నిర్ణయం

గోడ గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. శోభ మనసులో ఆందోళనగా ఉంది. ఆ రోజు లెక్కల పరీక్ష. ఇప్పటి వరకు రాసిన పరీక్షలు బాగానే రాసింది. ఇదే చివరి పరీక్ష. మళ్ళీ ఒకసారి ముఖ్యమైన లెక్కల సూత్రాలు చూస్తూంది. ఇంకా గంట మాత్రమే ఉంది. ఈసారి శోభ చాలా పట్టుదలతో చదివింది. క్లాసులో ఇప్పటి వరకు ఎప్పుడూ మొదటి ర్యాంకు రాలేదు. కనీసం మొదటి మూడు ర్యాంకులలో ఏదో ఒకటి తనకు రావాలి. అందుకే ఈ సంవత్సరం చాలా కష్టపడి చదివింది.
శోభ క్లాసు బయట నిల్చుని ఉంది. పిల్లలంతా పుస్తకాలు పట్టుకొని లెక్కలు చూస్తున్నారు. శోభ మనసులో ఎందుకో గుబులుగా ఉంది. అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి. ముఖ్యమైన సూత్రాలు మరొకసారి గుర్తుకు తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తూంది. దూరంగా ఆఫీస్‍ రూం నుండి సుధాబిందు టీచర్‍ ప్రశ్నా పత్రాలు పట్టుకొని రావటం కనిపించింది. అందరూ క్లాసులోకి వెళ్ళారు. ఆమె క్లాసులోకి వచ్చీ రావటంతోటే ‘బెస్టాఫ్‍లక్‍ మైడియర్‍ స్టూడెంట్స్’ అంటూ నవ్వింది. గంట మోగింది. అందరూ పుస్తకాలు తలుపు దగ్గర పెట్టి వచ్చి వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. లెక్కలు సులువుగా చేసే అనిత శోభ పక్కన కూర్చుంది. టీచర్‍ ప్రశ్నాపత్రాలు జవాబు వ్రాసే కాగితాలు అందరికీ ఇచ్చింది. శోభ ఆతృతగా పరీక్ష పత్రం చూసింది. అన్ని లెక్కలూ కష్టంగానే అనిపించాయి. కానీ లెక్కలన్నీ తను ఇంటి దగ్గర చూసుకున్నవే! అందరూ లెక్కలు చేయడంలో మునిగిపోయారు. హాలులో, సూది కిందపడినా వినిపించేటంత నిశ్శబ్దం. లెక్కలు రానివారు అటూ ఇటూ దిక్కులు చూస్తున్నారు. సమయం గడిచిపోతూ ఉంది. శోభ దాదాపు అన్ని లెక్కలు చేసింది. కాని ఆ లెక్కలన్నీ కరెక్టేనా అని అనుమానంగా ఉంది. ఇంకా ఇరవై నిముషాల టైముంది. మళ్ళీ ఒకసారి చూద్దామనుకుంది. పక్కనే కూర్చున్న అనిత కూడా పేపర్‍ మళ్ళీ ఒకసారి చూసుకుంటుంది. ‘అనిత జవాబులతో తన జవాబులు పోల్చి చూసుకొంటే…’ అనే ఆలోచన వచ్చింది. కాని అంతలోనే..


‘‘నీ పక్కన కూర్చున్న వాళ్లు నీ కంటే తెలివి తక్కువ వాళ్ళు అని గుర్తుంచుకోండి’’ అని టీచర్‍ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. శోభ ప్రతీసారి అనిత పేపర్‍ చూద్దామనుకొనే సరికి ఈ మాటలు గుర్తుకొస్తున్నాయి. అదే సమయంలో అనిత పేపర్‍ చూసుకోవడం అయిపోయింది. ‘‘అయ్యో!’’ అనుకుంది శోభ విచారిస్తూ. అనిత మళ్ళీ ఒకసారి తన పేపరు చదువుకొంటూంది. ఇదే సమయం అనుకొని శోభ టీచర్‍ మాటలు పక్కకు నెట్టి అనిత పేపర్‍ వైపు చూసింది. ఆమె ఆన్సర్‍లకు, తన ఆన్సర్‍లకు తేడా ఉంది. శోభకు ఒక్క క్షణం భయమేసింది. తన లెక్కలన్నీ తప్పుగా ఉన్నాయి అనుకుంది. తొందర తొందరగా తన ఆన్సర్లు కొట్టి వేసి అనితకు వచ్చిన ఆన్సర్లు వేసింది. కాని మనసులో ఏదో తెలియని అసంతృప్తి. సమయం అయిపోతోంది.
‘‘ఇంక పది నిమిషాలే ఉంది’’ అని వినిపించాయి టీచర్‍ మాటలు. శోభ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొంది. ‘ఎందుకో తన లెక్కలు సరిగ్గానే ఉన్నాయనిపిస్తూంది. తను అంత కష్టపడి చదివింది. తనపై తనకు నమ్మకం ఏర్పడింది. ఇలా ఆలోచించిన శోభ అనిత పేపర్లో చూసి వేసిన ఆన్సర్లు కొట్టి వేసి తనకొచ్చిన ఆన్సర్లు మళ్ళీ వేసింది. ఒక విధమైన ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నిర్ణయం తీసుకొని గబుక్కున లేచి టీచర్‍కు పేపర్‍ ఇచ్చేసి బయటికి వచ్చేసింది.
పరీక్ష సమయం అయిపోయింది. పిల్లలంతా పరీక్ష గురించి చర్చిస్తూ బయటికి వస్తున్నారు. మళ్ళీ వారం తర్వాత ఫలితాలు ప్రకటిస్తారని చెప్పారు. పిల్లలంతా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.


ఏప్రిల్‍ 6వ తేదీ ఉదయమే పిల్లలంతా రంగు రంగుల దుస్తుల్లో వచ్చారు. వారి ముఖాల్లో మాత్రం భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూంది. సుధాబిందు టీచర్‍ పోగ్రెస్‍ కార్డ్సు తీసుకొని రావటం గమనించి అందరూ క్లాసులోకి వెళ్ళి కూర్చున్నారు.
‘‘గుడ్‍మార్నింగ్‍! ఏమిటీ, అందరూ అలా నిశ్శబ్దంగా కూర్చున్నారు?’’ అంది. మేం ఎవరం ఏమీ మాట్లాడలేదు. టీచర్‍ నవ్వుతూ –
‘‘మీరంతా పదవ తరగతిలోకి ప్రమోట్‍ అయ్యారు’’ అంది. పిల్లలంతా ఒక్కసారిగా సంతోషంతో రిలాక్స్ అయినట్లు ఫీలయ్యారు. టీచర్‍ ఎవరెవరు ఎలా చదువులో అభివృద్ధి చెందారో క్లుప్తంగా చెప్పింది. అలాగే ఒకసారి పోగ్రెస్‍ రిపోర్ట్సును చూసి –
‘‘ఎప్పుడూ ఎవరైతే క్లాసు ఫస్ట్ వస్తున్నారో, ఈసారి వారు రాలేదు. కష్టపడి చదివిన వారే ఫస్ట్ వచ్చారు’’ అంది.
‘ఎవరు? ఎవరు? క్లాసులో గుసగుసలు మొదలయ్యాయి.
‘సరోజానా? విజయా..? సంతోషా..? అనితా..? అని తమలో తాము అనుకోసాగారు.
‘సైలెన్స్’ అంటూ టీచర్‍ చెప్పడం ప్రారంభించింది.
‘‘ఈసారి శోభ క్లాస్‍ ఫస్ట్ వచ్చింది. శోభకు లెక్కల్లో నూటికి నూరు మార్కులు వచ్చాయి.’’ అంది.
శోభ తన చెవులను తానే నమ్మలేకపోయింది. సంతోషంతో చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. క్లాసులో పిల్లలంతా చప్పట్లు కొడుతున్నారు. అందరివైపు చూసి తృప్తిగా నవ్వుతూ పొగ్రెస్‍ రిపోర్ట్ తీసుకొనేందుకు లేచింది. తన ఆత్మవిశ్వాసం, తన సరియైన నిర్ణయమే తనకు ఫస్ట్క్లాస్‍ తెచ్చిందని శోభ అనుభవపూర్వకంగా తెలుసుకుంది.


(1991 మార్చి – బాలచెలిమి)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *