ఉపాధి కోల్పోతున్న వడ్రంగులు


విశ్వకర్మీయుల / విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగం. కలపతో వివిధ వస్తువులను తయారుచేయుట వీరి వృత్తి. వడ్రంగి పని చేయువారు ప్రతి ఊరున ఉంటారు. వీరు ఇళ్ళకు సంబంధించిన తలుపులు, కిటికీలు, ఇళ్ళ పైకప్పులు వంటివి మొదలుకొని ఇంట్లో సామాన్యంగా వాడుకకు ఉపయోగించు చెక్క పరికరాలు అన్నీ చేస్తుంటారు. సాంప్రదాయకంగా భారతదేశంలో విశ్వబ్రాహ్మణులు మాత్రమే తమ కులవృత్తిగా వడ్రంగం చేస్తుండేవారు. ఆధునిక కాలంలో ప్రతి వారూ వడ్రంగం నేర్చుకొని చేయుట మొదలెట్టారు. చేతిలో పనివుంటే దేశంలో ఎక్కడికైనా పోయి బతకవచ్చు, కులవృత్తికి ఏదీ సాటిరాదు అని సామెతలు. చెక్క ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటికి రూపమిచ్చేది వడ్రంగి.


వండ్రగి పనిముట్లు, పరికరాలు :
వడ్రంగి, చిత్రిక, సుత్తి, ఉలి, బాడిత
వడ్రంగి పనిలో తయారయ్యే వస్తువులు
వ్యవసాయానికి కావల్సిన కాడి, మేడి, నాగలి, బండి.. మొదలైనవీ, ప్రజలు జీవించడానికి కావల్సిన ఇల్లు, తలుపు, దార బంద్రం, పీట, మంచం.. మానవ జీవిత చరిత్రలో అభివృద్ధికి మొట్ట మొదటి మెట్టైన ‘చక్రం’… చక్కతో తయారయ్యే ప్రతిదీ… పిల్లలు ఆడుకున్నే బంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకూ, ఊయల నుండి పడవల వరకు.. తయారు చేసే మొట్ట మొదటి వుడ్‍ ఇంజనీర్‍.
ప్రస్తుతం వడ్రంగితో పనిచేయించుకుంటే ఆలస్యం అవుతుందని భావించి రెడీమెడ్‍ తలుపులు, డైనింగ్‍ టేబుళ్ళను కొనుగోలు చేయడంతో ఈ రకం చేతి వృత్తులు అంతరించి పోతున్నాయి. నెల పొడవునా పనిచేసినా కనీసం వెయ్యిరూపాయలు కూడా రాదని వడ్రంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవ•త్తినే నమ్ముకుని వందలాది మంది తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వచ్చారు. చేసే పనికి కూలీ గిట్టుబాటు కాక నేడు వారు నౌకర్లుగా, గుమస్తాలుగా వేరే పనుల్లో చేరుతున్నారు.


విశ్వకర్మ (వడ్రంగి)
వారి పేరు చివర ఆచార్య, ఆచారి, ఆచార్యులు అని ఉంటుంది. ‘విశ్వకర్మ’అనగా ‘కర్మకారులు’. రాయిని గాని, ఇనుమును గాని, కలప చెక్కను, రాగి/ ఇత్తడి/ కంచులను గాని, బంగారం గాని కరిగించి పోతపోసి నగిషీలు దిద్ది అందరికీ ఉపయోగపడే విధంగా రకరకాల వస్తువులను తయారుచేయగలిగిన నైపుణ్యాన్ని ‘శిల్పం’ అంటారు. విశ్వకర్మ శిల్పకారుడు. ఈ శిల్ప నైపుణ్యం క్రమంగా ఐదు ప్రముఖ విభాగాలగా విభజింపబడింది. అందువలనే విశ్వకర్మకు ఐదుగురు కుమారులన్నారు. ఇందులో ఇనుముతో పనిచేయువారిని ‘కమ్మరి’, చెక్కతో పనిచేయువారు ‘వడ్రంగి’, రాగిపని వారలకు ‘తామ్రకారులు, శిలతో పనిచేయు వారలను ‘శిల్పకారులు’ అలాగే బంగారంతో పనిచేయువారు ‘కంసాలి’ అన్నారు. సంస్కృతంలో లోహకార, వర్ధకి, తామ్రకార, శిల్పకార, స్వర్ణకార అన్నారు.


ఉత్తర భారతంలో వడ్రంగి కులంవారికి పేరు చివర ‘శర్మ’ ఉంటుంది. అదే విధంగా నార్త్ లో కమ్మరి కులస్థులకే ‘విశ్వకర్మ’ అని పేరులో ఉంటుంది. అలాగే ‘పాంచాల్‍ ‘అని కూడా పిలుస్తారు.


వృత్తికి దూరం.. విశ్వబ్రాహ్మణులకు అష్టకష్టాలు
చెక్క ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటికి రూపమిచ్చేది వడ్రంగి. ఆది నుంచి వ్యవసాయరంగానికి వారే కీలకం. తుమ్మ చెట్టు కొమ్మలను తీసుకొస్తే బడిశెతో చెక్కి నాగలి తయారు చేసేవారు. వారు ముందుంటేనే సాగు సాగేది. అయితే కాలక్రమేణ వ్యవసాయరంగంలో యంత్రీకరణ రావడంతో ఉపాధిపై ప్రభావం చూపింది. నాగలితో దున్నేవారు లేకపోవడం, ఉన్నవారు కూడా ఇనుప వస్తువులను కొనుగోలు చేసి సాగుకు ఉపయోగించడంతో పనులు లేక జీవనోపాధి కరువైంది. 80శాతం వరకు ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వలసలు పోయి ఫర్నీచర్‍, గృహాలకు సంబంధించిన వస్తులను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారిని గతేడాది నుంచి కరోనా వెంటాడుతుండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ పోషణ గగనమైంది.
ఒక్క తెలంగాణాలోనే విశ్వబ్రాహ్మణులు 10లక్షలకు పైగా ఉన్నారు.

కులవృత్తులే ఆధారం
‘విద్యలెన్ని ఉన్నా.. కుల విద్యకు సాటిరావు’ అంటూ వృత్తి గొప్పతనాన్ని వర్ణించాడో కవి. కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తేనే వృత్తిని ఆస్వాదించవచ్చు. తృప్తి పొందొచ్చు. గతాన్ని.. ప్రస్తుతాన్ని పరిశీలిస్తే కులవృత్తులపై ఆధారపడి జీవించే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. పారిశ్రామికీకరణ, ఆధునిక పోకడలు మార్కెట్లో ప్రవేశించడంతో వృత్తికి ఆదరణ లేకుండాపోయింది. అయినా జోగిపేట, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‍ లాంటి పట్టణాల్లో పలువురు దశాబ్దాల తరబడి కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు.
వృత్తినే దైవంగా భావిస్తున్నారు. కష్టపడి కుటుంబాలను పోషిస్తున్నారు. కొన్ని కుటుంబాలైతే పిల్లలతో పాటు అందరూ కూడా వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నారు. పిల్లలను ఉన్నతంగా చదివిస్తున్నారు.


ఉపాధి కోల్పోతున్న వడ్రంగులు..
సొంత ఇంటిని నిర్మించుకునే ప్రతి ఒక్కరికి వండ్రగితో పని ఉంటుంది. ఇంటికి అవసరమైన తలుపులు, కిటికీలు, దర్వాజాలు ఇతర సామగ్రి కోసం వండ్రగులను ఆశ్రయించాల్సిందే. అయితే ప్రస్తుతం మార్కెట్‍లో రెడీమేడ్‍ వుడ్‍ షాప్‍లు, కిటికీలు, తలుపులు లభిస్తుండడంతో వడ్రంగులకు గిరాకీ తగ్గింది. అంతేగాక రాజస్థాన్‍, గుజరాత్‍, యూపీ, మహారాష్ట్రల నుంచి వలస వచ్చిన వ్యాపారులు ఇక్కడ రెడీమేడ్‍ సామగ్రిని అమ్ముతున్నారు. దీంతో వడ్రంగులకు పని తక్కువై పోయింది.


విశ్వ బ్రాహ్మణుల డిమాండ్లు…

  • జీవో నెం.31తో కర్ర వృత్తిదారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ సమస్య నుండి పరిరక్షించాలి.
  • కొవిడ్‍ లాక్‍డౌన్‍తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద విశ్వబ్రాహ్మణులకు తక్షణం ఆర్థిక సాయం అందించాలి.
  • అనువంశిక సంస్కృతి, సాహిత్యాలు, అర్చక పౌరోహిత్యం, వాస్తు, జ్యోతిష్య పాండిత్యాన్ని పెంపొందించు కోవడానికి ప్రతి జిల్లాలో విశ్వకర్మ వేదపాఠశాలలు నెలకొల్పాలి.
  • ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో విశ్వకర్మ కమ్యూనిటీ హాల్‍ను ప్రభుత్వం నిర్మించాలి.
  • మహిళలకు బ్యాంకు రుణాలతోపాటు టైలరింగ్‍, పెయింటింగ్‍, బ్యూటీపార్లర్‍, ఫ్యాషన్‍ డిజైనింగ్‍, శారిమగ్గం వర్క్లో ఉచిత శిక్షణ ఇవ్వాలి.
  • వితంతు విశ్వకర్మ మహిళలకు పెన్షన్‍ ఇవ్వాలి.
  • 50ఏళ్లు నిండిన విశ్వబ్రాహ్మణుడికి పింఛన్‍ ఇవ్వాలి.
  • దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాలకు విశ్వకర్మ అర్చక, పురోహితులను నియమించాలి.
  • విశ్వకర్మ జయంతి రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించాలి.

వీరు కోరుకుంటున్న చిన్న కోరికలను తెలంగాణ ప్రభుత్వం నిండు మనస్సుతో ఒక్కొక్కటిగా త్వరలోనే నెరవేరుస్తుందని ఆశిద్దాం.


సువేగా,
ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *