‘గాంధీ మాలా బేత్లా’ అన్న కవితను వసంత్ దబాత్రేను గుర్జార్ అన్న మరాఠీ కవి రాశాడు. ‘గాంధీ నన్ను కలిశాడు’ అన్నది కవితా శీర్షిక తెలుగులో. అది ఓ వేయి పదాల కవిత. ఆ కవితని 1983లో గుర్జార్ రాశాడు. ఆయన వయస్సు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఆ కవితలో అశ్లీలం వుందని 1994లో ఓ క్రిమినల్ కేసు దాఖలైంది.
మహాత్మాగాంధీ తనని దేవాలయంలో, చర్చీలలో, మసీదులో అదే విధంగా ఓషో ఆశ్రమంలో, క్లెమ్లిన్‍లో, ముంచాయి రెడ్ లైట్ ఏరియాలో కలిసినప్పుడు అతను అంటే కవి గాంధీతో మాట్లాడిన అంశాలే కవితలోని సారాంశం. గాంధీ చెప్పిన విలువలు ఏ విధంగా భగ్నమైనాయో చెప్పే కవిత ‘గాంధీ మాలా బేత్లా’.
అతను కవితను రాసింది 1983లో, ఆయన ముంబాయి పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్గా పని చేసేవాడు. ఆ పోర్ట్ సమావేశాలు ఎక్కడ జరిగినా ఆ కవితను చదివి ఆ సమావేశంలో పాల్గొన్న తోటి ఉద్యోగులని ఆలోచింపచేసేవాడు గుర్జార్. చిన్న పత్రికల ఉద్యమం నడిపే అరుణ్ కొలాట్‍కర్ ప్రభావంతో గుర్జార్ తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించాడు. అరణ్య, గోడి, సముద్ర అన్న కవితా సంపుటాలని అతను ఇప్పటికే వెలువరించాడు. పసర అన్న కవితా సంకలనం అచ్చులో వుంది.
‘గాంధీ మాలా బేవ్లా’ అన్న కవితలో అతను అశ్లీలంగా ఏమీ రాయలేదు. గాంధీ బోధించిన విలువలు ఎలా ధ్వంసం అవుతాయన్న విషయాల గురించి ఆ కవితని రాశారు. అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంలో 1986లో ఆ కవితను గుర్జార్ చదివాడు. ఆ సమ్మేళనంలో ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. అందరూ ఆ కవితను మెచ్చుకున్నారు. ఆ కవిత మొదటిసారిగా అశోక్ సహహనే ప్రాస్ ప్రచురణగా వచ్చింది.ఆ తరువాత బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రచురించిన మ్యాగజీన్‍లో పునర్ముద్రితం అయ్యింది. అది లాటూరులో ప్రచురితం అయ్యింది. గుర్జార్ అనుమతి తీసుకోకుండానే తమ మ్యాగజీన్‍లో ఆ కవితను బ్యాంకింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రచురించారు.
ఆ కవితలో అశ్లీలత వుందని పతిత్ పావన్ సంఘటన లాటూర్‍లోని మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసుని దాఖలు చేసింది. ఆ కవితలో అశ్లీలత ఏమీ లేదని, ఎందుకు దాన్ని ఇంత హడావిడి చేశారో అర్థం కావడం లేదని కవి గుర్జార్ భావన. వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసుని క్రిమినల్ కోర్టులో దాఖలు చేశారు.
కేసుని ఉపసంహరించాలని చాలా మంది విజ్ఞలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఉపసంహరించాలని అనుకొంది. కానీ ఆ పతిత్ పావన్ సంఘటన వాళ్ళు గొడవ చేయడంతో ప్రభుత్వం తన ప్రతిపాదనని ముందుకు తీసుకొని వెళ్ళలేక పోయింది. ఫలితంగా లాటూర్ కోర్టు విచారణలో కేసు అలా వుండి పోయింది. కేసు విచారణలో వుండగానే 2001వ సంవత్సరంలో కవి గుర్జార్ పదవీ విరమణ చేశాడు.
తన కవిత ఉద్దేశ్యం ఫిర్యాదు చేసిన వ్యక్తులకి చెప్పడానికి, వివరించడానికి గుర్జార్ ప్రయత్నం చేశాడు. మహాత్మాగాంధీ విలువలు ఎలా ధ్వంసం అవుతున్నాయో ఆ కవితలో వివరించానని గుర్జార్ వాళ్ళకె చెప్పాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇప్పుడు వసంత్ గుర్జార్ వయస్సు 72 సంవత్సరాలు. ఆయన వుంటున్నది బొంబాయిలో. కేసు నడుస్తున్నది లాటూర్‍లో. ఈ కేసు భారం కన్నా ఈ దూరభారం అతను భరించలేక పోతున్నాడు ఈ వయస్సులో. ఈ కేసుని రద్దు చేయమని హైకోర్టులో దరఖాస్తు చేశాడు. కానీ ఫలితం లేక పోయింది. సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. అక్కడ కూడా ఆయనకి ఉపశమనం లభించలేదు.
ప్రతి కవితను అది రాసిన కాలమాన పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలి. ఈ రోజు వున్న పరిస్థితిని బట్టి కవితను చూడకూడదు. వసంత్ దతాత్రేయ గుర్జార్ ఆ కవితను రాసింది 1983వ సంవత్సరంలో. ఎమర్జెన్సీ అయిపోయింది. జయప్రకాశ్ నారాయణ్ చేసిన ఉద్యమం అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. జనతా ప్రభుత్వ ప్రయోగం విఫలమైంది. ఈ నేపథ్యంలో తాను ఆ కవితను రాసానని గుర్జార్ అంటున్నారు. కోర్టులు కేసులని త్వరగా తెమల్చకపోవడం వల్ల ఆ కేసు ఇంకా విచారణ దశలోనే వుంది.
ఇది ఇలా వుండగా సాహిత్య అకాడమీ ప్రచురించే మరాటీ కవితా సంకలనంలో ఈ కవితను ప్రచురిస్తున్నానని బాలచంద్ర నెమాడే, గుర్జార్‍కి తెలియచేశారు.
ధండా ఘోష్, కాలీసల్వార్, కోల్‍దో అన్న కథలు రాసిన సాదత్ హసన్ మంటో కూడా భారతీయ శిక్ష్మాస్మృతిలోని సె.292 ప్రకారం దాఖలైన కేసులను ఎదుర్కొన్నాడు.
కేసులు నిలుస్తాయని పెట్టరు.
కేసులు నిలవాలని పెట్టరు / కేసులు కేసు కోసమే పెడతారు.
మనిషిని వంగతీయడానికి పెడతారు.
మనిషిని లొంగదీయడానికి పెడతారు.
గుర్జార్ మీద పెట్టిన కేసు కూడా అలాంటిదే. అయితే ట్రయల్ అన్న శిక్షని ఎదుర్కోవడమే ఓ పెద్ద శిక్ష. ఆ శిక్ష అతని జీవితకాలంలో ముగుస్తుందా అన్నది సాహితీవేత్తలను వేధిస్తున్న ప్రశ్న.
భావ ప్రకటనా స్వేచ్ఛకి సంకెళ్ళు వేయడం లాంటిదే ఈ కేసు. 1983లో రాసిన కవిత మీద 1994లో ఫిర్యాదు చేయడం ఈ కేసులోని విషాదం. అదీ కవితని పునర్ ముద్రించినప్పుడు. ఆ పత్రిక బాధ్యులని కేసు నుంచి విముక్తి చేసి కవిని మాత్రమే విచారణని ఎదుర్కోమని చెప్పడం అత్యంత విషాదం.
–మంగారి రాజేందర్ (జింబో)
ఎ : 9440483001