ఇవ్వాళ హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందింది. అంతర్జాతీయ స్థాయి సంస్థలకు ఆలవాలమై దేశ విదేశీ ఉద్యోగులను, సంస్థలను ఆకర్శిస్తోంది. హైటెక్ సిటీ దాటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళినట్లయితే అక్కడి మనుషులు, భవనాలు రెండూ హైదరాబాద్‍లో అమెరికా నగరాలను తలపిస్తాయి. ఇదంతా దశాబ్ద కాలంగా చోటు చేసుకున్న పరిణామాలు. నిజానికి హైదరాబాద్ శతాబ్దాల నుంచి అంతర్జాతీయ నగరమే అన్నది చరిత్ర తెలిసిన అందరూ ఆమోదించే విషయం. కుతుబ్‍షాహీల కాలంలో మనుచ్చి, అబెదుబెయ్, టావెర్నియర్ తదితర విదేశీయులు హైదరాబాద్ నగరాన్ని, గోలకొండను సందర్శించి ఇక్కడి ఆచార వ్యవహారాలను, రాజకీయాలను, పాలనను తాము రాసిన పుస్తకాల్లో రికార్డు చేసినారు.
అసఫ్‍జాహీల కాలంలో బుస్సీ, రేమాండ్ లాంటి ఫ్రెంచ్ సైన్యాధిపతులు, తర్వాతి కాలంలో కిర్క్పాట్రిక్, సీదెన్‍హామ్, రస్సెల్, బర్టన్, రిచర్డ్ మీడ్ తదితర బ్రిటీష్ రెసిడెంట్లు నగర చరిత్రకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారు. పామర్ అండ్ కంపెనీ అధినేత విలియమ్ పామర్, ఏషియాకు మొట్టమొదటి నోబెల్ బహుమతి సంపాదించి పెట్టిన హైదరాబాదీ రోనాల్డ్ రాస్, 1854లో హైదరాబాద్‍లో మెడికల్ స్కూల్ ఏర్పాటు చేసిన డాక్టర్ మెక్లీన్, నిజాం కాలేజి అధ్యాపకులు విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్‍లో నివసించారు. యూరప్, అమెరికా, ఆఫ్రికా ఖండాల నుంచి అరబ్, అఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, టర్కీ దేశాల నుంచి ఉపాధి కోసం, వివాహాల మూలగా ఎంతో మంది హైదరాబాద్‍లో జీవించారు. ఆరో నిజామ్, ఏడో నిజామ్ కోడళ్లు టర్కీ దేశస్థులు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. బ్రిటన్ మాజీ అధ్యక్షుడు విన్‍స్టన్ చర్చిల్ తొలి ప్రేమాయణం, సైనిక ప్రయాణం సికింద్రాబాద్‍లోనే సాగింది. సైనిక పటాలానికి నేతృత్వం వహించిన బ్రిటీష్ వ్యక్తి పెండర్‍ఘాస్ట్ పేరిట ఇప్పటికీ సికింద్రాబాద్‍లో ఒక వీధి ఉంది. హైదరాబాద్‍కు హాకీ, క్రికెట్, ఫుట్‍బాల్, గోల్ఫ్ ఆటలు నేర్పింది, తర్ఫీదు నిచ్చింది మొదట విదేశీయులే అనేది గుర్తించాలి. ఆరో, ఏడో నిజామ్‍లకు విద్యాబుద్ధులు చెప్పింది కూడా విదేశీ విద్యావేత్తలే! క్లర్క్ అనే అతను మహబూబ్ అలీఖాన్ ట్యూటర్‍గా పనిచేసిండు.
ఆఫ్రికా నుంచి వచ్చిన అబిషీలు నిజాం, వనపర్తి సైన్యంలో కీలకంగా పనిచేసిండ్రు. ఇప్పటికీ వీరి వారసులు హైదరాబాద్‍లోని ఏసి గార్డస్లో కొంత మంది ఉన్నారు. నిజానికి ఏసి గార్డస్ అంటేనే ఆఫ్రికన్ కావలరీ గార్డస్ అని అర్థం. వీరు ఇప్పటికీ తమ సంప్రదాయంలో భాగమైన తాషాను వాయిస్తూ పెళ్ళిల్లలో తమ కళను ప్రదర్శిస్తూ ఉన్నారు. రిచర్డ్ ట్రెంచ్, టస్కర్ లాంటి బ్రిటీష్ అధికారులు నిజాం ప్రభుత్వంలో 1920-40వ దశకంలో కీలకంగా వ్యవహరించారు. ఒకరు రెవిన్యూ మంత్రిగా మరొకరు హోం మంత్రిగా కీలక భాగాలను నియంత్రించారు. ఇదే తర్వాతి కాలంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందనేది వేరే విషయం. ఆనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలి అధ్యాపకులు చాలా మంది విదేశాల నుంచి వచ్చారు.
హైదరాబాద్‍కు విదేశీయుల రాక బహుశా కుతుబ్‍షాహీల పాలన నుంచే ఊపందుకుంది. కుతుబ్‍షాహీలు ఇరాన్‍కు చెందిన వారు. వీరు హైదరాబాద్‍కు వచ్చిన తర్వాత ఇక్కడి సంస్కృతితో మమేక మయిండ్రు. దసరా, హోళీ పండగలను స్థానికులతో కలిసి జరుపుకున్నారు. తాము ఇరాన్ నుంచి తీసుకువచ్చిన పీర్ల (మొహరం) పండుగను తెలంగాణ హిందూ- ముస్లిం జీవితాల్లో భాగం చేసిండ్రు. ఇందుకు తెలుగులో వచ్చిన వందల, వేల మొహర్రం పాటలే నిదర్శనం. హైదరాబాద్‍లోని మక్కా మసీదు నిర్మాణం మక్కా నుంచి మట్టిని తీసుకొచ్చి పునాదిగా పూదిచ్చిండ్రు. తొలి దశ హైదరాబాద్ కట్టడాలన్నీ ఇండో-ఇరాన్ స్టైల్‍లో నిర్మితమయ్యాయి. చార్మినార్ కూడా ఇందులో భాగమే! ఇదంతా విదేశీ పురుషులు ప్రదర్శించిన సృజించిన చరిత్ర. అయితే హైదరాబాద్ చరిత్రలో అవిభాజ్యమైన విదేశీ మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడి చరిత్రను విదేశాల్లో సైతం ఘనంగా చెప్పుకునేలా చేసిన ముగ్గురు మహిళల గురించి ప్రధానంగా ఇప్పుడు తెలుసు కుందాం.
హైదరాబాద్ చరిత్రలో ఎందరో మహిళలు చిరస్మరణీయంగా ఉన్నారు. అయితే అందులో ముగ్గురు విదేశీ మహిళలు తమ హైదరాబాద్ సంబంధాలతో ఇక్కడి చరిత్రను విశ్వవ్యాప్తం చేసిండ్రు. ఇందులో మొదటి వారు శ్రీమతి నెవిల్. ఈమె 1864 ఆ ప్రాంతంలో నిజాం సొంత పటాలానికి నేతృత్వం వహించిన కల్నల్ నెవిల్ భార్య జూలియ. ఈమె శ్రీమతి నెవిల్‍గానే ప్రసిద్ధి. హైదరాబాద్‍లో శాశ్వత నివాసమేర్పరచుకున్న ఈమె విదేశాల నుంచి ముఖ్యంగా ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‍కు వచ్చే ప్రముఖులందరికీ తమ ‘నెవిల్స్ ఫాల్లీ’లో ఆతిథ్యం ఏర్పాటు చేస్తుండేది. ఈమె ఆతిథ్యం గురించి పుస్తకాల్లో కూడా రికార్డయింది. సాహస మహిళగా పేరొందిన శ్రీమతి నెవిల్ తండ్రి చార్లెస్ లెవర్ ప్రఖ్యాత ఆంగ్ల నవలా రచయిత.
ఇక రెండో మహిళ జోసెఫ్ హెలెన్. ఈమె సౌతాఫ్రికాలో 1955లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపకుల్లో ఒకరు. హక్కుల ఉద్యమకారిణి. ఈమె హైదరాబాద్‍లో టీచర్‍గా పనిచేసింది. అదీ 1930వ దశకం కన్నా ముందే! ఇక మూడో వ్యక్తి మార్గరెట్ కజిన్స్. ఈమె ఆంధప్రదేశ్‍లోని మదనపల్లెలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘జనగణ మన’కు ట్యూన్ కట్టి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. కజిన్స్ హైదరాబాద్‍లో మహిళా ఉద్యమాలు ఊపందుకోవడానికి కృషి చేసిండ్రు. హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాతులైన మహిళలతో కలిసి ‘మహిళా సంఘాన్ని’ ఏర్పాటు చేసిండ్రు. ఈ సంస్థ తర్వాతి కాలంలో అనేక చైతన్య కార్యకలాపాలను నిర్వహించింది. ఇందులో ముందుగా మిసెస్ నెవిల్ గురించి తెలుసుకుందాం!
చార్లెస్ లెవర్ ప్రఖ్యాత ఐరిష్ నావలిస్ట్ (1806-1872). ఈయన రాసిన నవలలు, ఉత్తరాలు, జానపద గీతాలను ఆయన మరణానంతరం సమగ్ర సాహిత్యం పేరిట 1897-99 మధ్య కాలంలో మిసెస్ నెవిల్ ప్రచురించారు. ఈమె అసలు పేరు జూలియ. అయితే ఆస్ట్రియా దేశానికి చెందిన నెవిల్ అనే కల్నల్‍ని పెండ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్‍లో స్థిరపడింది. 1860 వ దశకంలో నెవిల్ నిజాం సొంత సైన్యానికి దళాధిపతిగా పనిజేసిండు. ఈ కాలంలో హైదరాబాద్‍కు ఇంగ్లండ్‍కు చెందిన ఏ ప్రముఖుడు నగరానికి వచ్చినా వారి మకాం, ఆతిథ్యం బాధ్యతలు మిసెస్ నెవిల్ చూసేదంటే ఆమె ఆనాటి ఆప్యాయతల గురించి తెలుసు కోవచ్చు. ఆమె గురించి ఆనాడు ఒక మాట ప్రచారంలో ఉండేది. నాలుగు రోజులుందామని వచ్చిన వారు ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత నాలుగేండ్లయినా ఇక్కడే ఉంటారు’ అని మాట ప్రచారంలో ఉండేదని ఎడ్విన్ ఎ వార్డ్ అనే అతను తన జ్ఞాపకాలు ‘రికలెక్షన్స్ ఆఫ్ ఎ సావెజ్’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాలు హైదరాబాద్‍లోనే ఆమె నివసించింది. చివరికి 1897లో హైదరాబాద్‍లోనే చనిపోయింది. 1830 ఆ ప్రాంతంలో జన్మించిన జూలియా తన తండ్రిలాగే డబ్లిన్‍లోని ట్రినిటీ కాలేజీలోనే చదువుకుంది.
ఆరడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ లావుతో గుర్రపు స్వారీతో ఆమె తిరుగుతూ ఉంటే అందరికీ హడలుగా ఉండేది. ఈమె గురించి ఆనాడు కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆమె సాహసాన్ని కూడా గొప్పగా చెప్పుకునేవారు. ఒక రోజు సాయంత్రం భర్త కల్నల్ నెవిల్లెతో కలిసి గుర్రంపై వాహ్యాళికి వెళ్లగా కొంచెం దూరంలో స్త్రీల అరుపులు, కేకలు వినబడ్డాయి. దీంతో భార్య భర్తలిద్దరూ గుర్రాలపైనే ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది బందిపోట్లు గ్రామీణ స్త్రీలు, పురుషులు నగరంలో అమ్మేందుకు తీసుకొచ్చిన ఉత్పత్తులను దోచుకొని వాళ్ళను బంధించారు. దీంతో ఆ గ్రామీణ మహిళలు అరిచారు. ఈ దశలో అక్కడికి చేరుకున్న దంపతులు బందిపోటు దొంగలను చుట్టుముట్టి వారిని కట్టడి చేసిండ్రు. అయితే వారిని అరెస్టు చేయడం వారికి శక్తికి మించిన పని కావడంతో మరింత సాయుధ బలగాలని తీసుకొచ్చేందుకు కల్నల్ నెవిల్లె వెళుతూ వారిని పారిపోకుండా చూడ గలవా అని భార్యను అడిగిండు. దానికి ఆమె యస్ అని సమాధానమిచ్చింది. బందిపోటులు అక్కడి నుంచి పోవడానికి ఇరుకైన నది వంతెన మాత్రమే ఉన్నది. దీంతో మిసెస్ నెవిల్లె వంతెన ప్రారంభంలో ఆయుధదారి అయి కాపలాగా నిలబడింది. ఆమె చేతిలో ఆయుధం చూసి బందిపోట్లు పారి పోవడానికి ప్రయత్నించలేదు. అంతేకాదు ఆమె ఆకారం కూడా భారీగా ఉండడంతో వారు భయపడ్డారు. ఈ లోపల కల్నల్ నెవిల్లె మిగతా పటాలాన్ని తీసుకొని వచ్చి బందిపోట్లను అరెస్టు చేయడం జరిగింది. ఈ సంఘటన ఆమె ధైర్యసాహసాలను తెలియ జేస్తుంది. అట్లాగే ఆనాడు హైదరాబాద్‍లో ఆఫ్రికన్ బందిపోట్ల తలనొప్పిని కూడా ఈ సంఘటన రికార్డు చేసింది. ఈ విషయాలన్నీ ఎడ్విన్ తన పుస్తకంలో రికార్డు చేసిండు. ఈ సాహసాన్ని ప్రశంసిస్తూ అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం లేఖ రాసింది. అంతకు ముందు ఆమె భర్తతో కలిసి కొన్ని రోజులు ఇటలీలో కూడా నివసించింది.
తండ్రి నుంచి సెన్స్ఆఫ్ హ్యూమర్‍ని వారసత్వంగా పొందిన మిసెస్ నెవిల్ తన మాటకారి తనంతో ఆతిథులను కట్టిపడేసేది. ఈ దంపతుల భవనానికి ‘నెవిల్స్ ఫాల్లీ’ అని పేరుపెట్టుకున్నారు. హైదరాబాద్ నగరానికి ఇంగ్లండ్ నుంచి వచ్చిన ప్రముఖులు బ్రిటీష్ రెసిడెన్సీలో కన్నా వీరి ఆతిథ్యాన్నే ఎక్కువగా స్వీకరించే వారట. ఇప్పటి ఫతేమైదాన్ క్లబ్ ప్రాంతంలో ఆనాడు అసఫ్‍జాహి పటాలం ఉండేది. దానికి కమాండర్‍గా నెవిల్లె పనిచేసిండు. ఆయనపై కేవలం ఒక్క సాలార్‍జంగ్ మాత్రమే పై అధికారిగా ఉండేవాడు. అన్ని విషయాల్లో ఆయనకే నిర్ణయాధికారం ఉండింది.
మిసెస్ నెవిల్ తండ్రి ఇంతకు ముందే చెప్పుకున్నట్లు చార్లెస్ లెవర్ ప్రఖ్యాత ఐరిష్ నవలాకారుడు. ఈయన మొత్తం నవలలని పెద్ద కూతురు నెవిల్ 37 భాగాలుగా సంకలనం చేసింది. ఈ నవలలన్నీ కూడా ఐరిష్ జీవితాలను ఇతివృత్తాలుగా తీసుకొని రాసినవే. తండ్రి చనిపోయిన తర్వాత పెద్దకూతురిగా బాధ్యతగా భావిస్తూ ఆయన రచనలన్నీ సమగ్రంగా ప్రచురించడానికి పూనుకుంది. దురదృష్టవశాత్తు ఆ పని జరుగుతుండగానే 1897లో మిసెస్ నెవిల్లె చనిపోయింది. అయితే తండ్రి నవలలు 1896-99 మధ్య కాలంలో సమగ్ర సంకలనంగా వెలువడింది. తండ్రి చనిపోయిన తర్వాత 1874లో చార్లెస్ లెవర్ రైటింగ్ టేబుల్‍ని ట్రినిటీ కాలేజికి బహుమానంగా ఇచ్చింది. ఈ టేబుల్‍ని ట్రినిటీ కాలేజి లైబ్రరీలో వేసి ఉపయోగంలోకి తెచ్చారు.
ఈయన రచనల్లో ‘ది కన్ఫెషన్స్ ఆఫ్ హారీ లారెక్కర్’ (1839), ‘చార్లెస్ ఓ మాల్లీ’ (1841), ‘ది మార్టిన్స్ ఆఫ్ క్రో మార్టిన్ (1856) తదితర నవలలు ప్రసిద్ధి.
ఇక ఇందులో పేర్కొంటున్న మరో మహిళ హెలెన్ జోసెఫ్. ఈమె యూనివర్సిటీ ఆఫ్ లండన్‍కు చెందిన కింగ్స్ కాలేజిలో చదువుకుంది. 1927లో చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్‍కు వచ్చి ఇక్కడి మహబూబియా బాలికల పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా మూడేళ్ళు పనిచేసింది. 1928-1930 మధ్య కాలంలో ఆమె టీచర్‍గా పనిచేసింది. ఆ తర్వాత 1931లో సౌతాఫ్రికాకు వెళ్ళింది. అక్కడ మానవ హక్కుల ఉద్యమాన్ని, వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటాన్ని, మహిళా ఉద్యమాలను నిర్మించింది. ఆమె పూనిక మేరకు 1956లో అక్కడి మహిళలు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ తీశారు. ఇప్పటికీ ఆ దేశంలో ఈ ర్యాలీకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తేదిన మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గాను రెండు సార్లు ఐదేసి సంవత్సరాల పాటు ఆమె గృహ నిర్బంధాన్ని అనుభవించింది. దేశద్రోహం నేరం కింద జైలుకు వెళ్ళింది. దక్షిణాఫ్రికాలో స్వాతంత్య్రం కోసం పోరాడిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపకుల్లో ఆమె కూడా ఒకరు. తన పోరాట జ్ఞాపకాలను పుస్తకాలుగా వెలువరించింది.
మొత్తం దక్షిణాఫ్రికాలో గృహనిర్బంధాన్ని ఎదుర్కొన్న మొట్టమొదటి మహిళ హెలెన్ జోసెఫ్. ఇంగ్లండ్‍లోని ససెక్స్లో జన్మించిన హెలెన్ 1931లో సౌతాఫ్రికాలోని డర్బన్‍లో స్థిరనివాసం ఏర్పర్చుకుంది. అక్కడే ఎయిర్ ఫోర్స్లో ఇన్ఫర్మేషన్ అధికారిగా పనిచేశారు. డెంటిస్ట్ బిల్లి జోసెఫ్‍ని వివాహమాడింది. 1905లో జన్మించిన జోసెఫ్ 1992 డిసెంబర్ 25న జన్మించింది.
ఇక్కడ చెప్పదలచుకున్న విషయమేమిటంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన ఎందరో మహిళలు ఆ తర్వాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు హైదరాబాద్ అందించిన తెహజీబ్, నేర్పిన పోరాట పటిమ కూడా కారణం. నిజానికి 1911లో మహబూబ్ అలీఖాన్ (ఆరో నిజామ్) మరణం తర్వాత అప్పటికే జాగీర్దార్ల పుత్రుల కోసం నడుస్తున్న ఆలియా, జాగీర్దారీ పాఠశాలల మాదిరిగా బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలలో ప్రధానంగా నవాబుల కూతుళ్ళు చదువుకునేవారు. ఇందులో బోధన చేసే వారిలో విదేశీ మహిళలే ఎక్కువ. ఇట్లా హైదరాబాద్ బాలికలకు ఆంగ్ల విద్యాబోధన చేసిన హెలెన్ జోసెఫ్ తర్వాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా హక్కుల ఉద్యమకారిణిగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
హైదరాబాద్‍లో మహిళా చైతన్యానికి ఇతోధికంగా కృషి చేసిన మరో విదేశీయురాలు మార్గరెట్ కజిన్స్. ఈమె హైదరాబాద్‍లో 1929లో లేడి హైదరీ క్లబ్ ఏర్పాటులో తోడ్పడ్డారు. ఆ తర్వాత హైదరాబాద్‍కు చెందిన సరోజిని నాయుడు, అమీనా హైదరీలతో కలిసి ఆలిండియా విమెన్స్ కాన్ఫరెన్స్ కార్యకలాపాలను నిర్వహించారు. అనేక సార్లు హైదరాబాద్‍కు రావడమే గాకుండా అప్పటి హైదరాబాద్ ప్రభుత్వ అధికారి అక్బర్ హైదరీ కోరిక మేరకు థియోసఫీ- ఆర్ట్ అనే అంశంపై ఇక్కడ ప్రసంగించారు. నికోలస్ రోరిచ్ ఆయన కుమారుడు స్వెటొస్లావ్‍ల పెయింటింగ్ ఎగ్జిబిషన్‍ని హైదరాబాద్‍లో నిర్వహించినప్పుడు మార్గరెట్ కజిన్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సరోజి నాయుడు సోదరుడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ భార్య కమలాదేవి, ప్రిన్సెస్ నిలోఫర్‍లతో సహా అనేక మందిని ఆలిండియా విమెన్స్ కాన్ఫరెన్స్ సభ్యులుగా చేర్పించడమే గాకుండా ఆ సంస్థ నిర్వహణ కోసం హైదరాబాద్‍లో భారీగా నిధులు వసూలు చేసింది. ఆ సంస్థ నడవడంలో హైదరాబాదీలది కీలక పాత్ర. ఇట్లా హైదరాబాద్ మహిళా చైతన్యాన్ని దేశవ్యాప్తం చేసిన మార్గరెట్ కజిన్స్ 1878లో ఐర్లాండ్‍లో జన్మించారు. ఆ తర్వాత 1915లో ఇండియాకు తన మకాంని మార్చుకొని విద్యావేత్తగా, మహిళా ఉద్యమ కారిణిగా, సంఘ సంస్కర్తగా, దివ్యజ్ఞాన సమాజ ప్రచారకురాలిగా, ఆర్ట్ క్రిటిక్‍గా ప్రసిద్ధి చెందారు. 1919లో మొదటిసారిగా రవీంద్రనాథ్ టాగూర్ మదనపల్లెకు వచ్చిన సందర్భంగా ఆయన రాసిన జనగణమన గీతానికి మార్గరెట్ కజిన్స్ ట్యూన్ కట్టారు.
అట్లాగే దివ్యజ్ఞాన సమాజానికి చెందిన అనిబిసెంట్‍కు, మేడమ్ బ్లావట్స్కీలకు కూడా హైదరాబాద్‍తో చాలా దగ్గరి సంబంధాలున్నాయి. అనిబిసెంట్ హైదరాబాద్‍కు అనేక సార్లు వచ్చి ఇక్కడి దివ్యజ్ఞాన సమాజంలో ఉపన్యాసాలిచ్చింది. అలాగే మేడమ్ బ్లావట్స్కీతో విదేశాల్లో సరోజిని నాయుడు సోదరుడు వీరేంద్రనాథ్ లాంటి విప్లవ యోధులు కలిసి పనిచేసిండ్రు.
ఇట్లా ఎంతో మంది విదేశాల్లో ప్రసిద్ధి పొందిన మహిళలు హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో చైతన్య కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. వీరి ప్రతిభకు విదేశాల్లో మంచి గుర్తింపు దక్కింది. అయితే హైదరాబాద్ ప్రజలకు వీరి గురించి అంతగా తెలియదు. వారు విదేశాల్లో పుట్టినప్పటికీ హైదరాబాద్‍ని తమ సొంత ఊరిగానే భావిస్తూ చైతన్య కార్యకలాపాలు నిర్వహించారు. వీరు అందించిన స్ఫూర్తి లేడి హైదరీ క్లబ్ రూపంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నది. లేడీ హైదరీ క్లబ్ 1929లో ప్రారంభమయింది. అయితే ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ తరలి పోవడంతో అక్కడ కేవలం నామమాత్రంగా చిన్న బిల్డింగ్ మాత్రం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్‍కు అంతర్జాతీయ సొబగులద్దిన మహిళా మణులకు వందనాలు.
-సంగిశెట్టి శ్రీనివాస్
ఎ : 9849220321