తప్పెటగుళ్ళు – నీలబోను సత్యం


‘‘నారాయణ, శ్రీమన్నారాయణ’’ అనే ఒక పదం ‘రంగస్థలం’ సినిమా స్వరూపాన్నే మార్చి చిట్టిబాబు అన్నను చంపిన హంతకులను హతమార్చి రంగస్థలంకు క్రొత్త సర్పంచ్‍ను ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేస్తుంది. నృత్యం చేస్తూ గంభీరమైన ముఖ వర్చస్సుతో, పొడగాటి జుట్టు, మెలితిరిగిన మీసాలతో ‘శ్రీమన్నారాయణ’ అనే పదాన్ని పాటరూపంలో పలికిన వ్యక్తి పేరే ‘నీలబోను సత్యం’. అతడు ఆడిన నృత్యం పేరే ‘తప్పెటగుళ్ళు’.


ఛాతిపైన ఒక తప్పెటగుండు (బోలుగా ఉన్న చిన్న గుండ్రటి డప్పు) గజ్జెలలాగు, కాళ్ళకు గజ్జెలు, ఒకేరంగుతో కూడిన బనియన్‍, మెడలో కాసులు, చెవిదిద్దులతో క్షణానికి ఒక స్టెప్పు వేస్తూ, గాలిలోనే (మండీలు) గిరికీలు కొడుతూ, లయబద్దంగా, గంటలకొద్దీ ఆడే ఆ నృత్య కళ పేరే ‘తప్పెటగుళ్ళు’. ఉత్తరాంధ్రలో ఈ నృత్యకళ గురించి తెలియని వారు లేరు. ఈ కళ, సాహిత్యంపై ఉభయ తెలుగు రాష్ట్రాలలో యూనివర్సిటీ స్థాయిలో పరిశోధనలు జరుగుతుండడం సంతోషించాల్సిన విషయం.
తాను నమ్ముకున్న నృత్యకళను తన వారసత్వంగా, తనకున్న ముగ్గురు కుమారులకు నేర్పిస్తూ, జీవనం గడవడం ఎంతకష్టమైనా జాతీయ స్థాయిలో తప్పెట గుళ్ళ నృత్యకళకు గుర్తింపును, ప్రాముఖ్యతను, ప్రచారాన్ని తెస్తున్న కళాకారుడే ‘నీలబోను సత్యం’.


విజయనగరం జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన (జి.ఆర్‍.కె.పురం) గోపాలకృష్ణ రంగరాయపురం నుండి జాతీయ స్థాయికి, ప్రపంచస్థాయికి ‘తప్పెటగుళ్ళ’ కళను తీసుకెళ్ళడంతో పాటు, లిమ్కా బుక్‍ ఆఫ్‍ రికార్డ్ను సొంతం చేసుకోవడం, గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎక్కడైనా నృత్య కళను ప్రదర్శించడం, బ్రతికి ఉన్నంతకాలం ఈ నృత్య కళాభివృద్ధికే తోడ్పడతా నని ప్రమాణం చేయడమంటే అతని జీవితమే ‘తప్పెటగుళ్ళు’ అని సత్యంను దాని నుంచి వేరు చేసి చూడలేమని ఇట్టే అర్థం అయిపోతుంది.
‘నీలబోను సత్యం’ విజయనగరం జిల్లా గోపాలకృష్ణ రంగరాయపురం గ్రామంలో ఆలగొల్ల (యాదవ) కులంలో జన్మించాడు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆలగొల్లలు ‘గావుపండగలు’ చేసుకున్నప్పుడు ప్రదర్శించే నృత్య కళ ‘తప్పెటగుళ్ళు’. ఇది ఎక్కువగా యాదవులు, కుర్మలు ప్రదర్శిస్తారని చెప్తుంటారు. సత్యంగారు దాదాపుగా 1988 నుండి ఈ కళనే నమ్ముకొని బ్రతుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కళ కోసమే బ్రతుకుతున్నారు. ఇతడు 5వ తరగతి వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు అప్పలస్వామి, గంగవ్వ. భార్య తేజమ్మ, కుమారులు తిరుపతి, అలివేలు, రామలక్ష్మణులు (కవలలు). ముగ్గురు కుమారులు చదువుతో పాటు ఈ నృత్య కళలో ప్రావీణ్యం సంపాదించారు.


సత్యంగారికి ఈ విద్యను నేర్పిన గురువులు దేవరాయులు, గుడిపూడి పైడయ్య, 1991 నుండి గురువుగా మారిన సత్యం విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లోని గ్రామాల్లో నెలల తరబడి ఇళ్ళు వదిలి అక్కడే ఉండి రాత్రిపూట యువకులకు ఈ కళా విద్యను నేర్పుతూ కృషి చేస్తున్నారు. బృందంలో 20 నుండి 30 మంది కళాకారులు ఉంటారు.


తప్పెటగుళ్ళు వేషధారణ – ప్రదర్శన రీతులు – ప్రత్యేకతలు
మువ్వల నిక్కరు, కాళ్ళకు గజ్జెలు, తలపాగా, తాశా ఆకారంలో ఉన్న డప్పును చాతికి కట్టుకోవడం, నడుముకు ముందు, వెనక రెండులంగోటాలు, నడుము చుట్టూ బంతులు మెడకు కాసులు, చెవిదిద్దులు చాలా చూడముచ్చటగా, కొత్తదనంగా తప్పెటగుళ్ళ కళాకారుల ఆహార్యం కనిపిస్తుంది. కొంతమందికి పొడగాటి జుట్టు, గంభీరమైన మీసాలు కూడా ఉండి చూపరులను ఆకట్టుకుంటాయి.


తప్పెటగుళ్ళ కళా ప్రదర్శన కత్తిమీద సాములాంటిది. దీనిలో సమపాదం, స్థిఆవర్తము, శకటాస్య, అధ్యర్థిక అనే విన్యాసాలు పాదాలను మార్చుతూ చేస్తారు. కళా ప్రదర్శనలో మొగ్గలువేయడం చెట్లు కట్టడం, ఫల్టీలు కొట్టడం, కంటితో సూదితీయడం, నోటితో నీటి బిందెలు తీయడం, మండీలు (మోకాళ్ళపై ఎగిరి కిందపడడం), గుంజీలు తీయడం, మట్టికుండపై నాట్యం. ఇందులో ఏది కుడి ఎడమైనా కాళ్ళు, చేతులు విరగడం ఖాయం.


సాధారణంగా పాట, సంగీతం, నాట్యం చేసేవాళ్ళు వేర్వేరుగా ఉంటారు. కానీ తప్పెటగుళ్ళు నృత్యకళలో చేతులతో (డప్పు) తప్పెట వాయించడం, పాటపాడటం, కాళ్ళతో గంతులు వేయడం అన్ని రకాలుగా కలిస్తేనే ఇందులో రాణించగలము.


శశిరేఖా పరిణయము, ఎల్లమ్మకథ, సాంబదేవుడి పెళ్ళి, చెంచులక్ష్మి సారంగధర చరిత్ర, మాలవారి మంగమ్మ, రెల్లి అప్పమ్మ, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రచారాలు (కుటుంబ నియంత్రణ) కథలుగా చెప్తారు.
ఇవన్నీ పైడితల్లి జాతర విజయనగరం, విశాఖ జానపద ఉత్సవాలు, గావుసంబరం, దేవుని సంబరం, గంగమ్మ పండుగ, సింహాద్రి అప్పన్న జాతర, దేవీ నవరాత్రి ఉత్సవాలు, గణేష్‍ ఉత్సవాలు, మరియు తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్సవాల్లో ప్రదర్శిస్తారు.


ప్రదర్శన కోసం ముందుగా అన్నీ సమకూర్చుకుని కబురు అందగానే అందరూ ఒకే దగ్గరకు చేరుకునేలా చేస్తారు సత్యం. వీరి శిష్యులు ఉత్తరాంధ్రలోని ప్రతిజిల్లా, మండలంలో కనీసం 30 మంది ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఎంతో ప్రతిభ ఉండి ఎందరో శిష్యుల్ని కలిగి ఉన్న సత్యంగారు ఉపాధి లేకపోయినా తప్పెటగుళ్ళ కళను బ్రతికించటం కోసమే పాటు పడుతూ వందల వేల కి.మీ. ప్రయాణం చేస్తూ కళ బ్రతికితే చాలు అనే ఆలోచనలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో సరై వలస, కొత్త వలస, సీతానగరం, తాళ్ళ బురిడి, పార్వతీపురం, కుంచిరెడ్డిపాలెం, బొండపల్లి, పెద్దపల్లి, బాడంగి, కోటిపల్లి, ఇంగులపల్లి, ఇందూపురం, బాలకృష్ణాపురం, యరంధ్ర, మరుపల్లి, గజపతినగరం. శ్రీకాకుళం జిల్లాలో కాకిపాలెం, అప్పల అగ్రహారం, ముక్తపాలెం విశాఖ జిల్లాలో శివాజిపాలెం, ఆర్లి, చిత్తన్నపేట, కుషులవాడ, గొండుపాలెం గ్రామాలలో శిక్షణ యిచ్చి తప్పెటగుళ్ల నృత్య కళను అభివృద్ధి చేసారు.


నీలబోను సత్యం ఈ గ్రామాలన్నీ తిరుగుతూ ప్రతీ గ్రామంలో నెల రోజులు నివాసం ఉండి వారికి పాలు, విన్యాసాలు, రాగం, కథలు అన్నీ నేర్పించి ఒక బృందాన్ని తయారు చేస్తాడు. ఆ బృందం చేత వివిధ సందర్భాల్లో, జాతరలలో, ఎ.పి.టూరిజం కార్యక్రమాలలో పాల్గొని ప్రదర్శనలు ఇప్పిస్తుంటాడు. ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న కళ, దీన్ని పది కాలాలపాటు సమాజంలో ఉండేలా చేయాలన్నదే తన లక్ష్యం అని చెప్తాడు సత్యం వినమ్రంగా.


నీలబోను సత్యం ఇచ్చిన జాతీయస్థాయి ప్రదర్శనలు

  • నాగాలాండ్‍ రాజధాని ‘కోహిమా’లో ఎపి.టూరిజం జానపద కళారూపం తరుపున పాల్గొని ప్రదర్శన ఇచ్చాడు.
  • పశ్చిమ బెంగాల్‍లోని కలకత్తాలో ఎపి. టూరిజం జానపద కళారూపం నుంచి పాల్గొని ప్రదర్శనలు ఇచ్చి బహుమతి పొందారు.
  • ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‍లో ప్రదర్శన ఇచ్చి అభిమానులను సంపాదించారు.
  • పూరీలో జగన్నాధ రథ యాత్ర సందర్భంగా వరుసగా 3 సం।।లు పలు ప్రదర్శనలు ఇచ్చారు.
  • న్యూ ఢిల్లీలోని శిల్పారామంలో, హర్యానాలోని సూరజ్‍ ఖండ్‍ మేళాలో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
  • దూరదర్శన్‍ బెంగళూరు, ఆకాశవాణి బెంగళూరు వారి ఆహ్వానం మేరకు ప్రదర్శనలు ఇచ్చారు.
  • తెలంగాణలో హైద్రాబాద్‍ శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రదర్శన యిచ్చారు.
  • చెన్నై జాతీయ నృత్య కళా పోటీలో పాల్గొని ప్రధమ బహుమతి పొందిన సత్యం గారికి బిరుదులు, గౌరవాలు కూడా దక్కాయి.
  • గండీపెండేరంతో కనకాభిషేకం చేసిన వివిధ సంస్థలు ‘నృత్య కళారత్న’ అనే బిరుదును కూడా ప్రధానం చేశాయి.


సినీ ప్రస్థానం :
ఈ మధ్య కాలంలో సినిమాలలో ఈ కళను ఒకటి రెండు నిమిషాల నిడివితో చూపిస్తుండటం వల్ల కూడా విశేష ఆదరణ లభిస్తుంది.
‘రంగస్థలం’ సినిమాలో రామ్‍చరణ్‍ సరసన పాటకు నృత్యం చేశారు. ఇంకా ఆర్‍. నారాయణమూర్తి గారి ‘అన్నదాత సుఖీభవ’, ‘పలాస’, ‘వెంకీ మామ’, ‘నమో వెంకటేశా’!, నాగార్జున, నాని కలిసి నటించిన ‘దేవదాసు’ సినిమాలో కూడా ఈ తప్పెటగుళ్ళ నృత్యాలు ప్రాచుర్యం పొందాయి.


ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇంత ప్రతిభ ఉండి ఇన్ని ప్రదర్శనలు ఇచ్చినప్పటికి కూడా ‘నీలబోను సత్యం’ అతని శిష్యులు దినసరి కూలీలుగానే మారారు. వీరు గుంటూరు, విజయవాడ మొదలగు ప్రాంతాల్లో వలసపోయి బ్రతుకు తున్నారు. వీరి ప్రదర్శన సమాజ శ్రేయస్సు కోసం, సంఘంలో స్నేహభావం, శ్రమతత్వాన్ని నేర్పుతూ నృత్యకళను సజీవం చేసుకోవాలన్నదే సత్యంగారి తపన.


ప్రభుత్వాలు కళాకారులకు పింఛను కానీ, ఏదైనా ఉపాధికానీ చూపి సహాయ సహకారాలు అందిస్తే మా బతుకులకు భరోసా ఉంటుందని సత్యంగారు ఆవేదన వ్యక్తం చేశారు. సింహాద్రి అప్పన్న ఉన్నంతకాలం ‘తప్పెటగుళ్ళు నృత్యకళ’ బ్రతికే ఉంటుందని సత్యం ఆశాభావంతో ఉన్నారు.


(నీలబోను సత్యం, ఫోన్‍ : 9000548924, జి.కె.ఆర్‍.పురం గ్రామం, బొబ్బిలి ఫోస్ట్, విజయనగరం జిల్లా)
-తెల్జారి గిరీశం, ఫోన్‍ : 916030655

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *