కొలిపాక తీర్థం చారిత్రక భాగ్యనగరమా, శాపగ్రస్త పురమా?


కొలనుపాకకు ‘కొల్లిపాక’, ‘కొట్టియపాక’, ‘కొల్లియపాక’, ‘కొల్లిహాకే’ అనే పేర్లు శాసనాలలో, ‘బింబావతిపురం, కుదుటనగరం, సరోవరకుటీరం, సోమశేఖరపురం, కుళుదపురం, కుల్పాక్‍’ అనే పేర్లు స్థానికమైనవని తెలుస్తున్నది. కొల్లిపాక అనే పేరు 18వ శతాబ్దం వరకు కొనసాగినట్లు రావూరి సంజీవకవి ‘వీరనారాయణ శతకం’వల్ల తెలుస్తుంది. నిజాం కాలంలో కుల్పాక్‍ అని పిలువబడ్డది. 3వ నిజాం సింకిందర్‍ జా (క్రీ.శ.1803-1829) ‘నవాబ్‍ మీర్‍ జైన్‍ లాబొద్దీన్‍ ఖాన్‍ సత్వత్‍ జంగ్‍ బహరాముద్దౌలా భైరాముల్‍ ముల్క్’కు ‘కుల్పాక్‍’ను జాగీరుగా ఇచ్చాడు.


కొలనుపాక చారిత్రకంగా తొలుత బౌద్ధక్షేత్రం. కొలనుపాకకు తూర్పున వాగు ఒడ్డున దొరికిన మట్టిఒరల బావులే ఇక్కడ బౌద్ధారామా లున్నాయనడానికి సాక్ష్యం. అమరావతిలో జరిగిన ‘కాలచక్ర’ కార్యక్రమానికి కొలనుపాక నుంచి తీసుకెళ్ళిన బౌద్ధస్తూపానికి చెందిన ఆయకస్తంభం, బుద్ధుని శిల్పం, అధిష్టానపీఠం, వజ్రపాణి శిల్పాలు, కొలనుపాక పురావస్తుశాఖ మ్యూజియంలో ఈశాన్యమూలన ఉన్న తలలేని బుద్ధశిల్పం కూడా కొలనుపాక బౌద్ధధర్మనిలయ మనడానికి నిదర్శనాలు. అంతేకాదు పురావస్తుశాఖ మ్యూజియం దక్షిణం గోడల్లో వున్న బౌద్ధజాతకకథల శిల్పాలు కూడా సాక్ష్యాలే. కాని, ఏ చరిత్రకారుడు కూడా కొలనుపాకలో బౌద్ధం వుందని ఒక్కమాట కూడ రాయలేదు.


ఆరేడు శతాబ్దాలదాక కొలనుపాక బౌద్ధమత కేంద్రమే. ఎనిమిదో శతాబ్దం నుంచి జైనతీర్థంగా మారింది. కొలనుపాకలోని దేవాలయాలన్నింటిలో జైనశిల్పాలు కని పిస్తాయి. 9వ శతాబ్దంలో రాష్ట్రకూట చక్ర వర్తులైన 1వ అమోఘవర్షుడు, అకాలవర్షుల (2వ కృష్ణుడు) బంధువు, రాజప్రతినిధి అయిన శంకరగండరస కొలనుపాక రాజధానిగా కొలనుపాక-20,000ల నాడును పాలించాడన డానికి క్రీ.శ.888నాటి ఆమనగల్లు శాసనం ఆధారం.


కొలనుపాక రాజధానిగా రాష్ట్రకూటుల తర్వాత కళ్యాణీ చాళుక్యులు పాలించారు. కళ్యాణీ చాళుక్యులు కొలనుపాక-7000ల నాడును రాజధానిని చేసుకున్నారు. 1వ సోమేశ్వరుడు కళ్యాణీలో రాజధాని నిర్మించినా కనే పశ్చిమచాళుక్యులు కళ్యాణీచాళుక్యులని పేరుపొందారు. తర్వాత వరుసగా కందూరిచోడులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, వెలమలు, బహమనీలు, మొఘలులు, కుతుబ్షాహీలు, ఆసఫ్జాహీల పాలనలో ఉన్నది కొలనుపాక.


కళ్యాణీ చాళుక్యరాజులలో శైవాన్ని, జైనాన్ని అభిమానించిన, అవలంబించిన వారున్నారని వారు వేయించిన శాసనాలవల్ల తెలుస్తున్నది. కళ్యాణీచాళుక్యులకు ఆద్యుడైన 2వ తైలపుడు (క్రీ.శ.973-997) జైనమతావలంబకుడు. మెదక్‍ జిల్లా కొల్చారంలో తాను ప్రతిష్టించిన పార్శ్వనాథుని విగ్రహం పాదాలవద్ద ‘తైలపరసర్‍’ అనే నామశాసనముంది. అతని తర్వాతి పాలకుడు సత్యాశ్రయుడు-ఇరివెబెడంగ (క్రీ.శ.997-1008), 5వ విక్రమాదిత్య (1008-1015), అయ్యన (1015), 2వ జయసింహుడు (1015-1042) వీరంతా జైనమతావలంబకులే.


కొలనుపాక-ఆరాధ్యశైవ పీఠం: పంచమఠాలు

జయసింహుని తర్వాత చాళుక్యప్రభువైన 1వ సోమేశ్వరుడు (త్రైలోక్యమల్లుడు) శైవమతావలంబకుడు. సోమేశ్వరుడు తన పేరుమీదనే కొలనుపాకలో సోమేశ్వరాలయం కట్టించాడు. ఇతడు వేయించిన శాసనాలలో కొలనుపాకలో, పొట్లపల్లిలో, రాయప్రోలులో పంచమఠాలకు దానాలు చేసిన ప్రస్తావనలు వున్నాయి.
శివాజ్ఞతో శివుని పంచముఖాల నుంచి పంచాచార్యులు పుట్టి వీరశైవమతాన్ని ప్రకటించారు. వీరిలో ‘శ్రీమద్రేవణ సిద్దస్య కొలిపాక పురోత్తమే! సోమేశ్వరలింగ జనన మావాసః కదళీపురే! (స్వయం భువాగమం, అధ్యాయం-9)’ ఆరాధ్యశైవ పంచాచార్యులలో రేవణసిద్ధుడు ప్రథముడు. వీరసింహాసనం అనే పీఠాధిపతి. మరుళారాధ్య ఉజ్జయిని, ఏకోరామారాధ్య కేదారనాథ్‍, విశ్వారాధ్యులు కాశీ, పండితారాధ్య శ్రీశైలంలలోని పీఠాధిపతులు. వీరివే పంచపీఠాలు. కాని, కొలనుపాకలో పంచమఠాల జాడలేదు.


కొలనుపాకలో లింగాయత మతం:
షడక్షరుడు రాసిన రాజశేఖరవిలాసంలో కొల్లిపాక శైవమతాచార్యుడైన రేణుకాచార్యుని జన్మస్థలంగా పేర్కొనబడ్డది. రేణుకాచార్యుడు స్వయంభులింగం సోమేశ్వరుని నుంచి ఉద్భవించి చివరికి అదే లింగంలో సిద్ధిపొంది నారట. షడక్షరుడు ‘తేనుకేశుడనే శైవాచార్యుడు లింగాయత మతాన్ని స్థాపించి రుద్రమునీశ్వరుడనే తన కొడుకునే మఠాధిపతిగా నియమించినాడ’ని రాసాడు. తేనుకేశుడు లింగాయతమత 5గురు ముఖ్యగురువులలో ఒకరు. తాను లింగాయత మఠాధిపతుల వంశంలోని చిక్కవీరదేవుని బంధువునని చెప్పుకున్నాడు. చిక్కవీరదేవుడు రుద్రమునీశ్వర వంశవ•క్షంలోని ఉద్ధన, గండబీశ్వర, అన్నడనీశ, రేవణసిద్ధి వంటివారికి సమవర్తి అని తెలిపాడు. వీరశైవాగమమును బట్టి రేణుకాచార్యుడే రేవణసిద్ధయ అని, అగస్త్యమహామునికి సిద్ధాంతశిఖామణిలోని ‘స్థతస్థల’ సిద్ధాంతాన్ని గురించి చెప్పినాడని ప్రతీతి.


సోమేశ్వరుని గుడి:
కొలనుపాకలోని ప్రధాన శివాలయం సోమేశ్వరాలయం. ఈ ఆలయంలోని లింగం నుండే రేవణసిద్ధారాధ్యుడు స్వయంభువుగా జన్మించాడంటారు. దాని పక్కన 4 ఆరాధ్యశైవుల పీఠాలుండాలి. ప్రస్తుతం సోమేశ్వరుని గర్భగుడికి ఎడమపక్కన గుడి (ఖాళీ), కుడిపక్కన (బీరప్పదేవుని పెట్టినట్లున్నారు) గుడి, అవతల చండికాంబగుడి ఉన్నాయి. సోమేశ్వరునికి ఒకటే గర్బగుడి. చాళుక్యులశైలిలో నిర్మాణమైన ప్రధాన సోమేశ్వర దేవాలయానికి అంతరాళం లేకపోవడం ఆలోచనీయం. గర్భగుడిలో నేలమట్టంగా వున్న రాతిమీద చెక్కిన శివలింగమే స్వయంభువు సోమేశ్వరుడుగా పూజింప బడుతున్నాడు. చండికాంబ గుడికి అంతరాళ, గర్భాలయాలున్నాయి. వాటి ద్వారశాఖల మీద లలాటబింబాలుగా గజలక్ష్ములున్నారు. ఈ గజలక్ష్ములు యోగాసన స్థితిలోవున్నారు. అంతరాళం ద్వారశాఖలమీది కలశాలు చాళుక్యశైలివి కావు. అయితే బాదామీ చాళుక్యుల నాటివి కావాలి. రాష్ట్రకూటులశైలిలో కూడా ఇట్లాంటి కలశాలు కనిపించలేదు. చండికాంబ గుడికి ఆవల గోడకానించి నిలిపిన రాష్ట్రకూటశైలి మహిషాసురమర్దని శిల్పం వుంది.


సోమేశ్వరునికి ఎదురుగా నిలిపిన నవగ్రహశిల్పఫలకం ఉంది. ఇది దక్షిణాది శిల్పశైలికి చెందినది కాదు. ఇటువంటివి పాల శకానికి చెందిన శిల్పఫలకం బీహార్లో, ఉత్తరప్రదేశ్‍ లో ఒక్కొక్కటి వున్నట్టు తెలుస్తున్నది. మరొకటి బ్రిటిష్‍ మ్యూజియంలో ఉంది. ఈ దేవాలయానికి ముఖమంటపం, నంది మంటపాలు తర్వాత చేర్చినట్లున్నాయి. సోమేశ్వరలింగానికి ఎదురుగా నవగ్రహఫలకం వెనక కాకతీయ శైలి సమలింగం మంటపంలో చేర్చి(ప్రతిష్టితం కానట్లు)వుంది. దానిమీద ఇత్తడితో చేసిన పంచముఖ మహేశ్వరుని శిరస్సు (తొడుగువంటిది) పెట్టివుంది. లింగానికి ఎదురుగా బాదామీ చాళుక్యశైలి 64 గంటలపట్టెడతో నంది వుంది. ఒక లింగంవున్న చతురస్రాకార ఫలకం, చిన్ననంది. మంటపంలో పాదాలు చెక్కిన రాతిబిల్ల అగుపిస్తుంది. వరుసగా పేర్చినట్లున్న శిల్పాల వరుస చిత్రమైన పద్ధతి. ఒకశిల్పంతో మరొక దానికి శైలితో, కాలంతో సంబంధమే లేదు. ఎన్నిసార్లు ఈ గుడి మార్చబడ్డదో అనడానికి ఇవే నిదర్శనాలు. మంటప స్తంభాలన్నీ రాష్ట్రకూటశైలితో వున్నాయి. ఇవెక్కడివి?


దేవాలయ మంటపం దక్షిణంగోడకు నడుమ కూల్చగా మిగిలిన చిన్న అడ్డుగోడ శకలం వుంది. దానిమీద శైవద్వార పాలకుడు పక్కన ఏనుగుతో కనిపిస్తున్నాడు. ఆ గోడమీద విల్లమ్ములతో వీరుడు కూడా వున్నాడు. ఎక్కడా కనిపించని ఏనుగు, ద్వారపాలకుల కలయిక ఏ కాలంనాటిది? మంటపానికి ఉత్తరదిశలో చిన్న కోనేరు వుంది. కోనేరు గుడిలోపల వుండదు. అంటే మొదట ఈ కోనేటి నైరుతి మూల వరకే గుడి వుండేది. ఆ తర్వాత గుడిద్వారాన్ని కూల్చి మంటపాన్ని పెంచారు. మనకు పాతమంటపం మీదికి చూరు ఎక్కించికట్టిన కొత్తమంటపం అంచు కనపడుతున్నది. సోమేశ్వరుని గుడికి ఉత్తరందిశలో ఏకాదశ లింగమంటపం వుంది. నిజానికి ఈ మంటపం గుడి బయట వుండాల్సిన కళ్యాణమంటపం వంటిది. ఆ ఖాళీలో కొత్తగా ఏర్పాటు చేసిన లింగాలివి. గుడిలోపలికి ప్రవేశించే ద్వారం మీద లోతైన గీతలతో చెక్కిన పాతకాలం అంటే రాష్ట్రకూటులనాటి రెండుకలశాలున్నాయి. గుడికి ఈశాన్యం ఖాళీ. కాని అక్కడికి చేర్చిన రెండుచేతుల జైన వినాయకుడున్నాడు. హనుమంతుడు, ధ్వజస్తంభం ఇక్కడెందుకు పెట్టినారో.


ఈ గుడికి పునాదిలేదు. వెనకవైపు నుంచి చూసినపుడు గోడలు సమానంగాలేవు. సోమేశ్వర దేవాలయాన్ని ఏ వాస్తునిర్మాణ శైలిలోకట్టారో అంతుపట్టడం లేదు. గోడలవెనక (సాధారణంగా బౌద్ధారామా లున్నచోట కనిపించే) రాతికనీలతో కట్టిన చతురస్రాకారపు బావి కనిపిస్తుంది. సోమేశ్వరుని గుడికి నైరుతిలో కోటొక్క లింగంగా పిలువబడుతున్న సహస్రలింగాంకిత శివలింగం కాకతీయశైలి వేది అధిష్టానం మీద ప్రతిష్టితమై వున్నది. అంతరాళం, గర్భాలయమున్న ఈ గుడికే కాకతీయ మహారాణి కాకతి రుద్రమదేవి కానుకలిచ్చినట్టు శాసనమున్నది. రుద్రమభర్త వీరభద్రునికి అరణంగా యివ్వబడ్డ రాజ్యం కొలిపాక. వీరభద్రుని లెంక నిశ్శంక పోతినాయక కొలనుపాకలో ‘వంశవర్ధన కుల్య (కాలువ?)’ తవ్వించాడు. వీరభద్రుని తండ్రి ఇందుశేఖరుడు సోమనాథునికి 30 నివర్తనాలు భూదానం చేసాడు.


సోమేశ్వరునిగుడికి ఉత్తరదిశలో రెండు గుడులున్నాయి. వాటిలో ప్రతాపరుద్రునిగుడిగా పిలువబడే, పునర్నిర్మాణానికి నిరీక్షిస్తున్న గుడి వాపీ, స్తూప పర్యంతం కాకతీయశైలి దేవాలయం. దాని ముందర గుడి శిథిలరూపంలో వుంది. సోమేశ్వరదేవాలయానికి దక్షిణం వైపున కూడా శిథిలాలయాలే.
సోమేశ్వరదేవాలయానికి ముందర దీర్ఘచతురస్రాకారపు ప్రదేశంలో ప్రస్తుత పురావస్తుశాఖ ప్రదర్శనశాల వుంది. ఉత్తర,దక్షిణాలలో రెండు వరండాలతో కనిపించే ఈ నిర్మాణం పడమట ఎదురెదురుగా రెండు, ఉపాలయాలు, మధ్యలో ఒక ఆలయ ప్రవేశద్వారం వున్నాయి.


ఈ ద్వారం నుంచే ప్రస్తుతం సోమేశ్వరుని గుడిలోనికి వెళ్ళే దారి వుంది. ఈ ద్వారం సోమేశ్వరునిగుడి ప్రవేశద్వారానికి ఎదురుగా లేదు కొంచెం పెడగా వుంది. నిజానికిది దారికాదు. అక్కడొక గుడివుండాలి. అక్కడున్న ద్వారశాఖలను, లలాటబింబాన్ని పరిశీలించినపుడు ఈ ద్వారం కళ్యాణీ చాళుక్యుల పూర్వశైలిలో చెక్కబడ్దది. ఇక్కడ ఒక గర్భగుడి వుండి వుండాలి. లేదా ఈ ద్వారాన్నే ఎక్కన్నుంచైనా తెచ్చి ఇక్కడ బిగించి వుండాలి. ఈ ద్వారం ముందర వరండా, వరండా ముందుకు పెంచి కట్టిన కొత్తమంటపం. ఎదురుగా జైనమానస్తంభం, ఒక నందిమంటపం ఉన్నాయి. మ్యూజియంలో సేకరించిన విగ్రహాలతోపాటు కాకతీయశైలి నంది ఇక్కడికి తెచ్చినదై వుంటుంది.


వీరనారాయణ దేవాలయం:
కొలనుపాక పాలించిన పారమారజగద్దేవుని (క్రీ.శ.1104-1110) సామంతుడు సోమలదండనాయకుడు (ఆలేటి కంపణం పాలకుడు) ‘జగద్దేవ నారాయణాలయం’ కట్టించాడు. ఈ గుడికి పెంచి కట్టిన మంటపం కప్పు మొత్తం జైనశిల్పాలు, జైనబసదుల రాళ్ళే వాడబడ్డాయి. ముందటి నారాయణుడేమైనాడో తెలియదు. కాని, ఇపుడు గుడిలో ఉన్నది 16వ శతాబ్దపుశైలి మీసాల లక్ష్మీనారాయణుడే వీరనారాయణుడుగా పిలువబడుతున్నాడు. నారాయణమూర్తి విగ్రహం అడుగునుండే కూసం అధిష్టానపీఠం తొలిలో సరిగా కూర్చుండబెట్టలేదు. విగ్రహం పక్కకు ఒరిగి కనిపిస్తుంది. దానికో పుక్కిటిపురాణం కథ చెప్తారు. వీరనారాయణగుడి చుట్టు గతంలో వుండే అష్టదిక్పాలకులు, మరికొన్ని శిల్పాలు కూడా ఇపుడు కనపడడం లేదు. (తరువాయి వచ్చే సంచికలో)

శ్రీరామోజు హరగోపాల్‍,
ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *