కాంచీపురంలో ‘భుజంగం’ అనే తెలివైన దొంగ ఉండేవాడు. అతను తెలివిని ఉపయోగించి యుక్తిగా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భుజంగం దొంగతనానికి బయలు దేరాడు. ఆ ఊరిలోని షావుకారు ఇంటి వెనుకకు వెళ్ళి మెల్లిగా గోడ దూకాడు. ఒక్కసారిగా మంచి మిఠాయిల వాసన వచ్చింది. సహజంగా భోజన ప్రియుడైన భుజంగానికి, నగలూ, డబ్బూ బదులు మిఠాయిలు దొంగిలించాలనే కోరిక కలిగింది. ఇంటి వెనక గుమ్మంలోంచి లోపలికి వెళ్ళాడు. లోపల వంటవాడు లడ్డూలు చేస్తున్నాడు. భుజంగానికీ వెంటనే ఓ ఉపాయం తట్టింది. వంటవాడి దగ్గరకొచ్చి ‘‘మీకు పనిలో సాయపడమని షావుకారు నన్ను పంపించాడయ్యా’’ అన్నాడు వినయంగా. షావుకారు తనకు సహాయంగా ఒక మనిషిని పంపినందుకు సంతోషిస్తూ వంటవాడు.
‘‘చూడు! లడ్డూలన్నీ ఈ బుట్టలో వెయ్యి! అలాగే పొయ్యిలో బూడిదని ఈ బుట్టలో వేసి బయట పారేసిరా!’’ అంటూ రెండు బుట్టల్నీ అక్కడ పెట్టి బయటికి వెళ్ళాడు. భుజంగం ‘ఇదేమంచి సమయం’ అనుకుని, లడ్డూలన్నీ ఓ బుట్టలో పేర్చి, వాటిపైన కాగితం పెట్టి, కాగితం పైన కాస్త బూడిదను పోశాడు. అదే విధంగా ఇంకో బుట్టనిండా బూడిదనింపి, పైన కొన్ని లడ్డూలు పేర్చాడు. ఇప్పుడు లడ్డూలున్న బుట్ట బూడిద బుట్టలా, బూడిదబుట్ట లడ్డూలున్న బుట్టలా కన్పిస్తోంది. అటూ ఇటూ చూసి వంటవాణ్ణి పిలిచి –
‘‘మర్చిపోయా! షావుకారు ఓ తేనెసీసా ఇమ్మన్నాడు. వెళ్తూ షావుకారుకు ఇచ్చి వెళ్తా’’ అన్నాడు. వంటవాడు ఇచ్చిన తేనెసీసాను బుట్టపై పెట్టుకుని, బుట్టను ఎత్తుకుని బయటికి బయలుదేరాడు. భుజంగం చేసేదంతా ‘మధు’ అనే కుర్రాడు చూడనే చూశాడు. మధు మెల్లిగా భుజంగం వెనకే బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత –
‘‘బాబుగారూ! నేను ఆ బుట్టను మోస్తాను. ఓ రూపాయి ఇప్పించండి. పొద్దుటి నుంచీ ఏమీ తిన్లేదు’’ అన్నాడు దీనంగా ముఖంపెట్టి. భుజంగానికి జాలికలిగి ‘సరే’ అంటూ బుట్టను మధు తలపై పెట్టాడు. ఇద్దరూ ఒకరిపక్క ఒకరు నడవసాగారు.
‘బుట్టలో ఏమున్నాయండి?’ మధు అడిగాడు.‘తేనెగుడ్లు’ సమాధాన మిచ్చాడు భుజంగం.
‘తేనెగుడ్లా!’ అవేంటిబాబూ! అన్నాడు తెలియనట్లు ముఖంపెట్టి.
‘వెధవా! తేనెగుడ్లు అంటే తెలీదా! ఆ గుడ్లు పిల్లవుతాయి’ అన్నాడు చికాకుగా.
‘మరి సీసాలో ఏముందండి?’ మళ్ళీ ప్రశ్నించాడు.
‘విషం’ అన్నాడు కోపంగా.
మధు మౌనంగా కొద్దిదూరం నడిచి హఠాత్తుగా పరుగెత్తడం మొదలెట్టాడు. అది చూసి భుజంగం –
‘‘ఒరేయ్! పారిపోవాలని ప్రయత్నిస్తే ఏంచేస్తానో చూడు’ అని అరిచాడు.
మధు పరుగెడుతూ వెనక్కి తిరిగి –
‘‘నేను టీకొట్టు దగ్గరుంటా. మీరక్కడికి రండి’’ అన్నాడు.
‘‘అక్కడే ఆగకపోయావో నాచేతిలో చచ్చావన్నమాటే జాగ్రత్త’’ అన్నాడు భుజంగం
మధు తొందరతొందరగా పరుగెత్తి రోడ్డు పక్కనే ఉన్న చెట్ల గుబుర్లోకి వెళ్ళి, కాగితంపైన ఉన్న బూడిదను కింద పారబోసి లడ్డూలన్నీ కాగితంపైన వేశాడు. తేనె సీసాను మాత్రం ఖాళీబుట్టలో పెట్టుకుని టీకొట్టు దగ్గరికి వచ్చి బుట్ట నేలపై పెట్టి ఏడవటం మొదలెట్టాడు. అదిచూసి అందరూ గుమికూడారు. మధు ఏడుస్తూనే-
‘‘బుట్టలో తేనెగుడ్లు ఉండేవి. అవి ఒక్కొక్కటి తేనెటీగలై ఎగిరిపోయాయి. మా అయ్యగారికి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు’’ అన్నాడు.
‘‘వీడికేమైనా పిచ్చిపట్టిందా? తేనెగుడ్లు ఉండటమేంటి?’’ అన్నారు అందరు. కొద్ది సేపటికి భుజంగం అక్కడికి రానేవచ్చాడు. భుజంగాన్ని చూసి మధు ఇంకా గట్టిగా ఏడుస్తూ –
‘అయ్యగారూ! ఈ బుట్టలో తేనెగుడ్లు ఉన్నాయని చెప్పారా లేదా?’ అన్నాడు. ‘అవును చెప్పాను’ అన్నాడు భుజంగం.
‘‘నేను ఆ గుడ్లు పట్టుకుని వస్తుంటే అవి అన్నీ తెనెటీగలై ఎగిరిపోయాయి’’ అన్నాడు.
భుజంగం మధు తెలివికి ఆశ్చర్య పోయాడు. బుట్టలో తేనె సీసామాత్రం ఉంది. అదైనా మిగిలింది కదా అనుకుని సీసా తీసుకునేందుకు భుజంగం ముందుకు వంగాడు. అదే క్షణంలో మధు ఏడుస్తూ ఆ సీసా అందుకుని –
‘ఇంటికెళ్ళిన తర్వాత మీరు నన్ను ఎలాగూ చావ బాదుతారు. అక్కడ చచ్చే బదులు ఈ విషం తాగి ఇక్కడే చస్తాను’ అంటూ సీసాలోని తేనె అంతా గడగడా తాగేశాడు. అది చూసి భుజంగానికి ఒక్కసారిగా తల తిరిగి పోయింది.
నవంబర్ 1990 (బాలచెలిమి)