బుద్ధ జాతక కథలకు చెందిన కథా దృశ్యాలు చెక్కివున్నాయి. బుద్ధుడు శిష్యులకు బోధిస్తున్న ద•శ్యాలు 2,3 చోట్ల వున్నాయి. ఒకచోట యుద్ధసన్నివేశం చెక్కబడి వుంది. దానిలో చేతిలో ఖడ్గంతో కుషానుని పోలిన శిల్పం వుంది. మిగతా రెండుగోడలమీద కూడా బౌద్ధజాతక కధలే. అందులో బుద్దుని బోధనల సంఘటనలే ఎక్కువగా చెక్కబడి వున్నాయి. బయటి గోడలమీద వివిధదృశ్యాలు ఆరేసి ఫ్రేములుగా విభజించ బడ్డాయి. మధ్యలోని శిల్పాలు పెద్దవిగా మిగతావి చిన్నవిగా వున్నాయి. ఒక్కటొక్కటిగా శిల్పాలను చెక్కి పేర్చిన రాతిఇటుకలు కింది నుండి పైకి సైజు తగ్గుతూ పోయాయి. దక్షిణంవైపు గోడమీద అజంతా చిత్రాలలోని పద్మపాణిని పోలిన బోధిసత్వుడు రాచకొలువులో లలితాసనంలో రాణితో కూర్చున్న దృశ్యం వుంది. అటిటు రెండుపక్కల బోధిసత్వుని అవతారరూపాల శిల్పాలున్నాయి. పైన ఫ్రేముల్లోను బుద్ధబోధనలదృశ్యాలే కనిపిస్తాయి. పడమటివైపు గోడమీద కిందివైపు అర్ధనారీశ్వర శిల్పం చెక్కివుంది. ఈశ్వరుని అర్ధభాగం, పార్వతి అర్ధభాగం స్పష్టంగా చెక్కబడింది. 6 అడుగులు, 8అడుగుల కొలతల ఈ ఫ్రేములో చతుర్బుజుడైన అర్ధనారీశ్వరుని కుడిచేయి గణపతి తలమీద, ఎడమచేయి కుమారస్వామి తలమీద పెట్టినట్లు చెక్కబడ్డాయి. దానిపై వరుసలో బుద్ధుని బోధనలు వింటున్న రాజు, రాణులు, పరివారం, మిథునాలు వున్నాయి. పై అంచుల రాతిఇటుకలపై సాగరమథనం చెక్కబడివుంది. ఉత్తరంవైపు గోడమీద చెక్కిన కథాదృశ్యం కొత్తదిగా వుంది. భయంకరంగా వున్న పెద్దతల కలిగిన బోధిసత్వుడు (జంభాలుడు?) ఎడమమోకాలితో ఎవరివీపునో వంచి, ఎడమ చేత అతని గొంతును వెనక్కి విరిచి నొక్కుతున్నట్టుగా వుంది. ఆ గోడమీద వున్న హరివాహన లోకేశ్వరునికి ఇరువైపుల అంచుగా నిలిపిన ఇటుకలమీద రెండు పూర్ణకుంభాలు చెక్కబడివున్నాయి.

బౌద్ధనిర్మాణాలున్నచోట ఇవి సాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ గోడకే శిఖరంవైపు ఈశాన్యపు అంచున చెక్కబడివున్న అమితాభుని శిరస్సు శిల్పం కాంబోడియా అంకర్‍ వాట్‍ దేవాలయం మీది పెద్ద రాతిముక్కల శిల్పానికి మాతృక అనిపిస్తుంది. ఇక్కడి శిల్పాలు అజంతా చిత్రాల తోను, అమరావతి, ఫణిగిరి, నాగార్జునకొండ బౌద్ధ శిల్పాలతోను, ఒరిస్సాలోని స్కందగిరి, ఉదయగిరి శిల్పాలతోను పోలికలు కలిగివున్నాయి. ఈ దేవాలయానిది విశిష్టమైన శిల్పశైలి. అనితరమైనది.
బౌద్ధచైత్యాలయంలో శైవం కనిపించడం వజ్రయానప్రభావమే. తెలంగాణాలో బౌద్ధానికి చివరిదశ వజ్రయానం. తాంత్రిక బౌద్ధమని, మంత్ర యానమని పిలువబడే వజ్రయానానికి మంత్రాలు, ధారణులు, ముద్రలు, స్త్రీదేవతారాధన, లైంగిక యోగసాధనలు లక్షణాలు. భిక్షుకుల మతంగా వున్న బౌద్ధం, ఉపాసకుల మతంగా మారిపోవడం, ఇతర మతాలైన జైన, వైష్ణవ, శైవాలు తాంత్రిక పద్ధతులను అవలంబించడం 7వ శతాబ్దం నుండి 12 శతాబ్దం వరకు కొనసాగింది. వజ్రయానం నాగార్జునునికొండ నుండే ప్రపంచ మంతటికి విస్తరించింది. చైత్యకులు బుద్ధుడిని భగవంతుడిని చేసారు. మహాదేవునిగా అంగీకరించారు.దాని ఫలితమే బౌద్ధంలో శివుడు కనిపించడం. వజ్రయాన ప్రతిమారూపభేదాలలో (lconograpgy) అక్షోభ్యుని ప్రతిమ లేదా స్తూపం నమూనా వుండడం వంటివి కనిపిస్తుంటాయి.


ఏదైనా దేవాలయం గోడల మీద ప్రధానదైవానికి సంబంధించని శిల్పాలుండడం శిల్పశాస్త్ర (కాశ్యపశిల్పం) రీత్యా సమ్మతమే. రామప్పగుడి, కోటగుళ్ళమీద జైనతీర్థంకరుల శిల్పాలు, రామప్పగుడి మంటపంలో గోపాలకృష్ణుడు, నందికంది శివాలయంలో వైష్ణవ శిల్పాలు, బాదామీ, ఐనోల్‍, పట్టడకల్‍ గుడులలో బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ శిల్పాలున్నాయి. వరంగల్లులోని గుడులలో ఒకమతం గుడిగోడల మీద పరమతం దేవుళ్ళ శిల్పాలున్నాయి. దేవునిగుట్ట గుడిలోని దేవుణ్ణి నిర్ణయించడానికి బయటిగోడలమీది అర్ధనారీశ్వర శిల్పం ఎట్లా ఆధారమౌతుందో శిల్పశాస్త్రవేత్తలు చెప్పాలి. ఎద్దు కనిపించినందువల్లనే ఈ గుడి శైవమనుకుంటున్నానంటారు కొరినా వెస్సెల్స్ అనే చారిత్రక పరిశోధకులు. బౌద్ధంలో ఎద్దు, గుర్రం, మేక, ఏనుగు, సర్పాలు సాధారణమే కదా. ఒక చరిత్రకారునికి రాక్షసవధ శిల్పసముదాయంలో ప్రలంబాసురుని వధిస్తున్న బలరాముడు కనిపించాడు. అతని శిల్పమిక్కడ ఏ సందర్భంలో చెక్కబడ్డదనాలి. అపుడిది వైష్ణవాలయం కావాలికదా. బోధిసత్వుని అవతారాల్లో జంభాలుడు మహాబలవంతుడు. సాధనమాలలో చెప్పినట్టు ‘ఉచ్చుస్మ జంభాలుడు’ ధనదుణ్ణి తొక్కిపట్టి నోటినుంచి వజ్రాలు కక్కిస్తాడు. ఇక్కడ తనను గుర్తుచేసుకోవచ్చు. బౌద్ధ ప్రతిమాలక్షణాలను పరిశీలిస్తే జంభాలుని గురించి తెలుస్తుంది. ఈ శిల్పంలో ధనదు(రాక్షసు)ని వధిస్తున్న తీరు పట్టడకల్‍లో మహిషాసురమర్దని మహిషుణ్ణి వెన్నువిరిచి చంపుతున్న శిల్పంతో పూర్తిగా పోలివుంది. ఈ గుడిమీద బాదామీ శిల్పశైలి ప్రభావం కొంత కనిపిస్తుంది. దేవునిగుట్టను ఒక మతానికి గ్రాబ్‍ చేసే ప్రచారం జరుగుతున్నది కాని, పరిశోధనకాదు. ఈ వ్యాసంలో గుడి బౌద్ధానికి కావచ్చుననడానికి ఆధారాలు చూపే ప్రయత్నం చేసాను. పరిశోధించి నిరూపించే సత్యమేదైనా అంగీకరించడానికి సిద్ధమే.


సిద్ధిపేట జిల్లా సింగరాయగుట్టమీద బౌద్ధబ్రహ్మ, పాతవరంగల్‍ జిల్లాలో ఇటీవల బయటపడ్డ అమితాభ్య, తారాదేవి ప్రతిమలు ఈ ప్రాంతంలో వజ్రయానం యొక్క ఉచ్ఛస్థితిని సూచించేవే. అయితే మొదటినుంచి రాజాశ్రయం అరకొరగా లభించిన బౌద్ధం కొట్టుమిట్టాడుతు జీవించింది. అంతేగాక కాలాముఖ, పాశుపతుల దాడులకు గురైంది. పాండవులగుట్ట గొంతెమ్మగుహలో వున్న ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’శాసనం బౌద్ధ, జైనాలకు పరమ మాహేశ్వరులు చేసిన హెచ్చరిక. ఇన్ని పరిణామాల మధ్య దేవునిగుట్ట మీద ఈ చైత్యాలయం బతికిబట్టకట్టడం ఆశ్చర్యమే. చరిత్రచేసుకున్న భాగ్యమే.


కట్టా శ్రీనివాస్‍ ప్రశ్నావళి – రచయిత సమాధానాలు :
1) ఈ గుడి ఎలా అరుదైనది? ఎటువంటి పరిశోధనలకు ఉపయోగపడుతుంది. దీనిని కావాడుకోవలసినంత ప్రత్యేకతలేమిటి?
ఈ ఆలయం నిర్మాణపరంగా, మతపరంగా నవ్యమైనది. మా పరిశీలన ప్రకారం శిల్పపరంగా దేశంలోనే ఈ మహాయాన బౌద్ధాలయం అరుదైంది. జావాలోని బోరోబుదూరులో 9వ శతాబ్దంలో నిర్మించిన మహాయాన దేవాలయంతో, కాంబోడియాలోని ఆంగ్‍ కర్‍ వాట్‍ లో 13వ శతాబ్దంలో కట్టిన మహాయానదేవాలయం శిల్పాలతో పోలికలు కలిగివుంది దేవునిగుట్ట దేవాలయం. పరిశోధకులకు ఈ గుడి గొప్ప పరిశోధక వస్తువు.
మహాయాన బౌద్ధ దేవాలయాలు మనదేశంలో చాలా తక్కువ. ఈ గుడి ఇక్కడ నిర్మాణం కావడానికి మహాయానబౌద్ధం ఈప్రాంతంలో విస్తరించిన చరిత్రను అన్వేషించాలి.


2) ఉనికి, నైసర్గిక విశేషాలు
ఈ దేవాలయం జయశంకర్‍ భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని కొత్తూరు గ్రామానికి ఈశాన్యంలో వున్న అడవిలో దేవునిగుట్టగా పిలువబడే చిన్నగుట్ట మీద వుంది.
3) ఆవాస విశేషాలు :
స్థానికంగా జరిగే గుడి ఉత్సవాలు, గుడి గురించి చెప్పుకునే మౌఖిక కథనాలు లేదా కైఫియత్తులు ఏమున్నాయి?
దేవాలయమున్న గుట్ట ఇసుకరాతి గుట్ట. గుట్టమీద నీటికుండాలున్నాయి. జలవనరుల ఉనికి ప్రత్యేక నీటిగుండం, సహజసిద్ధ సరస్సు. దట్టమైన అటవీప్రాంతంలో ఈ ఒంటరి దేవాలయముంది. ఈ గుడిలో మొదట శివలింగం వుండేదంటారు. లింగం వుంటే పానవట్టం వుండాలి. కాని, గుడిలో ఏ దేవత అధిష్టానపీఠం ఆనవాలైనా లేదు. గుడిముందర వున్న ఖాళీప్రదేశానికి చుట్టు చిన్నప్రహరీ వుంది. ఆ ప్రదేశం మధ్యలో 10 అడుగుల ఎత్తున్న బౌద్ధ స్తూపానికి చెందిన ఒక పాలరాతి ఆయకస్తంభం పాతి వుండేదిట. దాని కింద నిధులున్నాయనుకుని తవ్వేయడంతో అది మొదటికి విరిగిపోయింది. బహుశః ఆయకస్తంభాన్నే కొంతకాలం శివలింగంగా పూజించి వుంటారు. గుడిప్రహరీ బయట చతురస్రాకారపు చిన్న రాతిగద్దెవుంది. దానిమీద నంది వుండేదట. ప్రస్తుతం గుడిలోపల సిమెంటుతో కట్టిన గద్దెమీద లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని పెట్టి గ్రామస్తులు పూజిస్తున్నారు.
ప్రతియేటా హోళీపండుగనాడు ఈ గుడివద్ద జాతర జరుపుతారని గ్రామస్తులు చెప్పారు. అంతేకాదు వర్షాలు సమయానికి కురవకపోతే ఊరివారంతా కలిసి దేవునికి వరదపాశం పోస్తారట. దానినే ప్రసాదంగా తీసుకుంటారట.అట్లాచేస్తే తప్పకుండ వాన కురుస్తుందని వారి నమ్మకం.


4) ఆలయానికి వాడిన ముడి సామగ్రిలో ప్రధానం అనదగ్గ రాళ్ళు ఎక్కడివి? ఎలా చెప్పగలం?
గుడి నిర్మాణానికి ఆ గుట్టబండలనుంచి తీసిన రాతిబిళ్ళలనే వాడినట్లు తెలుస్తున్నది. గుడిపక్కనే వున్న రాతిబండను తొలిచినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.
5) గుడి బేస్‍ తాలుకు బ్లూ ప్రింట్‍ దేశీయ, విదేశీయ గుడుల బేస్‍ ప్లాన్‍లలో వేటితో నన్నా పోలికలు ఉన్నాయా? వుంటే ఏమిటి? ఏయే విశేషాలలో పోలికలున్నాయి?
చతురస్రాకారంలో ఒకే ద్వారంతో వున్న ఏకైక గర్భాలయం మాత్రమే వున్న ఆలయమిది. గుడిగోపురం పిరమిడ్‍ వలె లోపలనుండి, 5అంతస్తులుగా బయటనుండి కనిపిస్తున్నది. గుడికి పునాదులున్నట్టు లేదు. కాని గుడికి వెలుపలికి ఒకగోడ, లోపలికి ఒకగోడ వున్నట్టు తెలుస్తున్నది. రెండుగోడల మధ్య అడుగుమందం ఖాళీ కనపడుతున్నది. రెండుగోడలను, ఖాళీతో కలిపి చూస్తే 4.5 అడుగుల మందం వుంది. దేవాలయపుగోడలను రెండుపొరలుగా కట్టడం కళ్యాణీచాళుక్యులు, కాకతీయులు కట్టిన గుళ్ళల్లో మనం చూడవచ్చు. గుడిలోపలి చతురస్రపు గది 4వైపుల 10.5 అడుగుల కొలతలతో, గుడి బయటిగోడలు 19.5 అడుగుల పొడవు వున్నాయి.
6) ఆలయ నిర్మాణ శైలి ప్రధానంగా గుడి తిరిగి వున్న దిక్కు? గోపురం బ్లూ ప్రింట్‍ కొలతల వారీగా ఎలా వుంది? గోపుర నిర్మాణ పద్దతి లో గమనించిన విశేషాలు ఏమిటి? వాటిలో పోలికలు బేధాలు ఏమిటి? అవి ఏ కాలానికి చెందిన నిర్మాణాలతో దగ్గరి పోలికలు కలిగివున్నాయి.
గుడిద్వారం తూర్పువైపుకు వుంది. గుడి బయటి గోడల నిర్మాణంలో వాడిన శిల్పాల అమరిక శైలే గోపురంలోను పాటించ బడ్డది. ప్రతిపెద్దగోడ 2 చిన్నం 1పెద్దం 2చిన్న ఫ్రేములుగా విభజించి, వాటిమధ్య ఇసుకరాతిబిళ్ళలే స్తంభాలుగా నిలిపారు. గోపుర సోపానాలు 6+5+4+3+2 ఫ్రేములుగా పైవరకు అర్థశిల్పాలతో పంచతలగోపురం అలంకరించబడివుంది.
రాతి ఇటుకల గోడలనే కాన్వాసుగా శిల్పాలు చెక్కారు. ఇసుకరాతిబిళ్ళలు కనుక వాటి అంచులు త్వరగా రాలిపోతుంటాయి. అందుకని వాటిపై చెక్కిన శిల్పాలను డంగుసున్నం పేస్టుతో అలంకరించారు. అవి అచ్చంగా బౌద్ధస్తూపాలకు వాడే సున్నపురాతి ఫలకాల మీది శిల్పాలను తలపించే విధంగా వున్నాయి.
ఈ శిల్పాలు ఎక్కువగా బౌద్ధ జాతకకథలు చెక్కివున్న నాగార్జునకొండ, అమరావతి, ధూళికట్ట స్తూపాలను గుర్తుకు తెస్తున్నాయి. సున్నం లేపనంపోయిన శిల్పాలు ఐహోలు, ఎలిఫెంటా, స్కంధగిరి, మహాబలిపురం శిల్పాలను పోలి కనిపిస్తున్నాయి. శిల్పాలశైలిని బట్టి 6,7 శతాబ్దాల నాటివని చెప్పవచ్చు.


7) ఏయే దిక్కులలో ఏయే శిల్పాలను గమనించాము? శిల్ప నిర్మాణ రీతి లేదా ఐకనోగ్రఫీ ప్రకారం శిల్ప శైలి ఎలా వుంది? ఏయే ఆలయాలలో శిల్పాలను పోలి వున్నాయి?
గుడి దక్షిణంవైపు బయటిగోడమీద ప్రధానమైన, పెద్దఫ్రేంలో రాచకొలువుకూటం దృశ్యం కనబడుతుంది. బౌద్ధ జాతకకథలలో నందుని కొలువును గుర్తుచేస్తున్నది.
గుడికి వెనకవైపు, పడమరగోడమీద ప్రధానమైన ద•శ్యం పెద్దతల కలిగిన రాజువంటి శిల్పం ఎడమమోకాలిని మడిచి శత్రువు వీపులో నొక్కి, ఎడమచేత అతని ముఖాన్ని వెనక్కి విరిచి నొక్కుతున్నట్టుగా వుంది. కుడిచేయి పైకెత్తి వుంది. చుట్టు పరివార జనాలున్నారు. (ఇది పట్టడకల్‍ మహిషాసురమర్దని శిల్పంతో పోలికతో వుంది.)
శిల్పానికి కుడివైపు కిందిమూలలో గడ్డంతో కనిపిస్తున్న విదేశీయునివంటి శిల్పం జావాలోని బోరొబుదూర్‍ మహాయాన బౌద్ధదేవాలయం గోడలపైవున్న శిల్పంతో పోలివుంది. గుడికి ఉత్తరంవైపు గోడమీద అర్ధనారీశ్వర శిల్పం చెక్కివుంది. విలాసంగా నిలిచివున్న విగ్రహం కుడిచేయి గజముఖం కలిగివున్న బాలవినాయకుని తలమీద, ఎడమచేయి చిన్నపిల్లవాడి (స్కంధుడు) తలమీద పెట్టబడివుంది. ఈ శిల్పం తలకు కుడివైపున ఎద్దుతలొకటి కనిపిస్తున్నది.
8) ఓవర్‍ లాప్‍ అయిన శిల్పాలు కన్పిస్తున్నాయా? అవునయితే ఏయే శిల్పాలు ఎందుకలా జరిగి వుంటాయి. ఏ కాలం శిల్పాలను, ఏవి ఓవర్‍ లాప్‍ చేసి వుండొచ్చు.
కొన్ని శిల్పాలు అక్కడక్కడ అధ్యారోపనం చేయబడినట్లు కనిపిస్తున్నాయి. పూర్వపు శిల్పాలను చెక్కి సున్నంపూతతో తీర్చిదిద్దినట్లు అనిపిస్తాయి.
9) ఈ గుడిలోని విశేషాలగురించి ప్రముఖ పరిశోధకులెవరైనా పరిశీలనలో వెలిబుచ్చిన అభిప్రాయాలు అందుబాటులో వున్నాయా? వాళ్ళు ఏమంటున్నారు దాన్ని మనం మన పేపర్‍లో అంగీకరి స్తున్నామా విభేదిస్తున్నామా అయితే ఎందుకు? ఇంకేవైనా పుస్తకాలలో ప్రస్తావించారా అవేమిటి? ఇతర దేవుని గుట్టల విశేషాలు..
ఈ గుడిశిల్పాలను దినపత్రికలలో, సోషల్‍ మీడియాలో చూసిన కొందరు శైవాలయమయివుంటుందని తమ అభిప్రాయం వ్యక్తం చేసారు. కాని, వాళ్ళెవరు గుడిని ప్రత్యక్షంగా చూడలేదు. కనుక అభిప్రాయాలు భిన్నంగా వుండడంలో ఆశ్చర్యం లేదు. కాని, మనం మనఅభిప్రాయాన్ని నిలుపుకుంటూనే, వారి విమర్శలను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. లోతుగా అధ్యయనం చేయవలసిందిగా పరిశోధకులకు విజ్ఞప్తిచేస్తున్నాం.
గుడిలోపల మూడువైపుల చెక్కివున్న శిల్పదృశ్యాలన్నీ బౌద్ధజాతక కథలలోని బోధిసత్వుని పోలిన శిల్పాలు, బుద్ధుని బోధనలను వింటున్న శిష్యగణాలను గుర్తుకుతెచ్చే శిల్పాలు చెక్కివున్నాయి.


దక్షిణం వైపున్న గోడమీద పైమూలన ఒక యుద్ధదృశ్యం కనిపిస్తున్నది.అందులో ఒకవీరుడు గ్రీకులవలె దుస్తులు ధరించి ఖడ్గంతో కనిపిస్తున్నాడు. గాంథార బౌద్ధశిల్పఫలకాలలో కొన్నిచోట్ల ఇదే వేషభూషలతో కనిష్కరాజు కనిపిస్తాడు. అదేగోడకు కిందివైపు త్రిశూలం ధరించివున్న పెద్దదైన అర్ధశిల్పం కనిపిస్తున్నది. మహాయాన బౌద్ధంలో హిందూదేవతలను పోలిన దేవతాశిల్పాలు కనిపిస్తాయి. ఇట్లాంటి శిల్పాలు నేపాల్‍, కాంబోడియా, జావా, ఇండోనేషియాలలోని మహాయాన బౌద్ధ దేవాలయాలలో కనిపిస్తాయి.
10) కాపాడేందుకు ఎటువంటి పద్దతులు పాటించవచ్చు?
శాస్త్రీయంగా గుడిని అధ్యయనం చేసిన తర్వాత, ఆర్కియాలజీ వారు వారి పద్ధతులలో గుడిని రాతిఇటుకలవారీగా విడదీసి తిరిగి నిర్మాణం చేయాలి. గోపురాన్ని పునరుద్ధరణ చేయాలి. ఇసుక రాతి ఇటుకలు కనుక శిల్పాల అచ్చులను తీసుకుని, అవసరమైనచోట ఆ శిల్పాలను తిరిగి చెక్కించి గుడిని పునరుద్ధరణ చేయాలి.
11) ముగింపు నిర్ధారణలు
మనం చేసిన నిర్ధారణలను ఆర్కియాలజీవారు, దేవాలయాల నిపుణులు పునఃసమీక్షించాలని, కాలనిర్ణయం చేయాలని, పరిసర ప్రదేశాల్లో, పరిసరగ్రామాల్లో బౌద్ధం ఆనవాళ్ళను శోధించాలని కోరుకుందాం.
(దేవునిగుట్ట దర్శించిన చరిత్రబృంద సభ్యులు: వేముగంటి మురళీక•ష్ణ, కట్టా శ్రీనివాస్‍, అరవింద్‍ ఆర్య, తాళ్ళపల్లి సదానందం, వేముగంటి సమీర్‍ కుమార్‍, అహోబిలం కరుణాకర్‍, సామలేటి మహేశ్‍, చంటి మరియు కొత్తూరు గ్రామసర్పంచ్‍ రవీందర్‍రావు -అందరి తరపున).

శ్రీరామోజు హరగోపాల్‍,
ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *