‘భెల్‍’కు తెలంగాణ ప్రభుత్వం బాసట


బీహెచ్‍ఈఎల్‍ ప్రైవేట్‍పరం కాకుండా భారీ కాంట్రాక్టుతో అడ్డుకట్ట
పట్టుబట్టి నవరత్నానికి మెరుగులద్దిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు


కేంద్రం ఆధీనంలో ప్రస్తుతానికి 300 ప్రభుత్వరంగ కంపెనీలు ఉన్నాయి. ఆ సంఖ్యను 24కు కుదించుకోవాలని మోడీ సర్కార్‍ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నీతి ఆయోగ్‍ సిఫారసులను ప్రాతిపదికగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పక్రియను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేగవంతం చేయనున్నట్లు విశ్లేషకుల అంచనా.


రూ.1.75 లక్షల కోట్లు..

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2021-22లో ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల విక్రయించడం ద్వారా 1.75 లక్షల కోట్లను సమీకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు బిజినెస్‍ వెబ్‍సైట్స్ స్పష్టం చేస్తున్నాయి. కాగా- బీహెచ్‍ఈఎల్‍ను కూడా కేంద్ర ప్రభుత్వం విక్రయించవచ్చంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‍ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విశాఖ స్టీల్‍ ప్లాంట్‍ ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ఈ ఉద్యమానికి తాము మద్దతు ఇస్తామంటూ కేటీఆర్‍ ప్రకటించారు. భవిష్యత్తులో బీహెచ్‍ఈఎల్‍ను కూడా అమ్మకానికి కేంద్రం సిద్ధపడొచ్చని పేర్కొన్నారు.


ఇటువంటి తరుణంలో రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‍ థర్మల్‍ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రూ.50వేల కోట్ల వ్యయంతో యాదాద్రిలో 4,000 మెగావాట్లు, మణుగూరులో 1080 మెగవాట్లు, పాల్వంచలో 800 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. మొత్తం 5880 మెగావాట్ల థర్మల్‍ విద్యుత్తు కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టుకు అప్పగించే పక్రియను టీఎస్‍ జెన్‍కో చేపట్టింది. కాంట్రాక్టును చేజిక్కించు కొనేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీపడ్డాయి. ఈ జాబితాలో టాటాలు మొదలు అదానీ, అంబానీ, ఎల్‍ అండ్‍ టీ వంటి భారీ కంపెనీలు కూడా ఉన్నాయి. కొన్ని కంపెనీలు కాంట్రాక్టు కోసం జెన్‍కో అధికారులపై.. ఒకానొక సందర్భంలో సీఎం కేసీఆర్‍పై కూడా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే ప్రభుత్వరంగ సంస్థలకు అండదండ లివ్వాలన్న స్పష్టమైన ఆలోచనతో ఉన్న సీఎం కేసీఆర్‍ ఎక్కడా ఆ ఒత్తిళ్లకు లొంగలేదు. ప్రభుత్వరంగ సంస్థకే ఈ పనులను అప్పగించాలన్న పట్టుదలతో బీహెచ్‍ఈఎల్‍ (భారత్‍ హెవీ ఎలక్ట్రికల్‍) వైపు మొగ్గు చూపారు. బీహెచ్‍ఈఎల్‍ ఉన్నతాధికారులతో మాట్లాడి రూ.35వేల కోట్ల విలువైన పనులను అప్పగించారు. వాస్తవానికి ఆ సమయంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరంచేస్తూ, కొన్నింటిని అమ్మకానికి పెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీహెచ్‍ఈఎల్‍ను కూడా వదిలించు కోవాలని చూసినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భారీ కాంట్రాక్టుతో దేశవ్యాప్తంగా ఉన్న బీహెచ్‍ఈఎల్‍ యూనిట్లకు ప్రాణం పోసినట్టయింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో విద్యుత్తు ప్లాంట్లకు అవసరమైన అన్ని పరికరాలు, భారీ యంత్రాలను బీహెచ్‍ఈఎల్‍ యూనిట్లు సమకూరుస్తున్నాయి. బీహెచ్‍ఈఎల్‍ తిరుచ్చి యూనిట్‍ నుంచి బాయిలర్లు, హరిద్వార్‍ నుంచి టర్బయిన్లు, భోపాల్‍ నుంచి ఎలక్ట్రికల్‍ పరికరాలు సరఫరా అవుతుండగా, హైదరాబాద్‍ యూనిట్‍ నుంచి రొటేటింగ్‍ పరికరాలను అందిస్తున్నారు.


మొత్తం రూ. 35 వేల కోట్ల పనులు
రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రధాన విద్యుత్తు ప్లాంట్ల పనులను బీహెచ్‍ఈఎల్‍కు అప్పగించింది. యాదాద్రి విద్యుత్తు ప్లాంట్‍లో రూ.20వేల కోట్ల విలువైన పనులు, పాల్వంచలో రూ.5వేల కోట్ల పనులు, భదాద్రి ప్లాంట్‍కు సంబంధించి మరో రూ.10వేల కోట్ల పనులను మొత్తంగా రూ.35వేల కోట్ల పనులను బీహెచ్‍ఈఎల్‍కు అప్పగించారు.
కేంద్ర ప్రభుత్వం ఓ వైపు నవరత్నాల వంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, పెట్టుబడుల ఉపసంహరణ పేరిట వాటిని అమ్మకానికి పెడుతుండగా.. అటువంటి ఓ సంస్థకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‍రావు భారీ కాంట్రాక్టును అప్పగించి దాని మనుగడకు భరోసా కల్పించారు.

  • దక్కన్‍న్యూస్‍, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *