వేంకటరాజన్న అవధాని

అప్పటి నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం కరీంనగర్‍ జిల్లా మంథనిలో శ్రీ వేంకట అవధాని గారు తేది. 10.6.1909న శ్రీకృష్ణయ్య అవధాని, శ్రీమతి సీతమ్మ దంపతులకు జన్మించారు.
శ్రీ అవధాని గారు స్వాతంత్య్ర పోరాటపు ఉద్యమాలలో పాల్గొని, సత్యాగ్రహము చేసి నైజాం ప్రభుత్వము చేత అరెస్టుకాబడి, తమ జీవితంలో ఎంతో ధైర్యముగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లెక్కచేయక అన్ని ఉద్యమాలలో ముందుండి, అప్పటి స్టేట్‍ కాంగ్రెస్‍ కార్యక్రమాల్లో పాల్గొని, తమ సర్వస్వాన్ని దేశం కొరకు సమర్పించడానికి సిద్ధపడి పోరాటం సాగించినారు..
1946లో అప్పటి ప్రభుత్వం వీరిని అరెస్టు చేసి 6 నెలలు కరీంనగర్‍ జిల్లా జైలులో బంధించింది. శ్రీ వేంకట రాజన్న అవధాని గారు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, కవి, పండితులు బహు భాషా కోవిదులు, సంఘ సంస్కర్త. అధివక్త (అడ్వకేట్‍) ఆయుర్వేద వైద్యులు. ‘‘వైద్యవర’’ బిరుదాంకితులు.
హైద్రాబాద్‍లో వకాలత్‍ చదవడానికి నివాసముంటున్న సమయంలో శ్రీ కాళోజి నారాయణరావు, శ్రీ వెల్దుర్తి మాణిక్యరావు గారులతో కలిసి ఆనాటి పరిస్థితులపై చర్చించుకొనేవారు. వారు ముగ్గురు ‘‘తెలంగాణా వైతాళిక సమితి’’ పేరుతో ప్రసిద్ధులు.


కొంతకాలం వీరు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి సంపాదకత్వంలో వెలువడిన అప్పటి ‘‘గోలకొండ పత్రిక’’కు ఉప సంపాదకులుగా పని చేసినారు. తెలంగాణాలో కవులే లేరని, వీరికి కవిత్వమే రాదన్న ఒక అపవాదును సవాలుగా తీసుకొని ప్రతాపరెడ్డిగారు వెలువరించిన ‘‘గోలకొండ కవుల సంచిక’’లో శ్రీ అవధానిగారి కవిత ‘‘మంథెనద్విజలు’’ అను శీర్షికతో ప్రచురింపబడుట అత్యంత విశేషం. శ్రీ అవధాని గారు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారికి సన్నిహితులు, సమకాలీకులు. ప్రతాపరెడ్డి గారు వ్రాసిన ‘‘హిందువుల పండుగలు’’ అనే ఉద్గ్రంథానికి శ్రీ వేంకట రాజన్న అవధాని గారు ‘పీఠిక‘ వ్రాసినారు. ఈ పుస్తకం ఇటీవలనే పునర్ముద్రించబడినది.
ఆనాటి ‘‘ఆంధ్రమహాసభ’’ కార్యకలాపాల్లో కరీంనగర్‍ జిల్లా కేంద్రంలో చాలా చురుకుగా పాల్గొని దానికి సారథ్యం వహించి, ఎంతోమంది యువకులను తమ వాగ్దాటితో ఉద్యమంవైపు ఆకర్షింపజేసి చైతన్యవంతులను చేసిన ఘనత శ్రీ అవధానిగారిదే. అందుకేకావచ్చు అప్పటి మన భారత ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారు మంథని ప్రసక్తి వచ్చినపుడు తరచు “There were times when we used to derive inspiration from shri Avadhani garu” అని అంటుండేవారు.
ఓసారి శ్రీ పి.వి. గారు మంథనికి భారత ప్రభుత్వం విదేశాంగ శాఖామాత్యుల హోదాలో విచ్చేసినపుడు స్వయంగా శ్రీ అవధానిగారి ఇంటికి వెళ్ళి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నపుడు వారు అన్న మాటలు “Mr. Avadhani, I have only friends like you, I have no followers and group’’.


1945-46 సంవత్సరంలో అవధానిగారు కరీంనగర్‍ లో తమ న్యాయవాద వృత్తి కొనసాగించుచున్న సమయంలో ఒకనాటి రాత్రి రజాకర్‍ ముష్కరులు వీరి ఇంటిమీద దాడి జరిపినపుడు, మొత్తం వారి కుటుంబ సభ్యులంతా కలిసి ఎంతో ధైర్యసాహసాలతో ఆ దాడిని ఎదుర్కొన్నారు. అవధాని గారు గ్రంథాలయోద్యమ నిర్మాతగా, సంఘసంస్కర్తగా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని జిల్లాలోని అన్ని ముఖ్యమైన సంఘటనలలో ముందుండి పని చేసినారు.
స్వాతంత్య్రానంతరము శ్రీ అవధాని గారు అప్పటి ఆంధప్రదేశ్‍ రాష్ట్ర అనువాద సంఘములో అనధికార సభ్యులుగా 1967-70 కాలంలో పని చేసినారు. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశపు ఏడవ సంపుటములో శ్రీ అవధాని గారు వ్రాసిన వ్యాసము ద్వారా మంథని ప్రాచీన వైభవమును గూర్చిన అనేక చారిత్రక విషయాలు మనకు తెలియుచున్నవి.


‘‘Census of India 1971, Andhra Pradesh special survey reports on selected towns Manthani’’ అనే ప్రభుత్వ సమాచార శాఖ తరఫున ప్రచురింపబడిన గ్రంథంలో (8 వ పేజి) నాటి గణాంక శాఖ డైరెక్టర్‍ శ్రీ వేదాంతం I.A.S . ఆఫీసర్‍ గారు, అవధాని గారి గురించి ఇలా వ్రాసారు.
‘‘I visited the town twice before finalizing this monograph and I acknowledge with thanks the enlightened conversations I had with Shri Venkata Rajanna Avadhani, a scholar of infecluctual emi nence an Advocate and freedom fighters’’ అని వ్రాస్తూ వారిని ఎంతగానో కొనియాడారు.
మరల వారే ఈ గ్రంథం యొక్క 164-165 పేజీలలో శ్రీ అవధాని గారు సాహిత్య, సాంఘిక రంగాలలో చేసిన సేవలను ఉల్లేఖిస్తూ
‘‘In the year 1926, a Telugu Monthly manu script Magazine ( viz ) Namely, Prabodha Chandrika was started both in poetry and prose under the editor ship of Shri Avadhani, a local Scholar. The Editor himself a Scholar,Advocate. Social worker and vaidya vara. Shri Venkata Rajanna Avadhani is also au thor of (1) Agni Shabda Mahatyam. (2) జన్మరహస్యం ‘‘He possesses very intimate knowledge of Art, literature, History and grouth of Manthani Town’’ అని వీరి ప్రతిభా పాటవాలను గురించి ఎంతగానో ప్రశంసించారు.


వీరు సంఘ సంస్కర్తగా అనాదిగా వచ్చుచున్న కొన్ని సాంఘిక మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాటము సలుపుటయేగాక 4 రోజుల ‘‘ఉపనయన’’ క్రతువును అనగా వడుగులను కుదించి ఒకరోజులో ముగించవచ్చని, తాము స్వయంగా తమ రెండవ కుమారుని ఉపనయ నమును ఒకరోజులో నిర్వహించి ఈ ప్రాంతానికి మార్గదర్శులైనారు.
వీరు హరిజనోద్ధరణకు నడుము బిగించి ఒక హరిజన యువకుని తమవద్ద సహాయకునిగా నియోగించుకొన్నారు. అతనే స్వాతంత్య్రానంతరము రాష్ట్ర శాసన సభ్యునిగా మేడారం రిజర్వుడు స్థానం నుండి ఎన్నికైనారు. ఇతను మంథని గ్రామ నివాసియైన గడిపెల్లి రాములు MLA. గారు. ఆనాటి ఏ రాజకీయ సభకైనా, సాహితీసభకైనా వీరు అధ్యక్షత వహించని సంఘటన ఈ ప్రాంతములో చాలా అరుదుగా ఉండేది.


అప్పటి కరీంనగర్‍ జిల్లా పరిషత్‍ ఆధ్వర్యాన జరిగిన ఒక సమావేశంలో ధారాళంగా సాగిన వీరి ఉపన్యాసము విని, ముగ్ధులై, కవి సామ్రాట్‍ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వీరి దగ్గరకు వచ్చి వీరిని వేదికపైననే ఆలింగనం చేసుకొని ‘‘తెలంగాణా ప్రాంతంలో కూడా ఇంత చక్కటి తెలుగులో మాట్లాడేవారు ఉన్నారని తెలిసి తాను ‘‘ఆనందపరవశుడనైతి’’ నని ఎంతగానో శ్లాఘించారు.
మంథని MLAగా పని చేసిన శ్రీ గులుకోట శ్రీరాములు గారి షష్ఠి పూర్తి సందర్భంగా ప్రచురింపబడిన విశేష సంచికలో శ్రీ వేంకట రాజన్న గారి జీవిత సంగ్రహము ప్రచురింపబడినది. భారత స్వాతంత్య్ర 25వ వార్షికోత్సవాల సందర్భంగా 1972లో భారత ప్రభుత్వపు తరుఫున అవధానిగారి త్యాగాలకు సేవలకు గుర్తింపుగా తామ్రపత్రము రవీంద్రభారతిలో బహూకరింపబడినది. పరకాల గ్రామ వాసులు, శ్రీ రేపాల నరసింహ రాములుగారు ‘‘కరీంనగర్‍ సజీవ కిరణాలు’’ అనే జిల్లా స్వాతంత్య్రోద్యమ చరిత్ర – పంలో శ్రీ అవధాని గారి జీవిత విశేషాలు, నాటి స్వాతంత్య్ర పోరాటంలో వారు నిర్వహించిన విశిష్ట పా గురించి ఫొటోలతోసహా ప్రచురించారు.
ఈ గ్రంథం పేజి 27లో ప్రచురింపబడిన గ్రూపు -ఫొటోలో 1948 సంవత్సరపు కరీంనగర్‍ జిల్లా కాంగ్రెస్‍ పార్టీ నాయకులు శ్రీయుతులు వేంకట రాజన్న అవధాని కె.వి. నర్సింగరావు, రఘునాథ్‍ రావ్క్చ, బాడ్ల భూపతి, గులుకోట శ్రీరాములు, బి.వి. రాంరెడ్డి, కాసం శివరాజం గుప్త, పి.వి. నరసింహారావు, బి. వేంకటరామారావు, బి. మురళీధర్‍ రావు గార్లను చూడవచ్చు. శ్రీ పి.వి. గారు అనేక సందర్భాలలో అవధాని గారిని తమ గురువుగా భావించేవారు.


ప్రజాకవి, పద్మభూషణ్‍ శ్రీకాళోజి నారాయణరావు గారిని వారి అన్నగారైన శ్రీ కాళోజి రామేశ్వర రావు గారికిని శ్రీ అవధానిగారు ఆప్తులు, మిత్రులు, శ్రీ కాళోజిగారి ‘‘నా గొడవ’’ 4వ సంచిక పరాభవ వర్షంను శ్రీ అవధాని గారు 1966 వరంగల్లో జరిగిన సభలో ఆవిష్కరించారు.
దాదాపు 60 సంవత్సరాల క్రితం మంథనిలో బాలికలకు 7వ తరగతి వరకే పాఠశాల విద్యావకాశాలు ఉండినవి. 10వ తరగతి చదవడానికి అవకాశాలేలేవు. ఆ సమయంలో ధైర్యముగా శ్రీ అవధానిగారు తమ రెండవ కుమార్తె శ్రీమతి ప్రేమలతాదేవికిని మరియు శ్రీ లోకీ లక్ష్మణ శర్మగారి కుమార్తె శ్రీమతి క్రాంతి కుమారికిని, అప్పటి హైద్రాబాద్‍ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి వద్ద సహాయకులుగా మరియు సలహాదారుగా పనిచేస్తున్న శ్రీ వరహాల భీమయ్యగారి చొరవతో ప్రభుత్వము నుండి ప్రత్యేక అనుమతి పొంది ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బాలికలకు ప్రవేశము కల్పించి, 10 వ తరగతి వరకు విద్యావకాశ ములను కల్పించినారు.


ఆడపిల్లలకు చదువు ఎందుకు? ఇంటిపని, వంటపని చూసుకుంటే చాలు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి ఊల్లేలాలా? అని అనుకొనే రోజుల్లో శ్రీ అవధానిగారి క•షి వలన అనేకమంది బాలికలకు తమ ఉన్నత విద్యాభ్యాసానికి మార్గదర్శకులైనారు. స్త్రీ విద్యను ప్రోత్సహించినారు. తమ అందరు కుమార్తెలను డిగ్రీ వరకు చదివించిన ఘనత శ్రీ అవధాని గారికే దక్కుతుంది.


ఆ తరువాతి కాలంలో బాలికలకు పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని శ్రీరాజా వేంకట ముత్యంరావు గారి గదిని వారిచే మంథని ప్రజలకు దానమిప్పించిన ఘనత శ్రీ అవధాని గారి కుమార్తె శ్రీమతి ప్రేమలతాదేవి గారిదే అని తెలుపడం సమంజసంగా ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు, మ్యూజియంల శాఖకు సలహాదారులుగాను, పంచాయతీరాజ్‍ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను నాటి కాలంలో అమలులో ఉండిన వ్యవస్థకు అనుగుణంగా పంచాయితీ సమితుల సభ్యులకు తెలుపడానికి ప్రభుత్వము వారిపక్షాన ఉపన్యాసకులుగా కూడా పనిచేశారు.
శీశ్రీ అవధానిగారు తమ 87వ ఏట తేది 22.09.1995 నాడు మంథనిలోని వారి స్వగృహంలో తుది శ్వాస విడిచి ఇహలోక యాత్ర చాలించినారు.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-ప్రమోద అవధాని

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *