వ్యవసాయ విధానాలు పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి


భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు మధ్య సమతుల్యత వుంటేనే పర్యావరణం క్షేమంగా వుంటుంది. జీవితావసరాలకంటే ఆధునిక జీవన విధానంలో వచ్చిన గుణాత్మక మార్చులు ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వినియోగించుకోవడం వల్ల అనేక రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. పారిశ్రామిక, ఫార్మసీ, వ్యవసాయరంగాలలో అధికోత్పత్తి కోసం సాంకేతికజ్ఞాన వనరుల వినియోగమూ, అభివృద్ధిపేరిట జరిగే చర్యలూ తీవ్రమయ్యే కొద్దీ వాతావరణ భూతాప కారక ఉద్గారాలు, శబ్ద, వాయు, జల కాలుష్యాల పెరుగుదల పెరుగుతూ వస్తున్నది. ఈ మౌలిక వాస్తవాలను గుర్తిస్తూ ‘వాతావరణ న్యాయం’ అనే కొత్త భావన గురించి ఆలోచించాలి. వాతావరణ మార్పులను అదుపు చేయడం ఇవ్వాళ్టి ముఖ్య కర్తవ్యం.


తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ల నుంచీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటుంది. హరితహారం, పట్టణ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, రవాణా సౌకర్యాల మెరుగుదల వంటివి ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త అగ్రికల్చరల్‍ పాలసీని ఈ నేపథ్యంలోంచే పరిశీలించాల్సి వుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక సాగునీటి ప్రాజెక్టుల వల్ల నీటివనరులు పెరిగాయి. మూడు పంటలకు సరిపడా నీరు లభ్యమవుతుంది. సంప్రదాయ వ్యవసాయంలో రైతులందరూ ఒకే పంట వేయడానికి అలవాటు పడ్డారు. అధికోత్పత్తి కోసం జలవినియోగం, ఎరువులు, పురుగుమందుల వినియోగం పెరిగాయి. దీనితో భూగర్భ వనరులులలో కాలుష్యం పెరిగి వినియోగాంశాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, రైతుల సమగ్రాభివృద్ధికి అవసరమైన నియంత్రిత పద్ధతితో నూతన వ్యవసాయ విధానాలకు ప్రణాళికలు రూపొందించింది. దీని ప్రకారం ఏ నేలలో, ఏ కాలంలో, ఏ పంటలు వేయాలో ప్రభుత్వమే సూచిస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగనిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కలిగించి చైతన్యం పెంచాలి.


ఒకే పంట వేసి నష్టపోకుండా మార్కెట్‍ డిమాండ్‍ను బట్టి పత్తి, వేరుశెనగ, కంది పప్పు ధాన్యాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు, జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు వంటి ప్రత్యామ్నాయ పంటలను వేసే దిశగా రైతులను నడిపించాలి. ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి. ఈ పంటలకు సరైన గిట్టుబాటు ధరను చెల్లించి, సేకరించి, వీటి నిల్వల కోసం గోడౌన్లు ఏర్పాటు చేయాలి. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాన్ని అరికట్టాలి. సేంద్రియ ఎరువులు, క్రిమికీటకాల సహజ నిర్మూలనా చర్యలపై అవగాహన పెంచాలి. రైతుబంధు, రైతు వేదికవంటి పథకాల ద్వారా రైతుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ కృషి అభినందనీయం.
రైతులు వివిధ వర్గాల ప్రజలు ఈ నూతన వ్యవసాయ విధానాల అమలులో సహకరించి పర్యావరణ పరిరక్షణకు వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడి తెలంగాణ రైస్‍బౌల్‍ ఆఫ్‍ ఇండియాగా తీర్చిదిద్దడంలో రైతాంగం ముందుండాలని ఆశిస్తూ…


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *