గుండేరావు హర్కారే


పట్నములోన హైదరాబాదు గొప్ప
హైద్రాబాదులోన పాటపత్నంబు గొప్ప
పాతపట్నంబులో గొప్ప పదియురెండు
భాషలెరిగిన హర్కారె పండితుండు
(తెలంగాణోదయం)


బహుభాషలలోను, బహుశాస్త్రాలలోను ఉత్తమశ్రేణికి చెందిన పండితుడు గుండేరావు హర్కారే. ఎంత పాండిత్యముంటే, అంత ఒదిగి ఉండాలని నిరూపించిన శాంతమూర్తి ఆయన. త్రికరణ శుద్ధికి మారుపేరుగా నిలిచిన హర్కారే జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ త్రివిక్రమణ్ణి తలపించాడు.
గుండేరావు న్యాయశాస్త్రంలో ఎంత దిట్టనో, వ్యాకరణ శాస్త్రంలోను అంతే దిట్ట. పాణిని రచించిన అష్టాధ్యాయికి, ఆధునిక విజ్ఞానాన్ని అనుసరించి, విద్యార్థుల సౌకర్యార్థం’Sanskrit Grammar Made Easy’ పేరుతో ఒక యంత్రాన్ని తయారు చేశాడు. ఇది ఆయనకు గొప్ప కీర్తిని తెచ్చిపెట్టింది.


తెలుగుతో పాటు దేశవిదేశ భాషలలో సంపాదించిన పాండిత్యం ఒక ఎత్తైతే, సంస్కృతంలో గుండేరావు సంపాదించిన పాండిత్యం ఒక ఎత్తు. ద్వాదశ భాషా పండితుడు. ఆయన నా దృష్టిలో ఒక భాషా పండితుడే కాడు, ఒక విజ్ఞాన సర్వస్వం.


గుండేరావు సీతాబాయి. రామారావులకు 1887 మార్చి 13వ తేదీన హైదరాబాదు నగరంలో జన్మించాడు. వీరి ఇంటి పేరు హర్కారే. బహుశా ఇది వీరి వంశీయుల పనితనాన్ని బట్టి వచ్చిన బిరుదనామం. గుండేరావు పూర్వీకులది మహారాష్ట్ర. వివిధ జిల్లాల నుండి, పరగణాల నుండి ప్రభుత్వానికి అధికారికంగా వార్తలను చేరవేసే నమ్మకమైన దూతలకే హర్కారులని పేరు. బహుశా ఈ పేరుగల వారు దేశంలో ఎక్కడున్నా వారు ప్రభుత్వానికి నమ్మకంగా పనిజేస్తూ పేరు తెచ్చుకున్నవారే.
గుండేవారు హర్కారే జీవిత చరిత్రను అధ్యయనం చేస్తే ఈ విషయం స్పష్టంగా మన కర్థమవుతుంది.


హర్కారే పండితుడు. దేశకాల పరిస్థితులననుసరించి బాల్యంలో నిజాం రాష్ట్రవాసి కావడం వల్ల పర్ష్యన్‍, అరబిక్‍ భాషలు నేర్చుకోవలసి వచ్చింది. ఆ తర్వాతనే తెలుగు, మరాఠీ భాషలు నేర్చుకొన్నాడు. ఈ రెండు భాషలను ప్రైవేట్‍గా నేర్చుకోవలసి వచ్చింది. ఇక్కడ గమనించివలసిన అంశాలు మూడున్నాయి. వారు నేర్చుకున్న భాషలలో ఒకటి మాతృభాష, రెండు స్థానిక భాష, మూడు రాజభాష ఉండడం విశేషం. ఆ తర్వాత హర్కారే ఆంగ్లపాఠశాలలో తన 12వ ఏట చేరి, 1906 ప్రాంతంలో మెట్రిక్యులేషన్‍ పరీక్షకు హాజరయ్యాడు. ఆ తర్వాత కుటుంబపరిస్థితుల కారణంగా చదువుకు దూరమయ్యాడు. ఉద్యోగానికి చేరువయ్యాడు. 1908లో నగరంలోని న్యాయస్థానంలో గుమస్తాగా ప్రవేశించాడు.


అనువాదకులకు వివిధ భాషలలో పరిచయం ఉండడమేగాక, అనువాద కౌశల్యం కూడా ఉండాలి. హర్కారే ఒక గుమస్తాగా ఉండి, శ్రద్ధాభక్తులతో భాషారాధ్య చేసినాడు. అందుకే న్యాయస్థానం ఆయనకు 1908లో ఒకేసారి పదోన్నతిని పెంచి, స్పెషల్‍ మెజిస్ట్రేట్‍ కోర్టుకి బదిలీ చేశారు. అక్కడ హర్కారే మంచి అనువాదకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన పనితనాన్ని గుర్తించి నిజాం ప్రభుత్వం ఆయనను 1914లో ఉన్నత న్యాయస్థానానికి (Highcourt) బదిలీ చేసింది. అప్పుడు హర్కారే ప్రధాన న్యాయమ్తూకి అంతరంగిక కార్యదర్శిగా నియుక్తుడయ్యాడు.


భాషా పండితునిగా, సాహితీవేత్తగా ఒకవైపు గుర్తింపు తెచ్చుకున్న హర్కారే – హైకోర్టులో తన సేవలకుగాను గద్వాల సంస్థానంలో 1919లో మున్సిఫ్‍ మెజిస్ట్రేట్‍గా నియమింపబడినాడు. 1948 దాకా ఆయన అక్కడ పనిచేశాడు. సుమారు అక్కడి 30 ఏండ్ల ఉద్యోగకాలంలో ఆయన జిల్లా న్యాయాధీశుడుగా, కలెక్టర్‍గా, సెషన్స్ జడ్జిగా ఉన్నత పదవులను అధిరోహించాడు.


గద్వాలలో ఉన్న రోజుల్లో గుండేరావు న్యాయాధీశుడుగానే కాక గొప్ప పండితునిగా వెలుగొందాడు. గద్వాల సంస్థానాధీశురాలైన రాణి మహలక్ష్మమ్మ ఆదరాభిమానాలు చూరగొన్న హర్కారే తరుచుగా ఆస్థానానికి వెళ్లేవాడు. ఆస్థానానికి వచ్చే పండితుల ప్రేమకు, గౌరవానికి గుండేరావు ఆలవాలమయ్యాడు. ఆస్థానంలో జరిగే సాహితీచర్చలకు, అవధానాలకు సాక్షిగా నిలబడ్డాడు. గద్వాల సంస్థానానికి కొప్పెరపు కవులు వచ్చిన సందర్భంలో హర్కారే రాణిగారి ఆస్థానంలో ఉండడం విశేషం.


గుండేరావు తర్కన్యాయ వేదాంత శాస్త్రాలతోనేగాక గణితశాస్త్రంలోను నేర్పరి అనటానికి ఈ సందర్భంగా ఒక సంఘటనను వివరించక తప్పదు (స్వయంగా హర్కారే నాకు చెప్పిన విషయాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను).


గద్వాల సంస్థానానికి, నిజాం సర్కారుకి పన్నుల బాకీ విషయంలోపేచీ ఏర్పడింది. ముప్పైవేల రూపాయల పన్ను కట్టాలని మంత్రిగా ఉన్న సాలార్‍జంగ్‍ సంస్థానానికి తాఖీదు పంపించాడు. ఈ సంగతి ఎట్లాగో గుండేరావు హర్కారే దృష్టికి వచ్చింది. ఆయన లెక్కలన్నీ తీసి, అదివరకు కట్టినవి తీసేసి – చివరికి మూడువందలు మాత్రమే కట్టవలసి ఉన్నాయని తేల్చి చెప్పినాడట. ఈ విషయం తెలుసుకున్న సాలార్‍జంగ్‍ గుండేరావును గౌరవంగా హైదరాబాదులో జరిగిన ఒక విందు కార్యక్రమానికి ఆహ్వానించాడట.


అక్కడ స్వయంగా సాలార్‍జంగ్‍ గుండేరావును అభినందిస్తూ – యధాలాపంగా ‘‘నీలాంటి పండితుడు మా మతంలో చేరితే మా మతానికెంతో వన్నె కల్గుతుది’’ అని ప్రలోభపెట్టాడట. వెంటనే హర్కారే వినయంగా ‘‘ఇంకో మతం నుంచి మీ మతంలోనికి వచ్చేవాళ్ల వల్లనే మీ మతం వన్నెకెక్కడం నాకు తృప్తి కల్గించడం లేదు’’ అని సున్నితంగా సమాధానమిచ్చాడట.


గుండేరావు ధైర్యశాలి అంటానికి ఒక సంఘటనను తప్పక వివరించాలి. భారత ప్రభుత్వం టంగుటూరి ప్రకాశం పంతులు గారిని బంధించడానికి సన్నాహాలు చేసింది. పోలీసుల కన్నుగప్పి ప్రకాశంగారు ఒక నాల్గురోజుల కోసం గద్వాల సంస్థానానికి వచ్చాడు. మూరువేషంలో ఉన్న ప్రకాశంగారికి గుండేరావు తన ఇంట్లో నాల్గురోజులు ఆతిథ్యమిచ్చి, ఆ నాల్గురోజుల్లో ఆయన కూర్చొనగల్గినరీతిలో ఒక బలమైన వెదురుబుట్ట తయారుచేయించి – తద్వారా కండపుష్టిగల సేవలకుతో మోయించి, ప్రకాశం గారిని రహస్యస్థావరానికి చేర్చినాడట. ఈసంఘటనను హర్కారే గారు నాకు వివరించినప్పుడే కాదు, దీన్ని రాస్తున్నప్పుడు కూడా నా ఒళ్లు జలదరించింది.
గుండేరావు బలమైన వ్యక్తి. ఆయన ఆకారం ఒక కొండను తలపిస్తుంది. లేదా ఏనుగును తలపిస్తుంది లేదా గుమ్మడికాయను గుర్తుకు తెస్తుంది. అరబ్బులతో ముష్టి యుద్ధం చేసిన సాహసి. ఉదయం, సాయంత్రం ధ్యానానికి ప్రాధాన్యం ఇచ్చినట్లే వ్యాయామానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినాడు. ముష్టిఘాతాలతో ఆయన శరీరం గట్టిపడింది.


హర్కారే గద్వాలలో ఉన్నప్పుడు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అధ్యయనశీలియై అనేకానేక పరీక్షలు రాసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తీరిక దొరికితేచాలు ఏ కావ్యాన్నో లేదా ఏ శాస్త్రాన్నో చదవాలన్న కోరిక ఆయనది. మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన న్యాయశిరోమణి, సాహిత్యశిరోమణి పరీక్షలలోను, ధర్మశాస్త్రంలోను, తులనాత్మక సాహిత్యంలోను నిర్వహించిన పి.ఓ.ఎల్‍. పరీక్షలందును హర్కారే తన ప్రతిభను చూపించి విజయాన్ని సాధించాడు. న్యాయశాస్త్రంలో నిష్ణాతుడైన గుండేరావుకు న్యాయశాస్త్రానికి కేంద్రమైన ‘నవద్వీప్‍’లోని పండితపరిషత్తు ‘వాచస్పతి’ పట్టాన్ని ఇచ్చి గౌరవించింది. అయోధ్య, బెల్గాం పట్టణాల్లోని ప్రతిష్ఠాత్మకమైన పండితసభ గుండేరావుకు ‘విద్యాభూషణ’ బిరుదం ఇచ్చి గౌరవించింది.


గుండేరావు కేవలం పండితుడేకాడు. గొప్ప రచయిత కూడా. ఆయన రచనలు వెలుగులోకి వస్తే మరాఠీ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషలలో ఆయన చేసిన కృషి ప్రపంచానికి తెలుస్తుంది. కాని చాలమటుకు అవి మరుగునపడి ఉన్నాయి. ఐతే ఆయన చేసిన అనువాదాలు సంస్కృత పండితులనే ఆశ్చర్యపరచినవి. ఒక తెలుగువాడు ఆంగ్లం నుండో హిందీ నుండో, సంస్కృతం నుండో తెలుగులోకి అనువదిస్తే ఎంతో గొప్ప. కాని గుండేరావు అద్భుతమైన అనువాద కౌశల్యానికి ఆయన సంస్కృతానువాదాలే గట్టి నిదర్శనం.


సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి పింగళిసూరని కళాపూర్ణోదయాన్ని సంస్కృతంలో అనువదించగా, గుండేరావుగారు ‘ప్రభావతీ ప్రద్యుమ్నం’ను సంస్కృతంలోకి అనువదించాడు. ఇదొక అద్భుతమైన రచన. గుండేరావుగారి ఈ అనువాదం వారి చివరిదశలో జరిగింది. ఆ సమయంలోనే నేను వారికి అంతేవాసిని కావడం నా అదృష్టం.


గుండేరావు సంస్కృత అనువాద రచనలు మహత్తరమైనవి. ఆయనకు ఆంగ్లం మంచినీళ్లప్రాయమైంది. తెలుగుభాష – క్షీరసదృశం కాగా సంస్కృతం అమృతాయమానమైంది. ఆంగ్ల రచనలను సంస్కృతంలోకి అనువదించడమంటే ఆయనకు చాలా సరదా! ఎంతో గొప్ప పండితుడైనప్పటికీ సారళ్యానికి, శిల్పానికి ప్రాధాన్యం ఇచ్చిన మహానుభావు డాయన! థామస్‍గ్రే రచించిన ‘ఎలిజీ’ గోల్డ్స్మిత్‍ ‘ట్రావెలర్‍’ ‘డిజర్టెడ్‍ విలేజ్‍ వర్డస్వర్త్ రచించిన ‘ఇంటిమేషన్‍ టు ఇమ్మెర్‍టాలిటీ’ షేక్స్పియర్‍ నాటకాలైన ‘హేమ్‍లెట్‍’, ‘ది మిడ్‍ సమ్మర్‍ నైట్స్ డ్రీమ్‍’ మొదలైన వాటికి గుండేరావు చేసిన సంస్కృతకొవ్యాను వాదాలు విశిష్టమైనవి. ఆ మహాపండితుడు ఫారసీలోని ‘మన్నవీ షరీఫ్‍’, అరబ్బీలోని ‘ఖురానే షరీఫ్‍’ మొదలైన మతగ్రంథాలను సంస్కృతంలోకి తీసికొని వచ్చాడు. ఇంత అనువాదాలు మరెవరూ చేయలేదని చెప్పవచ్చు.


గుండేరావు అంటే భాషాకోవిదుడు. ఏ భాషనైనా ఇట్లే నేర్చుకొని, భాషించగల నేర్పరి. అంతేకాదు ఆ భాషలలో పాండిత్యాన్ని సంపాదించి వివిధ భాషల వారికి అనువాదాల ద్వారా ఆదర్శ పండితుడయ్యాడు.


గుండేరావు భాషావ్యాకరణ వేదాంతధర్మ శాస్త్ర గ్రంథాల్లోనే కాక చరిత్ర విషయంలోను తన విమర్శన, పరిశోధన పాటవాన్ని చూపాడు. ఆయన మరాఠీ సాహిత్య చరిత్రను తెలుగులో రచించాడు. భారతీయులకిష్టప్తామైన ఉపనిషత్తులను అధ్యయనం చేసి, వాటిలో ఈశ, కేన, కఠోపనిషత్తులకు కారికలు రచించాడు.


గుండేరావు అటు సాహిత్యాన్ని ఇటు వేదాంతాన్ని ఔపోశనం పట్టినాడా? అనిపిస్తుంది. ఆయన అన్ని మతాలను పరిశీలించాడు. మతగ్రంథాలను చదివాడు. భారతీయ వేదాంతంతో ఇతరుల ఆలోచనలను తులనాత్మక పరిశీలన చేసిన మహానుభావుడాయన. వివిధ మతాలకు చెందినవారు తరుచుగా గుండేరావు దగ్గరికి వచ్చి తమ ఆలోచనలను తెలియజేసి, గుండేరావు నుండి స్ఫూర్తిని పొందేవారు. హైదరాబాదు నగరంలో ఏ వేదాంత సభ జరిగినా అందులో విశిష్టస్థానం వారిదే.
గుండేరావు తెలంగాణ చిత్రపటం మీద మెరిసే ఒక వజ్రం. ఆయన మహ్మదీయుల పరిపాలనలో ఉద్యోగిగా ఉన్నప్పటికీ, కేవలం ఉద్యోగధర్మానికే పరిమితం కాలేదు హైందవ ధర్మానికి పట్టుగొమ్మగా నిలిచాడు. తెలంగాణలోని ప్రతి పండింతునికి స్ఫూర్తిసందించాడు. ఆయనలాగా ప్రాచ్యపాశ్చాత్య సంస్కృతులెఱిగినవారు అరుదుగ కనిపిస్తారు. అన్ని భాషలలోని అంతఃసూత్రాన్ని తెలిసికొన్న ఉత్తమ పండితుడాయన. 20వ శతాబ్దిలో చెప్పుకోదగ్గ పండితుల్లో ఆయన ఒకరని నా అభిప్రాయం.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)

ఆచార్య మసన చెన్నప్ప

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *