అంతర్జాతీయ పట్టణీకరణ

2060 నాటికి ప్రపంచ జనాభాలో 66% కంటే ఎక్కువ మంది
పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారు – ఐక్యరాజ్యసమితి అంచనా


(ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ 2021 జూన్‍ 5న మణికొండ వేదకుమార్‍ అధ్యక్షతన ‘ఎకో సిస్టమ్‍ రిస్టొరేషన్‍’ (Eco System Restoration)అనే అంశంపై జూమ్‍ మీటింగ్‍ ద్వారా ప్యానెల్‍ డిస్కషన్‍ నిర్వహించింది. ఈ సందర్భంగా NK.Patel, ప్రెసిడెంట్‍, ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ టౌన్‍ ప్లానర్స్ ఆఫ్‍ ఇండియా (ITPI), CMD – సన్‍ బిల్డర్స్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు)


ఈ రోజు మనం వివిధ ఒత్తిళ్లను తట్టుకునేందుకు నగరాలకు గల శక్తిసామర్థ్యాలు, మహమ్మారి అనంతర కాలంలో అర్బన్‍ ప్లానింగ్‍ భవిష్యత్‍ గురించి మాట్లాడుకుంటున్నాం. మహమ్మారులకు, అర్బన్‍ ప్లానింగ్‍కు గల సంబంధాన్ని పరిశీలిం చాల్సిన అవసరం వచ్చింది. అర్బన్‍ ప్లానింగ్‍ ప్రస్తావన వచ్చినప్పుడల్లా గ్రామీణ ప్రాంతా లకు వెళ్లిపోవడం, శాటిలైట్‍ ఏరియాకు వెళ్లిపోవడం లాంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి. 2060 నాటికి ప్రపంచ జనాభాలో 66 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తారని అంచనా. పట్టణాలకు ప్రజల రాక కారణంగానే మహమ్మారులు వస్తున్నాయన్న వాదన కూడా ఉంది. నగరాలకు, సాంక్రమిక వ్యాధులకు మధ్య ఎప్పుడూ సంబంధం ఉంటూనే ఉంది. ప్రాచీన భారతీయ నగరాలైనా సరే… లేదంటే న్యూయార్క్ లేదా లండన్‍ నగరాలు లాంటివైనా సరే. అవన్నీ సాంక్రమిక వ్యాధులతో ముడిపడినవే. ఇలాంటప్పుడే ఒక కీలక ప్రశ్న తలెత్తుతుంది. అసలు మనకు నగరాలు అవసరమా? నగరం అనేది వృద్ధికి సూచిక. అది పిరమిడ్‍లో కింది భాగంలో ఉండే పేదలకు ఉద్యోగాలు కల్పిస్తుంది.

ఇక నగరం ప్రాథమిక లక్షణం ప్రజలు ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలగడం. అందుకే నగరానికి అత్యవసర పరిస్థితులు తప్పవు. నగరం ఒక కాస్మొపాలిటన్‍ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా జనసాంద్రత కూడా. ఇలాంటి సమయంలో నా మనస్సులో కొన్ని ప్రశ్నలు మెదలుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లేదా భవిష్యత్‍లో నగరాలు ఇలాంటి మహమ్మారులను తట్టుకునే శక్తిసామర్థ్యాలను ఎలా పొందగలుగుతాయి? పెంపొందించు కోగలుగుతాయి? అర్బన్‍ డిజైన్‍ లేదా బిల్డింగ్‍ డిజైన్‍ ఏ మేరకు సెన్సిటివ్‍గా ఉండాలి? అది ప్రజల నైతిక స్థైర్యాన్ని ఎలా పెంచుతుంది? ఇది ఒక మానసిక సమస్య. మీరు ఒక రూమ్‍, కిచెన్‍ మా త్రమే ఉన్న ఇంట్లో లేదా రెండు గదులు, కిచెన్‍ ఉన్న ఇంట్లో క్వారంటైన్‍లో ఉండాల్సిన పరిస్థితి వస్తే… పరిస్థితి ఏంటి? ఇంట్లో నలుగురు నుంచి ఆరుగురు కుటుంబసభ్యులు ఉన్నారనుకుందాం. అలాంటప్పుడు… క్వారంటైన్‍లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందనుకుంటే… ఇంటి డిజైన్‍ ఎలా ఉండాలి? ప్రి – ఫ్యాబ్రికేటెడ్‍ మాడ్యూల్స్తో పబ్లిక్‍ ప్లేసెస్‍ వేగంగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ముంబైలో మీరు చూసిన విధంగా, ముంబై మెట్రో పాలిటన్‍ రీజనల్‍ డెవలప్‍ మెంట్‍ అథారిటీ బాంద్రాలో పబ్లిక్‍ స్పేస్‍ను 2000 బెడ్‍ హాస్పిటల్‍గా మార్చింది. కేవలం పది రోజుల్లోనే ఈ ఘనతను సాధించింది. అందుకే బహుళార్థ సాధకాలుగా పని చేసే విధంగా పబ్లిక్‍ స్పేసెస్‍ను వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లాక్‍ డౌన్‍ సందర్భంగా అర్బన్‍ ఎకనామిక్స్ ప్రభావాన్ని తగ్గించుకో వడం ఎలానో ఆలోచించాలి.

మనం ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. నగరం నడిచేలా చేయాల్సి ఉంటుంది. పలు రకాల సేవలు అందించాలి. మహమ్మారి సమయంలో మనిషికి, మనిషికి మధ్య సంబంధం బాగా తక్కువ స్థాయిలో ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? మనం నగరాలను ఎలా ప్లాన్‍ చేయాలి? ఎన్నో సమస్యల మన అనుభవంలోకి వచ్చాయి. నగర ప్లానింగ్‍లో అంతరం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్లానింగ్‍ గురించి పునరాలో చిస్తున్నారు. ఆరోగ్యదాయక నగరాల రూపకల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అభివృద్ధికి అదే మొదటి పరామితిగా మారింది. ఇన్నాళ్లుగా మనం అవసరాన్ని బట్టి అభివృద్ధి ప్లాన్‍, రవాణా ప్లాన్‍, పర్యావరణ ప్లాన్‍ రూపకల్పనకి ప్రాధాన్యం ఇస్తూ వచ్చాం. హెల్త్ ప్లాన్‍ మాత్రం ప్రిపేర్‍ చేయలేదు. ఇకపై ఆరోగ్యానికీ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను బలోపేతం చేయాల్సి ఉంటుంది. తద్వారా అది ఆరోగ్యదాయక నగరంగా మారుతుంది. ఇక రెండోది గ్రీన్‍ సిటీ. మహమ్మారిని తట్టుకునేలా మాత్రమే కాదు… రేపటి నాడు దాని నుంచి తిరిగి పూర్వస్థితికి చేరుకునేలా కూడా నగరాలను మనం రూపొందించాలి. అందుకు గాను పునరుత్పాదక గ్రీన్‍ ఎనర్జీ మౌలిక వసతుల్లో మనం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రవాణాపరంగా కూడా మార్పు సాధించాలి. అది తప్పనిసరి. మనం నాన్‍ – మోటరైజ్డ్ ట్రాన్స్ పోర్ట్ను కూడా రూపొందించుకోవాలి. మోటరైజ్డ్, నాన్‍- మోటరైజ్డ్ రెండింటి సమ్మేళనంగా రవాణా వ్యవస్థ ఉండాలి.

గ్రీన్‍ సిటీ రూపొందించేందుకు లోకల్‍ మెటీరియల్‍ రీచార్జ్, రీసైకిల్‍, రీయూజ్‍ వ్యూహం ఒక ఎజెండాగా ఉండాలి. ఇక ఇప్పుడు ఇన్‍ క్లూజివ్‍ సిటీస్‍. పట్టణ పేదల గురించి మాట్లాడుకుందాం. వారి గురించి పెద్దగా డేటా మన వద్ద లేదు. ఎంత మంది పేదలున్నారు… ఎన్ని కుటుంబాలున్నాయి… ఒక ప్రాంతంలో ముప్పు అవకాశాలు… ఎలాంటి పారిశుద్ధ్యం అందుబాటులో ఉంది లాంటి వివరాలు ఏమీ లేవు. మహమ్మారులను ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు లేదా మహమ్మారి రహిత నగరాల విషయానికి వస్తే ఇలాంటి వివరాలు ఎంతగానో అవసర మవుతాయి. ఇక మరో విషయం… ముంబై, ఢిల్లీ ప్రాంతాల నుంచి భవన నిర్మాణ కూలీల వలసలు. పట్టణ పేదల ఆర్థికాంశాలు కూడా ఆందోళన కలిగించే విషయమే. వీరికి ఆవాసం, ఉపాధి, రవాణా సదుపాయాలు కల్పించడం గురించి కూడా ఆలోచించాలి. వారి ఆవాసాలకు 10 లేదా 15 కి. మీ. దూరంలో ఉపాధి కల్పిస్తే, అది అంత మంచిదేమీ కాదు. ఇలాంటి వాటిని గతంలో మనం చూశాం. బహుశా ప్రతి నగరం కూడా అలాంటి అనుభవం ఎదుర్కొని ఉంటుంది. పట్టణ పేదల ఆవాసాలు దుర్విని యోగమవుతున్నాయి. ఎవరి కోసం ఉద్దేశించారో వారికి అవి దక్కడం లేదు. అందుకు గాను పట్టణ పేదల కోసం అందుబాటు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి. నగరం అభివృద్ధి చెందబోయే ప్రాంతాల్లో అవి ఉండాలి.


సురక్షితకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. బిల్డింగ్‍ డిజైన్‍, ఆఫీస్‍ లేఅవుట్‍ దానికి అనుగుణంగా ఉండాలి. అవన్నీ కూడా నూతన ప్రొటొకాల్స్కు అనుగుణంగా ఉండాలి. అంటే నగరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణం కొనసాగుతుంది. అదే సమయంలో శివార్లు కూడా వృద్ధి చెందుతుంటాయి. సిటీ అనేది వ్యాపారం, వాణిజ్యం, నాలెడ్జ్ లాంటి వాటన్నిటికీ కేంద్ర బిందువుగా ఉంటుంది. కార్మిక వర్గాల మొబిలిటీ అనేది ప్రధానంగా నగరం వృద్ధి చెందబోయే ప్రాంతాల్లో ఉంటుంది. సిటీ అనేది గవర్నన్స్ జోన్‍గా ఉంటుంది. స్వయంపోషకంగా కూడా ఉంటుంది.


ప్రపంచీకరణ, రెగ్యులేషన్‍, తదితర అంశాల నేపథ్యంలో భారతీయ అర్బన్‍ ప్లానర్‍ను ప్రభావితం చేసే నూతన అంశాలేమిటనే విషయం చూద్దాం. వీటిలో మొదటిది పట్టణ జనసాంద్రత. దాని తరువాత అందుబాటులో హౌసింగ్‍, పబ్లిక్‍ స్పేసెస్‍, అర్బన్‍ మూమెంట్‍, అర్బన్‍ ప్లానింగ్‍, డిజిటల్‍ టెక్నాలజీ, గవర్నన్స్ అండ్‍ పబ్లిక్‍ హెల్త్, సుస్థిరదాయక అభివృద్ధి లాంటి అంశాలుంటాయి. జనసాంద్రత విషయానికి వస్తే, ఒక నగరానికి ఆరోగ్యదాయకమైన జనసాంద్రత ఎంతగా ఉండాలి? మహమ్మారులు చాలా వరకు యాంటీ అర్బన్‍ గానే ఉంటాయి. అదే సమయంలో ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలకు సంబంధించి మనకు జనసాంద్రత అవసరమవుతుంది. ఇవన్నీ ఒక పవర్‍ హౌస్‍ లాంటివి. హాంకాంగ్‍, సింగపూర్‍, తైపీ లాంటి నగరాల్లో జనసాంద్రత అధికం. ముంబై, ఢిల్లీ, కోల్‍కతా లాంటి నగరాల్లో పోలిస్తే వాటిలో జనసాంద్రత రెట్టింపుగా ఉంటుంది. అయినా కూడా అవి కరోనా మహమ్మారిని బాగానే అదుపు చేయడం మనం చూశాం. అందుకే జనసాంద్రత అధికంగా ఉందనడాన్ని మహమ్మారి విస్తరణకు ఓ కారణంగా చెప్పలేం. ఈ అంశంపై ఒక సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ల్యాండ్‍ మ్యాన్‍ రేషియోను గనుక చూస్తే, భారత్‍లో అది ప్రతీ పౌరుడికి ఒక ఎకరా కంటే తక్కువగానే ఉంది. చైనాలో అది ఒక్కొక్కరికి 3 ఎకరాలుగా ఉంది. అంటే భూమి అనేది మనకు మరింత విలువైందిగా మారింది. పట్టణ ప్రాంతంలో భూమి కొరత మరింత తీవ్రంగా ఉంది.


ఇక జనసాంద్రత అంటే ఏంటో చూద్దాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే రద్దీ. దాన్ని మనం కొలవవచ్చు. అది ప్రజల మధ్య ఉండే దూరం. ఒక యూనిట్‍ ప్రజలకు అందుబాటులో ఉండే లివింగ్‍ స్పేస్‍నే డెన్సిటీగా వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు ముంబైలో దారావి ప్రాంతంలో అనధికారిక మురికివాడల్లో జనసాంద్రత అధికం. గాలి, వెలుతురు లాంటి వాటిపై కూడా జనసాంద్రత ప్రభావం ఉంటుంది. ఇక దీన్నే మరో రకంగా కూడా చెప్పవచ్చు. రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి పట్టే సమయాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. ఉదాహ రణకు ఒక ప్రాంతం నుంచి హాస్పిటల్‍కు వెళ్లేందుకు సాధారణ సమయాల్లో 15 నిమిషాలు పడితే, రద్దీ స మయాల్లో ఒక గంట సమయం పట్టవచ్చు. ఇలా ప్రయాణానికి పట్టే సమయాన్ని బట్టి కూడా డెన్సిటీని చెప్పవచ్చు.


భూమి గరిష్ఠ సద్వినియోగం, అందుబాటు ధరల్లో హౌసింగ్‍, ఇళ్ళ రకాలు, ఎంత ఓపెన్‍ స్పేస్‍ ఉండాలి లాంటి అంశాలను కూడా పరిశీలించాలి. 14 రోజుల క్వారంటైన్‍ సమయంలో లేదా లాక్‍ డౌన్‍ కాలంలో ఉండేందుకు రెండు గదుల చిన్నపాటి ఆవాసం కావాలి. దానికి తోడుగా ఇతర పౌర సదుపాయాలు ఉండాలి.
ఇక రెండో అంశం అందుబాటు హౌసింగ్‍. దీని విషయానికి వస్తే, మహమ్మారిలను నిరోధించేందుకు న్యూ యార్క్ పబ్లిక్‍ హౌసింగ్‍ పోగ్రామ్‍ను చేపట్టింది. దారావి (ముంబై), ఢిల్లీ, అహ్మదాబాద్‍లలో కూడా ఆరంభ దశలో వైరస్‍ ఇలానే మురికివాడల్లో విస్తరించింది. మురికివాడలను అప్‍ గ్రేడ్‍ చేయడం కూడా ఓ సమస్యగా మారింది. ఓ నగరానికి స్థలం పెద్దగా లేకపోతే ఏంటి పరిస్థితి? అహ్మదాబాద్‍, హైదరాబాద్‍ లాంటివి సమీపంలో ఎంతో భూమిని కలిగిఉన్నాయి. అదే సమయంలో భూమి కొరత తీవ్రంగా ఉండే ముంబై లాంటి నగరాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటికి అందుబాటు హౌసింగ్‍ కోసం మరో విధమైన ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. సాధారణ రెసిడెన్షియల్‍ రియల్‍ ఎస్టేట్‍ తరహాలో వారు కొనలేరు. కనీసం 10 బై 10 ఫీట్‍ గదిని కూడా వారు కొనలేరు. ఇలాంటి వారికి పబ్లిక్‍ హౌసింగ్‍ కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వలస కార్మికుల కోసం సామర్థ్యపూర్వక రెంటల్‍ మార్కెట్‍ను ఏర్పరచాలి. వారి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. అక్కడ జనసాంద్రతను తరువాతి కాలంలో నియంత్రించవచ్చు. జనసాంద్రత అంశంపై తరువాతి కాలంలో దృష్టి పెట్టవచ్చు.


సింగపూర్‍ను గనుక ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ అందుబాటు హౌసింగ్‍ అందించారు. రెండు దశాబ్దాల క్రితమే వారు దాన్ని ప్రారంభించారు. ప్రతీ పేద వ్యక్తికి అందుబాటు హౌసింగ్‍ లభ్యమయ్యేలా చూశారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. విధానాలు అమలు చేశారు. పీఎంఏవై ఒక్కటే విజయం సాధించింది. సరైన హౌసింగ్‍ పాలసీలు లేనందువల్లే దేశంలో మురికి వాడలు అధికమైపోతున్నాయి. అవసరమైతే ఫ్లోర్‍ స్పేస్‍ ఇండెక్స్ విస్తరించడం లాంటి చర్యలు తీసుకొని అందుబాటు హౌసింగ్‍ను అధికం చేయాలి. పబ్లిక్‍ హౌసింగ్‍ స్కీమ్‍ను ఎలా మెరుగుపర్చవచ్చో ఆలోచించాలి. ఉపాధి అవకాశాలను అధికం చేయాలి. ఇక మూడో అంశం పబ్లిక్‍ స్పేసెస్‍. వీటికి సంబంధించి మనకు అత్యవసర ప్రణాళికలేవీ లేవు. ప్రతి నగరానికి కూడా అత్యవసర సన్నద్ధత ఉండాలి. ఈ సందర్భంగా పబ్లిక్‍ స్పేసెస్‍ను చక్కగా నిర్వహించడమెలా అనే ప్రశ్న ఉదయిస్తుంది. మనం గ్రీన్‍, బ్లూ, గ్రీన్‍, బ్రౌన్‍ మౌలిక వసతులను తెలివైన రీతిలో మిళితం చేయాలి. అందుకు పబ్లిక్‍, ప్రైవేటు ఫైనాన్స్లను ఉపయోగించు కోవాలి. నగరంలో పెద్ద పెద్ద పబ్లిక్‍ స్పేసెస్‍ ఉండాలి. తిరిగి ప్రాంతాల వారీగా వార్డు స్థాయిలోనూ చిన్న చిన్న పబ్లిక్‍ స్పేసెస్‍ ఉండాలి. వాటిని పొందేందుకు రకరకాల విధానాల్లో కృషి చేయాలి. అహ్మదాబాద్‍ విషయానికి వస్తే చిన్న చిన్న ఓపెన్‍ స్పేసెస్‍ కలిగి ఉంది. ప్రతీ ఓపెన్‍ స్పేస్‍ కూడా ఒక ఎకరా కంటే తక్కువ స్థలంలోనే ఉంది. అవి రకరకాలుగా ఉన్నాయి. చిన్న పిల్లల పార్కులు, పెద్దల కోసం పార్కులు ఉన్నాయి. మహమ్మారి పరిస్థితుల్లో ఈ విధమైన ఓపెన్‍ స్పేసెస్‍ను ఎలా వినియోగించుకోవచ్చో ఆలోచిం చాలి. డెవలప్‍ మెంట్‍ కంట్రోల్‍ నియమ నిబంధనల్లో మార్పులు రావాలి. నైబర్‍ హుడ్‍ డిజైన్‍, ప్రజలు ఎలా సోషలైజ్‍ కావాలి లాంటి అంశాల గురించి ఆలోచించాలి. ఇలాంటి అంశాల్లో చైనా నుంచి పాఠాలు నేర్చు కోవాలి. చైనా 16 పబ్లిక్‍ స్పేసెస్‍ను అతి త్వరగా మేక్‍ షిఫ్ట్ హాస్పిటల్స్గా మార్చివేసింది. ఇలా ఓపెన్‍ స్పేసెస్‍ను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న అంశంలో విభిన్న అప్రోచ్‍లు ఉండాలి.


నేడు ఎన్నో కంపెనీలు తమ సిబ్బంది ఇంటి నుంచే పని చేసేందుకు వీలు కల్పిస్తున్నాయి. మరి కొన్నేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చేసే ఉద్యోగానికి, ఆవాసానికి మధ్య దూరం అనేది పరిగణనలోకి లేకుండా పోయింది.


మహమ్మారి సమయంలో లోకల్‍ సప్లయ్‍ చెయిన్‍, లోకల్‍ మాన్యుఫ్యాక్షరింగ్‍ చెయిన్‍ పూర్తిగా మూసుకు పోయాయి. అందుకే ప్లానింగ్‍ దశలోనే ప్రత్యామ్నాయ సరఫరా చెయిన్‍ మార్గంపై కూడా దృష్టి పెట్టాలి. లాక్‍ డౌన్‍ సమయంలోనూ సిబ్బంది అవసరం ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, కిరాణా సరుకులు, కార్పొరేషన్‍ సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతీ ప్రాంతానికి వారు చేరుకోగలిగేలా ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి.


గ్లోబల్‍ వార్మింగ్‍ విషయానికి వస్తే ప్రతీ మూడు సెకన్లకు ఒక ఫుట్‍ బాల్‍ గ్రౌండ్‍ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అడవిని మనం కోల్పోతున్నాం. అందుకే సుస్థిరదాయకత అనేది మన విధానం కావాలి. చైనాల్లో సైకిళ్ల వినియోగం 187 శాతం పెరిగింది. అందుకే తగిన రవాణా మార్గాలు ఎంచుకోవాలి. వాటిలో నడక, సైక్లింగ్‍కు సురక్షిత ఉండాలి. కొవిడ్‍ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలకూ సెన్సిటివ్‍ రోడ్‍ నెట్‍ వర్క్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో వర్క్ ఫ్రమ్‍ హోమ్‍ విధానంలో ఉన్న వారికి అవసరమైన మౌలిక వసతులు ఇంట్లో ఉండవు. అలాంటి వారి కోసం రెండు, మూడు నైబర్‍ హుడ్‍ జోన్లకు కలిపి ఒక చోట వర్క్ స్టేషన్‍ను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మనం సిటీ సెంటర్‍లోనే ఉండాల్సిన అవసరం లేదని గుర్తించాలి. శివారు ప్రాంతాలకు వెళ్లవచ్చు. అది ఆర్థికంగా మరింత చౌక, లాభదాయకం కూడా. మరింతగా ఆచరణసాధ్యం కూడా.


పట్టణ రవాణా విషయంలో ఎదురయ్యే సవాళ్ళను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. మన రహదారులు బాగా ఇరుగ్గా ఉంటాయి. ప్రజారవాణా వ్యవస్థ చాలా పేలవగా ఉంది. పట్టణ రవాణాలో కార్బన్‍ ఫుట్‍ ప్రింట్‍ను తగ్గించుకోవడం ఎలానో కూడా ఆలోచించాలి. ఇలాంటి అంశాలకు సంబంధించి డేటా ఎంతో ముఖ్యం. ప్రయాణికులు ఉపయోగించే రవాణా సాధనాలు లాంటి వివరాలు సేకరించి అందుకు తగ్గట్లుగా ప్లాన్‍ చేయాలి. ఎలక్ట్రిక్‍ వాహనాలను ప్రాధాన్యం ఇవ్వాలి. కోల్‍కతా వంటి నగరాల్లో భిన్న రవాణా ఎంపికలు ఉన్నాయి. వాటన్నిటినీ సమగ్రపరిచే వ్యవస్థ మాత్రం లేదు. స్మార్ట్ కార్డ్ ఉపయోగించి భిన్న రవాణా సాధనాల్లో ప్రయాణించగలిగే అవకాశాన్ని కల్పించాలి. అలాంటి వినూత్న అంశాలు ఇప్పుడు అవసరం.


ఇక అర్బన్‍ ప్లానింగ్‍ విషయానికి వస్తే, ఇక ఆఫీస్‍ స్పేస్‍ శకం ముగిసిపోయినట్లేనా? కాదు. ప్రస్తుత పరిస్థితి తాత్కాలికం మాత్రమే. లింకేజ్‍ను ఇప్పుడు సిటీ స్థాయి నుంచి రీజనల్‍ స్థాయికి తీసుకెళ్లాలి. 60 కి.మీ. దాకా లింకేజ్‍ ఏర్పాటు చేయాలి. ఇక చివరగా… మహమ్మారులను అదుపు చేయడంలో డిజిటల్‍ టెక్నాలజీ కూడా కీలకపాత్ర వహిస్తుంది. అందుకు అవసరమైన డేటాను సమర్థంగా సేకరించాల్సి ఉంటుంది.

  • అనువాదం : యన్‍.వి.యం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *