పర్యావరణం-శాస్త్రం – నైతికత-తాత్విక దృక్పథాలు


మానవాళి చరిత్రలో పూర్వమెన్నడూ లేని విధంగా పర్యావరణ సమస్యలు, సంక్షోభాలు, సవాళ్ళు 21వ శతాబ్దానికల్లా అధికమయ్యాయి. ఇవి నానాటికీ మరింతగా పెరుగుతూ వస్తున్నాయి. పర్యావరణపరంగా మానవాళి ఎదుర్కోవలసి వచ్చిన ప్రతి సంక్షోభానికి మూల కారణం మానవులు నిర్వర్తించే కార్యకలాపాలలోనే దాగి
ఉందనేది వాస్తవం.


జనాభా పెరుగుతూ ఉండటం వలన సహజ వనరులు తగ్గిపోవడం, క్షీణించడం రెండు మూడింతలు అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వ్యర్థ విషపదార్థాలు పెరిగి భవిష్యత్‍ తరాలను అనేక విధాలుగా బాధించే అవకాశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచమంతటా అటవీ ప్రాంతాలు, అడవులు, వ్యవసాయభూములు, చిత్తడి నేలలు, పచ్చిక బయళ్లు వృద్ధి చేయబడుతున్నాయి. వినియోగంలోకి వస్తున్నాయి. తద్వారా సంక్షోభం మరింత ముదురుతున్నది.
ఒకవైపు ఓజోన్‍ పొర విధ్వంసం, ఫలితంగా ఏర్పడే గ్రీన్‍హౌజ్‍ ప్రభావం గ్లోబల్‍ వార్మింగ్‍కు దారి తీస్తున్నది. మొత్తం మీద మానవ కార్యకలా పాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ అంతకంతకు ముప్పును సృష్టిస్తున్నాయి.


ఇప్పటికే అతి తీవ్రస్థాయిలో ఏర్పడిన సంక్షోభాలు భవిష్యత్తులో రెండిం తలు కావటం జరుగుతుంది. వీటిని ఎదుర్కోవాలన్న, అధిగమించాలన్నా, పరిష్కరించాలన్నా కీలకమైన నిర్ణయాలను మానవాళి తీసుకోవలసి వస్తుంది. ఈ నిర్ణయాత్మక సందర్భంలో జరిగే లేదా తీసుకునే నిర్ణయాలలో ఏది సరైన నిర్ణయం? ఏది కాదనే సంశయం, సందేహం మానవాళికి వస్తుంది. ఏ నిర్ణయం మేలు చేస్తుంది? ఏది కీడు చేస్తుంది? ఏది ముప్పును నివారించగలగుతుంది? ఏది ముప్పుకు కారణమవుతుందనే చర్చ జరిగే నిర్ణయాలపై వస్తుంది. ఈ చర్చ విషయం ఎట్లా ఉన్నా అసలు సరైన నిర్ణయాలు తీసుకోవడమెలా అనే ప్రశ్న ఉత్పన్న మవుతుంది. సరైన నిర్ణయం తీసుకోవడమనేది ఎక్కడ మొదలవు తుంది? ఎక్కడ ముగుస్తుంది? తీసుకున్న నిర్ణయ ఫలితాలు ఎలా ఉంటాయి. మొదలైనవన్నీ ప్రశ్నార్థకాలుగానే ఉంటాయి.


అంటే పర్యావరణ సమస్యలు ఎదుర్కోవడానికి, పరిష్కరించ డానికి గాని నిర్ణయం – అమలు – ఫలితం అనే మూడు అంశాలు ప్రధానంగా దోహదపడతాయి. ఆ మాటకొస్తే ఇవ్వాళ ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని విధాల విపత్తులకు సమస్యలకు మూలం కూడా ఇంతకు పూర్వం తీసుకోబడిన నిర్ణయాలే. అయినప్పటికీ అవి అప్పటి తరానికి మేలు కీళ్లను సమానంగానే కలిగించాయి. అవి ఎంత లాభదాయకమైనవి అయినా వాటితో పాటు విధ్వంస పరిణామాలను ముందుకు తెచ్చాయి. కాబట్టి జరిగిన నిర్ణయాలను కాకుండా అసలు నిర్ణయక్రమాన్ని జాగ్రత్తగా పరిశీలించాలనే అవగాహన ఇటీవల కాలంలోని పర్యావరణ తాత్త్విక చర్చల ద్వారా వెలుగులోకి వచ్చింది.


ఈ కారణంగానే మానవాళి పాటిస్తున్న ఎథిక్స్ గురించిన చర్చ పర్యావరణ తాత్త్విక చర్చలో తరచుగా ప్రాముఖ్యం వహించింది. ఇప్పుడు ఎథిక్స్ అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. దీని గురించి ఈ విధంగా పేర్కొన్నారు.”The word ethics is derived from the Greek word ethos, meaning “Custom”. in This sense, ethics refers to the general beliefs, attitudes or standards that guide customary behavior”.


స్థూలార్థంలో నైతికత అని ఎథిక్స్ను పేర్కొనవచ్చు. అది ఒక కట్టుబాటు. సంప్రదాయం. జీవించే పద్ధతిని సూచించేది. ప్రవర్తనకు మార్గదర్శిగా ఉండేది. ప్రవర్తనా ప్రమాణాలను నిర్దేశించేది. దీనిలో సాధారణ నమ్మకాలు, వైఖరులు తదితరమైనవన్నీ ఉంటాయి. మరొక అర్థంలో పరస్పర హితార్థం అనివార్యంగా పాటింపవలసిన నియమబద్ధ జీవన ధర్మంగా కూడా భావించవచ్చు. ఈ నైతికత ఏం చేస్తుందనే విషయంగా ఆలోచించి నప్పుడు మరింత స్పష్టత వస్తుంది. పర్యావరణ తాత్త్విక చింతనకు సంబంధించిన వివరణ ఇట్లా ఉంది.’Ethics involve a self conscious stepping back from our lives to reflect on what we should do, how we should act, and what kind of people we should be” ఈ వివరణను బట్టి చూస్తే మానవులుగా మనమేంచేయాలి, ఏ విధంగా వ్యవహరించాలి? ఎటువంటి వ్యక్తులుగా మనముండాలి అనే విషయాలను స్వీయచైతన్యంతో ఆలోచించటం ప్రతిఫలనాత్మక యోచనతో ఉండటం ముఖ్యమని తేలుతున్నది. ఇవి మానవుల నైతికత (ఎథిక్స్)లో అంతర్భాగంగా ఉంటాయని అర్థం అవుతుంది.


దీనిలో మానవులుగా మనమేం చేయాలి అనేది ఆచరణకు సంబంధించింది కాగా, మనమెట్లా జీవిస్తాం అనేది కొంత అమూర్తతకు సంబంధించింది. అసలు మనం ఏం చేయాలి? దేనిని విలువగా పరిగణించాలి అనే ఆలోచన కూడా దీన్లో ఇమిడి ఉంది. ఈ విషయమై ఎంతో విస్తృతమైన చర్చ పర్యావరణ తాత్వికాంశాల గురించి జరిగింది. జరుగుతూ ఉన్నది. పర్యావరణం అనేది శాస్త్ర సంబంధమైన విషయం, సమస్య కాబట్టి శాస్త్ర, సాంకేతికమైన పరిష్కారాలు మాత్రమే దారి చూపుతాయనే వారున్నారు. పర్యావరణ సమస్యను కేవలం శాస్త్ర, సాంకేతిక అంశంగా కాకుండా ఒక జీవనవిధాన తాత్విక అంశంగా చూడాలనే అభిప్రాయంతో ఉన్నవారూ ఉన్నారు. ఈ రెండు అంశాలను నిలకడగా ఆలోచించవలసి ఉంది. అంటే ఒకరకంగా ఈ రెండు విధాలైన అభిప్రాయాలు ఒకటి శాస్త్రం మీద నమ్మక, విశ్వాసాలను బలపరిచేది రెండోది మానవ నైతికత గురించి యోజన చేసేదిగా భావించాలి. శాస్త్రం ఒక్కటే పరిష్కారం చూపలేదు అనేది ఒకటైతే, నైతికత మాత్రమే సమాధానం చూపదు అనేది రెండవ భావన.


శాస్త్రం – నైతికత :
పర్యావరణ సంబంధ సమస్యలకు సంబంధించిన విధాన నిర్ణయాలలో, ప్రజల సంస్కృతిలో శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారా పరిష్కారం దొరుకుతుందనే ఆశకూడా ఒకటి ప్రబలంగానే ఉంది. ఇందువల్ల శాస్త్రగత మార్గదర్శకాలపై విశ్వాసం కనబరుస్తారు. వీరి విశ్వాసంలో ఒక వాస్తవం ఉంది. అదేమంటే పర్యావరణ సమస్య అధికంగా సాంకేతిక విషయాలతో ముడిపడి ఉంటుంది. ఇది హేతు బద్ధంగానే ఉన్నట్లు భావించవచ్చు. నిజానికి క్రిమి సంహారకాల వాడకంలోని లాభ, నష్టాల గురించి ఒక తత్త్వవేత్త కంటే రసాయన శాస్త్రవేత్త బాగా చెప్పగలడు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రాధాన్యంలోకి వస్తుంది. అదేమంటే “Environmental issues raise fundamental questions about what we as human beings value, the kind of beings we are, the kind of lives we should live, our place in nature and the kind of world in which we might flourish”.


వీటికి సంబంధించి సైన్సు చెప్పగల అంశాలు ఏమీ లేవు. కాబట్టే పర్యావరణ సమస్యలు నైతిక, తాత్త్విక ప్రశ్నలను లేవనెత్తుతాయి కనుక, అవి మానవులు ఏ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలనేది నైతిక బోధించగలుగుతుంది. సైన్సు మీద ఎంత విశ్వాస నమ్మకాలు ఉన్నప్పటికి గమనించాల్సిన అంశం ఇదే. అందుకే పర్యావరణ సమస్యలకు సంబంధించిన నిర్ణయాలను విషయ నిపుణులైన శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి విడిచి పెట్టడమంటే, వీరి నిర్ణయాలు విలువల పరంగా తటస్థంగా ఉంటాయని కాదు. అవి వస్తు నిష్టమని కూడా కాదు. శాస్త్ర సాంకేతికతలమీద అధికంగా ఆధారపడుతూ ఉండటం సాధారణంగా జరిగేదే అయినప్పటికీ ఇదంత మంచిది కాదనే వాదం కూడా ఒకటి ఉంది. అయితే మానవ సంస్కృతిలో జ్ఞానం, సత్యం మొదలైన విషయాల గురించి ప్రశ్నించగల అధికారం అంతిమంగా శాస్త్రానికి ఉందనే నమ్మకం కూడ ప్రబలి ఉందన్న విషయాన్ని మరవకూడదు. పర్యావరణ సమస్యలనేవి ఏదో ఒక ప్రత్యేక అనుశాసన పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సాంకేతికాంశాలు కావు. పర్యావరణ సమస్యల కోణాలు ఎప్పుడూ ఏదో ఒక అనుశాసన పరిధి, పరిమితులకు లోబడి ఉన్నటువంటి అంశం కాదనే అవగాహన ఇక్కడ ముఖ్యం. ఉదాహరణకు క్రిమి సంహారకాలవల్ల ఏర్పడుతున్న కాలుష్యంలో వ్యవసాయ రంగం, జీవశాస్త్రంలోని వివిధ శాఖలు, రసాయన వైద్య, ఆర్థిక, రాజకీయ, న్యాయశాస్త్రాలు ఇమిడిపోయి ఉంటాయి.


కాబట్టే విలువలకు సంబంధించిన ప్రశ్నవేయకుండా ఏ పర్యావరణ సంబంధాంశం విడిగా లేదు. విలువల ప్రమేయం లేకుండా పర్యావరణ సమస్యలను యాంత్రిక పద్ధతిలో చెప్పుకున్నా, అర్థం వివరించుకున్నా మనకు పర్యావరణ సంబంధాల పట్ల ఉన్న అవగాహనను వక్రీకరణకు గురిచేసే అవకాశం ఉంది.
శాస్త్రం ఇచ్చే సమాచారం లేదా వాస్తవాల మీదనే మనం పూర్తిగా ఆధారపడటం కుదరదు. ముఖ్యంగా పర్యావరణ సవాళ్ళను ఎదుర్కోవటంలో శాస్త్రం మనకు ఎంత వెసులుబాటుతో ఉంటుందనేది కూడా ప్రశ్నార్థకమే. ఒకవేళ శాస్త్రం పేర్కొనే వాస్తవాలు నిశితమైనవి అయినా ఒక క్రమ పద్ధతిలో హేతుబద్ధంగా పరిశీలింపబడినవే అయినప్పటికీ ఆ వాస్తవాలు మాత్రమే పూర్తి విషయాలను ఆవిష్కరించవనేది గ్రహింపులో ఉండాల్సిన అంశం. అయితే ఏదైనా శాస్త్రం పూర్తి విషయాన్ని వివరించలేక పోయిందంటే అది ఆ శాస్త్ర సామర్థ్య రాహిత్యం కాదు సరికదా? ఆ శాస్త్రానికి ప్రశ్నలు సంధించటంలో ఉన్న పరిమితులుగా అర్థం చేసుకోవాలి. పరిమితులు ప్రశ్నలపరంగా ఏర్పడ్డప్పుడు, సమాధానాలలోనూ పరిమితులు వుంటాయి. పర్యావరణ పరంగా మనం శాస్త్రంపై ఆధారపడేముందు, అసలు శాస్త్రవేత్తలు అడిగే ప్రశ్నల గురించి తెలుసుకోవాలి. శాస్త్రవేత్తలు అడిగే ప్రశ్నలు ఎక్కువ సందర్భాలలో శాస్త్ర పరిధికి అవల ఉన్న కారణాలను నిర్ధారిస్తూ ఉంటాయి. ఈ పరిమితులను శాస్త్ర విషయంగా గుర్తించిన పర్యావరణ విశ్లేషకులు ఈ విధంగా చెపుతున్నారు.


“How we understand our world and, therfore how and what we value is significantly shaped by what science tell us about the world. The only serious alternative is to recognize that both science and ethics are essertial if we hope to make meaningful progress in meeting the environmental challenges that con front us”.


దీనిని బట్టి చూస్తే ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, విలువైనవిగా పరిగణించటమేనేది ప్రపంచం గురించి సైన్సు మనకు తెలియజెప్పే విషయాలమీద ఆధారపడి రూపు దిద్దుకుంటుంది.”Science with out ethics is blind, ethics with out science is empty”. కాబట్టే మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను పర్యావరణపరంగా పరిష్కరించాలంటే, అందుకు అర్థవంతమైన ప్రగతిని సాధించాలంటే ఈ రెండూ అవసరమే. ఒక తాత్విక దర్శనం లేకుండా వొట్టి శాస్త్ర సమాచారం ఉన్నప్పుడు పర్యావరణ సమస్యలు పరిష్కరించబడవు. తాత్విక ఆలోచనలు మాత్రమే ఉండి శాస్త్రజ్ఞానం లోపించినప్పుడు పరిష్కారము దొరకదు. పర్యావరణ విధానాలకు, వాటి నిర్ణయాలకు వ్యక్తి, వ్యవస్థాగతంగా ఈ రెండూ ఉపకరించే అంశాలు.


పర్యావరణం – నైతికత (Ethics)
పర్యావరణ నైతికత అంటే సహజ పర్యావరణానికి మానవులకు మధ్య ఉండే సంబంధాలను గురించి ఒక క్రమ పద్ధతిలో పరిగణన చేయటం. దీనిని ఇలా నిర్వచించవచ్చు”Environmental ethics assumes that moral norms can do govern human behavior towrds the natural world”
నైతిక నియమాలు ప్రకృతి ప్రపంచం పట్ల మానవ ప్రవర్తన ఎట్లా ఉండాలనే విషయాలను నిర్దేశిస్తుంది. పర్యావరణ నైతికత పర్యావరణ నైతిక సిద్ధాంతం ఈ నైతిక నియమాలు ఏమిటి? ఇవి ఎవరికి? మానవులకున్న బాధ్యతలు ఏమిటి? ఏ విధంగా ఇవి సమంజసమైనవి మొదలైనవాటి గురించి వివరిస్తుంది.
ప్రశ్నలను బట్టి భిన్న సమాధానాలను భిన్న పర్యావరణ నైతిక సిద్ధాంతాలు అందిస్తాయి. కొద్దిమంది తాత్వికులు సహజ ప్రపంచం పట్ల మానవులకు ఉన్న బాధ్యతలు పరోక్షమైనవని వాదిస్తారు. వనరుల పరిరక్షణ అనేది ఇతర మానవుల దృష్టిలో ఉంచుకొని నిర్వర్తించాల్సిన బాధ్యతగా దీనిని అభివర్ణించారు. ఈ వాదాన్ని మానవకేంద్రక వాదంగా వ్యవహరిస్తున్నారు. దీని ప్రకారం “Anthropcentric (“human centered”) ethics holds that only human beings have moral value, thus although we may be said to have responsibilites, regarding the natural world, we do not have direct responsibilities to the natural world”.
మానవ కేంద్రక నైతిక సిద్ధాంతం ప్రకారం మానవులు మాత్రమే నైతిక విలువ కలిగి ఉంటారు. సహజ ప్రపంచం పట్ల మనుషులకు బాధ్యతలున్నాయని చెప్పబడినప్పటికీ, సహజ ప్రపంచంలో మనుషులకు గల బాధ్యతలు పరోక్షమైనవే తప్ప, ప్రత్యక్షమైనవి కావు. దీనిని బట్టి చూసినప్పుడు మనుషులకు తమ సహజ ప్రపంచంలో ఉండాల్సిన ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను ఆధారం చేసుకుని నైతికతకు సంబంధించిన సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయని, వీటిని ప్రాతిపదికగా చేసుకుని పర్యావరణ చింతనాశీలుర ఆలోచనలు కొనసాగి ప్రభావితం చేశాయని అర్థం చేసుకోవచ్చు.


భవిష్యత్తు మానవ తరాలను లక్ష్యంగా చేసుకుని మన నైతిక బాధ్యతలుంటాయని గుర్తించడం ద్వారా మానవ కేంద్రక నైతిక సిద్ధాంతం కొంత విస్తరణను పొందుతుంది. ఈ విధానంలో అప్పటికి ఉనికిలో లేని మానవుల పట్ల కూడా మన బాధ్యతలు విస్తరించబడతాయి. మనుషులు మాత్రమే పరిగణనలో ఉండటం అనేది మానవ కేంద్రక దృష్టి. దీనిపై తొలినాళ్ల పర్యావరణ ఉద్యమంలో అనేక సమస్యలు చర్చకు వచ్చాయి. వనరులను కాపాడటం, అణువ్యర్థాల పంపిణి మొదలైనవి ఈ దృష్టికోణం కలవిగా పరిగణింప బడినాయి.
మానవకేంద్రక సిద్ధాంతమే కాకుండా, పర్యావరణ నైతిక సిద్ధాంతాలలో మరొకటి కూడా ఉంది. మానవేతర కేంద్రక పర్యావరణ సిద్ధాంతమిది. దీని ప్రకారం తాత్వికులు కొందరు చెప్పేదేమంటే మానవుల పట్లనే కాకుండా సహజ అంశాల పట్ల మానవులకు ప్రత్యక్ష బాధ్యతలున్నాయని, ఉండాలని వాదించారు. Nonanthropocentric ethics grants moral standing to such natural objects as animals and plants” ఇక్కడ కూడా ప్రమాణబద్ధ నైతిక సూత్రాల విస్తరణ, పరివర్థిత పరచడం అవసరం అవుతుంది. జంతువులను నైతిక జీవులుగా పరిగణించడం వల్ల ఎన్నో వివాదాలున్నాయి. అయితే అంతరించిపోతున్న వృక్షజాతులు, జంతుజాలం గురించిన వాదలన్నీ ఈ మానవేతర పర్యావరణ నైతికతా సిద్ధాంతం కోవలోకి వస్తాయి. కాబట్టి మానవ, మానవేతర పర్యావరణ నైతిక సిద్ధాంతాలను వాటి తాత్త్విక మూలాలను, మూల్యాలను చర్చించవలసి ఉంది.


చరిత్ర పొడవునా తాత్వికులు మానవుల నైతిక ప్రవర్తన, జీవితం గురించి ఒక నిర్దిష్ట పద్ధతిని పాటిస్తూ సంగ్రహాత్మక అవగాహనను వృద్ధిపరచి అందివ్వడానికి పూనుకున్నారు. ఇవి ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి విశ్లేషించడానికి, అంతిమంగా మూల్యాంకన పరచడానికి ఒక ప్రాతిపదికను సమకూర్చాయి.
ప్రతి సమాజానికి కూడా దానివే అయిన కొన్ని రకాల విశ్వాసాలు, నమ్మకాలు, వైఖరులు, ప్రమాణాలు ఉంటాయి. వీటిని విధిగా పాటించటం ఉంటుంది. ఏవి పాటింపబడాలనేది ఆయా సామాజిక సందర్భాలు, అవసర, అనివార్యతల మీద ఆధారపడి రూపు దిద్దుకుంటాయి.
గ్రీకు తత్తశాస్త్రం తొలినాళ్ళ నుండి కూడా తాత్త్విక నైతికత ఏది ప్రమాణబద్ధమో అది ఒప్పు అని అంగీకరించే విషయంలో సంతృప్తిచెందలేదు. ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించాలి. అదేమంటే “Ethics as a branch of philosophy seeks a reasoned examination of what custom tells us about how we ought to live” మనం ఎట్లా జీవించాల్సి ఉంటుందనేది సంప్రదాయం చెపుతుందో దానిని హేతుబద్ధమైన పరీక్షచేసే తాత్త్విక శాఖగా తత్వశాస్త్రం చూస్తుంది.


-డా।। ఆర్‍. సీతారామారావు,
ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *